పొదుపు (బాలల కథ) - పద్మావతి దివాకర్ల

Savings

పదేళ్ళ చింటూకి నీరు వృధా చేయడం బాగా అలవాటైంది. స్నానం చేసిన తర్వాత కూడా గంటలకొద్దీ నీళ్ళతో ఆడటం సరదా! తండ్రి రామారావు, తల్లి శారద ఎంత చెప్పినా వినేవాడు కాదు. అలాగే తనగదిలో కూర్చొని చదువుకున్నతర్వాత వీధిలోకి ఆడుకోవటానికి వెళ్ళినప్పుడు కూడా ఆ గదిలో ఫ్యాన్, లైటు అలాగే వదిలేస్తాడు. తల్లి శారద అది చూసి చాలాసార్లు చింటూకి చెప్పింది విద్యుత్తు అలా వృధా చేయకూడదని. అవసరం లేనప్పుడు ఫ్యాను, లైటు ఆపేయాలని ఆమె చెప్పినా పట్టించుకునేవాడు కాదు. ఈ దుబారా చింటూ చేత ఎలా మానిపించాలో వాళ్ళకి అర్ధం కాలేదు.

ఒకసారి చింటూ వాళ్ళింటికి వాళ్ళ మావయ్య శేఖరం ఆ ఊళ్ళో ఏదో పని ఉండి వచ్చాడు. వచ్చినరోజే చింటూ నీళ్ళు వృధాగా వదలడం గమనించాడు శేఖరం.

చింటూని పిలిచి, "నీళ్ళు అలా వృధా చేయకూడదు. మనదేశంలో చాలా చోట్ల ప్రజలు నీళ్ళూ, విద్యుత్తు లేక కష్టాలపాలవుతున్నారు. మంచినీటికోసం కొన్ని ఊళ్ళల్లో అయితే పదికిలోమీటర్ల దూరం కూడా కాలనడకన వెళ్ళి తెచ్చుకుంటున్నారు తెలుసా?" అన్నాడు వాళ్ళ మావయ్య.

"మావయ్యా! వాళ్ళకి ఇంట్లో నీళ్ళు లేవు కనుక అంత దూరం వెళ్ళి తెచ్చుకుంటున్నారు. మన ఇంట్లో రోజంతా నీళ్ళు వస్తున్నాయి కదా, మనం నీళ్ళు ఎక్కువ వాడితే నష్టం ఏమిటి?" అన్నాడు చింటూ.

చింటూకి ఇలా చెప్తే అర్ధంకాదని అర్ధం చేసుకున్నాడు. నీళ్ళవిలువ, విద్యుత్తు విలువ తెలుసుకొనేలా చేస్తేనే చింటూ మారతాడని గ్రహించాడు శేఖరం. స్కూలుకి అప్పుడు సెలవులు ఉండటంతో తన అక్కయ్యకి చెప్పి చింటూని తనతో పాటు తన ఊరికి తీసుకెళ్ళాడు శేఖరం. చింటూకూడా చాలా ఉత్సాహంగా మామయ్యతో వాళ్ళ ఊరు బయలుదేరాడు.

సాయంకాలం చింటూని ఊరంతా తిప్పి, తన కొబ్బరితోటవైపు తీసుకెళ్ళాడు వాళ్ళ మామయ్య. ఆ తోటలో చాలా సరదాగా తిరిగాడు చింటూ. లేత కొబ్బరి నీళ్ళు తాగాడు. కొండమీద ఉన్న శివాలయంకి వెళ్ళాడు. ఇంటికొచ్చిన తర్వాత అత్తయ్య ఇచ్చిన మిఠాయిలు తిన్నాడు. అలా ఆ రోజంతా చాలా సరదాగా గడిచిపోయింది.

రాత్రి భోజనాలయ్యాక మావయ్య చెప్తూన్న కధలు వింటూ నిద్రకి ఉపక్రమించాడు చింటూ. ఇంతలో కరెంటు పోయింది. పంఖా తిరగకపోవడంతో ఉక్కపోత మొదలయింది. చాలా సేపటివరకూ కరెంటు రాకపోవడంతో ఆ రాత్రి ఇంటి డాబామీదే నిద్రపోయారు అందరూ.

తెల్లారి చింటూ లేచేసరికి చాలా ఆలస్యమైంది. అప్పటికే కుళాయిలో నీళ్ళు రావడం ఆగిపోయాయి. ఉన్న ఒక్క బకెట్ నీళ్ళతోనే స్నానం ముగించవలసి వచ్చింది. అప్పటికే అత్త మావయ్య స్నానం, పూజ ముగించారు. అల్పాహారానికి సిద్ధమై చింటూకోసం ఎదురుచూడసాగారు. చింటూ కూడా అక్కడికి చేరాడు. అత్త చేసిన ఇడ్లీ తింటూ చింటూ, "మావయ్యా! ఉదయమే ఎలా నీళ్ళు అయిపోయాయి?" అని అడిగాడు.

"ఇక్కడ నీటి ఎద్దడి చాలా ఎక్కవగా ఉంది చింటూ. తాగునీరుకి కూడా చాలామందికి కొరత ఉంది. నీటిని పొదుపుగా వాడాలి, కానీ దుబారా చేయకూడదు. మనం నీరు దుబారా చేస్తే మనలాంటి చాలామంది నీళ్ళు దొరకక ఇబ్బంది పాలవుతారు.” అన్నాడు మావయ్య.

ఉదయం పదిగంటలకల్లా మళ్ళీ కరెంటు పోయింది. విద్యుత్తు లేకపోతే ఎంత ఇబ్బందో తెలిసొచ్చింది చింటూకి. మావయ్యని అడిగాడు ఇక్కడెందుకు ఇంతసేపు విద్యుత్తు కోత ఉందని. అప్పుడు శేఖరం మావయ్య, "కొన్ని చోట్ల విద్యుత్తు దుర్వినియోగం చేయడంవల్ల మిగిలిన వారికి ఇలా ఇక్కట్లు తప్పవు. అందుకే విద్యుత్తు కూడా పొదుపుచేయాలి, నీళ్ళలాగే. వాటి వినియోగం సరిగ్గా నియంత్రించకపోతే మనవల్ల ఇతరులకు ఇబ్బంది కలుగుతుంది. భవిష్యత్తులో మనకి విద్యుత్తు, నీటి కొరత ఇంకా తీవ్రంగా ఉండవచ్చు. మనం అందుకే వీటిని దుబారా చేయకుండా పొదుపుగా వాడాలి." అని వివరించాడు.

మావయ్య మాటల్లోని సత్యం గ్రహించాడు చింటూ. తను ఇంకెప్పుడూ నీళ్ళు, విద్యుత్తు దుబారా చేయనని మావయ్యకి మాటిచ్చాడు.

ఇంటికి తిరిగివచ్చిన తర్వాత చింటూ మరెప్పుడూ నీళ్ళు, విద్యుత్తు వృథా చేయలేదు. అందుకు అతని తల్లీ తండ్రి ఎంతో సంతోషించారు.

అయితే చింటూకి బుద్ధి చెప్పటానికే ఆ రోజు నీళ్ళు, విద్యుత్తు రాకుండా మావయ్య చేయించాడన్న సంగతి చింటూకి తెలియదు.

మరిన్ని కథలు

Aame kavvinchindi
ఆమె కవ్వించింది
- తాత మోహనకృష్ణ
Chandruniko noolu pogu
చంద్రునికో నూలు పోగు
- కాశీవిశ్వనాధం పట్రాయుడు/kasi viswanadham patrayudu
Anaadha atidhyam
అనాథ అతిథ్యం
- - బోగా పురుషోత్తం
Vibheeshana Sharanu
విభిషణుని శరణు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Srivariki prema lekha
శ్రీవారికి ప్రేమలేఖ
- తాత మోహనకృష్ణ
Ramdaas formula
రాందాస్ ఫార్ములా
- వీరేశ్వర రావు మూల
Attagari samrajyam
అత్తగారి సామ్రాజ్యం
- బొబ్బు హేమావతి