గంగానమ్మ చిరునవ్వు - అన్నపూర్ణ . జొన్నలగడ్డ

ganganamma smile

శాస్త్రి గారు అనుష్ఠానం పూర్తి అయింది. తీర్థం తీసుకువచ్చి జ్వరంగా ఉన్న వారి అబ్బాయి కి నోట్లో పోసి నుదుటిన కాస్త విభూది రాసి వెళ్లారు. ఊరంతా కలరా జ్వరం వచ్చిన రోజులు అవి. ప్రతీ ఇంట్లోనూ చావులతో ఏడుపులు పెడబొబ్బలతో ఊరు ఉరు మొత్తం ఏకపెట్టున రోధనావస్థలో మునిగి ఉంది. పెద్దవారి జబ్బుని గట్టెక్కించమనే చిన్నవారు, పిల్లల జ్వరాలు తగ్గించమని మొక్కే పెద్దవారితో పొయ్యిలు వెలిగి వెలక్కా, తిని తినక జనం అంతా పుట్టెడు దుఃఖం లో ఉన్నారు. చెరువు గట్టున ఉన్న గంగానమ్మ గుడికి వెళ్లే వారు, వచ్చేవారిని కిటికీలోనుంచి చూస్తూ పడక కుర్చీలో అలా ఒకసారి వాలి శాస్త్రి గారు దుర్గా స్తుతి చదువుతున్నారు. ఆయన భార్య సావిత్రమ్మ గారు సావిడిలోకి వచ్చి ఇవాళ వాడి ఒళ్ళు మరీ కాలిపోతోంది. మూడు రోజులు గడిచినా అవధాని గారి మందు పోసినా జ్వరం జారట్లేదు అంటూ లోపలికి వెళ్లారు. శాస్త్రిగారికి ఆవిడ ఎం చెప్పాలని అనుకుంటున్నది అర్ధం అయ్యింది. వెంటనే లేచి వెళ్లి గంగానమ్మకు ఆయానకుడా మొక్కుకోవటానికి గుడికి వెళ్లారు. దణ్ణం పెట్టుకుని వచ్చారు. అలా ఇంకో రెండు రోజులు గడిచాయి అయినకుడా పిల్లాడు కొలుకోలేదు. శాస్త్రి గారికి దిగులు పెరిగింది. సావిత్రమ్మ గారు వంట చేస్తూ చీర చెంగు ఆమె బాధకొద్దీ కన్నీటితో తడిసిపోతోంది. ఇద్దరికి ఆ రోజు భోజనం కూడా సహించలేదు. సాయంత్రం పని చేయటానికి వచ్చిన కనకాలు వారి ఇద్దరిని చూసి ఎమ్మా... మీరు ఇలా దిగులుతో భోజనం మానేసి కూర్చుంటే బాబుగారిని ఎవరు కనిపెట్టుకుంటారు. భలేవారమ్మ, ఊరు అందరూ గంగానమ్మకు ఎరుపు(బలి) ఏస్తామని మొక్కుకున్నాక పిల్లలు కోలుకుని తిరుగుతున్నారంట. బాబుగారికి చెప్పండమ్మ, మీ చేతులకు పని అక్కర్లేదు. మొక్కుకొండి చాలు, మా వాళ్ళతో చెప్పి నేను మొక్కు తీర్పిస్తాను అని సావిత్రమ్మ గారికి నచ్చచెప్పే ప్రయత్నం చేస్తోంది. ఆ మాటలు శాస్త్రిగారికి వినిపించి అలా లోపలికి వినిపించేలాగా “ఇదిగో... అలా గుడి దాకా వెళ్ళొస్తాను” అని ఒక కేక వేశారు. గుడికి వెళ్లి లోపల గంట కొట్టి గంగానమ్మ ముందు కూర్చుని ఆమెనే చూస్తూ ఆలోచిస్తున్నారు. ఉరి పెద్దముత్తిదువ ఆ తల్లి. పసుపు రాసిన రెండు అడుగుల కొండరాయికి కలువరేకుల్లాంటి కళ్ళు. ఆ రెండిటి మధ్యలో సూర్యబింబం లాగా మెరిసిపోతున్న ఎర్రని కుంకుమ బొట్టు. ఆమె కుడివైపు ఒక కత్తి, ఎడమ వైపు ఒక త్రిశూలం. వాటికి తగిలించి ఉన్న రంగురంగుల మట్టి గాజులు. అందరిని రక్షించటానికి ఆసనం పై కూర్చుని ఉన్న అపర్ణలాగా ఉంది ఆ రూపం. ఎమ్మా! నా బిడ్డను రక్షించవా అని ఆర్థిస్తూ ప్రార్ధన చేస్తున్నారు శాస్త్రిగారు. తల్లి ఆయన వంకే చూస్తున్నట్లు నవ్వుతూ “నీ కోరిక తీరుస్తా. మరి.....నాకు ఎరుపు(బలి) వేస్తావా”? అని గంగానమ్మ అడిగినట్లు అనిపించింది. శాస్త్రి గారికి ఎం చెయ్యాలో అర్ధం కాలేదు. అప్పుడే గుడికి వచ్చి నమస్కారం చేసుకుని ఆయన వైపే నడచి వస్తున్న ఒక ఆడపడుచు అందెల చప్పుడుతో శాస్త్రిగారు ఈ లోకం లోకి వచ్చారు. ఆ చప్పుడు వైపు చూసేసరికి, ఆ పడుచు పసుపు పచ్చటి జరీ అంచు ఉన్న ఎర్రటి చీరెలో సువాసినిగా కనిపించింది. వెంటనే లేచి అలాగే అన్నట్లు తల ఆడించి నమస్కారం చేసి ఇంటికి వెళ్లారు శాస్త్రిగారు. నాలుగు రోజులు గడిచాయి పిల్లాడు చక్కగా లేచి తిరుగుతున్నాడు. సావిత్రమ్మ గారికి ప్రాణం కుడుటపడింది. ఆ రోజు ఇంట్లో పరవాన్నం వండి దేవతార్చన చేసి నైవేద్యం సమర్పించారు. ఆ రోజు రాత్రి భోజనం చేసి ప్రశాంతంగా నిద్రపోయారు. మరునాడు పొద్దున్నే లేచి శాస్త్రిగారు అనుష్ఠానం పూర్తి చేస్కుకుని తయారు అయ్యి సావిత్రమ్మ గారికి వినిపించేలాగా సావిడి లో నిల్చుని ఒక కేక వేశారు. “ఇదిగో.... అలా గుడి దాకా వెళ్లి వస్తాను” ఆ కేక వింటూనే వస్తున్నా... అంటూ ఒక సంచిలో గబగబా గుడికి తీసుకు వెళ్ళవలసిన సామాన్లు సర్ది ఆయన చేతికి ఇచ్చారు. శాస్త్రి గారు గుడికి దగ్గర అవుతున్నకొద్ది గంగానమ్మకు ఆత్రుతతో కళ్ళు ఇంకా విచ్చుకున్నాయి. శాస్త్రి గారు లోపలికి వచ్చి గంట కొట్టి, నీ చల్లని చూపుతో నా బిడ్డను కాపాడావు తల్లి ,ఇదిగో నీ మొక్కు అని ఒక పళ్లెం లో పసుపుపచ్చని అంచుతో మెరిసిపోతున్న ఎర్రటి చీర, ఇంట్లో పూసిన సన్నజాజులతో మధ్య మధ్య లో మారువం ఆకులు వేసి కట్టిన మాల, ఆకుపచ్చని మట్టిగాజులు, వాటి మధ్య కుదుమట్టంగా పనస ఆకులతో కుట్టిన బుట్టలో నింపిన పసుపు, కుంకుమలు అమర్చి గుమ్మం మీద పెట్టి పక్కనే అరటిపళ్ళు కొబ్బరికాయ సమర్పించి, ఒక సాష్టాంగ నమస్కారం చేసుకుని తల్లి! ఇదిగో నువ్వు అడిగిన ఎరుపు. నీ దయ చూపించావు, నువ్వు అడిగిన మొక్కు.. నే తీర్చుకున్నాను అని వెనుతిరిగి ఇంటి బాట పట్టారు. గంగానమ్మ పెద్ద పెద్ద కళ్ళు చేసుకుని అలాగే వెళ్తున్న శాస్త్రిగారిని ఆశ్చర్యంగా చూస్తున్నట్లు ఉంది ఆమె ప్రతిమ. రాయి లో అమ్మ చిరునవ్వు చూడగలిగిన శాస్త్రిగారికి ఆమె అడిగిన ముచ్చట చెల్లించే ఆలోచన కూడా ఆమె ఇచ్చిందో ఏమో మరి. ఇప్పుడు ఆశ్చర్యం మన వంతు. 🙏🙏🙏

మరిన్ని కథలు

Abhimanam khareedu
అభిమానం ఖరీదు
- మద్దూరి నరసింహమూర్తి,
Nirvika
నిర్విక
- బొబ్బు హేమావతి
Anji marindoch
అంజి...మారిందొచ్
- కాశీ విశ్వనాథం పట్రాయుడు
Moodu vupayalu
మూడు ఉపాయాలు
- డా.దార్ల బుజ్జిబాబు
Ayyo sankaram mastaaru
అయ్యో! శంకరం మాస్టారు
- తటవర్తి భద్రిరాజు (949 3388 940)
Second hand
సెకండ్ హ్యాండ్
- బొబ్బు హేమావతి
Emi jariginaa antaa manchike
‘ ఏమి జరిగినా అంతా మంచికే ’
- మద్దూరి నరసింహమూర్తి