Pedda paapaaji- paayas am panduga - Dr. K. Meerabai

Pedda paapaaji- paayas am panduga

“పిన్నిగారూ పిన్నిగారూ! “ అని పిలుస్తూ, కట్టుకున్న సరిగంచు పరికిణీ నేల మీద జీరాడకుండా కుచ్చిళ్ళు కొంచెంఎత్తి పట్టుకుని ఎత్తు అరుగుల ఇల్లు మెట్లు ఎక్కి లోపలికి వచ్చింది మీనాక్షి. వీధి గుమ్మం మెట్లపక్కన ఉన్న చిన్ననీళ్ళతొట్టిలో నుండి ఇత్తడి చెంబుతో నీళ్ళు ముంచుకుని కాళ్ళు కడుక్కున్న మూలాన పాదాలు తడిగా వున్నాయి.

" ఏమిటే అమ్మాయీ హడావిడి? నేను వంటపనిలో వున్నా" వంటింటిలో నుండి పలికింది వర్ధనమ్మగారు.

"పిన్నిగారూ! కాకినాడ నుండి మా నాన్నగారు పూతరేకులు తెప్పించారట. అమ్మ మీకు ఇచ్చి రమ్మంది." అంటూవంటగదిలోకి దూరింది మీనాక్షి.

"ఓసి మీ అమ్మ కడుపు బంగారం గానూ. వేలెడంత లేవు నీకు నేను పిన్నిగారినటే? " కిందకూర్చుని విసినకర్రతో బొగ్గులకుంపటి విసురుతున్న వర్ధనమ్మ నోరారా నవ్వింది.

"మా అమ్మ మిమల్ని పిన్నిగారూ అనేగా పిలుస్తుంది ? మరి నేనూ అంతే.” అంటూ పూతరేకుల డబ్బా ఆవిడ చేతికిఅందివ్వ బోయింది మీనాక్షి.

" అసింటా అసింటా. మడిగట్టుకున్నాను. అక్కడ పెట్టు. పెద్ద పాపాయికి పూతరేకులంటే మా చెడ్డ ఇష్టం." అందావిడ.

"పిన్నిగారూ! పెద్దపాపాయిని పిలుస్తారా కాసేపు ఆడుకుంటాను."

పదకొండేళ్ళకే ఏడో తరగతి చదువుతున్న మీనాక్షి ముచ్చట పడింది.

ఆ పిల్లకు చిన్న పిల్లలంటే తగని ముద్దు.

" ఏవిటీ? పెద్దపాపాయితో ఆడుకుంటావా?" గొంతుక్కూర్చుని బొగ్గుల కుంపటి విసురుతున్నదల్లా, నేలమీద చతికిలబడివిసినకర్ర కింద పడేసి, నవ్వడం మొదలు పెట్టింది వర్ధనమ్మ.

" ఏమిటే అమ్మా అంతగా నవ్వుతున్నావు? నాలుగు మెట్లు ఎక్కి లోపలికి వచ్చిన ఆవిడ కూతురు ఆయాస పడుతూఅడిగింది.

"పెద్దపాపాయ్! ఇదిగో ఈ పిల్ల నీతో ఆడుకుంటుందట." అంటూ మళ్ళీ నవ్వసాగింది ఆవిడ.

ఇంత లావుగా, కాస్త పొట్టిగా, పెద్ద బొట్టు పెట్టుకుని, చంకలో మూడేళ్ళ పాపను ఎత్తుకుని వున్న పెద్ద పాపాయ్ ని చూసిబిత్తరపోయింది మీనాక్షి .

“వీళ్ళు మన ఎదురింటిలోకి కొత్తగా వచ్చి చేరారు. మన బ్రామ్మలే. వీళ్ళ నాన్నగారు డిప్యూటీ తాసిల్దారుట.ఈ పిల్లపేరు మీనాక్షి. వీళ్ళ అమ్మ మంచి కలుపుగోలు మనిషి." కూతురికి చెప్పింది వర్ధనమ్మ.

“ ఇదిగో పెద్దపాపాయి కూతురిని తీసుకుని వెళ్ళి ఆడుకోపో. అమ్మకు చెప్పు రేపు పెద్దపాపాయి వాళ్ళ ఇంట్లో పాయసంపండుగ. మీరంతా బోయినాలకు రావాలి. ఆనక మా చిన్న పాపాయి మీ ఇంటికొచ్చి పిలుస్తుందిలే. " అంది వర్ధనమ్మమీనాక్షితో.

" ఒహో! చిన్న పాపాయి అంటే ఇంకో లావుపాటి పిన్నిగారన్నమాట." అనుకుని ఇంటికి చేరింది మీనాక్షి.

వాళ్ళు అద్దెకు దిగిన ఇల్లు కూడా ఎత్తు అరుగుల ఇల్లే గానీ, పిన్నిగారి ఇంటి అరుగులంత ఎత్తు కాదు.

మెట్లకు ఇటూ అటూ వున్న స్తంభాల మీదకు వాలిన వసారా కప్పు మీద బంగాళా పెంకులు పగడం రంగులోఅందంగా వుంటాయి.

ఎండ ఎక్కువగా వుండి వుడకపోత వుంటే, రాత్రికి పొడుగ్గా వున్న ఆ వసారాలోనే నాలుగు మడత మంచాలు వేసి, దోమతెరలు కడతాడు మసాల్చీ సత్యం. మంచాల పక్కనే మరచి పోకండా తాటాకు విసనకర్రలు కూడా పెడతాడు. పొద్దున్నే వచ్చి పరుపులు చుట్టి పెట్టి, మంచాలు మడిచి పెట్టడం కూడా అతని పనే.

సాయంకాలం లాంతర్ల చిమ్నీలు మసిలేకుండా తుడిచి, వత్తులు కత్తిరించి, కిరసనాయిలు పోసి వెలిగించే పని కూడాసత్యందే. అయ్యగారి ఆఫీస్ గదికి మాత్రం పెట్రొమాక్స్ లైటు వెలిగిస్తాడు.

ఇంటి లోపలికి వెళ్ళడానికి రెండు గుమ్మాలు వున్నాయి. ఒక గుమ్మంలో నుండి వెడితే మీనాక్షి నాన్నగారి ఆఫీసు గది, పక్కనే ఆయన పడక గది వుంటాయి.

ఇంకో గుమ్మం నుండి లోపలికి వెడితే నట్టిల్లు,పక్కనే ఇంకో గది, కాస్త లోపలికి వంటగది వున్నాయి .

ఇంతకీ పిన్ని గారింటికి పూతరేకులు పంపడానికి కారణం ఆ రోజు మీనాక్షి పుట్టిన రోజు. ఈ ఏడాది మీనాక్షి కి రెండు పుట్టినరోజులు జరిపింది వాళ్ళ అమ్మ. పోయిన వారం లో ఆ పిల్ల పుట్టిన నక్షత్రం వున్న రోజుకి కొత్త లినన్ సిల్క్ పరికిణీ కుట్టించి, పాలకోవా చేసింది. మీనాక్షి పుట్టిన శుక్రవారం, తిధి కలిసి వచ్చిన రోజుకోసం పెద్దాపురం సిల్క్ పరికిణీ, పూతరేకులు.

ఆ సాయంకాలం అన్నట్టుగానే పెద్దపాపాయి చెల్లెలు చిన్నపాపాయి వచ్చి అనంతపద్మనాభస్వామి వ్రతానికిభోజనానికి పిలిచి వెళ్ళింది.

పెద్ద పాపాయి వాళ్ళు వుండేది పక్క వీధి లొనే. మేనమామ కొడుకుకే ఇచ్చి చేసారుట పెద్దపాపాయిని అని అమ్మనాన్నతో చెబుతుంటే విన్నది మీనాక్షి.

మరునాడు పొద్దున్న అమ్మ రావడానికి ఓ గంట ముందే తను మంచినీళ్ళు తాగే కంచు గ్లాసు, రుమాలు చేతబట్టుకుని, ఇంటిపనిలో సాయం చేసే నౌకరు సత్యం ని వెంటబెట్టుకుని, పెద్దపాపాయి గారింటికి బయలు దేరింది మీనాక్షి.

అంత వుత్సాహంగా వెళ్ళడానికి కారణం అక్కడ వాళ్ళ ఇంటి ముందు సీమ చింతకాయల చెట్టు, వెనక నూతి దగ్గరవుసిరి చెట్టు వున్నాయని సత్యం అందించిన కబురు.

వీళ్ళు వెళ్ళేసరికి ఇంకా ఎవరూ రాలేదు. ఇంట్లో వాళ్ళు లోపలెక్కడో పూజలో వున్నట్టున్నారు .

సీమ చింతకాయల చెట్టు మీద లేత ఆకుపచ్చరంగులో కొన్ని, ఎరుపు రంగు తిరుగుతున్నవి చూపుడు వేలంత పొడుగుకాయలు గుత్తులుగా కనబడి మీనాక్షి ముఖం వెలిగి పోయింది.

ఆ పిల్ల రాళ్ళు ఏరి తెచ్చి కాయల మీదకి గురి చూసి కొడుతుంట్ ఒక్కటీ రాలడం లేదు.

“ఉండండి అమ్మాయిగారు." అంటూ సత్యం పెరటి వైపు నుండి పొడుగాటి వెదురుగడ తెచ్చి కొట్టేసరికి నాలుగుగుత్తులు రాలి పడ్దాయి.

గబ గబ అవి ఏరుకుని రుమాలులో కట్టింది మీనాక్షి.

రుచికోసం ఆకుపచ్చరంగులో వున్న కాయ వొలిచి లోపల తెలుపురంగులో వున్న గింజలలో పిక్కలు తీసేసి నోట్లోవేసుకుంది.

తీపి, వగరు రుచి నోటికి తగిలి ముఖం చిట్లించింది.

" మరేనండీ. ఎరుపు రంగుకు తిరిగిన కాయలలోనివి తియ్యగా వుంటాయండి." అన్నాడు సత్యం.

" అమ్మ రాక ముందే వుసిరి కాయలు కూడా కొట్టి పెట్టవూ?" అని మీనాక్షి ముచ్చట పడింది.

ఇద్దరూ చప్పుడు చేయకుండా పెరట్లోకినడిచారు.

రసంతో నిండి మెరుస్తున్న వుసిరి కాయలు చూస్తుంటేనే మీనాక్షి కి నోరు వూరిపోతోంది.

చెట్టుకున్న కాయలని సత్యం కర్రతో కొడుతుంటే పడినవి పడినట్టే ఏరి రుమాలులో మూట కట్టింది.

"అమ్మాయిగారండీ! మరేమో వుసిరి కాయలు తిన్నాక మంచినీళ్ళు తాగితే మాచెడ్డ రుచిగా వుంటాయండీ!" అంటున్న సత్యం కళ్ళు ఆ తీపి రుచి గుర్తుకొచ్చినట్టు మెరిసాయి.

“ అయితే నువ్వు నూతిలో నీళ్ళు చేదు మరి” అంటూ వుసిరికాయ కొరికింది.

నూతి గిలక మీద వున్న తాటికి కట్టిన చేద నూతిలోకి జారవిడిచి నీళ్ళు తోడి , తాడు పైన పట్టుకుని నూతిగట్టునపెట్టాడు సత్యం.

నములుతున్న వుసిరికాయ గుజ్జు గబుక్కున మింగి దోసిటితో నీళ్ళు తీసుకుని తాగి అబ్భ! ఎంత తియ్యగావున్నాయో!" అంది మీనాక్షి సంబరంగా.

అంతలో ఎవరో వస్తున్న అలికిడి అయి ఇద్దరూ మెల్లిగా వీధిగుమ్మం వైపు వచ్చారు.

"ఇవాళ వీళ్ళ ఇంట్లో పాయసం పండుగ. ఎంత కావలసితే అంత వడ్డిస్తారుట. నాకు క్షీరాన్నం చాలా ఇష్టం. మరినీకూ?" సత్యం ని అడిగింది మీనాక్షి.

"అబ్బో నాకూ శానా ఇష్టమండి. కానీ దేవుడి పెసాదం మాకు పెట్టరండి. మీ బేమ్మలకే." నిరాశగా అన్నాడు.

"ఎందుకనీ? వీళ్ళందరికీ పాలు తెచ్చి పోసేది మీ అమ్మే నంట కదా!" ఆశ్చర్య పడింది మీనాక్షి.

"అదంతేలెండి అమ్మాయిగారూ” తేల్చి చెప్పేడు.

"అయ్యో మరి నీకు పాయసం ఇష్టం అన్నావు?" మీనాక్షి ఆలోచన తెగక ముందే అమ్మ, చెల్లినీ, తమ్ముడినీవెంటబెట్టుకుని రావడం కనబడింది.

రుమాలులో కట్టిన కాయల మూట సత్యం చేతిలో పెట్టి “ఇంటికి వెళ్ళాక తిందాము “ అని రహస్యంగా చెప్పి, అటుపరుగు తీసింది మీనాక్షి.

“ అమ్మా అక్క కూడా వుంటే బాగుండేది కదా! “ అంటూ అమ్మ చెయ్యి పట్టుకుంది.

అమ్మ చెయ్యి పట్టుకోవడం మీనాక్షికి భలే ఇష్టం. అమ్మ పట్టుచీర కట్టుకుని, జుత్తు ముడి చుట్టూ పువ్వులుముడుచుకుంటే ఇంకా ఇష్టం. ఈ రోజు వాళ్ళ అమ్మ సింహాచలం సంపెంగ పువ్వురంగు పట్టుచీర కట్టుకుంది. తలలోచేమంతిపూలు పెట్టుకుంది.

మీనాక్షి కన్న అయిదేళ్ళు పెద్దదైన అక్క కాకినాడ పి.ఆర్. కాలేజీలో ఇంటరు చదువుతోంది. కోటేరు వంటి ముక్కు, పెద్దకళ్ళు, నొక్కుల జుత్తుతో తెల్లగా, అందంగా వుండే అక్క అంటే మీనాక్షికి పెద్ద ఆరాధన. అందులోనూ కాలేజీలో చేరాక అక్కమాటా, నడకా ఇంకాస్త నాజూకుగా తయారు అయ్యాయేమో ఆ ఆరాధన మరింత పెరిగింది.

అక్క పక్కన నడుస్తుంటే గర్వంగా వుంటుంది మీనాక్షి కి. అక్క వెనకే తోకలా తిరుగుతుంది. అక్క స్నేహితురాళ్ళ ఇంటికివెళ్ళినా వెంట పడుతుంది.

మీనాక్షి అమ్మ కూచి అయితే, వాళ్ళ చిన్నక్క నాన్న కూచి. అమ్మ దగ్గర ఏదైనా పని కావాలంటే మీనాక్షితో అడిగిస్తుందిఅక్క. అంటే స్నేహితురాలి పుట్టిన రోజుకు వాళ్ళింటికి వెళ్ళడం లాటివన్నమాట.

నాన్నగారి నుండి కావలసిన పనికి అమ్మ కూడా అక్కనే మధ్యవర్తిగా పంపుతుంది. కాకినాడ వెళ్ళి మిస్సమ్మ సినిమాచూడాలంటే నాన్నగారి దగ్గర అక్క సిఫార్స్ చేయాల్సిందే .

సెలవులకు అక్క రామచంద్రపురం ఒస్తే మీనాక్షికి, చెల్లికీ పండగే. ఎందుకంటే అక్క తిరిగి వెళ్ళేటప్పుడు బస్ ఎక్కేదాకాతన కూడా వుంటారు ఇద్దరూ. అక్క బస్ కదిలేటప్పుడు ఇద్దరికీ చెరో అణా ఇస్తుంది జీళ్ళు కొనుక్కో డానికి. అందుకోసంఎదురు చూస్తుంటారు.

పెద్దక్కకు పదహారేళ్ళకే పెళ్ళి చేసి అత్తరింటికి పంపేసారని అమ్మ మీద మీనాక్షికి కోపం. చిన్నక్క కంటే పెద్దక్క రెండేళ్ళేపెద్దది పాపం. ఆ అక్క వస్తే రాత్రిపూట నాన్నగారి ముందు కూర్చుని రెండు గంటలు చక్కగా వీణ వాయిస్తుంది.

చెల్లెళ్ళు తమ్ముడు అంటే పెద్దక్కకు ఎంతో ప్రేమ.చెల్లికి పేరు పెట్టింది కూడా పెద్దక్కే. చెల్లి ముఖం చక్కగాచంద్రబింబంలా వుంటుందని సంగీతంలో రాగం పేరుపెట్టింది.

కాసేపటిలో అందరూ రావడంతో పెద్దపాపాయి వాళ్ళ నట్టింట్లో వడ్డన మొదలయ్యింది.

"లక్ష్మిరమణ గోవిందా" అని అందరూ గొంతెత్తి పలికి తినడం మొదలు పెట్టారు.

పాయసం భలే రుచిగా వుందేమో జుర్రుకుని తినేస్తోంది. మీనాక్షి. ఎంత కావలిస్తే అంత వేస్తారు. అయితే ఒక్క రవ్వకూడా పారేయ కూడదు. ప్రసాదం కదా!

అందరూ అలవాటుగా మంచినీళ్ళ కోసం తమ ఇళ్ళనుండే గ్లాసులు తెచ్చుకున్నారు. పిన్నిగారు వచ్చి అందరికీ మరోసారిమంచినీళ్ళు పోస్తుంటే, తన గ్లాసులో కొద్దిగానే నీళ్ళు వున్నా, వద్దని చెయ్యి అడ్డం పెట్టింది మీనాక్షి.

పాయసం వడ్డిస్తున్న ఆయన రాగానే ఆ గుక్కెడు నీళ్ళు గభుక్కున తాగేసి, గ్లాసు ముందుకు జరిపింది. హడావుడిగాముందుకు పోతున్న ఆయన ఆ గ్లాసులొకి పాయసం వేసి వెళ్ళిపోయాడు.

అమ్మకి కనబడకుండ ఆ గ్లాసు మీద తన చేత్తో మూసి పట్టుకుంది.

చేతులు కడుక్కోడానికి అందరూ పెరటి వైపుకి వెడుతుంటే మీనాక్షి మాత్రం పాయసం వున్న తన గ్లాసు పట్టుకుని వీధి గుమ్మం వైపు పరుగు తీసింది.

అమ్మగారూ,అమ్మాయిగారూ రావడం కోసం ఎదురు చూస్తూ చెట్టుకింద కూర్చున్న సత్యం దగ్గరికి వెళ్ళి " ఇదిగో నీకోసంపాయసం తెచ్చాను. తొందరగా తాగెయ్యి " అంది.

పాయసం చూడగానే పాతికేళ్ళ సత్యం ముఖంలో పాల సీసా చూసిన పసివాడి ఆనందం కనబడింది.

అంతలో భయంగా ఇంటి గుమ్మం వైపు చూసి " అమ్మో! వాళ్ళకి తెలిస్తే కోప్పడతారండి అమ్మాయిగారూ! పైగా మీరుతాగే గళాసులో ..." అని బెదురుగా చూసాడు.

“అమ్మ నీకు గ్లాసులోనే కదా కాఫీ ఇస్తుంది? “ అంది.

" అది నా కోసమే అట్టిపెట్టిన గళాసండీ. అన్నాడుసత్యం.

“ఏం ఫరవాలేదులే తొందరగా. తాగు. రేపు నీళ్ళ కాగుకింద మంట వేసినప్పుడు కాసేపు పొయ్యిలో పెట్టి తీసేయ్. పాల గిన్నెలో పిల్లి మూతి పెడితే అమ్మ ఆ గిన్నెను అలాగే శుద్ది చేస్తుంది." ఆరిందాగా అంది తొందరపెడుతూ.

అమృతం లాటి పాయసాన్ని వదులుకోలేక, గీత దాటనూ లేక, " నా దోసిట్లో పోయండి అమ్మాయిగారు " అంటూదోసిలి పట్టాడు.

అపురూపంగా పాయసం జుర్రుకుని, చేతులు కడుక్కునే అవసరం లేనంత శుభ్రం గా నాకేస్తున్న సత్యం వైపు ఇష్టంగాచూస్తోంది మీనాక్షి.

“ నేను పెద్దయ్యాక ఇలా పూజ చేసుకుంటానుకదా అప్పుడు నిన్ను మా ఇంటికి పిలిచి, లోపల కూర్చోబెట్టి, మేమువాడుకునే కంచంలోనే అన్నం పెట్టి మేము తాగే గ్లాసులో నీకు పాయసం ఇస్తాను సరేనా?” భరోసా ఇచ్చింది మీనాక్షి.

కాలజ్ఞానం తెలిసినట్టు ఒక కాకి అవును... అవును అని అరుచుకుంటూ పోయింది.

మరిన్ని కథలు

sweet married life
తియ్యని కాపురం
- పి. వి. రామ శర్మ
friendship
స్నేహం (పిల్లల కథ)
- దార్ల బుజ్జిబాబు
Tolakari
తొలకరి
- శింగరాజు శ్రీనివాసరావు
The value of education
విద్యవిలువ
- డా.బెల్లంకొండడనాగేశ్వరరావు.
నడిచొచ్చిన పుట్ట
నడిచొచ్చిన పుట్ట
- Dr. శ్రీదేవి శ్రీకాంత్
fourth lion
నాలుగో సింహం
- తడకమళ్ళ మురళీధర్
wife
అర్ధాంగి
- గొర్తి.వాణిశ్రీనివాస్