అరుణోదయం (మినీ నవల) - లత పాలగుమ్మి

అరుణోదయం (మినీ నవల)

గజ గజ వణికే చలిలో... చాలీ చాలని పాత చిరిగిపోయిన కంబళిని పైకి.. క్రిందికి లాక్కుంటూ ఓ బెంచ్ మీద ఆద మరచి నిద్ర పోతోందికాలీ. ఆ పాప అసలు పేరు అరుణ. కానీ ఎవరూ ఆ పేరుతో పిలవరు కాబట్టి ఒక రకంగా ఆచిన్నారి కూడా మరచిపోయినట్లుంది తన పేరు అరుణని.

ఒకసారి అరుణ గతంలోకి తొంగి చూద్దామా !!

అరుణ మంచి కుటుంబం లోనే పుట్టింది.... కానీ పుట్టిన వెంటనే తల్లి చనిపోవడంతో నష్టజాతకురాలని, తల్లిని పొట్టన పెట్టుకుందని నింద పడింది..... నల్లగా పుట్టడం ఆమెదేతప్పన్నట్లు ‘కాలి’ అని నామకరణం చేశారు ముగ్గురు స్టెప్ సిస్టర్స్ .

తండ్రి ఆమెని చూడటానికి కూడా ఇష్టపడేవాడు కాదు. నాయనమ్మే ఏదో ఒక పేరు పెట్టాలి కదాని "అరుణ" అనిపెట్టింది.

అరుణ తండ్రికి మొదటి భార్య వలన ఒక కొడుకు, ముగ్గురు కూతుళ్ళు. నలుగురు పిల్లలు కలిగినతర్వాత కాన్సర్ వ్యాధి సోకి ఆమె చనిపోవడంతో పిల్లల్ని కొడుకు ఒక్కడూ పెంచలేడు........ తనెంత కాలం ఉంటుందో తెలీదని.... అరుణ వాళ్ళ నాయనమ్మ కొడుక్కి రెండో పెళ్ళి చేసింది. ఆమె పేరు లలిత. చాలా ఏళ్ళు ఆమెకి బిడ్డలు కలగకపోవడంతో అందరూ సంతోషించారు. ఆమెకి పిల్లలు పుడితే సవితి పిల్లలని బాగా చూడదనే అనే భయంతో.

లలిత ఎంతో తెలివైనది, సౌమ్య స్వభావం కలది కావడంతో ఎంతో ఓర్పుగా సవితి పిల్లలఆలనా పాలనా, ఇంటి బాధ్యతలన్నీ సమర్ధవంతంగా నిర్వర్తించేది.

అంతా సవ్యంగా సాగుతోంది అనుకునేలోగా ఆమెకి నెలతప్పడం, అరుణకి జన్మనివ్వడం... ఆ ఊరిలో సరైన వైద్య సదుపాయాలు లేక దురదృష్టవశాత్తూ కాన్పులోనే ఆమె చనిపోవడం జరిగింది.

ఇదంతా అరుణ పాద మహిమే అన్నట్లుగా చూశారు ఇంట్లో అందరూ.

కొడుక్కి రెండో పెళ్లి చేసినా సుఖం లేకుండా ఇంకో బిడ్డ బాధ్యత కూడా తమ నెత్తి మీదే వేసివెళ్లిపోయిందని గుండెలు బాదుకుని ఏడ్చింది అరుణ నాయనమ్మ. అయినా పసి బిడ్డనిప్రేమగానే సాకేది కోడలు మీద ఉన్న మమకారంతో.

అరుణకు సుమారుగ ఐదేళ్ల ప్రాయంలో వయసురీత్యా వచ్చిన అనారోగ్యంతో ఆమె కూడా కాలంచేసింది. నాయనమ్మ పోయిన తర్వాత అరుణని పట్టించుకున్న దిక్కే లేదు.

అరుణ తండ్రికి.. మొదటి సంతానం మొగపిల్లాడు కావడం, అందునా నలుగురి ఆడపిల్లల మధ్యన ఒక్కడే కొడుకు కావడంతో........ పొలం అమ్మి అతన్ని పై చదువులు చదివించాడు అరుణ తండ్రి.......... కష్ట కాలంలో అక్కరకు వస్తాడు కదా! కొడుకని.

కానీ అతను వివాహం చేసుకుని సిటీలో స్థిర పడి పండగలకి, పబ్బాలకి చుట్టంచూపుగా రావడమే కానీ తండ్రి భాధ్యతల్ని ఏమీ పట్టించుకోడు.

కొడుకు చదువు, ముగ్గురు ఆడపిల్లల పెళ్ళిళ్ళు, చేసేటప్పటికి అయిన అప్పులు తీర్చలేక...... సమయానికి పంటలు పండక హార్ట్ ఎటాక్ తో చనిపోతాడు అరుణ తండ్రి. అప్పటికి అరుణకుపదేళ్లు.

కార్యక్రమాలన్నీ అయిపోయాక అరుణ బాధ్యతని ఎవరు తీసుకోవాలి!? అనేది పెద్ద సమస్యఅయి కూర్చుంది అందరికి.

అరుణని తమతో తీసుకువెళ్తాము అని వదిన అన్న తర్వాత అందరూ ప్రశాంతంగా గాలిపీల్చుకున్నారు.... ఈ గుదిబండ మన మెడకి చుట్టుకోవటం లేదుకదా!! అని.

పట్టెడన్నం పెడితే పడి ఉంటుంది, ఇంటెడు పనీ చేయించుకోవచ్చనే దురుద్దేశం అరుణ వాళ్ళవదినది.

వదిన తనతో తీసుకువెళ్తాననగానే అరుణ చిన్ని మనసుకి ఎగిరి గంతెయ్యాలనిపించింది.

అరుణ వాళ్ళ అన్నయ్య ఉండేది సిటీలో... వాళ్ళకి ఇద్దరుఆడపిల్లలు కవిత, సరిత. వాళ్ళతో కలిసి స్కూల్ కివెళ్ళొచ్చు, కలిసి ఆడుకోవచ్చు అని ఆశ పడింది. మెుదటినుండీ వాళ్ళంటే అరుణకి చాలా ఇష్టం. వేసవిసెలవలకి వాళ్ళు తమ ఊరికి వస్తున్నారంటే ఆమెకి పండుగే.

వాళ్ళు వేసుకునే మంచి మంచి ఫ్రాక్స్, హెయిర్ స్టైల్, అందమైన ఫ్లవర్స్ తో కూడిన హేయిరబాండ్స్, రక రకాల షూస్, ఒకటేమిటి ! వాళ్ళు వేసుకునేవన్నీ స్పెషలే. ఊరిలో అందరికి వాళ్ళు మా అన్నయ్య పిల్లలని చెప్పుకోవడం చాల గొప్పగా అనిపించేది అరుణకి.

అక్కలు కూడా వాళ్ళని ఎంతో స్పెషల్ గా చూసేవారు.

తన సొంత తండ్రి కూడా తన కంటే వాళ్ళనే ఎక్కువ ఇష్టపడటం.... ఎందుకో అర్ధమయ్యేది కాదు అరుణకు ఆచిన్న వయసులో.

ఎప్పుడూ పల్లెటూరు దాటి బయటకు రాని అరుణకి మొదటిసారిగా ట్రైన్ ఎక్కడం...... ఆఊహకే చాలా సంబరపడిపోయింది.

ఓవర్ నైట్ జర్నీ తర్వాత ట్రైన్ స్టేషన్ కి చేరగానే ప్లాట్ఫార్మ్ మీద తమ ఊరి తిరునాళ్ళ మాదిరిహడావిడి.......... లగేజీతో అటూ ఇటూ పరుగులు తీస్తున్నజనాలు ... టీ సమోసా అమ్ముకునే కుర్రాళ్ళు... పళ్ళబండ్లు... బడ్డీ కొట్లు అన్నింటిని కళ్ళార్పకుండా చూస్తుంది అరుణ.

వదిన 'నడు' అనే గదమాయింపుకి... ఒక్కసారిగా ఉలిక్కిపడి... కలలో నడుస్తున్నట్లుగా వాళ్ళనిఅనుసరించింది.

నాలుగు రోజుల్లో అరుణకి ఇంట్లో పనులన్నీ అప్పగించేసిరోజంతా ఫోనులో స్నేహితులతో గప్పాలు కొడుతూకూర్చునేది వాళ్ళ వదిన.

ప్రొద్దున్న లేచిన దగ్గర నుండి కాలీ, కాలీ ఇదే పిలుపు ఆ ఇంట్లో ఎవరి నోటి నుండయినా....... కాలీ! మిల్క్ ప్యాకెట్స్ తీసుకురావే! అని వదిన.......... కాలీ! నా హోమ్ వర్క్ బుక్ కనపడటంలేదు, వెతికి ఇవ్వు అని పిల్లలు...... కాలీ! నా ఆఫీస్ బాగ్ పట్రా త్వరగా, లేట్అయిపోతోంది....అని అన్నయ్య....... ఇలా ఆమె లేనిదే ఏ పనీ జరగదన్నట్లు అయిపోయిందాఇల్లు.

అన్నయ్య పిల్లలతో కలిసి స్కూలుకి వెళ్ళి చదువుకోవాలనేఅరుణ కోరిక తీరని కోరికే అయింది. కానీ ఇంట్లో ఎవరికీఆమాటే గుర్తున్నట్ల లేదు.

ఏ రోజుకారోజు తనని స్కూల్లో చేరుస్తారేమోననే ఆ చిన్నారిఆశ అడియాసే అయింది.

ఒకరోజు ధైర్యం చేసి “తనని కూడా స్కూల్లో వేయమని”అడిగింది అరుణ వాళ్ళ అన్నయ్యని.

అతను పాపం, చిన్న పిల్ల కదా!! అని జాలి పడి సుముఖంగా ఉన్నట్లు కనిపించినా వదినమాత్రం ససేమిరా కాదంది.

" ఆ మాత్రం చదువు నేను ఇంట్లో చెప్పలేనా!? డబ్బులు దండగ ఎందుకు!? మీ నాన్న ఏమీమాకు ఆస్తులు పంచి ఇవ్వలేదు నిన్ను చదివించడానికి, మీ అక్కలుపట్టించుకోపోయినా..........పోనీలే, దిక్కులేనిదానివని జాలిపడి తీసుకువచ్చాము.

అయినా మా పిల్లలతో నీకు పోటీ ఏంటే!?" అని కళ్ళెర్ర చేసింది వదిన కోపంతో.

అన్నయ్య ఆఫీసుకి, వాళ్ళ పిల్లలు స్కూల్ కి వెళ్ళిపోయాక అరుణ తన చిన్ని చిన్ని చేతులతోఇంటెడు గిన్నెలు వేసుకుని కడగడానికి కూర్చుంటే......... ఈ లోగా వదిన తిట్లు.......... “ఎంత సేపుచేస్తావే!! ఏ పనీ రాదు నీకు.......... తిండి దండుగ తప్పించి, అనవసరంగా తగిలించుకున్నామునిన్ను” అని.

పగలంతా పని, రాత్రి పదింటికి పడుకోవడం....మళ్ళీ తెల్లవారు ఝామునే లేవడం..... మళ్ళీపనీ....ఇదే ఆమె దినచర్య.

అన్న ఇంటికి వచ్చిన దగ్గర నుండి ఆడుకోవడం అన్న మాటే తెలీదు.... పని తప్పించి ఇంకోప్రపంచమే లేకుండా అయిపోయింది ఆ చిన్నారికి.

మధ్యాహ్నం చద్ది అన్నం భోజనం...... తర్వాత కాసేపు నిద్ర, అది కూడా భయపడుతూనే.... వదినది అసలే పెద్ద గొంతు. ఎప్పుడు 'కాలీ' అని అరుస్తుందో తెలీదు. నిద్దట్లో కూడా వదిన పిలిచిందేమోనని ఉలిక్కిపడి లేస్తూ ఉండేది అరుణ.

ఆ చిన్నారికి వాళ్ళ ఊరు... స్నేహితులు అన్నీ గుర్తొచ్చిఏడుపొచ్చేది తరచుగా. ఆంక్షలు పెట్టిన వాళ్ళు ఎవరూలేరు తన ఇష్టం వచ్చినట్లు గడిపేది.

ఇంట్లో చాలా మంది ఉన్నారు కాబట్టి... తను చిన్న పిల్లఅని ఏమో... అక్కలు కూడా ఏ పనీ చెప్పేవాళ్ళు కాదు. అలా అని ప్రేమగా చూసిందీ లేదు.

అసలు తనని పెద్దగా ఎవ్వరూ పట్టించుకున్నదే లేదు . పక్కనే ఉన్న స్కూలుకి వెళ్లడం, తనిష్టమొచ్చినంతసమయం తోటి పిల్లలితో చెట్లంటా, పుట్లంటా తిరుగుతూరక రకాల ఆటలు ఆడుకోవడం...... అలా హాయిగా గడిచి పోయింది ఊరిలో.

ఇవన్నీ గుర్తు చేసుకుంటుంటే తను అప్పుడు ఎంతసంతోషంగా ఉండేదో....... అర్ధం అయింది ఆ పసిహృదయానికి.

కవిత వాళ్ళు స్కూలు నుండి ఎప్పుడు వస్తారా!! అని ఎదురు చూస్తుండేది అరుణ.... "వాళు ప్రొద్దుటి నుండి చదువుకుని అలిసిపోయి ఉంటారు........ పోవే, కాలీ!! పోయి వాళ్ళనితీసుకురా" అనేది వదిన.

ఆమె ఎప్పుడు అలా అంటుందా !! అని ఎదురు చూసేది అరుణ.

ఎందుకంటే రోజు మొత్తం మీద బయట ప్రపంచం ముఖం చూసేది ఆ ఒక్క సారే కాబట్టి.

స్కూల్ బస్సు రావడం, పిల్లలందరూ యూనిఫార్మ్స్, షూస్ వేసుకుని, బ్యాక్ ప్యాక్ తగిలించుకుని వరుసగాబస్సు లోంచి దిగడం.... ఏదో అపురూపమైన దృశ్యాన్నిచూసినట్లు చూసేది అరుణ... రోజూ చూసేదే అయినాసరే... ఇవన్నీ అరుణ కన్నులకు ఇంపుగా ఉండేవి. ఆమెని చూడగానే ఇద్దరూ వాళ్ళ బ్యాక్ పాక్స్ తీసిఇచ్చేసేవారు. ఎంతో సంతోషంగా మోసేది... వాళ్ళ బ్యాక్పాక్ వేసుకుని తనే స్కూలుకి వెళ్ళి వస్తున్నట్లుగా ఫీల్అయ్యేది అరుణ.

కవిత వాళ్ళు స్కూల్ నుండి వచ్చాక వదిన రోజూ వాళ్ళకి కేక్స్, క్రీం బిస్కట్స్ లాంటి మంచి, మంచి స్నాక్ ఐటమ్స్పెట్టేది. ఇది కూడా ఒక కారణం వాళ్ళు ఎప్పుడువస్తారా!! అని అరుణ ఎదురు చూడటానికి.

వాళ్ళతో పాటు అరుణ కి కూడా చిన్న ముక్క విదిల్చేది. వాళ్ళకి ఎక్కువైపోతే అరుణకు ఇచ్చేసిఆడుకోవడానికి వెళ్ళేవారు.... వాళ్ళ అమ్మ చూడకుండా తినమని చెప్పి. ఆమె మీద ప్రేమతో కాదు, తినకపోతే వాళ్ళ అమ్మ ఎక్కడ తిడుతుందో అనే భయంతో. ఇవన్నీ అరుణని ఎప్పుడూబాధించ లేదు.

వదిన సూటీపోటీ మాటలు, దెప్పిపొడుపులు, తిట్లు, వీటి ద్వారా తనెంత నష్టజాతకురాలో కదా!! అందుకే తనని ఎవరూ ఇష్టపడరని కొంచెం ఎదుగుతున్న ఆ పసి మనసుకు అర్ధమయ్యేది. వదిన దగ్గరికి వచ్చేంత వరకు ఆమెని ఎవరూ తిట్టిందీ లేదు.

తండ్రి చనిపోయే చివరి రోజుల్లో మాత్రం అరుణని పిలిచి “నిన్ను ఒక్కదాన్నే అన్యాయం చేసివెళ్ళిపోతున్నానమ్మా” అని బాధ పడ్డాడు.

అరుణ తండ్రి చనిపోయే ముందు కొడుకు చేతిని తన రెండు చేతులతో పట్టుకుని “అరుణఅందరి కన్నా చిన్నది,

దీన్ని ఒక అయ్య చేతిలో పెట్టే బాధ్యత మాత్రం నీదేరా, కాదనకు, ఆడపిల్లల్ని అడగలేను కదరా, నాయనా!” అని ఎంతో దీనంగా అడిగాడు. అన్నిటికి మౌనమే అతని సమాధానం.

ఒకసారి ఇంట్లో అన్నయ్య ఉంగరం కనిపించకపోతే అరుణే తీసిఉంటుందని చితక్కొట్టింది వాళ్ళవదిన. అరుణ తను తీయలేదని....కనీసం అన్న చేతికి ఉంగరం ఉన్నట్లు కూడా తనకితెలీదని....

ఎంత చెప్పినా వినిపించుకోలేదు.

వదిన కొట్టినందుకు కాదు, అన్నయ్య ఏమీమాట్లాడనందుకు బాధ అనిపించింది అరుణకి.

ఇంట్లో ఏ చిన్న సమస్య వచ్చినా " అనవసరంగా ఈ నష్టజాతకురాలిని తెచ్చి నెత్తి మీద పెట్టుకున్నాం, అందుకే మనకేమీ కలిసిరావడం లేదు" అని మండిపడేది వదిన. అప్పటికప్పుడు ఎక్కడికైనా పారిపోయి మొహం దాచుకోవాలి అనుకునేది అరుణ.

అతి కష్టం మీద కత్తి మీద సాము లాగ మూడు ఏళ్ళుగడిచాయి.

రోజురోజుకి వదిన ఆగడాలు తట్టుకోవడం కష్టం అయిపోయింది అరుణకి. ఒక రోజు జరిగినసంఘటన ఆమెని ఇల్లు వదిలి వెళ్లిపోయేలా చేసింది.

కవిత, సరితలిద్దరికి చికెన్ పాక్స్ రావడంతో ఇద్దరి మొహాలు మచ్చలతో వికారంగా తయారయ్యాయి... వళ్ళంతా కూడా మచ్చలే... తెల్లటి మొహాలపై మచ్చలు మరీ కొట్టొచ్చినట్లు కనపడటంతో ఎక్కడ తగ్గవో అనే భయంతో అన్న, వదిన బాగా బెంగ పెట్టుకున్నారు. అరుణకూడా వాళ్లని ఎంతో జాగ్రత్తగా చూసుకునేది.

అరుణని పిల్లల దగ్గరే ఉండమని, వాళ్ళకి బోర్ కొట్టకుండాబోర్డు గేమ్స్ ఆడమని చెప్పింది వదిన.

పగలు, రాత్రి వాళ్ల దగ్గరే ఉండేది అరుణ... అయినాఅరుణకి చికెన్ పాక్స్ రాకపోవడం... ఆశ్చర్యాన్ని, ఈర్ష్యను కలిగించింది ఆమెకి.

అరుణ ఆరోగ్యంగా ఉండటం, టీనేజీలోకి అడుగు పెట్టడంతో నలుపు రంగువిరిగి...చామనఛాయలోకి మారడం, వ్యవసాయదారుని కుటుంబం నుండి రాబట్టి.... తండ్రిలాగా మంచి వడ్డూ పొడుగు ఎదగడం.... వాళ్ళ పిల్లలు బొద్దుగా, పొట్టిగా ఉండటం చూసి సహించలేక పోయిందివాళ్ళ వదిన.

అరుణ మొహం చక్కగా ఉండటం చూసి భరించలేక మా పిల్లల్ని చూసి నవ్వావనే నెపంతో గరిట కాల్చి వాతలు పెట్టబోయింది ఆమె.

అదృష్టవశాత్తూ అరుణ వాళ్ళ అన్న సమయానికి వచ్చి కేకలు వేయడంతో ఆపింది.

ప్రతీ చిన్న విషయానికి చేయి చేసుకోవడంతో మనసుకి బాథ అనిపించి ఇల్లు వదిలివెళ్ళిపోయింది అరుణ. కోపంతో ఇల్లు వదిలి వెళుతుందే కానీ ఎక్కడికి వెళ్ళాలో తెలీదు ఆచిన్నారికి. తెలిసిన వాళ్ళు ఎవరూ లేరు ఆ మహానగరంలో. అలా నడుచుకుంటూ ఎన్ని మైళ్ళువెళ్ళిందో తెలీదు. శోష వచ్చి ఒక ఇంటి అరుగు మీద కూర్చుంది. ఆ ఇంట్లో వాళ్ళు అక్కడ నుండిపొమ్మని కసురుకోవడంతో ఏం చేయాలో తెలీక మళ్ళీ నడక కొనసాగించింది. కాళ్ళు నొప్పులు, ఆకలి, దాహంతో కళ్ళు తిరిగినట్లయింది.

ప్రక్క సందులో బజ్జీల బండి ఉన్నట్లు ఉంది. కమ్మటి బజ్జీల వాసన అరుణ ముక్కుపుటాలకిసోకింది. అసలే ఆకలి మీద ఉందేమో ఆ వాసన వస్తున్న వైపు గబ గబా ఓపిక చేసుకునివెళ్ళింది. బండి చుట్టూ జనాలు నిలబడి హడావుడిగా తింటున్నారు.

భార్యాభర్తలు ఇద్దరూ బజ్జీలు వేయడంలో హడావుడిగాఉన్నారు.

డబ్బులు లేవు కొనుక్కోవడానికి....... అడగడానికి ఆత్మాభిమానం అడ్డొచ్చింది....... ఆకలిదహించేస్తోంది. కొంచెం జనాలు తగ్గితే అడుగుదామని చూస్తూ కూర్చుంది.

మెల్లగా జనం పలుచబడ్డారు బజ్జీల దుకాణంలో.

వాళ్ళ పిల్లాడనుకుంటా!!

పాపం ఒక్కడు..... ప్లేట్లు కడుగుతున్నాడు.

“నేను సహాయం చేయనా తమ్ముడు నీకు!?” అని వరస కలిపింది అరుణ. అతను సంతోషంగాతలూపాడు.

అందరూ వెళ్ళిపోయాక “ఆ పిల్లాడు ఒక ప్లేట్ ఇడ్లీ, బజ్జి పట్టుకువచ్చి అరుణకిచ్చాడు తిను అక్కా" అని. తీసుకునిఆదరా బాదరాగా తింది.

అవి తిన్న తర్వాత ప్రాణం లేచి వచ్చినట్లయింది అరుణకు.

ఆ అబ్బాయి తల్లి ఇంకో ప్లేట్ బజ్జి తీసుకువచ్చి తినమ్మా!! అడగక పోయినా బోలెడు సహాయం చేసావు మాఅబ్బాయికి అని మెచ్చుకుంది. ఆ మాత్రం ప్రేమకే మొహంవాచిపోయిందేమో ఆనందంతో కళ్ళమ్మట నీళ్లు వచ్చాయి.

ఎందుకో తెలీదు కానీ చాలా సంతోషంగా అనిపించింది అరుణకి. ఇల్లు లేదు, చేతిలో డబ్బులులేవు!! రేపెలా గడుస్తుంది!? అనేది తెలీదు... అయినా మనసుకు ఎంతో ప్రశాంతంగా ఉంది .... ఎవరికీ భయపడాల్సిన పని లేదు.... వదిన తిడుతుందేమోననే భయం లేదు... అనుకుందిఅరుణ.

“ఈ రోజు రాత్రికి నేను మీతో ఉండవచ్చా అమ్మా!!”అని అడిగింది ఆపిల్లాడి తల్లిని.

అయ్యో!! మా కాడ ఏటి ఉన్నాయమ్మా!! నీకు పండుకోడానికి ఈయటానికి! చూత్తే సదువుకున్నోళ్ల బిడ్డలా ఉన్నావు. మీ ఇంటి కాడ దింపమంటావా బిడ్డా!! అనడిగింది ఆమె.

“ఇల్లు చాలా దూరమని ఈ రాత్రికి మీతో ఉండటానికి అనుమతించమని”అభ్యర్థించింది అరుణ.

ప్లాట్ ఫారం పక్కనే ఉన్న చిన్న గుడిసె వాళ్ళది. “ఈ రేతిరికి నువ్వు బయటనే పండుకో మావా!! ఈ పాప ఈడనే ఉంటుందంట” అని వాళ్ళాయనకి చెప్పి అరుణని లోపలికి రమ్మని పిలిచింది.

ఆ గుడిసెలో ముగ్గురుకే చోటుంది.

“బయట ప్రపంచకం మంచిది కాదని, ఈ వయస్సులో ఇల్లు వదిలి రాకూడదని, ఇలాసెప్తున్నందుకు ఏమీ అనుకోవద్దమ్మా” అని సౌమ్యంగా నచ్చ చెప్పింది ఆమె అరుణకి. భయంగా పరిసరాలు గమనిస్తున్న అరుణనిభయపడాల్సిన పని లేదని చెప్పి తన పక్కనే పడుకోబెట్టుకుంది.

రెండు రోజులు అక్కడే గడిపింది అరుణ. ఇంక వాళ్ళకి భారం అవడం ఇష్టం లేక... అక్కడే ఉంటేఅన్నయ్యకి తెలిసిన వాళ్ళు ఎవరైనా కనపడతారేమోననే భయంతో .. గమ్యం లేని ప్రయాణంమళ్ళీ కొనసాగించింది.

నడిచి నడిచీ అలిసిపోయిన అరుణ ఒక పెద్ద భవంతి దగ్గర ఆగింది. అక్క డే గేట్ దగ్గర కూర్చున్న వాచ్ మెన్ దగ్గరకి వెళ్ళి “తాతా! ఏమైనా పని దొరుకుతుందా!? నాకిక్కడ” అని అడిగింది.

“సార్ వాళ్ళు బయటకు పోయినారమ్మా, వచ్చినాంక అడిగి సెప్తాను........ రేపు రా” అన్నాడు.

ఎక్కడికి వెళ్తుంది తను!? ఇల్లు అనేది ఉంటె కదా !!

పెద్ద రావి, వేప వృక్షాలు కనపడ్డాయి. వాటి క్రింద నీడగా ఉంది కదాని కూలబడింది....... ఇంక ఆరోజు నడిచే ఓపిక కూడా లేదు...... ఏదో ఒక పని దొరికితే బాగుండును ఇక్కడ అని ఆలోచిస్తూ కూర్చుంది.

అలిసిపోయిన బాటసారుల కోసమే అన్నట్లు బెంచిలు వేసున్నాయి అక్కడ. అలసి, సొలసి ఉన్నశరీరం...ఎప్పుడు గాఢంగా నిద్ర పట్టేసిందో తెలీదు అరుణకి. మెలకువ వచ్చేసరికి చీకటిపడిపోయింది.

చల్లని గాలివీస్తోంది, భయంకరంగా దోమలు పీకుతున్నాయి.

ఆటకాయిగా తిరిగే ఇద్దరు కుర్రాళ్ళు ఎప్పటి నుండి గమనిస్తున్నారో గానీ వచ్చి అరుణ ప్రక్కనేఇంకో బెంచ్ మీద కూర్చున్నారు. చిన్నపిల్లని కూడా చూడకుండా అసభ్య పదజాలం వాడుతూ వెకిలిగ చూస్తుంటారు.

అరుణ వాళ్ళని చూసి బెంబేలెత్తిపోయింది. రెండు చేతుల్లో మొహం దాచుకుని వెక్కి వెక్కి ఏడవడం ప్రారంభించింది ... అక్కడే ఉండి ఇదంతా గమనిస్తున్న వాచ్ మెన్ “పోండి,ఈడనుండి!! ఆడపిల్ల అగుపడితే సాలు ఎదవలకి, చిన్న, పెద్ద ఎత్యాసం లేదు...... అని ఆ పోరగాళ్ళని గదమాయించి....... ఏం పిల్లా!! భయంగా ఉందా!? రా లోపటికి...... ఈ రేతిరికి మా ఇంట్లోపడుకో ......... వేకువఝామునే లేచి ఎల్లాల మరి, సరేనా!” అన్నాడు.

“సార్ ఆళ్ళ అనుమతి లేకుండా నేను ఎవరిని గేట్ లోపటికి తీసుకెళ్ల కూడదు. ఆళ్ళకి తెలిస్తేమళ్ళీ నాకు మాట వత్తుంది” అన్నాడు.

భయంతో వణికి పోతున్న అరుణ.. తాత అలా అన్నదే తడవుగా పరుగు పరుగున అతన్ని వెన్నంటే వెళ్ళింది....... సరే తాతా! అలాగేప్రొద్దున్నే లేచి బయటకి వచ్చేస్తానని చెప్పి.

చంద మామ కధల్లో రాజుల కోట గోడ లాగా పెద్ద ప్రహరీ గోడ...

పెద్ద గేటు, గేట్ ఓపెన్ చేయగానే...ఒక వైపు రక రకాల పూల చెట్లు ... నైట్ క్వీన్, మల్లె, సంపెంగ, రక రకాల గులాబీలు, సన్న జాజి చెట్లు ....అన్ని రకాల పూల గుబాళింపుతో సువాసనలు విరజిమ్మేస్తున్నాయి ఆ ప్రదేశమంతా...

అబ్బ! ఎంత బాగుందో....!

కల కాదు కదా! తను స్వర్గం లోకి రాలేదు కదా! అని గిచ్చి చూసుకుంది అరుణ.

మరో వైపు మామిడి, సపోటా, దానిమ్మ, అరటి చెట్లు..... అక్కడ లేని పండ్ల చెట్టు లేదేమో అన్నట్లుగా ఉంది.

అరుణవి అసలే చారెడేసి కళ్ళేమో కళ్ళార్పకుండా చూస్తూ..... “అబ్బా! ఎంత బాగుందో....అనిగట్టిగా అనబోతుంటే హుష్ ! గమ్మునుండు పిల్లా” అన్నాడు తాత.

పట్టపగలేవెూ అని భ్రమ కలిగించేలా... లైట్లతో దేదీప్యమానంగా వెలుగుతోంది ఆ ప్రదేశమంతా.

అంత పెద్ద భవంతిలో ఏ విధమైన అలికిడి లేదు.

“లోపల ఎవరుంటారు తాతా !?” అని అనడిగింది ఆశక్తిగా ..... “అయ్యన్నీ నీకు ఎందుకు పిల్లా!! సప్పుడు సేయకుండా నడు” అన్నాడు.

అరుణని గుడిసె బయటే నిలబడమని చెప్పి లోపలికి వెళ్ళాడు.

లోపలి నుంచి పెద్దగా అరుపులు వినపడ్డాయి... ఎవరిదో ఆడ గొంతు...

" ఎవరిని పడితే ఆళ్ళని ఎంట ఏసుకొస్తావు!! ఎలాంటి ఆళ్ళో కూడా తెలుసుకోకుండా.... పోయినమాల ఎవరో పోరగాడిని తెస్తే ఎంత గొడవ అయింది....ఆడు ఈడ నుండి పోననిమొరాయించాడు.... సార్ ఆళ్ళ వరకెళ్ళింది ఇషయం..... అయినా గానం ( జ్ఞానం ) లేదు నీకు....“అని కోపంతో మండి పడుతోంది ఆమె.

“పాపం, చిన్న పోరే! బయట చీకటికి భయపడి, చలికి ఒణికి పోతోందే!

పోకిరి కుర్రాళ్లు ఎంటపడుతున్నారు, కూసింత ఈ రేతిరికి పండుకోనీ ..... ప్రొద్దుగాలే లేచి ఎలిపోతాదిలేవే” అని నచ్చ చెప్పాడు తాతఆమెకి.

ఆమె బయటికి వచ్చి అరుణని చూసి ఆశ్చర్యంగా “ఓరి , ఈ సిన్న పోరి గురించా నువ్వు సెప్పింది!? సరే రా! లోపటికి... “ అని తీసుకు వెళ్ళింది. ఏందీ?? బువ్వతింటావా!? అనడిగింది.

అరుణ మొహమాటంగా తలూపింది.

అన్నంలో ఎఱ్ఱటి పండుమిర్చి పచ్చడి, ఉల్లిపాయ వేసిపెట్టింది.

తింటుంటే కారానికి వెక్కిళ్లు...... కళ్ళంట, ముక్కంట నీళ్లువచ్చి పొలమారి పోయింది అరుణకి.

మామ్మ మాట కటువే కానీ మనసు మంచిదనుకుంటా...... గబ గబా మంచి నీళ్లు తెచ్చి ఇచ్చి నెత్తిమీద తట్టింది. “మెల్లిగా తిను బిడ్డా! ఖంగారు లేదు” అంది.

ఆమె ఎంతో ప్రేమతో ప్రక్కనే కూర్చుని పెడుతుంటే ఆకలితో ఉన్న అరుణకు పండుమిర్చి కారంకూడా అమృతంలా అనిపించింది.

అరుణ గుడిసె అంతా పరికించి చూసింది.... అవడానికి చిన్నదే అయినా తక్కువ సామానుతోఎంతో పరిశుభ్రంగా ఉంది.

ఆమె తన పక్కనే పడుకోబెట్టుకుంది అరుణని. చాలారోజుల తర్వాత అరుణకు వాళ్ళ నాయనమ్మ గుర్తుకువచ్చింది... చలికి ఆ పెద్దావిడకి దగ్గరగా ఒదిగిపడుకుంటే.

అరుణ గురించి వివరాలు అడిగి తెలుసుకుని " ఇంత చిన్న వయస్సులో ఇన్ని కష్టాలు పడ్డావాబిడ్డా!! అని బాధ పడ్డారు ఇద్దరూ.

“ఈడనే ఏదో ఒక పని దొరుకుతుందిలే, సార్ వాళ్ళది పెద్ద మనసు... ఉండటానికి కూడా ఏదోఒక ఆసరా సూపెడతారులే” అని ధైర్యం చెప్పింది.

సరిగ్గా తెల్లవారకుండానే పిల్లా!! పోయి బయట బల్లమీద పడుకో అని పాత కంబళి ఇచ్చి తరిమేశాడు తాతఖంగారుగా.

అసలే కార్తీక మాసం. అందునా తెల్లవారుఝామునభయంకరంగా వణికించే చలిలో.... చిన్న కంబళి, దానిలో అక్క డక్కడా చిన్న చిన్న చిరుగులు.... అసలే కాలి పొడుగైన అరుణకు అది ఏ మూలకీ సరిపోదు. అయినా మైళ్ల నడకతో అలసి పోయిన అరుణ ఆదమరిచి నిద్ర పోయింది.

************************

వణికి పోతున్న అరుణకు మామ్మ వచ్చి ఇంకో కంబళి వేసేంత వరకు వళ్ళు తెలీదు . “అంత వళ్ళు తెలీకుండా పడుకుంటే ఎలా పిల్లా!? పెద్దవుతున్నావు, పరిసరాలుగమనించుకుంటూ, జాగ్రత్తగా ఉండాలని” మెత్తగాచీవాట్లు పెట్టింది.

ఆమె తిట్టినా సంతోషంగానే ఉంది అరుణకి. అరుణసాయం చేస్తానంటే వద్దని, వాళ్ళు చూస్తే ఊరుకోరనిచెప్పింది. మామ్మ గేట్ బయటంతా ఊడ్చి కళ్ళాపి చల్లిపెద్ద ముగ్గు పెట్టింది. ఆమె ముగ్గు పెడుతుంటే అరుణఅక్కడే కబుర్లు చెబుతూ కూర్చుంది. తను పిలిచేంతవరకు అక్కడే ఉండమని, ఎక్క డికీ వెళ్లవద్దని చెప్పి ఆమెలోనికి వెళ్ళింది. అరుణ ఓక్కర్తే మళ్లీ...

ఉదయం ఎనిమిది దాటిపోయింది. అరుణకు లోపలికి వెళ్ళడానికి అనుమతి లేదు. తాత జాడలేదు...... బహుశా లోపలి పనులతో బిజీగా ఉన్నాడేమో అనుకుంది అరుణ.

అరుణకి అక్కడి నుండి వెళ్ళడం ఇష్టం లేదు. ఒక్క రోజు పరిచయానికే తాత, మామ్మ పెద్ద దిక్కుగా, ఎంతోఆత్మీయులుగా అనిపించారు.

ఇక్కడే ఏదో ఒక పని దొరికితే బాగుండనని ఆశగా ఎదురు చూస్తూ కూర్చుంది.

కడుపులో ఎలుకలు పరుగెడుతున్నాయి. ఈ లోగా ‘కిర్రుమని’ గేట్ శబ్దం........ తాత రెండుజామపళ్ళు ఇచ్చి వెళ్ళాడు..... తోటలోవనుకుంటా........ తాజాగా తియ్యగా ఉన్నాయి.

అవి తిని మునిసిపల్ టాప్ లో కాసిని నీళ్ళు తాగింది అరుణ.

కాస్త ఆత్మారాముడు శాంతించాడు..

మళ్ళీ నిరీక్షణ....!

సుమారుగా మధ్యాహ్న సమయం. మామ్మ తెల్ల పళ్ళెం లోఅన్నం, పులుసు, కూర వేసుకు వచ్చి “పాపం, ఎంతఆకలితో ఉన్నావో ... ఏమో.... ప్రొద్దుగేల నుండి పనితోవీలు కాలేదే అమ్మా, నీకు ఏమన్నా పెట్టడానికి...

నీకోసమే కూర వండా... రేతిరి పచ్చడి కూడు తినలేకపోయావని”అంటూ ఎంతో అభిమానంతో అన్నం పళ్ళెంఅరుణ చేతికిచ్చింది.

అసలే ఆకలితో ఉన్న అరుణ గబ గబా తినేసింది... ఆమె ప్రేమకి కళ్ళంట నీళ్ళు తిరుగుతుండగా.

ఎవరికైనా తను పని చేసి పెట్టడమే కానీ, తనకెవరూ చేసి పెట్టడం అలవాటు లేని అరుణకి పెద్దామె కష్టపడి వండడమే కాక తనకు తెచ్చి పెడుతుంటే తనేమీ వాళ్లకి సహాయం చేయలేకపోతున్నానని వాపోతుంది.

అరుణ అభిమానానికి మామ్మ కళ్ళు చెమర్చాయి.

“బిడ్డలు లేని మా కోసం ఆ దేవుడే నిన్ను పంపించాడని” సంబర పడింది ఆమె.

ఈ లోపు మూడు కార్లు వరుసగా రావడంతో తాత పరుగు పరుగున వచ్చి గేటు తెరిచాడు. అరుణ తొంగి తొంగి చూసింది. కానీ ఎవ్వరూ కనపడరు, కారు గ్లాసుకి బ్లాక్ ఫిల్మ్ ఉండబట్టి.

సాయంత్రానికి అరుణ నిరీక్షణ ఫలించింది.... తాత వచ్చి “పిల్లా! లోనికి రా.... మా సార్ దగ్గరికితీసుకు వెళ్తా” అన్నాడు.

అదొక పెద్ద హాలు, అక్కడ సోఫాలో ఒకాయన కూర్చుని ఉన్నారు. ఆజానుబాహుడు, ప్రశాంతమైన ముఖ వర్చస్సుతో , ఎంతో గంభీరంగా ఉన్నారు. అరుణ భయంతో తాత వెనకాలనక్కి ఉంది.

నేను చెప్పింది ఈ పిల్ల గురించే అయ్యా!అన్నాడు తాత. "ఏదీ!! నాకెవరూ కనపడటం లేదే!” అన్నారు నవ్వుతూ.

తాత ప్రక్కకు తప్పుకున్నాడు .

చిన్నప్పటి నుండి శుభ్రంగా ఉండటం, చక్కగా తల దువ్వుకుని ఉన్నంతలో మంచి బట్టలువేసుకోవడం, అలవాటు అయిన అరుణకి... మురికి బట్టలు, స్నానం చేసి నాలుగు రోజులుఅయిందేమో జిడ్డుగా ఉన్న ముఖం, తైల సంస్కారం లేని జుట్టు.... ఈ అవతారంతో ఆయనముందు నిలబడాలంటే సిగ్గుతో ప్రాణం పోయినంత పని అయింది అరుణకి.

ఎంతో మృదువుగా ఇలారా! అని పిలిచారు........ భయ భయంగా వెళ్ళింది అరుణ. “నీపేరేంటి?? ఎంత వరకు చదువుకున్నావు!? నీ తల్లి తండ్రులు ఎక్కడ ఉంటారు!?” అని అడిగారు.

“తన పేరు ‘కాలీ’ అని చెప్పబోయి తమాయించుకుని 'అరుణ' అని, ఐదవ తరగతి వరకుచదువుకున్నానని చెప్పి, తల్లితండ్రులు చిన్నప్పుడే చనిపోయారని....తనకెవరూలేరని ఏ పనిఅయినా చేస్తానని...దయ చేసి ఇక్కడ ఉండటానికి అనుమతించమని” అడిగింది.

ఎవరినో పిలిచి ఈ అమ్మాయి ఇంక నుంచి ఇక్కడే ఉంటుంది... కావలసినవన్నీ చూడమని చెప్పివెళ్లిపోతారు. "రొట్టె విరిగి నేతిలో పడ్డట్టు” అయిందిఅరుణకి. మరునాటి కల్లా అరడజను క్రొత్త డ్రస్సులు, ఆమెకి కావలసిన మిగతావన్నీ అమిరినాయి .

అరుణకు ఇంకా అంతా కలలానే ఉంది.

వారం, పది రోజుల వరకు ఖాళీగా ఉంది. ఏం పని చెయ్యాలో ఎవరూ చెప్పటం లేదు. మూడుపూటలా తినడం, పడుకోవడం ఇదే పని ఆమెకు.

చిన్నప్పటి నుండి పనికి ఆహార పధకం అన్నట్లు పెరిగిందేమో..... ఇక్కడి వాతావరణం ఆమెకిచాలా వింతగా, కొత్తగా ఉంది.

*****************

ప్రకాశం, రజనీష్, సూర్యం గార్లు ముగ్గురు ప్రాణస్నేహితులు. ముగ్గురూ లక్ష్మీ పుత్రులే. వృత్తి రీత్యా లాయర్లు.

ప్రకాశం గారు పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా చేసి వాలంటరీరిటైర్మెంట్ తీసుకున్నారు.

రజనీష్, సూర్యం గారులు మాత్రం ప్రైవేట్ ప్రాక్టీస్ ఇంకా కొనసాగిస్తున్నారు.

ముగ్గురి ధ్యేయం ఒక్కటే, వృద్ధాశ్రమం స్థాపించి సాధ్యమైనంత మంది వృద్ధులకు ఆశ్రయం కల్పించడం. ప్రకాశం గారు తన డబ్బు, సమయమంతా దీనికే కేటాయిస్తున్నారు. ఆయనకున్న రెండు భవనాలు దీనికే వినియోగిస్తున్నారు.

ఏ నిర్ణయం తీసుకోవాలన్నా ముగ్గురూ కలిసి చర్చించుకుంటారు.

ఖాళీగా ఉండటం అలవాటు లేని అరుణే ఏదో ఒక పని కల్పించుకుని చేసేది. కిచెన్ లోకి వెళ్ళికూరగాయలు తరగడంలో సహాయం చేసేది.

ఓ రోజు ఆమె మొక్కల దగ్గర పాదులు చేస్తుంటే ప్రకాశం గారు వచ్చి అమ్మా, అరుణా!! అనిపిలిచారు.

గబ గబా లేచి ఏంటి సార్!? అనడిగింది ఎంతో వినయంగా. అరుణకు ఈ పిలుపు ఎంతో క్రొత్తగా, చెవులకి ఇంపుగా అనిపించింది. చిన్నప్పటి నుండి " కాలీ అనో... రావే .... పోవే... అనో తప్పించిఇంత ప్రేమగా పిలిచిన వాళ్ళు ఎవరూ లేరు.

ప్రకాశంగారు అరుణని తనతో రమ్మనమని ప్రక్కనే ఉన్న బిల్డింగుకి తీసుకు వెళ్ళారు. ఎంతోఉత్సాహంగా ఆయన్ను అనుసరించింది అరుణ.

ఆ ఆశ్రమంలో రెండు బ్లాక్స్ ఉన్నాయి. మొదటిది రూబీ బ్లాక్ ... రెండోది డైమండ్ బ్లాక్ . రూబీ బ్లాక్ లో ఎనభై ఏళ్ళు పైబడిన వాళ్ళే అందరూ.

డబ్బు లేక, ఎవరూ చూసే వాళ్ళు లేక అనాధలుగా ఉన్నవాళ్లు, ప్లాట్ ఫారం మీద రోజుల తరబడితిండి లేక శోష వచ్చి పడిపోయిన వాళ్ళు.... అనారోగ్యంతో ఉన్న వాళ్ళు.... ఇలా అందరిని ఒకచోట చేర్చి ఆదరిస్తున్నారు ప్రకాశం గారు వాళ్ళు.

రూబీ బ్లాక్ లో సుమారుగా యాభై నుండి అరవై వరకుబెడ్స్ వేసి ఉన్నాయి. అందరూ బాగా పెద్ద వాళ్ళు. ప్రకాశం గారు ఒక్కొక్కళ్ళ దగ్గరికి వెళ్లి యోగక్షేమాలు అడిగితెలుసుకున్నారు.

కొందరు తమని చూడటానికి పిల్లలు రావడం లేదని వాపోతే... కొందరు ఒంట్లో అస్సలుబాగుండటం లేదని కంప్లైంట్ చేస్తున్నారు... మరి కొందరు “మీరు మా దేవుడయ్యా“ అని చిన్నపిల్లల్లా ఆయన చేతులు పట్టుకుని వదలటం లేదు.

కొంత మంది మంచం మీద నుండి లేవలేని వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళ మెడికల్ ఫైల్స్ లోఉన్న ప్రిస్క్రిప్షన్స్ చూసి ఆ రోజు వేసుకోవాల్సిన మందులు దగ్గరుండి వేయించారు.

రెండోది డైమండ్ బ్లాక్

అందులో ఉన్న సీనియర్ సిటిజన్స్ లో చాల మంది హైలీ ఎడ్యుకేటెడ్, హెల్థీ అండ్ ఆక్టివ్. అది పెయిడ్ బ్లాక్ .

పిల్లలు విదేశాల్లో సెటిల్ అయితే ఒక్కళ్ళు ఉండలేక సీనియర్ హోమ్ కి షిఫ్ట్ అయిన వాళ్ళు కొంతమంది......

పిల్లలు పట్టించుకోని వాళ్ళు కొంత మంది అయితే.....

కొడుకు, కోడలు ఉద్యోగాలకి, మనవలు స్కూల్స్ కి వెళితేకాలక్షేపం లేక, ఇంట్లోఒంటరిగా ఉండలేక... ఎవరిద్వారానో ఇన్ని ఆక్టివిటీస్ ఉన్న ఈ సీనియర్ సిటిజెన్ హోమ్ గురించి విని ఇక్కడ చేరిన వాళ్ళు మరికొంతమంది... ఇలా రకరకాల వాళ్ళు ఉన్నారు.

వాళ్ళకి ఆర్ధికంగా ఏ విధమైన సమస్యలు లేవు....

మంచి ఉద్యోగాలు చేసి రిటైర్ అవబట్టి పెన్షన్ కూడా భారీగానే ముడుతుంది. వాళ్ళు దానిలోకొంత భాగం బ్లాక్ రూబీకి డొనేట్ చేసేవారు.

అక్కడ క్యారమ్స్, చెస్, వైకుంఠ పాళీ, ప్లేయింగ్ కార్డ్స్ , టీ. టీ. ఇలా రకరకాల గేమ్స్ ఉన్నాయి.

పెద్ద వాళ్ళందరూ కబుర్లు చెప్పుకుంటూ, జోక్స్ వేసుకుంటూ బిజీ గా ఆడుకుంటున్నారు. వాళ్ళనిచూస్తే ఓల్డ్ ఏజ్ హోంలో ఉన్నట్లుగా కాక వెకేషన్ సెలెబ్రేట్ చేసుకుంటున్నట్లుగా ఉన్నారు.

ప్రకాశం గారు కూడా వాళ్ళలో ఒకరుగా కలిసిపోయి గేమ్స్ ఆడారు. అందరూ చిన్న పిల్లల్లాగాఎంజాయ్ చేస్తున్నారు. అరుణ వింతగా వాళ్లనే చూస్తుండి పోయింది.

అక్కడ వైకుంఠపాళీ గేమ్ చూడగానే అరుణ మొహం వెలిగి పోయింది. అరుణకెంతో ఇష్టమైనఆట. చిన్నప్పుడు ఏదైనా బోర్డ్ గేమ్ ఆడిందంటే అది వైకుంఠపాళీనే. అరుణ ఫ్రెండ్ దగ్గర ఆబోర్డు ఉండేది. అందరూ ఆ అమ్మాయి కి ఎన్నో లంచాలు ఇస్తే గాని ఆ బోర్డు తెచ్చేది కాదు. అలాంటిది ఇక్కడ ఎన్ని వైకుంఠపాళీలు ఉన్నాయో అని ఎంతో ఆశగా, వింతగా చూసింది అరుణ.

మొదటిసారిగా ఆమెకి అర్ధమయింది జీవితంలో ఏవయస్సు లో అయినా సంతోషంగా ఉండవచ్చని.

తర్వాత ఆఫీస్ రూంకి కూడా అరుణని తనతో తీసుకు వెళ్ళారు. రజనీష్, సూర్యం గార్లు కూడాఅక్కడే ఉండటంతో వాళ్ళు ముగ్గురు కబుర్లలో పడ్డారు. ప్రకాశం గారు అలిసిపోయినట్లు కనపడటంతో అరుణ ఆయనకి అక్కడే ఫ్లాస్క్ లో ఉన్న కాఫీ తీసి ఇచ్చింది .

అడగకుండానే అర్ధం చేసుకుని కాఫీ ఇచ్చినందుకు మెచ్చుకోలుగా చూశారు ఆమె కేసి.

అన్నట్లు ఈ అమ్మాయి గురించి చెప్పలేదు కదా నేను మీకు !! అని వారం క్రితం పనిలోకి తీసుకున్నట్లుగా చెప్పారు ప్రకాశం గారు.

ఇంత చిన్న పిల్ల పెద్దవాళ్ళని చూసుకోగలదా! అనే అనుమానం వ్యక్తం చేసారు వాళ్లిద్దరూ. ఆమెని వాళ్ళ ఆర్ఫనేజ్ కి పంపిద్దామని అక్కడైతే తోటి పిల్లలితో కలిసి చదువుకుంటుంది అనిసూచించారు.

అరుణ మొహం ఆందోళనతో నిండి పోయింది అక్కడి నుంచి పంపించేస్తారేమోననే భయంతో. ఆమెకి ఆశ్రమం ఎంతగానో నచ్చింది.

చిన్నపిల్లే అయినా ఓర్పు ఎక్కువ అని, గత వారం నుండి గమనిస్తున్నానని, ఏ పనీచెప్పకపోయినా తనంత తానే కల్పించుకుని చేస్తోందని, పెద్దవాళ్ళని చూడడానికి కావలసినంతఓర్పు నేర్పు ఉన్నాయని అరుణ గురించి వాళ్ళకి చెప్పారు ప్రకాశం గారు.

చిన్న పిల్ల కాబట్టి కొంచెం సమయం ఆశ్రమంలో పెద్దవాళ్ళతో గడిపి మిగతా సమయం ప్రైవేటుగా అరుణ తన చదువు కొనసాగించాలని నిశ్చయించారు ప్రకాశం గారు.

మిగతా ఇద్దరూ కూడా ఆయన నిర్ణయానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

అరుణ ఆనందానికి అవధులు లేవు, తన చిరకాల వాంఛ నెరవేరబోతున్నందుకు.

ఆ రోజు మొదలుకుని ఆమె డ్యూటీ పెద్దవాళ్ళ దగ్గరే.

రోజూ ఉదయాన్నే పెద్దవాళ్లందరినీ పేరుపేరునాపలుకరించి వాళ్ళ సమస్యలు శ్రద్ధగా వినడం...... వాళ్ళనిశుభ్రం గా ఉంచుతున్నారో లేదో సూపర్ వైజ్ చేయడం ... బ్రేక్ఫాస్ట్ తర్వాత మెడిసిన్స్, వాళ్ళలో కొందరు మందులు వేసుకోననిమొరాయిస్తారు. వాళ్లకి ఓర్పుగా కధలు చెప్పి నచ్చ చెప్పడం. కాసేపు వాళ్లతో కబుర్లు ...ఇదీ ఆమెదిన చర్య.

ఒక నెల తిరిగేటప్పటికీ అన్ని అవగతమయ్యాయి అరుణకి.

ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళందరూ చిన్నపిల్లలితో సమానమని అర్ధమయింది అరుణకు.

అవడానికి అరుణ వయసు పదమూడేళ్ళే అయినా ఇరవై ఏళ్ళ వాళ్ళకి ఉండవలసినమెచూరిటీ ఉంది.

మెడిసిన్స్ పేర్లు చదవడం రాకపోవడంతో అరుణకు పెద్ద ఇబ్బందే ఎదురయింది

డైమండ్ బ్లాక్ లో ఉంటున్న రిటైర్డ్ ప్రొఫెసర్స్ కి అరుణకు చదువు నేర్పిస్తే మెడిసిన్స్ ఇవ్వడంలోహెల్ప్ అవుతుందని అనిపించడంతో ఆ మాటే ప్రకాశం గారితో అంటారు.

“అయితే ఇంక ఆలశ్యం ఎందుకు!? ఆ మంచి పనికి మీరే శ్రీకారం చుట్టండి” అని ప్రకాశం గారుఎవరితోనో అంటుంటే విన్న అరుణ సంబరపడిపోయింది.

స్వతహాగా తెలివైనది, చదువంటే మక్కువ కలిగింది కాబట్టి ఆరు నెలలు తిరిగే లోగా ప్రిస్క్రిప్షన్స్చూసి మెడిసిన్స్ ఇవ్వడం నేర్చుకుంది.

డైమండ్ బ్లాక్ లో ఒక లైబ్రరీ ఏర్పాటు చేశారు ప్రకాశంగారు వాళ్ళు.

స్టోరి బుక్స్ అన్నీ ఇంగ్లీష్ లోనే ఉండబట్టి అరుణ ముందు తాను నేర్చుకుని తర్వాత పెద్దవాళ్ళకి తెలుగులో చెప్పేది.

వారాంతరాల్లో ఆర్ఫనేజ్ నుండి పిల్లలు బస్సులోవచ్చేవారు ఆశ్రమానికి.

పిల్లలికి రామాయణ, మహా భారతాలు ఛార్ట్స్ తయారు చేసి వాళ్ళ మనసుకి హత్తుకునేలానేర్పేవారు రజనీష్, సూర్యం గార్లు. అందులో అరుణ తనకి తోచినంత సహాయం చేసేది.

రిటైర్డ్ ప్రొఫెసర్స్ కూడా అందులో ఆక్టివ్ గా పాల్గొనేవారు.

వాళ్లందరికీ చిన్న పిల్లలతో టైం స్పెండ్ చేయడం అంటే ఎంతో ఇష్టం. వీకెండ్ ఏం నేర్పాలి అనేప్రణాళిక వేయడంతోనే వీక్ అంతా గడిపేవారు. అరుణకు కూడా వీటి అన్నింటిలో పాలుపంచుకోవడంతో, మొహమాటం పోయి అతి త్వరలో ఆ బ్లాక్ లో వాళ్లందరికి కూడా చేరువ అయింది.

అరుణ ఆశ్రమానికి వచ్చాక సంతోషంతో సమయం ఎలా గడిచి పోతోందో తెలీలేదు. అయిదుసంవత్సరాలు ఇట్టే గడిచిపోయాయి.

వయసుతో వస్తున్న మార్పులతో..... చామన ఛాయ రంగుతో........ పెద్ద వాలుజడతో.......... చూడముచ్చటగా, అందంగా ఉండేది అరుణ.

పౌష్టికాహారం, మంచి దుస్తులు మనిషికి వన్నె తెస్తాయి అనేది ఎంత సత్యమో అరుణని చూసిచెప్పొచ్చు.

వయసు కన్నా అనుభవంతో కూడిన హుందాతనం, ఆత్మ స్థయిర్యం, సహనం, పొందికతనం, దయ, కరుణ కనపడేవి ఆమెలో.

అరుణ లేకపోతే గడవదనిపించేలా అల్లుకుపోయింది ఆశ్రమంలో అందరితో.

అమ్మా అరుణా!! అని ప్రకాశం గారు ప్రేమతో పిలిచే పిలుపు వినపడక పొతే అరుణకి ఆ రోజు గడవదు.

కొత్త వాళ్ళయితే అరుణ ప్రకాశం గారి కూతురేవెూ అనుకునేవారు.

అరుణ పద్దెనిమిదో ఏట పుట్టిన రోజు సెలెబ్రేట్ చేశారు ఆశ్రమంలో వాళ్ళందరూ కలసి. అరుణమొహమాటంతో ఎంత వద్దని చెప్పినా వినకుండా.

ప్రకాశం గారు ఇచ్చిన లక్ష్మి అమ్మవారి పెండెంట్ తో కూడిన గోల్డ్ చైన్ అరుణకి ఎంతోఅపురూపమైన కానుక.

జీవితంలో మొదటిసారిగా పుట్టిన రోజు జరుపుకున్న అరుణకు అది ఒక మధురమైనఅనుభూతిగా మిగిలింది.

ఎన్నో కానుకలు ....... ప్రతి కానుకా అమూల్యమే. అందరికి అరుణ అంటే వల్ల మాలిన అభిమానమే. ఎన్నో దీవెనలు, మరెన్నో ఆశీర్వచనాలు.

ఈ ఆశ్రమానికి రావడం తన పూర్వ జన్మ సుకృతంగా భావించింది అరుణ.

అరుణ ఎంత బిజీగా ఉన్నా వాచ్ మెన్ వాళ్ళని కలవడంమాత్రం మరిచేది కాదు. వారానికొకసారి మొక్కలకిపాదులు చేయడంలో వాళ్లకి సహాయం చేయడం, వాళ్ళతోకలిసి భోజనం చేయడం ఆమెకెంతో సంతృప్తినికలిగించేది.

ఆశ్రమం అంతా సంబాళిస్తూ ఇంకా తమని మర్చిపోకుండా తమతో సమయం గడపటం వాళ్ళకిఎంతో సంతోషంగా ఉండేది.

ఒకరోజు వాళ్ళని కలిసి ఆశ్రమం లోకి వస్తూ ఉండగారజనీష్ గారు దోవలో కలిసి “అరుణా!ఫారిన్ రిటర్న్ డాక్టర్ఒకరు ఇక్కడ వాలంటీరుగా పని చేయడానికిఒప్పుకున్నారు. అతని పేరు ఆదిత్య. ఆఫీస్ రూమ్ లోవెయిట్ చేస్తున్నాడతను....

నువ్వు అతనికి బ్లాక్ రూబీలో పేషెంట్స్ అందరిని పరిచయం చెయ్యి. రోజూ కొంత సమయం మనఆశ్రమానికి కేటాయిస్తానని ప్రామిస్ చేసాడతను”అని చెప్పారు.

అరుణ సరేనని అతన్ని ఎక్కువ టైం వెయిట్ చేయించడం ఇష్టం లేక గబ గబా ఆఫీస్ రూమ్ కేసిపరుగెట్టింది.

నమస్తేనండీ! నా పేరు 'అరుణ' అని ఒగరుస్తూ....తనని తాను పరిచయం చేసుకుని.... సారీఅండీ, వెయుట్ చేయించానా!? మీరు వస్తారని ముందుగా తెలీదండీ నాకు అంది ఖంగారుగా.

అక్కడున్న కాసేపటిలో అందరూ అరుణమ్మ గారు ........ అరుణమ్మ గారు....... అంటుంటే ఎవరోపెద్దావిడ... భూతద్దాల కళ్ళజోడు పెట్టుకుని... గంటుగా ఉంటుందని ఊహించిన డాక్టర్ ఆదిత్యకి.........సున్నితంగా సన్నగా పొడుగ్గా ఎంతో సింపుల్ గా శ్రావ్య మైన గొంతుతో తననిఅరుణ అని పరిచయం చేసుకున్న చిన్న అమ్మాయిని చూసి అవాక్కయ్యాడు.

అతను కూల్ గా పక్కనే జగ్ లో ఉన్న వాటర్ ఆమెకి గ్లాస్ లో పోసి ఇచ్చి " ముందు మీరీ వాటర్ తాగి ఓ నిమిషం పాటు రిలాక్స్ అవ్వండి, తర్వాతవెళదాము. నా షెడ్యూల్లో ఇవ్వాళ, రేపు కంప్లీట్ గా ఆశ్రమానికే కేటాయించాను" అన్నాడునవ్వుతూ.

అయ్యో! మీరివ్వడమేమిటండి! అని ఖంగారుగా అతనిచేతిలో నుండి గ్లాస్ లాక్కున్నంత పని చేసింది అరుణ.

అతను తనకేసి అలా కళ్ళార్పకుండా చూస్తుంటే అరుణకుకొంచెం మొహమాటంగా అనిపించి "మిమ్మల్ని రూబీ బ్లాక్ కి తీసుకు వెళ్ళమని రజనీష్ అంకుల్ చెప్పారు” వెళదామాండీ!! అంది ఎంతో మర్యాదపూర్వకంగా.

అరుణ ఖంగారు చూసి నవ్వుకుని “యా, ప్లీజ్ గో ఎహెడ్!” అంటూ ఆమెని ఫాలో అయ్యాడు ఆదిత్య. బ్లాక్ రూబీ లోఒక్కొక్కళ్ళని పేరు పేరునా పరిచయం చేసి ఎవరెవరికిఏమేమి మెడిసిన్స్ ఇస్తుందో ఆ వివరాలన్నీ ఎక్స్ప్లెయిన్ చేసింది అరుణ.

పేషెంట్స్ అందరినీ చూడటానికి రెండు మూడు రోజులు పడుతుంది అనుకున్న ఆదిత్య కి ఒకరోజులో కంప్లీట్ చేయించేస్తుంది అరుణ.

ముఖంలో ఎక్కడా అసహనం ఛాయలు లేకుండా, చిరునవ్వు చెదరకుండా అంత మందిపెద్దవాళ్ళ ప్రశ్నలకి ప్రేమతో , ఓర్పుగా జవాబులు చెప్తున్న అరుణ ఆదిత్య కళ్ళకి “ఆఠ్వా అజూబా" లా అనిపించింది.

“మీకు ఇన్ని మెడిసిన్స్ పేర్లు....... ప్రిస్క్రిప్షన్ చూడకుండా ఎవరెవరికి ఏమేమి ఇవ్వాలి........ ఎలా గుర్తు ఉన్నాయి!? అరుణ గారు! మీరు ఇంతకు మునుపు ఎక్కడైనా నర్స్ గా పని చేశారా!? అని అడిగి... మీరే ఒక చిన్న డాక్టర్ లా అనిపిస్తున్నారు నాకైతే అన్నాడు నవ్వుతూ.

అదేమి లేదండీ, ఎన్నో ఏళ్లుగా ఇస్తున్నాను కదా! అందుకేగుర్తుండిపోయాయి అని “మీరు నన్ను అరుణ అనిపిలవండి చాలు, నా పేరుకు ‘గారూ’ సూట్ అవదండీ” అంది చిరునవ్వుతో.

మీరు కూడా నన్ను సింపుల్ గా ఆదిత్య అనే పిలవాలిగారూ, డాక్టర్ ఇవన్నీ తగిలించామోకండి. ఆ షరతు మీదఅయితేనే అన్నాడు ఆదిత్య. ఇప్పటి వరకు తనెవరిని అలాపిలవలేదని ట్రై చేస్తానని అంది అరుణ మెుహమాటంగా.

మొదట్లో తను కూడా చాలా కష్ట పడ్డానని... ఆశ్రమానికిరావడానికి ముందు తనకి చదవడం కూడా రాదని... ఎవరిదయినా హెల్ప్ తీసుకుని ప్రతి పేషెంట్ కి మెడిసిన్స్ఆర్గనైజర్ కిట్ తయారు చేసుకునేదాన్నని అరుణచెప్తుంటే వింతగా ఆమెకేసి చూశాడు ఆదిత్య.

ఇంత ఎక్స్ పీరియన్స్ ఉన్న తనకి కూడా ప్రిస్క్రిప్షన్ చూడకుండా సాధ్యం కాదంటాడు ఆదిత్య.

"రియల్లీ యు అర్ యాన్ అమేజింగ్ పర్సన్ అరుణా!” అన్నాడు.

అతనలా తనని ఏదో గొప్ప పని చేసినట్లుగా పొగుడుతుంటే సిగ్గు పడింది అరుణ.

అతను రోజూ ఆశ్రమానికి రావడం..... అరుణ అతనికి అసిస్ట్ చేయడంతో ..... అతి త్వరలో ఇద్దరిమధ్య స్నేహం బలపడసాగింది.

రోజులు గడుస్తున్న కొలదీ అరుణ అంటే అభిమానం, ప్రేమ పెరుగుతూ వచ్చాయి ఆదిత్యకి.

ఓ రోజు అరుణ వాచ్ మెన్ వాళ్ళ ఇంటిలోనుండి రావడం చూసిన ఆదిత్య " వాళ్లనే రమ్మనికబురు పంపొచ్చుగా, మీరెందుకు శ్రమ తీసుకుని వెళ్లడం అని అన్నాడు.

వాళ్ళు తనకి ఆప్తులని..... దేవాలయం లాంటి ఆశ్రమాన్ని పరిచయం చేసిన తాత వాళ్లకి ఏమిచ్చినా ఋణంతీర్చుకోలేనని చెప్పింది.....

తను అనాథలా రాత్రి వేళ చలిలో బయట ఒణికి పోతుంటే వాళ్లిద్దరూ తనని చేరతీసి ఎలాకాపాడారో అన్ని వివరంగా చెప్పింది.

రోజుకి ఒక క్రొత్త విషయం ఆమె గురించి తెలుసు కోవడంఆదిత్యకి చాలా ఉత్సుకతగా ఉండేది. ఆమె మీద గౌరవంరెట్టింపు అవసాగింది.

ఇద్దరి మధ్యా గంటలు నిమిషాల్లా దొర్లి పోయేవి. అతను ఫారెన్ లో తన స్టడీస్...... అనుభవాలగురించి చెప్తుంటే..... ఆమె లైఫ్ లో అడుగడుగునా తను ఎలా స్ట్రగుల్ అయ్యింది చెప్పేది.

ఇద్దరి జీవితాలు రెండు విభిన్న కోణాలు.....

ఒకరి జీవితం వడ్డించిన విస్తరి అయితే..... మరొకరిది నిత్య పోరాటం.

అరుణ తన గతం గురించి చెప్తుంటే అతని మనసు బాధ పడేది...."ఆమెని అక్కున చేర్చుకుని 'నీకు నేనున్నాను' నువ్వు ఎప్పుడూ కష్ట పడకుండా

చూసుకుంటాను" అని చెప్పాలనే కోరికని బలవంతంగా ఆపుకున్నాడు ఆదిత్య. అది సరైనసమయం కాదని.

మర్నాడు ఆదిత్య ... సాయంత్రం డాక్టర్స్ కాన్ఫెరెన్స్ కిఅటెండ్ అవ్వాలని... ఉదయమే ఆశ్రమం విజిట్ కి వెళ్ళాడు.

అరుణ గురించి ఆఫీస్ బాయ్ ని అడిగితే “మేడం కి ఒంట్లో బాలేదని తన రూంలోనే ఉన్నారనిచెప్పి ....... పిలుచుకు రమ్మంటారా సార్!! “అని అడిగాడు.

వద్దని చెప్పి....... తనే ఆమె రూంకి వెళతానని చెప్పాడు ఆదిత్య.

అరుణ రూమ్ తలుపు కొంచెం వారగా వేసుంటే డోర్ నాక్ చేద్దామనుకున్న ఆదిత్య ....... మంత్రముగ్ధుడై నిలబడిపోయాడు. లోపలినుండి శ్రావ్యమైన అన్నమాచార్య కీర్తన వినపడుతుంటే.

అరుణ జుత్తు దువ్వుకుంటూ విండో దగ్గర నిలబడి తన్మయత్వంతో పాడుకుంటూ బయటకుచూస్తుంటుంది.

ఆమెది పెద్ద జడ అని తెలుసు కానీ జుత్తు విప్పితే నేలకుతాకుతుందేమో అన్నంత పొడుగాటి నల్లని కురులనితెలీదు అనుకుని అలా చూస్తుండిపోయాడు సభ్యతకాదని తెలిసినా.

ఆమె ఎందుకో తల తిప్పి ఆదిత్యని చూసి ఖంగారు పడింది. చున్నీ కోసం వెతుక్కుంటూ అయ్యో, మీరు ఎప్పుడు వచ్చారు!? రమ్మని కబురు చేస్తే నేనే వచ్చేదాన్ని కదా!

అయినా మీరు సాయంత్రం కదా రావాలి!? అని....

ప్లీజ్ కూర్చోండి, అంటూ కుర్చీ ముందుకి జరిపింది హడావిడిగా.

అన్ని ప్రశ్నలూ ఒకేసారి అడిగితే ఎలా అండీ!? ఫస్ట్ అఫ్ ఆల్ సారీ, ఇన్ఫార్మ్ చేయకుండా మీరూమ్ కి వచ్చినందుకు అని...... మీకు ఒంట్లో బాలేదని తెలిసి చూసి వెళదామని వచ్చాను, ఎలాఉందిప్పుడు!? చెప్పండి! అంటూ కూర్చున్నాడు.

“ఒంట్లో కొంచెం నలతగా ఉందని, అంతకు మించి ఖంగారు పడవలసింది ఏమీ లేదని” చెప్పింది.

“మీరు ఇంత బాగా పాడతారని ఎప్పుడూ చెప్పలేదే నాకు!?”

అని..... “నా కెంతో ఇష్టమైన సాంగ్, అన్నమాచార్య కీర్తన కదా ఇది! సంగీతంతో మా మమ్మీజ్ఞాపకాలు ముడి పడి ఉన్నాయి. తను చాలా బాగా పాడేది” అని చెప్పి..........

“ఇంకోసారి తప్పకుండా నాకు ఈ సాంగ్ పాడి వినిపించాలి మీరు” అన్నాడు.

“అయ్యో!! నాకు పాటలు రావండి, విని నేర్చుకున్నసంగీతం. ఏదో కూని రాగాలు తీస్తుంటాను. ఎవరి దగ్గరాశిక్షణ పొందే అవకాశం రాలేదు...రేడియోలో వినినేర్చుకున్నదే” అంది.

ఎప్పుడూ శారీ లోనే ఉండే అరుణ చూడీదార్లో ఇంకా చిన్న పిల్లలా అనిపించింది ఆదిత్యకి.

చిన్న పిల్లే అయినా...... అరుణ పరిస్థితుల ప్రభావం వల్ల త్వరగా పెద్దరికాన్ని ఆపాదించుకుందిఅనుకున్నాడు.

ఆమెను ఎంతసేపైనా అలా చూస్తూ కూర్చోవాలనిపించింది.

ఆమె రూమ్ కేసి దృష్టి మరలించాడు బాగుండదని. విశాలమైన రూమ్.... నీట్ గా సర్ది ఉంది. ఓ ప్రక్కగా కుట్టు మిషన్ ...... మరో ప్రక్కగా రాక్స్ నిండా బుక్స్. ఒక చిన్న లైబ్రరీ నే ఉందనిచెప్పొచ్చు ఆమె రూమ్ లో.

ఇన్ని బుక్సా !? అని ఆశ్చర్యంగా ఆ రాక్ దగ్గర కెళ్ళినిలబడ్డాడు.

అందులో పెద్ద బాల శిక్ష, కర్ణాటక సంగీతం మొదలుకునికంప్యూటర్ సైన్స్ బుక్స్, రక రకాల నొవెల్స్ ఉన్నాయి.

“మీకు ఉపయోగపడే బుక్స్ ఏమీ నా దగ్గర ఉండవండీ!!” అంది అరుణ కొంచెంమెుహమాటంగా.

చిన్నప్పటి నుండి యూ. ఎస్.

లోనే ఎక్కువ టైం ఉండబట్టి తెలుగు నవలలు చదివే అవకాశం రాలేదని..... మీరుఅనుమతిస్తే ఒక నవల తీసుకుంటానన్నాడు.

“అంత కన్నానా!! మహద్భాగ్యంగా తీసుకోండి” అంది.

“తమిళ్ , కన్నడ, మళయాళం లాంగ్వేజ్ లెర్నింగ్ బుక్స్చూసి

‘మీకు అంత టైం ఎక్కడ దొరుకుతుంది అరుణా!

ఇవన్నీ నేర్చుకోవడానికి, అటు చుస్తే ఆశ్రమం బాధ్యతఅంతా మీ భుజస్కందాల మీదే ఉన్నట్లుంటుంది” అన్నాడు

ఆశ్చర్యంగా.

“నేర్చుకోవాలనే కోరిక ఉండాలే కానీ సమయంకేటాయించడం పెద్ద కష్టమేమీ కాదండి” అందిచిరునవ్వుతో.

యాస్ యూజ్వల్ నా కామెంట్ ఒక్కటే మిమ్మల్ని కలిసిన దగ్గర నుండి అని ఆదిత్యఅంటుండగానే... ఆ... ఆ... నాకు తెలుసులెండి మీరేమంటారో! "యూ ఆర్ యాన్ అమేజింగ్పర్సన్ అరుణా!” అని... అవునా.... ! అంది సిగ్గు పడుతూ అరుణ.

మీరు నా నాడి పట్టేశారని నవ్వుతాడు ఆదిత్య.

ఇద్దరి మధ్యా క్రమంగా చనువు పెరగసాగింది .

స్నేహానికి అనురాగమనే బంధం పెనవేసుకుంటోంది.

“వన్ పర్సనల్ క్వశ్చన్! మీకెవరూ బాయ్ ఫ్రెండ్స్

లేరా!?" అని అడిగాడు సడన్ గా!!

ఆ... బాయ్ ఫ్రెండ్సా!? నాకే!? అని... ఆ మాట అనడానికే మెుహమాటపడిపోయు " ఈఆశ్రమంలో ఉన్న ప్రతి ఒక్కరూ నా స్నేహితులేనండి" అంది అరుణ నవ్వుతూ.

ఆమెకి ఎప్పటి నుండో అడగాలని ఉంది... అతనికి సుమారుగా ముప్పై ఏళ్ళు వరకుఉంటాయి... వివాహం అవలేదని తెలుసు కానీ ఎందుకు చేసుకోలేదోనని తెలుసుకోవాలని కోరిక, సమయం వచ్చింది కాబట్టి

వదులుకోదలుచుకోలేదు.... మరి మీకో!? అని అడిగింది.

ఆశ్చర్యంతో నోట మాట రాలేదు ఆదిత్యకి... ఈ ప్రశ్న అరుణనుండి ఊహించలేదతను.

కాసేపు మౌనంగా ఉండిపోయాడు.

"సారీ అండి! మిమ్మల్ని ఇబ్బంది పెట్టినట్లున్నాను పర్సనల్ విషయమడిగి" అంది అరుణ అతనిముఖం చూసి.

నో... నో.. నాట్ ఎటాల్! ఎప్పటి నుండో మీతో ఈ విషయం నేనే ‘షేర్' చేసుకుందామనిఅనుకుంటున్నానని....

" తను అమెరికా లో ఒక అమ్మాయి తో డేటింగ్ చేసేవాడినని... మ్యారేజ్ కూడా చేసుకుందాంఅనుకున్న తరుణంలో ఆమెకి తనకి అభిప్రాయ భేదాలు వచ్చి... రోజూ గొడవలతో మనశ్శాంతిలేక.... తన ప్రొఫెషన్ కి కూడా న్యాయం

చేకూర్చలేకపోయి... డిప్రెషన్ కి ట్రీట్మెంట్ తీసుకోవలసిన పరిస్థితి రావడంతో... డాడీ ఇండియాకివచ్చేయమన్నారు.... కొంత కాలం ఇక్కడ ఉండి వెళ్ళ వచ్చని. వచ్చిన తర్వాత మీకంతా తెలిసిందే” అని....

“మీ సాన్నిహిత్యంలో ఎలాంటి వారికయినా స్వాంతన లభిస్తుంది అరుణా! అమూల్యమైనస్నేహితురాలు దొరికింది నాకు” అన్నాడు ఆదిత్య.

మీతో మాట్లాడుతుంటే టైమే తెలీదని.... ఎలా ఉన్నారో చూసి పోదామని వచ్చి మిమ్మల్ని ప్రశ్నలతో బోర్ కొట్టించేశానని.....

ఆమెని రెస్ట్ తీసుకోమని సెలవు తీసుకుంటాడు ఆదిత్య.

“అతనితో సమయం గడపడం తనకెప్పుడూ ఆనందమేనని.... అతను వచ్చాకే తనకు కూడా రిలీఫ్ గా ఉందని” చెప్పింది అరుణ.

ఆదిత్య వచ్చి వెళ్లిన తరవాత అరుణ మనసంతా ఆనందంతో పరవళ్ళు తొక్కినట్లు అయ్యింది.

ఆదిత్యకు తెలియని టాపిక్ అంటూ ఏదీ ఉండదు. ఏవిషయం గురించైనా అనర్గళంగా మాట్లాడగలడు. అదేఅతనిలో అరుణకు ఎంతగానో నచ్చిన విషయం. తనకితెలియని ఎన్నో విషయాలు అతన్ని అడిగి తెలుసుకునేది. స్వచ్ఛమైన అతని నవ్వు, మాట్లాడుతుంటే అతని

హావా భావాలు... మేనరిజమ్స్... అన్నీ... అతన్ని అలానేచూస్తుండిపోయేలా చేసేవి ఆమెని.

అతను కూడా తనని ఇష్టపడుతున్నట్లే ఉంది..

ఈ అనుభూతి ఎంతో క్రొత్తగా .. వింతగా... సంతోషంగా ఉంది అనుకుంటూనే.....తను అందనిదానికి అర్రులు చాచటం లేదు కదా! అనుకుంది.

అతనికి, తనకి భూమ్యాకాశాలంత తేడా ఉంది. తనేమోఅనాధ, చదువు కూడా అంతంత మాత్రమే.. అతనుడాక్టర్, స్థితిపరుడు, మంచి ఫామిలీ నుండి వచ్చినట్లుతెలుస్తోంది... కానీ వాళ్ళ పేరెంట్స్ ఒప్పుకుంటారా!? తానేఅత్యాశకి పోతోందేమో అనుకుని తన లిమిట్స్ లోతనుండాలి... మనసుని అదుపులో పెట్టుకోవాలిఅనుకుంది.

రెండు రోజుల్లో అరుణ కోలుకుంది.

ఆశ్రమానికి వచ్చిన దగ్గర నుండి ఉదయాన్నే ప్రకాశం గారికిఎంతో ఇష్టమైన చిక్కటి ఫిల్టర్ కాఫీ ఇచ్చి.... రూమ్ అంతానీటుగా సర్ది పెట్టడం అలవాటు అరుణకి.

ప్రకాశం గారు ఎంత వారించినా ఈ విషయంలో మాత్రంఆయన మాట వినేది కాదు అరుణ.

రోజూ లానే ఆ రోజు ఉదయం కూడా ప్రకాశం గారికి కాఫీ ఇవ్వడానికి వెళ్ళింది

అరుణ.

అరుణ వెళ్ళేసరికి ఆయన విపరీతమైన జ్వరంతో మూలుగుతుంటారు. అరుణ ఖంగారుగాఆదిత్యకి, రజనీష్ గారికి కాల్ చేసింది.

ఆదిత్య బ్లడ్ టెస్ట్, ఇంకా కొన్ని టెస్టులు చేయించి..... ఆయనకు “విష జ్వరం వచ్చిందని, హాస్పిటల్లో అడ్మిట్

చేయాలని” అన్నాడు.

ఆయనకి అడ్మిట్ కావడం ఇష్టం లేకపోయినా ‘కంటేజియస్’ అని ఆదిత్య చెప్పడంతో తప్పనిసరి పరిస్థితులలో ఒప్పుకున్నారు.

హాస్పిటల్ లో నర్స్ లు చూసుకుంటారని చెప్పినా వినకుండా ఆయన రూమ్ బయటే పడిగాపులుపడేది అరుణ.

వారమైనా జ్వర తీవ్రత తగ్గుముఖం పట్టక పోయేసరికి పరిస్థితి విషమంగా మారుతోందని చెప్పారు డాక్టర్లు.

రజనీష్, సూర్యం గార్లు బెస్ట్ డాక్టర్స్ ని కన్సల్ట్ చేశారు.

ఆశ్రమంలో అందరూ బెంగ పెట్టుకుని ఆయన కోసంప్రార్ధనలు చేస్తుంటారు.

రోజూ ఉదయాన్నే ఆశ్రమంలోనే ఉన్న వేంకటేశ్వర స్వామి ఆలయంలో స్వామి వారిని దర్శించకోవడం అలవాటు

అరుణకు.

ఆ రోజు కూడా ఆలయానికి వెళ్లి పుట్టెడు దిగులుతో దేవుని ముందు నిర్లిప్తంగా కూర్చుని ఉన్నఅరుణని చూసి పూజారి గారికి బాధనిపించింది. ఎప్పుడు హుషారుగా ఉండే పిల్ల అలాదిగులుగా ఉండటం చూసి ఆయన “ఆమె తల మీద చేయి వేసి నిమురుతూ సార్ కి ఏమీఅవదమ్మా !! ఎంతో మందికి అన్నం పెట్టిన చెయ్యి. ఆ దేముడే ఆయన్ని కాపాడుకుంటాడు, నువ్వేమీ దిగులు పెట్టుకోకు“ అని ధైర్యం చెప్పారు.

అరుణ కోసం వెతుక్కుంటూ ఆమె ఆలయంలో ఉందని తెలిసి అక్కడికి వెళ్ళాడు ఆదిత్య.

ఈ వారం రోజులకే చిక్కిపోయి, తిండి నిద్ర లేక కళ్ళ కింద నల్లని వలయాలు ఏర్పడి......... ఆలయస్తంభం దగ్గర సూన్యంలోకి చూస్తూ కూర్చున్న అరుణని చూసిన....... ఆదిత్య హృదయమంతా బాధతో నిండిపోయింది.

ప్రకాశం గారికి సీరియస్ గా ఉందని తెలిసినా, ఆయనకి తగ్గిపోతుందని అరుణకు ధైర్యంచెప్పాడు.

ఆమె అతని భుజం పై తల పెట్టి వెక్కి వెక్కి ఏడుస్తుంటే ఆమెని ఊరుకోపెట్టడం గగనమైపోయింది ఆదిత్యకి.

తను నిజంగానే నష్ట జాతకురాలినని, తన వల్లే ప్రకాశం గారికి ఇలా అయ్యిందని అరుణ బాధపడుతుంటే......... అలాంటి మూఢ నమ్మకాలు పెట్టుకోవద్దని, ప్రతి ఒక్కరి లైఫ్ లో 'అప్ అండ్డౌన్స్' సహజమని నచ్చ చెప్పాడు.

ఇంత మందికి అండగా ఉన్న ఆయనను రక్షించు తండ్రీ, కావాలంటే ఆయన బదులు నన్నుతీసుకు వెళ్ళు అంటూ దేమునితో మొర పెట్టుకుంది అరుణ.

"సొంత పిల్లలు కూడా ఇంతలా బాధ పడరేవెూ” అనుకున్నాడు ఆదిత్య.

వయసుకి మించిన హుందాతనంతో, ఎప్పుడు ఉత్సాహంగా

ఉండే అరుణని ఇలా బేలగా...అధైర్యంగా చూడటంఆశ్చర్యంగాను, బాధగాను ఉంది అతనికి.

ఆమె మొక్కని మొక్కు లేదు. స్వామి వారి కుంకుమ తీసుకువెళ్లి ప్రకాశంగారి నుదుటనఅద్దింది..... నర్స్ వద్దని చెప్పినా వినకుండా.

ఐ. సీ. యు. లో ఉన్నవాళ్ళకి అలాంటివి పెట్టకూడదని, ఇన్ఫెక్షన్స్ వస్తాయని డాక్టర్ ఆమెనిహెచ్చరించారు.

అందరి ప్రార్ధనలు ఫలించి ప్రకాశం గారు త్వరగా కోలుకున్నారు.

కానీ బాగా వీక్ గా ఉండటం వల్ల కొద్ది రోజులు కంప్లీట్ రెస్ట్ తీసుకోవాలని... ప్రత్యేకించి కేర్ తీసుకోవడానికి హాస్పిటల్నుండి నర్స్ ని పంపిస్తామని చెపితే..... అరుణ వద్దనిచెప్పి తానే దగ్గరుండి అన్ని చూసుకుంటానని చెప్పింది.

సమయానికి మందులు, జావలు, పళ్ళ రసాలు అన్నీ ఇచ్చి ఆయన్ని కంటికి రెప్పలా చూసుకుందిఅరుణ.

రెండు నెలలు తిరిగేసరికి ప్రకాశం గారు పూర్తిగా కోలుకున్నారు.

రజనీష్, సూర్యం గార్లు ఎక్కువ సమయం ప్రకాశం గారితోనే

గడిపేవారు.

ఒక సాయంత్రం వేళ ఆరుబయట గార్డెన్ లో ప్రకాశం గారు కూర్చుని ఉంటే

చూసి అందరూ అక్కడికి చేరారు. ఇన్ని రోజుల తర్వాత ఆయనను ఇలా చూడటం కన్నుల పండుగలా ఉందనిచెప్పి సంతోషపడ్డారు అంతా.

ఈ లోపు లోనే అరుణ అక్కడికి షాల్ తీసుకుని వచ్చి ప్రకాశం గారికి కప్పి, చలి గాలి వీస్తోందిఅంకుల్, లోపలికి వెళదామా!! అని అడిగి.... “ఎవరో వచ్చారు మిమ్మల్నికలవడానికి.......నేనెంత చెప్తున్నా వినకుండా మీ రూంలోనే వెయిట్ చేస్తానని వెళ్ళారు అతను" అని చెప్పింది.

ప్రకాశం గారు కూడా ఆశ్చర్యంగా చూశారు ఎవరై వుంటారు!? సహజంగా ఎవరికీ తన రూంకివెళ్లేంత చనువు లేదు అనుకుంటూ.

రూంలో ఉన్న అతన్ని చూసి షాక్ తిన్నట్లుగా గుమ్మం లోనే ఆగిపోయారు......... “శ్రవణ్!! నువ్వా!?”అని. అతను ప్రకాశం గారి దగ్గరికి వచ్చి సారీ డాడీ! వర్క్ లో బిజీ గా ఉండి టైం కిరాలేకపోయాను... మీరు హాస్పిటల్ లో అడ్మిట్ అయినప్పుడు రజనీష్ అంకుల్ ఫోన్ చేశారు. ఎప్పటికప్పుడు ఆదితో మాట్లాడి మీ

పరిస్థితి తెలుసుకుంటూనే ఉన్నాను.

వాడు మీరు రికవర్ అయ్యారని చెప్పాడు. “మీరు నాతో మాట్లాడటానికి సుముఖంగా లేరనితెలుసు నాకు... మీకు ఇంకా నా మీద కోపం తగ్గలేదా డాడీ !? " అన్నాడు అతను కొంచెంనిష్ఠూరంగా.

అక్కడే నిలబడిన అరుణకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది. అంకుల్ కి ఒక కొడుకు ఉన్నాడనితనకి ఇప్పటి వరకు తెలియనందుకు. అంకుల్ రూములో కనీసం ఒక్క ఫొటో కూడా లేదుఅతనిది అనుకుంది.....

తను ఆశ్రమానికి వచ్చి ఇన్ని ఏళ్ళు అయింది. ఎవరూ అతని గురించి మాట్లాడుకోగా కూడావినలేదు, ఆది అని చనువుగా అంటున్నాడంటే ఇతనికి ఆదిత్య కూడా బాగా క్లోజ్అయిఉండొచ్చు అనుకుంది అరుణ.

అందరితో ఎంతో ప్రేమగా, అభిమానంగా ఉండే ఆయనఅతనితో నిర్లిప్తంగా ఉండటం విచిత్రంగా ఉంది అరుణకు.

కొడుకును చూసిన సంతోషం ఎక్కడా కనపడడం లేదు ఆయనలో.

"తనకి ఇప్పుడు బానే ఉందని, ఎందుకు అంత దూరం నుండి శ్రమ తీసుకుని రావడం!?" అన్నారు.

"వస్తే ఎందుకు వచ్చావని, రాకపోతే రాలేదని అంటారు... మీరు ఎప్పటికి నాకు అర్ధం కారుడాడి!” అన్నాడు కొంచెం విసుగ్గా.

ఇద్దరి మధ్య కాసేపు మౌనం....

డాడీ! "మీరు ఈ ఆశ్రమం బర్డెన్ పెట్టుకోవడం వల్లే తరచుగా మీ హెల్త్ పాడవుతోంది. ప్రాపర్టీస్అన్ని సేల్ చేసేసి నాతో వచ్చేయండి, మీకు నేను సిటిజెన్ షిప్ స్పాన్సర్ చేస్తాను" అన్నాడు.

తనకి ఇక్కడే బాగుందని, ఈ రెండు బిల్డింగ్స్, మిగిలిన ఆస్తులన్నీ కూడా ఆశ్రమానికి డొనేట్చేశానని చెప్పడంతో అతని ముఖంలో రంగులు మారిపోయికోపంతో .... “మిలియన్స్ అఫ్ప్రాపర్టీస్ పిల్లలుండగా ఎవరైనా ఆశ్రమాలకి డొనేట్ చేస్తారా!? మమ్మీ ఉంటే ఇలానే చేసేదా !?” అన్నాడు కోపంతో.

ఖచ్చితంగా ఇలానే చేసేది మీ అమ్మ అని...నువ్వు ఎందుకోసం వచ్చావో కూడా తెలుసు నాకు. మొదట్లో లక్షల్లో, తర్వాత కోట్లలో డబ్బు పంపమని అడిగావు. ఎంత కావాలంటే అంతపంపించాను. అయినా నువ్వు శాటిస్ఫై కాలేదు.

నీకు నా గురించి ఎప్పుడు పట్టింది కనుక!? మీ అమ్మ పోయిన దగ్గర నుండి ఒక్కడినై పెంచాను. ప్రాణానికి ప్రాణంగా చూసుకున్నాను... నిన్ను వదిలి ఉండలేనని తెలిసినా ఎక్కడో దూరంగాఅమెరికాలో చదువుతానంటే ఇష్టం లేకపోయినా పంపాను.

కానీ నువ్వు ఏం చేసావు!? కనీసం నాతో ఒక్క మాట అయినా చెప్పకుండా ....సిటిజన్ షిప్ కోసంఅక్కడే సెటిల్ అయిన ఎవరినో వివాహం చేసుకున్నావు... అది కూడా ఎవరి ద్వారానో తెలిసిందినాకు. నెలల తరబడి కాల్ చేయవు, వచ్చినప్పుడల్లా ఆస్థి కోసం తగాదా పెట్టుకుని వెళ్తావు. “ఎందుకురా ఇంత స్వార్ధ పరుడివైపోయావు!? నా పెంపకం లోనే ఏదో లోపం ఉండిఉంటుంది” అన్నారు బాధతో గొంతు పూడుకుపోతుండగా.

మీరు ఎప్పుడూ ఇంతే!! ఎప్పుడో జరిగిన విషయాలు తిరగతోడతారు.

బయట వాళ్లకి ఇచ్చిన వేల్యూ కూడా నాకివ్వరు. "ఈ ఆశ్రమంలో ఉన్న ముసలీ ముతకనే ఎక్కువైపోయారు మీకు” అన్నాడు కోపంగా.

నాకిప్పుడు నీ మీద పేమ కానీ కోపం కానీ మరే విధమైనభావాలు లేవు.

“ఈ ఆశ్రమం ద్వారా ఎంతో మందికి ఆశ్రయం కలిపిస్తూఒక పెద్ద వసుదైక కుటుంబాన్ని స్థాపించి ఎంతో ప్రశాంతంగా, సంతృప్తికరమైన జీవితాన్నిగడుపుతున్నాము మేమందరం ఇక్కడ అని.. ఇప్పుడునాకు అందరూ సమానమే”అన్నారు ప్రకాశం గారు.

ఓకే.... రైట్ !! మీకు అందరూ సమానమే అని కదా! అంటున్నారు... “రేపు మీకేమైనా అయితేనాకు కాల్ చేయాల్సిన అవసరం కూడా లేదు, అన్నీ వాళ్ల చేతనే చేయించుకోండి“ అని కోపంతోముఖం ఎఱ్ఱబడగా విసురుగా తలుపేసి వెళ్ళిపోయాడు.

అప్పుడే కోలుకుంటునన ప్రకాశం గారి ముఖంలో నెత్తురు చుక్క లేనట్లు పాలిపోయింది. ఆయన మనసెంత గానో దెబ్బ తిన్నట్లు ఉంది... “ఎంత వద్దనుకున్నా మనసు బాధ పడకుండాఉండదు వీడి మాటలకు” అనుకుని అక్కడే నిలబడి ఉన్న అరుణతో “తలుపు

దగ్గరగా వేసెళ్ళు అరుణా! నన్ను ఇప్పట్లో ఎవరూ డిస్టర్బ్ చేయొద్దు అని చెప్పు”అన్నారు ఎంతోగంభీరంగా. అరుణ మారు మాట్లాడకుండా అక్కడి నుండి బయలుదేరి వెళ్ళి పోయింది.... ఆయనతో మాట్లాడే ధైర్యం లేక.

ఆమె మనసెంతో బాధపడింది. దోవలో రజనీష్ గారు... బహుశా ప్రకాశం గారిని కలవడానికిఏమో... ఆయన రూమ్ కేసి వెళుతున్నారు, గబ గబా ఆయన దగ్గరికి వెళ్లి పరిస్థితి వివరించింది.

“దోవలో శ్రవణ్ కలిసినప్పుడే అనుకున్నాను... వాడు మాట్లాడిన తీరుని బట్టి ఇలాంటిదేదో జరిగిఉంటుందని..... ‘ఈడియట్’ వచ్చినప్పుడల్లా ప్రకాశాన్ని బాధ పెట్టకుండా వెళ్ళడు వాడు”అనుకున్నారు కోపంగా. వాడిని పిలిచి తప్పు పని చేశాను అని ఫీల్ అయ్యారు.

ప్రకాశం గారిని కలిసి కాసేపు ఆశ్రమం విషయాలు ముచ్చటించారు. మొదట్లో కాసేపు అనాసక్తి గామాట్లాడినా... ఆశ్రమ వార్షికోత్సవాలు అనేసరికి ఆయన మళ్ళీ మాములు మూడ్ లోకి వచ్చిఅరుణని కూడా పిలిచి మాట్లాడి ఎవరు ఏమేమి పనులు చేయాలో ప్లాన్ చేశారు.... “ఈసారి వార్షికోత్సవాలలో మనం ఆదిత్యని కూడా బాగా ఇన్వాల్వ్ చెయ్యాలి రజనీ! అరుణకి హెల్ప్అవుతుంది” అన్నారు ప్రకాశం గారు.

తప్పకుండా ! అన్నారు ఆయన.

“ఉత్సాహంగా ఉన్న యువతరాన్ని ప్రోత్సహించి... ఆశ్రమ బాధ్యతలు కొన్ని వాళ్ళకి అప్పగిస్తేమనం కొంచెం రెస్ట్ తీసుకోవచ్చు రజనీ! మనం ఉండగానే వాళ్ళని గ్రూమ్ చేసినట్లు అవుతుందికూడా అని... థాంక్స్ రా! నీతో మాట్లాడాక మనసుకి కాస్త ఊరట కలిగింది” అన్నారు.

థాంక్స్ ఎందుకు!? నేనే నీకు సారీ చెబుదామని వచ్చాను. “నీకు బాగా సీరియస్ గా ఉందనిడాక్టర్స్ చెపితే ఖంగారుపడి వాడికి కాల్ చేశాను. ఇప్పుడు కూడా వాడలా బిహేవ్ చేస్తాడనిఅనుకోలేదురా”అన్నారు బాధగా.

“నో ప్రాబ్లం! నువ్వు అలా ఫీల్ అవ్వాల్సిన పని లేదు. కొంత మంది అంతే! జన్మలో మారరు. వాడికి నన్ను బాధపెడితే కానీ సంతోషంగా ఉండదేమో! కానీ... వాడినిఅలాగే సంతోష పడని” అని నిట్టూర్చారు.

**********

వార్షికోత్సవాల షాపింగ్ అంతా అరుణ, ఆదిత్యలకిఅప్పగించారు.

ఆదిత్యతో షాపింగ్ అంటేనే అరుణకు పట్టలేని సంతోషంగా ఉంది.

వార్షికోత్సవాల డెకొరేషన్స్ దగ్గర నుండి అన్నీ ఇద్దరు కలిసి చేశారేమో ఇద్దరి మధ్య సాన్నిహిత్యంమరింత పెరిగింది. రోజంతా కలిసి ఉన్నా సరిపోయేది కాదు ఇద్దరికీ. సాయంత్రం ఇంటికివెళ్లాలంటే అతనికి ఇష్టం ఉండేది కాదు. ఆమెకి కూడా అతను వెళతాడంటే బెంగగా ఉండేది.

ఇద్దరి మధ్య స్నేహాన్ని మించిన బంధమేదో రూపు దిద్దుకుంటోంది.

ఒక లిస్ట్ తయారు చేసుకుని షాపింగ్ కి బయలు దేరారు ఆదిత్య, అరుణలు.

షాపింగ్ అంతా పూర్తి చేసుకుని వస్తుండగా "ఆదిత్యా!! ప్లీజ్ కార్ ఆపండి... “ అంది

ఖంగారుగా అరుణ.

ఆదిత్య కార్ రోడ్డుకి ఓ ప్రక్కగా తీసి ఆపాడు. “ప్లీజ్ మీరు బయలు దేరండి... నేను తర్వాత ఆటోలో వస్తాను. చాలా రోజుల తరువాత మా బంధువులు కనిపించారు” అని చెప్పి వెళ్ళిందిహడావిడిగా.

ఆమె కార్ డోర్ తీసుకుని వడివడిగా ఒక షాప్ కేసి పరిగెట్టింది. అతను అర్ధం కాక చూస్తున్నాడుఏమైందా!? అని.

అక్కడ షాప్ బయట పని చేస్తున్న ఒక మధ్య వయస్కురాలి దగ్గరికి వెళ్లి

'వదినా' అని పిలిచింది అరుణ ఎంతో అభిమానంగా. ఆమె అరుణకేసి ఎగాదిగా చూసింది... ఎవరా !? అని... ఎప్పుడో చిన్నప్పుడు ఇల్లు వదిలి వెళ్లిపోయిందేమో...గుర్తు పట్టలేదు ఆమె.

నేను మీ అరుణని... అదే 'కాలి' ని అంది.... అలా అంటే ఆమె గుర్తు పడుతుందని.

వాళ్ళ వదిన నోట వెంట మాట రాదు.

నల్లగా, పీలగా ఉండే ఆ పిల్ల ఎక్కడ !? అందంగా పెద్ద జడతో... ఖరీదైన మంచి చీర కట్టుతో... హుందాగా కార్ దిగి వచ్చిన ఈ అమ్మాయి ఎక్కడా !? అని ఆశ్చర్యంగా చూసింది.

“అన్నయ్య ఎలా ఉన్నాడు!? కవిత, సరితా వాళ్ళు ఏరి?? మీరిక్కడ పని చేస్తున్నారేంటి!?” అనిప్రశ్నల వర్షం కురిపించింది.

“ఆమె ఏడుస్తూ మీ అన్నయ్య పోయి మూడేళ్ళు అయిందని చెప్పి ... ‘కూర్చుని తింటే కొండలైనాకరిగి పోతాయన్నట్లు’ ఆయన సంపాదించిందంతా

అయిపోయి ... అత్యవసరాల కోసం ఇంట్లో వస్తువులన్నీ కూడా అమ్మేయాల్సి వచ్చిందని... పిల్లలచదువులు కూడా మధ్యలో ఆగి పోయాయి అని.... చివరికి మనుషులం మాత్రం మిగిలాము అనిచెప్పి.... ‘పూలమ్మిన చోటే కట్టెలమ్మలేక పోయినట్లు’ తెలిసిన వాళ్ళ మధ్యలో ఉండ లేక ఈ మారుమూల అయితే ఎవరూ గుర్తు పట్టరని, ఏదైనా పని చేసుకుని బ్రతక వచ్చని ఇక్కడికి వచ్చి ఈషాపులో పనికి కుదిరాము ముగ్గురం” అని చెప్పింది ఎంతో విచారంగా.

అన్నయ్య పోయాడని తెలిసి అరుణ నిర్ఘాంతపోయింది. అంత చిన్న వయసు లో పిల్లలికి తండ్రిఅండ లేకపోతే ఎంత కష్టమో అరుణకు తెలుసు కాబట్టి చాలా బాధ పడింది.

“ఎక్కడైనా ఉండటానికి ఆసరా కల్పించమని అడిగింది” అరుణని నఖ శిఖ పర్యంతం ఈర్ష్యగాచూస్తూ.

అరుణకు కూడా వాళ్ళని అలాంటి పరిస్థితులలో వదిలి వెళ్లడం ఇష్టం లేదు. వెంటనే ప్రకాశంగార్కి ఫోన్ చేసి పరిస్తితి వివరించింది.

ఆయన నీకెలా మంచిదని తోస్తే అలా చెయ్యమ్మా అని చెప్పి "ఎలానూ వాచ్ మెన్ పెద్దవాడై పోయాడు... అతన్ని బ్లాక్ రూబీ లోకి షిఫ్ట్ చేద్దామని అనుకుంటున్నాము. వీళ్ళ ముగ్గురినిఅందులో ఉండమని చెప్పి... ఎవరెవరు ఏ పనికి సమర్థులో ఆ పనిలో నువ్వే పెట్టమని సలహా ఇచ్చి ఒక వారం రోజుల్లో షిఫ్ట్ అవమని చెప్పు” అని అన్నారు ప్రకాశం గారు.

వారం రోజుల్లో వాళ్ళు ఆశ్రమానికి షిఫ్ట్ అయ్యారు.

అరుణకు ఆశ్రమం లో ఉన్న ఇంపార్టన్స్ చూసి వాళ్ళ వదినకి కంటకింపుగా ఉండేది. ఎలాంటి అమ్మాయికి ఎంతఅదృష్టం పట్టింది!? ఏడు మల్లెల ఎత్తున ఎంతోఅపురూపంగా పెంచుకున్న నా పిల్లలకి ఈ దుర్గతిపట్టింది! అని ఈర్ష్య పడింది.

గత్యంతరం లేక ఈ మహాతల్లి సహాయం తీసుకోవలసి వచ్చిందని ఎప్పుడు కారాలు మిరియాలునూరేది

తన పిల్లల దగ్గర.

ఇలా ఒక ఆరు నెలలు గడిచాయి.

అరుణేమో అంత పెద్ద భవంతిలో... తనేవెూ తన పిల్లలతో... ఈ చిన్న గుడిసెలో కళ్ళు భగ్గుమంటున్నాయి ఎప్పుడు అరుణ ని చూసినా ఆమెకి.

ప్రకాశం గారితో మాట్లాడి తమకి కూడా అరుణ ఉండే చోట ఒక రూమ్

ఇప్పించమని అడిగింది.

అరుణ ఇది వరకు ఎలా తన చెప్పు చేతలలో ఉండేదో.. ఎలా అయినా అక్కడి వాళ్లందరికీతెలియాలని ఆమె కోరిక... ఒక రోజు రజనీష్ గారు అటుగా వెళుతుండగ ఆయనకి వినపడేలా

" ఏమే కాలీ! కాలీ....! ఎన్ని సార్లు పిలవాలే నిన్ను... చెముడేమైనా వచ్చిందా!? " అని గట్టిగాఅరిచింది. అరుణకి కూడా ఆశ్చర్యంగా అనిపించింది, సడన్ గా వదిన అలా పిలవడం! పోనిలే! అలవాటుగా అలా పిలిచిందేమో అనుకుని... ఆ... వదినా! వస్తున్నా, అని అటుగా వెళ్లబోతుంటేరజనీష్ గారు కోపంతో అరుణని ఆగమని సైగ చేసి

"ఇంకోసారి 'కాలీ ' అన్న పిలుపు ఈ ఆశ్రమంలోవినపడిందంటే బయటకి తోసేస్తాం మిమ్మల్ని అందరిని " అని హెచ్చరించారు సీరియస్ గా. “చెడ్డవాళ్లకి ఆశ్రయంకలిపిస్తే పాముకి పాలు పోసినట్లవుతుందని”కొందరిపట్ల అభిమానం తో కాక వివేకంతో ఆలోచించి నిర్ణయంతీసుకోవాలని వాళ్ళ వదిన ముందే అరుణకి హిత బోధచేశారు.

అరుణ గతం, వాళ్ళ వదిన పెట్టిన బాధలు అన్ని తను ఆశ్రమంలో చేరడానికి ముందే వాచ్ మెన్ద్వారా వాళ్లందరికి తెలుసని అరుణకు తెలీదు.

రోజుకొక కార్ లో వచ్చే అందమైన డాక్టర్ తో అరుణసాన్నిహిత్యం అస్సలు సహించలేక పోయింది అరుణవాళ్ళ వదిన.

రోజూ ఆదిత్య కారు కోసం ఎదురు చూస్తూ ఉండేది ఆమె.

అతను ఎప్పుడు వస్తాడా!? వాళ్ళ అమ్మాయిని పంపిద్దామా!? అని ఆవిడ యావ. వాళ్ళపెద్దమ్మాయి కవితని అతనితో సాన్నిహిత్యం పెంచుకోమని నూరి పోసేది.

కవితని ఆదిత్య డిస్పెన్సరీలో నర్స్ గా పెట్టించమని అరుణని సతాయించేది ఆవిడ.

వార్షికోత్సవాల పనులలో హడావిడిగా ఉన్న అరుణ... కొన్ని సార్లు ఆదిత్యకి అసిస్ట్ చేయమని కోరింది కవితని... తనకి కూడా కొంచెం హెల్ప్ అవుతుంది కదా! అని.

రూబీ బ్లాక్ లోకి వెళ్ళడమే అసహ్యం కవితకి.. అందరూ ముసలాళ్ళు, పైగా అనారోగ్యంతో ఉన్నవాళ్ళు.. మందుల కంపు... అరుణ మాట తీసెయ్యలేక కవితకి మెడిసిన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసి అందరికి ప్రిస్క్రిప్షన్ చూసి మందులు

జాగ్రత్తగా వేయమని చెప్పి ఆదిత్య వెళ్ళిపోయాడు.

తను అతనితో టైం స్పెండ్ చేద్దామని వస్తే అతను వెళ్లిపోవడం...కవితకు కోపంతో.. అవమానంతోను కడుపు రగిలిపోయింది. అరుణతో అయితే హాఫ్ డే మెడిసిన్స్ ఇవ్వడంలోనే గడిపేస్తాడు అతను...

తర్వాత గార్డెన్ లో మొక్కల దగ్గర గంటలు గంటలు ఇద్దరు... ఇక ఇకలు.. పక పక లు.. ఏం మాట్లాడుకుంటారో తెలీదు కానీ...తన వరకు వచ్చేసరికి

దర్జాగా మందులు ఇవ్వమని చెప్పి పోయాడని.. అతనికి డాక్టర్నని పొగరని..... ఏ విషయంలోనూతను అరుణకంటే తీసిపోనని... ఇంకా చెప్పాలంటే తనే ఆమె కంటె అందంగా ఉంటుందని... అయినా అతను తన మొహం చూడటానికి కూడా ఇష్టపడడని.. తన అక్కసు అంతా వాళ్ళఅమ్మ దగ్గర వెళ్ళ గ్రక్కింది కవిత.

కవిత పెద్దవాళ్ళని విసుక్కోవడం, అసహ్యించుకోడం గమనించిన ప్రకాశం గారు రూబీ బ్లాక్ లోకిఆమెని అనుమతించ వద్దని చెప్పారు.

కొంత మంది పెద్దవాళ్ళ నుండి కంప్లైంట్స్ కూడా వస్తాయి ప్రకాశం గారికి ఆమె వాళ్ళ మీద చేయికూడా చేసుకుంటోందని.

ఇక్కడైతే అరుణ మంచితనాన్ని వాళ్ళు దుర్వినియోగపరుస్తున్నారని వాళ్ళని ఆర్ఫనేజ్ కి షిఫ్ట్ చేశారు.

ఇష్టం లేకపోయినా వేరే గత్యంతరం లేక... ఇదంతా అరుణ చేసిన కుట్రేనని... మేము సంతోషంగా ఉంటె చూసి ఓర్చుకోలేక పోయిందని... మా ఉసురు తగిలి తుడిచిపెట్టుకుపోతుందని... శాపనార్ధాలు పెట్టి వెళ్ళింది అరుణ వాళ్ళ వదిన.

వార్షికోత్సవాలు ఎలాంటి ఆర్భాటాలు లేకుండా ఆశ్రమంలోఅందరూ కలిసి చక్కగా సెలెబ్రేట్ చేసుకున్నారు.

అన్ని హడావిడులు అయిపోయాక అరుణ ఆఫీసులో వర్క్ చేసుకుంటుండగా ప్రకాశం, రజనీష్, సూర్యం గార్లు ముగ్గురు కలిసి రావడంతో అరుణ ఎకౌంట్స్ చూపిద్దామని బుక్స్ తెస్తుంటె... “ఇవన్నీ తర్వాత చూద్దామమ్మా, నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి..కూర్చో“ అన్నారుప్రకాశం గారు.

అరుణకి అర్ధం కాలేదు... చెప్పండి అంకుల్! అంది ఎప్పటిలా వినయంగా. ఆశ్రమంలో చేరిన రోజుఎంత వినయంతో ఉందో ఇప్పటికి అదే వినయం. ఎంత చనువిచ్చిన తన లిమిట్స్ ఏమిటోఆమెకి తెలుసు.... ఎప్పుడు క్రాస్ చేయదు అనుకున్నారు ప్రకాశం గారు. ఆమెలో ఆ వినయమేఅందరికి నచ్చేది.

“నీ పెళ్లి గురించి మాట్లాడదామని వచ్చాము” అన్నారు ఆయన.

సడన్ గా పెళ్లి మాట వచ్చేసరికి అరుణకి ఏం మాట్లాడాలో తెలీలేదు... సిగ్గు పడిపోయింది.

“ఆదిత్య గురించి నీ అభిప్రాయమేమిటి !? అని అడిగి... మీ ఇద్దరికీ టెన్ ఇయర్స్ ఏజ్ డిఫరెన్స్ ఉంది... నీకు ఓకే నా!? ....

నీ అభిప్రాయం ఏదైనా మొహమాట పడకుండా చెప్పమ్మా! ఫరవాలేదు” అన్నారు ప్రకాశం గారు.

అరుణ చెవులకి వీణ మీటినట్లుగా వినపడ్డాయి ఆ మాటలు.

ఆనందంతో ఎగిరి గంతులు వెయ్యాలనిపించింది.

“పెళ్లి అనేది జీవితాంతం ఉండేది... నువ్వు మొహమాట పడకుండా చెప్పాలి అరుణా“ అన్నారురజనీష్ గారు.

“మా రజని ఎప్పటి నుండో నిన్ను కోడలిగా చేసుకోవాలనిముచ్చట పడుతున్నాడమ్మా”అన్నారు సూర్యం గారు.

అరుణ అర్ధం కానట్లు చూసింది.

ఇంతలో ఆదిత్య "హాయ్ డాడీ" అంటూ రావడంతో అరుణ విస్తుపోయింది.

ఆదిత్య రజనీష్ అంకుల్ వాళ్ళ అబ్బాయని తనకి ఇంత వరకు ఎవరూ చెప్పకపోవడం ఆమెని ఎంతగానో ఆశ్చర్య పరిచింది.

నోట మాట రాలేదు అరుణకి.

“మీరెలా అంటే అలా అంకుల్ ... అని అనాధ అయిన నన్ను మీ కోడలిగా చేసుకుంటాననడంలోనే మీది ఎంత గొప్ప మనసోతెలుస్తోంది ....

నేను ఏ విషయంలోనూ డాక్టర్ ఆదిత్య తో సరి తూగనని తెలిసి కూడా మీరు నా అభిప్రాయం అడుగుతున్నారంటే... అది మీ ఉదార స్వభావం, సహృదయతని వ్యక్తపరుస్తున్నాయని కృతజ్ఞతాభావంతో“ అంటుంది అరుణ.

అరుణ తనని అనాధ అన్నందుకు ముగ్గురు ఆమె మీద ధ్వజమెత్తారు.

కూతురు లేని లోటు తీర్చావని ప్రకాశం గారు అంటే... నువ్వు మా అందరికి ఆప్తురాలివని... ఇంకోసారి అనాధ అనే మాట ఆమె నోటి నుండి రాకూడదని చెప్పి మందలించారు.

“రజని వాళ్ళ అబ్బాయని తెలిస్తే నువ్వు ఇంత ఫ్రీ గా ఉండలేవని.... అతను చాల ఏళ్లుగా ఫారెన్లో ఉండబట్టి ఇక్కడ ఎవరికీ తెలీదు కాబట్టి మా ప్లాన్ ఈజీ అయ్యిందని.... ఆదిత్యని ఆశ్రమంలో డాక్టర్ గా అప్పాయింట్ చేసుకున్నది కూడా ప్లాన్ లో పార్టేనని... ఆవిధంగా మీ ఇద్దరికీ సాన్నిహిత్యం కలిగేలా చేశామని ... మీ ఇద్దరూ ఒకరిని ఒకరు ఇష్టపడుతున్నారని తెలిసాకే వివాహ ప్రసక్తి తెచ్చామని చెప్పారు” ప్రకాశం గారు.

“నువ్వు మా వాడికి కోడలిగా వస్తే మీ ఇద్దరూ కలిసిఆశ్రమ భాద్యతలు చూసుకుంటారనే మా స్వార్ధం కూడా కొంత లేక పోలేదు” అన్నారు సూర్యం గారు నవ్వుతూ.

“వాట్!? ఈజ్ ఇట్ ట్రూ డాడీ!?“ అని తెల్ల మొహం వేసాడు ఆదిత్య

ఈ సారి ఆశ్చర్య పోవడం అతని వంతైంది.

“నేనీ ఆశ్రమానికి వచ్చిన మెుదటి రోజు

డాడీ నన్ను వాళ్ళ అబ్బాయినని పరిచయం చెయ్యక పోవడం నాకు చాలా ఆశ్చర్యమనిపించింది....

సమయం వచ్చినపుడు పరిచయం చేస్తానని... అప్పటి వరకు ఎవరితో అనొద్దని అంటే కొంచెంవింతగా అనిపించినా పెద్ద సీరియస్ గా తీసుకోలేదు నేనా విషయం” అన్నాడు ఆదిత్య.

“మీ ముగ్గురు చెస్ బాగా ఆడతారని తెలుసు కానీ అంకుల్... ఇంత మంచి ప్లేయర్స్ అని.... మాకెక్కడా డౌట్ రానంత బాగా ప్లానింగ్ చేస్తారని అనుకోలేదు” అన్నాడు ఆదిత్య చిరుమందహాసంతో.

మేము ఆడపెళ్లి వాళ్ళం.. మా వైపు నుండి ఓ.కే. రా! మరిమొగ పెళ్ళివాళ్ళు, మీరు చెప్పండి... మీకేం కట్న కానుకలుకావాలి!? అని జోక్ చేసారు ప్రకాశం గారు.

“అరుణ లాంటి ఆణి ముత్యాన్ని ఇస్తున్నావురా! ఇంకేంకావాలి మాకు” అన్నారు రజనీష్ గారు.

అరుణ, ఆదిత్యల మొహాలు సంతోషంతో వెలిగిపోయాయి. తమ ప్రేమకి ఇంత త్వరగా పెద్దలఅంగీకారం లభిస్తుందని ఊహించలేదామె.

"శుభస్య శీఘ్రం” అన్నారు సూర్యం గారు.

వివాహం అంగ రంగ వైభవంగా జరిపించారు ఆశ్రమంలో పెద్దలందరూ దగ్గరుండి.

రజనీష్ గారితో వియ్యమందాలని ఆశ పడుతున్న చాల మంది ప్రముఖులకు ఇది అర్ధం కానివిషయంగా అయ్యింది. ఏమీ లేని అనాధని కోడలిగా చేసుకోవడంలో మర్మం ఏమిటో అర్ధంకాలేదెవరికీ, ప్రకాశం, సూర్యం గార్లు ఇరువురికి తప్పించి.

అరుణ రాకతో ఆదిత్య జీవితం నందన వనమయింది.

అతని సాహచర్యం ఆమెకి జీవితం పట్ల ఎంతో ధైర్యం, నమ్మకం, నిశ్చింతను కలగచేశాయి.

ఆదిత్య అరుణని తన బిగి కౌగిలిలో బంధిస్తూ “అరుణా! పెళ్లి కూతురు అలంకరణలో ఎంతఅందంగా ఉన్నావో తెలుసా......!?” అన్నాడు.

ఊఁ హూ!! అని అరుణ మొహం సిగ్గుతో ఎర్రబడగా అతనిలోకి ఒదిగిపోయింది..... భాషకిఅందని అపురూపమైన భావం ఏదో ఆమె హృదయంలోంచి ప్రసరించి అతన్ని తాదాత్మ్యతకిలోను చేసింది.

ఆనాడు అరుణాదిత్యల జీవితాల్లో నిజమైన “అరుణోదయం” అయ్యింది.

( సమాప్తం )

మరిన్ని కథలు

murthy uncle
మూర్తి బాబయ్య
- ఎం.వి.ఎస్.ఎస్.ప్రసాద్
kaamini
కామిని
- ఎం.వి.ఎస్.ఎస్.ప్రసాద్
Smoke stick
అగ్గి పుల్ల
- అఖిలాశ
Punishment in discipline
క్రమశిక్షణ లో శిక్ష
- కందర్ప మూర్తి
dont leave you too..!
నేను మిమ్మల్నీవదలా...!
- బొందల నాగేశ్వరరావు
Sister Value (Children's Story)
చెల్లెలి విలువ (బాలల కథ)
- సరికొండ శ్రీనివాసరాజు‌