ఉపదేశం (బాలల కథ) - డి వి డి ప్రసాద్

Teaching (children's story)

విద్యానందస్వామి అనే ఓ సాధువు లోక కళ్యాణార్ధం దేశ సంచారం చేస్తూ ఓ సారి సీతాపురం అనే గ్రామం వచ్చి అక్కడ గ్రామస్తులకి ప్రతీరోజూ తన ప్రవచనాలు వినిపించసాగాడు. ఇలా నెలరోజులపాటు ప్రతీ సాయంకాలం రామాయణ, మహాభారత, భాగవత కథాంశాలతోపాటు తన ఉపదేశాలు బోధించాడు.

చివరిరోజు తన బోధనలు వింటున్న గ్రామస్తులను ఉద్దేశించి, "జీవితం క్షణభంగురం! ఎప్పుడు ఏమవుతుందో ఎవ్వరం చెప్పలేం. అందువలన ఏ కార్యమైనా అనుకున్న వెంటనే సాధించడానికి యత్నించాలి. ఏ పని వాయిదా వేయడం తగదు. ఈ రోజు చేయాల్సిన పని రేపటికి వాయిదా వేయకూడదు. రేపటికోసం అట్టిపెట్టకుండా ఈ రోజే పనిపూర్తిచేయాలి. వీలుంటే రేపటిపని కూడా ఈ రోజే పూర్తిచేయాలి. అలా అయితేనే కార్యం సిద్ధిస్తుంది. వీలైనంత త్వరలో మనసులో అనుకున్న పనులు పూర్తి చేసుకోవడానికి సంకల్పించాలి. అప్పుడే మనం పురోగతి సాధించగలుగుతాం." అని తన ఉపదేశం వినిపించాడు. విద్యానందుడి ప్రవచనం, ఉపదేశాలు ఆ ఊరి జనమంతా చాలా శ్రద్ధగా విన్నారు. ఆఖరిరోజు కావడం మూలాన విద్యానందం స్వామీజీ ఉపదేశాలు వినడానికి ఆ రోజు ఊరివాళ్ళు దాదాపు అందరూ వచ్చారు. అఖరికి వడ్డీవ్యాపారి గోవిందయ్య, వెచ్చాలు అమ్మే వర్తకుడు సోమిశెట్టేకాక, రాజభటుడు దుర్జయుడు, చిల్లర దొంగతనాలు చేసే రంగడు కూడా వచ్చారు. ఆ నలుగురికీ కూడా స్వామీజీ ఉపదేశం బాగా ఆకర్షించింది.

ఆ మరుసటి రోజు స్వామిజీ తన బోధనలు, ఉపదేశాలు వినిపించడానికి మరో ఊరికి పయనమయ్యాడు.

సరిగ్గా ఓ సంవత్సరం తర్వాత విద్యానందస్వామి మళ్ళీ ఆ ఊరు రావడం తటస్థించింది. తన ఉపదేశాలు, ప్రవచనలవల్ల వాళ్ళల్లో ఆధ్యాత్మికత ఎంత పెంపొందిందో, వాళ్ళ జీవన శైలి ఎంత పురోగమించిందో తెలుసుకోవాలని జిజ్ఙాస కలిగింది అతనికి. అందుకోసం ఆ ఊళ్ళో బస చేయ సంకల్పించాడు.

స్వామీజి తమ ఊరికి వచ్చారని తెలుసుకొని గోవిందయ్య, సోమిశెట్టి, రంగడు, దుర్జయుడు ఈ నలుగురూ స్వామీజీవద్దకు వచ్చారు.

"స్వామీ!...తమ ఉపదేశం మాకెంతో ఉపకరించింది. మీ ఉపదేశంవల్ల మేము చాలా లాభం పొందాం. మీరు చివరిరోజు చేసిన ఉపదేశం మాకు బాగా నచ్చింది. అది ఆచరణలో పెట్టడంవల్ల మాకు చాలా సంపద చేకూరింది." అని కృతజ్ఙతగా నమస్కరించి తాము తెచ్చిన ఫలములు, కానుకలు సమర్పించారు వారందరూ.

ఫలములు మాత్రమే స్వీకరించి, వాళ్ళు తెచ్చిన కానుకలు వాళ్ళకే తిరిగి ఇచ్చేసాడు విద్యానందస్వామి.

తన ఉపదేశాలు, ప్రవచనాలు ఫలవంతమైనందుకు మిక్కిలి సంతోషం చెంది, "నా ఉపదేశాలు మీకందరికీ ఉపయుక్తమైనందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. మీకు శుభమవుగాక!" అని దీవించాడు విద్యానందస్వామి.

ఆ తర్వాత గ్రామప్రజలందరూ కూడా స్వామీజిని దర్శించుకోవడానికి వచ్చారు. అయితే ఆ వచ్చినవాళ్ళందరూ కూడా మునపటికన్న హీనస్థితిలో ఉండటం చూసి నివ్వెరపోయాడు అతను.

వాళ్ళ దీన స్థితికి కారణమేమిటని అడిగాడు.

"స్వామీ!...ఏమైందో తెలియదుకానీ, ఏడాదైంది మా గ్రామస్థులందరమూ చాలా బాధలు పడుతున్నాం. మా ఊరి వడ్డీ వ్యాపారి గోవిందయ్య వడ్డి బాగా పెంచేసి, అప్పు తీర్చడంలో కొద్దిగా జాప్యమైతే మా పొలాన్ని, ఇంటినీ స్వాధీన పర్చుకుంటున్నాడు. ముందునుండే కల్తీ సరుకులు అమ్మే అలవాటున్న సోమిశెట్టి ఇప్పుడు ధరలు విపరీతంగా పెంచేసి, బాగా కల్తీ చేసి సరుకులు అమ్మి మమ్మల్ని దోచుకుంటూ విపరీతంగా లాభాలు గడిస్తున్నాడు." గోడు వెళ్ళబోసుకున్నాడు రామయ్య.

"స్వామీ!...అలాగే రాజభటుడు దుర్జయుడు మమ్మల్ని బాగా పీడిస్తున్నాడు. దౌర్జన్యం చేసి డబ్బులు వసూలు చేస్తున్నాడు. డబ్బులు ఇవ్వలేని వాళ్ళని నానా అల్లరి చేస్తున్నాడు. రంగడి ఆగడాలైతే చాలా పెచ్చుపెరిగాయి. ముందు చిన్నచిన్న దొంగతనాలు చేసే రంగడు ఇప్పుడు పెద్ద దోపిడీ దొంగయ్యాడు. రాత్రిపూట ఒంటరిగా ఎక్కడికెళ్ళలన్నా భయం. ఇప్పుడు మేమందరం ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకొని బ్రతకవలసి వస్తోంది." నీరసంగా చెప్పాడు గ్రామపెద్ద సీతయ్య.

“అప్పటికీ మా కష్టాలన్నీ తీరాలని దేవుడికి మొక్కుకున్నాం. అయినా రోజురోజుకీ మా పరిస్థితి మరింత దిగజారుతోందేకాని, మెరుగుపడటం లేదు.” అన్నాడు వీరయ్య అనే ఇంకో గ్రామస్థుడు.

వాళ్ళ మాటలు విని నివ్వెరపోయాడు విద్యానందస్వామి. తన ఉపదేశాల్ని ఆ నలుగురు వేరే విధంగా అర్ధం చేసుకుని ప్రజల్ని పీడిస్తున్నారని అర్ధం చేసుకున్నాడు స్వామిజీ.

జరిగినదానికి చింతించి విద్యానందస్వామి వాళ్ళని ఉద్దేశించి ఇలా అన్నాడు, "కొన్నిసార్లు బోధనలు, ఉపదేశాలు తప్పుగా అర్ధం చేసుకున్నందువల్ల ఇలాంటి అనర్ధాలు జరుగుతాయి. అయితే, మొదటి రోజు మీకు నేను బోధన చేసినట్లు అందరూ కలిసికట్టుగా, ఐకమత్యంగా వాళ్ళ దురాగతాలని అరికట్టవచ్చు. ఈ రాజ్యాన్నేలే మహారాజుకి ఫిర్యాదు చేసి వాళ్ళ దుర్మార్గాన్ని ఎదుర్కోవచ్చు. ఈ రోజునుండే ఆ పనిమీద ఉండండి. మీకు జయం కలుగుతుంది."

స్వామిజి చెప్పిన మాటల్ని అనుసరించి, ఆ గ్రామ ప్రజలు అందరూ కలిసికట్టుగా ఎదుర్కోవడమే కాక, మహారాజుకి ఫిర్యాదుచేసి వాళ్ళ ఆట కట్టించారు.

మరిన్ని కథలు

sweet married life
తియ్యని కాపురం
- పి. వి. రామ శర్మ
friendship
స్నేహం (పిల్లల కథ)
- దార్ల బుజ్జిబాబు
Tolakari
తొలకరి
- శింగరాజు శ్రీనివాసరావు
The value of education
విద్యవిలువ
- డా.బెల్లంకొండడనాగేశ్వరరావు.
నడిచొచ్చిన పుట్ట
నడిచొచ్చిన పుట్ట
- Dr. శ్రీదేవి శ్రీకాంత్
fourth lion
నాలుగో సింహం
- తడకమళ్ళ మురళీధర్
wife
అర్ధాంగి
- గొర్తి.వాణిశ్రీనివాస్