Great work - పద్మావతి దివాకర్ల

మహత్కార్యం

చాలా రోజుల తర్వాత తన చిన్ననాటి స్నేహితులను కలవబోతున్న ఉద్విగ్నత సుందరంని ఆ రాత్రి నిద్ర పోనివ్వ లేదు. తను ప్రయాణిస్తున్న ట్రైన్‌ కన్నా వేగంగా దూసుకు పోతున్నాయి అతని మది లోని ఆలోచనలు. ఒకే బడిలో చిన్నప్పుడు సుందరంతో కలసి స్కూల్‌ ఫైనల్ వరకూ చదువుకున్న పూర్వ విద్యార్థులందరూ ఒక సమూహంగా ఏర్పడ్డారు. వాట్సప్ గ్రూప్‌గా ఏర్పడి పరస్పరం ముచ్చటించుకుంటూనే ఉన్నారు. ఆ స్కూలు, ఆ ఊరు విడిచి పెట్టి నలభై ఏళ్ళు దాటినా చిన్న నాటి స్మృతులు ఇంకా మనసులో తాజాగానే ఉన్నాయి. సుందరం ఉద్యోగ విరమణ చేసి ఏడాది దాటింది, తన స్నేహితులందరూ కూడా ఆరుపదుల వయసు దాటిన వారే.

వాట్సప్ సందేశాల ద్వారా చాలా మంది తమ పాత స్కూలు, ఆ ఊరు చూడాలని, అందరూ మళ్ళీ కలిసి సంతోషంగా ఓ నాలుగు రోజులు ఆ ఊళ్ళో గడపాలని ఉబలాట పడ్డారు. ఆ విధంగా ఓ కార్యక్రమం రూపొందించారు. మొదటి రోజు ఉదయం అందరూ కలవడం, పరస్పర పరిచయాలు, సాయం కాలం చిన్న సాంస్కృతిక కార్యక్రమం పెట్టుకున్నారు. తమ గురువులను ఆ సాయంకాలం సన్మానించే కార్యక్రమం పెట్టుకున్నారు. ఆ తర్వాత రెండురోజులు పిక్‌నిక్ ప్రోగ్రాం పెట్టుకున్నారు. ఆఖరి రోజు ఉదయమే స్కూల్‌కి వెళ్ళి ప్రార్థనా కార్యక్రమంలో పాల్గొనాలని, చిన్నప్పుడు తాము కూర్చున్న బెంచీలపై కొద్దిసేపు కూర్చోవాలని నిర్ణయించుకున్నారు.

ప్రస్తుతం ఉద్యోగ నిర్వహణలో ఉన్న ప్రధానోపాధ్యాయుడిని కలిసి ఆ ఏర్పాట్లు పూర్తిచేసారు స్థానికంగా స్థిరపడిన రామారావు, క్రిష్ణమూర్తి తదితరులు. వాళ్ళు ఆ కార్యక్రమానికి వచ్చే తమ స్నేహితులకోసం అన్ని రకాల ఏర్పాట్లు చేసారు కూడా. వసతి కోసం అందరికీ ఓ గెస్ట్‌హౌస్ ఏర్పాటు చేసారు.

ఇప్పుడు ఆ హార్దిక సమావేశం కోసం అందరూ ఆత్రతగా ఎదురు చూస్తున్నారు.

స్కూల్ ఫైనల్ పూర్తైన తర్వాత చాలామంది విడిపోయారు. కొంతమంది చదువులు అంతటితో సరిపెట్టి ఏదో ఒక వృత్తిలో ప్రవేశించారు. కాలేజీ చదువుల కొచ్చేసరికి సుందరంతో బాటు ఇంకో పదిమంది మాత్రమే మిగిలారు. ఆ తర్వాత ఇంజినీరింగ్‌లో చేరేసరికి తనతోబాటు పాత స్నేహితులెవరూ లేరు. తలో మూలకి వెళ్ళిపోయారు. ఉద్యోగంలో చేరిన తర్వాత అయితే దేశం నలుమూలలకీ వెళ్ళిపోయారు.

ఒకరిద్దరు స్నేహితులైతే విదేశాల్లోనే స్థిరపడ్డారు. అయితే ఈ మధ్య స్మార్ట్‌ఫోన్, ఫేస్‌బుక్ పుణ్యమాని ఒకరికొకరు దగ్గరయ్యారు. డభై మంది స్నేహితులలో దాదాపు యాభైమందివరకూ ఆ వాట్సాప్ గ్రూప్‌లో ఉన్నారు. కొంతమంది భగవంతునికి ప్రియమైనవారైతే, కొంతమంది ఆచూకీ తెలియలేదు.

ఆ వాట్సప్ గ్రూప్ ఏర్పడిన తర్వాత వాళ్ళందరికీ తమ వయసు నలభైఏళ్ళు వెనక్కి వెళ్ళినట్లు అనిపించసాగింది. ఛాటింగ్‌తో అసలు సమయమే ఎవరికీ తెలియడం లేదు. అందులో ఉన్నవాళ్ళందరూ ఉద్యోగవిరమణ చేసినవాళ్ళే. స్నేహితుల పుట్టినరోజులు, పెళ్ళిరోజులు గుర్తుకుతెచ్చుకొని మరీ శుభాకాంక్షలు తెలుపుతున్నారు. చిన్ననాటి విషయాలు గుర్తుకు తెచ్చుకుంటూ చాలా సరదాగా, ఉత్సాహంగా ఉన్నారు.

సుందరం ఉదయమే టైన్ దిగి తమకోసం ఏర్పాటు చేసిన గెస్ట్‌హౌస్‌కు చేరుకున్నాడు. చాలా రోజుల తర్వాత కలవడంతో ఒకళ్ళనొకళ్ళు గుర్తుపట్టడానికి కొద్దిసేపు పట్టింది. అయితేనేం, చిన్ననాటి జ్ఙాపకాలు నెమరువేసుకుంటూ చాలా సరదాగా గడిపారు. సుందరం తన ప్రాణ స్నేహితులైన రాంబాబు, బాబూరావు, గోపాలం కూడా రావడంతో చాలా సంతోషంగా ఉన్నాడు. ఎంతసేపు మాట్లాడుకున్నా తనివి తీరనేలేదు ఆ మిత్రులకి.

చాలా సరదాగా గడిచిపోయాయి మొదటి మూడు రోజులు. చిన్నప్పుడు తాము వెళ్ళిన ప్రదేశాలకే ఇన్నేళ్ళ తర్వాత విహారయాత్ర చేసి అందరూ ఒక్కసారి చిన్నపిల్లలైపోయారు. ఇక ఆఖరిరోజు వచ్చేసరికి ఇంత వేగం రోజులు గడిచిపోయాయా అని అనిపించింది. ముందు అనుకున్న విధంగా అందరూ ఉదయం ఆరుగంటలకల్లా స్కూలుకి చేరుకున్నారు.

ఆ పూర్వ విద్యార్థులందర్నీ ఆ స్కూలు ప్రధానోపాధ్యాయుడు సదానందం, ఇతర టీచర్లు సాదరంగా అహ్వానించారు. రామారావు తన స్నేహితులందర్నీ వాళ్ళకి పేరుపేరునా పరిచయం చేసాడు.

సదానందం వాళ్ళందర్నీ చూసి చాలా సంతోషించాడు.

"ఇన్నేళ్ళ తర్వాత మీరందరూ చిన్నప్పుడు చదివిన స్కూల్‌ని గుర్తుపెట్టుకొని రావడం, ఉదయం ప్రార్థనలో పాలుపంచుకోవాలనుకోవడం ముదావహం. మీరందరూ ఈతరం వాళ్ళకి ఆదర్శం కావాలి. ఈ సందర్భంగా మేము ఓ సమావేశం ఏర్పాటు చేయాలని అనుకుంటున్నాం. మీలో చాలామంది మంచి ఉద్యోగాలు చేసి జీవితంలో చాలా విజయాలు సాధించారు. మీ అనుభవాలని మన స్కూలు విధ్యార్థులతో పంచుకోవాలని మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను. మీ అనుభవాలు వాళ్ళకి భవిష్యత్తులో మార్గదర్శకంగా ఉపయోగపడతాయి." అన్నాడు సదానందం.

ప్రేయర్ తర్వాత సుభ్రహ్మణ్యం మాట్లాడుతూ, "మా నాన్నగారు ఇక్కడ తాహసిల్దారుగా ఉద్యోగంలో ఉన్నప్పుడు నేను ఈ స్కూల్లో చేరాను. మా ఉపాధ్యాయులందరూ మాకు చదువు చెప్పడంలో చాలా శ్రద్ధ చూపించేవారు. నేనెప్పుడూ మా క్లాస్‌లో ఫస్టు వచ్చేవాణ్ణి. నేను ఆ సంవత్సరం రాష్ట్రంలోనే మొదటివాడిగా నిలిచాను. అదంతా మా టీచర్ల చలవే. నా స్కూల్ ఫైనల్ అయిన తర్వాత మా నాన్నగారికి ఇంకో ఊరికి బదిలి అవడంతో అక్కడ కాలేజిలో చదివినా ఈ స్కూలుని, మా టీచర్లని ఎన్నటికీ మరిచిపోలేను.

ఆ తర్వాత నేను ఎంసెట్‌లో మంచి ర్యాంక్ సాధించి ఎం.బి.బి.యెస్. పూర్తి చేసాను. నా ఈ ఉన్నతికి కారకులైన వారికి నేను సదా కృతజ్ఙుడిని. మీరందరూ కూడా బాగా చదువుకొని జీవితంలో పైకి రావాలని ఆశిస్తున్నాను." అని చెప్పాడు.

పిల్లల కరతాళ ధ్వనులు మిన్ను ముట్టాయి. ఆ తర్వాత ప్రొఫేసర్‌గా పని చేసి రిటైరైన అత్మారాం, ఇంజినీర్‌గా ఉద్యోగం చేసి పదవీ విరమణచేసిన ఆనందరావు, వకీలుగా పేరు ప్రఖ్యాతులు సంపాదించిన పరమేశ్వరరావు తదితరులు ప్రసంగించారు. సుందరం కూడా ఆ స్కూల్లో చదువుకున్నవైనాన్ని, ఆ తర్వాత ఇంజినీరింగ్ చేసి తను జీవితంలో సాధించిన విజయాల్నీ చెప్పాడు.

ఆ తర్వాత సుందరం తదితరులు తాము చదుకున్న క్లాస్ రూముల్లోకి వెళ్ళి కొద్దిసేపు విద్యార్థులనడుమ గడిపారు. అక్కడ బెంచీపైన కూర్చుంటే మళ్ళీ పాత రోజులు తిరిగివచ్చాయా అని అనిపించింది సుందరానికి. కొద్దిసేపు అందరూ చిన్నపిల్లలై పోయారు. ఆ జ్ఙాపకాలని పదిలపర్చుకోవాలని ఫోటోలు, సెల్ఫీలు దిగారు.

ఆ తర్వాత స్కూలు ఆడిటోరియంకి చేరుకున్నారందరూ. ఆ సమావేశంలో స్కూల్ ప్రధానోపాధ్యుడు సదానందం పేరుపేరునా అందరి వివరాలు అడిగి తెలుసుకున్నాడు. అల్పాహారం తీసుకున్న తర్వాత వారందరితో సదానందం మాట్లాడుతూ, "ఈ స్కూల్లో చదివి జీవితంలో బాగా పైకి వచ్చినందుకు మీకందరికీ నా అభినందనలు. మన స్కూలు చదువులకే కాక ఆటలకి, క్రీడలకీ కూడా మన రాష్ట్రంలోనే పేరుపొందింది.

మీరు చదివే రోజుల్లో ఈ స్కూలుకి ఉన్న ప్రతిష్ట నిలుపుకోవడానికి నేను, నా సహోద్యోగలందరమూ నిరంతరం కృషి సల్పుతూనే ఉన్నాం. ఇప్పటికే మీ స్నేహితులలో ఇక్కడ స్థిరపడిన రామారావుగారు, క్రిష్ణమూర్తిగారు మాకు అన్ని విషయాల్లో అండగా నిలుస్తున్నారు. వాళ్ళిద్దరూ ఉద్యోగ విరమణ చేసిన తర్వాత మన స్కూల్లో ఉచితంగా విద్యార్థులకు చదువు చెప్పడానికి ఏడాది కాలంగా పని చేస్తూనే ఉన్నారు.

అలాగే ఈ స్కూల్లో చదివిన ఒకప్పటి స్టేట్ ఛాంపియన్ అయిన ఫుట్‌బాల్ క్రీడాకారుడు రంగనాధంగారు మన స్కూలు విద్యార్థులకు అన్ని క్రీడల్లో, ఆటల్లో కోచింగ్ ఇస్తున్నారు. అయితే ప్రస్తుతం ఆర్థిక పరిస్థితి కొంత ఇబ్బందికరంగా పరిణమించింది. నిధుల కొరతవల్ల స్కూలు లాబరీటరీ కి కావలసిన పరికరాలు లేవు. అలాగే వర్షాలవల్ల కొన్ని రూములు పాడయ్యాయి.

మరమ్మత్తులకు ప్రభుత్వం నుండి కావలసినంత నిధులు అందడం లేదు. వివిధ క్రీడలకి సంబంధించిన వస్తువులు కొనుగోలు చేయడానికి నిధులు లేవు. మీరందరూ ఈ స్కూల్లో చదువుకొని జీవితంలో ఎంతో పైకి వచ్చారు. మీ అందరికీ మీ స్కూలుపై ఉండే అభిమానమే మిమ్మల్ని ఇక్కడికి రప్పించింది. మీరందరూ కలసి ఓ చెయ్యవేస్తే స్కూలు మరమత్తులు అవీ సులభంగా చేయించవచ్చు. మీ స్కూలుకి మీ వంతు సాయం చేసినట్లు ఉంటుంది." అన్నాడు.

సదానందం మాటలు విన్న సుందరం తదితరులు ఆలోచనలో పడ్డారు. "ఇక్కడ చదుకువుకున్న చదువు మా భావి జీవితానికి పునాది వేసింది. మేము చదువుకున్న మా స్కూలుకి ఉడుతాభక్తిగా సహాయం చెయ్యడం మా కర్తవ్యం. ఆ విధంగా ఈ స్కూలుకి మా ఋణం తీర్చుకున్నట్లు ఉంటుంది.

నా వంతుగా నేను లక్షరూపాయాలు ఈ మహత్కార్యానికి వినియోగించదలిచాను. అందరూ తలో చెయ్యవేస్తే స్కూలు మరమత్తులన్నీ పూర్తి చేయవచ్చు. వచ్చే సంవత్సరం మనం మళ్ళీ ఇక్కడే సమావేశమై ఆనందంగా గడపవచ్చు." అన్నాడు సుందరం.

వెంటనే మిగతా అందరూ కూడా తమ వంతు ఆ కార్యంలో భాగం పంచుకునేందుకు తమ అంగీకారం తెలియపరచారు.

రామారావు లేచి నిలబడి, "ఈ రోజు నాకు చాలా సంతోషంగా ఉంది. మనమందరమూ ఇక్కడ కలుసుకోవడం ఆ సంతోషానికి ఒక కారణమైతే, మన స్కులుకి మన ఋణం తీర్చుకోవడానికి ఈ అవకాశం రావడం ఇంకో కారణం. ఈ మహత్కార్యంలో పాలుపంచుకోవడం మన అందరి అదృష్టం. మనలాగే పూర్వ విద్యార్థులందరూ కూడా వాళ్ళు చదివిన స్కూళ్ళని మరిచిపోకుండా తమ ఇతోధిక సహాయం అందిస్తే మన విద్యావ్యవస్థ మంచి అభివృద్ధి సాధిస్తుంది." అన్నాడు సంతోషంగా.

ఆ స్నేహితులందరికీ మంచి పని చేస్తున్నామన్న తృప్తి కలిగింది.

మరిన్ని కథలు

murthy uncle
మూర్తి బాబయ్య
- ఎం.వి.ఎస్.ఎస్.ప్రసాద్
kaamini
కామిని
- ఎం.వి.ఎస్.ఎస్.ప్రసాద్
Smoke stick
అగ్గి పుల్ల
- అఖిలాశ
Punishment in discipline
క్రమశిక్షణ లో శిక్ష
- కందర్ప మూర్తి
dont leave you too..!
నేను మిమ్మల్నీవదలా...!
- బొందల నాగేశ్వరరావు
Sister Value (Children's Story)
చెల్లెలి విలువ (బాలల కథ)
- సరికొండ శ్రీనివాసరాజు‌