జాతకం తిరగబడింది - శింగరాజు శ్రీనివాసరావు

The horoscope is reversed

చీరాలలో హాయిగా బ్రతికే అలివేలును తెచ్చి హైదరాబాదులో పడేశాడు అచ్యుతరామయ్య, ఈ వయసులో కావలసింది ఆసుపత్రి వసతి అని చెప్పి. పదవీ విరమణ చేసిన తరువాత ఖాళీగా ఉండటం వలన ఏవేవో విపరీతపు ఆలోచనలు చేస్తూ ఆయన చేసే పిచ్చిపనులలో ఇదొకటి అనుకుంది అలివేలు.

సొంత కొంపను బాడుగకిచ్చి అద్దెకొంపలో దించాడు. చేతికింద మనిషికి బాగా అలవాటుపడ్డ అలివేలుకు, పనిమనిషి లేకపోయేసరికి చెయ్యి తెగ్గొట్టినట్టుంది. అసలే కరోనా కష్టకాలం కావడంతో పనిపిల్లలు దొరకడం కష్టమయింది. ఇరుగు పొరుగు అమ్మలక్కల సలహాతో ఆన్ లైన్ పనిమనిషులు దొరికే లింకు పట్టుకుని వాళ్ళకు ఫోను చేసి ఎట్టకేలకు ఒక పనమ్మాయిని పట్టింది. ఆన్ లైన్ పనిపనిషి అనే మాటే సరదా సరదాగా వుంది. ఎలాగైనా కుదుర్చుకోవాలని ఉబలాట పడింది. వివరాలు మాట్లాడుకొమ్మని ఒక అమ్మాయిని ఈ రోజు పంపుతామన్నారు వాళ్ళు. పనిని బట్టి, సమయాన్ని బట్టి జీతం చెబుతారట.

అందుకే ఆ పిల్లకోసం ఎదురుచూస్తున్నది. ఆడబోయే తీర్థం ఎదురైనట్టు కాలింగ్ బెల్లు మోగింది. వెళ్ళి తలుపు తీసింది అలివేలు. " అచ్యుతరామయ్య గారి ఇల్లు ఇదేనా?" అడిగింది వచ్చిన అమ్మాయి. " అవును" అంటూ ఎగాదిగా చూసింది ఆ పిల్లను. ఆ అమ్మాయి పనిపిల్లలా లేదు. సినిమాలో సెకండ్ హీరోయిన్ లా వుంది. ఇది పని చేసే రకంలా లేదు అనుకుంది మనసులో.

" మీరు ఇంట్లో పనిచెయ్యడానికి మనిషి కావాలని కాల్ చేశారట. అందుకే వచ్చాను. ఏ ఏ పనులో చెబితే శాలరీ ఎంతో చెబుతాను" అబ్బో చాలా ఫాస్టే అనుకుంటూ " ఏముంది. అంట్లు తోమడం, బట్టలుతకడం, ఇల్లు చిమ్మి తుడిచి పెట్టడం" చెప్పింది అలివేలు. " వాషింగ్ మిషనుందా మీకు" అడిగింది ఆ పిల్ల " అదుంటే నువ్వెందుకు" అనబోయి నాలిక్కరుచుకుని, " లేదు " అని ఆగింది.

" అంట్లు తోమే మిషను, వాషింగ్ మిషను, వ్యాక్యూమ్ క్లీనరు ఇవన్నీ ఉంటే, మీరు అడిగే పనికి నెలకు మూడువేలు ఇవ్వాలి. వ్యాక్యూమ్ క్లీనర్ లేకుంటే అయిదు వేలు. అంట్లు తోమే మిషను, వాషింగ్ మిషను లేకుంటే, మీ ఇంట్లో పని చెయ్యడానికి కుదరదు. పోతే ప్రతి ఆదివారం సెలవు అందరిలాగే. అది కాక నెలకు రెండు రోజులు అదనపు సెలవులివ్వాలి. బంధువులు వచ్చినపుడు అదనంగా మనిషికి రోజుకు వంద రూపాయలు. మాటి మాటికి మాకు ఫోన్లు చెయ్యకూడదు. అవసరమైతే మెయిల్ గాని, వాట్సాప్ గాని చెయ్యాలి. నాలుగు గంటల లోపు మీకు సమాధానం ఇస్తాము. పదే పదే టైమింగ్స్ మార్చకూడదు. సంవత్సరానికి ఇరవై శాతం జీతం పెంచాలి. ఇవీ మా సంస్థ నియమాలు" గుక్క తిప్పుకోకుండా చెప్పింది ఆ పిల్ల. నోట మాట రాలేదు అలివేలుకు. పదినిమిషాల పాటు అచేతనమై పోయింది

" మీరే విషయమూ చెబితే నేను మరో ఇంటికి పనికి వెళ్ళాలి" తొందర చేసింది ఆ పిల్ల. ఏం మాట్లాడాలో అంతు బట్ట లేదు అలివేలుకు. షాకులో నుంచి తేరుకోలేక పోతూనే " రేపు ఆయనతో మాట్లాడి చెబుతాను" అంది తడబడుతూ. " అలాగే మేడమ్. వచ్చి మిమ్మల్ని కలిసినందుకు సర్వీసు ఛార్జి అయిదు వందలు ఇవ్వండి. పని కుదిరితే జీతంలో తగ్గించి ఇద్దురు గానీ. కుదరక పోతే మాకు వృథా అయిన సమయానికి, బండికయిన పెట్రోలు ఖర్చు కింద తీసేసుకుంటాము" చెప్పింది ఆ పిల్ల. షాకు మీద షాకు. అదిరి పడింది అలివేలు. ఆన్ లైన్ అంటే మోజు పడింది. ఫలితం అయిదు వందలు బొక్క. మారు మాట్లాడకుండా తెచ్చి ఇచ్చి, ఆ అమ్మాయి దగ్గర ఫోను నెంబరు తీసుకుంది. ఏం చెయ్యాలో పాలుపోక కుర్చీలో కూలబడింది.

******

" అన్నీ వుంటే అయిదు వేలా" నోటి మీద వేలేసుకున్నాడు అచ్యుత రామయ్య. " ఎగేసుకుంటూ తీసుకు వచ్చారుగా కాపురాన్ని. అయినా ఏం మిడిమేలమండీ ఆ పిల్లది. నన్ను నోరెత్తనిచ్చిందా. లొడ లొడ మాట్లాడి వెళ్ళి పోయింది. మరి అన్నీ కొని, దానికి అయిదు వేలు ఇచ్చి పెట్టుకుందామా?" బంతి భర్త కోర్టు లోకి వేసింది.

" అమ్మో అంతా. అసలే పెన్షను బ్రతుకులు. పోనీ ఆ రెండు మిషన్లు కొంటాను. ఎలాగోలా నువ్వే తంటాలు పడు" బ్రతిమలాడే ధోరణిలో పడ్డాడు అచ్యుత రామయ్య. " నా ఒక్కదానివల్ల కాదు" " మరెలా" " మీరు చేసే పనేముంది. టిఫిన్ చేసి గాలికి తిరిగి రావడం తప్ప. అంట్ల గిన్నెలు మిషనులో వేసి తీయడం, వాషింగ్ మిషనులో బట్టలు వేసి ఆరాక తీసి మడతలు పెట్టడం, కూరలు తరిగివ్వడం ఇవన్నీ మీరే చెయ్యాలి. మిగతావి ఎలాగోలా నేనే చేసుకుంటాను. దీనికే ఇష్టపడతారో, అయిదు వేలిచ్చి దాన్నే పెట్టుకుంటారో మీ ఇష్టం" తెగేసి చెప్పింది. అవాక్కయ్యాడు అచ్యుత రామయ్య. తిరిగి ఊరికి వెళితే అవమానం. అయిదు వేలు ఇస్తే కూటికి అడుక్కోవాలి. ముందు నుయ్యి, వెనుక గొయ్యి అంటే ఇదేనేమో. శేష జీవితాన్ని జాలీగా గడపాలని నగరానికొచ్చాడు. కుడితిలో పడ్డ ఎలుకయ్యాడు. పదవీ విరమణ చేస్తే బ్రతుకింత బేవార్సుగా వుంటుందని అనుకో లేదు. ఉద్యోగం చేసేటప్పుడు తెగ కష్ట పడ్డ బిల్డప్ ఇచ్చాడు భార్య ముందు. ఛీ. వెధవ బ్రతుకు. కానీ తప్పదు. లొంగి పోయాడు అలివేలుకు. జాతకం తిరగబడింది అచ్యుత రామయ్యకు. ఎప్పటి లాగే చేతి కిందికి మనిషి దొరికాడు అలివేలుకు.

******

అయిపోయింది

*******

మరిన్ని కథలు

Aame kavvinchindi
ఆమె కవ్వించింది
- తాత మోహనకృష్ణ
Chandruniko noolu pogu
చంద్రునికో నూలు పోగు
- కాశీవిశ్వనాధం పట్రాయుడు/kasi viswanadham patrayudu
Anaadha atidhyam
అనాథ అతిథ్యం
- - బోగా పురుషోత్తం
Vibheeshana Sharanu
విభిషణుని శరణు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Srivariki prema lekha
శ్రీవారికి ప్రేమలేఖ
- తాత మోహనకృష్ణ
Ramdaas formula
రాందాస్ ఫార్ములా
- వీరేశ్వర రావు మూల
Attagari samrajyam
అత్తగారి సామ్రాజ్యం
- బొబ్బు హేమావతి