బంగారు చెల్లెలు (బాలల కథ) - సరికొండ శ్రీనివాసరాజు

Golden Sister (Children's Story)

వాసు చదువులో చురుకైనవాడు కాదు. చిన్నప్పటి నుంచీ అల్లరి పిల్లల సావాసంతో పూర్తిగా ఆటలకే సమయం కేటాయిస్తూ చదువును నిర్లక్ష్యం చేసేవాడు. చిన్నతనంలో బుద్దిమంతుడే. కానీ పాండు, సోము, రంగ మొదలైన వాళ్ళతో స్నేహం చేసి, చెడు అలవాట్లు నేర్చుకుంటూ తల్లిదండ్రులకు చెడ్డపేరు తెస్తున్నాడు. తల్లిదండ్రులు ఎంత హెచ్చరించినా, తిట్టినా, కొట్టినా ఫలితం శూన్యం. అస్తమానం క్రికెట్ ఆటతో కాలక్షేపం, వేరేవాళ్ళ తోటల్లోకి ప్రవేశించి కాయలు, పండ్లు దొంగతనాలు చేయడం, ఇతరులతో పోట్లాటకు దిగి, ఇంటిమీదకు గొడవలు తేవడం ఇలాంటివి వాసుకు నిత్య కృత్యాలు. పోనీ ఇంట్లో అన్నం అయినా సరిగ్గా తింటాడేమో అంటే ఆ కూర నచ్చలేదని, ఈ కూర నచ్చలేదని అలిగి అన్నం వదిలేయడం పరిపాటి అయింది. వాసు ఏమైపోతాడో అని తల్లిదండ్రులకు పెద్ద దిగులు పట్టుకుంది.

ఇప్పుడు వాసు 9వ తరగతికి వచ్చాడు. వాసు వాళ్ళ పిన్ని కూతురు శర్వాణి 7వ తరగతి పూర్తి చేసుకొని 8వ తరగతికి వచ్చింది. చాలా తెలివైన అమ్మాయి. నిరంతర పుస్తక పఠనం వల్ల చిన్న వయసులోనే గొప్ప మేథావి అయింది. అయితే వాళ్ళ ఊరి పాఠశాలలో 7వ తరగతి వరకే ఉన్నందున పెద్ద తరగతులు చదవడానికి వాళ్ళ పెద్దమ్మ ఇంటికి పంపినారు. వాసు చదివే పాఠశాలలనే శర్వాణి 8వ తరగతిలో చేరింది. వాసు వాళ్ళ ఇంట్లోనే ఉంటూ చదువుతుంది. శర్వాణీని చూసి అయినా వాసు మారతాడని వాసు తల్లిదండ్రుల ఆశ. వాసు, శర్వాణీలు చిన్నప్పటి నుంచి ప్రాణ స్నేహితులు.

వాసు చదువుకోకుండా ఆటలతోనే సమయం అంతా వృథా చేయడం శర్వాణీకి నచ్చలేదు. "ఒరేయ్ అన్నయ్యా! చదువుకునే సమయంలో చదువుకోవాలి. ఆడుకొనే సమయంలో ఆడుకోవాలి. ఇలా చదువు మానేసి, అస్తమానం ఆటలేమిటిరా? నీకు మార్కులు తక్కువ వస్తే అందరూ నిన్ను చూసి నవ్వరా? అప్పుడు నీ చెల్లెలు అని నేను ఎలా చెప్పుకోవాలి? మనిద్దరం అక్కాచెల్లెళ్ళ పిల్లలం కాదురా! లైఫ్ లాంగ్ మనం ఇద్దరం సొంత అన్నాచెల్లెళ్ళం. కావాలంటే నాతో ఆడుకో. నా మాట వినరా!" అంది శర్వాణి. చెల్లెలు మాటలకు ప్రభావితుడు అయ్యాడు వాసు. ఓ రెండు రోజులు బాగానే చదివాడు.‌ "ఒరేయ్! రెండు రోజుల నుంచి కనబడటం లేదు. ఏమైందిరా నీకు? నువ్వు లేకపోయేసరికి మాకు ఏదో వెలితిగా అనిపించింది. ఆడుకోబుద్ధి కాలేదు. టెండూల్కర్ లేని ఇండియన్ టీంలా ఉంది మా టీమ్. ప్లీజ్! మాతో వచ్చి ఆడుకోరా!" స్కూల్లో ఇంటర్వెల్ టైంలో వాసుతో అన్నాడు పాండు. నిజానికి పాండు ఎన్నడూ పాఠశాలకు సరిగా రాడు. ఆరోజు వాసు కోసమే వచ్చాడు. సాయంత్రం వాసు ఇంటికి వెళ్ళకుండా స్నేహితులతో ఆటలు ఆడుతున్నాడు. అన్నయ్య ఎంతసేపైనా ఇంటికి రాకపోవడంతో శర్వాణి వెతుక్కుంటూ వెళ్ళింది. స్నేహితులతో క్రికెట్ ఆడుతూ వాసు కనిపించాడు. "అన్నయ్యా! ఇంటికి రావా?" అన్నది శర్వాణి. వాసు "వెళ్దాం పద!" అన్నాడు. "అన్నయ్యా! నేను షాపుకు వెళ్తున్నాను. నువ్వు ఇంటికి వెళ్ళు‌" అన్నది శర్వాణి. వాసు ఇంటికి వెళ్ళాడు.

శర్వాణి వాసు మిత్రబృందంతో "ఇలా ఆటలతో కాలక్షేపం చేసే బదులు బుద్ధిగా చదువుకుంటే మంచి భవిష్యత్తు ఉంటుంది కదా! తా చెడ్డ కోతి వనమెల్ల చెల్లించినట్లు మా అన్నయ్యను చెడగొడుతున్నారు. ఎందుకు? మా అన్నయ్యను చెడగొడితే ఊరుకొనేది లేదు." అన్నది. పాండు ఆవేశంతో బ్యాట్ తీసుకొని శర్వాణీని కొట్టబోయాడు. రంగ పాండును ఆపి, శర్వాణీతో ఇలా అన్నాడు. "మా వాసు చెల్లెలివి కాబట్టి ఈసారికి నిన్ను వదిలేస్తున్నాను. ఇంకోసారి ఇలా మాట్లాడితే నిన్ను లేవకుండా తన్నుతా!" అన్నాడు రంగ. "వాసును మాతో ఆడుకోనివ్వకుండా చేశావో నీ మూతి పళ్ళు రాలగొడుతా!" అన్నాడు సోము. ఛీ! ఒక అమ్మాయితో ఎలా ప్రవర్తించాలో తెలియని రౌడీ వెధవలు. వీళ్ళతోనా అన్నయ్య స్నేహం చేస్తున్నది. ఈ స్నేహం ఇలాగే కొనసాగితే అన్నయ్య కూడా చెడిపోవడం ఖాయం. అనుకుంది శర్వాణి. ఇంటికి వచ్చి అన్నయ్యతో జరిగింది చెప్పింది. అన్నయ్య మీద అలిగి ఆ రాత్రి అన్నం కూడా తినలేదు. వాసు ఎంత బతిమాలినా ఫలితం శూన్యం. వాసు ఇక ఆ రౌడీ వెధవలతో ఆడుకోవద్దని నిశ్చయించుకున్నాడు. మరునాడు తన మిత్రబృందం వద్దకు వెళ్ళి, తన చెల్లెలిని అవమానించినందుకు వాళ్ళను తిట్టి, వాళ్ళతో జన్మలో ఆటలు ఆడనని చెప్పి, ఇంటికి వచ్చాడు.

"ఒరేయ్ పాండు! ఆ అల్లరి బృందంతో చేరి చెడ్డపనులు చేస్తూ మాకు తలవంపులు తెస్తున్నావురా! బుద్ధిగా సమయానికి ఇల్లు చేరి చదువుకో! మళ్ళీ ఆటలు జోలికి వెళ్ళావని తెలిస్తే కాళ్ళు చేతులు విరగ్గొడుతా." అన్నది పాండు తల్లి. సాయంత్రం స్కూల్ వదలగానే షరా మామూలే. పాండు మిత్రబృందంతో క్రికెట్ ఆట మొదలుపెట్టాడు. వాసు లేకపోవడంతో వాసు స్థానంలో కొత్తగా రాము ఆటలో చేరాడు. రాము బౌలింగ్. పాండు బ్యాటింగ్. రాము పాండుకు షాట్స్ కొట్టే వీలు లేకుండా దూరంగా బాల్స్ వేస్తున్నాడు. సహనం నశించిన పాండు "ఒరేయ్! నీ బౌలింగ్ చెత్తగా ఉంది. భారీ షాట్స్ కొడతానన్న భయానికి బాల్స్ బ్యాటుకు దూరంగా విసురుతున్నావు. దమ్ముంటే నా చేతివైపు బాల్ వెయ్యరా!" అన్నాడు పాండు. . ఈసారి రాము వేసిన బాల్ పాండు చేతికి బలంగా తగిలింది. ఆ బాల్ పాండుది. పాండు చాలా ప్రమాదకరమైన బాల్స్ వాడుతడు. పాండు చెయ్యి బాగా ఫ్రాక్చర్ అయ్యింది. ఇంటికి వెళ్ళిన పాండు జరిగిన విషయం చెప్పలేకపోయాడు. తల్లి కొడుకును బాగా తిట్టింది.

‌ రంగ తల్లి కూడా రంగను తరచూ తిడుతోంది. అయినా రంగలో మార్పు రాలేదు. రంగ, సోము, సోములు ఒక తోటలోకి వెళ్ళారు. ఎప్పుడూ చెట్టు ఎక్కి వాసూనే పళ్ళు తెంపి, మిత్రులకు ఇచ్చేవాడు. ఈసారి వాసు లేకపోవడంతో రంగ చెట్టు ఎక్కాడు. చాలా పైకి ఎక్కాడు. కానీ ప్రమాదవశాత్తు జారి ఎత్తు నుంచి కింద పడ్డాడు. కాళ్ళకు భయంకరంగా దెబ్బలు తగిలాయి. రెండు నెలలు ఆసుపత్రిలో ఉండాల్సి వచ్చింది.

కొత్తగా స్నేహితుడు అయిన రాము సోమును కలిశాడు. తరచూ సోము వాసుతో పరుగు పందెం కాసేవాడు. ఎప్పుడూ సోమునే గెలిచేవాడు. కానీ వాసు లేకపోవడంతో కొత్తగా మిత్రుడు అయిన రాముతో సోము పరుగు పందెం కాసాడు. రాము మెరుపు వేగంతో పరుగెత్తుతున్నాడు. సోము వెనుకబడినాడు. అటుగా సోము క్లాస్ మేట్సు శ్రావణి, స్రవంతి, సరస్వతి మాట్లాడుకుంటూ వస్తున్నారు. వీళ్ళ ముందు తన పరువు పోతుందని శక్తినంతా కూడగట్టుకుని పరుగెత్తుతున్నాడు. ప్రమాదవశాత్తు కిందపడి పళ్ళన్నీ రాలగొట్టుకున్నాడు. ఇంటికి వచ్చిన సోముతో తల్లి "ఏమైందిరా! అయ్యో! పళ్ళు ఊడగొట్టుకున్నావేమీ. కోపం వస్తే పళ్ళు రాలగొడుతా అనడం పరిపాటి అయింది నీకు. నీ మాటలకు కోపం వచ్చి, ఎవడో రాలగొట్టి చూపించాడు. ఏం జరుగుతుందో చెప్పు." కంగారు పడుతూ అడిగింది తల్లి. సోము ఏమీ చెప్పలేదు. "చెడు సావాసాలు వద్దని ఎంత చెప్పినా వినిపించుకున్నావా? చివరికి ఏమైంది? ఇంకోసారి బయటికి అడుగు పెడితే అంతే! ఇక ఇంటికి అస్సలు రానివ్వను. సిగ్గు లేదురా! నీ చెల్లెలు 6వ తరగతి అయినా బుద్ధిగా చదువుకొని క్లాస్ ఫస్ట్ వస్తుంది. దాన్ని చూసి బుద్ధి తెచ్చుకోరా!" అంటూ బాగా చివాట్లు పెట్టింది.

వాసు స్నేహితులకు దూరంగా ఉంటున్నాడు. చెల్లెలు ఇంటివద్ద శ్రద్ధగా చదువుతుంటే తానూ చదువుకోవడం మొదలు పెట్టాడు. క్రమంగా వాసుక మార్కులు పెరుగుతున్నాయి. మూడు నెలలు గడిచాయి. ఒకరోజు పాండు, సోము, రంగలు ఒకచోట సమావేశం అయ్యారు. వాసు తమతో ఆడుకోకపోవడమే తమకు దెబ్బలు తగలకుండా నికి కారణం అనుకున్నారు. వాసు బౌలింగ్ వేస్తే పాండుకు దెబ్బలు తగిలేవి కావని, వాసు చెట్టు ఎక్కితే రంగుకు దెబ్బలు తగిలేవి కావని, వాసుతో పరుగు పందెం కాస్తే సోము పళ్ళు రాలేవి కావని అనుకున్నారు. వాసుకు బుద్ధి చెప్పాలని అనుకున్నారు. అప్పుడే అటుగా వాసు వెళ్తున్నాడు. వాసు వెళ్ళిన రెండు నిమిషాల తర్వాత అప్పుడే వేసుకున్న ప్రణాళిక ప్రకారం సోము ఒక రాయి తీసుకుని ఎదురుగా ఉన్న మేడ అందమైన అద్దం మీదకు విసిరాడు. అద్దం పగిలింది. ఇంటి యజమాని పరుగు పరుగున రోడ్డు పైకి వచ్చాడు. అక్కడే ఉన్న ఈ ముగ్గురినీ చూశాడు. "మా క్లాస్ మేట్ వాసు ఈ పని చేశాడు అంకుల్." అని వాసు ఇంటి చిరునామా చెప్పారు ముగ్గురూ.

‌. ఆ యజమాని వాసు వాళ్ళ అమ్మానాన్నలతో పెద్ద గొడవ వేసుకున్నాడు. వాసు వాళ్ళ తల్లిదండ్రులు వాసును చివాట్లు పెట్టారు. తన తప్పేమీ లేదని చెప్పినా ఎవరూ నమ్మడం లేదు. శర్వాణి తనను ఎంత అపార్థం చేసుకుందో అన్న బాధ వాసుకు ఎక్కువైంది. "నువ్వు ఈ జన్మలో చెడు సావాసాలు వదలవురా! నీ చెల్లెలు శర్వాణిని చూసి బుద్ధి తెచ్చుకోరా! ఈరోజు నీకు అన్నం పెట్టేది లేదు. పో! నీ చావు నువ్వు చావు." అన్నది వాసు వాళ్ళ అమ్మ. వాసు ఏడుస్తూ కూర్చున్నాడు. అందరూ ఎవరి పనుల్లో వారు ఉండగా శర్వాణి వంటింట్లోకి వాసును రమ్మని సైగ చేసింది. వాసు వెళ్ళాడు. శర్వాణి ఒక పల్లెం నిండా తన కోసం కోసుకున్న బొప్పాయి ముక్కలను వాసుకు ఇచ్చి తినమంది. నిజానికి బొప్పాయి పండు వాసుకు అంతగా ఇష్టం లేదు. కానీ చెల్లెలు ప్రేమతో ఇచ్చేసరికి కాదనకుండా తిన్నాడు. ఎంతో తీయగా అనిపించాయి. చెల్లెలిని ఆప్యాయంగా దగ్గరకు తీసుకున్నాడు. "మనం ఎప్పటికీ సొంత అన్నా చెల్లెళ్ళమే." అన్నాడు వాసు. "నేను లైఫ్ లాంగ్ నీ స్వీట్ సిస్టర్ నే" అన్నది శర్వాణి. "నిజంగా నేను ఆ ఇంటి అద్దాలు పగలగొట్టలేదు చెల్లీ! ఆ దొంగ వెధవలు ఆ పని చేసి, నా మీదకు నెట్టారు." అన్నాడు వాసు. "నాకు తెలిసు. నువ్వు అలాంటి పనులు చెయ్యవని. అయినా వాళ్ళు నీ స్నేహితులే కదా! ఎందుకలా ప్రవర్తించారో" అంది శర్వాణి. "వాళ్ళకు బుద్ధి చెప్పేది ఎలా?" అన్నాడు వాసు. ముందు నువ్వు మంచిగా చదువుకో. 9వ తరగతి పూర్తి అయ్యేసరికి నువ్వు మొదటి ర్యాంకు సాధించాలి. 10వ తరగతిలో నువ్వే క్లాస్ లీడరువి అవుతావు. అప్పుడు నీ క్లాస్ మేట్సు అయిన ఆ ముగ్గురి భరతం పట్టు." అంది శర్వాణి. వాసు పట్టుదలతో చదువుతున్నాడు ‌

వాసు 9వ తరగతి వార్షిక పరీక్షలలో మొదటి ర్యాంకు సాధించాడు. 10వ తరగతిలో వాసును లీడరుగా తరగతి ఉపాధ్యాయులు నియమించారు. అంతేకాదు. 40 మంది విద్యార్థులను 5 గ్రూపులుగా విభజించారు. ఒక్కొక్క గ్రూపులో 8 మంది విద్యార్థులు ఉంటారు. ఒక్కొక్క గ్రూపుకు ఒక్కో లీడర్. ఆ సంవత్సరం మొత్తం ఆ లీడర్ చెప్పినట్లు మిగతా విద్యార్థులు వినాలి. లీడరుకు ఎదురు తిరిగితే చాలా కఠినమైన శిక్షలు ఉంటాయి. ఆ విద్యార్థులను మంచిగా చదివించే బాధ్యత గ్రూప్ లీడరుదే. వాసు తన గ్రూపులో పాండు, సోము, రంగలను వేయించుకున్నాడు. తన గ్రూపులో వచ్చిన ఏడుగురిని కూర్చోబెట్టుకుని ఇలా అన్నాడు వాసు. "మన గ్రూపులో అందరూ మిగిలిన గ్రూపు విద్యార్థులను మించిపోవాలి. ఇదెలా సాధ్యం? అని మీరు అడగవచ్చు. 9వ తరగతి దాకా చదువు సరిగా రాని నేను మా చెల్లెలి పుణ్యమా అని ఇప్పుడు మొదటి ర్యాంకు సాధించాను. మీరు పట్టుదలతో చదివితే మార్కులు మరింతగా పెరుగుతాయి. అనుక్షణం మిమ్మల్ని కనిపెడుతూనే ఉంటా. ఏ మాత్రం అనుమానం వచ్చినా ఉపాధ్యాయులకు ఫిర్యాదు చేస్తా. వారే మీ భరతం పడతారు. ముఖ్యంగా మన గ్రూపులో చదువులో బాగా వెనుకబడిన వారు ముగ్గురు ఉన్నారు. వారిని మాత్రం అస్సలు మెసలనివ్వను." అని.

ఉపాధ్యాయులు ఇచ్చిన ఇంటిపనిని చేశారా లేదా వాసు రోజూ తనిఖీ చేసేవాడు. అంతకు ముందురోజు అయిన పాఠాల నుంచి తన గ్రూప్ వారిని రోజూ ప్రశ్నలు అడిగేవాడు. ప్రతిరోజూ ఉదయం 4:30 కు తన వర్గంలోని విద్యార్థులకు ఫోన్ చేసి చదవమనేవాడు. తానూ చదివేవాడు. ఆ ఏడుగురు విద్యార్థుల తల్లిదండ్రులను కలిసి ఇంటివద్ద వారి పిల్లలు ఎలా చదువుతున్నారో అడిగేవాడు. ఏ విషయంలో నిర్లక్ష్యం వహించినా వారిపై ఉపాధ్యాయులకు చెప్పి, వారిని శిక్షింపజేసేవాడు. పాండు, సోము, రంగలు బయటకు రావాలంటే భయపడుతున్నారు. పొరపాటున వాసు కంట్లో పడడానికి కూడా భయపడుతున్నారు. ఇలా భయంతో పట్టుదలగా చదువుతున్నారు ముగ్గురూ. రాను రాను పరీక్షలలో వారికి మార్కులు పెరుగుతున్నాయి. ప్రీ ఫైనల్ పరీక్షలలో ఆ ముగ్గురికీ 60 శాతానికి పైగా మార్కులు వచ్చాయి. తమకు వచ్చిన మార్కులకు తామే ఆశ్చర్యపోయారు. వారి తల్లిదండ్రుల ఆనందానికి అంతే లేదు. ముగ్గురూ వాసు వద్దకు వెళ్ళారు. "ఇన్ని రోజులూ నువ్వు మాపై ప్రతీకారం తీర్చుకోవడం కోసం మమ్మల్ని బాగా కష్టపెడుతున్నావు అనుకున్నాం. కానీ నీ వల్ల మాకు మేలే జరిగింది. చదువుకోవడంలో ఉన్న ఆనందాన్ని చూశాం. ఇక మేము చదువును మధ్యలో వదలిపెట్టము. మాకు మంచి భవిష్యత్తును ఇవ్వబోతున్నావు. నీకు కృతజ్ఞతలు." అన్నాడు పాండు. "నేను ఇలా మొదటి ర్యాంకు సాధించి మీకు లీడర్ కావడానికి మా చెల్లెలు ఇచ్చిన ప్రోత్సాహమే కారణం ‌ మీరు చదువులో ఇంత మెరుగు కావడానికి పరోక్షంగా మా చెల్లెలు కారణం. మనం అందరం కృతజ్ఞతలు చెప్పుకోవాల్సింది మా చెల్లెలికి." అన్నాడు వాసు. "మేము నీ చెల్లెలు పట్ల అనుచితంగా ప్రవర్తించాము. మమ్మల్ని క్షమించు వాసూ! " అన్నాడు సోము. "ఇకపై మనం నలుగురం మంచి స్నేహితులం. ఆటలతో సమయం వృథా చేసుకోకుండా పోటీపడి చదువుదాం." అన్నాడు రంగ. సంతోషించాడు వాసు.

జరిగింది చెల్లెలికి చెప్పాడు. చెల్లెలు సంతోషించింది. వాసు చెల్లెలి ప్రభావంతో తెలివైన విద్యార్థిగా మారడమే కాదు. అన్ని కూరలూ, పళ్ళు ఇష్టంగా తింటూ మంచి ఆరోగ్యాన్ని పెంచుకున్నాడు. నిజంగా వాసుకు శర్వాణి బంగారు చెల్లెలు..

మరిన్ని కథలు

Nagisheela chetikarra
నగిషీల చేతికర్ర
- కందర్ప మూర్తి
Bratuku bali cheyaku
బ్రతుకు బలిచేయకు
- చెన్నూరి సుదర్శన్
Aa kondari valana
ఆ కొందరి వలన
- గంగాధర్ వడ్లమన్నాటి
Chilipi Malathi
చిలిపి మాలతి
- అమ్జద్.
Vammu kaani nammakam
వమ్ముకాని నమ్మకం
- బుద్ధవరపు కామేశ్వరరావు
Kotula naduma
కోతులనడుమ (కామెడీ కథ)
- చెన్నూరి సుదర్శన్
Tandri korke teerchina tanayudu
తండ్రి కోర్కె తీర్చిన తనయుడు
- కొత్తపల్లి ఉదయబాబు