నిజం-నమ్మకం - శింగరాజు శ్రీనివాసరావు

Truth-belief

" ఏమండీ. మన పనమ్మాయి రాజేశ్వరి కూతురికి పెళ్ళి కుదిరిందట. అబ్బాయి పాలిటెక్నిక్ చదివి హైదరాబాదులో ఉద్యోగం చేస్తున్నాడట. నెలకు ముప్ఫై వేలు జీతమట. తెలిసిన వాళ్ళు కావడంతో పిల్లను అడిగి మరీ చేసుకుంటున్నారట. అయినా మొహమాటం లేకుండా లక్ష రూపాయలు లాంఛనంగా అడిగారట.

అదిగాక పెళ్ళి ఖర్చుకు మరో లక్ష రూపాయలు యిమ్మన్నారట" చెప్పుకు పోతున్నది నా శ్రీమతి సునంద. " ఇప్పుడిదంతా నాకెందుకు చెప్తున్నావు. అయినా ఆ పిల్ల కూతురికి పెళ్ళయితే నీకెందుకే ఈ వివరాలు" " అదికాదండి. మన ఇంట్లో అయిదు సంవత్సరాలుగా పనిచేస్తున్నది. మన బిడ్డలతో పాటు బిడ్డలా కలిసిపోయింది. దాని మొగుడు చూద్దామంటే పచ్చి తాగుబోతు వెధవాయె.

పాపం ఇదే అన్నీ సమర్ధించుకు రావలసి వచ్చె. పిల్ల చూడముచ్చటగా ఉంటుంది, ఒద్దికయిన పిల్ల కాబట్టి, వాళ్ళ నాన్న వ్యవహారం తెలిసినా, దాన్ని పక్కనబెట్టి ఆ పిల్లను చేసుకోను ముందుకు వచ్చారు. ఇప్పుడు దానికి డబ్బు ఇబ్బంది వచ్చి పడినట్టుంది.

తను కష్టపడి దాచుకున్న డబ్బు లక్ష ఉందట. వాళ్ళ అన్నయ్య ఒక యాభైవేలు అప్పు ఇస్తానన్నాడట. ఇంక కనీసం డెభ్భై వేలయినా వుంటే కదా అని ఆలోచిస్తున్నది. అది దిగులుపడుతుంటే నేనే ఒక సలహా పారేశాను" " ఏం సలహా ఇచ్చావేమిటి?"

తను పనిచేసే నాలుగు ఇళ్ళలో అందరినీ తలా కొంచెం సహాయం చేయమని అడగమని. మొన్న మన అపార్టుమెంటులో వాణి వాళ్ళ ఇంట్లో పనిచేస్తుంది కదా. మొన్న ఆమె దీనికి ఒక ఆశ పెట్టింది. ఆమెకు కొంచెం చేదోడువాదోడుగా వుంటే అమెరికాలో ఉండే వాళ్ళ పిల్లలకు చెప్పి దాని కూతురు పెళ్ళికి ఇరవైవేలు ఇప్పిస్తానన్నదట. దాని మీద ఆశలు పెట్టుకుని సాయంత్రం అందరి ఇళ్ళలో పనికాగానే వాళ్ళింటికి వెళ్ళి సాయంత్రం అయిదింటి వరకు ఆమె చెప్పిన పనల్లా చేసి వెళ్తున్నది.

ఎంతైనా పాతికవేలంటే సామాన్యమా?" నోరెళ్ళబెట్టి చెప్పింది మా శ్రీమతి. " మంచిదే కదా. ఇంకో యాభైవేలు ఉంటే చాలు కదా. మనం కూడ ఎంతో కొంత ఇద్దాములే" అన్నాను. ఇంతలో రాజేశ్వరి కేక పెట్టడంతో వెళ్ళిపోయింది సునంద. మనలోమాట ఎందుకో మా పనిమనిషంటే మా ఆవిడకు వల్లమాలిన అభిమానం. అది కూడ ఇదంటే ప్రాణం పెడుతుంది. ఒక్కరోజు కూడ నాగా పెట్టదు.

కన్నతల్లిని కనిపెట్టుకుని చూసినట్లు చూస్తుంది. ఏ పని చెప్పినా సరే, చెయ్యను అని మాత్రం అనదు. అందుకే సునందకు రాజేశ్వరి అంటే అంత ఇష్టం. పైగా మా ఇద్దరు పిల్లలు అమెరికాలో ఉండడంతో రాజేశ్వరితో మాట్లాడుతూ, అప్పుడప్పుడూ అరుస్తూ దానిలో తన పిల్లలను చూసుకుంటుంటుంది సునంద. స్వతహాగా నేను పెద్ద మాటకారిని కాదు గనుక. నన్ను చూస్తే కొంచెం భయపడుతుంది రాజేశ్వరి. నేను కూడ ఇంటి విషయాలలో తలదూర్చను. అంతా సునందే చూసుకుంటుంది. నేను మాత్రం నా రాతలపిచ్చిలో కాలం గడుపుతుంటాను. రాలే కాసులు శూన్యమైనా అదో తుత్తి. అంతే. సరే నేను కూడ ఒక పదివేలు ఇద్దాంలే అనుకున్నాను మనసులో. *

*******

ఉదయాన్నే పూజ చేసుకుని బజారుకు బయలుదేరబోతుంటే సునంద చెప్పింది. " ఏమండీ ఇందాక వాణి గారు ఫోను చేశారు. వాళ్ళాయనను కొంచెం బ్యాంకు దాకా అట బండి మీద తీసుకెళ్ళండి. ఏదో డబ్బు తీసుకుంటాడట. మీ స్నేహితుడు ఉన్నాడటగా బ్యాంకులో. కొంచెం సహాయం చేయండి. పాపం పెద్దాయన ఎక్కువసేపు నిలబడలేకపోతున్నాడట" పరోపకారిలా సలహా పారేసింది. " ఊరంతా వాళ్ళకు చుట్టాలేకదే. మనలనెందుకు అడగడం."

" ఇరుగు పొరుగు అన్నాక ఆమాత్రం చేసుకోకపోతే ఎలా. ఆయన కింద సెల్లారురో పేపరు చూస్తున్నాడట. మీతోపాటు తీసుకెళ్ళండి." అని చెప్పేసి వెళ్ళిపోయింది సునంద. కిందికి వెళ్ళేసరికి వాణి భర్త ఆనందరావు గారు నా కోసమే చూస్తున్నారేమో, నన్నుచూసి లేచి నా బైకు దగ్గరికి వచ్చారు.

" నీకోసమే చూస్తున్నా వాసు. పెద్దవాడినయ్యా కదా. కొంచెం చూపు ఆనడంలేదు. బ్యాంకులో డబ్బు డ్రా చేసుకోవాలి. కొంచెం నీ బండిమీద తీసుకెళ్ళగలవా?" " భలేవారే సర్. ఇప్పుడే సునంద చెప్పింది. రండి వెళదాం" అని ఆయనను బండెక్కించుకుని బ్యాంకుకు తీసుకెళ్ళి ఒక లక్ష రూపాయలు ఇప్పించి తీసుకొచ్చి అపార్టుమెంటులో దించాను. దారిపొడుగునా ఆయన చేసిన దానాల గురించి, దేవుడికి చేసే పూజల గురించి చెపుతూ చెవులు తినేశాడు " వాసు ఏమిలేదయ్యా. మనలోమాట. మా సొంతవూరిలో రాములవారి దేవాలయం ఉందికదా.

దానికి ఊరంతా కలసి మరమ్మత్తులు చేపడుతున్నారు. నన్ను కూడా కొంచెం సాయం చెయ్యమన్నారు. పదో, పరకో ఇస్తే మందిలో కలిసిపోతుంది కదా. అందుకని దేవుడికి కొత్త వెండికిరీటం చేయిస్తానన్నాను. అలా అయితే మనపేరు మిగిలిపోతుంది కదా. ఆ దేవుడికి కూడ తెలుస్తుంది మన భక్తి. అందుకే ఈ డబ్బు తెచ్చాను. వాళ్ళు రేపు వస్తారట." రామదాసు లెవల్లో చెప్పాడు ఆనందరావు. నాకు కూడ అందులో కొంత నిజం ఉందనిపించింది. పైగా మా ఆవిడ ఇప్పటికే వాణిగారు రాజేశ్వరికి ఇరవై వేలు పెళ్ళికి సహాయం చేస్తానన్నారనే ఉప్పందించింది కదా. ఈయన మానవసేవే కాదు మాధవసేవ కూడ చేస్తారని అనిపించింది. పోనీలే ఉన్న డబ్బును సద్వినియోగం చేస్తున్నారనిపించి, ఆయనకు అనుకూలంగా రెండు మాటలు మాట్లాడి, నా పనిమీద నేను మరల బయటకు వెళ్ళిపోయాను.

****

" ఏమండీ విన్నారా ఈ విడ్డూరం " అంటూ నోరు నొక్కుకుంది మా శ్రీమతి, నాకు భోజనం వడ్డిస్తూ " ఏమైందేమిటి " అన్నాను నింపాదిగా " అదే వాణిగారు ఉన్నారు కదా. ఆమె రాజేశ్వరి కూతురు పెళ్ళికి ఇరవైవేలు సహాయం చేస్తానని చెప్పిందికదా. గుర్తుందా మీకు"

" ఇప్పుడు ముప్ఫై వేలు ఇచ్చిందా. మంచిదే కదా. ఇందులో విడ్డూరమేముంది" " నన్ను చెప్పనివ్వరు కదా. ఎంతసేపటికి మాట తుంచేసి లేచిపోదామనే" " సరే చెప్పు" " ఆమె ఇవాళ పొద్దున దాన్ని పిలిచి ఒక అయిదు పాత పట్టుచీరలు ముందేసి, 'ఇవి చాలా ఖరీదైన చీరలు, ఒక్కొక్కటి ఆరువేలు చేస్తాయి. ఇవి తీసుకిళ్ళి మీ కూతురు, నీవు, మీ అమ్మ అందరూ కట్టుకోండి పెళ్ళికి' అని చెప్పి, ' నేను నీకు ఇరవై వేలు ఇస్తానన్నాను కదా, ఇప్పుడు నీకు ముప్ఫై వేల రూపాయల పట్టుచీరలిస్తున్నాను. ఘనంగా తీసుకెళ్ళు' అన్నదట.

దాంతో దీనికి నోట మాటరాలేదు. రేపోమాపో పిగిలిపోయే చీరలిచ్చి ఎంత మాయచేయబోయిందండి ఆవిడ" " మరి డబ్బులు ఇస్తానంది అన్నావుగా మొన్న. సరే దానికి రాజేశ్వరి ఏమన్నది" " ముందు దానికి ఏంచెయ్యాలో అర్థం కాలేదట. వెంటనే వాళ్ళ అమ్మకు ఫోను చేసింది. వాళ్ళమ్మ ఆశ్చర్యపోయి.' మనకు చీరలు వద్దు. పెళ్ళికూతురికి చినిగిపోయే పాత చీర కట్టనక్కరలేదు. మన శక్తి కొద్ది సిల్కు చీరే కడదాం. నువ్వు, నేను పట్టుచీరలు కట్టి పాచిపనికి పోలేము కదా. ఇస్తే ఎంతోకొంత సొమ్ము ఇవ్వమను. లేకుంటే లేదు. చీరలు మాత్రం తేవద్దు' అని చెప్పిందట. దానికి వాణిగారికి కోపం వచ్చి 'పనిపిల్లకు అంత బలుపు పనికిరాదు. ఇష్టమైతే తీసుకో లేకపోతే లేదు. డబ్బులుగా పైసా కూడ ఇవ్వనన్నదట. పాపం రాజేశ్వరి దిగులుపడింది. దానికి మరల అప్పు బాధ తప్పలేదు"

" సరే దానికి మనమేమి చేద్దాం. అయినా ముందు మెహర్బానీగా చెప్పడమెందుకు. ఇప్పుడు లేదనడమెందుకు. వాళ్ళమ్మ చెప్పింది నిజమేగా. ఈ కోవిడ్ సమయంలో పాపం వాళ్ళకు రాను, పోను కార్ల బాడుగే చాలా అవుతుంది. నిజమే వాళ్ళకిప్పుడు చేతిలో డబ్బుకావాలి కాని, పట్టుచీరలు ఎందుకు?" నా మనసులో మాట అన్నాను. " ఆమె పథకం ఇంకా మీకు అర్థం కాలేదు. ఉన్న పాతచీరలు వదిలించుకుని బీరువా ఖాళీచేసి, పట్టుచీరలిచ్చామని గొప్పగా చెబుతూ దాని చేత వెట్టిచాకిరీ చేయించుకుందామని. ఏం తెలివితేటలండీ జనాలకి"

" ఆయన మొన్న దేవుడికి లక్షరూపాయలు పెట్టి వెండికిరీటం చేయిస్తున్నానన్నాడు. అంత డబ్బున్న వాడు ఒక పదివేలు ఆ పేదపిల్ల పెళ్ళికి ఇస్తే అరిగిపోతాడా" నా మనసుకు కొంచెం బాధగానే అనిపించింది. " అంతేనండి. కనిపించని దేవుడికి లక్షలు, లక్షలు పెడతారు. మనింట్లో పనిచేసే పిల్లలకు పది రూపాయలివ్వాలంటే ఏడ్చి చస్తారు. ఏదో ఒకరకంగా మనమే దానిని ఆదుకోవాలండీ పాపం"

" మనవంతుగా ఇచ్చాము కదే పదివేలు. మనం కూడ రిటైరయిన వాళ్ళం. ఎంతని చెయ్యగలం" " పోనీ ఒక పని చేద్దాం. కష్టంలో కష్టం. ఇంకో పదివేలు ఉచితంగా ఇచ్చి, ఒక ఇరవై వేలు వడ్డీలేకుండా ఇద్దాం. మనకు మాత్రం ఆ బ్యాంకులో వచ్చేది ఆరు శాతమే కదా. నెలకు ఇంత అని కత్తిరించుకుందాం. లేకపోతే అది మరల ఎక్కడో ఒకచోట అయిదు రూపాయల వడ్డీకి తెచ్చుకోవాలి. పాపం దాని శ్రమంతా వడ్డీలకే పోతుంది అప్పుడు" సునంద ముఖంలో జాలి తొంగిచూసింది. ఆ మాటలతో ఆలోచనలో పడ్డాను. నిజమే తను చెప్పింది. ఆడపిల్ల పెళ్ళంటే మాటలు కాదు. ఆ కష్టాలు స్వయంగా అనుభవించినవాడిని. సునంద మాటలలో నిజం కనిపించింది. పిల్లలకు మేమేమీ పెట్టనక్కరలేదు. రాజేశ్వరి ముఖం కళ్ళముందు మెదిలింది. ఒకవైపు తాగుబోతు భర్త, పదవ తరగతి చదువుతున్న కొడుకు. బ్రతుకంతా ఈ పాచిపని మీద వచ్చిన డబ్బులతో వెళ్ళిపోవాలి. సరేకానీ అనుకుని, సునందకు సరేనని చెప్పాను. తెగ ఆనందపడిపోయింది. కానీ మనమిలా సహాయం చేస్తున్నామని ఎవరికీ తెలియకూడదని చెప్పాను. సరేనని తలూపింది. ****** " ఏమోయ్ వాసు ఎక్కడికి బయలుదేరావు " పలకరించాడు ఆనందరావు సెల్లారులో బండి తీస్తున్న నన్ను. " కూరలకు సర్ " ముక్తసరిగా అన్నాను, మొన్న విషయం తెలిశాక అతని మీదనున్న మంచి అభిప్రాయం పోయింది నాకు " రాజేశ్వరి కూతురు పెళ్ళికి పదివేలు సహాయం చేస్తున్నావటగా. ఎందుకయ్యా పనివాళ్ళకు అంతంత డబ్బులివ్వడం. నాలుగు పాత చీరెలో, ఏ వెయ్యి రూపాయలో ఇస్తే సరిపోతుందిగా. మేము పట్టుచీరలిస్తుంటే వద్దని వెళ్ళిపోయింది. అంత తలపొగరు పిల్లకు పదివేలు ఇస్తావా. మీలాంటి వాళ్ళేనయ్యా పనివాళ్ళను పాడుచేసేది. మీలాంటి వాళ్ళ అండ చూసుకునే ఈ రోజుల్లో పనివాళ్ళు లెక్కలేకుండా తయారయ్యారు.

ఆ పదివేలు మా గుడికి ఇచ్చివుంటే పుణ్యమైనా వచ్చేది." నేనేదో తప్పు చేసినట్లు మాట్లాడాడు ఆనందరావు. మనసు చివుక్కుమంది. పెద్దవాడని వదిలేద్దామనుకున్నా, కాని నా మనసు నా మాట వినలేదు. " మీరు దేవుడికి వెండికిరీటం చేయిస్తున్నామన్నారు. నేను ఎందుకు అని ప్రశ్నించానా. కనిపించని దేవుడి మీద నమ్మకం మీది. దాన్ని నేను తప్పు పట్టను. అది మీ ఇష్టం. పేదపిల్ల పెళ్ళి ఇది. సమయానికి డబ్బు లేకపోతే ఆగిపోతుంది. ఇది నిజం. నేను నిజాన్ని చూశాను. కనిపించే మనిషికి సహాయపడితే నా చేతిలో డబ్బుకు సార్థకత అనుకున్నాను. ఆకలయ్యేవాడికి అన్నం పెట్టాలనుకునే మనస్తత్వం నాది. ఊరేగే దేవుడికి నైవేద్యం పెట్టాలనే మనస్తత్వం మీది. మీ వరకు మీది కరెక్ట్. నా వరకు నాది కరెక్ట్. మీరు నమ్మకానికి విలువ ఇచ్చారు.

నేను నిజానికి విలువ ఇచ్చాను. అంతే తేడా. పెద్దవారు మిమ్మల్ని నొప్పిస్తే క్షమించండి. సాటి మనిషి కన్నీటిని తుడవకుండా, నాకు నగలు చేయించమని ఏ దేవుడూ కోరడు. ఎందుకంటే అందరూ ఆయన బిడ్డలే. ఆయన మనకు స్తోమత కల్పించేది, లేనివారికి మనం చేదోడువాదోడుగా ఉంటామనే. వస్తానండి" అని బండి స్టార్ట్ చేశాను, మరో మాటకు ఆస్కారమివ్వకుండా. నా మాట కటువుగా ఉన్నా, అందులోని భావం అర్థం చేసుకుంటే కనీసం అయిదువేలయినా ఆ పేదపిల్ల పెళ్ళికి సహాయంగా ఇవ్వకపోతాడా అనే ఆశ.

మరిన్ని కథలు

Aame kavvinchindi
ఆమె కవ్వించింది
- తాత మోహనకృష్ణ
Chandruniko noolu pogu
చంద్రునికో నూలు పోగు
- కాశీవిశ్వనాధం పట్రాయుడు/kasi viswanadham patrayudu
Anaadha atidhyam
అనాథ అతిథ్యం
- - బోగా పురుషోత్తం
Vibheeshana Sharanu
విభిషణుని శరణు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Srivariki prema lekha
శ్రీవారికి ప్రేమలేఖ
- తాత మోహనకృష్ణ
Ramdaas formula
రాందాస్ ఫార్ములా
- వీరేశ్వర రావు మూల
Attagari samrajyam
అత్తగారి సామ్రాజ్యం
- బొబ్బు హేమావతి