స్నేహధర్మం - చెన్నూరి సుదర్శన్

Friendship

“ఒరేయ్! ఆనంద్.. ఒక రహస్యం చెబుతానరా.. పర్సనల్. ఇది మన ఇరువురి మధ్యనే ఉండాలి” అనగానే అనిల్ వంక ఆశ్చర్యంగా చూశాడు ఆనంద్.

“పద.. అలా పార్కులో కూర్చొని మాట్లాడుకుందాం” అంటూ.. అనిల్, ఇందిరా పార్కులో ఓ మూలకు దారి తీశాడు.

అనిల్, ఆనంద్ కూకట్­పల్లి కాలేజీలో డిగ్రీ ఫైనలియర్.. బాల్యస్నేహితులు. వారిద్దరి మధ్య ఎలాంటి రహస్యాలుండవు.. పొరపొచ్చాలూ లేవు. అలాంటిది అనిల్ నేడు ఒక రహస్యం. పైగా అది తన పర్సనల్ మ్యాటర్, అంటున్నాడని ఆనంద్ ఆలోచిస్తూ.. అనిల్­ను అనుసరించాడు.

“ఇది గత సంవత్సరం నుండి నా మనసులో అలజడి రేపుతోందిరా..!” అంటూ.. ఎలా మొదలు పెట్టాలో తటపటాయించసాగాడు అనిల్.

“అంటే.. నామీద అనుమానమారా! ఇన్నాళ్ళుగా ఆ రహస్యాన్ని నీలోనే దాచుకున్నావు” అంటూ చిరు కోపం ప్రదర్శించాడు ఆనంద్.

“ఛ.. అది కాదురా..” అంటూ చిరునవ్వు నవ్వుకుంటూ.. ఆనంద్ భుజంమ్మీద అరచేత్తో సుతారముగా తట్టాడు అనిల్. “నీకు గాకుండా మరెవ్వరికి చెప్పుకుంటానురా.. మంచి సలహా ఇవ్వు” అంటూ తన ఎదలోని వ్యధను కళ్ళకు గట్టినట్టుగా చెప్పసాగాడు.

“గత వేసవి సెలవుల్లో నేను బొటానికల్ టూర్ వెళ్లానని తెలుసు గదా!” అంటూ.. కళ్ళకు కట్టినట్టు చెప్పడం మొదలు పెట్టాడు.

***

అదొక పల్లెటూరు..

పల్లె అందాలన్నీ ఒలుక పోసుకుని తీర్చి దిద్దిన బాపుబొమ్మ భానుమతి. తల్లిదండ్రులకు ఒక్కగానొక్క గారాల పట్టి. ఊళ్ళో ఉన్నంత వరకు చదివింది. పైచదువులకు పట్నం పంపడం ఇష్టం లేక చదువుకు స్వస్తి చెప్పించారు తల్లిదండ్రులు. ఇష్టం లేక కాదు గాని భయం. ప్రేమిస్తున్నానంటూ అబ్బాయిలు వెంటపడడం.. వేధించడం. ప్రేమించడం లేదంటే.. వికృతచేష్టలతో రూపుమాపడం. ఎన్ని చట్టాలున్నా.. వాటిని చుట్టాలుగా మలుచుకుని.. శిక్షలనుండి తప్పించుకోవడం.. రివాజుగా మారిన కాలమిది.

ఊళ్ళో చదువుతో సరిపెట్టి, మూడు ముళ్ళు వేయిస్తే.. తమ గుండెల మీది బరువు దించుకున్న వాళ్ళమవుతామని భానుమతి తల్లిదండ్రుల ఆలోచన.

ఆరోజు యధావిధిగా తెలుగింటి ఆడపడుచులా.. ఊళ్ళోని రామాలయానికి బయలు దేరింది భానుమతి. ప్రతీ రోజు గుడికి వెళ్ళడం.. తన తల్లిదండ్రుల పేరు మీద అర్చన చేయించడమంటే తనకిష్టమైన పనుల్లో ప్రధానమైనది.

భానుమతి తీర్థప్రసాదాలు అందుకుని కళ్ళకద్దుకుని సేవించింది. ఆనవాయితీ ప్రకారం కాసేపు గుళ్ళో కూర్చుని తిరిగి ఇంటికి దారి తీసింది.

“హలో.. నా పేరు అనిల్­కుమార్” అంటూ తనకు తాను పరిచయం చేసుకుంటూ.. పిలిచేసరికి ఆశ్చర్యంగా తల వెనుకకు తిప్పి కోపంగా చూసింది భానుమతి.. ‘ఏమిటి?’ అన్నటుగా.

తాను గుడికి బయలు దేరినప్పటి నుండి అతను వెన్నంటి రావడం గమనిస్తూనే ఉంది. కాని ఇంత ధైర్యంగా ఈ పల్లెటూళ్ళో తనను పలికరించే సాహసం చెయ్యడం ఇదే ప్రధమం.

“మీ పేరు తెలుసుకోవచ్చా..” అంటూ మరో ప్రశ్న వేయడం భానుమతి భయపడుతూ.. అటూ, ఇటూ చూసింది తనను ఎవరైనా గమనిస్తున్నారా! అన్నట్టుగా. అది అర్థం చేసుకున్న అనిల్..

“మనల్ని ఎవరూ చూడ్డం లేదు” అంటూ ధైర్య వచనాలు పలికాడు.

అనిల్ వంక వాడి చూపులు సంధించి వడి, వడిగా వెళ్ళి పోయింది భానుమతి.

అది ప్రథమ రోజు అనిల్ అనుభవం.. ప్రథమ చూపులోనే భానుమతి అతని మదిని చెదరగొట్టి.. నాటిన ప్రణయ బీజాన్ని అంకురింప జేయాలనుకున్నాడు.

రెండవ రోజు కార్యక్రమానికి రూపు రేఖలు దిద్దుకుని భానుమతి ముందు ప్రత్యక్షమయ్యాడు.

“నేను వివరాలన్నీ తెలుసుకున్నాను. నాకు పట్నవాసపు అమ్మాయిలంటే ఎలర్జీ.. పల్లెటూరి అమ్మాయిల కున్నంత నిష్కల్మషత్వం, పట్టణ అమ్మాయిలలో ఉండదు. పైగా పల్లెవాసులు మేలిమి బంగారమని నా.. ” అంటుంటే అనిల్ మాటలను మధ్యలోనే కట్ చేస్తూ..

“చూడు మిస్టర్.. ముక్కూ, మొహం తెలియని వానితో నేను మాట్లాడను. నీ పని నువ్వు చూసుకో. లేకుంటే మర్యాద దక్కదు” అంటూ భానుమతి పరుగులాంటి నడక అందుకో బోయింది.

చటుక్కున ఆమె మార్గానికి అడ్డు తగిలాడు అనిల్.

“అలా అన్నావు బాగుంది. వేయి వరహాల మాట అది. నీనోట ముత్యాల మూట” మూట ముడి విప్పుకుని వరహాలు రాలితే ఏరుకుంటాను అన్నట్టుగా, అనిల్ చిరునవ్వు నవ్వుతూ..

“నా పేరు అనిల్. నేను కూకట్ పల్లి కాలేజీలో డిగ్రీ చదువుతున్నాను. మీ అమ్మా, నాన్నల మాటను జవదాటవని నాకు తెలుసు. నీకు నీ మేనబావతో పెళ్లి చెయ్యాలని చూస్తున్నారని తెలుసుకున్నాను. అదే విషయం నీతో మాట్లాడుదామని”

“ఏం మాట్లాడుతావ్? నీకు మా కుటుంబ విషయాలెందుకు?” రాలితే ఎరుకునేవి వరహాలు కావు నీ పళ్ళు అన్నట్టుగా చురక అంటించింది భానుమతి.

“నీ మంచికే చెబుతున్నాను. మేనరికం పెళ్ళిళ్ళు వద్దని మన శాస్త్రవేత్తలు కోడై కూస్తున్నారు. అయినా మన వాళ్ళు కొందరు పెడ చెవిన పెడ్తున్నారు. దాని పర్యవసానాలు చూసి గూడా మారడం లేదు. మానసికవైకల్య సంతానాన్ని పొంది మనఃశ్శాంతి లేకుండా బ్రతుకుతున్నారు” అంటూ ఇంకా సాగదీయ బోవడం గమనించి..

“థాంక్స్.. ఇక నీ పని నువ్వు చూసుకో” అంటూ ముందుకు కదిలింది భానుమతి.

“ప్లీజ్.. చివరగా ఒక మాట” అంటూ ప్రాధేయపూర్వకంగా అడిగే సరికి.. ఏంటది’ అన్నట్టుగా ప్రశ్నార్థకంగా చూసింది. నడకలో కాస్త వేగం తగ్గించి..

“ముందుగా నీ సమ్మతి తీసుకున్నాక, మీ ఇంటికి నా పేరంట్స్ ను పంపిస్తాను. నేను మొదటి చూపులోనే నిన్ను ఇష్ట పడ్డానని, మన పెళ్లి ప్రస్తావన తీయిస్తాను. అది గూడా నా డిగ్రీ పూర్తయ్యకనే..” అంటూ వేడుకోలుగా చూశాడు ఆనిల్.

భానుమతి గుండె ఝల్లు మంది. అలాంటి ఊహించని మాట వినాల్సిరాగానే..

“చెప్పు తీసుకుని కొడతా రాస్కెల్!.. ఏమనుకుంటున్నావురా! పల్లెటూరి పిల్ల పౌరుషం చూపిస్తా..” అంటూ కళ్ళల్లో నిప్పులు కురిపిస్తూ.. వంగి చెప్పు తీయ బోయింది. భయంతో నాలుగడుగులు వెనక్కి వేశాడు అనిల్.

“మా ఊరికి కొత్తవాడిలా కనబడుతున్నావు. ఇంకా నాసంగతి తెలియదనుకుంటాను. నీ కాళ్ళు విరిచి చేతిలో పెట్టి పంపిస్తా” అంటూ చూపుడు వేలితో బెదిరించింది. నోటికి వచ్చిన తిట్లు తిట్టుకుంటూ.. పరుగు అందుకుంది భానుమతి.

***

కన్నీళ్లు పెట్టుకోసాగాడు అనిల్.

“అమ్మాయిలు మొదట అలాగే బిగుసుకుంటార్రా. మరో మారు కలిసి నువ్వూ బెదిరించక పోయావా?” ఆనంద్ మాటలతో ఈలోకానికొచ్చాడు అనిల్.

“మళ్ళీ కలిశానురా. నా మనఃస్తత్వం తెలుసుగదా..! మంచి మాటలతో మనువాడుదామనుకున్నాను.. కాని ప్రతీ సారి ఆమె లోని కోపం ద్విగుణీకృతమవుతోంది. ఇప్పుడు ఫైనల్­గా ఏం చెయ్యాలో సలహా ఇవ్వరా”

“అలా మంచి మాటలతో దారికి రానప్పుడు.. సాహస నిర్ణయం తీసుకోవాలి. మనకు దక్కని శాల్తీని మరెవ్వరికీ దక్కకుండా తగినశాస్తి చెయ్యాలి” అంటూ కోపంగా ముక్కుపుటాలెగరవేస్తూ.. “ముఖాన్ని ఆసిడ్­తో కాల్చడం.. చాలా సులువైన పధ్ధతి. పైగా సులభంగా తప్పించుకోవచ్చుగూడా.. ఇంతకూ నువ్వు ఏ ఊరెళ్ళావో చెప్ప లేదురా. అమ్మాయి పేరేంటి?” అడిగాడు ఆనంద్.

“ములుగు జిల్లా దగ్గర జంగాలపల్లిరా.. అమ్మాయి పేరు భానుమతి” అంటూ నొసలుకు చెయ్యి పెట్టుకున్నాడు అనిల్ దిగాలుగా.

“భానుమతి తల్లిదండ్రులు..”

“కళావతి, సారంగపాణి”

“నో..” అంటూ వెర్రికేక వేశాడు ఆనంద్.

ఏమయ్యిందన్నట్టుగా గుడ్లు తేలేసి చూశాడు అనిల్.

నిముషం పాటు ఇద్దరి మధ్య సాగిన మౌనం, ఆతృతగా వేచి చూడసాగింది వారి మాటల కోసం.

కాసేపటికి ఆనంద్ భజం తట్టాడు అనిల్.

ఆనంద్ తెప్పరిల్లి.. “ప్లీజ్ వద్దురా.. అనిల్. భానుమతిని మర్చిపో..” అంటూ అనిల్ గదుమ పట్టుకున్నాడు.

“ఎందుకురా?”

“ఆమె నాకు చెల్లెలు అవుతుందిరా. మా దూరపు బంధువు పెద్దమ్మ కూతురు”

“పద్మజ గూడా ఒకరి చెల్లెలే కదరా! మరి నువ్వో!”

ఆనంద్ ఆశ్చర్య పోయాడు. నా విషయం ఎలా తెలిసిందా అని ‘నేనేంటి’ అన్నట్లు ప్రశ్నార్థకంగా చూశాడు.

“నేను ఏడాదిగా ప్రేమిస్తున్న భానుమతిని మర్చిపొమ్మంటున్నావు. నువ్వు పది రోజుల క్రితం పరిచయమైనా పద్మజను ఆమె మానాన ఆమెను వదిలేస్తావా? పూర్తిగా మర్చిపోయి!”

ఆనంద్ గుండెల్లో రైళ్ళు పరుగెత్తాయి. శ్వాస బిగుసుకు పోయింది..

“పద్మజ ఎవర్రా?” అంటూ బుకాయించాడు ఆనంద్. మేకపోతు గాంభీర్యంతో..

“స్నేహితుల మధ్య రహస్యాలు ఉండొద్దని.. నువ్వు చేసిందేమిటి? నా మీద నమ్మకం లేదారా!. నాకెందుకు చెప్ప లేదు” అంటూ కాస్త ఘాటుగా అడిగాడు అనిల్.

ఆనంద్ నోట మాటలు కరువయ్యాయి. ‘అనిల్­కు ఎలా తెలిసింది?.. ఇంకా విషయం సాంతం తెలిసినట్టేనా!’ అని దీర్ఘాలోచనలో పడ్డాడు. తన పని నిర్విఘ్నంగా జరుగాలంటే మూడో కంటికి తెలియద్దనుకున్నాడు.

“నిజంరా.. పద్మజ ఎవరో నాకు తెలియదు” అంటూ గంభీరంగా బుకాయించాడు.

“నాకు మన కెమిస్ట్రీ ల్యాబ్ కొమురయ్య చెప్పాడు”

“ఇది మరీ చోద్యంగా ఉంది”

“చోద్యమే మరి.. ల్యాబ్ నుండి గాఢసల్ఫ్యూరిక్ ఆసిడ్ బాటిల్ దొంగిలించడం చోద్యంగాదారా!”

ఆనంద్ గుండె ఝల్లు మంది.. అయితే కొమురయ్య చూసి ఉంటాడు. తను ఎవరికీ తెలియకుండా చేబట్టపోయిన పనికి ఒక ఆధారం దొరికిందన్నమాట. ఒంట్లో సన్నగా వణుకు పుట్టింది. తల దించుకున్నాడు.

“చూడు ఆనంద్.. ఏదైనా పని చేసే ముందు కనీసం ఒక స్నేహితుని సలహా తీసుకోవడం చాలా మంచిది. అతను చెప్పింది విని.. ఆ తరువాత స్వంతంగా నిర్ణయించుకోవాలి. పైగా ఒక వాస్తవంగూడా గుర్తుంచుకో.. మనం ఏ పనీ చేసినా ఎవరూ గుర్తించరని అనుకోవడం పొరబాటు. కళ్ళు మూసుకుని పిల్లి పాలు తాగినట్టు. ఆ సర్వంతర్యామి సదా మనల్ని, మన పాడు పనులను ఒక కంట కనిబెడుతూనే ఉంటాడు. ఆ భయం మనలో తప్పనిసరిగా ఉండాలి. అప్పుడే మనం పాపపు కృత్యాలు చేయడానికి సాహసించం.. ” అంటుంటే మధ్యలోనే..

“ఇప్పుడు నేనేం చేశాననిరా” ఏదో గీతోపదేశం చేస్తున్నావు?” అంటూ ఆనంద్ మరింత మండి పడ్డాడు.

“చేశావని గాదురా.. చేయబోయావని”

“శుద్ధ అబద్ధం.. ల్యాబ్ నుండి ఆసిడ్ తీసుకున్నంత మాత్రాన తప్పుడు పనులు చేస్తాననా?” అంటూ ఆనంద్ లేవబోయాడు. అనిల్ శాంత పరుస్తూ.. “ఇంకా నా గీతోపదేశం సంపూర్ణం కాలేదురా.. ఒక్క నిముషం” అంటూ ఆనంద్­ను లేవకుండా అడ్డుకున్నాడు అనిల్.

“ల్యాబ్ నుండి ఆసిడ్ ఎందుకోసం తస్కరించావో.. నాకు చెప్పలేదని.. నీమీద అనుమానం కలిగింది. ఈ మధ్య అప్పుడప్పుడు నన్ను తప్పించుకుని తిరగడం.. నువ్వు పద్మజను కలుస్తూండడం.. నేను రహస్యంగా గమనించాను. నా అనుమానం బలపడింది.

నిన్ననే నాకు పద్మజ అన్నయ్య కలిశాడు.. అతని మాటల్లోనే చెబుతాను విను.. అంటూ పద్మజ అన్నయ్య మాటలను యధాతదంగా వినిపించసాగాడు.

“అనిల్.. నీ స్నేహితుడు ఆనంద్ చేస్తున్న పనికి నరికి పోగులు పెట్టగలను. కాని అలా చేసే ముందు అతణ్ణి దారిలో పెడుతావన్న, నీ మీద నమ్మకంతో ఒక మాట చెబుతున్నాను. ఆవేశంలో ఎవరమైనా ఏదైనా ఒక్క క్షణంలో చేసెయ్యవచ్చు. కాని దాని పర్యవసనం.. జీవితాంతం దుఃఖించాల్సి ఉంటుంది.

ఆనంద్ నా చెల్లెలు పద్మజను వెంటబడి వేధిస్తున్నాడట. ఒకరు తాను ప్రేమింపబడితే అదృష్టమే గాని తమ ప్రేమను ఎదుటి వారిపై రుద్ది తనను బలవంతంగా ప్రేమించమనడం రాక్షసత్వం. దాని మూలాన విద్యార్థి దశలోనే తమ బంగారు భవిష్యత్తును బండలు చేసుకుంటున్నారు. నువ్వు ఎలాగైనా నచ్చజెప్పి నీ స్నేహితుణ్ణి కాపాడుకో..”

“వింటున్నావా ఆనంద్.. ఇది అతడు ఇచ్చిన వార్నింగ్.

నేను రాత్రంతా బాగా అలోచించాను. ఎలా మన స్నేహం చెడకుండా.. నిన్ను ఎలా కాపాడుకోవాలా! అని మదన పడుతున్నాను. నువ్వు కాస్త ఆవేశాపరుడివేనని తెలుసు గాని ఇలాంటి విషయాలలో నీ నిర్ణయం తెలుసుకుందామని భానుమతి కథ చెప్పాను. వాస్తవానికి భానుమతి నీ చెల్లెలని నాకు తెలుసు. నేనా ఊరికి బటానికల్ టూర్ వెళ్లానని నీకు తెలుసు. కాని భానుమతిని కలిసింది నా కల్పితం.

ప్రేమ నిరాకరణ విషయంలో నీ ఆలోచనా ధోరణి తెలుసుకుందామని కథ అల్లాను. నీ నైజం బయట పడింది. ఆసిడ్ దాడి చెయ్యమన్నావు.

మనం ఇంకా జీవితంలోనే స్థిరపడలేదు. ఇప్పుడే ప్రేమలు.. ఎందుకు చెప్పురా? నీ ఆలోచనా ధోరణి తప్పురా ఆనంద్. చెప్పడం నా స్నేహధర్మం” అంటూ కన్నీళ్ళు పెట్టుకోసాగాడు అనిల్.

ఆనంద్ బిగ్గరగా రోదిస్తూ.. అనిల్ మీద వాలి పోయాడు. తప్పు తెలుసుకుని.. ప్రాయశ్చిత్తుడవుతున్న ఆనంద్­ను చూసి తన ప్రయత్నం ఫలించినందుకు అనిల్ మనసు తేలిక పడింది. *

మరిన్ని కథలు

Srivariki prema lekha
శ్రీవారికి ప్రేమలేఖ
- తాత మోహనకృష్ణ
Ramdaas formula
రాందాస్ ఫార్ములా
- వీరేశ్వర రావు మూల
Attagari samrajyam
అత్తగారి సామ్రాజ్యం
- బొబ్బు హేమావతి
Pramod Pesarattu
ప్రమోద్-పెసరట్టు
- వీరేశ్వర రావు మూల
Atanu aame madilo
అతను ఆమె మదిలో
- బొబ్బు హేమావతి
Atani kannu aame meeda padindi
అతని కన్ను ఆమె మీద పడింది
- బొబ్బు హేమావతి
Kottha ugadhi
కొత్త ఉగాది
- తాత మోహనకృష్ణ
Pallavi
పల్లవి
- తటవర్తి భద్రిరాజు