చెల్లెలి విలువ (బాలల కథ) - సరికొండ శ్రీనివాసరాజు‌

Sister Value (Children's Story)

"ప్లీజ్! నాకు రిమోట్ ఇవ్వవా! పొద్దటి నుంచి నువ్వే చూస్తున్నావు టి. వి. నాకు అస్సలు ఇవ్వవు.రోజూ నీదేనా ఆధిపత్యం?" అన్నాడు జయంత‌. "నువ్వు రోజూ గంటల తరబడి నీ స్నేహితులతో ఆడుకొని వస్తావు. నేను ఆడుకోవడానికి ఎవరు ఉన్నారు చెప్పు?" అన్నది వాశిష్టి. "మర్యాదగా రిమోట్ ఇస్తావా లేదా?" అన్నాడు జయంత. "ఇవ్వను పో." అంది వాశిష్టి. సహనం నశించిన జయంత వాశిష్టిని కొట్టాడు. వాశిష్టి ఏడ్చుకుంటూ వెళ్ళి తల్లిని చేరింది.

తల్లి శివాని జయంతను బాగా తిట్టింది. వాశిష్టిని దగ్గరకు తీసుకొని ఓదార్చింది. ఇది కొత్తేమీ కాదు. రోజూ అన్నా చెల్లెళ్ళ మధ్య టి‌. వి. కోసమో, సెల్ ఫోన్ కోసమో గొడవ ఉండాల్సిందే. జయంత చాలా తెలివైన అబ్బాయి. ఎంత కఠినమైన పాఠం అయినా ఒక్కసారి వినగానే గ్రహిస్తాడు. రోజూ అన్ని సబ్జెక్టులు చదవడానికి 10 నిమిషాలు చాలు అతనికి. మిగతా సమయం అంతా బోర్ కొట్టి బయట స్నేహితులతో క్రికెట్, ఇంట్లో ఉంటే చెల్లెలితో కొట్లాటలు. ఈసారి కొట్టిన దెబ్బకు వాశిష్టి బాగా ఏడ్చింది. అలిగి అన్నం కూడా తినలేదు. ఈ విషయం వాశిష్టి తల్లి శివానీ ద్వారా వేరే ఊరిలో ఉన్న వాశిష్టి అమ్మమ్మకు తెలిసింది. ఫోన్ ద్వారా అమ్మమ్మ వాశిష్టిని బుజ్జగించింది. "అయినా అస్తమానం టి. వి‌ లు, మొబైల్ ఫోన్లతో ఏం కాలక్షేపమే పిచ్చి తల్లీ! మా చిన్నతనంలో ఇవన్నీ ఉండేవా? బోలెడన్ని ఆటలు ఆడేవాళ్ళం. వాటితో మంచి ఆరోగ్యం కూడా. కథలూ కాలక్షేపాలతో సమయమే సరిపోయేది కాదు ‌ తెలుసా! అంటూ ఆ విశేషాలన్నీ చెప్పింది." శ్రద్ధగా విన్నది వాశిష్టి.

మరునాడు జయంత రోజూలాగే బయటి స్నేహితులతో క్రికెట్ ఆడటానికి బయలుదేరాడు. వాశిష్టి అన్నయ్య వద్దకు చేరి, "అన్నయ్యా! అస్తమానం బయటి వాళ్ళతో ఆ క్రికెట్ ఏం ఆడతావు? నాతో ఇంట్లో ఆడవా? అమ్మమ్మ బోలెడన్ని ఆటల గురించి చెప్పింది. అవన్నీ ఆడుకుందాం. నువ్వు రోజూ బయట ఆడితే నాతో ఆడేవాళ్ళు ఎవరు చెప్పు." అంది. "చిన్నదానివి. నీతో నాకు ఆటలేంటి? అసలు నీకు ఆటల గురించి తెలుసా? నీతో ఆడితే నాకు ఆడినట్లు ఉంటుందా? ప్రతీసారీ నా చేతిలో నువ్వు చిత్తుగా ఓడిపోవడం తప్ప ఏమీ ఉండదు. పెద్ద బోర్." అన్నాడు జయంత. శివాని వచ్చి జయంతను చెల్లెలితో ఆడుకోమని అడిగింది. బతిమాలింది. బాగా తిట్టింది. ససేమిరా అన్నాడు జయంత. "నీకు ఇప్పుడు తెలియదురా చెల్లెలి విలువ. అది తెలిసిన రోజు నీ చెల్లెలు నీతో ఆడమన్నా ఆడదు." అన్నది శివాని. జయంత ఇదేమీ పట్టించుకోకుండా బయటికి వెళ్ళి స్నేహితులతో క్రికెట్ ఆడటం కొనసాగించాడు.

శివానీ తానే తీరిక సమయంలో కూతురితో ఆడటం ప్రారంభించింది. కొద్ది రోజుల్లోనే క్యారమ్ బోర్డు, చెస్, షటిల్ వంటి అనేక ఆటలలో కూతురిని నిష్ణాతురాలిని చేసింది. బోలెడన్ని కథలు చెప్పింది. క్రికెట్ మత్తులో మునిగిన జయంతకు ఇవేవీ రుచించలేదు. ఇక ఇంట్లో ఉంటే టి‌ వి. చూడటానికి తనకు పోటీనే లేదు. ఇక అన్ని రోజులు తనవే అనుకున్నాడు జయంత.

వాశిష్టి అనేక ఆటల్లో ఎంత ఆరితేరిందంటే పాఠశాల మొత్తం విద్యార్థుల్లో చెస్, క్యారెట్స్, షటిల్, రింగ్ బాల్ వంటి పోటీలలో ఆమెకు పోటీ లేరు. స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా ఆటల పోటీలు జరిగుతున్నాయి. అనేక పోటీలలో పాల్గొనడానికి వాశిష్టి తన పేరు ఇచ్చింది. క్యారమ్ బోర్డు పోటీకి జయంత కూడా పేరు ఇచ్చాడు. ఎవరెవరు జోడీగా ఆడాలో చీటీల ద్వారా డ్రా తీసి నిర్ణయిస్తున్నాడు ఉపాధ్యాయుడు. వాశిష్టి ఆ ఉపాధ్యాయుని దగ్గర చేరి, "గురువు గారూ! మా అన్నయ్యతో కలసి ఆడాలని ఉంది నాకు. ఇంటివద్ద మా అన్నయ్య నాతో ఎప్పుడూ ఆడుకోడు. దయచేసి ఇప్పుడైనా నాకు ఈ అవకాశం ఇవ్వండి." అని బతిమాలింది." ఆ కోరికకు ముచ్చటపడి ఆ ఉపాధ్యాయుడు ఒప్పుకున్నారు. అన్నాచెల్లెళ్ళు ఒక జోడీ అయినారు. ప్రతి ఆటలోనూ అన్నయ్య కాయిన్స్ ను సరిగా కొట్టలేకున్నా తానే ఒంటి చేత్తో గెలిపించింది. కానీ ఫైనల్లో వీరితో పోటీ పడిన ప్రత్యర్థులు హరి, వాసు ఇద్దరూ మంచి ఆటగాళ్ళే. వాళ్ళ చేతిలో ఈ అన్నాచెల్లెళ్ళు ఓడిపోయారు. ఈ అన్నా చెల్లెళ్ళకు రెండవ బహుమతి వచ్చింది.

"కృతజ్ఞతలు గురువుగారు! మా అన్నయ్యతో కలిసి ఆడే అవకాశం ఇచ్చినందుకు. నాకు అస్సలు బహుమతి రాకున్నా సరే. ఈ అదృష్టం ఒక్కసారైనా వచ్చినందుకు జీవితాంతం తృప్తిగా ఉంటుంది." అని కళ్ళనీళ్ళ పర్యంతం అయింది. ఆ సమీపంలో ఉన్న జయంత చెల్లెలి మనస్తత్వం తెలి‌సి తానూ కళ్ళనీళ్ళ పర్యంతం అయ్యాడు. ఆపుకోలేనంత దుఃఖం వచ్చింది. "నన్ను క్షమించు చెల్లీ! ఇంటివద్ద ఇకపై ఎప్పుడూ నీతోనే కలసి ఆడుకుంటా." అన్నాడు. సంతోషించింది వాశిష్టి..

మరిన్ని కథలు

Aame kavvinchindi
ఆమె కవ్వించింది
- తాత మోహనకృష్ణ
Chandruniko noolu pogu
చంద్రునికో నూలు పోగు
- కాశీవిశ్వనాధం పట్రాయుడు/kasi viswanadham patrayudu
Anaadha atidhyam
అనాథ అతిథ్యం
- - బోగా పురుషోత్తం
Vibheeshana Sharanu
విభిషణుని శరణు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Srivariki prema lekha
శ్రీవారికి ప్రేమలేఖ
- తాత మోహనకృష్ణ
Ramdaas formula
రాందాస్ ఫార్ములా
- వీరేశ్వర రావు మూల
Attagari samrajyam
అత్తగారి సామ్రాజ్యం
- బొబ్బు హేమావతి