తెలుగు సీరియళ్ళ తెగులు - చెన్నూరి సుదర్శన్

The rot of Telugu serials

“టైగర్..!” అంటూ గేటు ముందు నిలబడి పిలిచింది నీలమ్మ.

నీలమ్మ చేతిలోని పాత్ర చూసి అలవాటు ప్రకారం గ్రామసింహం తోకాడించుకుంటూ.. వచ్చింది. పాత్రలోని ఉప్మా కొంచెం చంచాతో తీసి.. ప్రహరీ గోడకానుకుని ఉన్న పెద్ద బండరాయి మీద పెట్టింది నీలమ్మ. టైగర్ తింటుంటే.. కాసేపు తీక్షణంగా చూసింది. అంతటితో తృప్తి చెందక లోనికి వెళ్ళి చిన్న గేటు మూసుకుంటూ.. చూడసాగింది. టైగర్ ఉప్మా సాంతం తిని, నాలుకతో మూతి తుడుచుకుంటూ.. వచ్చి గేటు ముందు కూర్చుంది. మరో రెండు నిముషాల పాటు టైగర్ హావభావాలను ఆకళింపు చేసుకుని.. ఇక భయమేమీ లేదన్నట్టుగా, తృప్తిగా ఉప్మా తిందామని తన గదిలోకి దారి తీసింది.

అనుమానం కలిగినప్పుడల్లా హోటల్లో నుండి టిఫిన్ తెప్పించుకోవాలంటే.. చేతిలో కొంత డబ్బు ఉండడం అవసరమని ఒక శాశ్వత పథకం పన్నింది.

నీలమ్మ ఆరు పదులు దాటిన వయసు. భర్త కాలం చేశాక తన ఒక్కగానొక్క పుత్రరత్నం దయానందం దయతలచి ఆమెను అనాధాశ్రమం పాలు చెయ్యకుండా.. ఇంట్లోనే సకల సౌకర్యాలతో ఒక ప్రత్యేక గదిని కెటాయించాడు. అందులో.. నేటి కాలానికి అత్యంత ఆవశ్యకరమైన పోర్టేబుల్ టీవీ అమర్చాడు. హాల్లో ఒక టీవీ మాత్రమే ఉంటే.. రిమోట్ కోసం తన భార్యామణి మణిమాలతో తగువులాట రావచ్చనే భయం. చేతికొక ఫోన్ సైతం కొనిచ్చాడు.

నీలమ్మ గదికి ఒకే ఒక కిటికి, గుమ్మం మాత్రమే ఉన్నాయి. గుమ్మానికి ఎదురుగా ప్రహరీ గోడకు చిన్న గేటు. నీలమ్మ కోసం టిఫిను, టీలు, భోజనం అందించడానికై కిటికీని సద్వినియోగం చేసుకుంటుంది మణిమాల.

గుమ్మం నుండి పెరట్లోకి.. అలాగే గేటు తెరచుకుని వీధిలోకి వెళ్ళడం కోసం సదుపాయం ఉందని నీలమ్మతో గొప్పగా చెప్పే వాడు దయానందం. కాని అది తాను నిత్యం ‘తల్లా..! పెళ్ళామా..!!’ అనే సీరియల్ చూస్తూ.. అమలు పరుస్తున్న వైనమని నీలమ్మకు తెలియదు. అదియును ఒకందుకు మంచిదే అన్నట్టు నీలమ్మ గూడా పెదవి విప్పేది గాదు.

ఒక రోజు నీలమ్మ దయానందం ఆఫీసుకు వెళ్తుంటే.. పిలుచుకుని తన మనసులోని కోరిక చెప్పింది.

“ఎందుకమ్మా..! చేతి ఖర్చుకు అన్ని డబ్బులు కావాలా!” అంటూ ఆశ్చర్యంగా అడిగాడు సదానందం. తను చూసే సీరియల్లో గూడా తల్లి అలాగే అడుగుతుంది. అందులో కొడుకు కాదనడు. జ్ఞప్తికి వచ్చి సరే అన్నాడు దయానందం.

“నీ పేరులోనే ఉందిరా దయ.. మీ నాన్నగారు పెట్టిన పేరు సరిపోయింది” అనగానే సదానందం భుజాలు రెండు ఇంచుల మందం పైకి ఎగిరాయి. వెంటనే జేబులో నుండి కొంత డబ్బు తీసి ఇస్తూ.. ఇది ప్రస్తుతానికి ఉంచు అన్నట్టు సైగ జేశాడు.

“ఈ విషయం కోడలుకు చెప్పకురా..” అంటూ సదానందం గదుమ పట్టుకుని బతిమాలింది నీలమ్మ. సరే అన్నట్టు గంగిరెద్దులా తలూపి బయట పడ్డాడు.

ఇదంతా చాటు మాటుగా విన్న మణిమాల కడుపు మండి పోయింది. తాను చూసే టీ.వీ. సీరియల్ ‘దగా తల్లి’ లో కూడా ఇలాగే కొడుకు దగ్గర డబ్బులు అడిగి తీసుకుని హోటల్ నుండి తనకిష్టమైన పదార్థాలు తెచ్చుకుని తింటుంది ముసల్ది. మరో సీరియల్ ‘అత్తా లేని కోడలుత్తమురాలు’ లో అలాంటి అత్త పీడ విరగడ అవ్వాలని కోడలు ఒక ఉపాయం పన్ని వదిలించుకుంటుంది.

తనూ అలాంటి ఉపాయంతో.. సమయం కోసమే మణిమాల వేయి కళ్ళతో ఎదురి చూస్తోంది.

***

ఆ రోజు ఆదివారం.. రథసప్తమి. తెలంగాణలో ‘కోడళ్ళ పండుగ’ అని గూడా అంటారు..

ఆ రోజు కొత్త చీర కట్టుకుని.. సూర్యకిరణాలు పడే చోట తూర్పు దిక్కున తులసికోట పక్కగా ఆవు పేడతో అలికి, దానిపై పిండితో పద్మం వేసి, పొయ్యి పెట్టి, సంకాంత్రి రోజున పెట్టిన పిడకలు, గొబ్బెమ్మలతో పొయ్యి వెలిగించి దాని మీద పాలు పొంగిస్తారు. తరువాత ఆ పాలల్లో కొత్తబియ్యం , బెల్లం, నెయ్యి, ఏలకులు వేసి పరమాన్నం వండుతారు.

మణిమాల మహా హుషారుగా ఉంది. తనకు అత్యంత ప్రీతి పాత్రమైన ‘అత్త లేని కోడలు ఉత్తమరాలు” సీరియల్లో చూపించిన పరమాన్నం ప్రయోగం నీలమ్మ మీద ప్రయోగించ బోతోంది. ఇక జరుగబోయేది మనసులో ఊహించుకుంటూ.. ‘కల నిజమాయెగా..! కష్టాలే తీరెగా..!!’ అని పాత సినిమాలోని పాట అందుకుంది. మనసు గాలిలో తేలి పోతోంది.

పరమాన్నం తెచ్చి కిటికీలో పెడుతూ..“అత్తమ్మా.. పండుగ కదా..! పరమాన్నం తెచ్చాను. మీ అబ్బాయి తిని పడుకున్నాడు” అంటూ ఏనాడూ లేని ఆప్యాతను కురిపించసాగింది మణిమాల.

“సంతోషం కోడలా..” అంటూ మణిమాల కట్టుకున్న కొత్తచీరను చూసి మెచ్చుకుంటూ పరమాన్నం పళ్ళెం తీసుకుంది.

“వేడిగా ఉన్నప్పుడే తినండి.. చల్లారితే బాగోదు” అంటూ మురిపెంగా మూతి మూరెడు సాచి, నవ్వుతూ వెనుదిరిగింది మణిమాల.

ఆమె మనసు ఉద్వేగంతో ఉరుకులాడుతోంది. తేప, తేపకు కళ్ళు గోడ గడియారం మీద వాలుతున్నాయి. ‘ఇప్పుడు తినడం ప్రారంభించింది.. మొదటి ముద్ద, రెండవ ముద్ద..’ అంటూ మనసులో లెక్కిస్తూ.. సమయాన్ని బేరీజు వేసుకో సాగింది. ‘మరో పది నిముషాలలో పడుకుంటుంది. నిద్ర లోనే నీలమ్మత్త..’ అనే ఊహలతో మణిమాల కళ్ళు కాంతులీనసాగాయి.

ఇంతలో వీధిలో నుండి పెద్ద, పెద్ద కేకలు వినరావడంతో.. దయానందం దిగ్గున లేచి బయటికి పరుగు తీశాడు. అతని వెనుకాలే మణిమాల వడి, వడి అడుగులతో అనుసరించింది. ఇంటి ప్రధాన గేటు ముందు టైగర్ అచేతనంగా పడి ఉంది. దాన్ని చూడగానే బావురుమన్నాడు దయానందం. వెంటనే ‘శునక పరిరక్షణ కమిటీ’ కి ఫోన్ చెయ్యబోయాడు.

“నేను ఫోన్ చేశానురా దయా.. ఈ పాటికే వస్తూ ఉండాలి. డాక్టరును గూడా తీసుకు రమ్మన్నాను” అంటూ విచారంగా చెప్పసాగింది నీలమ్మ.

టైగర్ అంటే నిజంగానే అది వీధిలో ఒక పులిలా తిరిగేది. కొత్తవాళ్ళు వస్తే అరుస్తూ.. భయ పెట్టేది. అది ఉందనే ధైర్యంతో వాడ లోని వారంతా రాత్రుళ్ళు ప్రశాంతంగా నిద్ర పోయేవారంటే అతిశయోక్తి గాదు. అలాంటిది ఎలా జరిగిందన్నట్టు గుమి గూడిన జనం ఎవరికీ తోచింది వారు అనుకోసాగారు.

“ఎవరో పాపాత్ములు.. విషం కలిపిన పదార్ధమేదో పెట్టి ఉంటారు. పాపం పిచ్చి ముండ దానికే తెలుసు తిని నేల కొరిగింది” అంటూ నీలమ్మ కడకొంగుతో కన్నీళ్లు ఒత్తుకోసాగింది.

ఇంతలో శునక పరిరక్షణ బృందం వ్యానులో వచ్చి వాలింది. వెటర్నరీ డాక్టర్ పరుగులాంటి నడకతో వచ్చి టైగర్ ను పలు విధాల పరీక్షించాడు. చివరకు ఒక నిర్ణయానికి వచ్చిన వాడిలా తన ప్రాథమిక చికిత్స పెట్టెలో నుండి తీసి.. టైగర్ కు ఇంజక్షన్ చేశాడు. అంతా ప్రాణాలు బిగపట్టుకుని చూడసాగారు. మరో పది నిముషాలలో టైగర్ వాంతి చేసుకుంది.. మేనులో కాస్త చలనం కనిపించింది.

నీలమ్మ పరమాన్నం పళ్ళాన్ని శుభ్రంగా సబ్బుతో కడిగి.. మంచి నీళ్ళు తీసుకు వచ్చింది. టైగర్ ను ప్రేమగా దగ్గరకు తీసుకుని తాగించింది. అది రెండు బుక్కలు గతికి తల అటూ, ఇటూ వేగంగా విదిల్చింది. టైగర్ పూర్తిగా కోలుకోవడం చూసి జనంలో హర్షాతి రేఖలు వెల్లివిరిశాయి.

సకాలంలో ఫోన్ చేసి టైగర్ ప్రాణాలు కాపాడినందుకు నీలమ్మ మీద వాడవారంతా ప్రశంసల ఝల్లు కురిపించసాగారు.

“ఇప్పుడిక ఫరవా లేదు. టైగర్ ప్రాణానికి అపాయమేమీ లేదు. మళ్ళీ రేపు వచ్చి చూస్తాను” అంటూ డాక్టర్ భరోసా ఇచ్చి తన బృందంతో వెళ్లి పోయాడు.

“ఒరేయ్ టైగర్.. నేను ‘కోడలు లేని అత్త గుణవంతురాలు’ అనే సీరియల్ టీ.వీ. లో చూస్తూండడం మంచిదయ్యింది” అంది.. మన ప్రాణాలు నిలబడ్డాయి అన్నట్లుగా.

ఆ మాటలు తన కోడలుకు అర్థమై ఉంటాయని ఒక వాడి చూపు మణిమాల వంక విసిరింది నీలమ్మ. తెగులు సీరియళ్ళ పేరు వినగానే సంఘటనలను పసిగట్టే సదానందం గూడా నీలమ్మ చూపులో తన చూపు కలిపాడు.

‘దొంగకు తేలు కుట్టింది’ అనే టీవీ సీరియల్లో మాదిరిగా ముఖం చాటేసింది మణిమాలని నిశ్చేష్టుడయ్యాడు దయానందం *

మరిన్ని కథలు

Swayamvaram
స్వయంవరం
- తాత మోహనకృష్ణ
Maatruhrudaya mahattu
మాతృహృదయ మహత్తు!
- చెన్నూరి సుదర్శన్
Simhavalokanam
సింహావలోకనం
- మద్దూరి నరసింహమూర్తి
Mana garden
మన గార్డెన్
- తాత మోహనకృష్ణ
Andari bandhuvuluu
అందరి బంధువులు
- భానుశ్రీ తిరుమల
Teeram cherchina parugu
తీరం చేర్చిన పరుగు
- షామీరు జానకీ దేవి
Vimanam lo kalakalam
విమానంలో కలకలం
- తాతా కామేశ్వరి
Aame kavvinchindi
ఆమె కవ్వించింది
- తాత మోహనకృష్ణ