శ్రీనగర్ కాలనీ - ఉపద్రష్ట కృష్ణప్రియ

srinagar colony

అమ్మని సాయంత్రం, ఆరున్నరా అలాగ బస్ ఎక్కిస్తాను గానీ, దింపుకో గలవా అన్నయ్యా? చిన్నవాడు వాడి ఫ్రెండ్ అక్కకి, పెళ్ళని అనకాపల్లి వెళ్ళాడు. మా ఆయన కేంప్ నించి రాలేదు... అంటూ కాల్ చేసి చెప్పింది వసంత, మధ్యాహ్నం రెండింటికి వైజాగ్ నించి.

"ఓ పని చెయ్యి. ఆవిడని ఎక్కించగానే, నాకు కాల్ చెయ్యి. కాస్త పని చూసుకుని నేను బస్టాండుకి బయలుదేరుతా, సరేనా?" అన్నాడు శంకరం. "అలాగే" అంది వసంత.

అనుకున్నట్లు గానే, ఆరున్నరకి, కాల్ చేసింది వసంత, కాంప్లెక్సుకి, బయల్దేరుతున్నట్లుగా. ఓగంట, అటూ ఇటూ తిరిగి బస్టాండుకు చేరుకున్నాడు శంకరం. కాంప్లెక్సు చేరేటప్పటికి ఎనిమిదన్నర అయ్యింది. అప్పుడు చూశాడు ఆమెని. కొంగు భుజాలనిండా కప్పుకుని బస్సు వచ్చేవేపే తదేకంగా చూస్తోంది. 'ఎవరో గానీ, పెద్దింటావిడ లాగానే ఉంది" అనుకున్నాడు.

ఓపావుగంట, సిగరెట్ ఊదుకుంటూ, వైజాగ్ నించి వచ్చే ప్రతిబస్సు దగ్గరికీ, వెళ్ళి చూసాడు. తల్లి కనబడలేదు. అలాగ ప్రతిబస్సునీ ఎగాదిగా చూడడం, చిరాగ్గా అనిపించసాగింది అతనికి.

శంకరం వెళ్ళివచ్చినప్పుడల్లా, అదోలాగా చూడసాగింది ఆమె. టైము గడుస్తున్న కొద్దీ "ఈవిడేమయ్యిందిరా బాబూ" అని భయం వేసింది శంకరానికి. చెల్లెలికి రింగ్ చేసి కనుక్కుందామని సెల్ తీశాడు. చార్జింగ్ అయిపోయినట్లుంది. కుయ్యీ కుయ్యీ లేదు. "ఓర్నాయనో ఇది ఎప్పటి నుంచి బబ్బుందో ఏంటో?, బజార్లంట తిరుగుతూ, చూసుకోనన్నా లేదు" అనుకుంటూ, రూపాయి ఫోన్ కోసం చుట్టూ, వెదక సాగాడు.

అప్పుడు మళ్ళీ కనిపించిందామె. "ఆవిడెవరో గానీ చాలా పరిచయస్తురాలు లాగానే ఉంది. కానీ, గుర్తుకు రావడం లేదు. తాను వచ్చేటప్పటికి, అలాగ, ఆవెలగని లైటు స్థంభంక్రింద నిలబడి ఉందామె. ఆవిడక్కడ, ఓ ఇరవయి నిమిషాలబట్టి అయినా ఉండి ఉండవచ్చు." అనుకుంటుండగా కోయిన్ బాక్స్ కనబడింది. ఫోన్ చేస్తే "ఎక్కడున్నావురా ఇంతసేపూ? మేం బయల్దేరేవేల్టికి, మా అత్తగారు వచ్చారు. "అదేంటి వదినగారూ! నేను దిగడమూ, మీరు ఆటో ఎక్కడమూనా, ఇదేమన్నా బాగుందా?, మీరు వెళ్ళడానికి వల్ల కాదంటే, కాదని" ఆపేసింది. ఆసంగతి నీకు చెబ్దామని అప్పటి నించీ ప్రయత్నిస్తున్నాను. స్విచ్చిడాఫ్ అంటోంది నీసెల్లు. వదినకి చేసి, సంగతి చెప్పాను. "ఓ గంటగడిచేక అయినా, చూసుకోకపోతారా, నువ్వేమీ వర్రీ కాకు" అనేసింది వదిన. "అమ్మయ్య. ఇప్పటికన్నా చూసుకున్నావు. ఇంక ఇంటికెళ్ళు." అంది వసంత, కొండంత బరువు దింపుకున్నట్లుగా.

"చార్జింగ్ అయిపోయిందే. చూసుకోలేదు." అన్నాడు శంకరం. ఆమె ఇంతవరకూ పడ్డ నరకయాతన, వూహకి వచ్చి, సిగ్గు సిగ్గుగా.

"ఏంపర్లేదురా. ఇవన్నీ మామూలే. ఇంక ఇంటి కెళ్ళు." అంది వసంత.

"సరే" అని ఫోన్ పెట్టేశాడు శంకరం. "వసంత, తన చెల్లెలని చెప్పుకోవడం కాదు గానీ, చాలా మంచిది. తానంటే చాలా అభిమానం. అందుకే తన ఇంట్లో అమ్మకి ఇబ్బందయినప్పుడల్లా, ధైర్యంగా, వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి, చక్కగా చూసుకుంటుంది. అలాగని, ఆమె అత్తవారిని కూడా, ఎవరినీ అశ్రద్ధ చేయదు. వారంతా ఆమెనెంతో గౌరవిస్తారు." అనుకున్నాడు అభిమానంగా.

బండి స్టార్ట్ చేస్తుండగా... ఆమె కనిపించింది.

రిక్షా వాళ్ళూ, ఆటోవాళ్ళూ, ఆమె చుట్టూ చేరి ఊదర కొట్టేస్తున్నారు. "ఇప్పుడేమీ బస్సులు లేవమ్మా కాలనీకి." అంటూ.

"ఆటో! బాబా మెట్ట దగ్గర, శ్రీనగర్ కాలనీకి, ఏంతీసుకుంటావు?" అందావిడ నోరువిప్పి.

"ఆగొంతు బాగా తెలిసున్నది లాగానే ఉంది. ఆమె ఎవరై ఉంటుంది?" అనుకున్నాడు శంకరం. "తిరుగు బేరాలేవీ ఉండవమ్మా. ఓవంద రూపాయలు చేసుకోండి. రండి" అన్నాడొక ఆటో డ్రైవరు.

"వందా?" అందావిడ విస్తుపోతూ. తరువాత "ఇంక, వేధించక వెళ్ళండి బాబూ" అంటూ బితుకు బితుకుగా, ఆశగా, బస్సుకోసం, బస్సువచ్చే దిశగా చూడసాగింది.

రిక్షావాళ్ళు "ఓ డబ్భై ఇవ్వండమ్మా. శేమంగా ఇంట్లో దించేత్తాము" అంటున్నారు.

"అమ్మ ఎలాగూ రాలేదు. పోనీ, ఆవిడని, వాళ్ళింట్లో దింపేస్తే" అనుకున్నాడు శంకరం.

"అమ్మో, ఈ ఆడాళ్ళతో అన్నీ డేంజరే. కావాలని సాయంచేస్తామంటే, మరోలా అర్ధంచేసుకుని, చెప్పుతో సత్కరించగలరు. కానీ - ఆవిడ్నెందుకో వదిలిపోబుద్ధి పుట్టడంలేదు. పోనీ, ఓసారి అడిగిచూస్తే సరి." అనుకుని, బండిని ఆమె దగ్గరికి పోనిచ్చి "నేను అటే వెడుతున్నాను. వస్తారా మేడం!" అన్నాడు. ఆమె, అతడిని ఓమారు ఎగాదిగా చూసి, 'వద్దులెండి' అనేసింది.

నిజం చెప్పాలంటే ఆమెకి కూడా చాలా చిరాగ్గా ఉంది. బస్సు వస్తుందో రాదో, తెలియదు. కానీ, - అతడు మంచివాడని, నమ్మడం ఎలా? ఈమధ్య ఎన్ని ఘోరాలు చూడడం లేదు?, అందునా చీకటివేళ, ఎవరినీ అసలు నమ్మరాదు. అమ్మో, అమ్మో, వయసుతో సంబంధం కూడా లేకుండా ఉంది. ఈకాలం, ఆడదాని బ్రతుకు మరీ అధ్వాన్నం అయిపొయింది. ఈఆటో వాళ్ళు చూస్తే, కొండెక్కి కూర్చున్నారు. బస్సుగానీ వస్తే పది రూపాయల్లో వెళ్లిపోవచ్చు. తోటపాలెం లో, ఒక తెలిసున్న వారింట్లో, చిన్న ఫంక్షన్ ఉంటే వెళ్ళింది. తొందరగానే బయలుదేరింది తాను. కానీ, వాళ్ళ ఇంటినించి, ఇక్కడికి వచ్చేటప్పటికి ఎనిమిదింటి బస్సు వెళ్ళిపోయిదంట. ఆటోలో, వెళ్ళవచ్చు గానీ, వాళ్ళూ ఈమధ్య నానా అల్లరీ చేస్తున్నారు. ఆవందా, ఏ ఖర్చుకైనా వస్తుంది కదా? అనవసరంగా ఎందుకు డబ్బు ఖర్చు?" బితుకుబితుకుగా చూస్తూ అనుకుందామె.

అంత చీకటిలోనూ, ఒక్కక్షణం, ఆమె తనని చూసిన తీరు, కలవరం కలిగించింది శంకరానికి.

తననితాను పరీక్షగా చూసుకున్నాడు. నల్లగళ్ళ తెల్లబనీనూ, నల్లపేంటూలో, ఆరడుగుల, డబ్భై కేజీల, చామనచాయ విగ్రహం కనిపించింది. "మరీ, గూండాగాడి లాగున్నానా, ఏమిటి చెప్మా? బ్యాంక్ మేనేజర్ని.! ... షిట్!... కోరి సాయం చేస్తానంటే ఇలాగే ఉంటుంది. స్కూటర్ తిప్పుకుని పోతేపోలా?" అనుకుని లైటు వేసుకుని, బండి స్టార్ట్ చేసి తలఎత్తాడు. తనున్నవేపు, తలైనా తిప్పకుండా బస్సువచ్చే వైపు, తదేకంగా చూస్తున్న 'ఆమె', చప్పున గుర్తుకొచ్చిందతనికి.

ఆమె, వేరెవరో కాదు. తనకి హైస్కూల్లో, లెక్కల మాస్టారి భార్య. ఆయన ఎంతబాగా పాఠం చెప్పేవారంటే. తానసలు ఇంటికొచ్చి, మళ్ళీ చూసుకునేవాడే కాదు. ఆయనంటే తనకి చాలాచాలా ఇష్టం. ఆయన, ఆమధ్య ఎప్పుడో, హార్ట్ ఎటాక్ వచ్చి, పోయారని తెలిసింది. ఏమిటో, వెళ్ళి చూడడానికి అవలేదు. కొద్దిగా, వయసు తెచ్చిన మార్పు తప్పించి, ఆవిడలో పెద్దగా, మార్పేమీ లేదు. ఆవిడది, మంచి మ్యూజికల్ వాయస్. వారూ తామూ, కానుకుర్తి వారి వీధిలో, గోడా వారింట్లో, అద్దెకుండే వారు. ఆమె, సంగీతకళాశాలలో, సంగీతం కూడా నేర్చుకునేది. రోజూ ఖాళీ సమయాల్లో, సాధన చేస్తూండేది. అందుకే బాగా గుర్తుండిపోయింది తనకి. అయినా, అప్పుడు "ఉఫ్" అంటే, ఎగిరిపోయేంత సన్నగా, ఉండేవాడు తాను. కానీ, ఇప్పుడో, ఇంత ఎత్తూ అంతలావూ అయిపోయాడు. దానికితోడు, ఇవాళ నల్లచారల తెల్ల బనీను కూడా వేసుకున్నాడు. తనసంగతులన్నీ చెప్పినా ఆవిడ గుర్తు పట్టదు సరికదా, మరీ అంతగా, గుర్తు పెట్టుకున్నాడంటే, ఏరౌడీ గాడో అనుకోగలదు. "అయినా, అరగంట బట్టీ, ఎదురుగా వున్నా పట్టించుకోలేదు గానీ, ఇప్పుడు పలకరించాడంటే, ఏదో వంక పెట్టుకుని, చీకటిలో మాట కలపాలని ప్రయత్నిస్తున్నాడు" అని అనుకోగలదు. ఆవిడని, ఎలాగయినా, వాళ్ళ ఇంట్లో దింపేయాలి. మరీ చీకటిపడింది. కానీ, ఆవిడ తనని నమ్ముతున్నట్లు గాలేదు..." అనుకుంటూ.

"ఇన్నాళ్ళూ, ఎక్కడినుంచైనా, సాయం పొందడమంటేనే, మహాకష్టం అనుకున్నాడు గానీ, మనమంటే నమ్మకంలేని వారికి, సాయం చేయడం మరీ కష్టమని, ఇవాళే తెలిసింది. చివరిగా, మదర్ సెంటిమెంట్ తో, తానెందుకువచ్చాడో చెప్తే పనికావచ్చేమో, లేకపోతే, ఆవిడఖర్మ." అనుకుంటూ.

"మా అమ్మ గారు, వైజాగ్ నుంచి రావాల్సి ఉంది. ఆవిడని రిసీవ్ చేసుకుందామనే. నేను వచ్చాను. సడన్ గా ఆవిడ ప్రోగ్రాంలో, మార్పు వచ్చిందంట. నా సెల్లులో చార్జింగు అయిపోవడం వల్ల, నాకు కబురు తెలియలేదు. మీరు బాబామెట్ట దగ్గర శ్రీనగర్ కాలనీకి, ఆటో అడుగుతున్నారు కదా, అది విన్నాను. మాఇల్లూ అటే.. దింపుతాను వస్తారా?' అన్నాడు.

చివాలున తిరిగిందామె శంకరం వైపు. ఆవెంటనే 'మీఇల్లు ఎక్కడా?..." అంది.
ఖంగుతిన్నట్లైన అతడు, సమాధానం చెప్పేలోపలే, 'ఏడుగుళ్ళ దగ్గరా?" అంది ఆరాగా.

'ఆ ఆ' అనేశాడు శంకరం గబగబా. నిజం చెప్పాలంటే, ఓసారెప్పుడో, ఏవో పోటీలవుతున్నాయంటే, విజ్జీ స్టేడియంకి, ఓఫ్రెండ్ తో వెళ్ళాడు. అంతే, మళ్ళీ ఎప్పుడూ, కాలనీకి వెళ్ళలేదు. ఆసంగతి ఇప్పుడు చెప్తే, ఆమె తనని, అసలు నమ్మకపోవచ్చు" అనుకున్నాడు. ఆమె, పెద్దగా ఆరా తీయక, ఓసారి బస్సువచ్చేదిక్కుచూసి, కిందపెట్టిన బేగ్ తీసుకుని, నడవండి" అంటూ ఎడమచేత్తో సెల్లు పట్టుకుని, సెల్లు చూసుకుంటూ, బండి వెనక్కి వచ్చి నిలబడింది.

ఆవిడ చేతినించి, బేగ్ జాగ్రత్తగా తీసుకుని, ముందరతగిలించుకుని, "కూర్చోండి మేడం" అన్నాడు, ముందుకి జరిగి కూర్చుని, ఆవిడ తనకి తగలకుండా, జాగ్రత్త పడుతూ.

స్కూటర్ గమ్యం వైపు దూసుకుపోసాగింది. తాను స్కూటర్ ఎక్కేదాకా తెగవెంపర్లాడిన అతడు, దారి పొడుగూతా తెగవాగి, పిచ్చెక్కిస్తాడేమో? అని భయపడిందామె. స్కూటర్ గతుకుల్లో పడ్డప్పుడల్లా 'సారీ' అనడం మినహా, అతడు మాట్లాడకపోవటం, ఆమెకి ఆశ్చర్యాన్నే కలిగించింది.

ఆవిడ దారిలో కోట, గుంచీ, రింగురోడ్డు అంటూంటే అర్ధం కాలేదు శంకరానికి. అతడు జోరుగా ముందుకెళ్ళిపోతూంటే "ఎటుపోతున్నావ్" అంది ఆమె.

"మీకెందుకు మేడం!, గాభరా పడకండి" అంటూ దూసుకుపోసాగాడు, అతడు.

అప్పటిదాకా స్కూటర్లు ఆపుకుని సెల్లులలో, కబుర్లాడు కుంటున్న, కాలేజీ పిల్లలు స్కూటర్లు స్టార్టు చేసుకుని వీళ్ళ వెనుక రాసాగారు, వేగంగా.

రధయాత్ర దాకా వెళ్ళాక, "ఆపండి బండి" అందామె గట్టిగా.

"ఎందుకుమేడం? ఎందుకూ? ఈ ముందు ఓదారి ఉండాలి. అదే చూస్తున్నాను" అన్నాడు.

సడెన్ గా, అతని బండి ముందు మూడు బళ్ళు ఆగాయి.

"యేయ్ ఏంటయ్యాఇదీ?, ఏమిటీ అల్లరీ" అన్నాడు, పీలగా.

"రోజూ, టీవీల్లోనూ, పేపర్లోనూ, ఆడవారిమీద అఘాయిత్యాలు చూస్తున్నాం కదా. మేడం చూడడానికి చిన్నపిల్లలాగ కనిపించిందేమో, మూర్ఖపు పిల్లలకి. దేవుడా! ఆమెకి ఏమీ కాకుండా, వాళ్ళ ఇంటికి చేరిస్తే చాలు, అదేంటో, ఎడమవేపు ఓదారి ద్వారా, వెళ్ళారు అప్పుడు! ఇప్పుడా దారి కనపడటం లేదు" భయంభయంగా అనుకున్నాడు అతడు. శంకరానికి, తగువులంటే, చాలా భయం. "ఏదో చూపులకే, ఇంత ఫర్సనాలిటీ, మీకు అసలు, గుండె బలంలేదు" అని భార్య చాలా సార్లే దెప్పి పొడిచింది.

"ముందు బండాపయ్యా. శ్రీకాకుళంలో, ఏవన్నా రాకెట్ నడుపుతున్నావా? అంత రయ్యిన ఆవిడని, పట్టుకుపోతున్నావ్?" గద్దిస్తూ, అన్నారు స్కూటరుమీద ఫాలో అయినవాళ్ళు!.

బండాపి దిగిన అతడు, మనసులోని గాభరాని అణుచుకుంటూ, "అదికాదు బాబూ" అన్నాడు.

"ఏమిటి కాదు సార్. చూడడానికి పెద్ద ఆఫీసరులాగున్నారు?. మీకు ఆ పెద్దావిడలో, మీ అమ్మ గారో, అక్కగారో కనిపించలేదా? ఈ సందులోకి నడవండి. మా ప్రెసిడెంటు ప్రకాష్ బాబూ, శక్రటరీ మార్కాండేయులూ మీకు మర్యాదలుచేయడానికి వస్తున్నారు," అన్నారు ఆ పిల్లలు.

"నాకా!, మర్యాదలా దేనికీ" ఆశ్చర్యంగా అన్నాడు శంకరం.

"దేనికీ! అని, మరీ అంత అమాయకంగా అడగక్కర్లేదు. బాబామెట్టకెళ్ళే, దారులన్నీ తప్పించి, ఎక్కడికీ పరుగు? ఇంతకీ, మీ ఇల్లెక్కడయ్యా చూపించు?" అందామె. కోపంతో రగిలిపోతూ.

"చెప్పండి సార్! మీకు సన్మానం చెయ్యడానికే, భోజనాలైనా చెయ్యకుండా, ఇలా వచ్చాం" వ్యంగ్యంగా అన్నారు, అక్కడికి చేరుకున్న ప్రకాష్ బాబూ, మార్కండేయులూ, అతని భార్య.

ఇంకా తాత్సారం చేస్తే, వాళ్ళు అన్నంతపనీ చేసేలాగున్నారని "మేడమ్! మీరు చక్రవర్తి మేష్టారి భార్యే కదా? మనందరం, కానుకుర్తి వారి వీధిలో, గోడా వాళ్ళ ఇంట్లో, అద్దెకుండేవాళ్ళం, మీరు సంగీతం నేర్చుకునేవారు... మాస్టారి ఆశీస్సులవల్లే ఇంతవాడి నయ్యాను. ఆమధ్య మాస్టారు దివంగతులైనట్లుగా, కొద్దిగా ఆలస్యంగా తెలిసింది. మొహం చెల్లక రాలేదు. ఇవాళ, అనుకోకుండా మీరు కనపడ్డారు.... ఒక్కరూ, అలాగ ఒంటరిగా, చీకట్లో... మా చెల్లి "మా అమ్మగారిని వైజాగ్ లో బస్సు ఎక్కిస్తాను. దింపు కో" అని కాల్ చేసి చెప్పడం నిజం. నాసెల్లు చార్జింగు అయిపోవడం నిజం. అందువల్లే నేనింతసేపు ఉండిపోవడమూ, మిమ్మల్ని చూడడమూ జరిగింది. మీకు నమ్మకం కలగకపోతే, రారేమోనని అబద్ధమాడాను... మాఇల్లు, కంటోన్మెంటులో ఉంది. నిజం చెప్పాలంటే, నాకు కాలనీ పేరు తెలుసు గానీ, దారికూడా తెలియదు. ...పొరపాటే ...కాదనను ...కానీ నాకింకొక దారికనిపించక మాత్రమే అలాగచేసాను... క్షమించండి మేడం" అన్నాడు శంకరం.

కళ్ళల్లో నీళ్ళు చివ్వున పొంగుతుండగా, ఆవిడేమీ సమాధానం చెప్పలేదు.

"దొరికిపోయావని, ఇలాగ మాటమారుస్తున్నావా?" మార్కండేయులు గారి భార్య ఉరిమింది.

"ఓ గాడ్!" అన్నాడు శంకరం. "ఇంకా ఏమిటండీ చూస్తున్నారు?, మనకాలనీలో ఏ ఆడ కూతురికీ అన్యాయం జరగకూడదనే కదా మనం ఒక అసోసియేషన్గా ఫామ్ అయింది.
ఇంత కష్టపడి దొంగని పట్టాం. వదలొద్దు. ఇంకెవరూ, మనకాలనీ లోని ఆడవారివేపు చూడాలన్నా, ఒణుకు పుట్టేటంతటి పనిష్మెంటు ఇవ్వాలి వీడికి" పిల్లలు ఆవేశంగా అంటూఉంటే, ఆవిడ గొంతు పెగుల్చుకుని "వద్దుబాబూ. ఈవ్యక్తి నిజమే చెబుతున్నాడు. నేను ఎప్పుడో అతని చిన్నప్పుడు చూసాను. గుర్తుపట్టలేదు, మీ అందరినీ ఇబ్బంది పెట్టాను" అంది, సిగ్గు పడుతూ.

"థాంక్స్ మేడం?" అన్నాడు శంకరం. చమటలు కర్చీఫ్ తో తుడుచుకుంటూ.

"నిజమా!, పోనీ లెండి ఏమీ అనుకోకండి సార్! సుసీలమ్మ గారికి ఏదేనా అవుతుందేమోనన్న ఆదుర్దాలో, కాస్త ఎక్కువగా రియాక్ట్ అయ్యాము." అని, "ఎస్సై రఘువీర్ గారికి, ఇమ్మీడియెట్ గా జరిగిన సంగతి చెప్పండి" ప్రెసిడెంట్ తో అన్నారు మార్కండేయులు.

"అలాగే అలాగే," అన్నాడు ఆయన.

"నా అదృష్టం బాగుండి మేడం నన్ను గుర్తు పట్టారు. అయినా, మీనెట్ వర్క్ నాకు చాలా ఆశ్చర్యం కలిగించింది. మీరు ఎలాగ మమ్మల్ని కనిపెట్టారు?" ఆశ్చర్యంగా అన్నాడు శంకరం.

"ఈమధ్య వరుసగా, బయటపడుతున్న ఇన్సిడెంట్లతో, మేము ఒక మీటింగు పెట్టుకుని, ప్రజలు కూడా, ఇలాంటి వాటిని చూసీ చూడనట్లు ఊరుకోకూడదని, కనీసం, మనకాలనీ వాసులని మనం రక్షించుకునే ప్రయత్నాలు, మనం చేసుకుంటే బాగుంటుందని,అనుకుని, ఒక సంఘంగా ఏర్పడ్డాము. దానిపేరు అభయ ఆంజనేయ సంఘం. చీకటిపడ్డాక, ఎవరేనా ఇంటికి రావడానికి, ఏదేనా వాహనం ఎక్కితే, ఎక్కినప్లేసు చెప్పగలిగితే చెప్పి, లేకపోతే, ఆటో ఎక్కితే A అని, స్కూటర్ ఎక్కితే B అనీ, వేన్ ఎక్కితే C అనీ మెస్సేజీ మాలో ఏ ఒక్కరికి పంపినా, మేము అలర్ట్ అయిపోతాం. మధ్య మధ్యలో, ఆ ఎక్కినవారు, దారిలో ఉన్న ప్రదేశాలు మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే మంచిది. లేకపోయినా, వదలం" అన్నారు మార్కండేయులు గారి భార్య.

"ఈకాలనీని చూస్తుంటే చాలా గర్వంగా అనిపిస్తోంది. మీ అందరికీ నా అభినందనలు." అని, "మేడం! మీరు స్కూటర్ ఎక్కితే మీ ఇంటిదగ్గర దింపేస్తాను." అన్నాడు శంకరం.

"వద్దమ్మా" అంది ఆమె.

"మీరింకా నన్ను నమ్ముతున్నట్టు లేదు. ఇంకా రాక్షసుడిలా, కనిపిస్తున్నానా?" అన్నాడు శంకరం.

"లేదమ్మా. ఇప్పుడు నువ్వు మనిషిలాగ కనిపిస్తున్నావు." అంది ఆమె.

"మేడం!" అన్నాడు శంకరం ఆశ్చర్యంగా.

"అవును బాబూ, ఆడది కనిపిస్తేచాలు. వయసులో చిన్నదా, పెద్దదా, అని కూడా ఆలోచించకుండా అల్లరి చేద్దాం, ఏమాత్రం అవకాశమున్నా, అవకాశాన్ని వినియోగించుకుందాం" అనుకునే మానవమృగాలు, యధేచ్చగా సంచరిస్తున్న ఈకాలంలో కూడా, ఇలాగ ఆలోచించే మీలాటి వారి ఉనికివల్లే, ఈప్రపంచం ఈమాదిరిగా నన్నావుంది. తల్లినీ, అక్కా చెల్లెళ్ళనీ గౌరవించినవాడే భార్యనీ, మిగిలిన స్త్రీలని గౌరవిస్తాడన్నది నిజం. ఇప్పటికే చాలా ఆలస్యం అయిందిబాబూ. మీమిసెస్ గాభరా పడుతూ ఉండవచ్చు. ఇంక, నాకు భయం లేదు. మీకు ఖాళీ దొరికినప్పుడు అమ్మాయినీ, పిల్లలనీ కూడా తీసుకునిరా. నానంబరు నోట్ చేసుకో. మేము సంతోషిస్తాము. ఇంక ఇంటికివెళ్ళు" అంటూ, ఆమె అంటూంటే, అందరూ వంతపాడారు.

ఆమె నంబరు తెలుసుకుని, ఆమెకో కాల్ ఇచ్చి, "ఇది నా నంబరు, మీ అందరిదగ్గరా ఉంచుకోండి." అంటూంటే, అతని సెల్లు మోగింది.

ఎత్తి, "ఆ, వచ్చేస్తున్నా" అంటూ పెట్టేసి, "నాభార్య. మేడం అన్నట్లు, గాభరా పడుతోంది, వస్తానమ్మా, వస్తానండీ" అని, అందరిదగ్గరా వీడ్కోలు తీసుకుని ఇంటికి బయలుదేరాడు శంకరం.

మరిన్ని కథలు

Manninchumaa
మన్నించుమా!
- రాము కోలా.దెందుకూరు.
Bandham
బంధం
- B.Rajyalakshmi
Desam kosam
దేశం కోసం
- కందర్ప మూర్తి
Sutakapu manishi
సూతకపు మనిషి
- రాము కోలా.దెందుకూరు
Guru dakshina
గురుదక్షిణ
- పిళ్లా కుమారస్వామి
Telivi okkate chaladu
తెలివి ఒక్కటే చాలదు
- శింగరాజు శ్రీనివాసరావు
Angla nadaka pingla nadaka
అంగ్ల నడక-పింగ్లనడక.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు.