అమ్మ బంగారం - ఎన్.ఎ.నాయుడు

golden mother

అమ్మ బంగారం

సీతారామయ్య గారు మరియు జానకమ్మలది అన్యోన్య దాంపత్యం. వారికి ముగ్గురు కొడుకులు ముగ్గురు కూతుళ్లు. ఆయన స్కూల్ టీచర్ గ పనిచేస్తూ ఎదో రకంగా జీవితం గడుపుతున్నారు. వాళ్ళ నాన్నగారు ఇచ్చిన కొంచం పొలం ఉంటె అది ఇల్లు కూడా పిల్లల చదువులకి వాళ్ళ పెళ్లిళ్లుకి అమ్మేసారు. ఎలాగో ఒకలాగ కాలం గడపుతూ అందరి బాధ్యతలు తీరిన తరువాత సీతారామయ్య గారు కన్ను మూసారు. ఇక జానకమ్మ గారు ఒక్కొక్కరి దగ్గర రెండు నెలలు ఉండి కాలం వెళ్ళ బుచ్చుతున్నారు. ఎన్ని బాధలు పడిన సీతారామయ్యగారు ఎప్పుడు కూడా జానకమ్మ గారి దగ్గర ఉన్న బంగారం మాత్రం అమ్మలేదు. మరియు అడగలేదు కూడా. జానకమ్మ గారు ఇస్తామన్న వద్దనే వారు. ఎందుకంటే అది జానకమ్మ స్వయానా కస్టపడి చిన్న పిల్లలకి చదువు చెప్పి సంపాదించినది. వాళ్ళ పెళ్లి రోజు పూర్తిగా బంగారం పెట్టుకోమనే వారు.

ఒక రోజు నాన్న చనిపోయిన తరువాత పెద్ద అబ్బాయి వఛ్చి అమ్మ, నా కొడుకు చదువుకి డబ్బులు కట్టాలి కొంచం బంగారం ఇస్తావా అని అడిగాడు. ఒరే ఈ బంగారం మీ ఆరుగురికి చెందుతుంది. నేను చనిపోయిన తరువాత మీ ఆరుగురు పంచుకోండి అని చెప్పింది. ఇక చేసింది లేక మరి వాడు ఏమి అనలేదు. కోడలు మాత్రం కోపంగా చూసింది. అది ఆడవాళ్ళ నైజం అనుకోని జానకమ్మ పెద్దగా పట్టించుకో లేదు.

తరువాత పెద్ద అమ్మాయి దగ్గరకి వెళ్ళినప్పుడు అది అమ్మ, నా కూతురుకి పెళ్లి కుదిరింది అత్తింటి వారు బంగారం పెట్టమంటున్నారు నీ దగ్గర ఉన్న బంగారం కొంత ఇస్తే దాని పెళ్లి అయిపోతుంది అంది. ఆమెకి కూడా ఈ బంగారం మీ ఆరుగురికి చెందుతుంది. నేను చనిపోయిన తరువాత మీ ఆరుగురు పంచుకోండి అని చెప్పింది. కావాలంటే నేను అందరిని ఒప్పిస్తానంది. కానీ జానకమ్మ గారు మృదువుగా చెప్పి తప్పించుకుంది.

తరువాత రెండవ కొడుకు దగ్గరకి వెళ్లి నప్పుడు వాడు అమ్మ, నా కొడుకుని అమెరికా పంపించాలి. దానికి అమెరికన్ ఎంబసీ వాళ్ళు ఏదైనా ఆస్ధి చూపించ మంటున్నారు, నీ బంగారం నా పేరున రాస్తే మంచిది అన్నాడు. ఒరే నీ పేరున రాస్తే మిగతా వాళ్ళు ఒప్పుకోరు. ఈ బంగారం మీ ఆరుగురికి చెందుతుంది. నేను చనిపోయిన తరువాత మీ ఆరుగురు పంచుకోండి అని చెప్పింది. రెండో కోడలు కెవ్వుమని అరిచింది కానీ ఆమె పట్టించుకో లేదు. వాళ్ళ ప్రవర్తనలో కొంచం మార్పు వచ్చింది కానీ అందరు ఏమనుకుంటారో నని కొంత గంజి పోసేస్తున్నారు. భగవంతుడా నన్నెందుకు అయన దగ్గరికి పంపించవు అనుకునేది జనకమ్మగారు.

రెండు మాసాలు తరువాత రెండవ కూతురు దగ్గరికి వెళ్ళినప్పుడు ఆమె కూడా అమ్మ నా పెద్ద కూతురు రజస్వల అయింది దానికి ఏదైనా బంగారం చేయించాలనుకుంటున్నాము కానీ మీ అల్లుడుగారు పరిస్థితి ఏమి బాగో లేదు. నీ దగ్గర ఉన్న బంగారం ఇస్తే దానికి ఏదైనా చేయిద్దామని అనుకుంటున్నాము. నీకు తెలుసుగా అన్నయ్యలు కూడా ఏమి పెట్టరు. ఆమెకి కూడా ఈ బంగారం మీ ఆరుగురికి చెందుతుంది. నేను చనిపోయిన తరువాత మీ ఆరుగురు పంచుకోండి అని చెప్పింది. అల్లుడు చాల బాధపడుతూ ముసలిది చాలా తెలివైనది. ఏమి ఇవ్వదు గాని మంచిగా తింటుంది అన్నాడు. ఆమె మనస్సు చివుక్కు మంది.

తరువాత వంతగా చిన్న కొడుకు దగ్గరకి వెళ్లి నప్పుడు అంతా బాగుందన్న తరువాత ఒక రోజు అమ్మ నా కూతురు బారసాల చెయ్యాలనుకుంటున్నాము. మా అత్తగారు వాళ్ళు ఏవో చేయిస్తున్నారు మన వైపునుండి ఏమి లేదు. అన్నయ్యలు బారసాలకి వస్తారో రారో కూడా తెలియదు. నీ బంగారం కొంత ఇస్తే నా కూతురికి ఏదయినా చేయిస్తానన్నాడు. ఈ బంగారం మీ ఆరుగురికి చెందుతుంది. నేను చనిపోయిన తరువాత మీ ఆరుగురు పంచుకోండి అని చెప్పింది. దానికి చిన్న కోడలు కొంచమేగా ఇమ్మంటున్నాము అని విరుచుకు పడింది. అన్నయ్యని అడిగి చెప్తానని దాటవేసేసింది.

ఇక ఆఖరిగా చిన్న కూతురి దగ్గరకి వెళ్ళింది. చిన్న కూతురు మంచిగా చూసుకుంది కానీ ఇంకా వెళ్లిపోదామని అనుకున్నప్పుడు అమ్మ అందరికి ఏంతో కొంత నాన్న పెట్టారు కానీ నా దగ్గరికి వచ్ఛేసరికి అంత అయిపోయిందని, నేను ఇష్టపడిన వాడితో ఎలాగో పెళ్లి చేసేసారు. మా అత్తగారు ఎప్పుడు అదే దెప్పుతుంటారు. ఎంతకి ఇష్టపడిన పెళ్లి అయినా మా హోదాకి తగ్గట్టు కనీసం కొంత బంగారం అయినా పెట్టలేదు అంటుంది. నేను మీ నాన్న గారికి అదే అని నా బంగారం నీకు ఇద్దామంటే ఒప్పుకో లేదు. మరి అయన ఉద్దేశం ఏమిటో నాకు అర్ధం కాలేదు అని అంది. ఈ అల్లుడు మాత్రం ఏమి అనలేదు ఎందుకంటే ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడు కదా.

తరువాత జానకమ్మగారికి కొంచం కొంచంగ అర్ధం అవ్వడం మొదలయ్యింది. వీళ్లంతా నా బంగారం కోసం నన్ను చూసుకుంటున్నారు గానీ నిజమైన అభిమానంతో కాదు. బహుశా అందుకేనేమో మా ఆయన ఇది ఎవరికి పెట్టనివ్వలేదు. ఎంతైనా ఆయన చాలా తెలివైన వారు. నేనంటే ఎంతో ఇష్టం. ఆయన చెనిపోయిన తరువాత నేనేమైపోతాననే అతని బాధ ఎప్పుడు. ఎన్నో సార్లు అదే అంటే అదేమీ మాటలు మీకంటే ముందు నేనే పోతానని అనే దానిని. ఇంత అభిమానమున్న అతనికి నేనేమి చెయ్యలేదు. ఎదో ఒకటి చెయ్యాలి అన్పించింది.

ఒక రోజు ఆయన కలలో కన్పించి బాగున్నావా జానకి అని అడిగేరు. అప్పటి నుండి ఆయన ఆలోచనలే వస్తున్నాయి. ఎదో ఒకటి చెయ్యాలి. అయన ఎప్పుడు అనే వారు కొంతమంది పేద విద్యార్థులకి అనాధ ఆశ్రమం పెట్టి విద్య బుద్దులు నేర్పించాలని. కానీ ఆయన కోరిక ఎప్పుడు నెరవేర లేదు. పిల్లలతో ఆయన చెనిపోయిన తరువాత అదే మాట అంటే అమ్మ మా బ్రతుకులే కష్టముగా గడుస్తున్నాయి ఏమి చెయ్య గలము అనేసారు. అంత అలోచించి జానకమ్మ గారు ఒక నిర్ణయంకి వచ్చింది. వెంటనే తన మరిదిని పిలిచింది. మరిదికి ఒదిన గారంటే చాల గౌరవం. ఎందుకంటే ఆమె దగ్గరే అతను పెరిగాడు. ఆమె ఎంతో అభిమానంగా చూసింది. అన్నయ్య అన్న చాల గౌరవం.

బాబు నువ్వు నాకు ఒక పని చెయ్యాలి. నా బంగారం అంత మన పెద్ద బీరువాలో ఉంది ఇదిగో తాళం చెవి. ఆ బంగారం తీసి అలాగే బంగారం పూసిన నగలు చేయించు. చేసిన తరువాత అవి పెట్టెలో పెట్టేసి తాళము వెసెయ్యి. తాళం నీ దగ్గర ఉంచు. అప్పుడు ఈ నగలు అమ్మేసి ఆ డబ్బుతో ఒక అనాధ ఆశ్రమం తయారుచెయ్యి అని చెప్పింది. ఇది నా ఆఖరి కోరిక. మీ అన్నయ్య గారి ఆశయం కూడా. ఇది నా వినతి కాదు నా ఆదేశం అనుకో. చేస్తాను వదిన కానీ ఈ డబ్బు చాలదు అన్నాడు. మొదట చిన్నది స్టార్ట్ చేసి మీ అన్నయ్య దగ్గర చదువుకున్న వాళ్లలో చాలా మంది మంచి ఉద్యోగాలలో ఉన్నారు ఒక అబ్బాయి కలెక్టర్ కూడా అయ్యాడు. అందరికి ఉత్తరాలు రాయు అంది. మరిది వదిన ఆదేశంగా అంత ఆలా చేసాడు. మొత్తానికి అందరి సహకారంతో అనాధ ఆశ్రమం మొదలయింది. శోభాయమానంగా దాని ఆరంభోత్సం కూడా జానకమ్మ గారి చేతనే చేయించారు. ఆమెకి ఎంతో తృప్తిగా అనిపించింది.

ఇంకొకటి వదిన బంగారం పూసిన నగలు ఎందుకు చెయ్యాలి వాటికి కొంత ఖర్చు అవుతుంది పెట్టె ఖాళీగా ఉంచితే సరిపోతుంది కదా అని మరిది అడిగాడు. నగలు వచ్చ్చాయన్న తృప్తి ఉంటేనే వీళ్ళు నా చివరి కార్యక్రమాలు కనీసం వాళ్ళకి నిజం తెలిసిన వరకైనా సరిగ్గా చేస్తారు లేదంటే అసలు పట్టించుకోరు అంది. తాళం నా దగ్గర ఎందుకు వదిన అనిఅడిగితే చూడు నేను ఎప్పుడు చచ్చిపోతానో నాకే తెలియదు నేను అపస్మారకం లో ఉన్నప్పుడు ఎవరైనా తీసుకో వచ్చు. అప్పుడు వాళ్లలో కలతలు వస్తాయి. వదిన చాలా తెలివైనది అనుకున్నాడు.

తరువాత కొద్ది రోజులకి ఆమె ఆరోగ్యం ఖ్సీనించడం మొగలయింది. ఒక రోజు పిల్లలిని మరిదిని అందరిని పిలిచి ఒరే మీరందరు నన్ను ఎంతో బాగా చూసుకున్నారు. దానికి నేనెంతో కృతఙయురాలుని. నా బంగారం మన బీరువాలో ఉంది. తాళం మీ చిన్నాన్న దగ్గర ఉంది అది పెద బాబు నువ్వు తీసుకుని అందులో ఎవరికి ఏమి చెందుతుందో రాసి పెట్టాను అవి అలా తీసుకోండి అని చెప్పింది. నా వొంటి మీద ఉన్న కొంచం మాత్రం మీ చిన్నాన్న గారి కూతురికి ఇవ్వండి అంది. మరిది నాకెందుకు వదిన అన్న మనస్సులోనే ఆమె మంచి గుణానికి ఎంతో మెచ్చుకున్నాడు. ఆడ పిల్లలు అందరు అమ్మ నీ బంగారం ఆడపిల్లలికి చెందాలి కదా అన్నయ్యలకి ఎందుకు ఇస్తున్నావు. అది కాదమ్మా నాకు తెలుసు మీరందరు ఆ బంగారం కోసమే నన్ను బాగా చూసుకున్నారు. అది నా కష్టార్జితం. నాకు మా అమ్మ వాళ్ళు ఇచ్చింది గానీ మీ నాన్నగారు చేయించింది గాని కాదు. మీ నాన్నగారు కూడా అందరికి సమానంగా ఇమ్మని చెప్పారు. మరి ఆయన ఉద్దేశం ఏమిటో నాకు అర్ధం కాలేదు అని అంది. ఇక చేసింది లేక అందరు ఒప్పుకున్నారు. ఎవ్వరు లేనప్పుడు చిన్న కూతురు వఛ్చి అమ్మ నాకు ఏమి ఇవ్వలేదు కాబట్టి నాకు కొంచెం ఎక్కువ ఇవ్వు అంది. అలా ఒక్కొక్కరు ఎదో ఒకటి చెప్పి తమకి ఎక్కువ ఇమ్మని అన్నారు. అప్పుడు ఆమెకి చాల బాధ అన్పించింది. ఆ బాధతోనే ఒక రోజు కన్ను మూసింది.

అందరు పిల్లలు కలసి ఆమె అంత్య కార్యక్రమం చేసేసారు. మరుచటి రోజే చిన్నాన్న గారిని పిలిచి బంగారం విషయం అడిగారు. అయన పిల్లలికి చెప్పారు అంత్య కార్యక్రమం అయిన మొదటి రోజే పంచుకుంటే మంచిది కాదు ఆమె పెద కార్యం తొమ్మిది రోజులు తరువాత అయిన వెంటనే తీసుకుందురు లెండి అన్నారు. అన్ని రోజులా అన్నట్టు చూసారు. ఒక వేళ చిన్నాన్న గారు తీసేసుకుంటే ఏమి చెయ్యగలం అనుకున్నారు. వాళ్ళ అనుమానం గ్రహించి ఆయన బీరువాకి రెండు తాళాలు వేద్దాము. ఒకటి నా దగ్గర ఉంటుంది ఇంకొకటి పెద వాడి దగ్గర ఉంటుంది అని చెప్పారు. ఇదేదో బాగుంది అనుకున్నారు కానీ ఆడపిల్లలు కోరిక పట్టలేక మా పిల్లల చదువులు పోతాయి అప్పటి వరుకు ఉంటె, మా అత్తగారికి బాగోలేదని ఒకరు ఆలా చెప్పారు. వాళ్ళ కోరిక చూసి చిన్నాన్న అన్నారు ఒక పని చేద్దాం మూడు రోజులుకి పురం ఎత్తేద్దాము. తరువాత పెద్దకార్యం తొమ్మిది రోజులకి చేద్దాం అన్నారు. బంగారం వస్తుంది కదా అన్న ఆతృతలో అందరు ఒప్పుకున్నారు.

పురం ఎత్తిన తరువాత అందరు చేరి పెట్టె తెరిచారు. అందరు తల తల మంటున్న బంగారం చూసి మురిసి పోయారు. ఎవరి పేరు మీద ఉన్నది వాళ్ళు తీసుకున్నారు. ఆమె ఒంటిమీద ఉన్న కొద్దిపాటి బంగారం చిన్నాన్న కి ఇచ్చ్చారు. చిన్నాన్న దానిని అనాధ ఆశ్రమం కి ఇచ్ఛేస్తానన్నారు. అది మీ ఇష్టం అని అందరు సంబర పడి పోయేరు. ఎవరిళ్ళకి వాళ్ళు వెళ్లిన తరువాత మొక్కుబడిగా తొమ్మిదవ రోజుకి వఛ్చి కార్యం పూర్తి చేసి వెళ్లిపోయారు. ఒక కూతురు ఆమెకి వఛ్చిన నగ పాత మోడల్ ది అని దానిని విరిపి కొత్త మోడలు చేసుకుందామని బంగారం షాపుకు వెళ్తే అది బంగారం పూసినది అని తెలిసింది. లబో దిబో మని అందరికి చెప్పింది. తక్కిన వాళ్ళు కూడా ప్రయత్నించగా అది బంగారం పూసినది అని తేలింది.

దానితో అందరు చిన్నాన్నని నిలదీయడానికి వెళ్లారు. ఆయనే ఎదో చేశారని పెద్ద మాటలు ఆడారు. అప్పుడు ఆయన ఒక కవరు వాళ్ళకి ఇచ్చ్చారు. అందులో వాళ్ళ అమ్మ రాసిన ఉత్తరం ఉంది. ఆమె ఏమి రాసిందంటే పిల్లలు మీ చిన్నాన్న ప్రమేయం ఇందులో ఏమి లేదు నేనే మీ నాన్న గారి పేరున ఆశ్రమం తెరవడానికి ఇది చేశాను. మీ నాన్న గారి పేరు చిరకాలం ఉండాలంటే నాకు ఇదే మార్గం అనిపించింది. నాది తప్పయితే నన్ను క్షమించండి.

అయినా వినకుండా చిన్నాన్నే ఆ ఉత్తరం రాసుంటారు అని అమ్మ సంతకం పరిశీలించారు. అది సరిపోయింది. అయినా తృప్తి చెందక ఆయన ఏదైనా తెల్ల కాగితం మీద అమ్మతో సంతకం చేయించి ఆయనే రాసి ఉంటారని పోలీస్ కంప్లైన్ ఇచ్ఛేరు. పోలీసులు వఛ్చి ఆయనని నిలదీయగా ఎక్కడైతే గోల్డ్ అమ్మేరు ఆ షాప్ కు తీసుకు వెళ్లి రసీదులు చూపించారు. ఎక్కడైతే బంగారం పూసిన నగలు చేయించారో అక్కడ కూడా సాక్ష్యం ఇప్పించారు. అప్పుడు పోలీస్ లు సంతృప్తి చెంది వాళ్ళ అందరికి బుద్ధి చెప్పి పంపించారు.

కొన్ని సంవత్సరాలు తరువాత ప్రభుత్వం ఆ సీతారామయ్య గారి అనాధ ఆశ్రమానికి దేశంలో మంచి అనాధ ఆశ్రమంగ రాష్ట్రపతి అవార్డు ఇఛ్చి జానకమ్మగారికి పద్మశ్రీ అవార్డు ఇచ్చింది. ఆ అవార్డుకి కూడా మేము వెళ్తామంటే మేము వెళ్తామని అందరు పిల్లలు తగువులాడుకుంటుంటే ఆ అవార్డు ఉత్తరంలో చిన్నాన్న లక్ష్మి రామయ్య గారు మాత్రమే రాష్ట్రపతి భవన్ కు రావలిసిందిగా అని రాసి ఉన్నది చూసి అందరు నోళ్లు మూసుకున్నారు. తాము తమకి జన్మ నిచ్చిన వారికి ఎంత అన్యాయం చేశారో తెలుసుకున్నారు.

“ఇకనైనా పిల్లలు తాము తమకి జన్మనిచ్చిన వారికి చెయ్యవలసిన బాధ్యతలు తెలుసుకుంటే ఈ సమాజం బాగు పడుతుంది”.

మరిన్ని కథలు

Lost Words
చివరి మాటలు
- దార్ల బుజ్జిబాబు
Akshaya Patra - Bommala Kathalu
బొమ్మలు చెప్పిన కమ్మని కథలు
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు.
WIfe also a human
భార్య ఒక మనిషే అర్థం చేసుకొరూ
- విన్నకోట శ్రీదేవి
Bhojaraju Kathalu
బొమ్మలు చెప్పిన కమ్మని కథలు
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు.
wife sri lakshmi
సతీ శ్రీలక్ష్మి (కామెడీ కథ)
- సరికొండ శ్రీనివాసరాజు‌
devadattudu Fairy tales told by dolls
బొమ్మలు చెప్పినీ కమ్మనికథలు
- బెల్లంకొండ నాగేశ్వరరావు.
singing donkey
గాన గంధర్వ ఈ గార్ధభం
- కందర్ప మూర్తి