నవ్వుల లోకం - భాస్కర్ కాంటేకార్

Laughing Club

======================

ఒక రోజు దగ్గరలో వున్నపార్క్ లో వాకింగ్ కి వెళ్ళాను.అక్కడ ఒక అంధ అబ్బాయి మరియు ఒక అమ్మాయి, పార్కులో లాఫింగ్ ఎక్సర్సైజ్ చేస్తున్న ఒక బృందాన్ని తదేకంగా చూడటం గమననించా. ఆ సంఘటనే ఈ కథకు ప్రేరణ. వారిద్దరికీ ఈ కథ అంకితం.

======================

అది ఒక ఉదయం.నన్ను రోజు ఉదయం పూట పార్కు కి తీసుకెళ్తుంది లాస్య. ఎప్పటి లాగే నిదుర లేచాను. 'అంతా నిన్నటి లాగే ఉంది అనడం కంటే అంటా రాతిరి చీకటి లాగే ఉంది 'అంటే బాగుండేమో అనిపించింది, కానీ లాస్య కు బయబడి అనలేదు. లాస్య కు నెగటివ్ వర్డ్స్ వాడటం ఇష్టం ఉండదు.

"నవ్వుల లోకం పరిచయం చేస్తాను వస్తావా" అడిగింది శ్రీలాస్య, కాఫీ కప్పు నూ చేతి కందిస్తూ.

"నవ్వుల లోకమా!" ఆశ్చర్య పడుతూ అడిగాను.

"అవును నవ్వుల లోకమే! నాగ లోకం, దేవ లోకం, ఆలాగే అది ఒక లోకం నాకైతే ఆశ్చర్యంగా ఉంది , నిజంగా నవ్వుల లోకం అంటూ ఒకటుంటుందా అని, కాఫీ తాగుతూ ఉండబట్ట లేక అడిగాను.

"భూలోకంలో నవ్వుల లోకం ఒక భాగమా లేక ఇది భూమి అవతల ఆకాశం మీద ఒక భాగమా? అక్కడికి చేరేందుకు బస్సు, రైలు విమానం ఏది కావాలో ?" అన్నాను కాఫీ చప్పరిస్తూ.

"అబ్బా నీకన్ని సందేహాలే. నవ్వులంటే నవ్వులంతే, అక్కడ నవ్వులే తప్ప మరోటి ఉండదు" సమాదానమిచ్చింది శ్రీలాస్య, చిరునవ్వుతో కాబోలు.

ఆలా ఎందుకు అనిపించదో నాకైతె తెలీలేదు. "ఇంకొక్క సందేహం,ఆ లోకంలో ఎందుకలా నవ్వుతారు? " సంశయిస్తూ అడిగాను.

"ఇదేమి ప్రశ్న.(నొసలు చిట్లిస్తూ) అడిగింది లాస్య.

"నవ్వుల లోకంలో నవ్వులే కదా ఉండేది.అందరూ ఉల్లాసంగా,ఉత్సాహంగా నవ్వుతూ వుంటారు కాబట్టే ఆ లోకానికి నవ్వుల లోకం అని పేరు." సమాదానమిచ్చింది శ్రీలాస్య.

కాళీ కప్పు ని నాచేతి నుండి తీసుకొని టి పాయ్ పై పెట్టి ,సరే పద అంటూ నా చేయి పట్టుకుంది శ్రీలాస్య. అలాగె ఆమె చేయిని పట్టుకుని అనుసరించాను. కొద్దీ దూరం నడిచాక లాస్య చెపుతూ ఉంది "ఇదొక పెద్ద కాంప్లెక్స్ ,ఈ కాంప్లెక్స్ కి ' 'నవ్వుల లోకం' అని పేరు.' నవ్వుల లోకానికి స్వాగతం ' అంటూ బోర్డు రాసి పెట్టిన పెద్ద కమాను ఉంది. "మనము ఆ కమాను కింది నుండి కాంప్లెక్స్ లోకి ఎంటరవుతున్నాము" అంది లాస్య.

ఈ కాంప్లెక్స్ లో ఇటు పక్క ఒక వైపు పార్కు, మరో వైవుకు మినీ సినిమా హాల్ , ఒక చిన్న మ్యూజియం, గాన కచేరిలు చేసుకునేందుకు వీలుగా ఉన్న వేదికలు మరియు ఒక మెడిటేషన్ హాలు" కమాను లో నుండి కొంచం దూరంలో, కుడి ప్రక్కన ఓ పార్కు ఉంది. పార్కు గేటు తీసుకొని లోనోకి వెళ్ళాము.

"పార్క్ ఎలా ఉంది" అనడిగాను శ్రీలాస్య ను.

లాస్య చెప్పడం మొదలెట్టింది. "పార్క్ పచ్చదనంతో నిండి ఉంది. గేటు ముందు వరుసగా ఉన్న పూల చెట్లు, మన రాకను స్వాగతిస్తూ చేతులతో ఆహ్వానిస్తున్నట్లున్నాయి. చిన్న గడ్డి పోచలు , కొత్తగా తమ ఇంటికి వచ్చిన వారిని ఆశ్చర్యంగా , భయంగా చూసే పసిపాపల్లా, తలలెత్తి మన వైపు చూస్తున్నాయి. ఇంకా కసుకున్న నవ్వి ,ముఖం చాటేసుకొనే కొంటె పిల్లల్లా ముద్ద మందారాలు , పిల్ల గాలులకు తమని తాము చాటేసుకొంటు దోబూచులాడుతున్నాయి." లాస్య చెప్పడంలో లాలిత్యం ఉంటుంది.అది నా అదృష్టం.

ఆ పార్క్ లో నడుస్తూ ఉంటే, మనసుకు ఎంతో హాయిగా ఉంది.పైగా శ్రీలాస్య ను అనుసరిస్తూ నడుస్తూ ఉంటే నాకు ఒక భరోసా. మనస్సు చెప్పలేని ఆనందంలో తలమునకలవుతూ ఉంది. శ్రీలాస్య సన్నిధి లో నాకు ఒకరకమైన ఆనందం మరియు సంతోషం అన్నీ కలుగుతాయి. కొన్ని సార్లు నేను ఆమెను లాస్య అని కూడా పిలుస్తాను , మీరేమి కన్వ్ఫూస్ కాకండి.. కొంచెం దూరం నడిచాక ఒక దగ్గర ఆగింది శ్రీలాస్య. ఆమె ఆగిందే తడువుగా నేను కూడా ఆగాను.

ఆమె మళ్ళీ చెప్పటం మొదలు పెట్టింది. "మనం నిలుచున్న స్థలానికి కొద్దీ దూరంలో,ఒక పెద్ద లాను అంటే పచ్చిక బయలు.. క్రింద పచ్చటి తివాచీ పరచినట్లున్న మెత్తని గడ్డి మొక్కలు. ఆ పచ్చదనం పై చల్లిన తెల్లని పూల లాగా సుమారుగా ఓ నలభై మంది వరుసగా నిలుచున్నారు. అందరూ తెల్లని పైజామా, కుర్తా ధరించి వున్నారు. పచ్చని గడ్డి పై తెల్లని డ్రెస్ వేసుకొని, అందరూ మూడు నాలుగు వరుసలలో నిలబడ్డారు". అందరు తమ రెండు చేతులను గాలిలో లేపి మళ్ళీ వెనక్కి లాక్కొని గట్టిగా చప్పట్లు కొడుతున్నారు. చప్పట్లకు అనుగుణంగా రిదమిక్ గా నవ్వుతున్నారూ. కొందరు గట్టిగా, కొందరు సన్నగా, కొందరు ముసిముసిగా. కొందరూ పళ్ళు కనిపించేలా, మరికొందరు పెదవులు మాత్రమే కదిలేల అందరూ మూకుమ్మడిగానవ్వుతున్నారు లాస్య ఏంటదీ ? అనడిగా.

జవాబుగా లాస్య అంది, "అది నవ్వుల చప్పుడు.అందరూ చప్పట్లు కొడుతున్నారు, నవ్వులు నవ్వుతున్నారు. మార్చి మార్చి నవ్వుతున్నారు. ఆ పార్కు మొత్తం ఆ నవ్వులు మరియు చప్పట్ల చప్పుళ్లతో మారు మ్రోగుతుంది. పార్కు చుట్టూ డాబా ఇండ్లు ఉండడం వలన రీసౌండ్ వొచ్చి , ఆ శబ్దాలు ద్విగుణీకృతం అయ్యి ఇంకా బాగా ,వినసొంపుగా లయ బద్దంగా వినిపిస్తున్నాయి. ఎలా ఉంది అంది లాస్య. చాలా బాగుంది. ఇంత మంది ఒక దగ్గర బృందంగా చేరి ఇలా నవ్వడం బాగుంది. ఈ చప్పుళ్ళు వినడానికి చాలా అందంగా ఉన్నాయి అన్నాను శ్రీ లాస్యతో. ప్రకృతికి తనకంటూ ఒక మూడు , ఒక భావన ఏమి ఉండదు.మనం ఎలాగ ఊహించుకొంటే అలాంటి భావనతో మనకు దర్శనమిస్తుంది. అశోక వనం లో దుఃఖం లో ఉన్న సీతమ్మ కు , అక్కడి చెట్లు,పుట్టలు అన్ని కూడా విషాదంలో ఉన్నట్లే తోచేవట. ఇప్పుడు ఇక్కడ మనం నవ్వులు వింటున్నాం కాబట్టి మన మనసుకూడా ఆనందంగా ఉంటుంది.ఆ నవ్వుల శబ్దం వింటున్నంత సేపు, మనసులో ఒక రకమైన సంతోష భావన కలుగుతుంది. నవ్వు సంతోషాన్నీ ప్రకటించే హావ భావం.అందుకే నవ్వుల శబ్దం విన్నప్పుడు, విన్న వారి మనసుకుడా పులకించి పోతుంది. సరిగ్గా నాకు అదే జరుగుతోంది.

ఇక శ్రీలాస్య తో అడిగాను"ఇదేనా నవ్వులలోకం అంటే " అని. ఇదీ నవ్వుల లోకమే కానీ దీనికి మించి ఇంకో ప్రదేశం ఉంది , నిన్నక్కడికి తీసుకెళ్తాను పదా అంటూ నా చేతిని పట్టుకొని, పార్కు పక్కనే ఉన్న మినీ థియేటర్ వైవుకు జాగ్రత్తగా తీసుకెళ్లింది. "అక్కడ కూడా ఇలాగే నవ్వే చప్పుళ్ళు ఉంటాయా ? " అని అడిగాను. "అన్నీ ఇక్కడే చెపితే థ్రిల్ ఏముంటుంది" పదా అంటూ పార్క్ పక్కనే ఉన్న చిన్న హాలు లోకి తీసుకెళ్లింది. హాలుకి కొంచెం ఎగువ గా ఓ డోర్ , దాన్ని తెరువగానే లోనుండి ఒకటే నవ్వుల సవ్వడి. తలుపులు వేయగానే చప్పుడు లేదు.

"ఏంటదీ "ఆశ్చర్యంగా అడిగాను.

"ఇది మినీ సినిమా హాల్ అని, అక్కడ పేరుపొందిన హాస్య చిత్రాలు మరియు చిత్రాలలోని హాస్య సన్నివేశాలను చూపిస్తారు. అది చూసి జనం విరగబడి నవ్వుతున్నారు. డోర్ తెరిచినప్పుడు ఆ నవ్వుల శబ్దం ఇక్కడి వరకు వినిపిస్తుంది. డోర్ మూస్తే ఆ నవ్వుల చప్పుడు ఆ హాలు లొనే ఉంటుంది " ఆ హాలులో ఓన్లీ కామెడీ క్లిప్పింగ్స్ మాత్రమే చూపిస్తారు. ఎవరైతే హాయిగా కాసేపు నవ్వాలనుకుంటారో, వారు ఇక్కడకు వచ్చి కొంత సమయం గదుపుతారు.

నవ్వుల లోకం అంటే కొంచం అర్థం అయినట్లనిలించింది నాకు. నవ్వడం అంటే మనం నవ్వాలి కానీ ఎవ్వరో నవ్వుతున్న శబ్దాలని వింటే మనకు నవ్విన అనుభవం కలుగదు కదా. నేను నవ్వాలి అంటే ఎదుటి వారి కొంటె చేష్టలను చూడాలి.కానీ... "నేను కూడా నవ్వాలి అంటే ఎం చేయాలి?" అని లాస్యను అడిగాను. లాస్య నవ్వుతూ చెప్పింది, " ఏముంది సింపుల్, నీవు ఆ గ్రూప్ లో చేరి, వారు నవ్వుతున్నట్లు నవ్వడమే. అంది. తరువాత నా ముఖ కవలికలు గమనించి కాబోలు, తను టాపిక్ మార్చి , అవన్నీ నీకు పరిచయం చేస్తానుగా తొందరెందుకు , నీవు ఆ అనుభూతిని ఎలా పొందాలో చెపుతాను కానీ పద అంటూ పక్కనే ఉన్న ఒక హాలులోకి తీసుకెళ్లింది.

ఆ హాలు లోకి ప్రవేశించే ముందు ,దాని గురించి వివరించింది శ్రీలాస్య. 'ఆ హాలులో చిన్న చిన్న క్యూబికల్స్ ఉంటాయని. ప్రతి క్యూబికల్ లో ఇద్దరు కూర్చోడానికి వీలుంటుందని కూర్చున్న వారికి ఎదురుగా ఒక స్క్రీన్ ఉంటుంది. రమనీయంగా ఉండే అందమైన ప్రకృతి ఫోటోలు అక్కడ ప్రదర్శించ బడతాయని. మరియు పక్కనే కొన్ని మైక్రో ఫోన్స్ , ఇయర్ బడ్స్ పెట్టి ఉటాయని, అవసరమనుకున్న వాళ్లుగా మైక్రో ఫోన్స్ తో ముందుగానే లోడ్ చేయబడిన పాటలు వింటూ , స్క్రీన్ తమకు ఇష్టమైన ప్రకృతి సౌందర్య చిత్రాలను చూస్తూ మెడిటేషన్ చేసుకోవచ్చునని. చాలామంది ఆ స్క్రీన్ లేకుండా, ఏ సంగీతం లేకుండా కూడా ధ్యానంలోకి వెళ్ళిపోతారని ' అక్కడి పరిస్థితిని కళ్ళకు కట్టినట్లు విషద పరిచింది శ్రీలాస్య హాలు లోకి అడుగు పెడుతూనే, ఇది అదే క్యూబికల్స్ ఉన్న హాలేనా అని అడిగాను.

అవును .ఇది నే చెప్పిన అదే మెడిటేషన్ హాల్, ఇక్కడ మాటాడకూడదు, క్యూబికల్ లోకి వెళ్లి మాట్లాడుకొందాము పదా అని ఓ క్యూబికల్ లోకి తీసుకెళ్లి డోర్ వేసింది. సౌండ్ ప్రూఫ్ గది అది, ఏ చప్పుడు లేకుండా ప్రశాంతంగా , నిశ్శబ్దంగా ఉంది.మన మాటలు ఎవరికి వినపడవు కూడాను. నన్ను కూర్చుండ బెట్టి , తను కూడా పక్కనే ఉన్న సీట్లో కూర్చుంది.

"ఇక్కడ కూర్చొని, ఈ ఇయర్ ప్లగ్స్ చెవిలో పెట్టుకుని సంగీతాన్ని వింటూ మెడిటేషన్ చేస్తారు కొందరు. ముందు ఉన్న వివిధ ఫోటోలను చూసుకొంటు ఆ పీఫోటోలో కి మానసికంగా వెళ్ళిపోతారు. పక్కనే ఉన్న బటన్ నొక్కితే, ముందు స్క్రీన్ లో ఉన్న ఫోటోలు మారుతాయి. మన మూడుకి అనుగుణంగా ఫోటోలు మార్చుకొని మెడిటషన్ చేసుకుంటారు. కొందరు ఏ ఫోటో లేకుండా కళ్ళు మూసుకుని కూడా ధ్యానం చేస్తారు. " లాస్య మెల్లిగా చెపుతూ ఉంది. ఆమె చెపుతూ ఉంటే అవన్నీ చూసినంత అనుభూతి కలుగుతుంది. ఆమె గొంతులో ఏదో మాధుర్యం ఉంది. వింటువుంటే ఇంకా వినాలనిపిస్తుంది. మళ్ళీ శ్రీలాస్య చెప్పడం మొదలుపెట్టింది. "ఇంతవరకు అక్కడ లానులో జనాలు బహిరంగంగా నవ్వే నవ్వులను విన్నాము.ఆ నవ్వులు విని మనము నవ్వాము.. ఇక మినీ థియేటర్ లో నవ్వులు విన్నాము. అవి ఒక విషయాన్నీ చూసి మనసు ఆనందపడినప్పుడు బయటకు వచ్చిన నవ్వులు నవ్వడానికి మనకు మూడు సందర్భాలు దోహదపడతాయి. ఒకటి విని ,రెండోది చూసి. ఇక మూడవ రకం గురించి నీకు చేపుతాను విను." నేను వింటున్నట్లుగా తల ఊపాను. తాను చెప్పుకుంటూ పోతుంది,

"నవ్వడం లోను రెండు రకాలు ఉన్నాయి. ఒకటి బహిరంగంగా అందరికి వినిపించేలా నవ్వడం, రెండోది మనలో మనం నవ్వుకోవడం. ధ్యానం లోకి వెళ్లి, మనసుకి నచ్చిన చిత్రాన్ని వూహించుకొంటు మనసులో నవ్వడం. ఇదొక చిత్రమైన మరియు బాగా ఆదరింపబడుతున్న యోగ ప్రక్రియ. ఆటో సజేషన్ ఇచ్చుకొంటు లోలోన హాయిగా నవ్వుకోవడమే దీని ప్రధాన ఉద్దేశ్యం. ఆటో సజెషన్ అంటే అనడిగాను లాస్యను. మన మనసుకు మనమే సజేసన్ ఇస్తూ ,ఊహల్లొకి వేళ్ళడం. సెల్ఫ్ ఎప్నటైజ్ లాంటిది. . మనమంతా మూసివున్న మిని థియేటర్ లాంటి వాళ్ళం . ఒక్కసారి లోనికి వెళ్లి డోర్ వేసుకొంటే చాలు మన నవ్వులు మనమే వినుకోవచ్చును. పక్కనే కూర్చొన్న శ్రీలాస్య చెపుతూ పోతుంది. కూర్చొని, ముందు ఒక ఏకాగ్రత స్థితికి రావాలి. అప్పుడు మెల్లిగా ఆటో సజేషన్ ఇచ్చుకొంటు, నవ్వుల లోకంలోకి జారీ పోవాలి.

'ఇక ప్రయత్నించు' అంది లాస్య. తాను చెప్పినట్లుగా, ముందు ఏకాగ్రతగా కూర్చున్నాను. ఏకాగ్రత కుదిరిన తరువాత ఆటో సజెషన్స్ ఇవ్వడంమొదలు పెట్టాను. ముందు మానసికంగా ,నవ్వుల లోకం లోకి ఎంటర్ అవ్వడం నుండి మొదలుపెట్టాను. ఒక ఊహ లోకంలోకి వచ్చాను. తరువాత మెల్లిగా పార్కు వద్దకు వచ్చి లాఫింగ్ క్లబ్ లో చేరాను. నేను కుడా వార్ లాగ తెల్లని డ్రెస్ వేసుకున్నాను.అందరితో పాటు చప్పట్లు కొట్టుకొంటు, పెద్దపెద్దగా నవ్వసాగా.. ఆ నవ్వుల చప్పుడు ఆ పార్కుఅంతా ప్రతిధ్వనిస్తుంది. ఆహా ఎమిటా నవ్వుల చప్పుడు. మమ్మల్ని చూసి జనం కూడా సంతోశంతో నవ్వుతున్నారు. ఎంతో ప్రశాంతంగా ఉంది. మా గ్రూప్ చుట్టూ కొంత జనం ప్రోగయ్యారు. అందరూ మా గ్రూపుని విచిత్రంగా చూస్తున్నారు. ఆ ప్రోగైన జనంలో శ్రీలాస్య కూడా ఉంది. శ్రీ లాస్య ను వచ్చి మాతో కలవమన్నాను. కానీ తనకు తెల్లటి డ్రెస్ లేదని , నేను మీతో కలవడం కుదరదు అంది. లాఫింగ్ తెరపి లాంటిదే ఈ నవ్వడం.

అలా ఓ గంట ప్రాక్టీస్ చేసిన తరువాత నేను లాస్య దగ్గరకు వొచ్చి ఇద్దరం కలిసి మినీ థియేటర్ లోకి వెళ్ళాము. లోపల ప్రేక్షకులు కడువులు చెక్కలయ్యేలా నవ్వుతున్నారూ. చార్లీ చాప్లిన్ సీన్ వేశారు. హాలులోకి వెళ్ళగానే చీకటి అనిపించినా కొద్దీ సేపటి తరువాత అందరూ కనిపించ సాగారు. ఇద్దరం వెళ్లి కాళీ ఉన్న సీట్లలో కూర్చున్నాము. అబ్బో ఏమి నవ్వులవి. పడి పడి నవ్వుతున్నారు. కొందరు బిగ్గరగా, కొందరు మెల్లిగా. మరికొందరు ఎంత జోకైనా సరే చిరునవ్వుని మించి నవ్వడంలేదు. ఇక లాస్య నవ్వడం చూస్తే మనం నవ్వకుండా ఉండలేము. ముందు పుర్రు మంటూ మొదలు పెట్టి , వంగి తన కడుపు పట్టుక్కని నవ్వుతుంది. అమ్మో ఇక తనని కంట్రోల్ చేయడం కష్టం అనిపించేంతగా - గట్టిగా నవ్వుతుంది. లాస్య కు నవ్వుతో పాటే చేతులతో పక్కనున్న వారిని కొట్టే అలవాటు కూడా ఉన్నట్లుంది. ఇంకేముంది నవ్వాల్సి వచ్చినప్పుడు, నా తొడలపై గట్టిగా కొట్టసాగింది.

నేను నా జీవితంలో ఇంతగా పడి పడి నవ్వడం ఇదే మొదటి సారి... నవ్వుతునే ఉన్నాము. ఇంకా గట్టిగా నవ్వుతున్నాము. మనస్ఫూర్తిగా నవ్వుతున్నాము.నవ్వుతూనే ఉన్నాము. శ్రీలాస్య నన్ను తట్టి లేపె వరకు, నేను అదే ఊహా లోకంలో నవ్వుతూనే ఉన్నాను. శ్రీలాస్య అడిగింది " ఇక నవ్వుల లోకం లోంచి బయటకు రావా ?" అని. చాలా లోతుగా గా మెడిటేషన్ లోకి లేదా ధ్యానంలోకి వెళ్లిన వారిని ట్రాన్స్ లోకి వెళ్లారంటారు. నేను అదే స్థితికి చేరానేమో! మెల్లిగా ట్రాన్స్ లొంచి బయటకు వచ్చాను. అదే చీకటి . 'కళ్ళు లేవని నీకు వలదింక కలతమ్మ, తన కళ్ళతో జగతి చూపించ గలడమ్మ' అన్నట్లుంది నా పరిస్థితి'. పక్కనే శ్రీలాస్య ఉందన్న భరోసాను మరొక్కసారి నిర్ధారించుకొన్నాను. నవ్వుల లోకం గూర్చి నా అనుభవాల్ని అడుగుతూ , నన్ను ముందుకు నడిపిస్తూ శ్రీలాస్య , కనిపించని నా కళ్ళకు తాను కంటిచూపై.

మరిన్ని కథలు

Naanna neeku vandanam
నాన్నా..నీకు వందనం!
- చెన్నూరి సుదర్శన్
Lakshyam
లక్ష్యం...!
- రాము కోలా
Srirama raksha
శ్రీ రామ రక్ష
- అన్నపూర్ణ . జొన్నలగడ్డ
pustakala donga
పుస్తకాల దొంగ
- దార్ల బుజ్జిబాబు
Samasyalu
సమస్యలు
- Dr.kandepi Raniprasad
Nijamaina Gnani
నిజమైన జ్ఞాని.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు.
Evaru goppa
ఎవరు గొప్ప.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు.