ఊరే వాళ్లకి ఊపిరి..! - లక్ష్మి కుమార్

village thoughts

"రాజమ్మ ఉదయం నుండి, ప్రతి సారి గేట్ సౌండ్ ఐనప్పుడల్లా బయటకెళ్లి చూసి వస్తుంది. "ఎన్ని మార్లు బయటికెళ్తావ్.. కాళ్ళెం నొప్పి గిప్పి లేదేటి, అంటూ గుమ్మనికి బయట కూర్చున్న రాజమ్మతో.. అంటూ తనుకూడా బయట నిలబడి రోడ్డు వైపుకు చూస్తున్నాడు నాగయ్య...." అదికాదే రాజమ్మా వచ్చేవాళ్లు రాకేటికి పోతారు.. నోవ్వూరికే అటు ఇటు తిరిగితే మళ్ళా ఆ కాళ్లకేటైన ఐద్దెమోనని అంటూ ఆమె పక్కకే వచ్చి కూర్చున్నాడు...."

"నాని మానస ఆంటీ వాళ్ళు ఇంకా టెన్ మినిట్స్ లో వచ్చేస్తారంట మమ్మీ చెప్పింది.. కం ఇన్ సైడ్ అంటూ రాజమ్మ చేయి పట్టుకొని లాగుతున్నాడు ఏడేళ్ళ మనవడు... "

కాసేపటికి మానస ఆమె భర్త లోపలకి వస్తూనే "పెద్దమ్మ.. పెదనాన్న అంటూ రాజమ్మ నడుం చుట్టూ చేతులసి .. ఎలా ఉన్నావ్ పెద్దమ్మ అని ఆప్యాయం గా అడుగుతుంది.. వంశీ కూడా ఎలా ఉన్నారు మావయ్య .. ఆరోగ్యం బాగానే ఉంది కదా అంటూ కుశల ప్రశ్నలు అడిగాడు .

"మాము బాగానే ఉన్నాం కానీ నువ్వేట్ట ఉండవమ్మ అని రాజమ్మ, మానస ముంగురులను పైకి సరిచెస్తు అడిగింది.. "

ఇంతలోనే బయటకెళ్లిన ప్రదీప్ లోపలకి వచ్చి చెల్లెలు బావను చూసి అబ్బో అమ్మాయికి ఇప్పుడు ఖాళీ అయింది రావడానికి అన్నాడు.. .

"లేదన్నయ్య ముందు విశ్వ వాళ్ళింటి వెళ్ళాం, అక్కడొక టు డేస్ ఉన్నాం, ఇంక డాడీ వాల్ల దగ్గరకు వచ్చి ఒన్ డే అయింది.., పెద్దమ్మ వాళ్ళని చూడాలని ఈ రోజు ఇటోచ్చాం... అంటూ ఆపకుండా చెప్పింది మానస."

మానస నాగయ్య తమ్ముడు శ్రీనివాస్ కూతురు. వాళ్ళు ఉద్యోగ రీత్యా మొదటి నుండి హైదరాబాద్ సిటి లోనే ఉండేవారు, కానీ ప్రతి వేసవి సెలవలకు కుటుంబంతో సహ ఊరికెళ్లి నాగయ్య ఇంట్లోను నెల రోజులుండేవారు. అందుకే మానసకు పెద్దమ్మన్నా. పెదనాన్న అన్న చాలా ఇష్టం. మానస భర్త విశ్వతేజ అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ , మానసను పెళ్లి చేసుకొని వెళ్ళిన తరువాట మూడేళ్లకు ఇండియా రావడం ఇదే ఫస్ట్ టైమ్...,. అందరి బోజనాలు అయిపోయాయి, రాజమ్మ కోడలు.. పావని, మానస అమెరికా ముచ్చట్లలో పడ్డారు, ప్రదీప్, విశ్వ కూడా ఏవో మాట్లాడుకుంటున్నారు, పిల్లలు ఫోన్ లలో నిమగ్నమయ్యారు... నాగయ్య రాజమ్మ మాత్రం హాల్లో టీవీ చూస్తున్నారు. తర్వాత ఒక గంటకి మానస "వెళ్ళొస్తాం వదిన.. అంటూ బయలు దేరింది."

అరే అప్పుడే ఏంటి.. ఒక రోజు కూడా ఉండరా....అంది పావని

"లేదు వదినా మా ఆడబిడ్డ పెళ్లి ఉంది కదా చాలా పనులు ఉన్నాయి. మళ్ళీ పెళ్లికబురు చెప్పడానికి వస్తాను కదా. అంటూ ప్రయాణం అయ్యింది అందరూ గేట్ వరకు వచ్చి బాయ్ చెప్పి పంపించారు. వెళ్లే ముందు మాత్రం మళ్లీ వస్తా పెద్దమ్మ, పెదనాన్న బాయ్ అంటూ కారు అద్దాన్ని మూసింది. తర్వాత మళ్ళీ మామూలే ఎవరి పనుల్లో వాళ్ళు బిజీ, ప్రదీప్ మాత్రం ఒకసారి బయటికి వచ్చి, వాళ్ళమ్మ టాబ్లెట్ కవర్ చూస్తుంటే "అమ్మ మందులు ఉన్నాయా" అని అడిగాడు.. అయిపోయినాయి అయ్యా.. అంది రాజమ్మ.. “అమ్మ నీకు ఎన్ని సార్లు చెప్పాను, రెండు రోజులు ఉండగానే చెప్పమన్నా.. అప్పటికప్పుడు అంటే డాక్టర్ గారు అపాయింట్మెంట్ దొరకదు... నాకు కూడా సెలవు అంటే కష్టమే కదా, అందుకే ముందు చెప్పమనేది .... అన్నాడు ప్రదీప్

"నాకేం తెలుసు అయ్యా మళ్లీ డాక్టర్ బాబు దగ్గర కి వెళ్లాలని.. అంటూ కాళీ కవరు లోపల పెట్టింది రాజమ్మ. నాగయ్య ఒకసారి కొడుకు మొహం చూసాడు, ప్రదీప్ "అమ్మా .. ఆపరేషన్ అయిన సిక్స్ మంత్స్ వరకు మందులు వాడాలి అని చెప్పారు కదా డాక్టర్ గారు.. అందుకే.. అడుగుతున్నా సరేలే వీలునుబట్టి వెళ్దాం.. అని చెప్పి లోపలికి వెళ్లిపోయాడు ప్రదీప్ .. ఇంతలో టీవీలో సంక్రాంతి సంబరాలు... అంటూ చూపిస్తుంది.... రాజమ్మ మనవడు వచ్చి ఛానల్ ఎక్కడ మార్చేస్తాడో అని.. రిమోట్ తీసుకుని తన చెంగు లో పెట్టుకుంది.. కాసేపటికి అనుకున్నట్టే మనవుడు వచ్చి నాని బొమ్మలు పెట్టు.. అంటూ మార్చేశాడు..చేసేదేమీ లేక రిమోట్ మనవడు చేతికిచ్చి.. రాజమ్మ మనవరాలు గదిలోకి వెళ్లి తన, చాపమీద బొంత పరుచుకుని పడుకుంది,

రాజమ్మ మనవరాలు కావ్య ఎప్పుడూ ఇంగ్లీషులోనే మాట్లాడుతుంది. అందుకే రాజమ్మకు ఆమె చెప్పేది ఏమీ అర్థం కాదు.. రాజమ్మ మాట్లాడేది అమ్మాయికి పెద్దగా అర్థం కాదు వీళ్ళ మధ్య మాటలు చాలా తక్కువగా ఉంటాయి…, పావని ఇంగ్లీష్ ఎక్కడ రాకుండా పోతుందోనని చిన్నప్పటి నుండి ఇంట్లో కూడా ఇంగ్లీషులోనే మాట్లాడటం అలవాటు చేసింది కావ్యకి.. అందుకే అమ్మాయికి తెలుగు అంత స్పష్టంగా రాదు.. కాసేపటికి "నాని ఫోన్... లక్ష్మి ఆంటీ మాట్లాడుతుంది.." అని ఫోన్ రాజమ్మ చేతిలో పెట్టింది కావ్య. “ హలో.. అత్త ఈ రాత్రికే ఊరికి పోతున్న ఒక మాట చెబుదామని ఫోన్ చేశాను.. మాయ కూడా చెప్పు నీ ఫోన్ చేశానని. "జాగ్రత్తగా ఉండండి వెళ్లి వస్తా మరి.." అంది లక్ష్మి అలాగే లచ్చిమి జాగ్రత్తమ్మా.... అని చెప్పి, ఫోన్ కావ్య కి ఇచ్చేసింది... రాజమ్మ.

ఇక నడుం వాల్చగానే.. మొన్న పది హేను రోజుల క్రితం లక్ష్మి చెప్పిన సంగతులే గుర్తొచ్చాయి.. పది హేను రోజుల కిందట లక్ష్మి...., రాజమ్మ ను నాగయ్య ను చూడటానికి వచ్చింది. లక్ష్మీ రాజమ్మకు దూరపు చుట్టం. వరుసకు మేనకోడలు అవుతుంది.. ఆరోజు తొమ్మిది గంటలకి ఇంటి ముందు ఆటో ఆగితే ఎవరో అనుకున్నారు." ఆటో లో దిగిన లక్ష్మి ని చూడగానే రాజమ్మ కు ప్రాణం లేచి వచ్చినట్లయింది. లక్ష్మి కొడుకు సురేష్.. అమ్మ మళ్లా.. సాయంత్రం అయిదింటికి వస్తాను రెడీగా ఉండు.. నాకు ఆఫీసులో పని ఉంది, ఇదే ఆటోలో వెళ్ళిపోతా.. అని చెప్పి.. లోపలకి కూడా రాకుండానే వెళ్ళిపోయాడు.. "ఏంటే లచ్చిమి చెప్పాపెట్టకుండా వచ్చేసావు.. రా లోపలికి.." అంది రాజమ్మ సంతోషం గా..

"అత్త ఎట్టుండారు…ఆపరేషన్ అయ్యాక కాళ్ళ నొప్పి తగ్గింది ఏటే.... మావయ్య ఎంటే అంతలా సిక్కి పోయినాడు ఊర్లోనే బాగుండేది కదా".. అంటూ లోపలకి వచ్చింది. "ఆపరేషన్ అయ్యాక కాల్ నొప్పి తగ్గిందే.. మందులు ఇంకా వాడుతున్నాను.ఇంకా నెల దాకా వాడాలి అంటున్నారు. .. మీ మాయ్య కి ఇక్కడేమీ పని లేక కాలు కాలిన పిల్లిలా పైకి కిందికి తిరుగుతుంటాడు... ఊరు నుంచి వచ్చాక. శుభ్రంగా ఇంత అన్నం కూడా సరిగా తినట్లేదు.. ఊరు మీద బెంగ పెట్టుకున్నాడు ఏంటో మరి.. అంటూ చెప్పింది రాజమ్మ " ఆ ఎట్టి కోడి ఏంటి మరి.. మంచి కోత మీద ఉన్న నువ్వుజేను కూడా వదిలేసి.. కాడి ఎడ్లనోమో ఎర్రయ్యాకిచ్చాడు.. నీ కొడుకేమో ఇక్కడ కొత్తే గానీ ఆపరేషన్ చేయించ నన్నాడు... మొన్న ఫోన్ చేస్తే... నీ కొడుకు ఏం చెప్పాడో తెలుసా.... "అమ్మ ఆళ్ళు ఇంకాడకి రారు. నా దగ్గరే ఉంటారు.. ఆళ్ళకి ఏ టైనా అయితే.. అంత మాను సెలవు ఎ ట్టుకుని రావటానికి నాకు కాళీ లేదు.. అని చెప్పాడే.. అందుకే ఓపాలి మిమ్మల్ని కూడా సూసినట్టుంటదని నేనే వచ్చాను అంటూ .. ఆపకుండా చెప్పింది లక్ష్మి.

లక్ష్మి చెప్పిన మాటలు.. నాగయ్య మనస్సును మరింత బాధ కలిగించాయి.. "సరేగాని లచ్చిమి... మా రావుడు లచ్చన్న ఎలా ఉన్నారే.. ఆటికి శుభ్రంగా తిండిడెతున్నాడా.. లేదా.. అంటూ ఆమె సమాధానం కోసం కంటిలో ఉన్నతడి కనపడకుండా గుమ్మం వైపు చూస్తూ అడిగాడు నాగయ్య". నాగయ్య తనవైపు చూడకపోయినా లక్ష్మికి నాగయ్య మనసులో బాధ అర్థం అయింది.. "ఆ.. ఎడుతున్నారు గాని పని కూడా బాగానే చేయించుకున్నాడు పాపం.. అటేకేడా రెట్టు (రెస్ట్ ) ఇయ్యడు.." ఈ మాటలకి నాగయ్య మనసు మరింత బాధపడింది. ఊర్లో ఉన్నప్పుడు తన రెండు ఎద్దులను రాముడు లచ్చన్న అని పిలుసుకుంటూ కన్న బిడ్డల్లా చూసుకునే వాడు.. అవి వచ్చిన దగ్గరనుండి... వానలు బాగా పడి పంటలు పండా యని.. వాటిని ఇంటి ఇలవేల్పు లాగా చూసేవాడు.. "ఆ మీ మాయ కి ఏడున్నా.. రాముడు లచ్చన్నే .. కానీ ఇంకేటి ఊరు విశేషాలు చెప్పు.. మొన్న పండక్కి అన్ని చేసుకున్నారా…అని అడిగింది రాజమ్మ.

"ఆ... చేసాం అత్తా.... ఎలాగయినా మీరున్నప్పడు కళ.. ఇప్పుడు లేదే అత్తా.. మీ ఇల్లు ఎవరు లేక చూత్తుంటేనే భీతానమెత్తిపోతుంది.. ఆ మేట్టారు ని ఒకగదిలో ఉండమన్నట్టున్నారు.. ఆయనెప్పుడూ తాళమే .. సనారం ఏల్లిపోతాడు.. మళ్ళా సొవారం గాని రాడు.. కనీసం ఉన్నప్పుడన్నా గేట్ తాళం తీయడు.." సంక్రాంతి పండుగంటే రెండేళ్ల ముంగట చేసుకున్నం చూడు అదేనే.. అత్తా.. అంది లక్ష్మి

"అవునే లచ్చిమి.. ఎన్ని పిండొంటలు.. రోజుకొకలకి సోప్పున.. మాఇంటి కాడే అందరు కూకుని ఒండుకొనేవాళ్ళం .. మా యాకిలి పెద్దగా ఉండేదని అక్కడే రోట్లో పిండికోట్టి, పాకమెట్టి ఎన్నేసి అరెసలోండేవాళ్ళం.. ఏటో ఇప్పుడేటి లేకుండా ఐపోనాది. .. అని భాద ను తనలోనే ఉంచుకొని లక్ష్మి తో మాట్లాడుతుంది రాజమ్మ . "మాయ..పశువుల పండుగ రోజు (కనుమ ) , రావుడు, లచ్చన్న ని, మీ పాల గేదెను ఇంటికి తోలుకొచ్చి, ఆటికి పూజలు చేసి కడుపునిండా ఉలవలు, చిట్టూ (ఒడ్ల పోట్టు ) ఎట్టి, ఎలాసుసేటోడోకదా!...అంది లక్ష్మి "మీ మాయే కాదు కనుమ నాడు ఊరంతా పశువుల పండగే కాదేటి "…అంది రాజమ్మ.. వీరి కబుర్లకు మధ్యలోనే అడ్డు వచ్చి... "కావురలేనా... దానికెవన్నా ఏడతావా అంటూ నాగయ్య అక్కడ నుండి లేచాడు."

"ఊరి ముచ్చట్లు ఎంత సెప్పుకున్న తనివితీరాదు .. ఇక్కడేటి ఎవరిగూట్లో అల్లే.. పక్కింట్లో పమాదం ఐనా తొంగి సూడరు.. ఎవరు బయటకు రారు.. మనం ఎల్లినా ఐసిత్రం గా సూత్తరు,.. కోడలు, కొడుకు ఎల్లకా మీవిద్దరం, సూత్తే టీవీ లేపోతే మూగోళ్లు కూసున్నట్టు కూసుంటమే.. సాన బాధ గా ఉందే లచ్చిమి.. ఊరోచ్చేయాలని ఉంది. నా కొడుకేమో అక్కడకేళ్ళటం కుదరదంటున్నాడు అంటూ కళ్ళ నీళ్లు పెట్టుకుంది రాజమ్మ.

"ఊరోకేయే యత్తా ఒక ఓయస్సోచ్చాక ఈ కట్టం తప్పదేమో!.. ఓపాలి ఎల్లోత్తానని అడిగిసూడు ఏవంటాడో అంటూ రాజమ్మ పెట్టిన అన్నాన్ని తింటుంది లక్ష్మి."

"ఆ... అది యింది . ముంగటేడు ఎల్దామంటే సెలవు లేదు.. ఐనా ఇక్కడ వాతావరణం అలవాటు చేసుకోవాలా.. అక్కడ కెళ్ళి ఏం సెత్తావ్.. అన్నాడు మ యబ్బాయి... "ఇక్కడైతే ఇంటికి పిల్లలకి కాపలా ఉంటాం కదా.. అంటూ తనుకూడా అన్నం కలుపుకున్నాడు.. నాగయ్య "పోన్లే మాయ ఎక్కడుంటే ఏంటి శుభ్రం గా ఆరోగ్యగా ఉండండి. ఐనా అత్తకీ కాలునొప్పి వచ్చి నడవలేక పోయింది కానీ లేపోతే ఇంకొన్నాళ్ళు ఆడే ఉండానిచ్చేవాడు." అని సర్ది చెప్పి వాళ్ళ మానసిక బాధ తగ్గించడానికి ప్రయత్నించింది లక్ష్మి. తరువాత ఐదు గంటలకు లక్ష్మి కొడుకొచ్చి వాళ్ళమ్మని ఇంటికి తీసుకెళ్ళిపోయాడు.

***********************

మానస పెళ్లి కబురు చెప్పడానికి వచ్చింది, ఆ రోజు ఇంట్లో నాగయ్య, రాజమ్మ మాత్రమే ఉన్నారు. గుమ్మం దగ్గరే కూర్చుని చూస్తున్న వాళ్లిద్దర్ని చూసి "అన్నయ్య లేడా పెద్దమ్మా.. పెళ్ళికి మీరు తప్పకుండా రావాలి అని చెప్పింది.. కానీ మానస కు పెదనాన్న మొఖం లో ఊరిలో ఉన్నప్పుడు ఉన్న ఉత్సాహం కనబడలేదు.. దగ్గరగా వచ్చి పెదనాన్న ఏమైంది... అలా ఉన్నావు.. అని అడిగింది.. " ఏమీ లేదమ్మా బాగానే ఉన్నా.. అన్నాడు

కానీ రాజమ్మ అందుకుంటూ.. మీ పెదనాన్న ఈడుండలేక పోతున్నడమ్మా.. ఎంతైనా పుట్టిపెరిగింది ఊర్లో కదా.. అక్కడ పది మంది ఉంటారు.. మాటకు ఓసారి అనుకో ఎవరో ఒకరు వస్తానే ఉంటారు.. ఎదోపని ఉండేది... ఇక్కడేమో.. కాలు చెయ్యి ఆడనోళ్ళాక మళ్ళే కూసోవాలి.. మీ పెదనాన్న కేమో పొద్దున్న లేచిన కాడనుండి.. పొలం లో అడుగేట్టకపోతే పొద్దు పోదయే.. ఏం సెత్తం మరి..". అని రా తల్లి అన్నం తిందుగానీ అని తీసుకెళ్లింది….

****************

మరో పది రోజులకి మానస అమెరికాప్రయాణం కి అన్నీ సర్దుకుంది.. అన్న వదిన ను కూడా ఎయిర్ పోర్ట్ కి తప్పకుండా రావాలి అని చెప్పింది. "పిల్లలు కూడా ఎయిర్ పోర్ట్ చూడలేదు కదా మనం కూడా వెళ్దాం అండి. ఎలాగూ సెండ్ ఆఫ్ ఇచ్చినట్టు ఉంటుంది "అని పావని అన్న మాటలతో ప్రదీప్ పావని, పిల్లలు తీసుకునే ఎయిర్పోర్ట్ కి వెళ్లాడు . అక్కడ మానస ప్రదీప్ కోసం ఎదురు చూస్తూ కూర్చుంది. పావని పిల్లలు ఎయిర్ పోర్ట్ చూడటంలో నిమగ్నమైపోయారు . మానస... "అన్నయ్య నీకు ఫోన్ చేయాలని పది రోజుల నుంచి చూస్తున్నాం.. కానీ కాళీ లేక చేయలేదు అందుకే ఈ రోజు తప్పకుండా రమ్మన్నా..అని ప్రదీప్ పక్కనే కూర్చుంది. మానస మెల్లగా తను చెప్పాలనుకున్న విషయాన్నీ మొదలు పెట్టింది..

"పెదనాన్న పెద్దమ్మ ని ఊరికి పంపించే అన్నయ్య.. అన్న మానస మాటలకు ఒక్కసారిగా ఉలిక్కి పడ్డాడు ప్రదీప్.. ఏమైంది వాళ్ళు నీతో ఏమైనా చెప్పారా..అన్నాడు కంగారుగా... లేదు అన్నయ్య.. వాళ్ళు పుట్టింది పెరిగింది... ప్రకృతి ఒడిలో అయినా పల్లెటూరులో.. వాళ్ళ 60 ఏళ్ల జీవితం అంతా పల్లెటూరి తోటే ముడిపడి ఉంది.. అలాంటిది ఇప్పుడు ఒక్కసారిగా ఈ కాంక్రీట్ జంగిల్ తీసుకొచ్చి. ఇక్కడ బంధించడం ఏమీ బాగోలేదు.. ఒక్కసారి నువ్వే ఆలోచించు.. అంది

"అక్కడ వాళ్ళకి ఏదైనా వస్తే ఎవరు చూస్తారు" అన్నాడు ప్రదీప్

"ఏదైనా వస్తే చూడడానికి అక్కడ ఇంకా స్వచ్ఛమైన మనసున్న పల్లెటూరి వాళ్ళు ఉన్నారు. ఐనా లక్ష్మి అత్త కూడా పక్కనిల్లే కదా... అంతకు సీరియస్ అయితే ఎలగు నీవు వెళ్తావు.. వాళ్లు ఈ పట్నంలో కేవలం మనుషులు మాత్రమే ఉన్నారు.. వాళ్ల మనసు మాత్రం ఊరిలోనే ఉంది.. జీవం లేకుండా.. జీవచ్ఛవాలుగా ఎందుకు అన్నయ్య వాళ్ళు ఇక్కడ ఉంచుతున్నావు... వాళ్లకు ఊరే ఊపిరి అన్నయ్య.. ఆ ఊరిలో ఉంటే వాళ్ళలో ఊపిరి ఇంకొన్నాళ్ళు ఉంటుంది. ప్లీజ్ నేను ఇలా చెప్పానని ఏమీ అనుకోవద్దు.. వాళ్లని ఊరికి పంపించే. నీకు వీలైనప్పుడు వెళ్లి చూస్తూ ఉండు." అని చెప్పింది. ప్రదీప్ అంతగా ఎప్పుడూ ఆలోచించలేదు కానీ మానస చెప్పాక తన మనసుకు కూడా అదే కరెక్ట్ అనిపించింది.?. డాక్టర్ కూడా రాజమ్మకి వచ్చింది సాయటిక కాలు నొప్పే.. ఆపరేషన్ చేస్తే తగ్గిపోతుంది అన్నాడు. అలాగే ఆపరేషన్ కూడా ఐపోయింది.. ఇప్పుడు మందులు వాడితే సరిపోతుంది అనిచెప్పాడు.. ప్రదీప్ కి కూడా వాళ్ళని బలవంతం గా ఉంచి నట్లే అనిపించింది..

తరువాత రెండు రోజులకు "అమ్మ మనం చౌడారం వెళ్తున్నాం.. అక్కడ ఇళ్లన్నీ క్లీన్ చేయమని చెప్పాను.. అన్న కొడుకు మాటలకు.. రాజమ్మ, నాగయ్యకు.. కళ్ళల్లో మెరుపులు కనిపించాయి.. వారి సంతోషానికి అవధులు లేవు..

“అంజమ్మ నాగయ్య కాదు ఇలా ఎంతోమంది , అనేక కారణాలతో సిటీ లో ఉండలేక, ఉరేళ్ళ లేక జీవచ్చవాలుగానే బ్రతుకుతున్నారు. కాబట్టి అందరం మనస్సు పెట్టి వాళ్ళ కోసం ఆలోచించాలి.. తప్పకుండా ఆలోచిస్తారు కదూ...!”

మరిన్ని కథలు

Aame kavvinchindi
ఆమె కవ్వించింది
- తాత మోహనకృష్ణ
Chandruniko noolu pogu
చంద్రునికో నూలు పోగు
- కాశీవిశ్వనాధం పట్రాయుడు/kasi viswanadham patrayudu
Anaadha atidhyam
అనాథ అతిథ్యం
- - బోగా పురుషోత్తం
Vibheeshana Sharanu
విభిషణుని శరణు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Srivariki prema lekha
శ్రీవారికి ప్రేమలేఖ
- తాత మోహనకృష్ణ
Ramdaas formula
రాందాస్ ఫార్ములా
- వీరేశ్వర రావు మూల
Attagari samrajyam
అత్తగారి సామ్రాజ్యం
- బొబ్బు హేమావతి