వాయిదా - సరికొండ శ్రీనివాసరాజు

postpone

సోము చదువులో అంతంత మాత్రమే. ఆటలకే ప్రాధాన్యతనిస్తూ పరీక్షల సమయంలో చదువవచ్చులే అంటూ వాయిదాలు వేస్తూ వచ్చేవాడు. తీరా పరీక్షలు దగ్గర పడేకొద్దీ వామ్మో! ఇంత సిలబసా? నా వల్ల కాదు. పరీక్షలు వాయిదా పడితే బాగుండు. ఇంకా బాగా చదవవచ్చు అనుకునేవాడు. పరీక్షలలో చాలా తక్కువ మార్కులు వచ్చేవి. అటు ఉపాధ్యాయుల తోటీ, ఇటు తల్లిదండ్రుల తోటి శిక్షలు పడేవి. ఈ సారైనా బాగా చదువుకోవాలని అనుకునేవాడు. కానీ ప్రతిసారీ చదువును వాయిదా వేస్తూ పరీక్షలు సమీపించగానే సరిగా చదవలేక పరీక్షలు వాయిదా పడాలని కోరుకోవడం, పరీక్షలలో దెబ్బ తినడం జరుగుతూనే ఉంది.

ఇప్పుడు సోము 9వ తరగతి పూర్తి చేశాడు. ఉపాధ్యాయులు సోము తల్లిదండ్రులను పిలిపించారు. "మీ అబ్బాయి చదువు ఏమీ బాగాలేదు. వచ్చే సంవత్సరం మీ అబ్బాయి ఫెయిల్ అయితే మా పాఠశాలకు చెడ్డపేరు వస్తుంది. మీ అబ్బాయి టి.సి. ఇచ్చి పంపుతాము. వేరే పాఠశాలకు పంపండి. జూన్ నెలలో పాఠశాలలు పునః ప్రారంభం అయ్యాక రండి. అప్పుడు టి.సి. తీసుకోండి." అన్నారు. అంత మంచి పాఠశాల చుట్టుపక్కల ఎక్కడా లేదు. ఎంత బతిమాలినా ఫలితం శూన్యం. ఇంటివద్ద సోముకు బీభత్సంగా చివాట్లు పడ్డాయి.

జూన్ నెలలో పాఠశాలలు పునః ప్రారంభం అయ్యాయి. ప్రధానోపాధ్యాయులు సోమూను పిలిచి, "ఇప్పుడు కొత్త అడ్మిషన్లు వస్తున్నాయి. తీరిక లేనందువల్ల టి.సి. ఇవ్వలేకపోతున్నాం. జులై 1 నాడు టి.సి. రాసిస్తా. అప్పుటి వరకే నువ్వు ఈ పాఠశాలలో ఉండేది." అన్నాడు. సోము ఉన్న కొద్ది రోజులు మంచి విద్యార్ధిగా పేరు తెచ్చుకోవాలని ఏరోజు పాఠాలు ఆరోజు కష్టపడి చదువుతున్నాడు. జులై నెల వచ్చింది. అప్పుడు ప్రధానోపాధ్యాయులు సోమును పిలిపించి,‌ "నిన్ను నిరుత్సాహపరచకుండా నీకు మంచి పాఠశాలను మాట్లాడాను. వాళ్ళు ఆగస్టు 15 తర్వాత రమ్మన్నారు." అన్నాడు. సోము రెట్టింపు పట్టుదలతో చదువుతున్నాడు. ఉపాధ్యాయులు అంతా సోమును మెచ్చుకుంటున్నారు.

ఆగస్టు 15 తర్వాత ప్రధానోపాధ్యాయులు సోమును పిలిపించి, "శభాష్ సోము. నీ పట్టుదల ఇలాగే కొనసాగితే నీకు మంచి మార్కులు వచ్చేవరకు ఈ పాఠశాలలోనే ఉంటావు. ఏ మాత్రం తగ్గినా నీకు ఇంకో పాఠశాల సిద్ధంగా ఉంది." అన్నాడు. సోము ఆనందం పట్టలేక సడలని పట్టుదలతో చదివి 10వ తరగతిని అత్యుత్తమ గ్రేడుతో ఉత్తీర్ణుడు అయినాడు. సోము బద్దకాన్ని వదిలించగలిగినందుకు సంతోషించారు ప్రధానోపాధ్యాయులు.

మరిన్ని కథలు

Naanna neeku vandanam
నాన్నా..నీకు వందనం!
- చెన్నూరి సుదర్శన్
Lakshyam
లక్ష్యం...!
- రాము కోలా
Srirama raksha
శ్రీ రామ రక్ష
- అన్నపూర్ణ . జొన్నలగడ్డ
pustakala donga
పుస్తకాల దొంగ
- దార్ల బుజ్జిబాబు
Samasyalu
సమస్యలు
- Dr.kandepi Raniprasad
Nijamaina Gnani
నిజమైన జ్ఞాని.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు.
Evaru goppa
ఎవరు గొప్ప.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు.