లక్ష్యం...! - రాము కోలా

Lakshyam

కటవ తారీఖున అందుకోవల్సిన జీతాలు పదవ తారీఖున అరకొరగానే అందిస్తున్న యాజమాన్యంను ఏమీ అనలేక , కుటుంబ ఖర్చులు చిట్టా ముందేసుకుని లెక్కలపై కుస్తీలు పడుతూ నెలసరి ఖర్చుల బడ్జెట్ ప్లాన్ తయారుచేస్తూ తల మునకలై తెల్లకాగితాలపై కథనరంగంలో అభిమన్యుడిలా పోరాటం చేస్తుంటే "నన్ను, ఎవ్వరో పిలుస్తున్నారు" అనిపించడంతో తల ఎత్తి చూసాను . ఎదురుగా నా పుత్రరత్నం... గుండె గుబేల్ల్ మంది..ఏదో ఖర్చు పెరగబోతుందంటూ మనస్సు హెచ్చరికలు పంపింది. "డాడీ!నాకు కొత్త షూ కావాలి.." "క్లాసులో అందరూ నా షూ వంకే చూస్తున్నారు. తల తీసేసినట్లుగా ఉంటుంది." "ఇక నావల్ల కానేకాదు !ఈ రోజు కొత్త షూ కొంటేనే రేపు కాలేజికి !లేదంటే లేదు ." మాటలు తూటాల్లా పెల్చినట్లు కచ్చితంగా చెప్పేసిన నా పుత్రరత్నాన్ని అలాగే చూస్తుండి పొయా! "హాతవిధీ "అనుకుంటూ "చదువుల్లో వెనుకబడినా అవమానంగా లేదు కానీ,షూ బాగోలేదని ఎవ్వరో అంటేనే అవమానంగా ఉంటుందా" అనుకున్నాను పైకి అనలేక. రెండు నెలలు క్రితం మూడున్నర వేల రూపాయల్తో కొన్న షూ అప్పుడే పాతవైపోయాయా! ఆశ్చర్యం నుండి నేను ఇంకా తేరుకోలేదు. "తల్లిదండ్రులు సంపాదన ఎంతో తెలుసుకుని, తమ ఖర్చులు పొదుపుగా వాడుకునే యువత నేడు ఎక్కడైనా కనిపిస్తారా!సాధ్యమేనా" కనిపిస్తే చేతులెత్తి నమస్కరించాలనిపిస్తుంది నాకు . పుత్రరత్నాన్ని తీసుకుని సాయంత్రం షాపింగ్ వెళ్ళక తప్పలేదు మా వాడు చాలా తెలివిగా కాస్త పెద్ద షాపు అడ్రస్ చెప్పి అక్కడకే తీసుకువెళ్ళమని చెప్పడంతో,మరో మార్గం లేక "తప్పదు కదా! పిల్లల కోర్కేలు తీర్చడానికేగా తల్లిదండ్రులు ఉన్నది " అనుకుంటూ అక్కడికే తీసుకువెళ్ళి తనకు నచ్చినవి తీసుకోమని చెప్పి బయటనే నిలుచుండిపోయా.. గంట సెలక్షన్ తరువాత "డాడీ,"అన్న పిలుపు వినిపించడంతో "నా జేబులోని డబ్బులకు రెక్కలు వస్తున్నాయ్.." అనుకుంటూ లోపలికి అడుగు వేసా. నా దృష్టి షాపులో రిషి పాదాలకు షూ తొడుగుతున్న కుర్రాడిపై నిలిచింది. ఆశ్చర్యంగా చూస్తూనే పలకరించా!అతను రిషి క్లాస్ మెట్. "మధు నువ్వేంటి ఇక్కడ",అంటూ" తెలుసుకోవాలనే ఉత్సుకత పెరిగింది .కారణం అతను కాలేజీ టాఫర్ కనుక. తన పని తాను చేసుకుంటూనే "ఇక్కడ కొంత కాలంగా పనిచేస్తూ! "పోలీసు సెలెక్షన్స్ కు ప్రిపేరౌతున్నా గురువుగారు." "ఉదయం రన్నింగ్ కు షూ కావాల్సి వచ్చింది." కోచింగ్ సెంటర్లో చేరగల స్థోమత లేదు.బయట బుక్స్ కొనాలి. "నాన్న సంపాదన కూడా అంతంత మాత్రమే కదా! ఈ మధ్య తనకు ఆరోగ్యం కూడా సరిగా లేదు. నాన్నను ఇబ్బంది పెట్టలేను , అలా అని నాలక్ష్యం వదలలేను అందుకే పార్ట్ టైం ఇక్కడ పని చేస్తున్నాను గురువుగారు."అని చెప్పుకుంటూ పోతున్న మధు వంక చూస్తుంటే ఎంతో తృప్తి కలిగింది , ఇటు వంటి ముత్యం నా శిష్యుడైనందుకు. సంస్కారం అనేది డబ్బులతో వచ్చేది కాదనిపించింది. మమతాను రాగాలు, కష్టసుఖాలను పంచుకునేది పేద, మధ్యతరగతి కుటుంబాల్లోనే కాని ధనవంతుల బంగ్లాల్లో కాదనిపించింది.. జేబులు తడుముకుంటున్నా! పెళ్ళిరోజుకు శ్రీమతికి చీర కొనాలని దాచిన డబ్బులు, పోస్టాఫీసులో కట్టవలసిన సేవింగ్ డబ్బులు చేతికి తగలడంతో ఓ నిర్ణయం తీసుకున్నా. షాపు నుండి బయటకు వస్తు మధు చేతిలో మూడు వేలు పెట్టాను . "నా గిఫ్ట్ గా షూ కొనుక్కో! సెలెక్షన్స్ లో జాబ్ సాధించాలి.మీ నాన్న గారి కష్టాలు తీరాలి,నిన్ను చూసి తాను గర్వపడాలి" వద్దు గురువుగారు అంటున్నా తన చేతిలో ఉంచాను డబ్బులు దీవిస్తూ... ఇది చూస్తూ రిషి తలవంచుకున్నాడు! ఎందుకో .అది తనలో మార్పు అయి ఉండాలని అనుకుంటున్నా!ఒక తండ్రిగా ... నాది అత్యాశౌనో కాదో తెలియదు., షాపు మెట్లు దిగుతూ....

మరిన్ని కథలు

Simhavalokanam
సింహావలోకనం
- మద్దూరి నరసింహమూర్తి
Mana garden
మన గార్డెన్
- తాత మోహనకృష్ణ
Andari bandhuvuluu
అందరి బంధువులు
- భానుశ్రీ తిరుమల
Teeram cherchina parugu
తీరం చేర్చిన పరుగు
- షామీరు జానకీ దేవి
Vimanam lo kalakalam
విమానంలో కలకలం
- తాతా కామేశ్వరి
Aame kavvinchindi
ఆమె కవ్వించింది
- తాత మోహనకృష్ణ
Chandruniko noolu pogu
చంద్రునికో నూలు పోగు
- కాశీవిశ్వనాధం పట్రాయుడు/kasi viswanadham patrayudu
Anaadha atidhyam
అనాథ అతిథ్యం
- - బోగా పురుషోత్తం