స్నేహ బంధం - కందర్ప మూర్తి

Snehabandham

అవంతీపుర రాజ్యాధీశుడు నరేంద్ర వర్మ వృద్ధాప్యం వల్ల యువరాజు సమరసేనుడిని పట్టాభిషిక్తుడిని చేసి రాజ్యాన్ని అప్పగించాలను కున్నాడు.మహామంత్రి దమనకుడిని పిలిచి తన మనోవాంఛను తెలియచేసి రాజపురోహితుని సంప్రదించి మంచి సుముహూర్తం నిర్ణయించ వల్సిందిగా కోరాడు. రాకుమారుడు సమరసేనుడు , మహామంత్రి కుమారుడు సుచరితుడు బాల్యం నుంచి కలసి మెలసి పెరిగారు. ఖడ్గ యుద్ధం ,విలువిద్య ,యుద్ధ తంత్రాలు కలిసి నేర్చుకున్నారు. ప్రాణ మిత్రులయారు. స్వంత అన్నదమ్ముల్లా ఉంటారు. మహామంత్రి దమనకుడి మనసులో దురాలోచన కలిగింది. తరతరాలనుంచి ఈ రాజ్యాధీశులకు మా తెలివితేటలు , యుద్ధతంత్రాలతో సేవలు అందిస్తూంటే పేరు ప్రఖ్యాతులు ,సకల సౌఖ్యాలు వారు అనుభవిస్తున్నారు.ఈసారి నా కుమారుడిని ఎలాగైన ఈ రాజ్యానికి యువరాజుగా పట్టాభిషిక్తుడిని చేసి సింహాసనం మీద కూర్చోబెట్టాలను కున్నాడు. ఏదైనా ఉపాయం ఆలోచించి యువరాజును అంతం చెయ్యాలి. మహరాజుకు వారసులు ఎవరూ లేరు. అప్పుడు ప్రత్యమ్యాయంగా నా కుమారుడే పట్టాభిషిక్తుడవుతాడు. తండ్రి దురాలోచన తెలుసుకున్న సుచరితుడు తనకి రాజ్యకాంక్ష లేదని , రాకుమారుడు సమరసేనుడికి ఎటువంటి హాని తలపెట్టవద్దని వేడుకున్నాడు. దుర్భుద్ధి తలకెక్కిన మహామంత్రికి కొడుకు మాటలు రుచించలేదు.తన మనోవాంఛ నెరవేర్చడానికి వ్యూహరచన చేయసాగాడు.తండ్రిని కనిపెట్టి ఆయన దురాలోచన తెలుసు కుంటున్నాడు సుచరితుడు. యువరాజు సమరసేనుడు అపుడపుడు జంతువుల వేటకోసం సమీప అడవికి వెల్తూంటాడు.అడవిలోనే యువరాజును హత మార్చాలను కున్నాడు మంత్రి. తనకి నమ్మకస్తుడైన ఒక గూఢచారికి డబ్బు ఆశ చూపి తన వశం చేసుకున్నాడు. యువరాజు వేటకు వెళ్లి నప్పుడు అదును చూసి కాలనాగుతో కాటు వేయించి చంపాలను కున్నాడు. తండ్రి దురాలోచన గ్రహించిన సుచరితుడు యువరాజును రక్షించాలనుకుని కోయవాని రూపంలో వేటకు వెళ్లిన సమరసేనుడిని అనుసరించాడు. వేటలో అలసిన యువరాజు అశ్వం దిగి పెద్ద వృక్షం కింద విశ్రాంతి తీసుకుంటూ ఆదమరిచి నిద్రపోయాడు. యువరాజును అనుసరిస్తున్న వేగు తన వద్దనున్న సర్పాన్ని కింద వదిలాడు. ఇదంతా దూరం నుంచి గమనిస్తున్న కోయవాని రూపంలో ఉన్న సుచరితుడు తన వద్దనున్న విల్లంబులతో సర్పాన్ని హతమార్చాడు..బాణం శబ్దం విన్న యువరాజు నిద్రనుంచి మేల్కొని చూడగా పాదాలకు దూరంగా బాణం తగిలి చచ్చి పడిఉన్న సర్పం కనపడింది కాని దగ్గర్లో ఎవరూ కాన రాలేదు. ఎవరు తనని ఈ విష సర్పం నుంచి రక్షించారను కున్నాడు. ఈ సవ్వడికి దగ్గరలో రక్షకులుగా ఉన్న సైనికులు పరుగున వచ్చి బాణం తగిలి చచ్చి పడున్న సర్పాన్ని చూసి ఆశ్చర్యపోయారు.ఎవరు యువ రాజును ప్రాణాపాయం నుంచి కాపాడారో తెలుసుకో లేక పోయారు. మహరాజు నరేంద్రవర్మకు ఈ విషయం తెలిసి ఆందోళన చెంది యువరాజు భద్రతకు ప్రత్యేక రక్షణ ఏర్పాటు చేయించ వల్సిందిగా మహామంత్రిని కోరాడు. తన ప్రయత్నం విఫలమైనందుకు మహామంత్రి ఖంగతిన్నాడు. ఎలాగైన తన పథకం సఫలం చెయ్యాలను కున్నాడు.యువరాజుకు సపర్యలు చేసే సేవకురాల్ని తన గుప్పెట్లోకి తెచ్చుకుని ఆమె ద్వారా పాయసంలో కాలకూట విషాన్ని కలిపి తాగించాలని పన్నాగం చేసాడు. తండ్రి జరిపే ప్రతి వ్యూహాన్ని తెలుసుకుంటున్న సుచరితుడు దానికి తరుణోపాయం కనిపెడు తున్నాడు. మహామంత్రి వేసిన పథకం ప్రకారం ఒకరోజు సేవకురాలు పాయసంలో విషం కలిపి యువరాజు దగ్గరకు తీసుకెల్తుండగా విషనాగు ఆమె కాళ్ల ముందునుంచి పరుగెడుతు కనుపించింది. సేవకురాలు భయపడి చేతిలోని పాయసం పాత్రని కింద పడేసి పరుగెత్తింది. రక్షక భటులు పామును వెతికి చంపేసారు.రాజమహలుకి విషనాగు ఎలా వచ్చిందని తర్జన బర్జన పడసాగారు. మహరాజుకి చింత ఎక్కువైంది. రాజ పురోహితుణ్ణి పిలిపించి నాగపూజ చేయించ వల్సిందిగా కోరాడు. మహామంత్రికి మతి పోతోంది. యువరాజును సంహరించి తన కుమారుడు సుచరితుడిని యువరాజుగా పట్టాభిషేకం చెయ్యాలన్న తన కోరిక నెరవేరడం లేదు. ఏదో ఒక అవాంతరం వచ్చి పడుతోంది. ఈసారి పటిష్టంగా పథకం అమలు చేసి ఎలా గైనా తన మనసులోని కోరికను నెరవేర్చాలను కున్నాడు. సమయం కోసం ఎదురు చూస్తున్నాడు. పొరుగు రాజ్యం కుశాలనగర అధిపతి మహీపాలుడు తన కుమార్తె కాదంబరి వివాహం ప్రకటించి , తమ కుమారుని స్వయంవరానికి పంప వల్సిందిగా అవంతీ పురాధీసుడు నరేంద్రవర్మకు ఆహ్వానం పంపేరు. మహరాజు కుమారుణ్ణి పిలిచి కుశాల నగరం వెళ్లి రాకుమారి స్వయంవరంలో పాల్గొన వల్సిందిగా కోరాడు. తండ్రి కోరిక మేరకు కుశాల నగరానికి మిత్రుడు సుచరితుడితో బయలు దేరాడు సమరసేనుడు.మహామంత్రి దమనకుడు ఈసారి తన వ్యూహం ఎలాగైనా సాధించాలను కున్నాడు. మార్గమధ్యంలో అడవి దాటాలి. తనకు నమ్మకమైన వేగును వినియోగించి యువరాజు ప్రాణాలు తియ్యాలను కున్నాడు. యువరాజు, తన ఆప్తమిత్రుడు సమరసేనుడిని కంటికి రెప్పలా కాపాడుకుంటున్న సుచరితుడు తండ్రి దుర్భుద్దికి విచారం కలిగింది. తను ఎంతలా వేడుకున్నా తండ్రి మనసు మారలేదు. నా కోసమే ఇంత విశ్వాసఘాతానికి ఒడి కడుతున్నాడు.నేను ప్రాణాలతో ఉన్నంత వరకు యువరాజుకి ముప్పు తప్పదు. తన ప్రాణత్యాగంతో ఈ సమస్య తీర్చాలను కున్నాడు. " మిత్రమా , నువ్వు కుశాలనగరం చేరి స్వయంవరంలో విజయం సాధించి రాకుమారి కాదంబరితో అవంతీపురం వచ్చి పట్టాభిషిక్తుడివై కిరీటధారణ జరగాలి. అదే నా మనోవాంఛ. నాదొక విన్నపం. ప్రయాణ మార్గంలో నీ వేష ధారణలో నేను , నా వేష ధారణలో నువ్వు అశ్వాల మీద ముందుకు సాగుదాము.కుశాల నగరం చేరగానె నిజ రూపాల కొద్దామనగానే యువరాజు ' సరే 'నన్నాడు. దుస్తులు ,అశ్వాలు మార్చు కుని ప్రయాణమయారు. మహామంత్రి మంత్రాంగం ప్రకారము అరణ్య మార్గంలో వేగులు ఏర్పరచిన కొండకోయలు యువరాజు దుస్తుల్లో స్వేత అశ్వం మీద ముందుగా వెళుతున్న సుచరితుడిని రాకుమారుడిగా భావించి చెట్టు మాటున పొంచి గురి చూసి విషపు బాణాన్ని సంధించారు.బాణానికున్న విష ప్రభావంతో సుచరితుడు అశ్వం మీద నుంచి కిందపడి, ఆతృతగా దగ్గరకు వచ్చిన సమరసేనుడి చేతిలో చేయి వేసి ప్రాణాలు వదిలాడు. యువరాజు వెంటనే తేరుకుని తన దగ్గరున్న విల్లంబులతో చెట్టు చాటున నక్కిన కోయల్ని సంహరించాడు. యువరాజు దుస్తుల్లో ఉండి తన కోసం ప్రాణాలు అర్పించిన ఆప్తమిత్రుడి పార్ధివ శరీరాన్ని చూసి దుఃఖితుడయాడు. అక్కడే మిత్రుడి అంతిమయాత్ర కొన సాగించాడు. మిత్రుడి కోరిక ప్రకారము కుశాల నగరానికి చేరుకుని స్వయంవరం లో విజయం సాధించి రాకుమారి కాదంబరిని వివాహ మాడి అవంతీపుర రాజ్యానికి పట్టాభిషిక్తు డయాడు.తన ప్రియమిత్రుడు సుచరితుడి నిలువెత్తు విగ్రహాన్ని తయారు చేయించి తన దర్బార్ హాల్లో ప్రతిస్టించాడు మహామంత్రి దమనకుడు తన తప్పిదానికి పశ్చాత్తాపం కలిగింది. తన స్వార్థం దుర్భుద్ధితో అత్యాశకి పోయి ఏకైక పుత్రుణ్ణి పోగొట్టుకున్నా నని బాధ పడసాగాడు.తన పాపానికి ప్రాణత్యాగమే సరైన శిక్షనుకుని విషం తాగి ప్రాణాలు వదిలాడు. పుత్ర వియోగం భరించలేక మహామంత్రి ప్రాణత్యాగం చేసాడను కున్నారు రాజ్య ప్రజలు. * * *

మరిన్ని కథలు

Swayamvaram
స్వయంవరం
- తాత మోహనకృష్ణ
Maatruhrudaya mahattu
మాతృహృదయ మహత్తు!
- చెన్నూరి సుదర్శన్
Simhavalokanam
సింహావలోకనం
- మద్దూరి నరసింహమూర్తి
Mana garden
మన గార్డెన్
- తాత మోహనకృష్ణ
Andari bandhuvuluu
అందరి బంధువులు
- భానుశ్రీ తిరుమల
Teeram cherchina parugu
తీరం చేర్చిన పరుగు
- షామీరు జానకీ దేవి
Vimanam lo kalakalam
విమానంలో కలకలం
- తాతా కామేశ్వరి
Aame kavvinchindi
ఆమె కవ్వించింది
- తాత మోహనకృష్ణ