రామబాణం - చెన్నూరి సుదర్శన్

Rama banam

“రఘూ.. నిన్న శ్రీరామ కథ ఎంత వరకు చెప్పానో గుర్తుందా!.. ఏదీ చెప్పు చూద్దాం” అంటూ ముద్దుగా అడిగాడు రామయ్యతాత.

“ఓ..!” అంటూ తలూపుతూ.. “శ్రీరాముడు చెట్టు మాటున దాగి వాలిని తన బాణంతో చంపేస్తాడు. అవును తాతయ్యా.. అలా చంపడం తప్పుకాదా?” అంటూ రఘు ప్రశ్నించేసరికి రామయ్యతాత కాస్త తటపటాయించాడు. మిగతా చిన్నారులంతా నిజమే అనే రీతిలో తలలూపుతూ.. రామయ్యతాత ఏం చెబుతాడా అన్నట్టు తమ చెక్కిళ్ళపై అరచేతులు ఆన్చి విస్మయంగా చూడసాగారు.

రామయ్య భౌతిక శాస్త్ర ఉపాధ్యాయుడిగా పదవీ విరమణ చెయ్యడం.. ధర్మపత్ని కాలధర్మం చెందడం వరుసగా జరిగి పోయాయి. ఒక్కగానొక్క కొడుకు అమెరికాయానం అతణ్ణి ఒంటరివాణ్ణి చేసింది. లంకంత కొంపలో బిక్కు, బిక్కుమంటూ.. ఉండలేక, తనకు చేదోడువాదోడుగా ఉంటారని, పిల్లలు గల ఒక బీద కుటుంబాన్ని ఉచితంగా అందులో ఉండమన్నాడు. పెరట్లో తన నివాసం కోసం చిన్న గుడిసె వేసుకున్నాడు. గుడిసె ఆవరణలో పలురకాల ఫల, పుష్పాల చెట్లు నాటి, వాని ఆలనా, పాలనా చూసుకోసాగాడు. వాని ఆకర్షణతో వచ్చిన చిన్న పిల్లల సహచర్యం సంపాదించుకున్నాడు. రామయ్యకు తెలుగు భాష మీద ఎక్కువ మక్కువ. దాని అభివృద్ధికై పిల్లల్లో పునాదులు వేయాలనే సంకల్పం. దానికి కథలే ప్రధానములని పిల్లల మనఃస్తత్వం తెలిసిన రామయ్య, ఆ కథలను ఆసక్తికరంగా చెప్పడంతో ఆనతి కాలంలోనే.. ఆ వాడ పిల్లలందరికీ రామయ్య అంటే వల్లమానిన అభిమానమేర్పడింది.. రామయ్యతాత, రామయ్యతాతా.. అని నోరారా పిలువసాగారు.

రామయ్యతాతకు పిల్లలంటే పంచ ప్రాణాలు. వారికి పురాణ కథలు చెబుతూ.. మన సంస్కృతి గొప్పదనాన్ని వారిలో నింపాలనే తపన. ఈ మధ్యనే ‘సంపూర్ణ రామాయణం’ కథ చెప్పడమారంభించాడు. పిల్లలంతా ఆసక్తిగా వింటూ.. వారు ప్రదర్శించే హావభావాలతో ఊపిరి పోసుకుంటున్నాడు.

“శ్రీరాముడు దుష్ట శిక్షకుడు.. శిష్ట రక్షకుడు.

వాలి దుష్టుడు. అన్యాయంగా అతని తమ్ముడు సుగ్రీవుని భార్యను చెరబట్టాడు. అతని దుష్టపాలనతో వానరులను హింసించ సాగాడు. అతని ఆగడాలకు తగిన మరణ శిక్ష విధించి సుగ్రీవునకు పట్టాభిషేకం చేయించాడు శ్రీరాముడు.

అయితే రఘూ..! నీవు అడిగినట్టుగానే వాలి గూడా.. అలా దొంగచాటుగా దాక్కొని చంపడం నేరం కాదా! అని శ్రీరాముణ్ణి అడిగాడు. అప్పుడు శ్రీరాముడు.. ‘అవును నిజమే.. ఇదొక రకంగా నా తప్పిదమే. అందుకు నాకు శిక్ష తప్పదు. వచ్చే శ్రీకృష్ణావతారంలో నీవు ఒక ఒక బోయవాడుగా జన్మిస్తావు. నీ బాణంతో నాకు మరణం కలుగుతుంద’ని చెప్తాడు. శ్రీరాముడు గూడా ఆ విష్ణుమూర్తి అవతారమేనని తెలుసుకుని వాలి నమస్కరిస్తుండగా.. అతని ప్రాణాలు అనంతవాయువుల్లో కలిసి పోయాయి” అంటూ రామయ్యతాత చక్కగా విడమర్చి చెబుతుంటే.. అంతా కథలో లీనమయ్యారు.

“రామబాణానికి తిరుగు లేదు. అది చాలా శక్తి వంతమైనది. నేను ఇదివరకు గూడా చెప్పాను. తాటకి అనే రాక్షసిని సంహరించింది” అంటూ మరో మారు కథను పునఃశ్చరణ చేస్తూ.. రామబాణం యొక్క ప్రశస్తిని, దాని నిర్మాణాన్ని వివరించాడు.

పిల్లల ముందు వెదురు కర్ర ముక్కలతో విల్లును, బాణములను తయారు చేసి.. సంధించి చూపాడు. పిల్లలంతా కేరింతలతో ఎగురసాగారు.

“తాతయ్యా.. విల్లును మనం చేతితో పట్టుకుని బాణాన్ని వదలుతున్నాము కదా! అలా గాకుండా మనం దూరంగా ఉండి బాణం వదలడానికి అవకాశముందా?” అంటూ ప్రశ్నించేసరికి రామయ్యతాత ఆశ్చర్యపోయాడు.

ఈకాలపు పిల్లల ఆలోచనాధోరణులు.. సాంకేతిక నిపుణతవైపు మొగ్గు చూపుతున్నాయి.

“రఘూ.. నీ ఆలోచన బాగానే ఉంది. కృషిచేస్తే సాధించవచ్చు. రిమోట్ కంట్రోల్ ద్వారా టీ.వీ. ఆన్ చేస్తున్నాం. ఇంకా ఇంట్లో ఉండి వ్యవసాయ నీటిపంపులను ఆన్ చెయ్యడం ఒక సామాన్య రైతు కనుక్కున్నాడు. రిమోట్ ద్వారా ఇది గూడా సాధ్యమే గావచ్చు” అంటూ రామయ్యతాత తన ఇంట్లో, ఈమధ్య మూలకు పడ్డ చిన్న టెలివిజన్, దాని రిమోట్ రఘుకు ఇచ్చాడు. కొన్ని ఉపయుక్తకరమైన భౌతిక శాస్త్ర నియమాలు, సూచనలు విశదీకరించాడు. మనిషి తలుచుకుంటే సాధించనది ఏదీ లేదని ప్రోత్సహించాడు.

***

ఆరోజు రామయ్యతాత ‘రావణ సంహారం’ ఘట్టం బోధిస్తున్నాడు. పిల్లలంతా చెవులు పెద్దవిగా చేసుకుని ఉత్కంఠగా వినసాగారు.

“శ్రీరాముడు సంధించిన బాణం రావణుని ఒక తలను ఖండించింది. అదేమీ మాయనో గాని మళ్ళీ తల అతుక్కు పోయింది. అలా ఎన్ని సార్లు తలను ఖండించినా అది అతుక్కు పోతూనే ఉంది. అప్పుడు రావణుని సోదరుడు అయిన విభీషణుడు, రామును చెవిలో రావణుని మరణ రహస్యం చెబుతాడు. రాముడు దానికి ఒప్పుకోడు. అది వీరుని లక్షణం కాదని నిరాకరిస్తూ.. మామూలుగానే రావణునిపై బాణం సంధిస్తాడు. ఇంతలో వాయుదేవుడు ఆ బాణం లక్ష్యం దిశను మార్చి, రావణుని నాభి కింది భాగంలో ఉన్న అమృతభాండాన్ని ఛేదించేలా చేస్తాడు. అమృతం నేల పాలుగావడంతో రావణుడు మరణిస్తాడు” అనగానే..

“తాతయ్యా.. బాణం లక్ష్యాన్ని వాయుదేవుడు బహుశః రిమోట్ కంట్రోల్ ద్వారానే చేసి ఉంటాడు. నేను చూపిస్తాను చూడండి” అంటూ

రఘు తాను తెచ్చిన ఒక పెట్టె తెరిచాడు.

అందులో నుండి రంగు కాగితాలు అంటించి తళ. తళ మెరుస్తున్న ధనుస్సును, కొన్ని బాణాలు తీశాడు. పిల్లలంతా ఉవ్వెత్తున పాలసముద్రపు కెరటాల్లా ఎగురసాగారు. రఘు ప్రావీణ్యత చూసి రామయ్యతాత నివ్వెర పోయాడు.

రఘు ధనుస్సులో బాణం ఎక్కుబెట్టి లాక్ చేశాడు దాన్ని భద్రంగా పెట్టెలో దాచి కేవలం బాణం త్రిభుజాకారపు మొన మాత్రమే పెట్టె కన్నం నుండి బయటికి కనబడుతోంది. పెట్టెను ఒక టేబుల్ మీద పెట్టి బాణం లక్ష్యం దిశలో గోడకు ఒక చిన్న వృత్తం గీచాడు. పిల్లలంతా కళ్ళు పెద్దవిగా

చేసుకునిచూదసాగారు. రామయ్యతాత నిశ్చేష్టుడయ్యాడు.

రఘు పెట్టెకు ఐదడుగుల దూరం వెళ్లి తన చేతిలోని రిమోట్ ఆన్ చేశాడు. వెంటనే జువ్వున పెట్టెలో నుండి బాణం బయటకు దూసుకు వచ్చి గోడకు గీచిన వృత్తంలో అతుక్కు పోయింది. పిల్లల కరతాళ ధ్వనులు మిన్నంటాయి. రామయ్యతాత ఒక్క ఉదటున వచ్చి రఘును అమాంతం ఎత్తుకుని ముద్దాడుతుంటే అతని కళ్ళల్లో ఆనంద భాష్పాలు దొర్లాయి.

“రఘూ ఎలా చేశావు బాబూ” అంటూ.. హృదయానికి హత్తుకున్నాడు. “ఆ కాలంలో గూడా టెక్నాలోజీ ఉందనుటకు ఎన్నో దృష్టాంతరాలు ఉన్నాయి..ఉదాహరణకు వారు పుష్పకవిమానం వాడారని మనకు తెలిసిందే..” అంటూ రఘును మెప్పుకోలుగా చూడసాగాడు.

రఘు ధనుస్సుకు, బాణాలకు వాడిన వెదురుకర్ర ముక్కలు, వానికి అతికించిన మెరిసే రంగు కాగితాలు.. ఇంకా రామయ్యతాత ఇచ్చిన టీ.వీ. లోని పరికరాలు, దాని రిమోట్ కంట్రోల్ ఉపయోగిస్తూ.. బాణం లాక్, అన్ లాక్ సిస్టం సాంతం వివరించాడు.

రామయ్యతాత ఆనందానికి హద్దు లేకుండా పోయింది. తాను ఇచ్చిన సలహాలను ఫలప్రదంగా చూపిన రఘుతో.. “రఘూ.. నువ్వు నిజంగా ఆశ్రీరామచంద్ర ప్రభువు అంశతో పుట్టావయ్యా.. నీ తల్లిదండ్రులు చేసుకున్న పుణ్యఫలం. ఈ రామబాణం సద్వినియోగమైనప్పుడు వారికి మరింత పేరు ప్రఖ్యాతలు వస్తాయి” అంటూ తన దీవెనెలిచ్చాడు.

***

అవ్వాల రామయ్యతాత ఒంట్లో నలతగా ఉండి లేవడం కాస్త ఆలస్యమయ్యింది. కాలకృత్యాలు తీర్చుకుని వాకిట్లో వాలుకుర్చీలో ఎండపొడకు కూర్చున్నాడు.

ఇంతలో చిన్నా, పెద్దలతో కలిసిన ఒక సమూహం ఉప్పెనలా.. తన గుడిసె వైపు పరుగెత్తుకుంటూ రావడంతో.. ఆశ్చర్యంగా లేవబోయాడు. రఘు పరుగెత్తుకుంటూ వచ్చి రామయ్యతాత పాదాలపై వాలాడు. అతని వెనుకాలే.. ‘జిజ్ఞాస’ టీ.వీ. ఆంకర్, కెమెరామన్.. రఘు తల్లిదండ్రులు, ఒక పోలీసాఫీసరు.

“రామయ్యతాతా.. మీరు రామబాణం.. దాని ప్రాశస్త్యం గురించి చెప్పారని.. మీరు ఇచ్చిన సలహాలతోనే తాను రిమోట్ రామబాణం తయారు చేశారని రఘు చెబుతున్నాడు. దానికి మీస్పందన కోరుతోంది మన జిజ్ఞాస . టీ.వీ. ప్రేక్షలకోసం” అంటూ ఆంకర్ అరవై రకాల ఆనందడోలికలను తన ముఖంలో ప్రదర్శించసాగింది.

“అది గత వారమే రఘు ప్రదర్శించాడు. అలనాటి రామబాణానికి నేటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడించి ప్రయోగం చేసి చూపించాడు రఘు. నేను పెద్దగా సాయపడిందేమీ లేదు. అదంతా రఘు అసమాన ప్రతిభ. ఇంతకూ ఏం జరిగింది?” అంటూ రఘును ఆప్యాయంగా పైకి లేపి తన గుండెలకు హత్తుకున్నాడు రామయ్యతాత.

“మేము అడిగితే మా తాతయ్య ముందు చెబుతానని పరుగెత్తుకుంటూ వచ్చాడు” అంటూ ఆంకర్ అత్యంత ఉత్సాహంతో రఘుకు మైకు అందించింది. కెమెరామన్ రఘు మీదకు ఫోకస్ చేశాడు.

రఘు ఏమాత్రమూ తొణకకుండా.. బెణకకుండా.. రాత్రి జరిగిన సంఘటన కళ్ళకు గట్టినట్టు చెప్పసాగాడు.

“నిన్న మానాన్నగారు మాఊళ్ళో పొలం అమ్మి ఎక్కువ మొత్తంలో డబ్బు తీసుకుని ఇంటికి వచ్చేసరికి సాయంత్రమయ్యింది. రేపు బ్యాంకులో జమచేస్తానని అమ్మతో చెప్పగా విన్నాను. నేను ఎందుకైనా మంచిది మన జాగ్రత్తలో మనం ఉండాలని.. ధనుస్సుకు రెండు బాణాలు సంధించి, రిమోటుకు అనుసంధానం చేసుకుని బీరువా మీద ఏర్పడకుండా పెట్టాను. ఇంట్లో డబ్బులుంటే కుదురుగా నిద్ర పట్టక పోవడం సహజం. భయం భయంగానే నా గదిలో పడుకున్నాను కాని నిద్ర రావడం లేదు.

అర్థరాత్రి అలికిడికి దిగ్గున లేచి కూర్చున్నాను. కిటికీలో నుండి చూశాను. అమ్మ లేచి లైటు వేసింది. నాన్నను లేపబోతుంటే.. వెనుకాల ఒక దొంగ, అమ్మ ముందు ఒక్క ఉదటున వచ్చి కత్తితో బెదిరించసాగాడు. నేను వెంటనే వాని కళ్ళను లక్ష్యంగా చేసుకుని రిమోట్ సాయంతో రామబాణాలను సంధించాను. అవి రెప్ప పాటులో దొంగ కళ్ళల్లో దిగబడ్డాయి. వాడు హా, హా కారాలు పెడుతుంటే నాన్న లేచి వాణ్ణి తాడుతో బంధించాడు నాన్న. నేను పోలీసులకు ఫోన్ చేశాను” అనగానే పిల్లలంతా చప్పట్లతో గంతులు వేయసాగారు.

“అవును రఘు మూలాన ఒక అంతర్రాష్ట్ర గజదొంగను పట్టుకోగాలిగాం. ఆ గజదొంగ మీద పెద్ద మొత్తంలో రివాజు గూడా ప్రకటించింది ప్రభుత్వం. అది రఘు తల్లిదండ్రులకు అందిస్తాం. ఈ సంవత్సరం మన జవహర్లాల్ నెహ్రూ గారి పుట్టిన రోజును బాలల దినోత్సవంగా జరిపే సందర్భంలో సాహసబాలురకిచ్చే అవార్డుకోసం రఘు పేరును సిఫారసు చేస్తాం” అంటూ పోలీసు సర్వోన్నత అధికారి ప్రకటిస్తుంటే, పిల్లల కేరింతలతో.. రామయ్యతాత ఆశ్రమ ప్రాంగణం లోని చెట్లు పులకిస్తూ.. పూల వర్షం కురిపించ సాగాయి. *

మరిన్ని కథలు

Swayamvaram
స్వయంవరం
- తాత మోహనకృష్ణ
Maatruhrudaya mahattu
మాతృహృదయ మహత్తు!
- చెన్నూరి సుదర్శన్
Simhavalokanam
సింహావలోకనం
- మద్దూరి నరసింహమూర్తి
Mana garden
మన గార్డెన్
- తాత మోహనకృష్ణ
Andari bandhuvuluu
అందరి బంధువులు
- భానుశ్రీ తిరుమల
Teeram cherchina parugu
తీరం చేర్చిన పరుగు
- షామీరు జానకీ దేవి
Vimanam lo kalakalam
విమానంలో కలకలం
- తాతా కామేశ్వరి
Aame kavvinchindi
ఆమె కవ్వించింది
- తాత మోహనకృష్ణ