కలసి ఉంటే కలదు సుఖం - Lakshmi Gayatri

Kalasi vunte kaladu sukham

ఆరు వాటాల లోగిలి! కామందు కనకయ్య గారి మేడకి ఎదురుగా ఉంటుంది. ఇదీ ఆయనదే మరి. అందులో ఉంటున్న వారంతా ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఆయన ఆశ్రితులే. ఎప్పుడు చూసినా పిల్లల ఆటలూ కేరింతలతో మారుమోగుతూ ఉంటుంది ఆ లోగిలి. రాము పెంచుకుంటున్న పిల్లిపిల్లా, పాపాయి వెనకాలే తోకాడించుకుంటూ తిరిగే కుక్కపిల్లా కూడా సందడి చేస్తూనే ఉంటాయి. ఆ రోజు, తెల్లగా తెల్లారింది. ముద్దబంతిపువ్వు లాంటి లక్ష్మి, తను గుమ్మంలో అందంగా తీర్చిదిద్దిన ముగ్గుని మురిపెంగా చూసుకుంటూ మెట్టు మీద కూచుని కాఫీ తాగుతోంది. ఎదురింటి గిరి, వాణి తెచ్చి ఇచ్చే కాఫీని హాయిగా ఆస్వాదించేందుకు గాను గుమ్మంలో కుర్చీ వేసుకుని కూచున్నాడు. గిరి షోకిల్లారాయుడు. చుట్ట నోట్లో పెట్టుకుని "నేను గిరీశాన్ని" అంటూ నలుగురి చేతా అక్షింతలు వేయించుకుంటూ ఉంటాడు. ముసలి తల్లి తప్ప మరెవరూ లేని గిరి, ఊళ్లో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో పంతులు. పక్క వాటాలో ఉండే వాణికి "మధురవాణి" అని పేరు పెట్టి, పెళ్లి చేసుకుంటానని నేరుగా అడిగేశాడు. ఐదుగురు పిల్లలు గల కుటుంబం వాణిది. అంచేత వాణి తండ్రి ఎగిరి గంతేసి మరీ ఆనందపడ్డాడు. అయితే అనుకోకుండా గిరి ముసలి తల్లి కాలం చెయ్యడంతో పెళ్లి వాయిదా పడింది. వండిపెట్టే దిక్కు లేని గిరికి వాణీ వాళ్లే అన్నీ అమరుస్తున్నారు. వాళ్లకి ఇబ్బంది లేకుండా నెలకింతా అని ఇస్తున్నాడు గిరి. లక్ష్మి పక్క వాటాలో ఉండే బుచ్చమ్మ గారు, తన ఒక్కగానొక్క కొడుక్కి పొద్దున్నే ఇంత ఉడకేసి పెట్టేసి, తను నాలుగిళ్లలో వంటలు చెయ్యడానికి వెళుతుంది. రోజూలాగే ఆవిడ వసారాలో కత్తిపీట ముందేసుకుని కూర తరగబోతూ, "నీకు ఏటి పొడవునా ధనుర్మాసమే గదా లచ్చమ్మా" అంది నవ్వుతూ. ఆ మాటకి లక్ష్మి ఆనందంగా నవ్వింది. గిరికీ,తనకీ కాఫీ పట్టుకుని అక్కడికొచ్చిన వాణి మాత్రం, "పెళ్లయితే ఈ ముగ్గుల సరదా తీరిపోతుంది" అంది నవ్వుతూనే. "ఏం, పెళ్లయాక నువ్వు మన గుమ్మంలో ముగ్గులు పెట్టవా... అయినా నీకు రావుగా..ఇంకేం పెడతావులే" అన్నాడు గిరి కాఫీ అందుకుంటూ వాణి గిరి మాటలు పట్టించుకోకుండా, "బుచ్చమ్మ గారూ, ఈరోజు నుంచీ దివాణంలోనేనా మీ పనీ" అంటూ అడిగింది. దివాణం అంటే కామందు గారి మేడ. వాణి ప్రశ్నకి బుచ్చమ్మ అవునంటూ తలాడించింది. వెంటనే గిరి, "అవును గదూ....కనకయ్య గారి పెద్దబ్బాయి పెళ్లి రొండ్రోజుల్లోకి వచ్చేసింది గదా. నేను మర్చేపోయాను. అయితే మనందరం పెళ్లివారమన్నమాట." అన్నాడు "మరేం....మీకు ఇవేల్టి నుంచి వండొద్దని చెప్పాను మా అమ్మకి. పెళ్లింట్లో మూడు కూరలూ, ఆరు పిండివంటలతో భోంచేస్తారు గదా" అంది వాణి ఠకీమని లక్ష్మి కిసుక్కున నవ్వింది. బుచ్చమ్మ కూడా నవ్వుతూ, "గిరిబాబుకిక పస్తే" అంది గిరి కూడా నవ్వేసి, "పోన్లే.. కనీసం పెళ్లి రోజున తింటాం గదా మూడు కూరలూ ఆరు పిండివంటలూ. నాతో బాటు నువ్వూను" అన్నాడు. "ఏమో, నాకైతే అనుమానమే. బుచ్చమ్మ గారి అబ్బాయి కూడా వెళ్లి చాకిరీ చేస్తున్నాడు గాని వాడికి మెతుకు విదల్చడం లేదావిడ. ఎంగిలి చేత్తో కాకిని తోలాలన్నా ఆయన అనుమతి ఉండాల్సిందే గదా" అంది వాణి "ఆవిడొక్కర్తే కాదు... కొడుకులిద్దరూ కూడా ఆయన మాటకి కట్టుబడి ఉండాల్సిందే. పెద పాలికాపు వీరన్న కథలు కథలు చెబుతుంటాడు వినలేదూ" అంది బుచ్చమ్మ గారు. "వీరన్న చెప్పడమెందుకూ, ఎదురుగా ప్రత్యక్ష సాక్షి మన లక్ష్మి కనబడుతుంటేనూ" అంది వాణి కనకయ్య గారి చిన్నబ్బాయి కేశవ్ కి లక్ష్మి అంటే చాలా ఇష్టం అన్న సంగతి అందరికీ తెలిసిందే. పేద కుటుంబంలో పిల్లని చేసుకుంటానంటే తండ్రి తాట ఒలిచేస్తాడన్న భయంతో ఆ కుర్రాడు నోరు మూసుకుని ఊరుకున్నాడన్నదీ జగద్విదితమే. వాణి మాటలకి లక్ష్మి తల దించుకోగా, బుచ్చమ్మ గారు నిట్టూరుస్తూ, "ఆ కనకయ్య కి ఎవరైనా బుద్ధి చెబితే బావుండు" అంది ఆవిడ మాట ఇంకా పూర్తి గాకుండానే పీపీపీ అంటూ బూరా వినిపించింది నలుగురూ ఉలిక్కిపడి చూసేసరికి వాణి తమ్ముడు వెంకటేశం బూరా ఊదుతూ కనిపించాడు. వెంటనే గిరి నవ్వుతూ, "బుచ్చమ్మ గారూ, మీ మాట వెనకాలే మంగళవాద్యం వినబడింది. ఏదో జరుగుతుందండీ" అన్నాడు గిరి మాట ఇంకా పూర్తి గాకుండానే ఆదరాబాదరా పరిగెత్తుకొచ్చిన పెద పాలికాపు వీరన్న "గిరిబాబూ, పెద్దబ్బాయి గారి పెళ్లి ఆగిపోయింది" అన్నాడు రహస్యంగా. ఎంత నెమ్మదిగా అంటించినా అక్కడ బాంబు పేలింది. కత్తిపీట వొదిలేసి బుచ్చమ్మ గారు నిట్ట నిలువునా పైకి లేచి నిలబడింది. ఒక్క ఊపున మెట్టు దిగిన లక్ష్మి, వాణి పక్కకొచ్చి చెవొగ్గింది. వీరన్న మాత్రం మరింత గొంతు తగ్గించి, "ఇంకా ఊరంతా పాకలేదు బాబూ కబురు. మీరెక్కడా అనబోకండి. అసలేటయిందో నాకూ తెల్దు. నా బుర్ర కెక్కిన మాటేటంటే పెదబాబు పట్నంలో ఎవుర్నో లగ్గమాడేసిండు. నాయంగా అయితే నిన్న రాతిరికి బాబు పట్నం నుంచి రావాల గందా. రాలేదు. ఫోను సేసిండు. ఆ ఫోను మాటాడిందగ్గర్నించీ అయ్య ఒహటే గంతులు... అమ్మ ఒహటే ఏడుపు. ఈరోజు తెల్లారక మున్నే పెళ్లోరికి ఫోన్ సేసీసిండయ్య... ఏమీ అనుకోబాకండని"..... వీరన్న చెప్పడం ముగించేసరికి శ్రోతలంతా ఆశ్చర్యానందాలతో ఒకళ్ల మొహం ఒకళ్లు చూసుకుంటున్నారు. ఎవ్వరికీ లొంగకుండా బరితెగించి తిరుగుతున్న ఎద్దును చివరాఖరికి ఎవ్వరో ఎదురు దెబ్బ తీశారన్న కబురు ఎంత చల్లగా..తియ్యగా ఉంటుందో వాళ్ల మొహాలు చూస్తే తెలుస్తుంది. అంతలో వీరన్న తల కొట్టుకుని, "అసలు వచ్చిన పని మర్చినాను బాబూ..అయ్య మిమ్మల్ని ఉన్న పాటున రమ్మంటుండు" అన్నాడు. శ్రోతలు మరొక్కసారి మొహాలు చూసుకున్నారు. కళ్లతోనే కూడబలుక్కున్నారు. "సరేలే వీరన్నా.. నువ్వు పద. నేను స్నానం చేసి వెంటనే వచ్చేస్తాను" అన్నాడు గిరి. "తొరగా రండి బాబూ... లేకపోతే నన్ను కమ్ముకుంటాడయ్య" అంటూ వీరన్న వచ్చినంత తొందరగా వెళ్లిపోయేడు. వీరన్న కనుమరుగైన ఉత్తర క్షణం లో గిరి బుచ్చమ్మ కి చేతులు జోడించి దండం పెడుతూ, "ఆహా... ఏమి నోరు అక్కయ్య గారూ మీది..?" అంటూనే వాణి చెయ్యి పట్టుకుని "లలలా... లలలా " అంటూ డాన్స్ చేశాడు. లక్ష్మి దగ్గరగా వచ్చి ఆ పిల్ల తల మీద చెయ్యి వేసి, "మరేం భయం లేదు చెల్లెమ్మా... ఇహ నీకూ కేశవుడికీ లగ్గం ఖాయం" అన్నాడు. బుచ్చమ్మ, వాణి, లక్ష్మి ముగ్గురూ లోగిట్లో ఆడుకుంటున్న పిల్లల్లాగే కేరింతలు కొట్టారు. "పదండి.. పదండి. మీరు పూలరంగడిలా తయారై వెళ్లేసరికి దివాణంలో నిప్పు మరింత రాజుకుంటుంది" అంటూ గిరిని లోపలికి నెట్టి, లక్ష్మితో కబుర్లాడుతూ తన ఇంటి వైపు నడిచింది వాణి. సహజంగానే షోకిల్లారాయుడైన గిరి, వాణి చెప్పినట్టే పూలరంగడిలా ముస్తాబై బయల్దేరి వెళ్లాడు. అతను వెళ్లేసరికి వసారాలో కామందు కనకయ్య గారి అప్పజెల్లెలు పనివాడికి గంజో, అంబలో ఏదో పోస్తోంది. అది చూస్తూ ముందుకు నడిచాడు గిరి. నిండా గంట కూడా గడవకుండానే తిరిగొచ్చి ఆదరాబాదరా వాణిని పిలిచాడు. అతని పిలుపు కోసమే ఎదురు చూస్తున్న వాణి, లక్ష్మి ఒక్క పరుగున గిరి వాటాలోకొచ్చారు. బుచ్చమ్మ గారు అప్పటికే దివాణంలో వంట చేసేందుకు వెళ్లిపోయింది. గిరి గొంతు తగ్గించి రహస్యంగా, "కనకయ్య గారి పెద్దబ్బాయి తనతో పని చేసే కిరస్తానీ అమ్మాయిని లవ్ మేరేజ్ చేసుకున్నాట్ట. ఆ మాట వినగానే పెళ్లికని వచ్చిన చుట్టాలంతా పెట్టే బేడా సర్దుకుని వెళ్లిపోయారు. ఒక్క అప్పజెల్లెలు మాత్రం ఉంది. కనకయ్య గారి భార్యకి ఒంట్లో బాగా లేదు. మన బుచ్చమ్మ గారు ఇంత ఉడకేస్తోంది. మరోవైపు ఆడపెళ్లివారు తగవుకొస్తున్నారుట. నేనైతే నిర్మొహమాటంగా గట్టిగా మాట్లాడతానని ఆడపెళ్లివారు వచ్చి వెళ్లేదాకా నన్ను వాళ్లింట్లో ఉండమన్నారు. ఇక వాళ్లావిడ దగ్గర ఉండటానికి ఎవ్వరూ లేరని నిన్నూ, లక్ష్మినీ తీసుకురమ్మన్నారు. కల్లో కూడా ఊహించని విధంగా పరిస్థితులు తారుమారయ్యేసరికి మనిషి కాస్త మెట్టు దిగొచ్చినట్టే ఉన్నాడు. కించిత్తు అభిమానం లేకుండా బంధువులంతా ఒక్కసారి తనని ఏకాకిని చేసి వొదిలెయ్యడంతో ఆయనకి బాగా తెలిసొచ్చినట్టుంది. ఊళ్లో కూడా వెలి వేసేస్తారేమోనని భయపడుతున్నాడు. మంచి మనుషుల కోసం దేవులాడుతున్నాడు. లక్ష్మి ఆ ఇంట్లో మెప్పు సంపాదించుకోవడానికి ఇదే సరైన అదను. ఇద్దరూ బయల్దేరండి త్వరగా. మిమ్మల్ని తీసుకువెళ్లడానికే నేనొచ్చాను." అన్నాడు. లక్ష్మీ, వాణీ ఆనందంగా గిరితో కలిసి బయల్దేరారు. నెమ్మదిగా వారం రోజులు గడిచాయి. ఆ రోజు ఉదయం లక్ష్మి ఎప్పటిలాగే ముగ్గు చూసుకుని మురిసిపోతూ కాఫీ తాగుతుండగా, అక్కడికొచ్చిన బుచ్చమ్మ గారు, లక్ష్మి బుగ్గలు పుణుకుతూ, "చిన్నపిల్లవైనా కామందు గారి దగ్గర పెద్ద మాటలు చెప్పావే పిల్లా" అంది "మీకూ చెప్పారా ఆయన.. " గిరి ప్రశ్నకి బుచ్చమ్మ నవ్వుతూ "ఆఁ... మనిషిలో మంచి మార్పే వచ్చింది. కనబడ్డ వాళ్లందరికీ చెబుతున్నారు. "ఇంకా కులాలూ మతాలూ ఏమిటి బాబుగారూ.. మనం మంచిగా ఉంటే ఊరంతా మనని నెత్తిన పెట్టుకుంటుంది. మరేం ఫర్వాలేదు. పెద్దబాబుని ఏమీ అనకండి. ప్రాణమిచ్చే మనిషి కంటే కావలసిందేముంది... పెద్దబాబంటే ఆ అమ్మాయికి ప్రాణం గనకే ఆయన ఆ పని చేశారు. తండ్రి, మీరే కాదంటే ఇక పెద్దబాబుకెవరున్నారు.. " అందట ఈ పిల్ల. మరొకప్పుడైతే ఏమో... ఇప్పుడున్న పరిస్థితిలో ఆ మాటలు ఆయన చెవికి బాగానే ఎక్కాయి. తన పెళ్లానికి కూడా లక్ష్మి ఇలాగే ఊరడింపు మాటలు చెప్పి తేరదియ్యడం ఆయనకి మరింతగా నచ్చింది. లక్ష్మే నా చిన్నకోడలని బాహాటంగా చెబుతున్నాడాయన." అంది. "మరింకేం... ఈసారి నిజంగానే మనమంతా పెళ్లివారం. ఏంవాయ్..మైడియర్ వెంకటేశం... ఏదీ నీ బూరా " అన్నాడు గిరి అప్పుడే అక్కడికొచ్చిన వెంకటేశాన్ని చూసి. వెంకటేశం వెంటనే చేతిలో రెడీగా ఉన్న బూరాని పీపీపీమనిపించాడు మరింత హుషారుగా. లక్ష్మి సిగ్గుపడుతూ తల దించుకోగా, "నలుగురం కలిసీ మెలిసీ ఉంటే జీవితాలు సుఖంగా సాగుతాయి" అంది బుచ్చమ్మ గారు జనాంతికంగా.

మరిన్ని కథలు

Peddarikam munduku vaste
పెద్దరికం ముందుకువస్తే
- శింగరాజు శ్రీనివాసరావు
Sayodhya
సయోధ్య
- కందర్ప మూర్తి
Karona kaatu
కరోనా కాటు
- సోమవరపు రఘుబాబు
Chillara Sevalu
చిల్లర శవాలు
- అఖిలాశ
Tel malisha majaka
తేల్ మాలీషా ! మజాకా!?
- జి.యస్. కె. సాయిబాబా
Sivayya tarimina deyyam-Story picture
శివయ్య తరిమిన దెయ్యం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు.