పెద్దరికం ముందుకువస్తే - శింగరాజు శ్రీనివాసరావు

Peddarikam munduku vaste

" మమ్మీ ఆకలేస్తుంది. అన్నం పెట్టవా?" శ్రీహాసను తట్టి అడిగాడు ఏడు సంవత్సరాల యశ్. " ఇప్పటికి పదిసార్లు చెప్పాను, నీ ఆకలితో నాకు సంబంధం లేదు. మీ డాడిని అడుగు. వండిపెడితే తిను. లేకుంటే పస్తు పడుకో" యష్ ను నెట్టివేసింది. ఏడుస్తూ తండ్రి దగ్గరకు వెళ్ళాడు. " దానికి పొగరు తలకెక్కిందిరా. భర్తనన్న గౌరవం లేదు దానికి. అడిగినప్పుడు అన్నం పెట్టలేకపోతే ఎందుకు కన్నదట నిన్ను. అడగరా దాన్ని" కొడుకును విదిలించుకున్నాడు చరణ్. ఒక్కక్షణం బిత్తరపోయాడు యష్. అంతలోనే మరల చరణ్ ను కుదుపుతూ " ఆకలేస్తోంది డాడి. స్కూలు నుంచి వచ్చాక కూడ అమ్మ ఏమీ పెట్టలేదు. ఏదైనా ఇవ్వు డాడి తినడానికి" ఏడుపు పెద్దది చేశాడు యష్. విసురుగా లేచాడు చరణ్. గబగబా రిఫ్రిజిరేటర్ దగ్గరికి వెళ్ళి తలుపు తీసి అందులో నుంచి రెండు యాపిల్స్ తీసి యష్ ముందుకు విసిరాడు. " తిను. తినిచావు. ఆకలి ముందుపుట్టి, వెనక నువ్వు పుట్టినట్టున్నావు. పీక్కు తింటున్నారురా నువ్వొక పక్క, ఆ రాక్షసి ఒక పక్క" అంటూ వంట గదిలోకి వెళ్ళి గ్లాసులో పాలు పోసుకుని వచ్చి యష్ ముందు ఎత్తికొట్టాడు. " చేతకాని వాడివి చేతకానట్టు ఉండాలి. పోషించడానికి చేతకానివాడివి, ఎందుకు కట్టుకున్నావు. ఎందుకు పిల్లల్ని కన్నావు" పక్క మీద నుంచే విసుర్లు విసిరింది శ్రీహాస. " బుద్ధి గడ్డితిని. ఆడపిల్లవనుకున్నాను గానీ, ఆషాడభూతివనుకోలేదు. ఉన్నదాంతో సర్దుకుపోతావనుకున్నాను గానీ, ఊరంతా అప్పులు చేయిస్తావనుకోలేదు" " ఎవరికోసం చేశారు నాకోసమా. నెల నెల మీ నాన్నకు పదివేల రూపాయలు పంపడానికి అప్పులు కావు. నేను నెలకొక చీర కొనుక్కుంటేనే అప్పులవుతాయి." " అది బాధ్యత. ఇంట్లో తెచ్చుకుని ఎలాగూ పెట్టుకోలేను. కనీసం తిండికి డబ్బు కూడ పంపకపోతే, వాళ్ళు మాడి చస్తారే. కొడుకుగా వాళ్ళను అందలమెక్కించక పోయినా, ఆకలితో చంపలేను" " నాకు తెలుసు. మీ మగవాళ్ళకు ఆడదాన్ని అవసరానికి వాడుకోవడమే తెలుసు తప్ప, వాళ్ళ మనసు గురించి అక్కరలేదు. వయసులో ఉన్నప్పుడు పెద్దవాళ్ళ కోసం కోరికలను చంపుకోవాలి. వాళ్ళు కడతేరిపోయేలోపు పిల్లలు ఎదిగివస్తారు. వాళ్ళ చదువుల కోసం, పెళ్ళిళ్ళ కోసం డబ్బులు చాలక, అప్పుడు కూడ మేమే కోరికలు చంపుకోవాలి. ఇక ఎప్పుడు ఆడదాని మనసులోని కోరికలు తీరేది" ఏకరువు పెట్టింది శ్రీహాస. "నీకుగాకుండా, మీ అమ్మ వాళ్ళకు కూడ నా డబ్బు దోచిపెడతావాయె. ఈ గొంతెమ్మ కోరికలు తీర్చుకుంటావనే కదా ఉద్యోగం చేయమన్నాను. అప్పుడు నీ డబ్బు నువ్వెట్టా తగలబెట్టుకున్నా సరిపోయేది." బాణం విసిరాడు చరణ్. " ఆ కూతేదో పెళ్ళికి ముందు కూయాల. అప్పుడేమో ఉద్యోగం చేయడం అంత ముఖ్యం కాదు. ఇల్లు బాగా చూసుకుంటే చాలన్నారు. ఇప్పుడేమో ఈ తతంగం. అబ్బో మహా మేధావులండీ మీరు" అంగుళం తగ్గలేదు శ్రీహాస. " ఛీ " అని ఛీదరించుకుని వెళ్ళిపోయాడు చరణ్. " చేతగాని చవట" అని ముసుగుతన్నింది శ్రీహాస. వీళ్ళ గొడవకు వస్తున్న ఏడుపే కాదు, ఆకలి కూడ చచ్చిపోయింది యష్ కు. నెలలో ఇరవై రోజులు ఇదే తంతు ఇంట్లో. పసివాడికి కూడ అసహ్యం కలుగుతున్నది. అమ్మ, నాన్న ప్రేమగా దగ్గరతీయడం ఎప్పుడో ఒకసారి జరుగుతున్నది ఆ పసివాడి బ్రతుకులో. గోరుముద్దల సంగతేమో గాని, అసలు ముద్ద కూడ సరిగా పెట్టరు. ఎప్పుడూ కొట్టుకుంటూనే ఉంటారు. అందరి తల్లిదండ్రులూ ఇలానే ఉంటారా? అనే ప్రశ్న, ఆ పసిమనసును తొలిచేస్తూనే ఉన్నది. మెల్లగా లేచాడు. తన గదిలోకి వెళ్ళి అంతా వెతికాడు. దొరికినంత చేత పుచ్చుకుని చప్పుడు చేయకుండా తలుపులు తీసి మెల్లగా బయటపడ్డాడు యష్. ********* రాత్రి పన్నెండు గంటలయింది. డ్యూటి మారే సమయమొచ్చింది. టేబుల్ సర్దుకుని లేచాడు స్టేషనుమాస్టరు ముకుందయ్య, ఒకసారి ప్లాటుఫాం కలయ తిరిగి వద్దామని. అతనికి అదొక అలవాటు. డ్యూటి దిగేముందు స్టేషనంతా చుట్టి వస్తాడు. అలా తిరిగేటప్పుడు కొందరు పసిబిడ్డలు అతనికి కనిపించేవారు. ఎవరో చేసిన పాపం ఆ పసిబిడ్డల రూపంలో ప్లాటుఫాం మీద వెక్కిరించేది. కానీ ముకుందయ్య విసుక్కునేవాడు కాదు. తన చేతులలో ఆ బిడ్డలను తీసుకెళ్ళ అనాథాశ్రమంలో అప్పచెప్పేవాడు. మొదటిసారి దొరికిన ఆడపిల్లను తన పిల్లలతో పాటే పెంచుకుంటున్నాడు. కానీ అందరినీ అలా పెంచడానికి తన స్థోమతు చాలదని తెలిసి, అనాథాశ్రమంలో అప్పచెప్పి వస్తున్నాడు. ఏ మహానుభావులైనా ఆ బిడ్డలను చేరదీసి సాకకపోతారా అనే ఆలోచన అతనిది. తనకు వచ్చే సంపాదనలో పదిశాతం ఆ అనాథాశ్రమానికి విరాళంగా ప్రతినెల ఇస్తుంటాడు. అలా తిరుగుతున్న ముకుందయ్యకు బల్లమీద నిదురిస్తున్న పసివాడు కనిపించాడు. చూడడానికి ఎంతో ముద్దుగా ఉన్నాడు. మంచి కుటుంబానికి చెందినవాడులా అనిపించాడు. తట్టిలేపబోయాడు. కానీ మనసొప్పలేదు. మనసులో ఒక నిర్ణయానికి వచ్చి, తిన్నగా భుజానికెత్తుకున్నాడు. ****** తెల్లగా తెల్లవారింది. కళ్ళు తెరిచాడు యష్. ఆశ్చర్యపోయాడు చుట్టూచూసి. తను ఇక్కడికెలా వచ్చాడో అర్ధంకాలేదు. రాత్రి ఇంటినుంచి బయలుదేరి వచ్చి, ఆటోయెక్కి రైల్వేస్టేషనుకు వచ్చాడు. ఏదైనా రైలు వస్తే ఎక్కి తాతయ్య ఊరు వెళ్ళిపోదామని బల్లమీద కూర్చున్నాడు. అంతవరకే గుర్తున్నది. తరువాత ఇక్కడ ఇలా. " బాబు మెలకువ వచ్చిందా?" అంటూ వచ్చింది ఒకావిడ. ఎవరా అని చూశాడు. ఎవరో ఆమె అమ్మకంటే పెద్దదిగా వుంది అనుకున్నాడు. ఆమె తన చేతిని పట్టుకుని స్నానాలగదికి తీసుకెళ్ళి వదిలింది. పళ్ళు తోముకుని, స్నానం చేసి వచ్చాడు యష్. వచ్చేసరికి బట్టలు చేతిలో పట్టుకుని ఉన్నది ఆమె. మాట్లాడకుండా తొడుక్కున్నాడు. ఇంతలో అక్కడికి వచ్చాడు ముకుందయ్య. " రాజేశ్వరి బాబు ఎప్పుడు తిన్నాడో ఏమో. టిఫిను పెట్టు" అని భార్యకు చెప్పి " బాబు వెళ్ళు. అక్కడ అక్కయ్య, అన్నయ్య ఉన్నారు. వాళ్ళతో కూర్చుని కడుపునిండా తిను" అని తల నిమిరిపంపాడు. యాంత్రికంగా ఆమెను అనుసరించాడు. ఆమె వేడి వేడిగా దోసెలు వేసి పళ్ళెంలో పెట్టింది. అక్కడికి ముకుందయ్య కూడ వచ్చాడు. " కడుపునిండా తిను. ఇది మీ ఇల్లే అనుకో " ప్రేమగా అన్నది రాజేశ్వరి. ఏడుపు వచ్చింది యష్ కు. అలా ఎప్పుడు ప్రేమగా తన తల్లి అనగా వినలేదు. అందుకే దుఃఖం పొంగింది. " ఏడవకు బాబు. ముందు తిను. తరువాత మీ ఇంటి దగ్గర దింపి వస్తాను " అన్నాడు ముకుందయ్య. యష్ ఉలిక్కిపడ్డాడు ఆ మాట విని. " వద్దు. నన్ను మా ఇంటికి తీసుకెళ్ళ వద్దు. నేను ఇక్కడే వుంటా" అప్రయత్నంగా వచ్చింది యష్ నోట. ఒక్కసారిగా షాక్ అయ్యాడు ముకుందయ్య. ఏదో జరిగినట్లున్నది ఇంట్లో. అందుకే భయపడుతున్నాడు. " అలాగే ఇక్కడే వుందువు గాని. తిను " అని వీపు తట్టాడు, చిన్నగా విషయం రాబడుదామని నిర్ణయించుకుని. ******* " సార్ మా బాబు ఆచూకీ ఏమైనా తెలిసిందా?" చరణ్ వచ్చి అడిగాడు ఇన్స్పెక్టరు రవిని. అతని వెనుకనే వచ్చింది శ్రీహాస. ఆమె కళ్ళు ధారాపాతంగా వర్షిస్తున్నాయి. " మా బాబును వెతకడానికి ఎంత సమయం పడుతుంది. ఎవరైనా కిడ్నాప్ చేశారేమోనని అనుమానంగా వుంది సర్. మీరే రక్షించి తీసుకురావాలి" ఏడుస్తూ వేడుకుంది శ్రీహాస. " ఇప్పుడు ఏడిస్తే ఏమి లాభం. వాడిని ఎప్పుడైనా ప్రేమగా చూశావా. నీ చీరలు, షోకులు తప్ప వాడి బాగోగులు పట్టించుకున్నావా. అనుభవించు" ఉన్నది పోలీసుస్టేషనన్న సంగతి కూడ మరచిపోయి ఆవేశపడ్డాడు చరణ్. " మీరు మాత్రం తక్కువతిన్నారా. పసివెధవని జాలిలేకుండా వాడి ముఖాన పండ్లు విసిరేసింది మీరుకాదా. మీకు మీ వాళ్ళు తప్ప ఎవరూ అక్కరలేదు. నాది కన్నకడుపండీ" తగ్గలేదు శ్రీహాస. " ఇక చాలు ఆపండి మీ గొడవ. ఇది స్టేషననుకున్నారా. మీ ఇల్లనుకున్నారా. అసలు మీరు చదువుకున్న వాళ్ళేనా. అసలు నా అనుమానం ప్రకారం, మీ అబ్బాయి కనపడకపోవడానికి కారణం మీరే" గద్దించాడు రవి. " అదేంటి సర్. అలా అంటారు. మేమెందుకు కారణమవుతాము" అడిగాడు చరణ్. " ముమ్మాటికీ మీరే. కాట్లకుక్కలా కొట్టుకుంటూ ఇంటిని వల్లకాడు చేసింది మీరే. మీ ఇరువురి ప్రేమల మధ్య పెరగవలసిన వాడు, మీ కీచులాటల మధ్య బలిపశువయ్యాడు. లాలించవలసిన వయసులో హింసించబడ్డాడు. ఆ పసిమనసు గాయపడితే ఓదార్చడానికి గానీ, అర్థంలేని మీ అహంకారాన్ని అదుపుచేసి మంచిమార్గాన్ని చెప్పడానికిగాని ఎవరున్నారు మీదగ్గర. కని, పెంచిన తల్లిదండ్రులను గడప తొక్కనివ్వదు మీ తరం. ఎందుకంటే వాళ్ళుంటే మీ స్వేచ్ఛకు అడ్డు. వాళ్ళుంటే మీకు బాధ్యత పెరుగుతుంది. అందుకే పెద్దవాళ్ళను అంటరానివాళ్ళను చేసి పాతకొంపల్లోకి విసిరేశారు. పెద్దల సుద్దులు పిల్లలు వినకుండా ఏకాకులను చేసి పారేశారు. మూడవ యేట నుంచే వారికి పాఠశాల బందీఖానా. పసివాడితో పాటు పసివాడై వారిని ఆడించే తాతయ్యలు ఉండరు. తల్లి కోప్పడినా దగ్గరకు తీసి, ' తప్పు నాన్నా. అమ్మకు నీ మీద కోపం కాదు, ప్రేమ. నువ్వు తినకపోయినా, చదువుకోకపోయినా, అల్లరిచేసినా నిన్నందరూ ఎగతాళి చేస్తారనే దిగులురా అది. నువ్వంటే అమ్మకు ప్రాణం' అని సర్దిచెప్పి, తల్లిదండ్రుల మీద వారికి ప్రేమ కలిగేలా మంచిమాటలు చెప్పి సంస్కారాన్ని పెంచే అమ్మమ్మలు, నాయనమ్మలు లేరు. అందుకే ఈరోజులలో పిల్లలు ఇసుమంత బాధ కూడ భరించలేక ఆత్మహత్యలకు పాల్పడే సున్నిత మనస్కులలా తయారవుతున్నారు" చెప్పుకుపోతున్నాడు ముకుందయ్య. " అసలు మీరెవరండి మాకు హితబోధ చెయ్యడానికి. మా బ్రతుకులు మా ఇష్టం " తలెగరేశాడు చరణ్. " అవునురా. మీ బ్రతుకులు మీ ఇష్టం. కానీ అభం శుభం తెలియని నా మనవడి బ్రతుకును బుగ్గిపాలు చేస్తానంటే నేనొప్పుకోను. ఆ గాయపడ్డ మనసును మీ మధ్య వుంచి ఇంకా గాయపరచలేను. నువ్విప్పుడన్నావే అతనిని, నువ్వెవరు నాకు నీతులు చెప్పడానికని. అతనేరా ఈరోజు చేతికి చిక్కకుండా పోయే నీ కొడుకును కాపాడి, ఇంటికి తీసుకెళ్ళి కడుపునిండా తిండిపెట్టి, ఆ పసివాడి మనసులోని బాధను తెలుసుకుని నా దగ్గరకు చేర్చాడు. నీలాంటి కుసంస్కారిని కొడుకుగా కన్నందుకు సిగ్గుపడుతున్నాను" ఎప్పుడు వచ్చాడో గాని చరణ్ తండ్రి హనుమంతరావు, కొడుకును దులిపేశాడు. " నాన్నా మీరు ఎప్పుడు వచ్చారు" తడబడుతూ అడిగాడు చరణ్. " నేనే పిలిపించాను. స్టేషనుమాస్టరు ముకుందయ్య గారు బాబును తీసుకుని మా దగ్గరకు వచ్చి విషయమంతా చెప్పి, బాబును అతని తల్లిదండ్రులకు అప్పగించడానికి మా సహాయం కోరాడు. బాబును చూడగానే గుర్తుపట్టాము. మీరు వచ్చినపుడు మీ దగ్గరనుంచి మీ తండ్రి గారి చిరునామా, మీ మామ గారి చిరునామా కూడ తీసుకున్నాము, మా విచారణ కోసం. బాబు కనిపించకుండా పోయిన రాత్రి మీ భార్యాభర్తలు గొడవపడ్డారని, మీరలా ఎక్కువ సమయాలు గొడవపడుతూనే ఉంటారని, బాబు మాటలలో అర్థమయిన ముకుందయ్య గారు, మీ నాన్నగారిని పిలిపించమన్నారు. అప్పటిదాక బాబు ఆచూకీని గోప్యంగా ఉంచమన్నారు. అరగంట క్రితమే వచ్చారు మీ నాన్నగారు. ఇంతలో మీరు కూడ రావడం జరిగింది" చెప్పాడు ఇన్స్పెక్టరు రవి. తలవంచుకున్నాడు చరణ్. మాటలరాక మౌనంగా ఉండిపోయింది శ్రీహాస. ఇంతలో యష్ ను వెంటబెట్టుకుని వచ్చాడు కానిస్టేబుల్. తల్లిదండ్రులను చూసి భయపడుతూ వణికిపోతున్నాడు యష్. తలపక్కకు తిప్పిచూశాడు ఎవరున్నారా అని. తాతయ్య కనిపించేసరికి " తాతయ్యా " అంటూ వెళ్ళి కాళ్ళను చుట్టుకుని వెక్కి వెక్కి ఏడవసాగాడు. " చూడండి. నేను మీ అంత చదువుకున్నవాడిని గాను. ఏదో పదవతరగతి చదివి రిజర్వేషనులో టిక్కెట్ కలెక్టరుగా ఉద్యోగంలో చేరి, ఈ మధ్యనే స్టేషను మాస్టరయ్యాను. జీవితాన్ని తప్ప, పుస్తకాలను చదవలేదు. అర్థరాత్రి పసివాడు స్టేషనులో బల్లమీద పడుకుని ఉంటే జాలివేసి తీసుకెళ్ళి, నాకున్నంతలో అంత అన్నం పెట్టి వివరమడిగాను. మీ కోపతాపాల మధ్య పసివాడు నలిగిపోతున్నాడని అర్థమయింది. ఈ సమయంలో బాబును మీ దగ్గరికి చేరిస్తే, మీరు బాబును ఓదార్చకపోగా, నాలుగు తగిలిస్తారేమోనని అనుమానపడి మీ నాన్నగారిని పిలిపించాము. ఆయన వస్తే బిడ్డకు క్షేమమని మాకు అనిపించింది. ఇందులో ఏదైనా పొరపాటు జరిగితే మన్నించండి" అసలు విషయం చెప్పి మన్నింపు కోరాడు ముకుందయ్య. " ఎంతమాట సార్. ఈ రోజు నా మనవడు మాకు దక్కాడంటే దానికి కారణం మీరు, మీ ఔదార్యం. ఉద్యోగాన్ని ఎంత బాధ్యతగా నిర్వర్తిస్తారో, అంతే బాధ్యతగా సమాజసేవ చేస్తారని అర్థమయింది. సంస్కారంలేని పెద్ద చదువులు దేనికండి, గోడలకు తగిలించుకోను తప్ప. చదువు సంస్కారాన్ని యివ్వదనడానికి మేము, సంస్కారానికి చదువు అక్కరలేదని మీరు మంచి ఉదాహరణలు. మీ మేలు జన్మలో మరచిపోలేము సర్. జీవితాంతం ఋణపడేవుంటాం. పెద్దవాడిని గనుక మీ పాదాలంటలేను. అలాచేస్తే మీకు ఆయుక్షీణం" అని ముకుందయ్య చేతులు పట్టుకుని కళ్ళకు అద్దుకున్నాడు హనుమంతరావు. " అయ్యో ఎంతమాట. పెద్దవారు మీరు. ఎలాగైతేనేం మీ బిడ్డను మీ దగ్గరికి చేర్చగలిగాను. ఇకనుంచైనా బాబును జాగ్రత్తగా చూసుకోమనండి. పసిమనసులు సర్. మంచైనా, చెడైనా ఈ వయసులో మనసులో నాటుకుంటే అది చెదిరిపోదు. అమ్మ, నాన్న అంటే తమకు రక్షణకవచాలని పిల్లలు అనుకోవాలి. అంతేగాని, వీళ్ళ మధ్య నేను బ్రతకలేనని పారిపోకూడదు. ఇంతకుమించి నేను చెప్పలేనండి. ఉంటాను." అని అందరికీ నమస్కరించి, యష్ కు ముద్దుపెట్టి, " జాగ్రత్త బాబు " అని వెళ్ళిపోయాడు ముకుందయ్య. ఇన్స్పెక్టరు గారి వద్ద సెలవు తీసుకుని బయలుదేరారు అందరూ. ******** " నాన్నా. ఇంకొక్క రోజు ఉండి వెళ్ళండి" అడిగాడు చరణ్ తండ్రిని. " అవును తాతయ్యా ప్లీజ్. మీరు ఇక్కడే ఉండండి. మీరు వెళ్తే మరల అమ్మ, నాన్న గొడవ పడతారు" తాతను చుట్టుకున్నాడు యష్. " సారీ యష్. ఇక మేమెప్పుడూ గొడవపడం. నిన్ను బాధపెట్టం నాన్నా. అమ్మ మాట నమ్ము" యష్ ను దగ్గరకు తీసుకుంది శ్రీహాస. " ఎందుకురా అలా అందరూ బ్రతిమలాడుతున్నారు. నేను వెళ్తున్నది మీ అమ్మను తీసుకుని వచ్చి ఇక్కడే ఉండడానికి" చెప్పాడు హనుమంతరావు. ఉలిక్కిపడింది శ్రీహాస. బిక్కమొహం వేశాడు చరణ్. " హే... అవునా తాతయ్యా. హ్యాపి. హ్యాపి" అని ఎగురుతున్నాడు యష్ సంతోషంతో. " అంత ఆశ్చర్యపోకమ్మా. నేను చెప్పింది నిజమే. నేను మీ అత్తగారితో సహా బయలుదేరి వారం రోజులలో శాశ్వతంగా ఇక్కడ ఉండిపోయేలా వస్తాను. మీరు ఔనన్నా, కాదన్నా మా స్థానం ఇదే. మీ గొడవల మధ్య పడి నా మనవడు అనాథాశ్రమం చేరకుండా కాపాడవలసిన బాధ్యత తాతగా నాకున్నది. వాడికి మంచిని నేర్పించడం కోసం, ప్రేమను పంచడం కోసం మేమిక్కడికి వస్తాము. కాదనడానికి మీకు అవకాశం లేదు. కోర్టులు కూడ మావైపే ఉన్నాయి. ఉంటానురా. వారం లోపే ఇక్కడికి వస్తాము" అని చెప్పి సమాధానం కోసం చూడకుండా బయలుదేరాడు హనుమంతరావు. నోట మాట రాలేదు చరణ్ దంపతులకు. 'బిడ్డల కాపురం చెల్లాచెదరవుతుంటే, భేషజానికి పోయి వారికి దూరంగా ఉండడం సరికాదు. మాటలు పడ్డా పర్వాలేదు. చరణ్ కాపురం సరిదిద్దాల్సిన బాధ్యత తనది. మనవడిని తీర్చిదిద్దాలి. అందుకోసం ఎన్ని అవమానాలైనా పడడానికి సిద్ధం' అని మనసులో అనుకున్నాడు హనుమంతరావు. అవును నిజమే. పెద్దలు సర్దుబాటు చేసుకుంటూ ముందుకువస్తే ఉమ్మడికుటుంబాలు మనగలుగుతాయి. భావితరాలు సంస్కారవంతులుగా తీర్చిదిద్దబడతారు. ******* ******* ********

మరిన్ని కథలు

Kreeda sphoorthi
క్రీడాస్ఫూర్తి
- డి.కె.చదువులబాబు
Bhale alochana
భలే ఆలోచన
- సరికొండ శ్రీనివాసరాజు
Naanna maripoyadu
నాన్న!మారిపోయాడు
- కె.వి.వి.లక్ష్మీ కుమారి
Veedhi arugulu
వీధి అరుగులు
- రాముకోలా.దెందుకూరు.
Vennamuddala kalyanam
"వెన్నముద్దల కళ్యాణం"
- కొత్తపల్లి ఉదయబాబు
Mantri yukthi
మంత్రి యుక్తి.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు.
Chandrudi salaha
చంద్రుడిసలహా
- డి.కె.చదువులబాబు