అమ్మో శివయ్య.... - డా.బెల్లంకొండ నాగేశ్వరరావు.

Ammo sivayya

సాయంత్రం ఏదో వెదుకుతూ రచ్చబడ్డ వద్దకు వచ్చింది శేషమ్మ. తీరుబడిగా రచ్చబండపై కూర్చుని ఉన్న శివయ్య"ఏంటి అత్తా వెదుకుతున్నావు"అన్నాడు.
"నా నల్లకొడిరా అల్లుడు పొద్దుననగా పోయింది ఏడఉందో"అంది శేషమ్మ.
"అత్తా వెదకమాక నీకోడి"అంటూ శేషమ్మ చెవివద్ద గుసగుసలాడాడు శివయ్య.
"ఆ ఇది దానిపనా ఊళ్ళోకి రాని దానిసంగతి తేలుస్తాను"అంది నిప్పులుకురిసే కళ్ళతో శేషమ్మ.
మరుదినం చేతిసంచితో ఊళ్ళోకి వచ్చి తనఇంటి సుబ్బమ్మను చూసిన శేషమ్మ"ఆహా ఏమి నంగనాచివే నానల్లకోడిని కూరవండుకుని కూతురు ఊరువెళ్ళి హాయిగా రెండుపూటలు తిని ఏమి ఎరుగనిదానిలా ఊళ్ళోకివచ్చావా"అంటూ గయ్యమంది సుబ్బమ్మపై శేషమ్మ.
"అయ్యో అయ్యో నీఅన్యాయంకూలా,నేనే పాపం ఎరుగనమ్మ.పిల్లది జ్వరంతో మూడురోజులు మంచం పట్టి ఉంటే చూద్దాం అనివెళ్ళా! జ్వరంతో ఉన్న పిల్లకు కొడికూర పెడతారా? అయినా నేను ఎలాంటిదాన్నో నీకుతెలియదా? ఇరవై ఏళ్ళుగా ఇరుగు పొరుగునఉంటున్నామే, ఓమాట అనేముందు ఆలోచించవా? అయినా నీకోడిని నేను పట్టినట్టు చెప్పిన వెధవ ఎవడే"అంది సుబ్బమ్మ.
"శివయ్య చెప్పాడు"అంది శేషమ్మ.
"ఆ ఏడి వాడు పని పాట లేకుండా రచ్చబండకాడచేరి ఇట్టాంటి పనులు చేస్తున్నాడు వాడితోనే తేల్చుకుంటా"అంది సుబ్బమ్మ.
"వాడు నిన్నే వాళ్ళ చెల్లెలు వాళ్ళఊరు దుర్గాపురం వెళ్ళాడు"అన్నారు ఎవరో!
"పెద్దమ్మ నీనల్లకోడిని డొంకలో కుక్కలు పట్టాయి"అని చెప్పి చక్రం తోలుకుంటూ వెళ్ళాడు ఓపిల్లోడు.
"ఏమనుకోమాకు వదినా ఆశివయ్య గాడి మాటలు ఇని నిన్ను అలా అన్నాను"అని సుబ్బమ్మ చేతులు పట్టుకుంది శేషమ్మ.
------------------------------------------------------------------------------------
అన్నంతిని చేయి శుభ్రపరుచుకుంటున్న శివయ్యను"అన్న ఎన్నిరోజులైనా ఉండు కాని ఇక్కడ ఎటువంటి సమస్యలు తీసుకు రాబోకురా"అంది శివయ్య చెల్లెలు విజయ.
"అలాగే"అన్నాడు శివయ్య.
సాయంత్రం రంగయ్య అంగడికి వచ్చిన పాల కోటయ్య"ఏమయ్య పెద్దమనిషి ఈవయసులో నీకిదేం పోయేకాలం నేను పాలల్లో నీళ్ళు ఎక్కువ కలుపుతున్నానా?పైగా పాలుకొలిచే లోటా అడుగు భాగాన సొట్ట కొట్టానా? అంగడి దగ్గరకు వచ్చిన అందరితో కూస్తున్నావంట"ఆవేశంగా అన్నాడు.
"రావయ్యరా! నేనే వద్దామనుకుంటున్నా నీదగ్గరకు,ఏంది తక్కెడ అడుగున చింతపండు అంటిస్తానన్నవంట? బియ్యంలో రాళ్ళు కలుపుతున్నానా? నాసరుకులన్ని నకిలివా? నువ్వు నీళ్ళు కలిపితే నాకెందుకు,నీపాల లోటాకి సొట్టకొట్టుకున్నావో,నీబుర్రకి బొక్కపెట్టుకుంటావో నాకెందుకు? నీబతుకు నీది,నాబతుకు నాది నేను ఎప్పుడు ఎవరికాడ నీగురించి మాట్లాడలేదు. మరోసారి నా వ్యాపారం సంగతి ఎత్తావంటే మర్యద దక్కదు, కుయ్యడానికి నేనుకోడినా?" మాటలు అన్నాడు రంగయ్య.
"మరయితే ఆడు నీగురించి నాకు అట్టా చెప్పాడే"అన్నాడు కోటయ్య.
"ఎవురు విజయ వాళ్ళ అన్న శివయ్యేనా,వాడే నీగురించి నాకు చెప్పాడు"అన్నాడు రంగయ్య.
"పద వాడిసంగతి తేల్చుకుందాం"అని విజయ ఇంటికి దగ్గరకు వెళ్ళారు.
"రాత్రే అన్నయ్య వాళ్ళ ఊరు వెళ్ళాడు"అంది విజయ.
ఇలా పలుగ్రామల ప్రజలు శివయ్య బారినపడి అతని ఆగడాలు భరించలేక రాజుగారికి ఫిర్యాదు చేసారు.
శివయ్యను పిలిపించిన రాజుగారు"శివయ్య నువ్వు ఎక్కడ ఉంటే అక్కడ తగాదాలు పెడతావట అంతనేర్పరివా? ఏది మాఅంతఃపురంలో ఉండి మహారాణి వారికి మాకు తగవు పెట్టు నువ్వు ఎంతటి గొప్పవాడివో చూధ్ధాం"అన్నాడురాజు గారు."ప్రభువుల ఆజ్ఞ ప్రయత్నిస్తాను"అన్నాడు శివయ్య.
అలా కొద్ది రోజులు గడచింది.పరిపాలన విషయాల వత్తిడిలో శివయ్య విషయం మర్చిపోయాడు రాజుగారు. శివయ్య రాణి వాసంలో తిరుగుతూ మహారాణి గారిని చూస్తూనే మోకాళ్ళపై కూర్చోని తలవంచి నమస్కరించేవాడు.అతని వినయానికి మహారాణి ఎంతో ముచ్చటపడేది.
కొద్దిరోజుల అనంతరం రాజు గారిని ఏకాంతంగా కలసిన శివయ్య "మహారాజా నేను ఓడిపోయాను.బుద్ధివచ్చింది వెళ్ళిపోతున్నాను కాని ఓక రహస్యం తమతో చెప్పాలి"అంటూ...ఆగిపోయాడు.
"ఏమిటిఅది? నిర్బయంగా చెప్పు "అన్నాడు మహారాజు.
"ప్రభు గోడలకు చెవులుంటాయి తమరు అనుమతిస్తే చెవిలో మనవి చేసుకుంటాను"అని రాజుగారి చెవిలో గుసగుసలాడాడు.
"నిజమా? పరిక్షించవలసిందే! అన్నాడు రాజుగారు.
"మహాప్రభు ఈపరిక్ష పౌర్ణమిరాత్రి మాత్రమే చేయాలి! రేపే పౌర్ణమి మరినాకు సెలవు"అని నేరుగా రాణివాసం వెళ్ళిన శివయ్య ఎప్పటిలా రాణి గారికి నమస్కరిస్తూ"మహారాణి నేను ఓడిపోయాను రేపే మాఊరు వెళ్ళి పోతున్నాను మీకు ఒక రహస్యం చెవిలో చెప్పాలి అనుమతి ఇవ్వండి" అన్నాడు.
"దానికేం నాయనా నువ్వు నాబిడ్డలాంటి వాడివి అలాగే చెప్పు"అని చెలికత్తెలను గదిలోనుండి వెలుపలకు పంపంది.
రాణి గారి చెవివద్ద గుసగుసలాడిన శివయ్య"మహారాణి ఇది పౌర్ణమి రాత్రి మాత్రమే పరిక్షించాలి. రేపే పౌర్ణమి మరి సెలవు"అని వెళ్ళిపోయాడు.
మరుదినం పౌర్ణమి ఆరాత్రి రాజుగారు మంచపై నిద్రపోతున్న మహారాణిని గారిని వాసన చూడసాగాడు.అప్పటివరకు నిద్ర నటిస్తున్న మహారాణి
"ఛీ కుక్కఫో " అని రాజుగారినిఅని వేరే మంచంపైకి వెళ్ళిపడుకుంది.
"పోవే చేపలు అమ్మేదాన"అని రాజుగారు అన్నాడు.
"ఏమిటి? నేను చేపలు అమ్మేదాన్నా?"అంటూ గయ్యమంది మహారాణి.
"మరి నేను కుక్కనా? అన్నాడు మహారాజు"
జరిగిన విషయం అర్ధమైన రాజు,రాణి శివయ్య తెలివితేటలకు నవ్వుకుని "ప్రభు తమరు గతజన్మలో కుక్కగా జన్మించారని అందువలన ఈజన్మలోనూ ప్రతి పౌర్ణమికి మీపక్కన ఉన్నవారిని కుక్కలా వాసన చూస్తారని నాకు చెప్పి పౌర్ణమి రాత్రి మిమ్మలను గమనించమన్నాడు అందుకే తమరు వాసన చూడటంతో మాటతూలాను మన్నించండి" అన్నది మహారాణి.
"దేవి నువ్వు గతజన్మలో చేపలు అమ్మే దానవని కావాలంటే పున్నమి రాత్రి నిన్ను వాసనచూడమని శివయ్య నాకు చెప్పాడు మన్నించుదేవి అతని మాటలు నమ్మి నిన్ను తూలనాడాను"అన్నాడు రాజు.
మరుదినం శివయ్యను పిలిపించి "శివయ్య నీవే గెలిచావు.నువ్వు హాయి బ్రతకడానికి పదిఎకరాల వ్యవసాయ భూమి ఇస్తున్నా! ముందు జీవితంలో ఎవరికైనానువ్వు తగాద పెట్టినట్లు నిర్ధారణ అయితే నీకు మరణదండన విధిస్తాను జాగ్రత్త వెళ్ళు"అన్నాడు రాజు గారు.
రాజు గారి హెచ్చరికతో భయంగా తన చెడు అలవాట్లు అన్నిమానుకుని పొలం పనులతో హాయిగా జీవించాడు శివయ్య.

మరిన్ని కథలు

Vimanam lo kalakalam
విమానంలో కలకలం
- తాతా కామేశ్వరి
Aame kavvinchindi
ఆమె కవ్వించింది
- తాత మోహనకృష్ణ
Chandruniko noolu pogu
చంద్రునికో నూలు పోగు
- కాశీవిశ్వనాధం పట్రాయుడు/kasi viswanadham patrayudu
Anaadha atidhyam
అనాథ అతిథ్యం
- - బోగా పురుషోత్తం
Vibheeshana Sharanu
విభిషణుని శరణు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Srivariki prema lekha
శ్రీవారికి ప్రేమలేఖ
- తాత మోహనకృష్ణ
Ramdaas formula
రాందాస్ ఫార్ములా
- వీరేశ్వర రావు మూల