అమెరికా సంబంధం - చెన్నూరి సుదర్శన్

Amerika sambandham

“సూర్యం.. అమెరికా ట్రంకాల్ కావాలి” ప్రాధేయపూర్వకంగా అడిగాడు గోవర్ధన్.

అతని గొంతులో ఆవేదన ప్రస్ఫుటమవుతోంది.

ఆకాలంలో అమెరికా ట్రంకాల్ అంటే మాటలు కాదు. చాలా ఖర్చుతో కూడుకున్న పని. కేవలం టెలీఫోన్ ఆపరేటర్ మాత్రమే కనెక్ట్ చేసే సౌకర్యముంది. కాని అతని అత్యంత ప్రియమైన చిన్న కూతురు సంధ్యతో మాట్లాడాలనే కోరిక ముందు అది అమూల్యం.

సూర్యం వివరాలు తీసుకున్నాడు. ఇంటర్ కమ్ లో అతని కొలీగ్ చేత కాల్ బుక్ చేయించుకుని డాకెట్ తెప్పించుకున్నాడు. సంధ్య గొంతు వినాలని అతనికీ ఉత్సుకత ఉంది. ఈ మధ్యనే వరంగల్ పోతన టెలీఫోన్ కార్యాలయానికి బదిలీ మీద వచ్చాడు. ఇక్కడ నుండి నేరుగా అమెరికా లైను లేదు. వయా హైదరాబాదు ప్రయత్నించాలి. కాస్త కష్టసాధ్యమైనా.. సూర్యం సాధించాడు.

అవతల సంధ్య భర్త భరణి మాట్లాడుతున్నాడు. గోవర్ధన్ కు కాల్ కనెక్ట్ చేసి అబ్జర్వ్ చెయ్యసాగాడు సూర్యం. ఆ వెసులుబాటు, అధికారం ఆపరేటర్లకు ఉంటుంది.

“భరణీ..! మా అమ్మాయి ఆచూకి దొరికిందా”

“లేదు మామయ్యా.. నేను ఆఫీసుకు సెలవు పెట్టి పోలీసు స్టేషన్ చుట్టూ తిరుగు తున్నాను”

“నేను అమెరికా వస్తాను. వచ్చే శనివారం అక్కడ ఉంటాను. ఆవిషయమే చెబుదామని ఫోన్ చేశాను” అంటూ ఫోన్ కట్ చేశారు గోవర్ధన్.

సూర్యం దిగ్భ్రాంతి చెందాడు. సంధ్య కనిపించక పోవడమేమిటి? అదీ అత్యంత పటిష్టమైన పోలీసు వ్యవస్థ కలిగిన ఆమెరికాలో..! అతని మనసు శూన్యమయ్యింది. సూర్యం రిలీవర్ రావడంతో.. అతనికి ట్రంక్ బోర్డు అప్పగించి బయటపడ్డాడు.

టెలీఫోన్ భవన్ కెదురుగానే హన్మకొండ వెళ్ళడానికి లోకల్ బస్ స్టాప్. గబా, గబా రోడ్డు క్రాస్ చేసి రన్నింగ్ బస్సెక్కాడు సూర్యం. కిటికీ ప్రక్కన కూర్చున్నాడు. బస్సు వేగం పుంజుకుంది. చెట్లు వెనక్కి పరుగెడుతున్నాయి. అతని ఆలోచనలను నెమరు వేస్తూ.. మాటి, మాటికి సంధ్య రూపమే అతని కళ్ళల్లో కదలాడు తోంది..

సూర్యం 1974లో డిగ్రీ చేస్తున్నప్పుడు హన్మకొండ బ్రాహ్మణ వాడలో ఉండ డానికి గది అద్దెకు తీసి సహకరించాడు అతని ఊరి బాల్య స్నేగితుడు రవి.. గోవర్ధన్ కు స్వయాన బావమర్ధి.

గోవర్ధన్ పాలిటెక్నిక్ కాలేజీలో సూపరింటెండెంట్.. అతనికి ఇద్దరమ్మాయిలు.. సరళ, సంధ్య. అతని ఆలోచనా ధోరణి అంతా మానవ సంబంధాలకన్నా వ్యాపార ధోరణి మిన్న.

సరళ పెళ్ళి.. కట్నం కానుకలు లేకుండా చెయ్యాలని పథకాలు రచించాడు. అందులో భాగంగా రవి ఎల్కతుర్తిలో ఎనిమిదవ తరగతి కాగానే తీసుకు వచ్చి జూనియర్ పాలిటెక్నిక్ సివిల్ ఇంజనీరింగ్ లో జాయిన్ చేయించాడు. అప్పట్లో ఆ కోర్సుకు బాగా డిమాండు ఉంది. అదృష్టవశాత్తు రవి చదువు పూర్తికాగానే నిర్మల్ లో ఉద్యోగం వచ్చింది. అప్పటికి ఇంకా సరళ పదవతరగతి గూడా ఉత్తీర్ణురాలు కాలేదు.

సంధ్య ఎనిమిదవ తరగతి చదువుతోంది. సూర్యం రోజూ సాయంత్రం గోవర్ధన్ ఇంటికి వెళ్ళి సంధ్యకు హోమ్ వర్క్ చేయించి.. పాఠాలూ చెప్పే వాడు. గోవర్ధన్ సతీమణి సుశీలమ్మ ఉత్తమురాలు. సూర్యాన్ని తన స్వంత తమ్మునిలాగే చూసుకునేది. సూర్యం గూడా సుశీలమ్మను ‘అక్కయ్యా..’ అని పిలిచేవాడు. సూర్యం క్రమశిక్షణ చూసి గోవర్ధన్, సుశీలమ్మలు ముచ్చటపడే వారు. గోవర్ధన్ మదిలో మరేదైనా ప్రణాళిక లోని భాగమో! ఏమో! గాని అప్పుడప్పుడు సూర్యాన్ని భోజనానికీ ఆహ్వానించే వాడు కూడా.

అలా రెండు సంవత్సరాలు సూర్యం, సంధ్యల మధ్య గురువు శిష్యురాలి అనుబంధం కొనసాగింది.

సంధ్య పదవతరగతి మొదటి శ్రేణిలో ఉత్తీర్ణురాలయ్యింది. ఇదంతా మా తమ్ముని ప్రతిభ అని సూర్యాన్ని పొగిడింది సుశీలమ్మ.

అదే సమయంలో సూర్యానికి మెరిట్ ప్రాతిపదికన టెలీఫోన్ ఆపరేటర్ ఉద్యోగం వరించింది. ఆర్మూరులో జాయినయ్యాడు.

ఉద్యోగ వచ్చింది కదా.. అని సూర్యానికి పెళ్లి సంబంధం చూసి కరారు చేశారు అతని తల్లిదండ్రులు.

ఒక రోజు సూర్యం తనకు కాబోయే భార్యను తీసుకుని వెళ్ళి.. సుశీలమ్మకు, గోవర్ధన్ కు పరిచయం చేశాడు. గోవర్ధన్ ముఖం పాలి పోయింది.

సూర్యం పెళ్ళికి గోవర్ధన్ ఒక్కడే హాజరయ్యాడు. సుశీలమ్మ రానందుకు సూర్యం బాధపడ్డాడు.

సంధ్య ఇంటర్ మీడియట్ లో ఉండగానే.. ఆమె వివాహ ఆహ్వాన పత్రిక అందుకుని.. అప్పుడే సంధ్యకు పెళ్ళి ఏంటని ఆశ్చర్యపోయాడు సూర్యం.

వరుడు భరణిని చూసి కంగుతిన్నాడు. భరణి ఈడు ముదిరిన వాడు. పైగా సరళకు తగ్గ జోడుగా అనిపపించ లేదు. అదే విషయం రవితో కదిలించాడు సూర్యం.

“అమెరికా సంబంధం.. కట్నమాశించని సంబధం” అన్నాడు రవి నిర్లిప్తంగా.

“హన్మకొండ.. లాస్ట్ స్టేజ్..” అని గట్టిగా కేక పెట్టాడు బస్ కండక్టర్.

ఆలోచనలు నుండి తేరుకున్నాడు సూర్యం.

బస్సు దిగి నేరుగా గోవర్ధన్ ఇంటికి దారి తీశాడు. సూర్యాన్ని చూడగానే సుశీలమ్మ పరుగులాంటి నడకతో వచ్చి సూర్యం ఎదపై తలపెట్టి.. “తమ్ముడూ..! ఘోరం జరిగి పోయింది.. తమ్ముడూ..!!” అంటూ శోకము పెట్టింది. సూర్యం కళ్ళూ జలపాతాలయ్యాయి.

“ఏమయ్యిందక్కా.. బావ ఫోన్ లో భరణితో మాట్లాడుతుంతే విన్నాను. విషయం తెలియక గాబరా పడుతూ వచ్చాను. సంధ్య ఏమయ్యింది?. అమెరికాలో తప్పి పోయిందా? అక్కడ పోలీసు వాళ్ళు చాలా స్ట్రిక్ట్. తప్పకుండా దొరుకుతుంది. ఏడువకు” అంటూ.. ఓదార్చాడు సూర్యం. పది నిముషాలకు గాని కాస్త తేరుకో లేదు.

గోవర్ధన్ కన్నీళ్లు తుడ్చుకుంటూ సూర్యాన్ని కూర్చోమ్మంటూ కుర్చీ చూపించాడు. ఇంతలో సుశీలమ్మ వంటింట్లోకి వెళ్లి సూర్యానికి మంచి నీళ్ళు తెచ్చిచ్చింది. సూర్యం గ్లాసు ఖాళీ చేసి టీపాయ్ మీద పెడుతూ.. అసలు ఏం జరిగింది అన్నట్టుగా గోవర్ధన్ వంక చూశాడు.

గోవర్ధన్ ముఖం దించుకుని జరిగింది చెప్పసాగాడు..

“అమెరికా సంబంధమని.. సంధ్య అమెరికా వెళ్తుందని ఎంతో సంబరపడ్డాము. మా బంధువర్గంలో ఎవరూ ఇంత వరకు మన రాష్ట్రం వదలి పోలేదు. నా బిడ్డ అమెరికాలో.. అని గర్వపడ్డాము. పైగా కట్న ప్రసక్తి తేకుండా మీ అమ్మాయికి మీరేమైనా పెట్టుకొండి అని మా వియ్యంకుల వారు అంటుంటే.. వారి మంచితనానికి పొంగిపోయాము. అయనా నా బిడ్డకు తక్కువ చేయలేదు. తన కిష్టమైన నగలు చేయించాము. పెళ్ళిఘనంగా చేశాం. నువ్వు చూశావు గదా.. సూర్యం!” అనగానే అవునన్నట్టుగా తలాడించాడు సూర్యం.

“భరణి అమెరికా వెళ్ళి సంధ్యకు వీసా పంపించాడు. అంత దూరం అమ్మాయి ఒక్కర్తే వెళ్తోందని మీ అక్కయ్య వెక్కి, వెక్కి ఏడ్చింది. తోడు వెళ్ళలేని పరిస్థితి. అప్పుడని పించింది అమెరికా సంబంధం అనవసరంగా చేశామని. నేనూ ఏడ్చాను. అయినా అమ్మాయి అమెరికాలో సుఖపడ్తుందనుకున్నాం. గాని ఇలా జరుగుతుందని కలలో గూడా ఊహించ లేదు” అంటుంటే గోవర్ధన్ గొంతు జీర బోయింది. ఎదలో నుండి దుఃఖం పొంగుకు రాసాగింది.

“ఏం జరిగింది బావా? .. అక్కయ్యకు ధైర్యం చెప్పాల్సిన మీరే ఇలా దిగాలు పడితే ఎలా?” అంటూ ఉపశమన వాక్యాలు పలికాడు సూర్యం.

“సంధ్య అమెరికా చేరుకోగానే భరణి రిసీవ్ చేసుకున్నాడు. ముందుగా అతని అక్కయ్య ఇంటికి తీసుకు వెళ్ళాడు. వారం రోజుల తరువాత తన ఇంటికి తీసుకు వెళ్ళాడు. భరణి ఉండేది ఒక పెద్ద ఇల్లు. పెళ్ళికి ముందు అతనితో బాటుగా మరో ముగ్గురు స్నేహితులు కలిసి ఉండే వారు. సంధ్య వస్తుందని తెలిసి ఖాళీ చేసి అదే వీధిలో మరో ఇంట్లో ఉంటున్నారు,

ఆ రోజు భరణికి నైట్ షిఫ్ట్ చెయ్యక తప్పింది కాదట. మరుసటి రోజునుండి ఎలాగైనా ఉదయానికి మార్చుకుంటానని చెప్పి తన స్నేహితులను సంధ్యకు రక్షణగా వరండాలో పడుకోమన్నాడట.

భరణి తెల్లవారి వచ్చేసరికి అతని మిత్రులింకా నిద్రనుండి లేవలేదట. సంధ్య

పడుకున్న గది తట్టితే సమాధానం లేదట. ఎంత పిలిచినా పలుకక పోయే సరికి భయమేసి పోలీసులకు కంప్లైంట్ చేశారట.

పోలీసులు వచ్చి తలపు బద్దలు కొట్టి లోనికి వెళ్తే.. బెడ్ మీద సంధ్య లేదు. డ్రెస్సింగ్ టేబుల్ మీద సంధ్య నగలన్నీ ఉన్నాయి. ఒక్కటి గూడా మిస్ కాలేదు.

సంధ్య ఏమయ్యిందో ఇప్పటికీ మిస్టరీ గానే ఉంది” అంటుంటే గోవర్ధన్ కళ్ళు నీటి కడవలయ్యాయి. సుశీలమ్మ మరో ప్రక్క ఏడుస్తూనే ఉంది మౌనంగా..

“ఇది ఎప్పుడు జరిగింది బావా..” విస్మయంగా అడిగాడు సూర్యం.

“నాలుగు మాసాలవుతోంది”

“మరి ఇప్పుడా బావా అమెరికా వెళ్ళేది?” అంటూ చిరు కోపం ప్రదర్శించాడు సూర్యం.

“లేదు సూర్యం.. ఒక సారి వెళ్లి వచ్చాను” అంటూ తాను చేసిన ప్రయత్నం చెప్పసాగాడు.

“పోలీసులకు సంధ్య వివిధ భంగిమలలో దిగిన ఫోటోలు ఇచ్చి వేడుకున్నాను. ఉదయం తెలుగు సినిమాలు ప్రదర్శించే సినిమా హాళ్ళలో సంధ్య ఫోటోలను ప్రదర్శిస్తూ.. ప్రేక్షకులనూ వేడుకున్నాను. నాకూ ఆశ్చర్యంగానే ఉంది సూర్యం..! అమెరికాలో అమ్మాయి కనబడక పోవడం.. పోలీసులు కనుక్కోలేక పోవడం. చాలా విచిత్రంగా ఉంది. భరణితో బాటు అతని స్నేహితులనూ ఇంటరాగేట్ చేశారు. ఫలితం శూన్యం.

మరొక సారి అమెరికా వెళ్లి మరో ప్రయత్నం చేద్దామనుకుంటున్నాను”

హాల్లో కాసేపు మౌనం ఆవహించింది. సూర్యానికి ఇంకా ఎక్కవ సేపు ఉండాలనిపించ లేదు. అమెరికా సంబంధ మని అమ్మాయిని చేజేతులా చెయ్యి జార్చుకున్నారు. భరణి గురించి సరిగ్గా తెలుసుకోవడం.. చాలా తప్పిదం. ఏది ఏమైనా ఇప్పుడనుకుని ఏంలాభమని మనసులోకి రాగానే..

“సరే బావా.. అక్కయ్యా వస్తాను” అంటూ సెలవు తీసుకుంటూ.. ఏదో జ్ఞప్తికి వచ్చిన వాడిలా ఆగిపోయి.. “అక్కయ్యా.. రవి, సరళ ఎలా ఉన్నారు? “ అడిగాడు సూర్యం.

“వాళ్ళ గోస దేవునికిముడుతోంది. అయినా దేవునికింకా కనికరం కలగడం లేదు” అంటూ.. నుదురు కొట్టుకో సాగింది సుశీలమ్మ.

“ఏమయ్యింది బావా.. “ అంటూ మళ్ళీ కూర్చున్నాడు సూర్యం.

“వాళ్లకు బుద్ధిమాంధ్యంతో ఒక అమ్మాయి పుట్టింది. ఆమెతో కష్టాలన్నీ చుట్టుముట్టాయి. వారం రోజుల క్రితం మెట్ల మీద నుందడి పడి పోయిందట. నుదురుకు గాయమయ్యింది. ప్రస్తుతం ఎం.జి.ఎం. (మహాత్మా గాంధీ మెమోరియల్) హాస్పిటల్ లో ఉంది. రవవి ఇప్పుడే వెళ్ళాడు టిఫిన్ బాక్స్ పట్టుకుని” అంటూ విషయం చెప్పాడు గోవర్ధన్. సూర్యం నిశ్చేష్టుడయ్యాడు.

***

రోగుల సందర్శన సమయంలో హాస్పిటల్ వెళ్ళాడు సూర్యం.

రవి హాస్పిటల్ ప్రధాన గేటు వద్ద ఎదురయ్యాడు. చేతిలో థర్మాస్ ఫ్లాస్క్ ఉంది. పాపకు పాలు తీసుకుని వెళ్ళే ప్రయత్నంలో ఉన్నాడు. సూర్యాన్ని చూడగానే కళ్ళల్లో నీళ్ళు నిండుకున్నాయి. ఉద్వేగంగా హత్తుకున్నాడు.

ఇద్దరు కలిసి హాస్పిటల్ లోనికి దారితీశారు.

“పాపకు ఎలా ఉంది?” అంటూ బాధగా అడిగాడు సూర్యం.

“తలకు బలమైన గాయం అయింది. ఆరు కుట్లుపడ్డాయి వచ్చే వారం కుట్లు విప్పి డిశ్చార్జ్ చేస్తామంటున్నారు” అంటూ గాయం ఎలా అయ్యిందో చెప్పాడు రవి.

“గాయం మాని పోతుందిలే కాని పాపకు మాటలు రావడం లేదని.. వినికిడి శక్తి లేదని.. పిచ్చి చూపులు చూస్తోందని చెప్పాడు బావ.. హైదరాబాదులో ఇలాంటి మానసిక వికలాంగులకు మంచి వైద్యశాల ఉంది రవీ.. ఆ విషయం చెబుదామనే వస్తున్నాను” అన్నాడు సూర్యం. “మేనమామను చేసుకోనని సరళ మొండికేసినా.. నేను సర్ధి చెప్పి పెద్ద పొరపాటు చేశాను” అంటూ తల దించుకున్నాడు.

“నాకు చదువు చెప్పించి ఉద్యోగామిప్పించిన బావ మాట.. నేనూ కాదన లేక పోయాను. అయినా అంతా మా కర్మ” వేదాంత ధోరణిలో అన్నాడు రవి.

‘నిజమే కావచ్చు.. అందరికీ మేన సంబంధాలు బెడిసి కొట్టడం లేదు. కాని ప్రమాదం మాత్రం లేదని చెప్పలేం’ అని ఆలోచిస్తూ.. రవితో కలిసి పాప బెడ్ వద్దకు వెళ్ళాడు సూర్యం.

సూర్యాన్ని చూడగానే సరళ కన్నీళ్ళ పర్యంతమయ్యింది. పడుకుని ఉన్న పాప చెక్కిలిని ప్రేమతో తడిమాడు సూర్యం. అతని కళ్ళూ చెమర్చాయి.

***

ఆ మరునాడు సూర్యం డిప్యుటేషన్ మీద ములుగు వెళ్ళాల్సి వచ్చింది. ల్యాండ్ లైన్ ఫోన్ లేక పోవడం.. గోవర్ధన్ ఇంటి విషయాలేవీ తెలిసి రాలేదు. బహుశః గోవర్ధన్ అమెరికా వెళ్లి ఉంటాడు. సంధ్య సంగతి ఏమైనా తెలిసిందో లేదో!.. రవి కూతురు ఎలా ఉందో!.. డిశ్చారయ్యాక తను చెప్పిన హైదరాబాదు లోని హాస్పిటల్ కు వెళ్ళారో లేదో..!.. అనే ఆలోచనలతో సతమత మయ్యే వాడు. ఉత్తరం వ్రాసినా సమాధానం వస్తుందన్న గ్యారంటీ లేదు. అయినా చూద్దామన్నట్టు రిప్లై కార్డు రాశాడు సూర్యం.. తను ఊహించినట్టుగానే.. సమాధానం రాలేదు.

దాదాపు నెల రోజుల తరువాత డిప్యుటేషన్ పూర్తి కాగానే నేరుగా గోవర్ధన్ ఇంటికి వెళ్ళాడు సూర్యం. వీధి గుమ్మం తెరచి ఉంది. తొంగి చూస్తే ఇల్లంతా నిర్మానుష్యంగా కనబడింది. మనసేదో కీడును శంకించింది.

“అక్కయ్యా..” అంటూ పిలిచాడు.

“రా.. సూర్యం” అంటూ నూతిలోని గొంతులా వినబడింది సూర్యానికి.. అది గోవర్ధన్ గొంతు. ఆశ్చర్య పోయాడు. అమెరికా వెళ్లి అప్పుడే వచ్చేశాడా! అని అనుమానపడుతూ.. హాల్లోకి అడుగు పెట్టాడు.

“లోనికి రా.. సూర్యం” అంటూ మళ్ళీ పిలిచేసరికి బెడ్ రూమ్ లోకి వెళ్ళాడు. గోవర్ధన్ జీవశ్చవంలా మంచంలో పడుకుని ఉండడం చూసి ఝల్లున వణకి పోయాడు సూర్యం. ధైర్యం చిక్కబట్టుకుని..

“అమెరికా నుండి ఎప్పుడు వచ్చు బావా..” అంటూ ప్రక్కనే ఉన్న స్టూలు మీద కూర్చున్నాడు.

“అమెరికా వెళ్ళ లేదు సూర్యం..”

“అదేంటి? సంధ్య దొరికిందా?”

“సంధ్యను వెదుక్కుంటూ మీ అక్కయ్య పోయింది” అంటూ ఘొల్లుమన్నాడు గోవర్ధన్.

సూర్యానికి విషయం అర్థం గాక విస్తుపోయాడు సూర్యం.

“ఆరోజు నువ్వు వచ్చి వెళ్ళాక మీ అక్కయ్య ఆ రాత్రంతా కుమిలి, కుమిలి ఏడ్చింది. అర్థ రాత్రి నిద్రలో లేచి సంధ్య వచ్చింది.. ఏమయ్యా పడుకున్నావా! లే.. లేచి తలుపు తీయి .. అంటూ కలవరించ సాగింది. నాకు భయమేసి.. అమెరికా ప్రయాణం మానుకున్నాను. తెల్లవారి లేచినా.. స్పృహలోకి రాలేదు. అదే ఆలాపన. ఏ అమ్మాయిని చూసినా ‘సంధ్యా..’ అంటూ.. వెళ్ళి హత్తుకునేది. భీమారం లోని ఎర్రగడ్డ దవాఖానకు తీసుకు వెళ్లాం. వాళ్ళు అడ్మిట్ చేసుకున్నారు. కాని అదే అర్థరాత్రి సంధ్యా..! సంధ్యా..!! అని కలవరిస్తూ.. కలవరిస్తూ.. కన్ను మూసింది” అంటూ గుండెలు పగిలేలా ఏడ్వసాగాడు గోవర్ధన్. సూర్యం మ్రాన్పడి పోయాడు.

సరళ వంటింట్లో నుండి పరుగెత్తుకుంటూ వచ్చింది. గోవర్ధన్ తలను తన ఒడిలోకి తీసుకుని ఓదార్చసాగింది. ఆమె కళ్ళూ.. ధారాళంగా వర్షించసాగాయి.

“నేను ఈమధ్య నెల రోజులు వేరే ఆఫీసుకు వెళ్ళానమ్మా.. ఇప్పుడే నేరుగా ఇక్కడికే వచ్చాను. అక్కయ్య సంధ్య మీద బెంగతో పోవడం..” అంటుంటే సూర్యం గొంతు కూరుకు పోయింది. కాసేపు నోట మాట రాక తల దించుకున్నాడు . సూర్యం కళ్ళల్లో నిండిన నీరు పొంగి పొరలుతూ.. నేల మీద బిందువుల రూపంలో రాలసాగాయి.

కొద్ది సేపటికి తలెత్తి.. దీనంగా సరళ వంక చూస్తూ.. “పాప ఎలా ఉంది? గాయం పూర్తిగా మానిపోయిందా” కళ్ళు తుడ్చుకుంటూ అడిగాడు సూర్యం.

సరళ మాట్లాడలేక పోతోంది.. ఆమె పెదవులు వణకుతున్నాయి.

అప్పుడే గదిలోకి అడుగు పెట్టిన రవి సూర్యం మాటలు విన్నాడేమో..!

“పాప గూడా అక్కయ్య వెనుకాలే పోయింది సూర్యం” అన్నాడు. సూర్యం చటుక్కున లేచి రవిని అమాంతం హత్తుకుని భోరుమన్నాడు.

“పాప తల ఆపరేషన్ వికటించింది.. డాక్టర్లు ఎంత ప్రయత్నించినా పాప మనకు దక్కలేదు” అంటూ రవి కుర్చీలో కుప్పలా కూలిపోయాడు.

కొయ్యబారిపోయాడు సూర్యం.*

మరిన్ని కథలు

Vimanam lo kalakalam
విమానంలో కలకలం
- తాతా కామేశ్వరి
Aame kavvinchindi
ఆమె కవ్వించింది
- తాత మోహనకృష్ణ
Chandruniko noolu pogu
చంద్రునికో నూలు పోగు
- కాశీవిశ్వనాధం పట్రాయుడు/kasi viswanadham patrayudu
Anaadha atidhyam
అనాథ అతిథ్యం
- - బోగా పురుషోత్తం
Vibheeshana Sharanu
విభిషణుని శరణు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Srivariki prema lekha
శ్రీవారికి ప్రేమలేఖ
- తాత మోహనకృష్ణ
Ramdaas formula
రాందాస్ ఫార్ములా
- వీరేశ్వర రావు మూల