చివరి పాఠం. - డా.బెల్లంకొండ నాగేశ్వరరావు.

Chivari paatham

అమరావతి నగర రాజ్య పొలిమేరలలో సదానందుడు అనే పండితుడు ఆదేశ రాజుగారి సహయంతో,విద్యార్దులకు ఉచిత భోజన ఆశ్రయం కల్పించి విద్యాబోధన చేయసాగాడు.కొంతకాలం తరువాత ఇద్దరు శిష్యుల విద్యాభ్యాసం పూర్తి కావడంతో వాళ్ళను పిలిచి "నాయనలార నేటితో మీవిద్యా భ్యాసం పూర్తి అయింది,మీరువెళ్ళవచ్చు"అన్నాడు సదానందుడు.అందుకు ఆశిష్యులు"గురుదేవా,విద్యాదాత,అన్నదాత లు దైవస్వరూపాలు కనుక తమకు గురుదక్షణగా ఏదైనా ఇవ్వడం ఆచారం. ఏదైనా గురుదక్షణ కోరండి తమ పాదపద్మాలకు సమర్పించి వెళతాం" అన్నారు."నాయనలారామీరు పేద విద్యార్దులు మీవద్ద ఏంఉంటుంది నాకుఇవ్వడానికి,మీకోరిక కాదనలేక పోతున్నాను.అడవిలోనికి వెళ్లి మీతలగుడ్డనిండుగా ఎండి రాలిన ఆకులు తెచ్చిఇవ్వండి అవే నాకు గురుదక్షణ"అన్నాడు సదానందుడు.అలాగే అంటూ అడవిలోనికి వెళ్లిన శిష్యులు ఎండినఆకులు సేకరించబోగా,అక్కడ ఉన్నవారు"నాయనలారా ఈప్రాంతంలోని ఎండిన ఆకులు అన్ని సేకరించి విస్తర్లుగా కుట్టుకొని మేమంతా జీవిస్తున్నాం దయచేసి ఇక్కడఆకులు ఏరకండి". అన్నారు. మరికొంతదూరంలోనికి వెళ్ళి అక్కడ ఎండుఆకులు సేకరించబోగా అక్కడ ఉన్నవారు"నాయనలారా ఇలారాలిన ఎండు ఆకులను మేము వైద్యాచేయడానికి వాడుతున్నాం. దయచేసి మీరు ఇక్కడఎండు ఆకులు సేకరించ వద్దు" అన్నారు.మరో ప్రాంతంకు వెళ్లగా అక్కడ ఉండేవారు "నాయనా ఈప్రాంతంలోని వారందరము ఈఎండు ఆకులతోనే అన్నవండుకుంటాం, స్నానానికి నీళ్లు వేడిచేసుకుంటాం,కనుక ఈప్రాంతంలో ఎండుఆకులు సేకరించవద్దు"అన్నారు.ఎక్కడకువెళ్ళినా ఏదోవిధంగా ఎండుఆకులు వినియోగంపడంచూసి నిరాశతో ఆశ్రమం చేరేదారిలో నీటిలో ఒక ఎండుఆకు చూసి అందుకోబోగా అందులోఉన్న రెండుచీమలు"అయ్య ఈఆకుపుణ్యాన మాప్రాణాలు కాపాడుకుంటున్నాం, దయచేసి మామ్ములను వదిలేయండి "అన్నాయి.వట్టిచేతులతో ఆశ్రమంచేరిన శిష్యులను చూసి" ఏంజరిగింది నాయనలారా"అన్నాడు సదానందుడు.జరిగినవిషయం వివరించారు శిష్యులు."నాయానా అర్ధంఅయిందా చెట్లు మానవాళికి ఎంతమహోపకారాన్ని చేస్తున్నాయో. ఈసృష్టిలో వ్యర్ధ అంటూఏదిలేదు.చివరికి పోలంలో కలుపు మొక్కగా ఉండే గరిక కూడాపసువుల మేతకు వినియోగ పడేదే"అన్నాడు సదానందుడు. "గురుదేవా చివరిపాఠం గా మీరునేర్పిన ఈవిషయం లోకానికి తెలియజేస్తాము సెలవు"అని సదానందునికి పాదాభివందనం చేసి వెళ్లిపోయారు శిష్యులు.

మరిన్ని కథలు

Pellipandiri
పెళ్ళీపందిరి
- సి.హెచ్.ప్రతాప్
Samudram lo Kakiretta
సముద్రంలో కాకిరెట్ట.
- కాశీ విశ్వనాథం పట్రాయుడు
Manavatavadulu
మానవతావాదులు
- జీడిగుంట నరసింహ మూర్తి
Photo teeyadam neramaa
ఫోటో తీయడం నేరమా! (క్రైమ్ కథ)
- చెన్నూరి సుదర్శన్
Paarina pachika
పారిన పాచిక!
- - బోగా పురుషోత్తం, తుంబూరు.
Jeevana deepam
జీవన దీపం
- సి.హెచ్.ప్రతాప్
Aasaraa
ఆసరా!
- రాము కోలా. దెందుకూరు
Ichhanamma vayanam-Puchhukunnanamma vayanam
ఇచ్చానమ్మా వాయనం పుచ్చుకున్నా...
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు