మృత్యువు తప్పింది - కందర్ప మూర్తి

Mrutyuvu tappindi

జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలు అవి విషాదమైనా ఆనందమైనా ఎప్పుడో ఒకప్పుడు జ్ఞప్తికి వస్తాయి. అటువంటి భయానక సంఘటన ఒకటి నాకూ ఎదురైంది. దేశ సరిహద్దు రాష్ట్రం సిక్కిం లో ఆర్మీ వైద్య విభాగంలో మేల్ నర్సుగా విధులు నిర్వర్తిస్తున్న రోజులవి. ఆర్మీ జవానులకు రోజూ విధి నిర్వహణ సమయంలో జరిగే ప్రమాదాలూ ,వాతావరణ సంబంధమైన జబ్బులూ, మందుపాత్రల ప్రమాదాలు జరిగినప్పుడు మా మెడికల్ కేంప్ కి తీసుకు వస్తే అందుబాటులో ఉన్న పరికరాలతో ప్రథమ చికిత్స జరిపి ప్రమాదకర కేసుల్ని మాకు యాబై కిలోమీటర్ల దూరంలో మూడు వేల మీటర్లు ఎత్తున ఉన్న " కాలింగ్ పాంగ్ " అనే హిల్ స్టేషన్లో ఉన్న ఆర్మీ బేస్ హాస్పిటల్ కి ఆర్మీ అంబులెన్స్ లో తీసుకువచ్చి అప్పగిస్తాము.అంబులెన్స్ లో పోర్టబుల్ ఆక్సిజన్ సిలిండర్ ,అత్యవసర మందులు ,ఇంజెక్షన్లూ బేటరీతో నడిచే చిన్న పంకా ,స్ట్రెక్చర్లుతో సమకూర్చబడి దృఢమైన ఇంజిన్ బాడీ ఉంటుంది. మైదాన ప్రాంత వాహనాలకు మంచుకురిసే పర్వత ప్రాంత వాహనాలకు బేధం ఉంటుంది. వాహనాలు పెరఫెక్టుగా కండిషన్లో ఉండటమే కాదు వాహనం నడిపే డ్రైవర్లూ అవయవ లోపం లేకుండా కంటి చూపు చక్కగా ఉండాలి. ఎత్తైన పర్వత ప్రాంతమైనందున ప్రమాద ఇరుకైన రోడ్లు వంపులతో ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. మంచు కురిసే సమయంలో కొండ దారి సరిగ్గా కనిపించదు. పసుపు పచ్చ ఫాగ్ లైట్లు ఇంజిన్ ముందు వాడ వల్సి ఉంటుంది. రోడ్డంతా ఐస్ కప్పి వాహనం నడపడం కష్టమైనందున టైర్లకు ఇనుప చైన్సు బిగిస్తారు. ఆర్మీబోర్డర్ రోడ్డు ఆర్గనైజేషన్ వారు ఎప్పుడూ అప్రమత్తతగా ఉండి రోడ్ల మీద గడ్డకట్టిన ఐసు, వర్షాల సమయంలో పర్వతాల మన్ను కూలి రోడ్లను ఛిద్రం చేసినప్పుడు నేపాలీ గూర్ఖా కూలీల చేత సరి చేయించి ప్రయాణానికి ఆటంకం లేకుండా మ తించరు. పైకి కిందకు వెళ్లే వాహనాలను కొన్ని ట్రాఫిక్ పాయింట్ల వద్ద నిర్దారిత దూరంలో మిలిటరీ పోలీస్ కంట్రోల్ పాయింట్లు(టి.సి.పి) ద్వారా నియంత్రిస్తారు.అక్కడక్కడ బ్రేక్ వేన్సు క్రేన్సుతో రోడ్డు ప్రమాదం జరిగినప్పుడు సిద్దంగా ఉంటాయి. రొటీన్ గా నేను మా మెడికల్ ఫస్టు ఎయిడ్ శిబిరం నుంచి క్షతగాత్రులను, సాదారణ జబ్బు పడిన సైన్య జవానులను మాకు అందుబాటులో ఉన్న' కాలింగ్ పాంగ్ 'మిలిటరీ బేస్ హాస్పిటల్ కి చేర్చి అక్కడ నయమైన ఆర్మీ సిబ్బంది జవానులను వెనక్కి మా అంబులెన్సులో తీసుకువస్తాము. ఒకసారి నేను కొంతమంది రోగగ్రస్థ జవానులను తీసుకుని మెడికల్ ఎస్కార్టుగా అంబులెన్సులో ఉదయం బ్రేక్ ఫాస్టు తిని బయలు దేరాను. మా అంబులెన్స్ డ్రైవర్ ఒరిస్సా కి చెందిన మహంతి. చురుకైన అబ్బాయి. ఎప్పుడూ చలాకీగా ఉంటూ జోకులేసి నవ్విస్తుంటాడు.అంబులెన్స్ బాడీ లోపల జవానులను ఎక్కించి వెనక డోర్ లాక్ చేసి ముందు నేను కోడ్రైవర్ గా, మహంతి డ్రైవింగ్ సీట్లో కూర్చుని బయలుదేరాము. అంబులెన్సులో పేషంటు కండిషన్ చూడటానికి ఒక విండో ఉంటుంది. అత్యవసరమైతే మరో మెడికల్ ఎస్కార్టుని వెంట ఉంచుకుంటాము. ఆ ఘాట్ రోడ్లలో పైకి వెళ్లేటప్పుడు ఎత్తు ప్రమాదకర వంకర టింకర రోడ్ల మూలంగా డ్రైవర్ గేర్లు మార్చుకుంటూ ఎదురు వచ్చే వాహనాల్ని చూసుకుంటు మెల్లగా వెళ్లవలసి ఉంటుంది. అందువల్ల అంబులెన్స్ వెనక డోర్లు తెరుచుకోకుండా లాక్ చేస్తారు.కుదుపులు మలుపుల వల్ల డ్రైవర్ని ఎలర్టుగా ఉంచ డానికి కోడ్రైవర్ గా ముందు ఉన్న వ్యక్తి ఏదో మాటలతో కాలక్షేపం చెయ్యాలి. పైకి వెళ్లేటప్పుడు కన్న హాస్పిటల్ నుంచి వెనక్కి వచ్చేటప్పుడు ఇంకా మెలకువగా ఉండాలి. అక్కడ మధ్యాహ్న భోజనం చేసి బయలు దేరుతాము. మధ్యాహ్న సమయం వెహికిల్ కిందకు దిగుతుంది.స్పీడ్ ఎక్కువ. వంకరటింకర ప్రమాదకర ఘాట్ రోడ్డయి నందున డ్రైవరూ కోడ్రైవరు చాలా ఎలర్టుగా ఉండాలి. మేము మా బేస్ హాస్పిటల్ కాలింగ్ పాంగ్ చేరుకుని రోగగ్రస్థ జవానులను అక్కడి మెడికల్ సిబ్బందికి అప్పగించి లంచ్ చేసి ఒక గంట విశ్రాంతి తీసుకుని సుమారు రెండు గంటలకు, ట్రీట్ మెంటు తీసుకుని బాగైన జవానులను అంబులెన్స్ లో ఎక్కించి వెనక డోర్ లాక్ చేసి కిందకు మా ప్రయాణం మొదలెట్టాము. పైకి వెళ్లేటప్పుడు వాతావరణం బాగుంటుంది.ఎత్తు కనక మెల్లిగా అంబులెన్స్ కదులుతుంది. అదే తిరుగు ప్రయాణంలో రోడ్డు పల్లం, బండి స్పీడ్ పట్టుకుంటుంది.డ్రైవర్ బ్రేకుల మీద చెయ్యి ఉంచుతు స్టీరింగ్ వీల్ కంట్రోల్ చెయ్య వలసి ఉంటుంది. లంచ్ చేసి బయలు దేరుతాం కనక కొంత నిద్ర మత్తూ వేధిస్తుంది. సుమారు గంట పైన ప్రయాణం జరిగింది. మరొక గంట లోపే మా వైద్య శిబిరం చేరుకోవచ్చు.నేను ఏదో పిచ్చాపాటి కబుర్లు చెబుతూ డ్రైవర్ని ఎలర్టుగా ఉంచుతున్నాను. సడన్ గా డ్రైవర్ మహంతి అంబులెన్సుకి బ్రేక్ వేసి ఎమర్జెన్సీ హేండ్ బ్రేక్ చేత్తో పట్టుకున్నాడు. కొంచం నిద్ర మత్తులో ఉన్న నేను ఉలిక్కి పడ్డాను.సైడు డోర్ అద్దం లోంచి చూస్తే కళ్లకి కింద నీళ్లు కనబడుతున్నాయి.ఒక్క సారి గుండె గుభేల్ మంది.ఏమైందో అర్థం కాలేదు. అంబులెన్సు ఘాట్ రోడ్డు రక్షణ గోడ ఎక్కి ఇంజిన్ భాగం గాల్లోను వెనక బాడీ నేలను ఆనేటట్టు ఉంది. అటువంటి క్లిష్ట సమయంలో డ్రైవర్ మహంతి గుండె నిబ్బరంతో వ్యవహరించి నన్ను మెల్లగా బేలన్సు కాసుకుంటు వెనక్కి దిగి అంబులెన్సు డోర్ తెరిచి లోపల ఉన్న జవానులను కిందకు దింపి వారి సాయంతో అంబులెన్సును రోడ్డు రక్షణ గోడ నుంచి కిందకు దిగేలా చెయ్యమన్నాడు. ఈ లోపున బోర్డరు రోడ్డు రవాణా సిబ్బంది అంబులెన్సు ను చూసి పరుగున వచ్చారు.మొత్తానికి అందరూ కలిసి అంబులెన్సును ప్రమాదం నుంచి కాపాడేరు. నాకు భూమ్మీద ఇంకా నూకలు మిగిలాయి కాబట్టి అంతటి భయంకర రోడ్డు ప్రమాదం నుంచి గట్టెక్కాను.అదంతా డ్రైవర్ మహంతి గుండె దైర్యమే. ఏక్సిడెంటని తెలిసి తన ప్రాణం రక్షించుకోవడం కోసం అంబులెన్సు వదిలి పైకి జంప్ చేస్తే నాతో పాటు అంబులెన్సులో ఉన్న మిగతా జవానుల ప్రాణాలు వందల అడుగుల నీటి లోయలో పడి శరీరాలు కూడా దొరికేవి కావేమొ. తర్వాత బోర్డర్ రోడ్డు ఆర్గనైజేషన్ వారి ద్వారా మిలిటరీ పోలీసులకు తెలిసింది. వారు అంబులెన్సు యాక్సిడెంట్ విషయం మా హెడ్ క్వార్టర్స్ కి తెలియ చేస్తే వేరే వాహనంలో మమ్మల్ని మా మెడికల్ కేంప్ శిబిరానికి చేర్చారు. రిస్క్యూ వాహనం ద్వారా దెబ్బ తిన్న అంబులెన్సు ని వర్కుషాపుకి చేర్చారు. ఇదండీ , మృత్యు గండం గడిచి మళ్లా బట్ట కట్టగలిగాను. ** ** **

మరిన్ని కథలు

Aame kavvinchindi
ఆమె కవ్వించింది
- తాత మోహనకృష్ణ
Chandruniko noolu pogu
చంద్రునికో నూలు పోగు
- కాశీవిశ్వనాధం పట్రాయుడు/kasi viswanadham patrayudu
Anaadha atidhyam
అనాథ అతిథ్యం
- - బోగా పురుషోత్తం
Vibheeshana Sharanu
విభిషణుని శరణు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Srivariki prema lekha
శ్రీవారికి ప్రేమలేఖ
- తాత మోహనకృష్ణ
Ramdaas formula
రాందాస్ ఫార్ములా
- వీరేశ్వర రావు మూల
Attagari samrajyam
అత్తగారి సామ్రాజ్యం
- బొబ్బు హేమావతి