కంకర రోడ్డు - Pandurangachary vadla

Kankara road

కారు వెనక నుండి లేస్తున్న ఎర్రటి దుమ్మును, తిరుగుతున్న చక్రాల కింద నుండి లేచి పడుతున్న చిన్న చిన్న కంకర రాళ్ళను చూస్తూ, దడదడమని వణుకుతూ అద్దాలు చేస్తున్న శబ్దాలను వింటూంటే ఇట్టే తెలిసిపోతుంది వెళుతోంది కంకర రోడ్డు మీద అని. సీట్లలో కూర్చునే కారుతో పాటే ఎగిరి పడుతూ "తొందరగా నిద్ర లేవరా, లేకపోతే ఆలస్యం అయిపోతుంది అంటే విన్నావా.. లేదు, దగ్గరే కదా, పది నిమిషాల్లో వెళ్ళిపోతాం అన్నావ్.. ఇప్పుడు చూడు,వెళ్లాల్సిన దారిలో కాకుండా ఇలా చుట్టూ తిరిగి వెళ్ళాల్సి వస్తోంది..." అంది అమ్మ కాస్త కోపం, ఆలస్యం అయిపోతుందేమో అన్న కంగారు మిళితమైన స్వరంతో.. "నాకేమన్నా తెలుసా, ఈ రోజు మన కర్మ ఇలా కాలుతుంది అనీ, ఆ రోడ్డు రిపేర్ అనీ.. అయినా ఎంత సేపూ ఈ దార్లో వెళ్ళినా ఇంకో పది నిమిషాలు అంతే.." అన్నాను నేను ఎందుకో అమ్మను అలా చూసేసరికి నాక్కూడా చిరాకేసి... "పది నిమిషాలు పది నిమిషాలు అని మనం బయల్దేరిన గంట నుండీ ఇప్పటికీ ఆరు సార్లు అన్నావు.. ఆ పది నిమిషాలు అనడం ఆపు నువ్వు.. నాకు విసుగొస్తుంది" అంది అమ్మ, నేను బయల్దేరినప్పటి నుండీ ఒకటే మాట అప్పచెప్తూ ఉండేసరికి.. "అమ్మా.. ఊరికే నసపెట్టకు.. నడుపుతున్నాగా.. మళ్లీ మళ్లీ విసిగిస్తే ఏదో ఒకదానికి కారు గుద్దేస్తా చూడు..." అన్నాన్నేను అమ్మ మాటలకి నాకు డ్రైవింగ్ మీద ఏకాగ్రత కుదరక.. "ఆపింక.. ఆ దరిద్రపు మాటలు.. నేను నోర్మూసుకుని కూర్చుంటాలే.." అంది అమ్మ రెట్టింపు కోపంగా.. అమ్మ ఎంత కోపంగా ఉందో మరి కాసేపటికి అర్ధం అయ్యింది నాకు, అమ్మ మౌనం చూసి. "అమ్మా.. నువ్వలా ఉండకూ.." అన్నాను రోడ్డు మీద ఉన్న గాజు పెంకులను చూడకుండా, అమ్మ వైపు తిరిగి. టైర్ పేలిన శబ్దం.. అమ్మ అరుపు.. ఒకేసారి.. బ్రేక్ నొక్కాను. కార్ డోర్ తీసి కిందకి దిగి వెళ్లి చూస్తే, ఎడమ వైపు టైర్ గాజు పెంకుల మధ్య ఊపిరి పోయి నిల్చుని ఉంది. నేనైతే ప్రాణం పోసే దేవుణ్ణి కాదు కదా, వాడుకుని వదిలేసే మనిషిని మరి. కార్ వెనక్కి వెళ్లి స్టెప్ని కోసం చూసాను. డిక్కీ డోర్ మీద ఒక చెయ్యి.. తల పైన ఒక చెయ్యి వేసి నిల్చున్నాను. అమ్మ ఎంత పిలిచినా నా సమాధానం రాకపోయేసరికి, అమ్మే వచ్చింది కారు దిగి వెనక్కి, నన్ను చూడ్డానికి, ఏమయ్యిందో అని. ఏం జరిగిందో అమ్మకి అర్థం అయ్యింది. "నేను పొద్దున్నుండీ చెప్తున్నానా.." అని అమ్మ మళ్లీ మొదలు పెట్టే లోపే "చాలమ్మా.. ఆపు.. నీవల్లే ఇదంతా.. " అని అరిచాను. వారం కింద టైర్ పంక్చర్ అయినపుడు, షాప్ లో ఇచ్చిన స్టెప్నీ తీసుకురావడం మరిచి పోయిన నా మతిమరుపు మీద కోపాన్ని అమ్మ మీద చూపిస్తూ.. "మధ్యలో నేనేం చేశాను రా.. " అంది అమ్మ, లేని తప్పుని తన మీద తోస్తునందుకు నన్ను నిలదీస్తూ.. "నువ్వు ఊరికే అలా నస పెడుతూ ఉంటే ఏమవుతుంది మరి??" "ఇప్పుడెలా రా??" "ఏమో అమ్మా.. ఈ దారిలో పంక్చర్ షాప్ కూడా లేనట్టుంది.. ఎవరైనా వస్తే వాళ్ళతో పాటూ బండిలో వెళ్లి పంక్చర్ వేయించుకుని రావడమే" అన్నాను టైర్ విప్పడానికి జాకీ, రెంచ్ తీసుకుంటూ.. "మరి పెళ్లి రా??" అంది అమ్మ పెళ్లికి సమయానికి అందలేక పోతున్నాను, పెళ్లి చూస్తానో లేదో అనే బాధలో.. మరి బాధ ఉండదా.. సొంత తమ్ముడి కూతురాయే.. ఎప్పటినుండో మామయ్య మమ్మల్ని రమ్మని పిలుస్తున్నా కూడా నాకు సెలవు దొరకక అమ్మని పంపించలేదు. పెళ్లి పనుల్లో పడి మామయ్య కూడా రాలేదు అమ్మని తీసుకెళ్లడానికి. ఇంచు మించు 3 గంటలు పట్టింది టైర్ పంక్చర్ వేయించుకుని వచ్చి, కార్ కి బిగించి బయల్దేరి, పెళ్లి మండపానికి వెళ్ళేసరికి. పెళ్లిలో ఉండవలసిన హంగామా గానీ పెళ్లికి వచ్చిన అతిథులు గానీ కనపడలేదు అక్కడ. నిస్తేజంగా కనపడిన మామయ్య అత్తయ్య మొహాలు. ఏం జరిగిందో తెలీని అయోమయంలో పెళ్లి కూతురు. ************ జరిగిందంతా కలలా భావిస్తూ కూతురిని సాగనంపి అలాగే పెళ్లి మండపం ముందు నిల్చుని చూస్తున్న అత్తామామయ్యలు. కాబోయే అల్లుడికి ఇవ్వవలసిన కట్నం తాలూకు డబ్బులు మామయ్యకు సర్దుబాటు అయ్యిందో లేదో అని అమ్మ కంగారు పడుతుంటే, తరువాత చెప్పొచ్చులే అనుకుని, అమ్మకు చెప్పకుండా నేను సర్దుబాటు చేసి, మేము పెళ్లికి వచ్చేటపుడు నాతో పాటుగా బ్యాగులో తీసుకువచ్చిన డబ్బులు మామయ్యకు ఇవ్వవలసిన అవసరం రాలేదు. తిరుగు ప్రయాణంలో నా కారులో అమ్మా నేను... నాతో తాళి కట్టించుకున్న నా మరదలు

మరిన్ని కథలు

Srivariki prema lekha
శ్రీవారికి ప్రేమలేఖ
- తాత మోహనకృష్ణ
Ramdaas formula
రాందాస్ ఫార్ములా
- వీరేశ్వర రావు మూల
Attagari samrajyam
అత్తగారి సామ్రాజ్యం
- బొబ్బు హేమావతి
Pramod Pesarattu
ప్రమోద్-పెసరట్టు
- వీరేశ్వర రావు మూల
Atanu aame madilo
అతను ఆమె మదిలో
- బొబ్బు హేమావతి
Atani kannu aame meeda padindi
అతని కన్ను ఆమె మీద పడింది
- బొబ్బు హేమావతి
Kottha ugadhi
కొత్త ఉగాది
- తాత మోహనకృష్ణ
Pallavi
పల్లవి
- తటవర్తి భద్రిరాజు