తికమక..!! చిన్న కథ - డా. కె.ఎల్. వి.ప్రసాద్

Tikamaka

కరోనా కాలం ఇది . అయినా ,అక్కడ జనసందోహం బాగానే వుంది . కొందరు సగం మూతికి మాస్కు పెట్టుకుంటే ,కొందరు మాస్కును మేడలో వెళ్లాడ దీసుకున్నారు మూర్ఛ రోగుల్లా . అక్కడ ఎవరూ స్థిమితంగా ఒకే చోట కూర్చోలేక పోతున్నారు ,నిలబడలేక పోతున్నారు . తమ వంతు కోసం తలుపు వైపు ఆత్రంగా చూస్తున్నారు . ఇంతకీ ఆప్రదేశం గురించి చెప్పలేదు కదూ !అదో పేరుపడ్డ చర్మ వ్యాధుల ఆసుపత్రి . వూళ్ళో ఎంతమంది చర్మ వ్యాధి వైద్య నిపుణులు వున్నా , జనం మాత్రం ఆ .. ‘ గోకా .. చర్మవ్యాధుల ఆసుపత్రి ‘కె ,వెళతారు . దురద పెడితే ఎంతసేపైనా గోక్కుంటూ క్యూలో కూచుంటారు గానీ ,ఖాళీగా వుండే వేరే డాక్టరు దగ్గర చూపించుకోరు . ముఖం మీద మొటిమలు చిదుముకుంటూ కొందరు ,తల గోక్కుంటూ కొందరూ ,వీపు బరుక్కుంటూ కొందరూ ,ముఖం మీద మచ్చలుగోక్కుం టూ ,పబ్లిక్ గా గోక్కునే అవకాశం లేని ప్రేదేశాల్లో ,గోక్కునే ప్రయత్నం చేస్తూ అష్టకష్టాలు పడుతున్న ,ఆడపడుచులు ,మగమహారాజులతో అక్కడ సన్నివేశం వింతగా ,బాధాకరంగా ,వుంది . కరోనా కారణంగా ఎన్నో జాగ్రత్తలు పాటిస్తున్న నేపథ్యంలో ,ఒక్కొక్క కేసు పరీక్ష చేసి మందులు రాయడానికి ,డాక్టరుగారికి ,చాలా టైం పడుతోంది . ఇలా ఎవరి బాధల్లో వాళ్ళు ,నాటకంలో పాత్రల్లా ,తమ సమస్యలను తాము ,తమకు తెలిసిన రూపంలో ప్రదర్శిస్తున్నారు . ఇంతలో ,అక్కడున్న వారు అంతా ఉలిక్కి పడేలా ,డబ్భై ఏళ్ళ వ్యక్తి గొణుక్కుంటూ ,చేతిలోవున్న స్కెలు లాంటి కర్ర బద్దతో వీపు గోక్కుంటూ , ఏమాత్రం సిగ్గు పడకుండా ,అవసరమైన అన్ని చోట్ల ,విపరీతంగా గోక్కుంటూ ,వాళ్లందరిమధ్య ,కాలుగాలిన పిల్లిలా తిరుగుతూ గేటు దగ్గర వున్నకంపౌండర్ కు ,దండాలు పెడుతూ ,తనను త్వరగా లోపలికి పంపమని వేడుకుంటున్నాడు . అందరి ఆమోదం పొందిన తర్వాత ,ఆ ముసలాయన్ని ,లోపలి కి డాక్టరు దగ్గరికి పంపించాడు కాంపౌండర్ . తక్కువ మాట్లాడడం ,ఎక్కువ మందులు ,రాసె అలవాటు వున్న,ఆ డాక్టరు ఏమిటన్నట్టు మూఖాభినయం చేసాడు ,ముసలాయన్ని చూసిన డాక్టర్ గారు . ‘’ డాక్టర్ గారూ .. నెల రోజుల క్రితం వచ్చాను ,వళ్ళంతా దద్దుర్లు -గోకుడు అని . తమరు కొన్ని గోళీలు ,ఈ టానిక్కూ రాసిచ్చారు . ఒకటి తాగితే తగ్గలేదని ,ఇంకో సీసా కొనుక్కుని తాగాను ,ఈ లోగా .. లాక్ డౌన్ వచ్చింది . నా బాధ ఎక్కువయింది డాక్టర్ సాబ్ !’’ అన్నాడు అమాయకం గా . అతని దగ్గర మందుల చీటీ చూసి .. తలపట్టుకున్నాడు డాక్టర్ . అతనే మూర్ఛవచ్చి పడిపోతాడేమోనన్న అనుమానం వచ్చింది ,ఆ పేషేంటుకీ ,గేటు దగ్గర కాంపౌండర్ కీను ! సంగతేమిటంటే ,డాక్టర్ రాసిన చర్మపు లోషన్ టానిక్ అనుకునే తాగేశాడు ఇన్నాళ్లు ,ముసలాయన , డాక్టర్ తేరుకోడానికి చాలా సమయం పట్టింది.

సమాప్తం

మరిన్ని కథలు

Aame kavvinchindi
ఆమె కవ్వించింది
- తాత మోహనకృష్ణ
Chandruniko noolu pogu
చంద్రునికో నూలు పోగు
- కాశీవిశ్వనాధం పట్రాయుడు/kasi viswanadham patrayudu
Anaadha atidhyam
అనాథ అతిథ్యం
- - బోగా పురుషోత్తం
Vibheeshana Sharanu
విభిషణుని శరణు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Srivariki prema lekha
శ్రీవారికి ప్రేమలేఖ
- తాత మోహనకృష్ణ
Ramdaas formula
రాందాస్ ఫార్ములా
- వీరేశ్వర రావు మూల
Attagari samrajyam
అత్తగారి సామ్రాజ్యం
- బొబ్బు హేమావతి