సమయస్ఫూర్తి - ఎం బిందుమాధవి

Samayaspoorthi

అదొక జిల్లా స్థాయిలో పని చేసే ప్రభుత్వ కార్యాలయం.

అందరూ మధ్యతరగతి జీవులే!

నెల జీతాలతో ....సర్పోదనకుండా.... లేదనుకోకుండా జీవితాలు సాగిస్తూ...స్థితి కల వారి మధ్య అయితే లేని వారి గాను, అంతకంటే తక్కువ వారి మధ్య స్థితి మంతులుగా జీవిస్తున్న సగటు మనుషులు.

రోజు ఆఫీసులో అందరూ మౌనంగా ఒకరి ముఖాల్లోకి ఒకరు చూసుకుంటూ కంటి సైగలతో ఎదుటి వారికి ఏదోచెప్పాలనుకుంటున్నట్టుగా ఉన్నది వాతావరణం!

"మేనేజర్ గారు నిన్నేమయినా అడిగారా" అన్నాడు వామన రావు.

"లేదే, దేని గురించి? నిన్నేమయినా అడిగారా" అన్నాడు ప్రకాశం.

"పొద్దున్నే నా టేబుల్ దగ్గరకి వచ్చి ఏదో అడగాలన్నట్టుగా అటూఇటూ తచ్చాడి, ఇదిగో ఆంజనేయులూ...అని పిలిచారు. మళ్ళీ ఏమనుకున్నారో తన క్యాబిన్ లోకి వెళ్ళిపోయారు" అన్నాడు ఆంజనేయులు.

"ఇంతకూ ఏమిటి విషయం" అన్నాడు రహీం.

మేనేజర్ పరాంకుశం స్థలం కొంటూ, డబ్బు తక్కువ పడితే చిట్టు పాడాడు. తను ఆఫీస్ కి అధికారి! ఇంత మందిలోగ్యారంటీ సంతకం పెట్టే వాళ్ళు ఇద్దరు దొరకరా అన్న ధీమాలో ఉన్నాడు.

విషయమెలాగో గూఢచర్యం చేసిన ప్యూన్ వెంకటేష్ పసికట్టాడు. రోజు గ్యారంటీ సంతకాలు పెట్టించుకోవటానికి చిట్ఫండ్ కంపెనీ వారిని రమ్మన్నాడు పరాంకుశం.

పరాంకుశానికి ఆర్ధిక క్రమశిక్ధణ తక్కువ. చెప్పుకో తగిన చెడు అలవాట్లు లేకపోయినా..ప్రతి నెల ఇరవయ్యో తారీకుకి జీతంఖర్చయిపోయి ఐదొందలో, వెయ్యో తన క్రింది వారి దగ్గర చేబదులు తీసుకుంటూ ఉంటాడు.

అసలే దుబారా మనిషి! ఇప్పుడు అతని చిట్టుకి గ్యారంటీ సంతకం పెడితే, రేపు అది అయ్యే వరకు కట్టకపోతే తాముఇబ్బంది పడతామని ఆఫీసులో స్టాఫ్ కి బాధ!

*****

"సర్ పిలుస్తున్నారు" అంటూ వీరయ్య వచ్చి చెప్పేసరికి ప్రకాశానికి నెత్తి మీద బాంబ్ పడ్డట్టయింది.

కాస్త రిచ్ లుక్ తో నీట్ గా ఇస్త్రీ బట్టలు వేసుకుని, స్కూటర్ మీద ఆఫీస్ కి వచ్చే ప్రకాశం డబ్బు విషయంలో తనఅంచనాలకి తగ్గ స్థాయి వాడవటం వల్ల తన ప్రతిపాదనని తిరస్కరించకుండా ఒప్పేసుకుంటాడని లెక్కేశాడు. నాలుగునెలల్లో అతని ప్రమోషన్ కూడ డ్యూ ఉన్నది. అది అతన్ని లొంగతియ్యటానికి ఒక ఆయుధం అనుకున్నాడు పరాంకుశం. అందుకే అతన్ని ఎన్నుకున్నాడు.

"సర్ పిలిచారుట" అన్నాడు మేనేజర్ రూం తలుపు తీసి లోపలికి వెళుతూ!

":( రావోయి ప్రకాశం. పిల్లలు, భార్య కులాసానా? మీ అబ్బాయి ఏడు నైంత్ అనుకుంటా! వచ్చే సంవత్సరంటెంత్..శ్రద్ధగా చదువుకుంటున్నాడా? :( బాగానే చదువుతూ ఉంటాడులే! నీ కొడుకేగా! తండ్రి తెలివితేటలొచ్చుంటాయి" అని కాసేపు ములగ చెట్టు ఎక్కించాడు.

కుర్చీలో అటు ఇటు అసహనంగా కదులుతున్న ప్రకాశం, "అందరం బానే ఉన్నాం సర్. మా అబ్బాయి కూడా బానేచదువుతున్నాడు" అన్నాడు.

"మాకు తెలిసిన వాళ్ళ ద్వారా ఒక స్థలం అమ్మకానికి వస్తే, సొసైటీ స్థలం కదా అని ఎడ్వాన్స్ ఇచ్చాను. మూడొంతులు డబ్బుకట్టేశాను. తక్కువ పడిన డబ్బు కోసం చిట్టు పాడాను. రోజు చిట్ ఫండ్ కంపెనీ వాళ్ళు గ్యారంటీ సంతకాలకివస్తామన్నారు. నీ పేరు ఇచ్చాను. నీకేం అభ్యంతరం లేదుగా. పది నెలలు కట్టేశా, ఇంకా ఇరవై నెలలే కట్టాలి" అనిఆగాడు.

లౌక్యం, సమయస్ఫూర్తి పుష్కలంగా ఉన్న ప్రకాశం వెంటనే దిగులుగా మొహం పెట్టి,

"అయ్యో అదెంత మాట సర్. మీకు అవసరానికి సహాయం పడగలిగితే సంతోషమే! కానీ కంపెనీ చిట్ అంటే, నాగ్యారంటీ సంతకానికి ఒక చిన్న సమస్య ఉంది సర్. పోయిన నెల్లో మా బావ మరిదికి కంపెనీ చిట్ కే గ్యారంటీసంతకం పెట్టాను సర్. నాకు ఆల్రెడీ ఒక చిట్ వాళ్ళ దగ్గరే ఉన్నది. అది పాడేశాను. ఇంకా వాయిదాలు కడుతున్నాను. కాబట్టి వాళ్ళ రూల్స్ ప్రకారం నా గ్యారంటీ సంతకం చెల్లదు సర్. మీరు ఇంత ఇదిగా అడిగితే ఇలా చెప్ప వలసివస్తున్నందుకు క్షమించండి సర్" అని ముఖంలో బాధంతా వెలిబుచ్చుతూ అక్కడే నిల్చున్నాడు.

":( సరే పోనీలే! ఏం చేస్తాం! ఆంజనేయులిని ఇలా పిలు" అన్నాడు పరాంకుశం.

బ్రతుకు జీవుడా అని బయట పడి, తను లౌక్యంతో గండం నించి బయట పడిన భావాలు ముఖంలో ఇతరులకికనపడనివ్వకుండా బాత్ రూం లోకి వెళ్ళి చల్లటి నీటితో ముఖం కడుక్కొచ్చాడు.

"ఆంజనేయులూ ....నిన్ను సర్ పిలుస్తున్నారు" అని చెప్పాడు.

*****

ఐదో క్లాస్ చదువుతున్న కూతురు ఉషని రోజూ తన స్కూటర్ మీద తీసుకెళ్ళి స్కూల్లో దింపి వస్తాడు ప్రకాశం. మధ్యాహ్నంఅతని భార్య శాలిని వెళ్ళి తీసుకొస్తుంది.

స్కూల్ ఇంటికి దగ్గరే కానీ, రెండు మూడు మలుపులు తిరిగి వెళ్ళాలి. రోజు స్కూల్లో దింపుతూ "మధ్యాహ్నంవచ్చేటప్పుడు మీ ఫ్రెండ్స్ తో వచ్చెయ్యి. బామ్మని అమ్మ హాస్పిటల్ కి తీసుకెళ్ళాలి" అని చెప్పాడు.

"అలాగే నాన్నా!" అని స్కూటర్ దిగి స్కూల్లోకెళ్ళింది ఉష.

ప్రకాశం ఇంటి ముందు ఉండే కల్పన ఉష స్కూలే!

మధ్యాహ్నం స్కూల్ వదిలాక ఉషకి కల్పన కనిపించలేదు. కాసేపు వెతికి ఒక్కతే బయలుదేరింది. అప్పటికే పిల్లలందరూఒక్కొక్కరే వెళ్ళిపోయారు.

ఉష నడుచుకుంటూ వస్తుంటే ఒక్కతే ఉన్నదని గమనించిన వ్యక్తి ఒకడు సందు మలుపులో ఉష చెయ్యి పుచ్చుకుని లాగిచంకనేసుకుని, నలుగురి దృష్టి పడుతుందేమోనని గబ గబా నడుస్తున్నాడు.

ఒక్కసారిగా జరిగిన హఠాత్సంఘటనకి బెదిరిన ఉష తెలివి తెచ్చుకుని, పక్కనే వెళుతున్న మనిషిని చూసి "నాన్నాస్కూల్ నించి తీసుకెళ్ళటానికి మధ్యాహ్నం రానన్నావుగా, వచ్చేశావా! స్కూటర్ ఏది?" అన్నది.

ఉషని చంకనేసుకున్న వ్యక్తి పిల్లని గభాల్న దింపి, తన వాలకం తెలిస్తే ఎక్కడ పోలీసులకి పట్టిస్తాడో అనే భయంతోపరుగందుకున్నాడు.

పాప తనని వాళ్ళ నాన్న అనుకుంటున్నదని భావించిన సదరు వ్యక్తి, "పాపా ఎవరమ్మా నువ్వు? నేను మీ నాన్న లాగాఉన్నానా" అన్నాడు.

"కాదు అంకుల్. మధ్యాహ్నం స్కూల్ నించి తీసుకెళ్ళటానికి మా అమ్మ రావలసిందే. కానీ అమ్మ నాయనమ్మని హాస్పిటల్ కితీసుకెళ్ళింది. అందుకని నన్ను రోజు స్కూల్ నించి మా ఫ్రెండుతో కలిసి వచ్చెయ్యమన్నది. మా ఫ్రెండ్ కనిపించలేదు. వెతకటంలో ఆలశ్యమయింది. అందరూ వెళ్ళిపోయారు. ఒక్కదాన్నే వస్తుంటే అబ్బాయి నన్నెత్తుకెళ్ళటానికిచంకనేసుకున్నాడు.భయమేసింది. ఇంతలో మీరు కనిపించారు! మీతో మాట్లాడితే తెలిసిన వాళ్ళని భయపడినన్నొదిలేస్తాడని అలా పిలిచా" అన్నది.

ఆపద కలిగినప్పుడు "సమయస్ఫూర్తి" ప్రదర్శించటంలో ప్రకాశం కూతురు అనిపించింది ఉష!

"పద నేను వచ్చి నిన్ను దిగపెడతా" అని ఆయన ఉషతో పాటు ఇంటి దగ్గరకి వచ్చాడు.

ధైర్యంగా అప్పుడు ప్రవర్తించి గట్టెక్కినా, ఉష సంఘటనకి భయపడిపోయింది.

ఉష ఇంటికొచ్చేసరికి, అప్పుడే హాస్పిటల్ నించి వచ్చిన తల్లి తాళం తీస్తున్నది.

ఒక్క సారిగా తల్లిని వాటేసుకుని గట్టిగా ఏడ్చేస్తూ జరిగిందంతా చెప్పింది.

పాపతో పాటు వచ్చినాయన.."మీ అమ్మాయి బాగా తెలివైనదండి. మంచి సమయస్ఫూర్తితో వాడిని బురిడీ కొట్టించింది. రోజు మీరందరూ చాలా అదృష్టవంతులు" అని తన దారిన తాను వెళ్ళాడు.

"అక్కడ ధైర్యంగా ఉండి, వాడి బారి నించి బయటపడి ఇప్పుడు పిరికిదానిలాగా ఏడుస్తున్నావా? నో...నా తల్లి ఉషతెలివిగా సమయస్ఫూర్తితో ఎంత ఆపద నించి బయటపడిందో! ఐయాం ప్రౌడ్ ఆఫ్ యూ బేబీ!" అని దగ్గరకి తీసి వెన్నునిమురుతూ ఒళ్ళో పడుకోపెట్టుకుంది.

*****

ఆపదలో నించి బయటపడ్డ మనవరాలి మనసులో ధైర్యం నింపటం కోసం, నాయనమ్మ పిల్లని దగ్గరకి తీసుకుని, "బంగారు తల్లీ నీకు రామాయణం లో జేజి హనుమాన్ తెలుసు కదా! మీ పిల్లలందరికీ ఆయనంటే చాలా ఇష్టం కదా!" అన్నది.

"అవును బామ్మా, నువ్వు ఆయన పద్యం రోజూ చెప్పిస్తావు కదా! ఇప్పుడు మళ్ళీ చెప్పనా" అని కళ్ళు మూసుకుని, చేతులుజోడించి

"బుద్ధిర్బలం యశో ధైర్యం

నిర్భయత్వ మరోగతా

అజాడ్యం వాక్పటుత్వంచ

హనుమత్స్మరణాత్ భవేత్" అన్నది ఉష.

":( అలా రోజూ చదువుతున్నావు కనుకనే, ఇందాక సమయస్ఫూర్తి తో ధైర్యంగా ప్రవర్తించి, ఉపాయంతో ఆపద నించిబయటపడ్డావు."

"ఆయన కూడా నాలాగే ప్రమాదంలోంచి బయటపడ్డాడా బామ్మా" అనడిగింది.

"అవునమ్మా. ఇప్పుడు కధ చెబుతా విను."

"హనుమాన్ సీతా దేవిని వెతకటానికి లంకకి వెళ్ళాడు, అవునా?"

"అలా వెళ్ళటానికి ఆయన సముద్రం మీద ఎగిరాడు! అలా ఎగిరి వెళ్ళేటప్పుడు, ఆయనని "సురస" అనే నాగమాతఅడ్డగించి "నిన్ను తినేస్తాను. దేవతలు నిన్ను ఆహారంగా తీసుకోమని నాకు చెప్పారు. కాబట్టి నువ్వు వెళ్ళటానికి వీలు లేదుఅని అడ్డం నిలబడింది."

"నేను సీతా దేవిని వెతకటం అనే రామకార్యం మీద వెళుతున్నాను, అని ముందుకెళ్ళటానికి ప్రయత్నించాడు. ఆవిడఎలాగయినా హనుమని అడ్డుకోవాలని ప్రయత్నిస్తే, హనుమ తన శరీరాన్ని విపరీతంగా పెంచేసి ఆవిడని ఎదుర్కోవాలనిప్రయత్నించాడు. ఆవిడ కూడా తన శరీరాన్ని అంతకంటే ఎక్కువగా పెంచేసి తినేస్తానంటూ నోరు పెద్దగా తెరిచింది."

"అప్పుడు హనుమ, ఒక్క సారిగా తన శరీరాన్ని అతి చిన్నగా చేసి ఆవిడ నోట్లోకి వెళ్ళి బయటికొచ్చేసి...'మాతా ఇకవెళ్ళటానికి నాకు అనుమతి ఇవ్వు అని తన సమయ స్ఫూర్తిని ప్రదర్శించాడు. హనుమ తెలివికి, సమయ స్ఫూర్తికిసంతోషించి ఆవిడ ఆశీర్వదించి పంపింది.

*******

"లంక చేరాక, అక్కడ అనేక చోట్ల వెదికి చివరికి ఆమెని అశోక వనం లో శింశుపా వృక్షం క్రింద చూసి సంతోషించాడు. ఆవిడకి తను రామ దూతనని, ఆమెని వెతుకుతూ వచ్చానని చెబుతూ నమ్మకం కోసం రాముని ఉంగరాన్ని ఇచ్చాడు. ఆమె దు:ఖాన్ని పోగొట్టి, రాముడు వచ్చి రావణునితో యుద్ధం చేసి, ఆమెని తీసుకువెళతాడని చెబుతాడు."

"సీతమ్మ కనిపించిన ఆనందంతో అక్కడున్న చెట్లకున్న ఫలాలు కోసుకుని తినేసి, కొన్ని చెట్లు పీకేసి, వనమంతా ధ్వంసంచేసేశాడు. అల్లరిని ఎదుర్కోవటానికి వచ్చిన రావణ సేనని చీల్చి చెండాడి యుద్ధంలో చాలా మందిని చంపేశాడు. ఆఖరికి రావణుని కుమారుడైన అక్ష కుమారుడిని కూడా చంపేస్తాడు. ఇక లాభం లేదని రావణుడు మహా బలవంతుడు, ఇంద్రుడిని జయించిన తన కుమారుడు ఇంద్రజిత్తుని హనుమ మీద యుద్ధానికి పంపించాడు. హనుమకి, ఇంద్రజిత్తుకిమధ్య ఘోరమయిన యుద్ధం జరిగింది. యుద్ధంలో హనుమని కట్టడి చెయ్యటం చేతకాని ఇంద్రజిత్తు అతని మీద"బ్రహ్మాస్త్రం" ప్రయోగిస్తాడు.

"అవధ్యోయమితి జ్ఞాత్వా తమస్త్రేణాస్త్ర తత్వవిత్,

నిజ గ్రాహ మహాబాహుర్మారుతాత్మజ మింద్రజిత్"

[ అస్త్రముల బలాబలములు తెలిసినవాడు, మహా బాహువు అయిన ఇంద్రజిత్తు 'ఇతనిని చంపుట శక్యము కాదు ' అనితెలిసికొని, హనుమంతుని బ్రహ్మాస్త్రము చేత బంధించెను]

"తత: స్వాయంభువైర్మంత్రైర్బ్రహ్మాస్త్రమభిమంత్రితం

హనుమాంశ్చింతయామాస వరదానం పితామహాత్"

[ఇంద్రజిత్తు బ్రహ్మ మంత్రముల చేత అభిమంత్రించిన్ బ్రహ్మాస్త్రమును ప్రయోగించినాడని తెలిసికొని, హనుమ తనకుబ్రహ్మ దేవుడిచ్చిన వరమును గుర్తు చేసుకున్నాడు]

" వీర్యమస్త్రస్య కపిర్విచార్య

పితామహానుగ్రహమాత్మనశ్చ

విమోక్ష శక్తిం పరిచింతయిత్వా

పితామహాజ్ఞామనువతతేస్మ"

[హనుమకి బ్రహ్మాస్ ప్రభావం తెలిసినా, తన విషయంలో బ్రహ్మ దేవుని అనుగ్రహమును గుర్తు తెచ్చుకుంటూ, అస్త్రమునుండి విడిపించుకునే శక్తి ఉన్నదని తెలిసి కూడా, బ్రహ్మ గారి పట్ల గౌరవంతో అస్త్రానికి బందీగా ఉన్నట్టునటించాడు. ఎందుకంటే....]

"గ్రహణేచాపి రక్షోభిర్మహన్మే గుణ దర్శనం

రాక్షసేంద్రేణ సంవాదస్తస్మాద్గృహ్ణంతు మాం పరే"

[నన్ను రాక్షసులు పట్టుకుంటే నాకు లాభమే! అలాగయితే నాకు రావణాసురినితో మాట్లాడే అవకాశం కలుగుతుంది. కాబట్టి నన్ను రాక్షసులు పట్టుకెళ్ళటానికి వీలుగా..విడిపించుకోగలిగినా కట్టుబడే ఉంటాను అని మనసులో తలపోస్తాడు]

ఇలా మహా బలశాలి అయిన హనుమ తన సమయస్ఫూర్తిని ప్రదర్శించి, బ్రహ్మాస్త్రానికి కట్టుబడి రావణుడి దగ్గరకి వెళ్ళేఉపాయం ఆలోచించాడు.

"అలా హనుమ అనేక సందర్భాల్లో తన సమయస్ఫూర్తిని, తెలివితేటలని ఉపయోగించి రామకార్యం చేసుకొచ్చాడు. అందుకే పిల్లల కి జేజి హనుమాన్ అంటే భక్తి, ఇష్టం" అని బామ్మ ఉషని తల మీద చెయ్యి వేసి ఆశీర్వదించింది.

ఎం బిందుమాధవి

మరిన్ని కథలు

Telivijana majaka
టెలివిజనా! మజాకా!?
- కందర్ప మూర్తి
Prateekaaram
ప్రతీకారం
- చెన్నూరి సుదర్శన్
Anasteeshiya
అనెస్థీషియా
- వెంకట రమణ శర్మ పోడూరి
Voohinchaledu
ఊహించలేదు...!
- రాము కోలా.దెందుకూరు
APP Street police
ఎ.పి.పి స్ట్రీట్ పోలీసు
- కందర్ప మూర్తి
Maskena covid naasti
మాస్కేన కోవిడ్ నాస్తి
- పి. వి. రామ శర్మ
Pantulamma
పంతులమ్మ
- చెన్నూరి సుదర్శన్