అతను ... ఆమె .. సెక్షన్ 497 - వారణాసి భానుమూర్తి రావు

Athadu aame section 497

''ఈమేరా నా భార్య - కోమలి '' క్రొత్తగా పెళ్లి చేసుకొన్న రాజారావు పరిచయం చేసాడు తనని మధుకి . '' నమస్తే '' మధు చూశాడు ఆమె వైపు. ప్రతి నమస్కరిస్తున్న ఆమెను చూసి నిశ్చేష్టుడై పొయ్యాడు మధు. అజంతా శిల్ప సుందరిలా , తీర్చి దిద్దిన బాపు బొమ్మలా ఉందామె. తలంటు పోసుకోందేమో గాలికి ఆమె ఉంగరాల జుట్టు ఆమె ముఖం మీద పడి మరింత అందాన్ని ఇస్తోంది. లేత బుగ్గల మీద పడి దొర్లిపోతున్నాయి వంకీల్లా తిరిగిన ఆమె ఉంగరాల జుట్టు. వయసుకు తగ్గ శరీర సౌష్టవం , పరువం తెచ్చి పెట్టిన అందాల అవయవ సొంపులతో పసిడి బొమ్మలా కళ కళ లాడి పోతోంది ఆమె. కళ్ళు గూడా ఆర్పకుండా ఆమెనే తదేకంగా చూస్తున్న మధును రాజారావు గమనించాడు . '' కూర్చోరా ! '' కుర్చీ చూపించాడు రాజారావు. వాళ్లిద్దరూ మధు ముందున్న సోఫా లో కూర్చొన్నారు . '' వీరే నన్న మాట మీ ప్రియ మిత్రుడు '' ఆమె నవ్వింది మధు వంక చూసి. ట్యూబ్ లైట్ వెలుగులో ఆమె అందాల పలు వరస తళుక్కున మెరిసి మాయమయింది . '' అబ్బా .. ఎంత అందమైన పలు వరస.. ఎంత అందమైన నవ్వు '' నిజంగా ఆ నవ్వులో కోటి వీణియల మృదు ,మధుర నాదం మీటినట్లు, లేత చిగురులు తిని మత్తెక్కిన కోయిలల కల కూజిత రావములు విన్నట్లు ఉంది . '' ఉండండి .. కాఫీ తెస్తాను '' ఆమె లోపలికి వెళ్లి పోయింది. '' రాజా.. నువ్వు నిజంగా అదృష్ట వంతుడివిరా ! హార్టీ కంగ్రాట్యులేషన్స్ ఫర్ యువర్ సెలెక్షన్'' అన్నాడు మధు . మనసులో కాస్తా ఈసుగా ఉన్నా కనబడ నీయ కుండా అభినందించాడు మధు . ఎంతటి విశాల హృదయుడైనా , రాజా రావుని చూసి ఈర్ష్య పడక తప్పదు. ఎందుకంటే రాజారావుకు , కోమలికి ' కాకి ముక్కుకు దొండ పండు ' చందంగా ఉంటుంది . రాజారావుకు , కోమలి తగిన భర్త గాదని మధు అభిప్రాయం. కారణం కోమలి అప్సరసలా ఉండడం, రాజారావు అందుకు భిన్నంగా ఉండడమే ! రాజారావు నల్లగా, పళ్ళు ఎత్తుగా , నవ్వనంత వరకే అందంగా ఉంటాడు. గారపట్టిన ఒక్కటి , రెండు పళ్ళు, చెల్లా చెదురుగా ఉండే జుత్తు . ఇలాంటి రాజు గాడికి అలాంటి అందమైన అప్సరస దొరకడమా? భగవంతుడా ఏమిటయ్యా నీ లీల ? ఏమిటీ విచిత్ర బంధం ? '' అందుకే నేమో ? పెళ్లిళ్లన్నీ స్వర్గం లోనే జరుగుతాయంటారు '' రాజారావు కంటే తనే ఎంతో అందంగా ఉంటాడు. , కాలేజీ రోజుల్లో , ఇప్పుడు ఆఫీసులో గూడా తనను శోభన్ బాబులా ఉన్నావని అంటారు. అందుకే తన అందాన్నికాపా డుకోవడం కోసం ప్రతి రోజు రెండు గంటలయినా శ్రమ పడాతాడు మధు . ఆలోచనా పరంపరలతో వేగి పోతున్నాడు మధు. ' ఏమిటా ఆలోచిస్తున్నావు ? గతుక్కు మన్నాడు రాజారావు పలకరింపుతో . ' ఈవిడ మీ బంధువులమ్మాయేనట్రా ? అడిగాడు మధు . 'అవునురా .. దూరపు బంధువులు'. అంటుండగానే ఆమె ట్రే లో రెండు కాఫీ కప్పుల్తో , ఒక ప్లేట్లో కొన్ని బిస్కట్లతో ప్రత్యక్ష మయింది . ' ప్లీజ్..హావ్ ఇట్ ' అంది ఆమె మధు వంక చూస్తూ . 'క్రొత్త పెళ్లికొడుకులా సిగ్గు పడుతున్నారేమిటండి ' అని కిల కిల మని నవ్వుతు కాఫీ కప్పు మధు చేతికి అందించింది ఆమె. మధు జంకుతూనే అందుకొన్నాడు కాఫీ కప్పు. ఆ తొట్రు పాటు లో ఆమె కొస వ్రేళ్ళు తన చేతికి తగిలాయి. ఆ తగలడం ఆమె తన కేసి ఒక చిరు నవ్వు నవ్వింది . నవ్వు- మందహాసం - చిరునవ్వు లాంటి పదాలు ఎప్పుడో చిన్నప్పుడు తెలుగు పాఠాల్లో చదువు కొన్నా అర్థం కాలేదు. కానీ ఆమె పెదవుల మీద అలా చిరునవ్వు దొర్లి పడుతుంటే అర్థమయింది మధుకి . ' థాంక్స్ ' అన్నాడు కాఫీ త్రాగుతూ . 'మీ ఫ్రెండ్ పెళ్లి అయిపొయింది గదా ! మరి మీరు ఎప్పుడు చేసుకొంటున్నారు ? ' మళ్ళీ కిల కిల మని నవ్వింది ఆమె. మధు దగ్గర జవాబు రాలేదు. ఆమె నవ్వే తన చెవుల్లో ప్రతిధ్వనిస్తోంది . వాడు అంతే ! ఆడవాళ్ళతో మాట్లాడాలంటే జంకు.. భయం.. సిగ్గు మా వాడికి ' అన్నాడు రాజా రావు బిగ్గరగా నవ్వుతూ . రాజారావు మాటలకి ఆమె మళ్ళీ కిల కిల మని నవ్వింది.. 'వస్తానురా ! టైం అయిపొయింది 'అని వాచీ కేసి చూసుకొంటూ పైకి లేచాడు మధు. ' మంచిది రా.. అప్పుడప్పుడు వస్తూ ఉండు .. ముగ్గురం కలిసి చతుర్ముఖ పారాయణం చేస్తాం . నెక్స్ట్ సండే రారా !' అన్నాడు రాజా రావు . ' తప్పకుండా రావాలి.. ' అందామె . ' ష్యూర్ .. అలాగే వస్తాను. ' చిన్నపిల్లాడిలా తలూపాడు మధు . ఆమె మళ్ళీ నవ్వింది . అదే నవ్వు..అదే అదే ... -------------------------------------------------------------------------------------------------------------- మధుకి ఇంకా పెళ్లి కాలేదు . ఎన్ని సంబంధాలు వస్తున్నా తనకి నచ్చిన పిల్ల దొరకడం లేదు. తాను ఒక ఊహా సుందరిని తన హృదయంలో ప్రతిష్టించు కొన్నాడు. అలాంటి పిల్ల దొరికే వరకు తాను పెళ్లి చేసుకో గూడదని ప్రామిస్ చేసుకొన్నాడు. ఎలాంటి అందమైన పిల్లను తన పేరెంట్స్ వెతికి చూపించినా ఏదో ఒక వంకతో వద్దని కాన్సిల్ చేస్తున్నాడు . రాజారావు , మధు హైస్కూలు నుండి కాలేజీ వరకు ఫ్రెండ్స్ . డిగ్రీ అయినా తరువాత వారిద్దరి మధ్య కాంటాక్ట్స్ బొత్తిగా తగ్గి పొయ్యాయి. మధు ఉద్యోగ వేటలో హైదరాబాదు కు వెళ్లి పోయాడు . రాజారావు నెల్లూరు లో బిజినెస్ చేస్తూ వున్నాడు . మధు బ్యాంకు ఎంప్లాయిగా చేరి పొయ్యాడు . కొన్ని రోజుల తరువాత మధు నెల్లూరు కి ట్రాన్సఫర్ మీద వచ్చాడు . ఒక రోజు కాకతాళీయంగా మధు వాళ్ళ బ్యాంకులో అకౌంట్ ఓపనింగ్ కోసమని మధు కౌంటర్ దగ్గరకి వచ్చాడు రాజారావు. ఇద్దరి నోట మాట రాలేదు. ఆశ్చర్యంగా ఒక్కరి నొక్కరు చూసుకొని తరువాత విశేషాల్ని పంచుకొన్నారు . రాజారావుదీ తన వయస్సే ! చక్క గా పెళ్లి చేసు కొని ఒక్క సంవత్సర మయ్యింది . ఇక్కడే బిజినెస్ చేస్తూ సెటిల్ అయ్యాడు . వాడు పెద్ద ఎలెక్ట్రికల్ కాంట్రాక్టర్. ఇక్కడున్న పవర్ కంపెనీలన్నింటితోనూ చక్కని వ్యాపార సంబంధాలు ఉన్నాయట రాజారావుకి . కోట్లల్లో టర్నోవర్ ఉందట వాడికి. వాడి అదృష్టం కొద్దీ వాడికి అప్సరస లాంటి అమ్మాయి దొరికింది . మధు గూడా అల్లాంటి అమ్మాయి కోసం సంబంధాలు వెతుకుతున్నాడు గాని , ఏ అమ్మాయి అతనికి నచ్చడం లేదు . ఇన్ని రోజుల తరువాత తన క్లోజ్ ఫ్రెండ్ని కలవడం మధుకి చాలా సంతోషంగా ఉంది. ------------------------------------------------------------------------------------------------------------------- భోంచేసి రూమ్ లో పడుకొన్నాడన్న మాటే గాని నిద్ర రావడం లేదు మధుకి . మధు ఒక్కడే ఏకాంతంగా బెడ్ మీద పడుకొన్నాడన్న మాటే గాని రాజారావును కోమలి ఎలా ఒప్పుకొందబ్బా అని ఆలోచిస్తూ వున్నాడు . ఆలోచనలు ఎక్కువయితే సిగరెట్ త్రాగడం అతని హాబీ . ఒక సిగరెట్ వెలిగించాడు . మనుషులు అంతా ఒక్కటే ! ఒక్కటే తెలివి .. ఒక్కటే జ్ఞానం. కానీ దేవుడు ఒక్కొక్క వ్యక్తికీ ఒక్కొక్క బ్రతుకును ఇస్తాడు. వారి జీవితాలు అలా వారికి ఎదురయిన అవకాశాలని బట్టి మారిపోతూ ఉంటాయి . వచ్చిన అవకాశాల్ని సద్వినియోగ పరచు కొన్న వాడే సక్సెస్ ఫుల్ పర్సన్ అవుతాడు . సంఘంలో పేరు ప్రతిష్టలు వస్తాయి. అలాంటి కోవ లోకి చెందిన వాడే రాజారావు. -------------------------------------------------------------------------------------------------------------------- ఆదివారం రానే వచ్చింది . ట్రిమ్ గా షేవ్ చేసుకొని నీట్ గా ఫ్రెష్ అప్ అయి , వైట్ షర్ట్ ఫుల్ హాండ్స్ బ్లాక్ పాంట్ మీద టక్ చేసుకొన్నాడు. ఇంపోర్టెడ్ పెర్ఫ్యూమ్ రాసుకొని సినిమా హీరో లా తయారయ్యాడు . రాజారావు ఇల్లు చేరుకొనే సరికి ఉదయం పదుకొండు గంటలు కావస్తోంది . గోడ మీదున్న బజర్ నొక్కాడు. తెలుపు తెరచు కొంది . తలుపు తెరచిన కోమలిని చూసి నోట మాట రాక స్థాణువులా నిలచి పొయ్యాడు మధు. తలంటు పోసుకొని చిరు గాలికి చిలిపిగా వూగిస లాడుతూ , పాల భాగం మీద నాట్యం చేస్తున్న ఆమె ముంగురులు , రోజ్ కలర్ బొట్టు , గులాబీ రంగు లిప్ స్టిక్ తో దొండ పండులా మెరుస్తున్న ఆమె అధరాలు, రోజ్ కలర్ యూ నెక్ డిజైన్ బ్లౌజ్ , మాచింగ్ షిఫాన్ జార్జెట్ చీర , మృదు మధురమైన గులాబీ పువ్వులా విరిసినట్లున్న కోమలిని చూస్తూ అలాగే ఉండి పొయ్యాడు బయట మధు. కోమలి నవ్వింది .. ' ఏమండి.. అలాగే ఉండి పొయ్యారు ? ప్లీజ్ కం ఇన్సైడ్ ' అంది . ఊహా జగత్తులో నుండి వాస్తవ ప్రపంచంలోకి వూడి పడ్డాడు మధు. ' రావచ్చా .. ' 'భలే వారే ..రండి ' ' ఇంత సేపు మీకోసమే వెయిట్ చేశారు రాజ్ .. ఇప్పుడే వెళ్లారు ఒక పని మీద . మీరొస్తే ఉండమన్నారు ' అంది కోమలి . ఆమె హాల్లోకి అడుగులు వేసింది. ఆమె వెనకాలే మధు అనుసరించాడు . పొడుగాటి జడ , ఆ జడలో తురిమిన కనకాంబరం పూలు మదిని నివ్వెర పొయ్యేట్లు చేశాయి. ' ఇంతకీ రాజారావు ఎక్కడికి వెళ్ళాడు ? ' మధు అడిగాడు సోఫాలో కూర్చొంటూ . ఒక అరగంటలో వస్తానన్నారు. అయన కథ మీకు తెలుసు గదా ! ఎప్పుడు బిజి నెస్ ! ఓ క్షణం గూడా వృధా చెయ్యరు. టైం ఈజ్ మనీ అంటారు . ఇంటి గురించి ధ్యాసే లేదు. ఆదివారం గూడా సరదాగా కాలక్షేపం చెయ్యరు ' అంది కోమలి . ' వాట్ యు వుడ్ లైక్ టు హావ్ ? కాఫీ ఆర్ ఫ్రూట్ జ్యూస్ ?' 'అబ్బె... నాకేం వద్దండి' . ' డోంట్ ఫీల్ షై మధు గారు ' అని ఆమె వడి వడిగా కిచెన్ వైపు వెళ్లింది . ఆమె పాదాలకు వేసుకొన్న గజ్జెల చప్పుడు మధు గుండెల్లో పులకింతలని రేపుతోంది . ' అబ్బా .. ఎంత అందమైన నడక ? ఎంత అందమైన నవ్వు ? ఎంత అందమైన విగ్రహం ? బ్రహ్మ ఎలా సృజియించాడు ఈమెను ? నిజంగా కుందనపు బొమ్మ. పసిడి పరువంపు పూబంతి ' ఓ ఐదు నిముషాల్లో జ్యూస్ గ్లాసుతో తిరిగి వచ్చింది కోమలి. ' తీసుకోండి ' అందామె . గ్లాసు తీసుకొంటున్నపుడు ఆమె చేతి వ్రేళ్ళను గమనించాడు. ఎంతో మృదువుగా ఉన్న ఆమె చేతి వ్రేళ్ళు , పొడుగ్గా నాజూగ్గా కత్తరించి ఉన్న ఆమె గోర్లు, వాటికీ అప్లై చేసిన గులాబీ రెండు నైల్ పోలిష్. మధు కుడి చేత్తో కొన చేతి వ్రేళ్ళ ను సుతారంగా తాకి జ్యూస్ గ్లాసు అందు కొన్నాడు. ఆ స్పృశిం చడంలో ఏదో విద్యుత్ ప్రాకి నట్లయింది. ఒళ్లంతా గగుర్పాటు అయినట్లుంది. నవ్వడానికి ప్రయత్నిస్తూ కోమలి ముఖం వైపు చూసాడు. కోమలి ముఖంలో ఏ భావం చదువ లేక పొయ్యాడు మధు . ఆమె తిరిగి ముందున్న కుర్చీలో కూర్చింది . అంతలో రాజా రావు వచ్చాడు . ' ఎంత సేపయిందిరా నువ్వొచ్చి. పది గంటలకే వస్తా నన్నావు గదా ' రాజారావన్నాడు . ' అరగంట అయింది రా' రాజారావు వచ్చి తన పక్కనే కూర్చొన్నాడు . ఆ మాటా ఈ మాటా మాట్లాడుకున్నారు ఇద్దరూ . లంచ్ తరువాత కొంతసేపు కార్డ్స్ ఆడు కొన్నారు ముగ్గురు . ' సాయంత్రం సినిమా కు వెడుతున్నాం రా ! నువ్వు వస్తావా ? ' అన్నాడు రాజారావు. ' పానకంలో పుడక లా గా మీ మధ్యలో నేనేందుకు గాని మీరెళ్ళండి. ' అన్నాడు మధు. ' మీ ఫ్రెండ్ మీరు లేక పొతే సినిమా చూడలేడేమో .. రండి నేనే మీ అనుకోను ' మళ్ళీ కిల కిల మని నవ్వింది కోమలి . అదే నవ్వు తనని పిచ్చి వాణ్ణి చేస్తోంది . ఆ కపుల్ కి బై చెప్పేసి బైక్ ఎక్కి స్టార్ట్ చేసి వెళ్లి పొయ్యాడు మధు. --------------------------------------------------------------------------------------------------------------- వరూధిని ప్రవరాఖ్య నవల చదువుతున్నాడు. పాదాలకు పసరు రాసుకున్న ప్రవరాఖ్యుడు తెలియకుండా హిమాలయాల్లో దారి తప్పి పోతాడు. పాదాలకు పూసిన పసురు ఆ మంచు గడ్డల మీద నడకతో కరిగి పోతుంది. ఏ దిక్కు తోచని ప్రవరాఖ్యుడికి వరూధిని పరిచయమవుతుంది. తనతో రతి క్రీడలు జరిపమని , గాంధర్వ వివాహం చేసుకొమ్మని శత విధాల ప్రయత్నిస్తుంది . పరమ నిష్టా గరిష్టుడైన బ్రాహ్మణోత్తముడు ప్రవరాఖ్యుడు . ఆమెకు లోబడకండా తన వూరికి వెళ్ళి పోతాడు. ఇదంతా గమనిస్తున్న ఒక గంధర్వుడు మారువేషంలో ప్రవరాఖ్యుడిలా వెళ్లి వరూధినితో రతి క్రీడలు జరిపాడు . వరూధిని ప్రవరాఖ్యుడే తన మనసు మార్చుకొని తిరిగి వచ్చాడని ఆనందంగా తన తనువును , మనసును సమర్పిస్తుంది. ఏ పురాణం చూసినా అనైతిక సంబంధాలు లేవా ? గౌతముని భార్య అహాల్యను ఇంద్రుడు మోహించలేదా ? రావణాసురుడు పెళ్లయిన సీతమ్మను మోహించా లేదా ? కుంతీ ఎలా బిడ్డలని కన్నది ? వాయు దేవుడు , అగ్ని దేవుడు, సూర్యదేవుడు ద్వారా ఎలా బిడ్డల్ని కన్నది ? ద్రౌపతి ఐదు మంది పతులను‌ పొంద లేదా? తను గూడా గంధర్వుడులా మారిపోయి కోమలిని ...అలా మోసం చెయ్య వచ్చా ? ఛ .. ఛ.. పనికి రాని ఆలోచనలు. ఒక స్నేహితుడి భార్యను అలా మోసం చేయవచ్చా ? రాత్రంతా ఆలోచిస్తూ నిద్ర పట్టక అలాగే కోమలిని గురించి ఆలోచిస్తూ ఉండి పొయ్యాడు . ఒక పాకెట్ సిగరెట్లు స్మోక్ చేసాడు రాత్రంతా. --------------------------------------------------------------------------- రోజులు గడిచే కొద్దీ కోమలిని చూడ లేకుండా ఉండ లేక పోతున్నాడు మధు . కోమలి తన మనసంతా ఆక్రమించేస్తోంది. ఏమి చేసినా అంతా కోమలి మీదనే ధ్యాస పోతోంది. తప్పని అంతరాత్మ చెబుతున్నా , మనసుకి నచ్చిన పని చేయడం తప్పు లేదని మనస్సు చెబుతోంది. అక్కినేని పాట ఎక్కడో వినబడుతోంది వివిధ బారతిలో . '' భూమ్మీద సుఖ పడితే తప్పు లేదురా ! బుల బాటం తీర్చుకొంటే తప్పు లేదురా !'' అని . ఈ పాటంటే మధుకి చాలా ఇష్టం . అవును... తప్పేంటి? మనసుకు నచ్చిన పని చేయడంలో తప్పులేదు గదా ? ఈ మధ్య వచ్చిన సుప్రీం కోర్టు తీర్పు గూడా తనకి బాగా నచ్చింది. పెళ్లయిన స్త్రీ పురుషుడి సొత్తు గాదు . ఆమె ఇష్టా ఇష్టాలను బట్టి ఆమె ప్రవర్తించవచ్చు. ఇద్దరి మేజర్లు ఒకరి నొకరు ఒప్పుకొంటే వారు శారీర సంబంధానికి అడ్డు చెప్పే హక్కు ఎవరికి లేదు '' అని పీనల్ కోడ్ సెక్షన్ 497 రాజ్యాంగ విరుద్ధ మని సుప్రీం కోర్టు తేల్చి చెప్పింది. లాప్టాప్ తీసి గూగుల్ లో సుప్రీం కోర్టు అడల్ట్రీ మీద సెర్చ్ చేసాడు మధు. ' 'Adultery is no longer a crime. The supreme court declared that section 497 of the Indian penal code is unconstitutional . Husband is not the master of a wife. '' ఆరాత్రి హాయిగా నిద్ర పొయ్యాడు మధు . ------------------------------------------------------------------------------------------------------------ ఒక ఆదివారం. సినిమా హీరోలా రొమాంటిక్ గా తయారయి కోమలి ఇంటికి వెళ్ళాడు మధు. తనకి తెలుసు రాజారావు బిజి నెస్ ట్రిప్ మీద సింగపూర్ వెళ్లాడని. కానీ కోమలిని చూడకుండా ఉండ లేక పోయాడు . అందుకే ముందుగా ఇన్ ఫార్మ్ చెయ్యకుండా కోమలి ఇంటి ముందు ఆగి బజర్ నొక్కాడు . ఎప్పటి లాగే కోమలి తలుపు తీసింది. ' మే ఐ కమ్ ఇన్ ? ' అన్నాడు మధు. ' ఏమిటి ? చెప్ప పెట్టకుండా వచ్చేసారు హీరో గారు ' అంది కోమలి కిల కిల మని నవ్వుతు . ఆయన మీకు చెప్పలేదా ? సింగపూర్ వెళ్ళారు . ' అంది కోమలి. ' చెప్పాడనుకొండి . రాజా లేకపోతే రాగూడదా ? ' అని చిలిపిగా అడిగాడు మధు. అబ్బే .. అదేం లేదండి ' అంది కోమలి . కోమలి ని ముగ్గు లోకి దింపడానికి ఇదే సమయం అనుకొన్నాడు మధు. 'టైమ్ వేస్ట్ చేసుకోవద్దు ' అని అంటోంది మనసు. ' కాఫీ .. హార్లిక్స్ ''అడిగింది కోమలి ' అబ్బె ... ఏమి వద్దండి .. నా ఎదురుగా కూర్చొని మాట్లాడండి. నాకదే చాలు ' మధు అన్నాడు హేర్ స్టయిల్ సరి చేసు కొంటూ . అతని మనసులో కోరికలు గుర్రాలవుతున్నాయి. ' నా మీద మీ అభిప్రాయం ? ' అని అడిగాడు మధు. ' మీ కేంటండి .. యంగ్ హీరో లా ఉంటారు . యద్దనపూడి గారి నవలా హీరో రాజా శేఖరాన్ని మించి పొయ్యారు ' అంది కోమలి నవ్వుతూ . మధు కి ధైర్యం వచ్చింది . తన మీద మంచి అభిప్రాయం ఉందని తెలిసింది . ' మా ఆఫీసులో అందరు నన్ను రొమాంటిక్ హీరో అని పిలుస్తా రండి ' అన్నాడు మధు కోమలి కళ్ల ల్లో కళ్ళు పెట్టి నవ్వుతూ. కోమలి నవ్వుతూ ' బలే వారే' అని అంది. ఇంకొంచెం పర్సనల్ గా అడగాలనుకొన్నాడు . ''మరి మీరు ఇంత బ్యూటిఫుల్ గా ఉంటారు కదా ? ఆ రాజారావు ఎలా నచ్చాడు మీకు ? పర్సనల్ విషయాన్ని అడిగాననుకోకండి ' అన్నాడు మధు. కోమలి జవాబు ఇవ్వలేదు. ముభావంగా ఉంది . ' చాలా తల నొప్పిగా ఉంది కోమలి గారు .. రాత్రంతా నిద్ర పోలేదు .. నేను వస్తా.. ' అని అన్నాడు మధు ' ఉండండి . మెడిసిన్ తెస్తాను. టాబ్లేట్ వేసుకొంటారా ? '' ' జండూ బామ్. అమృ తాంజన్ ఉంటే ఇవ్వండి . చాలు . ' అన్నాడు మధు . హడావుడిగా సోఫాలో లేచిన కోమలి పయ్యెద సర్రున క్రిందకు జారి పోయింది. బల మైన ఆమె స్థన ద్వయం , ఆ మధ్యలో రెండు పర్వతాల మధ్య లోయలాంటి ఇరుకైన గాడిని చూసి మధు మతి చలించినట్లయింది. ' అబ్బా .. ఎంత అందమైన వక్ష స్థలం ? ఆ వక్షస్థలం లో తాను ఒక మల్లె పూవు లా ఇరుక్కుపోతే ఎంత బాగుంటుందో ! ' అనుకొన్నాడు మధు . తటుక్కున జారిపోయిన పైటను సర్దుకొని హాల్లోకి వెళ్ళి మెడికల్ కిట్ తెచ్చి ఇచ్చింది కోమలి . ' నా జబ్బుకు మీ దగ్గర మందు ఉందా ' అని నవ్వుతు నర్మ గర్భంగా అడిగాడు మధు . ' ఉండండి .. ఒక్క క్షణంలో కాఫీ తెస్తాను ' అని కిచెన్ లోకి వెళ్ళింది కోమలి . ఆమె వెళ్లిన వైపే చూస్తున్నాడు మధు . ఆలోచనలతో సత మతమై పోతున్నాడు. హార్ట్ బీట్ బలంగా కొట్టు కొంటోంది. చేసే తప్పుడు ఆలోచన వల్ల వళ్లంతా షివరింగు వచ్చినట్లయింది. అయినా గుండె బిగువుతో ఊపిరి బలంగా తీసుకోని లేని శక్తిని కూడ గట్టుకొంటున్నాడు. ' ఈ రోజు ఎదో ఒక్కటి జరగాలి. కోమలిని ఎలాగైనా తన వైపుకు తిప్పు కోవాలి . కోమలిని వశీకరణం చేసుకోవాలి అని అనుకొన్నాడు మధు . ఎదలో జరిగే ఈ ఆరాటాన్ని ఎలా చెప్పాలో , ఎలా సంభాషణ మొదలు పెట్టాలో తెలియక తిక మక పడుతున్నాడు . కోమలికి గూడా తనంటే చాలా ఇష్టం అని ఎన్నో సార్లు ఆమె చర్యల ద్వారా తెలుసు కొన్నాడు . తన ప్రేమను ఏ ఆడదీ బహిరంగంగా చెప్పుకోలేదు . ఆడవారి మాటలకు అర్థాలు వేరులే అని అందుకే పెద్ద వాళ్ళన్నారు. ఆడదాని హృదయం అగాధం అని గూడా అన్నారు. కోమలి ని ఈ రోజు నోరు తెరచి అడిగెయ్యాలి అని అనుకొన్నాడు మధు. కోమలి కాఫీ తో ప్రత్యక్ష మయింది. . ' థాంక్స్ ' అన్నాడు మధు ' మీ లాంటి అప్సరస కోసం నా లైఫ్ పార్ట్నర్ గా ఐదేళ్ల నుండీ నేను వెతుకుతూనే ఉన్నాను. నాకు దొరకడం లేదు. ఏమైనా రాజారావు చాలా అదృష్ట వంతుడు ' అన్నాడు మధు. ' ఉహు ' కోమలి ఏమి మాట్లాడంలేదు . కాఫీ గ్లాసు తీసుకోని కిచెన్ లోకి తిరిగింది కోమలి. ' కో--- మ---- లీ ' మొట్ట మొదటి సారిగా ఏక వచన ప్రయోగానికి ఆశ్చ్య ర్య పోయింది కోమలి ''కోమలి.. నీ ..నీతో ఒక విషయం మాట్లాడాలి . వస్తావా ?' కోమలి ముఖంలో రంగులు మారాయి. ' అందమైన వాళ్ళంటే నాకు చాలా ఇష్టం . మరీ నిన్ను చూసినప్పటి నుండి నాకు ఎన్నో జన్మల నుండి చూసి నట్లుంది . నా కెందుకో నిన్ను చూడకుండా ఉండ లేక పోతున్నాను ' అన్నాడు మధు . మాటలు తడ బడు తున్నాయి. నోటిలో తడి ఆరి పోతోంది. ' ఈ మధ్య సుప్రీం కోర్టు ఒక తీర్పు ఇచ్చింది అడల్ట్రీ మీద . మీరు చదివారా ? మధు శత విధాలా ప్రయత్నిస్తు న్నాడు కోమలిని ముగ్గు లోకి దించ డానికి. కోమలి 'యెస్' అంటే తన కౌగిలి లోకి తీసుకోని ప్రేమ సామ్రాజ్యంలో ముంచెత్తాలి అని మనసులో అనుకొన్నాడు మధు. ఉన్నట్లుండి కోమలి చెయ్యి పట్టుకొని ' ఐ లవ్ యు కోమలి ' అని అన్నాడు మధు. ఈ అసంకిల్పిత చర్య కి బొమ్మలా నిలిచి ఉండి పోయింది కోమలి. ఏం చెయ్యాలో పాలు పోవడం లేదు. మధు గట్టిగా తన కేసి హగ్ చేసు కొంటున్నాడు. అతని బిగి కండరాలు తనని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. ఒక్క ఉదుటున విడిపించుకొని మధు చెంప మీద చెళ్ళున వాయించింది కోమలి . ' ఐ థింక్ యు అర్ యాన్ ఇడియట్ ' ఉగ్ర కాళిలా అరిచింది కోమలి . ' రాజారావు నాకు దేవుడు. ఎన్ని సుప్రీం కోర్టులు తీర్పులు వచ్చినా భారతీయ స్త్రీ మనస్తత్వం మారదు . అగ్ని సాక్షిగా వివాహం చేసుకొన్న రాజారావు నాకు దేవుడు. హిందూ వివాహం ప్రకారం ఏడడుగులు వేసి, వేదోక్త ప్రకారం నా మెడలో మంగళ సూత్రం కట్టి ఒక్క జంట గా మారిన మాది జన్మ జన్మల బంధం . అది విడదీయ రాని అను బంధం . మధు నువ్వు నీ ఫ్రెండ్ కి చేయరాని ద్రోహం తల పెట్టావు. ఐ కాంట్ పార్దన్ యూ ' అన్నది కోమలి ఏడుస్తూ . ' రాజారావు నీకు నచ్చాడా ?' ' మధు..వెర్రి ప్రశ్న వెయ్యకు. రాజారావు నాకు దేవుడు. తల్లి తండ్రి లేని నన్ను ఒక అనాధ శరణాలయంలో చూసి పెళ్లి చేసుకొన్నాడు. ఆయనకు కుల మత పట్టింపులు లేవు . డౌరీ అంటే అసహ్యం . అతనికి కావసినది తనని అర్థం చేసుకొనే ఒక ఇల్లాలు . అలాంటి మా ఆయన నాకు దేవుడే ! . నీ లాంటి పోకిరి గాళ్ళు ఎంత మంది చెప్పినా మా వివాహ బంధాన్ని ఏమి బ్రేక్ చెయ్యలేవు ' అంది కోమలి. 'కోమలి ... ఒక్క సారి ఆలోచించు ప్లీజ్' ''ఐ సే యు గెట్ అవుట్ అఫ్ ది హౌస్ . ఇంకో క్షణం ఇక్కడ ఉన్నావంటే పోలీసు వాళ్లకి కంప్లైంట్ ఇస్తాను '' అపర రుద్ర కాళిలా గర్జించింది కోమలి. మధు ఒక్క ఉదుటున లేచి బయటకు పరుగెత్తాడు .

మరిన్ని కథలు

Telivijana majaka
టెలివిజనా! మజాకా!?
- కందర్ప మూర్తి
Prateekaaram
ప్రతీకారం
- చెన్నూరి సుదర్శన్
Anasteeshiya
అనెస్థీషియా
- వెంకట రమణ శర్మ పోడూరి
Voohinchaledu
ఊహించలేదు...!
- రాము కోలా.దెందుకూరు
APP Street police
ఎ.పి.పి స్ట్రీట్ పోలీసు
- కందర్ప మూర్తి
Maskena covid naasti
మాస్కేన కోవిడ్ నాస్తి
- పి. వి. రామ శర్మ
Pantulamma
పంతులమ్మ
- చెన్నూరి సుదర్శన్