మేక్ ఓవర్ - అయ్యగారి శ్రీనివాస్

make over

"A calm and modest life brings more happiness than the pursuit of success combined with constant restlessness."

చిన్నతనం లో నాన్నగారిని చూస్తే ఎప్పుడూ భయమే మాకు. చాలా తక్కువ మాట్లాడేవారు మాతో.మనిషి ఆరడుగుల  ఆజానుబాహుడు, వయసు మోసుకొచ్చిన మార్పులతో వచ్చిన  తెల్లని జుట్టు. ఎప్పుడూ తెల్లని ఖద్దరు పంచ, లాల్చీ వేసుకుని పడక్కుర్చీ లో కూర్చుని ఏ పుస్తకమో చదువుకుంటూ ఉండేవారు. అయనతొ ఏమైనా పని పడిందంటే మాత్రం నాకు గుండెల్లో పెద్ద రాయి పడ్డట్టు అయ్యేది. ఆమ్మో ఎలా మాట్లాడాలి ఆయనతో అని. అన్నింటికీ మరి పాపాల భైరవుడి లా ఇంట్లో అమ్మ ఉండేది. వెళ్లి అమ్మా అంటూ ఆవిడ కొంగు పట్టుకుని, కాలేజీ వాళ్ళు ఆరెంజ్ చేసిన టూర్ కి వెళ్లాలని వుంది. డబ్బులు ఏమి ఇవ్వక్కర్లేదు, అంతా కాలేజీ వాళ్లే చూసుకుంటారు.  నాకు వెళ్లాలని ఉంది నాన్నగారిని అడగాలంటే భయం, నువ్వు ఆయనతో చెప్పవా అని బతిమలాడే వాడ్ని. ఆయన ఎస్ అన్నారు అంటే పండగే నాకు, యురేకా అంటూ గెంతులే అయన చూడకుండా. ఇదంతా నాకు పద్దెనిమిది ఏళ్ళ వయసులో, నేను డిగ్రీ చదువుతున్న నాటి మాట.  అప్పుడు అయన వయసు సుమారు అరవై నాలుగో, అరవై అయిదో. ఒక విధంగా చూస్తే ఆయన అంటే భయం కంటే భక్తే ఎక్కువ నాకు. నాన్నగారు అంటే విశ్వరూపదర్శం లో శ్రీకృష్ణుడి అవతారం అంత మెగా సైజు లో ఊహించుకుంటూ ఉండేవాడిని. ఆయన మనసులో ఎం భావాలు ఉండేవో  మాత్రం తెలిసేది కాదు, అయన కూడా చాలా గుంభనంగా వుండే వారు.

మరి ఇప్పుడు నా గురించి. వయసు అరవై కి కొంచెం దగ్గరలో. అంటే  నేను పెద్దవాడినే కదా. కానీ ఇప్పటికి క్లారిటీ లేదు నాకు, నా పెద్దరికం పైన. మనసు చెబుతూ ఉంటుంది, నువ్వు ఇంకా కుర్రాడివే అంటూ.  మరి శరీరం చెప్తుంది, ఇక  ఓపిక లేదు విశ్రాంతి కావాలి అని. అంతా కన్ఫ్యూషన్.

అసలు ఈ "పెద్దమనిషి " అవడం ఏంటి, అసలు పెద్దమనిషి అంటే ఎవరు, అరవై ఏళ్ళు వచ్చేస్తే పెద్దమనిషి అయిపోతామా, అన్న సందేహాలు అనేకం చుట్టుముట్టాయి నా మైండ్ లో.  రాజమండ్రి లో మా వీధిలోనే వుండే రిటైర్డ్ స్కూల్ మాస్టారు నాకు మంచి మిత్రుడు. మొన్నీమధ్య పనిగట్టుకుని అయన దగ్గరికి వెళ్ళాను. కుశల ప్రశ్నలయ్యాక, నా సందేహం బయపెట్టాను. అయ్యా మాస్టారు అసలు ఈ పెద్దమనిషి అవడం అంటే ఏమిటి, ఈ వయసు లో నా జీవితం ఆనందం గా సాగి పోవాలి అంటే ఎం చెయ్యాలి అని.  ముందు ఇదిగో కాఫీ తాగు తరువాత మాట్లాడుకుందాం అంటూ, కాఫి కప్పు నా ముందు పెట్టాడు. చెపొద్దూ, మాస్టారి భార్య తయారుచేసే చిక్కని ఫిల్టర్ కాఫీ అంటే నాకు చాలా ఇష్టం. చాలా సార్లు ఆవిడ చేసే కాఫీ తాగడానికే, వాళ్ళింటికి వెళ్లిన సందర్భాలు ఎన్నో.  కాఫీ ప్రతి డ్రాప్ ఆస్వాదిస్తూ, రెండు నిముషాల్లో కంప్లీట్ చేసి, కప్ ని పక్కన పెట్టి, చెప్పా  మాస్టారి తో,   గొంతుకలో కాఫీ తాగుతున్న ఫీల్ రాలేదు , అమృతం తాగుతున్నట్లే ఉంది  అని.

అప్పుడు గొంతు విప్పారు మాస్టారు, చూడు సుబ్బారావు , ఇంత కాలం నువ్వు గడిపిన జీవితం వేరు, ఇప్పుడు గడపబోయే ఈ జీవితం వేరు. ఇప్పటి దాకా పిల్లలు, సంసారం అంటూ గడిపేసావు, కనీసం ఇప్పుడైనా నీ  ఆలోచన నీ మీదకి మళ్ళించు. ముందు  నిన్ను నువ్వు ప్రేమించడం నేర్చుకో, మిగిలిన అతి కొద్ది జీవితం లో ప్రతి క్షణం ఎంజాయ్ చేయడానికి ప్రయత్నం చెయ్యి. కానీ ఇదంతా జరగాలంటే, నిన్ను నువ్వు కంప్లీట్ మేక్ ఓవర్ చేసుకోవాలి.మొదలుపెట్టు ఈ రోజే నిన్ను నువ్వు మేక్ ఓవర్ చేసుకోవడం, ఒక నెల తరువాత కనపడు అప్పుడు చూస్తా, ఈ మేక్ ఓవర్ కాన్సెప్ట్ నీలో ఎం మార్పులు తెస్తుందో అంటూ అయన తన కృష్ణోపదేశం  ముగించారు. అలాగే మాస్టారు, మళ్ళీ నెల రోజుల తరువాత కలుస్తా, అంటూ అయన దగ్గర సెలవు తీసుకొని బయటపడ్డా.

మాస్టారు చేసిన గీతోపదేశం నా మైండ్ లో డీప్ గా నాటుకుపోయింది. ఈ రోజు నుంచే  ప్రారంభించాలి, నన్ను నేను ప్రేమించుకోవడం, మేక్ ఓవర్ చేసుకోవడమూ. కానీ  కళ్ల ముందు ప్రత్యక్షమయింది పెద్ద క్వశ్చన్ మార్కు. మేక్ ఓవర్ చేసుకోమని చెప్పారు మాస్టారు, అంతవరకూ బాగానేవుంది, కానీ అసలు ఈ మేక్ ఓవర్ అంటే ఏంటని. అప్పటికే బెంగుళూరు వచ్చేసిన నాకు, మళ్ళీ దీనికోసం మాస్టార్ని ఎందుకు డిస్టర్బ్ చేయడం, చేతుల్లో ఎలాగో గూగుల్ వుంది కదా గాలం వేద్దాం అంటూ వెతికాను మేక్ ఓవర్ అంటే ఏంటి అని. అది చెప్పిన సమాధానం ఒకటికి రెండుసార్లు చదివి, అప్పుడు మొదలు పెట్టా, మాస్టారు చెప్పిన మేక్ ఓవర్ కార్యక్రమం. మరి సరదాగా ఇప్పుడు ఒక చిన్ని ఫ్లాష్ బ్యాక్, ఒక నాలుగు దశాబ్దాల కి వెనక్కి  వెళదాం. చిన్నప్పుడు మా ఇంట్లో ముఖం చూసుకోడానికి ఓ చిన్న అద్దం పెంకు ఉండేది వెనకాల వున్న కళాయి అంతా పోయి.నా ముఖం  చూసుకుంటే ఏదో ఒక కన్నో, లేదా నా ముక్కో, ఏదో ఒకటే కనపడేది దాంట్లో. అయినా మరి అప్పుడు మేం యూత్, మరి నీట్ గా డ్రెస్ చేసుకెళ్ళాలి అనే కోరిక.ఏంచేస్తాం. అడ్జెస్ట్ మెంట్ నర నరాల్లో నిండిపోయిన సాధారణ మధ్య తరగతి సగటు జీవి గా, నా సాటిస్ఫాక్షన్ కోసం, ఆ అద్దం లో కనపడే నా ముక్కు ని, లేదా చెవి ని చూసుకుంటూ తల దువ్వేసుకుని, రాజమండ్రి బజార్ లో కొన్న అశోక టాల్కమ్ ఫేస్ పౌడర్ దట్టం గా ముఖం మీద దట్టించేసి, చిరుగులు పడ్డ చొక్కా కాలర్ కనపడకుండా ఏ కర్చీఫో దానికి నీట్ గా తగిలించి,  కీచు కీచు మనే నా డొక్కు సైకిల్ మీద కాలేజీ కి వెళ్ళేవాడిని, ఏ అడవి రాముడు సినిమా పాటలో పాడుకుంటూ..

సీన్ కట్ చేస్తే ఇప్పుడు వర్తమానం లోకి వద్దాం. వయసు వచ్చేస్తోంది అనే భయం వచ్చాక నా బర్త్ డే వచ్చిందంటే ఆనందం పోయి భయం మొదలైంది. వామ్మో యాభై ఆరు, యాభై ఏడూ, లెక్క పెడుతూ వుంటే. మరి కాలం సూపర్ సోనిక్ స్పీడ్ లో పరుగు పెడుతోంది నన్నెవరూ ఆపలేరు వొచ్ అంటూ. కానీ నన్ను నేను సమాధానపరచు కోవడానికి మాత్రం,  లేదు నేను ఇంకా యూత్ లోనే ఉన్నాను అని నాకు నేనే సర్టిఫికెట్ ఇచ్చేసుకుంటూ వచ్చాను. మరి మనసు కుర్రాడిలా పెట్టుకుంటే పోతుందా ! అద్దం లో ముఖం చూసుకోవాలంటే బెరుకు,  చూసుకుంటే అసలు నేను నాకు కనిపించేస్తుందనేది అసలు భయం.

ఒకప్పుడు ఏదో  గూట్లో ఒక మూల ఉండేది అష్టావక్ర ఆకారం పగిలి మిగిలిన చిన్న అద్దం పెంకు. మరి ఈనాటి తప్పించుకోలేని ఆధునికత్వం తెచ్చిన మాడ్యూలర్ వార్డ్రోబుల బయట భాగం మొత్తం అద్దాలే. ఫోర్ డి సినిమాల్లో కనిపించినట్లు బెడ్ రూమ్ రెండు వైపులా పెద్ద పెద్ద అద్దాలే.బెడ్ రూమ్ లోకి వెడితే నేను  దానికేసి చూడకుండా తప్పించుకోలేను. ఆలా అని దాంట్లో నా ముఖం చూసుకుందును కదా, ఎవరీ బాబోయ్ ఈ జీవి అని నాకే భీతి కలిగేలా, ముగ్గుబుట్ట అయిపోయిన జుట్టు, పొరబాటున నవ్వడానికి ట్రై చేసానా, అంతే ఉండవలసిన ముప్పై రెండు పళ్ళ స్థానం లో అన్ని ఖాళీలే. బహుశా మాస్టారు నన్ను చూసే చెప్పి వుంటారు ముందు మేక్ ఓవర్ చేసుకుని రండి అని, అనిపించింది ఆలోచిస్తే ఇప్పుడు. ఇంక మొదలుపెట్టా రెట్టించిన ఉత్సాహం తో నా మేక్ ఓవర్ కార్యక్రమం.

కోరమంగళ లో అమెరికా నుంచి వచ్చిన డెంటిస్ట్, ఒక మోడరన్ డెంటల్ దుకాణం ఓపెన్ చేసారంటే అక్కడికి వెళ్లి, వాళ్ళు పోష్ పోష్ గా చెప్పిన హాయ్ హాయ్  గ్రీటింగ్స్ వింటూ , కట్టుడు పళ్ళు పెట్టించుకుని  అవి కదలకుండా బ్యాండేజీ వేసిన నోరు తెరిచి,  నేను  మాట్లాడే పరిస్థితి లేకుండా చేసి, నా చేతులో ఒక లకారం బిల్లు పెట్టి, చొక్కా జోబీ లో వున్న కార్డు తో గీకించుకుని,  తరువాత, జాలి గా ఒక చూపు నాకేసి పడేసి, ఎగ్జిట్ వైపు పంపించారు. అమ్మయ్య ఇప్పుడు చక్కగా నోరు తెరచి అందం గా నవ్వచ్చు అనుకునే అంతలో ఆ నెల వచ్చిన క్రెడిట్ కార్డు బిల్లు చూసాక వచ్చింది నవ్వు కాదు మూర్చ. అప్పుడు డిసైడ్ చేశా, ఈసారి డెంటల్ ప్రాబ్లెమ్ వస్తే ఈ అమెరికా డెంటిస్ట్ ని వదిలేసి, మా రాజమండ్రి కోటగుమ్మం రోడ్డు మీద నా చిన్నప్పటి నుంచి చూస్తున్న, చైనా డాక్టర్ దగ్గరికి వెళ్లాలని. అంత దూరం చైనా నుంచి మారుమూల రాజమండ్రి లో ఎప్పుడో యాభై ఏళ్ళ క్రితం సెటిల్ అయిన ఈ చైనా డాక్టర్ క్వాలిఫికేషన్ ఏంటో ఎవరికీ తెలీదు.ఎప్పుడూ ఇంత కావాలని డిమాండ్ చేసేవాడు కాదు.  మన దగ్గర ఎంత వుంటే అంతే తీసుకొని, పళ్ళు పీకి పంపించేవాడు ఆయన. మేక్ ఓవర్ పేరు చెప్పి, లకారం హుష్ కాకీ అయినందుకు నా అమాయకత్వం మీద నాకే జాలి వేసింది. చెప్పొద్దూ !

ఇక నెక్స్ట్ స్టెప్ జుట్టు కి నల్లరంగు వేయడం. నాకు తెలియకుండానే నా ఆలోచన  నా మీసాలమీదకి వెళ్లాయి. పదేళ్ల క్రితం అనుకుంటా ముందు ఒకే ఒక వెంట్రుక తెల్లబడింది మీసం లో. ప్చ్ ఎం కాలే అనుకుంటూ కత్తెర తో కట్ చేశా. వారం రోజుల తరువాత చూస్తే రెండు చోట్ల తెల్ల వెంట్రుకలు, ఓస్ అంటూ కట్ చేసి పడేసా. అలా మొదలైన మీసాల కటింగ్ ప్రక్రియ పూర్తయ్యే సరికి నా ముఖం హిందీ సినిమా హీరోలా అయిపొయింది, పేడిమూతి తొ.ఇక సంస్కార వంతమైన సోప్ డబల్ ఎక్సెల్  తో ఉతికేసినట్లుగా పూర్తిగా  తెల్లబడ్డబడ్డ నా జుట్టు చూసి నేను దడుచుకోకుండా,  గార్నియర్ హెయిర్ కలర్ ఒకటైతే సరిపోదని రెండు పాకెట్లు సుబ్బరంగా జుట్టుకి దట్టించా.తరువాత అప్పటిదాకా వాడుతున్న  డ్రెస్ లుపక్కన పడేసి, ఫినిక్స్ మాల్ కెళ్ళి బ్రాండెడ్ టి షర్ట్ లు, జీన్ ప్యాంటు లు తీసుకున్నా.నేను ఇప్పుడు హఠాత్తుగా ముప్పై ఏళ్ళ యూత్ ఫుల్ కుర్రాడి గా మేక్ ఓవర్ అయిపోయా. అఫ్ కోర్స్ ఓన్లీ హాయ్ హాయ్ చెప్పడానికే, రండి సార్ ఒక గంట సేపు జిమ్ కి వేడదాం అని ఎవరైనా అంటే మాత్రం రన్ అవుట్ లేదా రిటైర్డ్ హర్ట్.అది వేరే విషయం అనుకోండి.

మరి ప్రతి మనిషికీ ఒకో వెర్రి ఉంటుంది కదా. మరి నాకు వున్న వెర్రి, పాటలు పాడ్డం.ఇంతకు ముందు బాత్ రూమ్ కే పరిమితం అయిన నా కూనిరాగాలు ఇప్పుడు స్టేజి మీద పాడే స్టేజికీ వెళ్ళింది.ఏదో వీడికి వెర్రి అనుకున్న చుట్టు పక్కల జనాలూ భరించేస్తూన్నారు, ఎవరూ చూడకుండా చెవుల్లో దూది పెట్టుకుని మరీ. ఇక నా మేక్ ఓవర్ కానప్పుడు చక్కని భక్తి గీతాలు, మంచి ఘంటసాల మాస్టారి పాటలు పాడుతూవుండేవాడ్ని. మేక్ ఓవర్ అయ్యాక వచ్చింది మార్పు నేను పాడే పాటల్లో కూడా. మెగాస్టార్ లు, విక్టరీ లు, నటసింహ లు, యువ సామ్రాట్ లు, అరవై నిండాక కూడా చక్కగా  సెవెన్టి ఎం.ఎం తెర మీద గెంతులు వేయడం చూసిన నాకు, వాళ్ళు యాక్ట్ చేస్తే లేంది, నేను వాళ్ళ పాటలు పాడితే తప్పా అనిపించి,  నా ఫేవరెట్ స్టార్  సుప్రీం హీరో మెగాస్టార్ నటించిన సినిమా లో ఒక పాటలు పాడడం మొదలెట్టా. అదండి నా మేక్ ఓవర్ భాగోతం.నా వెర్రి తొండ ముదిరి ఉసరవెల్లి అయింది.అందుకే ఇక్కడి తో పుల్ స్టాప్ పెడుతున్నా..

ఇక చూస్తూ చూస్తూనే మాస్టారు చెప్పిన నెల రోజులైంది. అసలు ఏదో వొంక పెట్టి మా ఊరు వెళ్లడం నాకు అలవాటే. ఈసారి మాస్టారిని కలిసిరావాలి అనే పని పెట్టుకుని, శేషాద్రి ఎక్సప్రెస్ లో రాజమండ్రి బయలుదేరాను. మర్నాడు పొద్దున్నే మాస్టారి ఇంటికి వెళ్లి, తలుపు తట్టాను మాస్టారు అంటూ. తలుపులు ఓపెన్ చేసిన అయన, నన్ను చూసి, ఎవరు బాబూ నువ్వు, ఎం కావాలి అని అడిగాడు. ఏంటి ఇది ఒక నెల రోజుల్లోనే మాస్టారి మైండ్ కి ఏమైపోయింది అనుకుంటూ, నేను మాస్టారు మీ శిష్యుడు సుబ్బారావు ని అని అరిచాను, ఒక వేళ చెవిక్కూడా ప్రాబ్లెమ్ వచ్చిండేమేనన్న సంశయం తో.  ఓహో నువ్వా సుబ్బారావు ఏంటి ఇలా తయారైపోయావ్.. కాలేజీ కుర్రాడి లా, రా లోపలికి అంటూ ఆహ్వానించాడు.

యధా ప్రకారం మాస్టారు ఇచ్చిన కాఫీ తాగి, అప్పుడు చెప్పా, మాస్టారూ మీరు చెప్పినట్లే ఫుల్లు మేక్ ఓవర్ చేసుకుని వచ్చా, ఇది సరిపోతుందా, లేకపోతే ఇప్పుడు కుర్రాళ్లు చేసుకుంటున్నట్లు మన దానవాయిపేట్ సెంటర్ లో వున్న  అప్పారావు సెలూన్  కి  వెళ్లి నా జుట్టు స్ట్రెయిట్ గా మేకుల్లా స్టిఫ్ చేయుంచుకోవాలా అని. నాకేసి జాలి గా చూస్తూ ఒక నవ్వు నవ్వారు మాస్టారు ఒక వేదాంతి లాగా. సుబ్బారావు నేను చెప్పిన మేక్ ఓవర్ అంటే నీకు సరిగ్గా అర్థం కాలేదయ్యా. నా దృష్టిలో మేక్ ఓవర్ అంటే మెంటల్ మేక్ ఓవర్, అంటే వస్తున్న వయస్సు కనుగుణంగా, నీలో  ఒక పాజిటివ్ ఆలోచనా ధోరణి అలవాటు చేసుకోవడం, కుటుంబ సభ్యుల తోనూ ఇతరుల తోను ఎలా మసలుకోవాలి, అహంకారం, ఈర్ష్య, అసూయ, ద్వేషం, ఇతరుల్ని చూసి కంపేర్ చేసుకోవడం, లాంటి విషయాల్లో, నీకు నువ్వు చేసుకోవలసిన మార్పులు చేర్పులు కూర్పులు. ఇదే సుబ్బారావు నేను చెప్పిన మేక్ ఓవర్. మరి నువ్వు నీ శరీరానికి మేక్ ఓవర్ అనుకుంటూ నానా అవస్థలు పడ్డావ్. వయసు, అది తెచ్చే మార్పుల్ని నాచురల్ గా తీసుకొని, ఒక విధమైన వైరాగ్యభావం తో మెలిగారు  మన పెద్దవాళ్ళు. అందుకేనేమో సమాజం లో ఎంతో గౌరవం, ఒక ప్రతిష్ట ఉండేవి ఆ తరం వాళ్ళకి. ఎక్కడా తనకి అవసరం లేని చోట్ల ఎక్కువగా మాట్లాడేవారు కాదు, కలగచేసుకోనే వారూ కాదు. తమకి తామే దూరం మెయింటైన్ చేసుకుంటూ తమ పెద్దరికం కాపాడుకునే వారు.

మరి ఈనాటి తరం, అంటే మన తరం మారిపోయామ్ అవసరానికి మించి మరీ అనిపిస్తుంది ఆలోచిస్తే.  న్యూక్లియర్ ఫామిలీ వ్యవస్థ లో వున్న అతి పెద్ద నెగటివ్ పాయింట్ ఇంట్లో ఉండేది ముగ్గురే. పిల్లలికి తల్లీ తండ్రి తప్ప తమ ఫీలింగ్స్ షేర్ చేసుకోవడానికి అమ్మమ్మ తాతయ్య ఎవరూ వుండరు. అలాగే తల్లితండ్రులకి, తనకి వున్న ఒకరో ఇద్దరో పిల్లల తో విపరీతమైన అటాచ్ మెంట్ ఉండడం ఒకటి. అది పిల్లలకి ఒక వయసు వచ్చేదాకా పరవాలేదు. కానీ పిల్లల కి పెళ్లిళ్లు అయి వాళ్ళ సంసారాలు వాళ్ళు ఆనందం గా గడుపుతున్నపుడు,పెద్దవాళ్ళు  తెలిసో, తెలియకో పిల్లల వ్యక్తిగత జీవితాల్లో కనుక వేలు పెట్టడం జరిగితే, అప్పుడు మొదలవుతుంది తమ  వ్యక్తిగత జీవితాల్లో వీళ్ళెందుకు జోక్యం చేసుకోవాలంటూ. కొన్ని ఇళ్లల్లో చూసాను, కొడుకే అన్న చనువు తొ తల్లి, ఒరేయ్ నీ ఆఫీస్ టైం అయింది ఇంకా లేవలేదు, లే అంటూ తలుపు తట్టడం, లేదా వాళ్ళ వ్యక్తిగత విషయాల్లో జోక్యం చేసుకోవడం లాంటివి. తప్పనిసరిగా పిల్లలకి అనిపిస్తుంది, ఈ పెద్దవాళ్ళు తమ వ్యక్తిగత జీవితం లోకి ప్రవేశిస్తున్నారని. ఇక మొదలు రవాణా కాష్టం రాజుకోవడం.  ఒకప్పటి వుమ్మడి కుటుంబ వ్యవస్థ అంతరించిపోయింది అంటే, వేలు మనవైపే చూపిస్తుంది.

పిల్లలు పెద్దవాళ్ళు అయి పెళ్లిళ్లు అయినా, వాళ్ళ వ్యక్తిగత విషయాల్లో జోక్యం చేసుకోవడం, ఉచిత సలహాలు ఇవ్వడం,  ఇవన్నీ నేటి యువతరానికి నచ్చక, మనకి నచ్చచెప్పలేక, పాపం వాళ్లే తమ దారి మార్చుకుని, దూర ప్రాంతాలకి వెళ్లి పోతున్నారు.  మేక్ ఓవర్ అంటే మన అప్పీరెన్స్  కి మేక్ ఓవర్ చేసుకోవడం కాదు. మానసికంగా మేక్ ఓవర్ చేసుకోవడం, వయసు కి తగిన పరిణితి సాధించడం, హుందా గా ప్రవర్తించడం, చుట్టుపక్కల వాళ్ళు, మన పిల్లలు, మన వయసు ని చూసి కాకుండా, మన ప్రవర్తన చూసి మనల్ని  గౌరవించడం. అదీ అసలైన మేక్ ఓవర్ అంటే. దీనిలో భాగమే మన రిలేషన్ షిప్స్ లో ఆన్ వాంటెడ్, ఆన్ సోలిసిటెడ్, ఆన్ ఇన్వైటెడ్ గా  సలహాలు ఇవ్వడం,  ఇంటర్ ఫియరెన్సు అవడం మానేస్తే,  ఆటోమేటిక్ గా నేడు మనం చూస్తున్న  చాలా సమస్యలు పరిస్కారం అయిపోతాయి. పెద్దవాళ్ళు గా మనమే మారాలి. అందుకే నాకు ఈ మధ్య ఒక ఐడియా వచ్చింది, మన చిన్నతనం లో చదువుకున్న వెంకట్రామా అండ్ కో పెద్ద బాలశిక్ష,  అరవై దాటాక  మనం ఇంకోసారి చదవాలేమో అని. అందుకే ఏమో పెట్టారు దానికి పేరు పెద్ద బాల శిక్ష గా. అది చదివితే కొంత అయినా మార్పు వస్తుంది మనలో, అంటూ తన సుదీర్ఘ ఉపదేశాన్ని ముగించాడు. మాస్టారూ  నాకు సరైన క్లారిటీ ఇచ్చారు.. పెద్దవాళ్ళు, పెద్దరికం అనే విషయాల మీద, మీకు చాలా కృతజ్ఞతలు అంటూ నమస్కారం పెట్టి బయటికి వచ్చాను.

ఇప్పుడు నా మనసు చాలా హయ్ గా ఉంది.ఒక శిష్యుడికి భగవంతుడు ప్రత్యక్షమై హితబోధ చేసినట్లు, నాకు ముందున్న మార్గం చాలా క్లియర్ గా కనపడుతోంది ఇప్పుడు.

ప్రస్తుతం సమాజం లో చాలా కుటుంబాల్లో పెద్దవాళ్ళకి అంటే మన తరానికి, పిల్లలకి అంటే యువతరానికి మధ్య, జనరేషన్ గ్యాప్ మూలం గానో, కమ్యూనికేషన్ గ్యాప్ మూలం గానో, అభిప్రాయభేదాలు రావడం, అది అనవసరపు అశాంతి కి దారి తీయడం చూస్తూనే వున్నాం.    పెద్ద మనుషులు గా మనమే ఒకింత తగ్గి, నేను చెప్పినట్లు ఆన్ ఇన్వైటెడ్, ఆన్ సోలిసిటెడ్, ఆన్ వాంటెడ్ విషయాలో ఇన్వొల్వ్  కాకుండా, మన డొమైన్ లో మనం వుంటే బహుశా, మన జీవితం లోని ఆఖరి అంకం ఆనందంగా ముగించేయచ్చేమో.మన చక్కని పాజిటివ్ ఆరోగ్యకరమైన ఆలోచనలే మనకి మానసిక ప్రశాంతత ఇస్తాయేమో, మన మాస్టారు చెప్పినట్టు.

మరిన్ని కథలు

asirayya
అసిరయ్య
- భవ్య
robbery
దోపిడి
- పద్మావతి దివాకర్ల
lesson by champions
గుణపాఠం నేర్పిన ఛాంపియన్లు
- సరికొండ శ్రీనివాసరాజు
cow kid
లేగ దూడ
- వినయ్ కుమార్ కొట్టే
valentines day story
ప్రేమికుల రోజు
- కాంతి శేఖర్. శలాక
she like pearl social story
కడిగిన ముత్యం
- లత పాలగుమ్మి
the solution
పరిష్కారమార్గం
- కందర్ప మూర్తి