ఈశ్వరి,రఘురాంలు ఆదర్శ దంపతులుగా వారి బంధువుల్లో పేరుపడ్డారు. చాలా కుటుంబాలలో భార్యా, భర్తల్లో భార్యలకు ఎక్కువగా పూజలు,వ్రతాలు,నోములు ఇవి తప్పని సరి.భర్తలు మధ్యస్తంగా ఉంటూ ఉంటారు.కానీ ఆశ్చర్యంగా వీరి కుటుంబంలో ఇరువురికీ భక్తి భావాలు ఎక్కువ. దేవాలయాలలో సెలవు రోజుల్లోనూ,పండుగ దినాలలోనూ స్వయంగా ప్రసాదం చేసుకుని గుడికి వచ్చిన వారందరికీ దేవునికి పూజానంతరం ఆ ప్రసాదాన్ని పంచిపెట్టడం ఒక దైవకార్యంగా నిర్వహిస్తూ ఉంటారు.గుడి దగ్గర కొచ్చే యాచకులకు అరటిపళ్ళు,పులిహోర పొట్లాలు,మంచినీళ్ళ ప్యాకెట్లతో పాటు చాలా సార్లు అక్కడున్న వారందరికీ ఎంతో కొంత నగదును సమానంగా ఇచ్చేవారు.
భార్యా, భర్తలు పెళ్ళైన కొత్తల్లో దేవాలయాల చుట్టూ తిరగడం సర్వసాధారణం .దానికి అనేక కారణాలు ఉండొచ్చు. కానీ ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం అంటే ఈశ్వరి, రఘురాంలకు పుట్టిన కూతురు శ్రావణి అన్న ప్రసన నాడే అమ్మవారి వెండి విగ్రహాన్ని ముట్టుకోవడం ఆ దంపతులకు విస్మయం కలిగించింది.రానూ రానూ ఆ దంపతులు గుళ్లకు వెళ్తున్నప్పుడల్లా శ్రావణి అర్చకులు చదువుతున్న మంత్రాలను తదేకంగా వింటూ ఉండేది.పాప చేతిలో ప్రసాదంగా పెట్టిన అరటిపండు , చెక్కరపొంగలి,పులిహార లాంటి పదార్థాలను తల్లి తండ్రుల వెనకాల బుడిబుడి నడకలు నడుస్తూ వెళ్ళి, గుడి దగ్గర కూర్చున్న యాచకుల చేతిలో పెడుతూ ఉంటే తల్లితండ్రులు పొరపాటున కూడా వారించక ఆ పిల్లకు బాల్యంలోనే వంటబట్టిన దాతృత్వ ,భక్తి భావాలను చూస్తూ,గమనిస్తూ గర్వంగా భావించేవారు.
ఆ రోజు ఆదివారం అవడం,ఒక ప్రత్యేక భజన కార్యక్రమంలో పాల్గొని బయటకు వస్తున్న రఘురాం దంపతులకు గుడి ప్రాంగణంలో ఒక డబ్బై ఏళ్ల వయసు గల ముదుసలి గుడి ద్వారబంధం పక్కన ఉన్న సిమెంట్ బెంచీమీద నీరసంగా పడుకుని ఉండటం గమనించారు.
ఈలోపు శ్రావణి తల్లి చేతిలో ఉన్న అరటి పళ్ల ప్రసాదాన్ని అడిగి తీసుకుని, ఆ ముదుసలి అవ్వ దగ్గరకు పరిగెత్తుకుంటూ వెళ్లి ఆమెను లేపి ఆమెకు అందించింది.భగభగ మంటున్న ఎండలో ఒళ్లంతా కాలిపోతున్నా, నిస్సహాయంగా పడి ఉన్న ఆమెకు చేతిలో ప్రసాదంతో దర్శనమిచ్చిన బాల దేవతను చూడగానే శరీరం అంతా పులకించిపోయి ,ఆనందంగా ఆ పిల్లను దగ్గరికి తీసుకుని ,ఆ చిట్టిపాప ఇచ్చిన ప్రసాదాన్ని ఆతృతగా అందుకుని తినడం మొదలుపెట్టింది.
సహృదయం మూర్తీభవించిన ఈశ్వరి దంపతులు అంతటితో తమ పని అయిపోయింది అని భావించక ఆ ముదుసలి గురించి తెలుసుకోవడానికి చేసిన ప్రయత్నంలో ఆమెను కొంతకాలం క్రితం పిల్లలు ఇంటినుండి తరిమివేసినట్టు అర్థమయ్యింది. అప్పటినుండి వాళ్ళ అరుగుల మీద, వీళ్ళ అరుగుల మీద కాలక్షేపం చేస్తోంది.
ఇదంతా అర్థమయి ,అర్థమవక కళ్ళు ఆర్పి గమనిస్తున్న శ్రావణి, తల్లి తండ్రులను ఆ అవ్వను తమతో తీసుకు వెళదామని పట్టుబట్టింది.
శ్రావణిని దైవస్వరూపంగా భావించే ఈశ్వరి,రఘురామ్ లు వెంటనే ఇంకా ఏమీ ఆలోచించకుండా బయటనుండి రిక్షాని పిలిచి ఆ ముదుసలిని అందులో కూర్చోబెట్టారు.
ఆ ముసలావిడకు తనని ఎక్కడకు తీసు కెళ్తున్నారో అర్ధం కావడం లేదు.ఆమె మెదడు ఆలోచనాశక్తిని కోల్పోయింది.
ఎన్ని రోజులు స్నాన సంస్కారాలు లేకుండా ఉందో ఆవిడ. ఈశ్వరి ఆవిడకు వేడి నీళ్ళ స్నానం చేయించి ఉతికిన బట్టలు కట్టుకోమని ఇచ్చింది.తను ఎక్కడున్నానో తెలియని పరిస్థితి ఆమెది. నీరసంగా గోడకు జార్లగిల్లబడి కళ్ళు మూసుకుంది. ఒక గంట తర్వాత ఆమెకు భోజనం అవీ పెట్టాక కొద్దిగా ఓపిక వచ్చిన తర్వాత ఆమె ఎక్కడ ఉంటుందో ఆ వివరాలు అడిగాడు రఘురాం. ఆమె పెదవులు అదురుతున్నాయి. అప్రయత్నంగా ఆమె కళ్ళల్లో నీళ్ళు ఉబికాయి. అది చూసి చలించి పోయాడు.ఎంతోబలవంతం చేస్తే కానీ ఆవిడ తను ఎక్కడనుండి వచ్చిందో చెప్పలేదు.ఆమెలో తన్నుకు వస్తున్న ఏడుపును బలవంతాన ఆపుకుంది. ఆమె గురించి తెలుసుకోవాలన్న ఆరాటం అతనిలో ఎక్కువయ్యింది. ఆమెను ఓదార్చే ప్రయత్నం చేసాక చివరకు ఆమె చెప్పిన వివరాలను బట్టి ఆ ఇంటికి వెళ్ళాక , అతను గ్రహించింది ఏమిటంటే ఆమె కొడుకు,కోడలు ఆవిడకి తిండిపెట్టలేక బయటకు పంపించేశారని తెలిసి అతను షాక్ తిన్నాడు. మనస్సు అంతా వేదనతో నిండిపోయింది. సమాజం ముసలి తల్లి తండ్రుల విషయంలో ఎంత కర్కశంగా ప్రవర్తిస్తూ ఉందో తెలుసుకున్నాడు. ఇలా వృద్దులంతా వ్యర్దులుగా భావించే ఈ లోకంలో ఉన్నందుకు అతనికి సిగ్గుగా అనిపించింది.
ఇంకా వాళ్ళతో ఏమీ వాదించక నేరుగా ఇంటికొచ్చి శ్రావణితో " తల్లీ ఈ కొత్త బామ్మ మనింట్లోనే ఎప్పటికీ ఉండిపోతుంది. ..నీ కోరిక తీరింది కదూ ! " అన్నాడు ప్రేమగా చూస్తూ. చిన్నారి శ్రావణి మొహం కలువపువ్వులా వికసించింది.
“అమ్మా ! నువ్వు చెప్పిన వివరాలు బట్టి నేను మీ ఇంటికి వెళ్లాను. వాళ్ళ ఆర్ధిక పరిస్థితి బాగున్నట్టు నాకు అనిపించలేదు. అంతమాత్రం చేత కన్నతల్లిని ఇంట్లోంచి తరిమివేయ్యడం చాలా అన్యాయం అనిపిస్తోంది. కారణాలు ఏవైనా కానీ జరగరానిది జరిగింది. అంత మాత్రం చేత నువ్వు నీ మనసును బాధపెట్టుకోకు. నువ్వు రావలసిన చోటుకే వచ్చావని నేను అనుకుంటున్నాను. మాకు కూడా ఇంట్లో పెద్ద దిక్కు అంటూ ఎవరూ లేరు. నేను నిన్ను నా తల్లిగా భావిస్తాను. నా కూతురు ఆలనా పాలనా చూసుకుంటూ మా ఇంట్లోనే నిన్ను ఉండిపొమ్మని కోరుకుంటున్నాను. నీ కొడుకు , కోడలు మనసు మారి ఎప్పుడైనా నిన్ను చూడాలనుకుంటే ఇక్కడికే వచ్చి చూస్తారు. నువ్వు చాలా నీరసంగా ఉన్నావు. ఓపిక రావడానికి మందులు తెచ్చి ఇస్తాను.ఇది ఏనాటి బంధమో నాకు తెలియదు కానీ నువ్వు మా కోసం ఇక్కడే ఉండిపో ...” అంటూంటే అతని గొంతు గాద్గదికం అయ్యింది.
" అవునండీ. ఇలాంటి వారిని ఆదుకున్నప్పుడే భగవంతుడు మన పట్ల అనుగ్రహం ప్రసరిస్తాడు.ఈ రోజు మన చిట్టి శ్రావణి ఈ బామ్మ గారి దగ్గరకు వెళ్ళి ప్రసాదం ఇచ్చి ఉండకపోతే పిల్లలు ఉన్నా లేని ఒక అనాథను ఆదుకునే
అదృష్టం మనకు కలిగేది కాదు " అంది ఈశ్వరి ఆనందంగా. అలా అంటూ ఉంటే అప్రయత్నంగా ఆమె కళ్ళల్లో నీళ్ళు చిప్పిల్లాయి.
" అవును ఈశ్వరి! "మానవ సేవే మాధవ సేవ " అన్నారు .అటువంటి అవకాశాలు కోసం మనం అన్వేషించాలి. మన ఆస్తులు , డబ్బు ఇవన్నీ మనం కష్టపడి సంపాదించుకుంటున్నాం అనే భ్రమలో ప్రతి వారూ కొట్టుకుపోతున్నారు. అవన్నీ భగవంతుడు ఇచ్చినవే. ఆయన తరపున మనం అవసరార్ధులకు, అన్నార్తులకు సేవచేస్తే మనం ఆశించక పోయినా ఆ భగవంతుడు వడ్డీతో సహా కూడా ఇచ్చి వేస్తాడు " అని అంటూంటే మరో పక్క చిన్నారి శ్రావణి అప్పటికే కొత్తగా వచ్చిన బామ్మ గారితో కబుర్లు చెపుతూ ఉండటం చూసి ఆ దంపతులు విచిత్రమైన భావోద్వేగంతో ఉక్కిరిబిక్కిరి అయ్యారు. * **
సమాప్తం

