అది ములుగు పోలీసు స్టేషన్.
అప్పుడే వచ్చిన నరహరి ఎస్సై కుర్చీలో కూర్చోని.. మోచేతులు ముందు టేబుల్ పై ఆన్చాడు. అలసి పోయినట్టుగా.. భారమనిపిస్తున్న తలను రెండు చేతి వేళ్ళతో సుతారముగా పట్టుకున్నాడు. తన తండ్రి ఎంతగా చెప్పినా వినకుండా.. ఈ పోలీసు ఉద్యోగంలో చేరడం తన తప్పిదనానికి మొదటిసారిగా పశ్చాత్తాప పడసాగాడు.
‘నిజమే.. నా మనస్తత్వాన్ని అవగగాహన చేసుకున్న నాన్న పోలీసు ఉద్యోగం నీకు సరిపడదురా.. వద్దు!.. వద్దు!!.. అని నెత్తీ నోరు బాదుకున్నాడు. నేనే.. నా మొండి తనంతో దేశ రక్షణలో సైనికునికి ఎంత బాధ్యత ఉందో! ప్రజా రక్షణలో పోలీసుకూ అంటే బాధ్యత ఉంది. ప్రజలకు అండగా ఉండి, రౌడీ మూకలను చీల్చి చెండాడాలని కలలు కన్నాను. కాని వాస్తవంగా జరుగుతుందేమిటి?.. రాజకీయనాయకుల జోక్యంతో తనకు బదిలీ మీద బదిలీలే తప్ప నిర్దోషులైన ప్రజలను రక్షించే అవకాశమే లేకుండా పోతోంది. దాని ఫలితమే ఈ మారుమూల ములుగు చూడాల్సి వచ్చింది. ప్రజల్లో చైతన్యం తీసుకు రావాలి..’ అని మనసు పరి, పరి విధాల పరితపిస్తూ, నిట్టూర్పు విడుస్తుంటే.. ముందున్న ఫోన్ మ్రోగింది. దాంతో అతని సహజ సిద్ధమైన చురుకుదనం చటుక్కున ఫోనెత్తాలా చేసింది.
అవతల వ్యక్తి ‘హలో.. పోలీసు స్టేషనా!’ గాబరాగా అడగడం విని..
“ఔను.. పోలీసు స్టేషనే. నేను ఎస్సైని మాట్లాడుతున్నాను” అన్నాడు నరహరి. భయపడకు.. విషయం ఏంటో చెప్పమన్నట్టు.
“సార్ నేను గట్టమ్మపల్లె గట్టు మీద నుండి మాట్లాడుతున్నాను. ఇక్కడ పొదల్లో ఒక చిన్న పాప శవం ఉంది”
భయంతో అతని మాటలు తడబడుతున్నాయని పసిగట్టిన నరహరి మరేవీ వివరాలు అడక్కుండా..
“నేను బయలుదేరుతున్నాను. వచ్చే వరకు అక్కడే ఉండు” అంటూ జాగ్రత్తలు చెప్పాడు.
గబ, గబా బయటకు వచ్చి జీపు డ్రైవర్ ను పురమాయించాడు. మరో కానిస్టేబుల్ ను తీసుకొని జీపులో బయలు దేరాడు. దారిలో కేసుకు సంబంధించిన శాఖాసహాయకారులకు ఫోన్లు చేసాడు. ములుగు పోలీసు స్టేషన్ నుండి గట్టమ్మపల్లె దాదాపు మూడు కిలో మీటర్ల దూర ముంటుంది. రోడ్డు మీద పెద్దగా రద్దీ ఏమీ లేదు. ఐదు నిముషాలలో పల్లె చేరుకున్నారు. బస్ స్టాప్ ప్రక్కన జీపు ఆపి గట్టు మీదకు దారి తీసాడు జీపు డ్రైవర్. నరహరి, కానిస్టేబుల్ అతన్ని అనుసరించారు. వారిని దూరంగా చూస్తూనే.. పరుగెత్తుకుంటూ వచ్చాడు శవాన్ని చూసిన ఆసామి.
“నీ పేరు? ఎందుకు ఇటు వచ్చావు? ఎలా చూసావు శవాన్ని?” అంటూ ప్రశ్నల వర్షం కురిపించాడు నరహరి.
“సార్ నా పేరు నారాయణ. గట్టమ్మపల్లెలో ఉంటాను. గొర్ల కాపరిని. గొర్లను మేపుకుంటూ గట్టు మీదకు వచ్చాను. పొదలో ఇరుక్కున్న ఒక గొర్రెను బయటకు లాగుతుంటే ఈతచాప చిరిగి పాప శవం బయట పడ్డది. వెంటనే మీకు ఫోను చేసాను” అరచేతులు రెండూ నలుపుకుంటూ.. వినయంగా వివరించాడు.
“మీ ఊరి సర్పంచికి ఫోన్ చేసి మరో నలుగురు పెద్ద మనుషులను తీసుకొని రమ్మని ఫోన్ చేయి నారాయణా” అని ఆదేశించాడు నరహరి.
“సార్ సర్పంచికి ఫోన్ చేసాను. అతని సలహా ప్రకారమే మీకూ ఫోన్ చేసాను. బహుశః వస్తుంటారు” అంటూండగానే.. అల్లంత దూరంలో ఐదారుగురు మనుషులు రావడం కనబడింది.
“అదుగో సార్. సర్పంచ్ సదానందం వస్తున్నాడు” అంటూ అటువైపు వేలెత్తి చూపాడు నారాయణ. మరో మార్గం నుండి శవం ఫోటోలు తీయడానికి ఫోటో గ్రాఫర్, వేలిముద్రల నిపుణుడు రావడంతో నరహరి అడుగుల్లో వేగం పెరిగింది.
అంతా కలిసి పొదల్లో ఉన్న శవం దగ్గరికి చేరుకున్నారు.
నరహరి సూచనలతో సదానంద తన సహాయకారికి ఇషారా చేసాడు. అతను నెమ్మదిగా చెట్ల గుబురులో ఉన్న చిరిగి పోయిన ఈతచాపను బయటకు లాగాడు. మరీ లోతుగా పాతిపెట్టక పోవడం.. సులభంగానే బయటకు వచ్చింది. మరో ప్రక్క ఫోటో గ్రాఫర్ ఫోటోలు తీయడంలో మునిగి పోయాడు. వేలి ముద్రల నిపుణుడు సరే సరి. ఆధారాలను పసిగడుతూ సేకరించసాగాడు. పాప శవం పూర్తిగా బయట పడే సరికి..
“సార్ ఈ అమ్మాయి కళావతి కూతురు ప్రమీల. నిన్న రాత్రి నుండి కనిపించడం లేదని వెతుకుతోంది. ఈరోజు పోలీసు స్టేషన్ల ఫిర్యాదు చేద్దామంది” అని సదానందం అనగానే..శవం ఆచూకి దొరికినందుకు నరహరి పెదవులు విచ్చుకున్నాయి. కాని వెంటనే మరో ముఖ్యమైన ప్రశ్న ఉద్భవించింది. ‘ఇంత చిన్న పాప దాదాపు ఐదు సంవత్సరాలు ఉంటాయేమో!. ఎవరు హత్య చేసి ఉంటారు?’ మస్తిష్కం ముడి పడింది. కళావతిని రమ్మని ఫోన్ చేయుమని సదానందానికి చెప్పి.. ములుగు ప్రభుత్వ దవాఖాన అంబులెన్స్ కోసం ఫోన్ చేసాడు నరహరి.
ఫోటో గ్రాఫర్, వేలిముద్ర నిపుణులు తమ, తమ పనుల్లో మునిగి పోయారు. ఆధారాలు సేకరించారు. పాప గొంతు నులిమి హత్య చేసినట్టుగా ప్రాథమికంగా నిర్థారణకు రాగానే వారిలో చర్చ మొదలయ్యింది.
“కళావతికి ఎందరు పిల్లలు? ఆమె భర్త ఏం చేస్తాడు?” అంటూ ఆరా తీసాడు నరహరి.
“ఆమె భర్త గత సంవత్సరమే చనిపోయాడు సార్. నా అన్న వాళ్ళు ఎవరూ లేరు. ఈ అమ్మాయి ఒక్కర్తే ఆమెకు” అంటూ క్లుప్తంగా చెప్పాడు సదానందం.
“ఆమె భర్త ఎలా చనిపోయాడు?” అని మరిన్ని వివరాలు అడుగుతూ.. ప్రక్కనే నిలబడ్డ కానిస్టేబుల్ వంక చూసాడు నరహరి. అతని చూపులను అర్థం చేసుకున్న కానిస్టేబుల్.. రికార్డు చేయసాగాడు.
మరో పదినిముషాలలో.. కళావతి గుండెలు బాదుకుంటూ రావడం.. వాతావరణమంతా గంభీరంగా మారిపోయింది. ప్రమీల శవాన్ని తాకకుండా అడ్డుకున్నాడు కానిస్టేబుల్.
“చూడమ్మా.. శవాన్ని పోస్ట్ మార్టం చేసాక నీకు అప్పగిస్తాం. అంత వరకు నువ్వు ముట్టుకోవద్దు” అని హెచ్చరించాడు. “రేపొకసారి పోలీసు స్టేషన్ కు వచ్చి నీకు ఎవరిమీదైనా అనుమానముంటే రిపోర్ట్ ఇవ్వు. ఇంతలో పంచనామా రిపోర్ట్స్ గూడా వస్తాయి” అంటూ శవ పంచనామా పనిలో మునిగాడు నరహరి. పనికి ఆటంకం కలుగ కుండా కళావతిని కాస్త దూరంగా తీసుకు వెళ్ళాడు ఫోటో గ్రాఫర్.
పంచనామా పూర్తీ కావడంతో నరహరి సూచనల మేరకు సర్పంచ్ సహాయకారుడు నరహరి సలహా అడిగి తన భుజంమ్మీద ఉన్న కండువాను శవం మీద కప్పాడు. శవాన్ని రెండు చేతుల్లోకి తీసుకొని.. రోడ్డు మీద వేచి ఉన్న అంబులెన్స్ వైపు దారి తీసాడు. అతని వెనుకాలే కళావతి ఆకాశం వంక దీనంగా చూస్తూ, ఏడ్చుకుంటూ అనుసరించింది. నరహరి ఆలోచనలన్నీ కేసు మీదనే లగ్నమై, ఆలోచనలతో సతమత మవుతూ.. తన బృందంతో గట్టు కిందకు బయలుదేరాడు.
పాపశవాన్ని, కళావతిని, సర్పంచ్ సహాయకుణ్ణి ఇంకా కానిస్టేబుల్ ను తీసుకొని అంబులెన్స్ హాస్పిటల్ కు బయలుదేరింది. దాని వెనుకాలే నరహరి తన బృందంతో జీపులో అనుసరించారు.
శవం పోస్ట్ మార్టం కాగానే సర్పంచ్ సాక్ష్యంగా శవాన్ని కళావతికి అప్పగిస్తూ.. మరునాడు ఉదయం పది గంటలకు స్టేషన్ రావాలని గుర్తు చేసాడు నరహరి.
***
కళావతి మరునాడు ఉదయం సర్పంచ్ సదానందాన్ని తీసుకొని పోలీసు స్టేషన్ కు వచ్చింది.
“ఎస్సై గారు ఉన్నారు లోనికి వెళ్ళండి” అంటూ సెంట్రీ కానిస్టేబుల్ చేత్తో ఇషారా చేసాడు.
ఇరువురిని చూడగానే సదానందాన్ని కూర్చోమంటూ కుర్చీ చూపించాడు నరహరి.
“కళావతీ.. పోస్ట్ మార్టం రిపోర్ట్స్ వచ్చాయి. ప్రమీలను గత రాత్రి తెల్లవారుఝామున నాలుగు గంటల ప్రాంతంలో గొంతు నులిమి హత్య చేసినట్టు తేలింది. నీకు ఎవరిమీదనైనా అనుమానముందా?” అడిగాడు నరహరి. రిపోర్ట్స్ కాగితాలను సదానందానికి చూపిస్తూ..
“సార్ నిన్న సాయంత్రం నేను ప్రమీలను ములుగు బడి పార్కులో ఆడిస్తున్నాను. ఒకాయన ప్రమీల ఫోటో తీసాడు. నాకు అనుమానమేసి పోలీసులకు ఫోన్ చేసాను. కాసేపటికి ఒక పోలీసు వచ్చి పాప తల్లి అనుమతి లేకుండా ఫోటో తీయడం తప్పు కదా! అని అడిగితే.. ‘ఫోటో తీయడం నేరమా?’ అని పెడసరంగా సమాధానమిచ్చాడట. మీ పిల్లల ఫోటోలు తీసుకో ఎవరేమనరు.. కాని ఇతరుల పిల్లల ఫోటోలు తీయకూడదని మందలించి వదిలేసాడు. మీరు అడగండి సార్” అనుమానమంతా అతని మీదనే ఉన్నట్టు చెప్పింది కళావతి.
వెంటనే నరహరి కాలింగ్ బెల్ నొక్కి రైటర్ టు నాట్ టును ను పిలిచాడు. సామాన్యంగా పోలీసు స్టేషన్లో పోలీసులను వారి పేర్లతో గాకుండా వారికి కేటాయించిన నంబర్లతో పిలవడం కద్దు.
“టూ నాట్ టూ నిన్న మన వాళ్ళు ఏమైనా కంప్లైంట్ చేసారా!”
“అవును సార్. ఎవరో ఒకామె తన కూతురు ఫోటో తీస్తున్నారని ఫోన్ చేస్తే నేను మన త్రీ నాట్ త్రీని పంపాను. అతని పేరు, ఫోన్ నంబర్ రికార్డు చేసాం. పాప ఆడుకుంటుంటే సంభ్రపడి ఫోటో తీసానన్నాడట” అంటూ రికార్డు చూపించాడు రైటర్.
“ఫోన్ చేసింది ఈమెనే.. “అంటూ కళావతిని చూపించాడు నరహరి. “ఆ పాపను ఎవరో హత్య చేసారు” అంటూ రికార్డులోని అతని పేరు, ఫోన్ నంబరు నోట్ తన డైరీలో నోట్ చేసుకుంటూ.. “ఈమె వద్ద కంప్లైంట్ రాత పూర్వకంగా తీసుకో” అన్నాడు.
“ఇక మీరు వెళ్ళండి. నేను కనుక్కుంటాను” అంటూ సదానందం, కళావతి వంక చూసాడు నరహరి.
ఇరువురు రెండు చేతులా నమస్కరించి రైటర్ వెనుకాలే ఆఫీసులోకి వెళ్ళారు.
***
దాదాపు నెల రోజులు గడిచాయి.
కళావతి అప్పుడప్పుడు సదానందం దగ్గరకు వచ్చి తన బిడ్డ మరణానికి కారకులెవరో!.. పోలీసులు ఏమైనా చెప్పారా! అని ఆరా తీసేది. ఆమెను చూడగానే సదానందం మనసు నీరు కారి పోయేది. పాపం! ఒంటరిది.. ఉన్న ఒక్క బిడ్డనూ దేవుడు దూరం చేసాడని.. ఆమెకు ఏదైనా సాయం చేయాలని మనసు ఆరాట పడేది. పోలీసుల నుండి ఎలాంటి సమాచారం లేదని ఓదార్చి పంపేవాడు.
ఒక రోజు కళావతి ఆదుర్దాగా తన ఆఫీసుకు రావడం.. ప్రమీల హత్య గురించి ఏమైనా తెలిసిందేమోనని..
“విషయం ఏమైనా తెలిసిందా..!” అంటూ ఉత్సుకతతో అడిగాడు సదానందం.
“లేదు సార్. నాకు హన్మకొండలో అమ్మాయిల హాస్టల్లో వంట మనిషిగా నౌకరి వచ్చింది. వెళ్తున్నాని చెప్పడానికి వచ్చాను” అంటూ రెండు చేతులా దండం పెట్టింది.
“చాలా సంతోషం కళావతీ.. వెళ్లిరా..” అంటూ అభినందనలు తెలిపాడు. అక్కడ పిల్లలో తన బిడ్డను చూసుకుంటూ బాధను మర్చిపోతుందని సదానందం మనసు కాస్త నెమ్మది పడింది. జేబులో నుండి కొన్ని డబ్బులు తీసి ఇవ్వబోతుంటే..
“వద్దు సార్. నా వద్ద ఉన్నాయి” అంటూ సున్నితంగా తిరస్కరించింది కళావతి.
ఇంతలో ఏదో వ్యాను వచ్చిన శబ్ధం రావడంతో ఇరువురు బయటకు వచ్చారు..అది పోలీసు జీపు.
ప్రమీల విషయం ఏమైనా తెలిసిందేమోనని జీపు ముందరకు వడి, వడిగా అడుగులు వేసారు.
“సార్.. మిమ్మల్ని, కళావతిని తీసుకు రమ్మన్నాడు మా ఎస్సై” అంటూ జీపు ఎక్కమన్నట్టుగా చేత్తో సంజ్ఞ చేసాడు కానిస్టేబుల్. ‘అయితే విషయమంతా తేలిందన్నట్టే.!’ అని మనసులో అనుకుంటూ.. పద పోదామన్నట్టు కళావతిని చూసాడు సదానందం.
ఇరువురుని తీసుకొని జీపు వాయు వేగంగా పోలీసు స్టేషన్ కు బయలు దేరి స్టేషన్ ముందు వాలింది.
ఎస్సై వీరి కోసమే ఆదుర్దాగా చూస్తున్నట్టు గమనించిన సదానందం..
“సార్ ముందుగా మీకొక సంతోషకరమైన వార్త చెబుతాను. కళావతికి హన్మకొండలో బాలికల వసతి గృహంలో వంటమనిషిగా ఉద్యోగం వచ్చింది” అని చెబుతుంటే మధ్యలోనే అడ్డుకున్నాడు నరహరి.
“అంటే.. ఇక్కడి నుండి జంప్ అవుదామని ప్లాన్ వేసిందా!” ఠక్కున అన్నాడు.
ప్లాన్ అనే పదం సదానందాన్ని నివ్వెర పర్చింది.. కళావతి ముఖం దించుకోవడం మరింత కలవర పర్చింది.
“అదేంటి సార్.. ప్లాన్ అంటూ ఏదో కొత్తగా మాట్లాడుతున్నారు. కంప్లైంట్ ఇచ్చినా.. ఫోటో తీసిన వాణ్ని ఇంతవరకు పట్టుకోలేదు” అంటూ చిరు కోపం ప్రదర్శించాడు సదానందం.
“అటు చూడండి” అంటూ సెల్లో ఉన్న ఆసామిని చూపాడు నరహరి.
అతణ్ణి చూడగానే కళావతికి గుండె ఆగినంత పనయ్యింది. సదానందం ఆశ్చర్యపోయాడు. సెల్లో ఉన్నది ఎవరో
కాదు తనకు ఆత్మీయుడైన ములుగు కార్పొరేటర్ కాంతయ్య.
“సార్ అతడేనా ఫోటో తీసింది?” అంటూ ఆశ్చర్యంగా అడిగాడు సదానందం. కాదన్నట్టు కళావతి తల అడ్డంగా ఊపడం చూసి చిన్నగా నవ్వుతూ..
“మీరు లోపలి రండి.. పత్రికా విలేకర్లు కూడా వస్తున్నారు. వారి ముందే వివరంగా మాట్లాడుకుందాం ” అంటూ పత్రికా విలేకర్లను ఆహ్వానిస్తూ.. ఆఫీసు గది లోకి తీసుకు వెళ్ళాడు నరహరి.
కళావతిని తప్ప అందరినీ కూర్చోండని కుర్చీలు చూపించాడు రైటర్ టునాట్ టు. కార్యక్రమాన్నంతా వీడియో తీయడానికి కానిస్టేబుల్ టు నాట్ టును పురమాయించి తను రికార్డు చేయడానికి ఉద్యుక్తుడయ్యాడు.
నరహరి గొంతు సవరించుకొని.. “కళావతి కూతురు ప్రమీలను ములుగు బడి పార్కులో ఫోటో తీసిన వాడు నా బాల్యమిత్రుడు” అనగానే సదానందం, కళావతి ముఖాలు అదోరకంగా పెట్టారు ‘అందుకేనా వదిలేసింది’ అన్నట్టు. వారి ముఖ కవళికలను అర్థం చేసుకన్న నరహరి మనసులో చిన్నగా నవ్వుకుంటూ తిరిగి చెప్పసాగాడు.
“అతని పేరు సుధాకర్. మంచి రచయిత. ప్రస్తుతం హైదరాబాదులో ఉంటున్నాడు. బాల్యంలో తాను చదువుకున్న ములుగు బడి చూద్దామని ఆ రోజు వచ్చాడు. హెడ్ మాస్టర్ ను కలిసి తన తల్లి దండ్రుల పేరు మీద బీద విద్యార్థులకు స్కాలర్ షిప్ ఇవ్వడానికి నిర్ణయం చెప్పాడు. ఆ సాయంత్రం తిరిగి హైదరాబాదు వెళ్ళే సమయంలో పార్కులో పిల్లలు ఆడుకోవడం చూసి ముచ్చటపడి జ్ఞాపకార్థం ఫోటో తీస్తుంటే.. ప్రమీల అడ్డుగా రావడం కాకతాళీయంగా జరిగింది. దాన్ని గమనించిన కళావతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. అమ్మాయి ఫోటో కావాలని తీయలేదు. అయినా తప్పే కాని దాన్ని నేను నేరంగా పరిగణించడానికి ఆస్కారం లేదు” అనగానే..
“అయితే నేరస్తులెవరు? సార్” అంటూ ఆత్రుతగా ప్రశ్నించాడు సదానందం.
“ఆ విషయం కళావతి చెప్పాలి. నేను కేసు సాంతం పరిశోధన చేసాను. అందుకే ములుగు కార్పొరేటర్ కాంతయ్యను లోపలేసాను. పోలీసు ధోరణిలో అడిగే సరికి కాంతయ్య నాకు అంతా చెప్పాడు. ఇక చెప్పాల్సింది కళావతి”
అంటూ కళావతి వంక తీక్షణంగా చూసాడు నరహరి. కళావతి తల దించుకుంది.
“అదుగో సభ్య సమాజంలో తలదించుకునే పరిస్థితి తెచ్చుకున్నావు. నిజం చెప్పుతావా? లేక చెప్పించమంటావా?” అంటూ లాఠీ ఊపుతూ కన్నెర్ర చేసి చూసాడు నరహరి. “నిజం చెబితే శిక్ష తక్కువ పడేలా కేసు ఫైలు చేస్తాను” అంటూ ఎరవేసాడు.
“సార్.. నిజం చెబుతాను” అంటుంటే దుఃఖం కట్టలు తెంచుకొని వచ్చింది. కళావతి భోర్ మంది. కాసేపటికి తేరుకొని నోరు విప్పింది.
“సార్ మా ఆయన పోయాక కాంతయ్యనా మీద కన్నేశాడు. మాయ మాటలు చెబుతూ నన్ను లోబర్చున్నాడు. నన్ను వివాహం చేసుకోవాలని షరతు పెట్టాను. ప్రమీల అడ్డుగా ఉందని ఆమెను తొలగించుకుంటే వివాహం చేసుకుంటానని ప్రమాణం చేసాడు. సమయం కోసం వేచి చూడసాగాను. ఇంతలో ప్రమీల ఫోటో తీయడం నేరం అతని మీద మోపవచ్చని కాంతయ్యను ఉసికొల్పాను” అంటుంటే దుఃఖం ఆగడం లేదు. సదానందం ఆమె వంక నిశ్చేష్టుడై చూడసాగాడు.
“సరే.. సరే.. ఏడుపు ఆపు. టూ నాట్ టూ ఈమెను స్త్రీల లాకప్ లో వేసి కాంతయ్యను తీసుకొనిరా..” అంటూ పురమాయించాడు నరహరి.
“సర్పంచ్ సార్ చూసారా.. ఇంకా కళావతి అసలు స్వరూపం బయట పడలేదు. కాంతయ్య నుండి మరిన్ని వివరాలు రాబడుతాను” అంటూ విలేకర్ల వంక కేసు సాంతం తెలుస్తుంది అన్నట్టు చూసాడు.
కాంతయ్య పిల్లి కూనలా వచ్చి సర్పంచ్ వెనుకాల నిలబడ పోయాడు.. మీరే రక్షించాలి అన్నట్టు. నరహరి గదమాయించే సరికి గజ, గాజా వణుకుతూ.. పక్కకు నిలబడ్డాడు. సదానందం కళ్ళు ఎరుపెక్కాయి. ఉరిమి, ఉరిమి చూడసాగాడు.
“కాంతయ్యా.. కళావతి మీ ఇద్దరి రహస్యాన్ని కొంత వరకు చెప్పింది. మిగతాది నువ్వే చెప్పాలి. నిన్ను ఏ రాజకీయ నాయకులూ రక్షించ లేరు. మన సదానందంగారు ప్రజల మనిషి. ద్రోహులను సహించరు” అంటూ తన సిబ్బందిని అప్రమత్తం చేసాడు నరహరి. అలాగే సార్ అన్నట్టు వారి నుండి స్పందన రాగానే ఇక చెప్పు అన్నట్టు కాంతయ్య దిక్కు తిరిగి చూసాడు నరహరి.
“సార్.. నేను దేవుని మీద ప్రమాణం చేసి చెబుతున్నాను. కళావతి, నేను చిన్నప్పుదు ములుగు బడిలోనే పడవ తరగతి వరకు చదువుకున్నాం. నాతో బాగా చనువుగా మెదిలేది. నాకూ ఇష్టమే.. కాని పెళ్లి మరొకరితో కావడం.. నేను దూరమయ్యాను. విధి వక్రీకరించి తన భర్త కాలం చేసాక.. తన జీవితంలోకి ఆహ్వానించింది. నేనంటే తనకు చాలా ఇష్టమని పెళ్లి చేసుకుందామని.. నేను లేకుంటే బతకనని ఏడ్చేది. అయితే ప్రమీలను ఎవరికైనా దత్తత ఇద్దాం. తరువాతనే పెళ్లి చేసుకుంటానని వాగ్దానం చేసాను. కాని ఇలా అర్థాంతరంగా అమ్మాయి ప్రాణాలు తీస్తుందని ఊహించలేదు” అంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు కాంతయ్య.
ఉన్నఫళంగా నోరు తెరిచారంతా..
“అవును.. కాంతయ్య చెప్పిందంతా వాస్తవం. ఫోటో తీసాడనే నెపంతో కథలల్లి బిడ్డను పొట్టన పెట్టుకున్న రాక్షసి కళావతి. కావాల్సిన ఆధారాలు, వేలి ముద్రలు లభ్యమయ్యాకనే.. నేను ఈ మీటింగ్ ఏర్పాటు చేసాను. ఇక కేసు నమోదు చేసి కోర్టులో అప్పగించడమే..” అంటూ అందరివంకా కలియ చూసాడు నరహరి.*

