సింహపురిని సింహబలుడు అనే రాజు పాలించేవాడు. తన పాలనలో శతృరాజ్యాల నుంచి రక్షణకు సింహపురి రాజ్యం చుట్టూ శతృదుర్బేధ్యమైన ఎత్తయిన ప్రాకారాన్ని నిర్మించాడు. ఎవరైనా తన రాజ్యంపై యుద్ధానికి వస్తే తన యుద్ధ నైపుణ్యతను ప్రదర్శించి తరమికొట్టి సింహస్వప్నంలా నిలిచేవాడు. దీంతో సింహపురి ప్రజలు ఏ సమస్యా లేకుండా ప్రశాంతంగా నిద్రించేవారు.
సింహబలుడు సైతం తన శక్తి సామర్థ్యాలను పరీక్షించుకుంటూ నిత్యం ప్రజల రక్షణపై దృష్టి సారించి పరిశీలిస్తూ పరిష్కరించేవాడు. సింహబలుడుకి శతృదేశాల బెడదలేని సమయంలో వృద్ధాప్యం సమీపిస్తున్న వేళ ఓ సమస్య కంటి మీద కునుకు లేకుండా చేసింది. వెంటనే ప్రజల వద్దకు వెళ్లాడు.
'' ప్రభూ ఎవరో దొంగలు మేము దాచుకున్న డబ్బు అంతా దోచుకెళుతున్నారు..'' అని ఫిర్యాదు చేశారు. అది విన్న రాజుకు దొంగ గంగులుపై సందేహం వేసింది. తన సైనికులను ప్రహరీ పక్కనే నిఘా వుంచాడు. ఆ రాత్రి గజదొంగ గంగులు రానే వచ్చాడు. శత్రుదుర్బేధ్యమైన రాజ మందిర ప్రాకారాన్ని ఎక్కి రాజమందిరంలో వున్న వజ్ర వైడూర్య కిరీటాన్ని అపహరించి వెళ్లాడు. రాజ భటులు ఇది గమనించారు. గజదొంగ గంగులును పట్టుకునేందుకు పెద్ద ఇనుప చువ్వలతో తరిమే ప్రయత్నం చేశారు. అయినా గజదొంగ చాకచక్యంగా గోడదూకి పారిపోయాడు.
ఈ సంగతి రాజుకు చెప్పడంతో ఎంతో బాధపడ్డాడు. తన ఎంతో యుద్ధ నైపుణ్య శక్తి సామర్థ్యాలు కలిగిన వాడిని..ఎందరో పరాక్రమ రాజుల నుంచి ప్రజలకు రక్షణ కల్పిస్తున్న వాడిని.. ఇప్పుడు ఈ దొంగలు నన్ను చేతకాని వాడిని చేశారు..'' అని లోలోన కుమిలిపోసాగాడు.
మంత్రిని పిలిచి '' ఏం చేద్దాం?'' అని ప్రశ్నించాడు. '' మీ యుద్ధ నైపుణ్యత చూపి దొంగల్ని పట్టుకోండి మహారాజా'' అన్నారు మంత్రి సూరయ్య.
'' అలాగే'' అని చెప్పి మరుసటి రాత్రి రాజభవన ప్రాకారం వద్ద నిల్చొన్నాడు సింహబలుడు. బాగా చీకటి పడిన తర్వాత గజదొంగ గంగులు ముసుగు వేసుకుని వచ్చాడు. అప్పటికే ఎదురుచూస్తున్న రాజు కత్తిని విసిరాడు.
గజదొంగ గంగులు తన చేతిలో వున్న కారం పొడిని రాజు కళ్లలోకి విసిరాడు. ఒక్క సారిగా విరుచుకుపడ్డ గంగులు రాజు మెడలో వున్న వజ్రాల హారాన్ని లాక్కుని పారిపోయాడు.
ఒక్కసారిగా కళ్లలో మంటతో కుప్పకూలిన రాజు తేరుకుని చూసే లోపే తన కత్తి కిందపడి వుంది. మెడలో హారం మాయమై వుండటం చూసి తన యుద్ధశక్తి సామర్థ్యాలపై సందేహం వేసి తనలో తానే ప్రశ్నించుకున్నాడు. ఆ తర్వాత ఆ రాత్రంతా ఆలోచించి తనకు ఆప్తుడైన సైనికాధికారి కాలయ్యను పిలిచి తన వ్యూహాన్ని వివరించాడు. కాలయ్య ఆ రాత్రి ముసుగు దొంగలా మారి రాజమందిరంలో రాజు చేతిలో వున్న వజ్రాల వుంగరాన్ని లాక్కుపోయాడు.
ఈ విషయం గజదొంగ గంగులు విన్నాడు. తన కన్నా పెద్ద దొంగవచ్చి విలువైన వస్తువులను దొంగిలించుకు పోవడం తో ఈర్ష్య పెరిగింది. దీంతో కాలయ్యకు దగ్గరయ్యాడు. అతనికి రాజ మందిరంలో అన్ని తెలుసునని గ్రహించాడు. రహస్యాలన్నీ చెబితే దొంగతనంలో సగం వాటా ఇస్తానని తెలిపాడు. అలాగే అని అంగీకరించాడు కాలయ్య.
ఆ మరుసటి రోజు నుంచే గంగులు దాచి వుంచిన ఆభరణాల ప్రదేశం తెలుసుకున్నాడు. గంగులు దొంగిలించిన నగలన్నీ తీసుకెళ్లి రాజ భటుల సాయంతో రాజుకు అప్పగించాడు.
గజదొంగ దొంగిలించిన నగలన్నీ మాయం అయ్యేసరికి తనకు మించిన గజదొంగ ఎవరు? అని తీవ్ర ఆలోచనలో పడ్డాడు. కాలయ్యను దొంగతనాలకు తీసుకెళుతూ తన ముఠా నుంచి తప్పుకుని మాయమవుతున్న నగల గురించి చింతించ సాగాడు.
ఓ రోజు కాలయ్య దొంగతనం చేస్తూ రాజ భటులకు పట్టుబడ్డాడు. కాలయ్యను విడిపించుకోవడానికి శత విధాలా ప్రయత్నించసాగాడు గంగులు.
ఓ రోజు దొంగతనం బాధితులు బాధలు చెప్పుకోవడానికి దొంగ కాలయ్యను ప్రవేశపెట్టాడు రాజు. అది చూసిన గజదొంగ గంగులు తను కూడా దొంగల బాధితుడిని రాజు వద్దకు వెళ్లి ముసలి కన్నీరు పెట్టాడు . '' నీ వద్ద ఏయే వస్తువులు పోయాయో ఓ సారి చెప్పు?'' ప్రశ్నించాడు రాజు. గజదొంగ రాజు ముందు భయం భయంగా చూస్తూ కిరీటం..'' అన్నాడు. ఇంకా రాజ మందిరంలో దోచుకున్న ఆభరణాలు అన్నింటిని చెబుతుంటే మారు వేషంలో వున్న గంగులుపై అనుమానం వచ్చింది. '' నిజంగా ఈ వస్తువులన్నీ మావే.. నిజంగా నువ్వు గంగులువే కదా..?'' అని గద్దించాడు రాజు.
గంగులుకు వెన్నులో భయం పుట్టుకుంది. '' నేను గంగులును కాదు.. వణుకుతూ అన్నాడు.
'' అయితే ఈ వస్తువులన్నీ దొంగిలించింది గంగులే? అనుమానం లేదు.. అతను తప్ప ఇంకెవరూ రాజ్యంలో దొంగలు లేరు...'' అన్నాడు రాజు. '' కాదు మహారాజా! నాకన్నా గజదొంగ వున్నాడు వాడే కాలయ్య.. మొత్తం ఆ వస్తువులన్నీ దొంగిలించాడు..నేను కాదు.. కావాలంటే అడగండి..వాడే మహా గజదొంగ..'' ఆగ్రహించాడు.
'' కాలయ్య గంజదొంగ ఏమిటీ? అతను మా సైనికాధికారి.. నీ దొంగబుద్ధి ఏమిటో తెలుసుకోవడానికి నియమించిన నిఘా అధికారి..'' అన్నాడు రాజు.
రాజు పన్నాగం తెలియక ఇన్నాళ్లు తప్పించుకు తిరుగుతున్న గజదొంగ గంగులు ఇప్పుడు ప్రత్యక్షంగా దొరికాడు. ఎన్నో రోజులుగా తనకు, ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న గజదొంగ దొరికినందుకు రాజు ఎంతో సంతోషించాడు. అతడిని చెరసాలలో వేయించాడు. యుద్ధ నైపుణ్యంతో శతృ రాజుల బాధ లేకుండా రక్షణ కల్పించిన రాజు యుక్తితో దొంగల బెడద నుంచి కాపాడినందుకు రాజును ప్రజలు ప్రశంసించారు.

