ఉచితం..! ఉచితం..! ఉచితం..! - చెన్నూరి సుదర్శన్.

free..free..free
“మహాజనులారా.. నా ఉచిత సోదర, సోదరీమణులారా..” అని సభనుద్దేశించి సదయ్య సంభోదించగానే సభ దద్దరిల్లేలా చప్పట్లతో మారు మ్రోగింది. అంతవరకు  ఆఊళ్ళో అలా ఏనాయకుడూ సంభోదించడం విని ఎరగరు. జనాల్లో ఉత్సాహపు కేరింతలు  కుంభవృష్టిలా కురవడం చూస్తూ.. సదయ్య భుజాలు ఇంచుమందం పైకి ఎగిరాయి. సదయ్య  పూర్తీ పేరు సదానందం గాని అంతా అతన్ని సదయ్య అనే పిలుస్తుంటారు. కొత్తగా రాజకీయాల్లోకి దూరాడు. సభల్లో ‘ఉచితం పథకాల’ గురించి వసపిట్టలా వాగీ, వాగీ  ‘ఉచితం’ ఊత పదంగా మారింది. సభలోని జనాలు గాడిద చెవుల్లా నిక్కించి వింటూండడం సదయ్య మరింత రెచ్చి పోయాడు.

“ఇదివరకు వచ్చిన నాయకులంతా  బిచ్చగాండ్లలా మీఇంటి చుట్టూ ఉచితంగా తిరుగుతూ. తిరుగుతూ, మీ పిల్లల గోచీలు ఉచితంగా కడుగుతూ, మీఇళ్ళల్లో పొయ్యిలు ఉచితంగా రాజేస్తూ, మీపశువుల కొట్టాలలో పేడ ఉచితంగా  ఎత్తి పారబోస్తూ, మీ క్షౌరశాలల్లో ఉచితంగా గెడ్డాలు గీస్తూ, మీ టీకొట్టుల్లో కాచిన టీని ఉచితంగా పంచుతూ..  మిమ్మల్ని ప్రసన్నం చేసుకుని..  ఓట్లు అడుక్కొని సీట్లు దండుకున్నారే తప్ప మీకు ఉచితంగా ఇసుమంతైనా పనులు చేసి పెట్టలేదని నాకు బాగా  తెలుసు. మీరంతా ఆ నాయకుల పాలన మీద ఉచితంగా విసిగి పోయారననీ  తెలుసు. ఇదే మంచి తరుణమని నేను పి. పి. పి, అంటే ‘ప్రజా పథక పార్టీ’ అనే కొత్త పార్టీని ఉచితంగా స్థాపించి మీ ముందుకు వచ్చాను. నన్ను ఉచితంగా ఆశీర్వదించాల్సిందని సవినయంగా మనవి చేసు కుంటున్నాను” అంటూ సభనంతా ఓమారు కలియ జూశాడు సదయ్య. వారి చూపులను అర్థం చేసుకున్న సదయ్య.  ఇసుమంతైనా  నిరుత్సాహ పడలేదు. ఇక అసలైన వాగ్బాణాలు సంధించాలను కున్నాడు.  ముఖంపై చిరునవ్వు పులుముకుని, తిరిగి మైకులో రెండు సార్లు ఉఫ్..ఉఫ్.. అని ఊది దానికి  పని కల్పించాడు.“నాకు తెలుసు.. మీరంతా ఉచితంగా ‘ఇక  నువ్వేం పొడుగు చేస్తావు?’ అని అనుకుంటున్నారు కదూ..! అయితే వివరిస్తాను ఉచితంగా వినండి.

నేను చేబట్టబోయే సంస్కరణల పేరు కూడా  పి.పి.పి. అంటే ‘ప్రజలకు పథకాల పంపిణీ’. ప్రజలు ఉచితంగా ఎన్నుకోబోయే నేను, ప్రజల డబ్బును తిరిగి ప్రజలకోసం పథకాల రూపాలలో ఉచితంగా అందించడమన్న మాట. నేను పది  పథకాలతో బాటు ఒక బోనస్ పథకం  తయారు చేశాను. ఊరూరా సభలల్లో ఉచితంగా చాటింపు చేసుకుంటూ వస్తున్నాను. అందరినీ వారికి  కావాల్సిన పథకాలను నాకు ట్విట్టర్లో పోస్ట్ చెయ్యండని ఉచితంగా చెబుతూ వస్తున్నాను. ఎవరినీ నిరుత్సాహ పర్చకుండా అన్ని పథకాలను ఉచితంగా  అమలు పరుస్తానని మీ మీద  ప్రమాణం చేసి ఉచితంగా చెబుతున్నాను” అనగానే సభలో చప్పట్ల వర్షం జోరుగా కురిసింది. 

ఆ జడివానలో సదయ్య తబ్బిబ్బై పూర్తిగా తడిసి పోయాడు. ఇదే తరుణము.. మించిన దొరకదని పి.పి.పి. వివరించసాగాడు.  మహాజనులారా..  మన రాష్ట్రంలో ఉచితంగా విపరీతమైన డబ్బుంది. ఇంకా కావాల్సి వస్తే మీ అభివృద్ధి కోసం ఉచితంగా అప్పు కూడా చెయ్యగలను.  అప్పు లేనిదే రాష్ట్రం ఉచితంగా అభివృద్ది చెందడం కల్ల. మీ సుఖమే.. నే కోరుకున్నా ఉచితంగా..   నా పార్టీ కార్యాచరణ పి.పి.పి.లను మీ ముందుంచుతున్నాను.. సవినయంగా వినగలరని ఉచితంగా మనవి చేస్తున్నాను. ఇప్పుడు నేను చెప్పబోయే పథకాలాన్నీ  ఉచిత పథకాలే.. ముందుగా బోనస్ పథకం గురించి వివరిస్తాను. నేటి కాలపు మనిషికి కూడు, గుడ్డ, గాలి నీరు లేకున్నా మనగలడేమో..! గాని అంతర్జాలము (ఇంటర్ నెట్), వైఫై లేకుండా అర నిముషమైనా బతకలేదు. అందుకే ఇరవై నాలుగు గంటలూ ఉచితం.. ఉచితం” సభలో చప్పట్ల మోత. సదయ్య కండ్లల్లో వేయి దీపాల కాంతి.. సభను శాంత పరుస్తూ.. మళ్ళీ చెప్పడం మొదు పెట్టాడు సదయ్య. 
“ఇక పది పథకాలలో మొదటిది.. వృద్దాప్య పథకం. దీనికి ఏబది సంవత్సరాల వయసు నిండిన వారంతా అర్హులు. గిరిజనులకు ఉచితంగా మరో పది సంవత్సరాల వయసు రాయితీ ఉంటుంది. అంటే వాళ్ళు నలుబది సంవత్సరాలకే  అర్హులు. ఈ పథకం కింద ప్రతీ ఒక్కరికి ఉచితంగా పదివేల రూపాయలు.

రెండవది.. నిరుద్యోగభృతి, దీనికి డిగ్రీలో చేరిన ప్రతీ విద్యార్థీ, విద్యార్థినిలు అర్హులు. ఈ పథకం కింద ప్రతీ ఒక్కరికీ ఉచితంగా  ఐదువేల రూపాయలు.. మూడవది.. విద్యార్జన పథకం. దీనికి  బళ్ళో చేరిన పిల్లలంతా అర్హులు. వివిధ తరగతులను బట్టి ఇంటర్మీడియట్ స్థాయి దాకా  నాలుగు వేల వరకు ఉచితంగా లబ్ది.  నాల్గవది.. బాలపథకం. ఇందులో పుట్టిన ప్రతీ బిడ్డకు శిశు ప్రాయం నుండి బడి ప్రాయం వరకు  రెండు వేల వరకు ఉచిత సర్దుబాటు. ఐదవది.. ఉచిత గర్భాధారణ పథకం” అనగానే సభలో ఈ మారు చప్పట్లతో బాటు కేరింతల నవ్వులు పువ్వులై విరిశాయి.  అది అర్థం చేసుకున్న సదయ్య తానూ కాసేపు  నవ్వుతూ సభనుద్దేశించి “అయ్యాల్లారా.. మీరూహిస్తున్నట్లు ఉచితంగా గర్భాధారణ చేయించడం కాదు. గర్భిణీ స్త్రీలకు అదనంగా ప్రసూతి  అయ్యే వరకు ఉచితంగా వెయ్యి రూపాయలు పుష్టికరమైన  భోజనం కోసం, ఇంకా  అదనంగా వైద్య ఖర్చులు ఉచితం” సభ కాసేపు చప్పట్లు మ్రోగించి మరిన్ని పథకాల కోసం ఎదురి  చూడసాగింది. అది అర్థం చేసుకున్న సదయ్య,  చేతులతో సంజ్ఞలు చేస్తూ.. మళ్ళీ చెప్పసాగాడు.

“ఆరవది.. కళ్యాణ పథకం. ఈరోజుల్లో పెండ్లి చెయ్యడమంటే మాటలు కాదు. ప్రజలు ఇబ్బంది పడకుండా.. వధువుకు రెండు లక్షలు, వరునికి లక్ష రూపాయలు ఖర్చుల నిమిత్తం ఉచితంగా పంపిణీ. కళ్యాణ మండపాలు ప్రభుత్వమే కట్టించి  ఉచితంగా ఇస్తుంది. ఏడవది.. శోభాయాన పథకం. నూతన వధూవరులకు శోభనం రోజు మంచం అలంకరణ తదితర  పూలు,  పండ్లు, పాల కోసం  ఉచితంగా రెండు వేల రూపాయల బక్షీసు.  ఎనిమిదవది.. శ్రీరామ రక్ష పథకం. ఆరోగ్యమే మహా భాగ్యమన్నారు పెద్దలు. మీ ఆరోగ్యామే నా పీఠానికి రక్ష గనుక ఆ పథకానికలా పేరు  పెట్టాను. మీ ఆరోగ్యానికి నా పూచీ. మీకు రోగం వచ్చినా రాక పోయినా.. కండ బలానికి గానీ.. బుద్ది బలానికి గానీ.. దవాఖాన్లకు వెళ్లి ఉచితంగా మందులు, టానిక్కులు తీసుకోవచ్చు, ఆపరేషన్ అయినా  పరేషాన్ గాకండి. ఉచితంగా డాక్టర్లు చేసి పెడ్తారు. తొమ్మిదవది.. ప్రాణ రక్షణ  పథకం. అంటే మీ ప్రాణాలకు నా ప్రాణం అడ్డేసి మీకందరి ప్రాణాలను ఉచితంగా భీమా చేయిస్తాను. ఇక మీరంతా ఎంతో ధీమాగా బతుకెయ్యొచ్చు. ఇందులో రెండు  భాగాలుంటాయి.  ఒకటి రైతు మందు, రెండవది జనం మందు. రైతు మందు అంటే రైతులు పొలాల్లో చల్లుకునేది ఉచితం. జనం మందు అంటే మనకు పసందైన  మందు అదీ ఉచితమే.  మందు అనగానే ఒకరు ఒకరకంగా.. మరొకరు మరో రకంగా అర్థం చేసుకోవడం మామూలే. అయితే నేననే మందు మీరనుకునే మందు ఒకే రకం. మందు కావాల్సిన వాళ్ళు ఎక్కడికీ వెళ్ళనవసరం లేదు. వారికి ఆరోగ్యకరమైన మందు ప్రభుత్వమే ప్రతీ ఇంటికి ఒక విస్కీ  ఫుల్ బాటిల్ ఉచితంగా సరఫరా చేస్తుంది. మీ ఇష్టమొచ్చిన బ్రాండ్ ఎన్నుకోవచ్చు. అదనంగా మరో బాటిల్ కావాలంటే రాయితీ మీద దొరుకుతుంది” అనగానే సభలో ఈమారు చప్పట్ల మోత రాష్ట్రమంతటా వినవచ్చేలా మారు మ్రోగాయి. సదయ్య మోముపై చిరునవ్వు మొలిచింది. తన సన్నని  మీసాల కొసలు మెలి తిప్పుకుంటూ.. గొంతు సవరించుకున్నాడు. సభ ఉత్సుకతతో వినసాగింది. 

“ఇక చివరాకరిది.. పదవ పథకం.. మిమ్మల్ని పూడ్చేసే, కాల్చేసే పథకం” అనగానే సభలో కలవరం మొదలయ్యింది. దానిని కవరు చేస్తూ.. వెంటనే అందుకున్నాడు సదయ్య. “కంగారు పడకండి మహాజనులారా.. అది మన అంతిమ యాత్ర కోసం,, ఉచితంగా మన శవదహన సంస్కారాలు.. వగైరా.. వగైరా..” అనగానే సభలో నిశ్శబ్డం చోటు చేసుకుంది. “దీని కోసం ఒక ప్రత్యేకమైన ఫోన్ నంబరు వుంటుంది. ఆ నంబరు అందరికీ సులభంగా గుర్తుండాలని పది సున్నాలు పెట్టిస్తాను. ఎవరైనా కాలం చేసినప్పుడు  పది సున్నాలకు ఫోన్ చేస్తే చాలు. ప్రభుత్వ లాంచనాలతో వారికి అంతిమసంస్కారం అందుబాటులో వుంటుంది” సభ యావత్తు నిలబడి హర్షధ్వనుల మధ్య తమ మద్దతు తెలిపారు. ‘సదయ్యా.. జిందాబాద్.. పి.పి.పి. జిందాబాద్’ అనే నినాదాలు మిన్నంటాయి. సదయ్య ఎలాగైనా ముఖ్యమంత్రిని కావాలనే పథక రచనల  పర్యవసానమే పది పథకాల పి. పి. పి.  సదయ్య పథకం ఫలించింది. పి. పి. పి. పార్టీ ఊహిచని రీతిలో ఘనవిజయం సాధించింది. ప్రతిపక్షాలు  నామరూపాలు లేకుండా గోదాట్లో కొట్టుకు పోయాయి.  ఆ రోజు సదయ్య  ప్రమాణ స్వీకారం మహోత్సవం. సిటీ  స్టేడియంలో ఇసుక పోస్తే రాలనంత జనం.. జనం.. జనం. సిటీ రోడ్లన్నీ జనసంద్ర కెరటాలతో దరహాసమయమయ్యాయి.    సదయ్య ‘నేనే రాజు నేనే మంత్రి’ అన్న రీతిలో గవర్నర్ ఎదుట ప్రమాణం చెయ్యసాగాడు. “సదానందంకు మారు పేరైన సదయ్య అనే నేను మన రాష్ట్ర ముఖ్యమంత్రిగా నేడు ప్రమాణం చేస్తున్నాను.

ఒక బోనస్ పతకంతో బాటు పది ఉచితపథకాలతో మీ ముందుకు వచ్చిన నన్ను  నమ్మి మా పి.పి.పి, ని అనూహ్య రీతిలో గెలిపింఛి నాకు పట్టంగట్టిన  ప్రజలకు నమ్మకద్రోహం చేయనని, చిత్త శుద్ధితో పథకాలన్నీ అమలు పరుస్తానని మరో మారు దేవుని మీద, గవర్నరు మీదా, ప్రజల మీడా ప్రమాణం చేస్తున్నాను”  గవర్నరు ఆముదం తాగిన వాడిలా ముఖం పెట్టాడు. అదేమీ పట్టించుకోకుండా రిజిస్టర్లో సంతకం చేశాడు సదయ్య..  స్టేడియమంతా మతాబాలతో.. తారాజువ్వాలతో.. వెలుగులు విరజిమ్మింది. ఆ వెలుగులు శాశ్వతం కాదన్నట్లే సదయ్య ముఖ్య మంత్రి  పదవి ఒక వెలుగు వెలిగి తుస్సుమన్నది.  పథకాలు అమలు చెయ్యాలంటే మాటలుకాదు. అమాయకపు ప్రజలు ఉచితానికి అలవాటు పడ్డారు. ‘ఉచితంగా ఇస్తానంటే తల్లీ కావాలి.. పిల్లాకావాలి’ అన్నట్టు ప్రజలు పనీ, పాట మరిచి సోమరితనానికి పట్టంగట్టారు. దానికి తోడు సదయ్య ‘ట్విట్టర్’ లో ప్రజల మరిన్ని ఉచితపథకాల సూచనలతో నిండి పోయింది.  ఒక్క ఎడాదిలోగానే ప్రభుత్వ ఖజానా ఖాళీ అయ్యింది. అప్పుల కోసం కేంద్రానికి చిప్ప పట్టుకుని పొతే చెప్పుతో కొట్టే పరిస్థితి ఎదురయ్యింది. ‘ఎవరు చేసిన పాపం వారనుభవించక తప్పదన్నా” అని కేంద్ర పెద్దన్న హితవు పలికాడు.  రాష్ట్ర ఖజానా నింపుకోవడం కోసం పన్నుల మీద యావ దొర్లింది సదయ్యకు. పథకాలను జల్లించి వాటిలోని లొసుగులకనుగుణంగా పెట్రోలు మీద, నీళ్ళ మీద, కరెంటు తదితర నిత్యావసరాల మీద,  చివరకు అలనాడు ఔరంగాజేబు జుట్టుపై పన్ను విధించినట్లు విధించాడు. సకల  పన్నుల భారం పదింతలు చేశాడు. ప్రజల్లో వ్యతిరేకత మొదలయ్యింది. పది మాసాల్లోనే పి. పి. పి. పడిపోయింది. 

‘గవ్వ రాకడ లేదు.. గడియ రికాం  లేదు ‘ అన్నట్లు  పనిచేసిన సదయ్య ఇంటికే పరిమితం కావాల్సి వచ్చింది.  అకారణంగా పెళ్ళాన్ని వదలి రాజకీయాల్లో చేరితే వెలిగి పోవచ్చన్న అతని ఆద్రర్శమార్గం బెడిసి కొట్టింది. ఇటు సంసార సుఖానికీ అటు దేశ సేవకూ పని లేకుండా ‘రెంటికి చెడ్డ రేవటి’ అయ్యాడు. సదయ్యకు జ్ఞానోదయమయ్యింది. నేరుగా అత్తారింటికి వెళ్లాడు. మేనత్తామామ కాళ్ళ మీద పడి వేడుకొని.. తన సతీమణి సావిత్రిని తిరిగి కాపురానికి తెచ్చుకున్నాడు. రోజులు గడుస్తున్నాయి.. కాని రాజకీయంలో విఫలమైనట్లే సంతాన నయోగంలోనూ విఫలమయ్యాడు. సంతాన సాఫల్య కేంద్రాలన్నింటికీ ఉన్నది ఊడ్చి పెట్టాడు. అంతా సదయ్య  లోని లోపమే అని తేల్చి చెప్పారు. విచారంలో మునిగిపోయాడు సదయ్య.  ఒక రోజు సావిత్రికి ఒక ఆలోచన వచ్చింది. మెల్లగా సదయ్యను ప్రసన్నం చేసుకుని అతను తండ్రి అయ్యే ఒక సులువు మార్గాన్ని చెప్పింది. “బావా నేనొక ఉచిత పథకం ఆలోచించాను” అంది. ఉచిత పథకం పేరు వింటేనే అగ్గి మీద గుగ్గిలమయ్యే సదయ్య కనీసం తండ్రి నయ్యే అవకాశం ఏమాత్రమూ వదులుకోవద్దనే ఉత్సుకతతో ఏంటది అన్నట్టుగా కళ్ళతోనే అడిగాడు. “పి.పి.పి. పూర్తిగా ఉచిత పథకం” అంటూ ముద్దు, ముద్దుగా చెప్పింది.

“అంటే..!’ ఆశ్చర్యంగా అడిగాడు సదయ్య. తన పథకం తనకే చెప్పి దెప్పి పోడుస్తుందనే భావనతో..“పర పురుషుని పొందు” అనగానే విపరీతమైన కోపంతో లేచి గట్టిగా అరుస్తూ  ఒక తన్ను తన్నాదు సావిత్రిని.

***

కాళ్ళు సరిగ్గా చాచి పడుకోలేని గదిలో పడుకున్న సదయ్య కాలు తాకిడికి భళ్ళున శబ్దమయ్యింది.  హడలి పోయి వంటింట్లో నుండి పరుగెత్తుకొచ్చింది సావిత్రి. అక్కడి దృశ్యం చూసి నవ్వ సాగింది. బీరువా తలుపులు తెరుచుకుని పడిపోయింది.  అందులోని బట్టలన్నీ చెల్లా చెదురుగా పడిపోయి ఉన్నాయి.

“ఏం బావా కలగాన్నావా? “ అంటూ సావిత్రి కిల, కిలా నవ్వసాగింది. ఇదంతా కలనా..! అని మనసులో అనుకుంటూ అయోమయంగా దిక్కులు చూడసాగాడు సదానందం.“బావా నువ్వు ఎప్పుడు లేస్తావా..! ఎప్పుడు చెబుదామా అని ఎదురి చూస్తున్నాను” అంటూ గోముగా సదయ్య ఒడిలో వాలింది సావిత్రి. ఈ రోజు కొత్తగా మాట్లాడుతోందేమిటా..! అని ఆశ్చర్యపోయాడు సదయ్య,  కళ్ళు నులుముకుని, ఏంటది అన్నట్లుగా చూసాడు. 

“నేను నెలతప్పాను” అంది. సావిత్రి ఒళ్లో లేకుంటే ఎగిరి గంతులు వేసే వాడే. నిద్రమత్తు పూర్తిగా వదిలింది. అమితమైన సంతోషంతో సావిత్రిని అలాగే హత్తుకున్నాడు. 

ఎవరైనా ఉచితపథకాలతో ఓటు అడగడానికి వస్తే తరిమి, తరిమి కొట్టాలని.. ఆసంతోష సమయంలో గట్టి నిర్ణయం  తీసుకున్నాడు సదయ్య.*

మరిన్ని కథలు

forever
ఉభయ కుశలోపరి
- అయ్యగారి శ్రీనివాస్
if bride went out...
అమ్మాయి లెచిపోతే...?
- రంగనాధ్ సుదర్శనం
justice by god
దేవుడు చేసిన న్యాయం
- శింగరాజు శ్రీనివాసరావు
anubhandhalu
అనుబంధాలు
- P.L.N.మంగారత్నం
waiting for long
ఎదురుచూపులు
- లత పాలగుమ్మి
gift to teacher
గురువు గారికి బహుమతి
- దుర్గమ్ భైతి
chinni aasa
చిన్న ఆశ
- పేట యుగంధర్