యోగం - కొత్తపల్లి ఉదయబాబు

yogam

"మేము వెళ్ళొస్తాం.ఏమిటో రోజులన్నీ మనవి కాదుకదా. వాడేవడో ఈవేళే   పోవాలా నా ఖర్మ కాకపోతే. చివరిచూపు  దక్కడం కోసం ఇంత పొద్దున్నే బయల్దేరాం. నువ్వెళ్ళి నాన్నగారు చెప్పినట్టు   ఆ పని పూర్తిచేసుకో. ముందా తాత్కాలిక పోస్ట్ వచ్చేస్తే తర్వాత అదే నెమ్మదిగా పర్మినెంట్ అవుతుంది.అర్ధమైందా."

కనకవల్లి బాగ్ సర్దుతూ అన్నింటికీ ఊకొడుతున్న కొడుకుతో మళ్లీ అంది."సరిగ్గా వింటున్నావా. సరిగ్గా ఉదయం తొమ్మిదింటికి బయలుదేరు. అక్కడకి వెళ్ళేసరికి తొమ్మిదిన్నర అవుతుంది. నీ సర్టిఫికెట్స్స్ అన్నీ పట్టుకెళ్లు.నాన్నగారు  ఎస్.డి.ఓ.టి.గారితో మాట్లాడారట. డైరెక్ట్ గా వెళ్లి ఆయన్ను కలు. వెంటనే తీసుకుంటారు."

"అయిందా. మనం వెంటనే బయల్దేరితే ఫస్ట్ బస్ దొరుకుతుంది.వాడు సంధ్యావందనం చేసుకుంటాడు.పద పద."అంటూ రాఘవరావు భార్యని తొందరచేశాడు. వెళ్తూ కొడుకుని దగ్గరగా పిలిచి..."మంచి శకునం చూసి మంచి సమయంలో బయల్దేరితే... అంతా శుభమే జరుగుతుంది. చెప్పిందంతా గుర్తుందిగా... వచ్చిన వెంటనే మంచి శుభవార్త చెప్పాలి. అంతా శుభమగు గాక." అనేసి వెళ్లిపోయారు రాఘవరావు దంపతులు. తలువులన్నీ మూసి అలవాటు ప్రకారం ఇంట్లోనే దేవతాస్నానం ఆచరించి సంధ్యావందనం చేసుకుని  సర్టిఫికేట్స్స్ అన్ని సరిగ్గా ఉన్నాయో లేదో చూసుకునే పనిలో పడ్డాడు భాస్కర్.

రాఘవరావుగారికీ  ఒక కూతురు తరువాత ఇద్దరు కొడుకులు. అమ్మాయికి పెళ్లి అయి ఇద్దరు మనవలతో సుఖంగా కాపురం చేసుకుంటోంది. పెద్దబ్బాయి  అమెరికా లో చేస్తున్నాడు. రెండేళ్ళు అయింది పెళ్లి అయి. కొడలికి ఏడో నెల. ఆఖరివాడు భాస్కర్. పిల్లల వయసుల్లో అంతరాలతో బాటు ఉగ్యోగాలు లభించడంలో కూడా అంతరాలు గమనించిన ఆయన ఒకవేళ చదువుకున్న విద్యవల్ల వుద్యోగం రాకపోతే ఉపాధి కల్పించే టెక్నికల్ విద్యా కూడా నేర్చుకోమని ప్రోత్సహించి టైప్ – రైటింగ్ , కంప్యూటర్ విద్యా నేర్పించారు భాస్కర్ కి. ఖాళీ సమయాల్లో తమకు పూజలు చేయించే బ్రహ్మగారివద్ద నిత్య పూజావిధానం, వినాయక చవితిపూజ. సత్యనారాయణ వ్రతం, అన్నీ శాస్త్రోక్తంగా నేర్పించారు. భాస్కర్ కంఠం గంభీరంగా కంచుఘంట లా ఎంతదూరమైనా వినిపించే విధంగా ఉండటంతో ఎవరో ఒకరు పూజకు పిలవడం, తన కంటూ కొంత ఆదాయం రావడంతో సంతృప్తి పడుతూనే ఉద్యోగాలు  ప్రయత్నాలు చేస్తున్నాడు. రాఘవరావు ఆ గ్రామంలో పోస్టుమాస్టర్ గా చేస్తున్నారు. పోస్టాఫీసు అంటే కేవలం   క్షేమ సమాచారాలు తెలుపుకుంటూ బంధువులకు    ఉత్తరాలు రాసుకుని పోస్ట్ చేసుకునే పనికి మాత్రమే ఉపయోగిస్తుందనుకుని ఎక్కువశాతం నమ్మకంతో ఉన్న ఆగ్రామంలో సర్పంచ్ గారి సహకారంతో ఒక సదస్సు ఏర్పాటు చేసి తపాళాశాఖ ప్రజలకు అందిస్తున్న సేవలు, ప్రభుత్వం అందిస్తున్న పధకాలను వివరించేసరికి ప్రజలందరూ విస్తుబోయారు. ఆ పథకాలు వినియోగించుకుని పిల్లల భవిష్యత్తుకు పునాదులు వేసుకోవాలని సూచించిన ఆయన సలహా ఎందరికో నచ్చింది.అందులో ముఖంగా రికరింగ్ డిపాజిట్ పధకం వారికి చాలా నచ్చింది.

అంతే....గ్రామంలో ఎంతో చైతన్యం వచ్చింది.మరునాటినుంచే పోస్టాఫీసు కౌంటర్ దగ్గర క్యూ ప్రారంభమైంది. అలా పోస్టాఫీసు ఆవశ్యకతని తెలియజేసిన రాఘవరావు గారంటే ఊరు ఊరంతా గౌరవంతో నమస్కరించేవారు. ఆవార్త పేపర్లో రావడంతో టెలీఫోన్ ఎక్స్చేంజి ఎస్.డి.ఓ.టి.గారు స్వయంగా ఫోన్ చేసి రాఘవరావుగారిని అభినందించి  స్నేహం పెంచుకున్నారు. ఆ ఓరవడిలో  తన కుమారుడు డిగ్రీ పాసై ఉన్నాడని, వాడికి ఏదైనా కాజువల్ పోస్ట్ లో టెంపరరీగా  ఉద్యోగ అవకాశముంటే చూసిపెట్టమని రాఘవరావు ఆయన్ని కోరారు. సరిగ్గా ప్రతీసోమవారం 20 మంది డిగ్రీ అర్హతలున్న అభ్యర్ధులను టెంపరరీ బేసిస్ మీద సెలెక్ట్ చేసి లిస్ట్ తమకు పంపమని పై అధికారులు ఆదేశించడంతో ఆ పనిలో నిమగ్నమైన ఎస్.డి.టి.ఓ గారు రెండవ సోమవారం సాయంత్రమ్ రాఘవరావుగారు గుర్తుకువచ్చి ‘మీ అబ్బాయిని మళ్ళీ వారం తప్పక పంపండి. వీళ్ళని పెర్మనెంట్ చేసే అవకాశం కూడా ఉంది అతన్ని తీసుకునే పూచీ నాది.ఉదయం పదింటికల్లా పంపండి సర్’ అని చెప్పారు. అందుకే ఈ సోమవారం భాస్కర్ ని అన్నివిధాలా రెడీ చేసి సిద్ధం చేసి తప్పక వూరెళ్ళారు. సరిగ్గా తొమ్మిది గంటల సమయమైంది. నిన్నరాత్రి మిగిలిన ఉప్పుడు పిండి, ఆవకాయ - పెరుగుతో తిని మంచి బట్టలు ధరించి వెళ్ళేపని విజయవంతం కావాలని దేవునికి నమస్కరించుకున్నాడు భాస్కర్. బయల్దేరబోతుంటే తండ్రి మాటలు గుర్తొచ్చాయి.మంచి శకునం చూసుకుని మంచి సమయంలో బయల్దేరమని చెప్పిన మాట. వెంటనే పంచాంగం తీసి చూసాడు.8.55నుంచి 9.43 వరకు వర్జ్యం...తరువాత పడినిముషాల తేడాలో దుర్ముహూర్తం ఉన్నాయి. అవి అయ్యాకా వెల్దామని అలాగే మంచం మీద నడుం వాలిస్తే చద్దన్నం మహిమవల్ల నిద్రపట్టేసింది. సరిగ్గా 12.20 నిముషాలకి మెలకువ వచ్చింది. అరెరే...11.00 గంటలతో అన్ని చెడు ఘడియలు తొలగిపోయాయి..కానీ తనకు మెలకువరాలేదు..అనుకుని మళ్లీ పంచాంగం తీసుకుని చూస్తే 3.33 కి మళ్ళీ వర్జ్యం ఉండటం తో ఈ మధ్య లో వెళ్లి వచ్చేస్తే సరిపోతుందని బయల్దేరి వెళ్ళాడు భాస్కర్. వెళ్ళేసరికి 1.10 అయింది.అటెండెరుతో తండ్రి విసిటింగ్ కార్డు లోపలకి పంపిస్తే    ఎస్.డి.ఓ.టి. గారు లోపలకి రమ్మన్నారు. "నమస్తే సర్.నాన్నగారు మిమ్మల్ని కలవమన్నారు.ఇవిగో నా సర్టిఫికెట్లు."అని ఫైల్ ఇవ్వబోయాడు. ఆయన కోపంగా చూసాడు ఆయన.

‘’నీకు అసలు బుద్ధి ఉందా.ఇలా అంటున్నానని ఏమీ అనుకొకయ్యా.మా అబ్బాయి లాంటి వాడివి. ఉదయం పడిగంటలకల్లా రమ్మంటే ఇపుదా రావడం? ఈవారం ఇరవై మందిని తీసుకోవడం లిస్ట్ ఫైనలైజ్ చేయడం కూడా అయిపోయింది. ఎందుకు  లేటైంది?’’ ‘’సార్.అది..అదే... నాన్నగారు మంచి సమయం చూసి వెళ్ళమంటేనూ....’’ ‘’ చాల్చాల్లే ,మంచి పని చేశావ్. మీ నాన్నగారు నన్ను గురించి ఏమనుకుంటారు? అయ్యో, అవకాశం ఉండి కూడా సాయం  చెయ్యలేకపోయారు  అనుకొరూ?ఉద్యోగం వచ్చాకా ఎవడైనా మంచి సమయం చూసి ప్రవేశిస్తాడు. ఇంటర్వ్యూ కి వెళ్లడానికి మంచి టైమ్ చూసుకున్నవాడిని నిన్నే చూస్తున్నా.సరే...నూవ్వ్ చేసిన నిర్వాకం మీ నాన్నగారితో చెప్పు. నేను భోజనానికి వెళ్తున్నా.నేను ఫోన్ చేసి మాట్లాడతా అని చెప్పు.’’

‘’ సారీ సర్.వెరీ సారీ.’’ ‘’ చివరగా చెబుతున్నా. మళ్ళీ సోమవారం రా.నీ అదృస్టమ్ ఎలా ఉందో... నేను సాయం చేద్దామన్నా నీకు వచ్చేయోగం ఉంటే వస్తుంది...వెళ్ళిరా.’’ అని ఆయన తనముందే బయటకు నడవడంతో విధిలేక బయటకు నడిచాడు భాస్కర్. ఇంటికి వచ్చాకా విషయం తెలుసుకుని కనకవల్లి రాఘవరావుగారిమీద తాడేత్తున లేచింది. ‘’ఇదంతా మీ నిర్వాకం వల్లే. ప్రతీ దానికీ మంచి సమయం, శకునం చూసి బయల్దేరమని చెబుతారు. దానికి తోడు హాయిగా వాడి సహవాసగాళ్ళందరూ హాయిగా  ఇంజనీరింగ్ చదివి క్యాంపస్ లో సెలెక్టయి సంతోషం గా వున్నారు. నాకు ఇంజనీరింగ్ ఇంటరెస్ట్ లేదు అంటే కంప్యూటర్, ఆ  దేవుడి పూజలు నేర్పించారు.ఇపుడు చూడండి.ఏంజరిగిందో.వాడికసలు ప్రభుత్వ ఉద్యోగం వచ్చే యోగం ఉందా అని.’’

‘’ఈవిషయం లో నాన్నగారిని ఏమీ అనకమ్మా. నేను ఏవరజి విద్యార్ధిని అని నాకు పదవతరగతిలోనే అర్ధం అయింది. అందుకే నాన్నగారు ఇంజనీరింగ్ చెప్పిస్తానాన్నా వద్దు అన్నాను. నా ఇష్టం కొద్దీ కంప్యూటర్ కొర్సే చేశాను. నా అభిరుచి కొద్దీ పూజలు చేయడం నేర్చుకున్నాను. అందరూ ఇంజనీర్లైపోయి దేశానికి చేసెసే సేవ ఏమీ లేదు ఇప్పుడు. కన్నందుకు చదువు చెప్పించారు.నా కాళ్లమీద నేను నిలబడి చూపిస్తాను. ‘నీ విదేశాల కోరికలు, ఆశలు అన్నీ అన్నయ్య నడిగి  తీర్చుకో...’’ అనేసి విసురుగా లోపలికి వెళ్లిపోయాడు భాస్కర్.‘మళ్ళీ వారం ఉద్యోగం సంపాదించు. అప్పుడు చూస్తా నీ గొప్పదనం. మీ నాన్న పలుకుబడీను.’’ విసుక్కుని పనిలో పడింది కనకవల్లి. 

వారానికి ఇరవై మందిని తాత్కాలికంగా ఉద్యోగం లోకి తీసుకుంటున్నారన్న వార్తా దావానలంలా వ్యాపించింది నిరుద్యోగ సమాజంలో. ఆ నాలుగవ సోమవారం మంత్రిగారు, ఏం.ఎల్.ఏ.,స్థానిక ప్రజా ప్రతినిధుల  రికమెండషన్ ఉత్తరాలతో, మరికొందరు డైరెక్ట్ గా ‘దక్షిణ తాంబూలలతో’ ప్రత్యక్షమైపోయారు నిరుధోగ కుర్రకారు అంతా. అదృష్టవశాత్తూ ఆ విధమైన ఎంపిక విధానాన్ని ఆపివేయమని రాష్ట్ర స్థాయి అదికారుల ఉత్తర్వులు వెలువడటంతో ఆ కాపీని నోటీస్ బోర్డు లో అంటించి చేతులు దులుపుకున్నారు ఎస్.ది.ఓ.టి. గారు.

ఆ జన సమ్మర్ధంలో ఆయన్ని ఆకలిసే అవకాశం లేకుండా పోయింది భాస్కర్ కి. ఆయన కూడా అర్జెంట్ మీటింగ్ కి రమ్మని జిల్లా కేంద్రం నుంచి ఫోన్ రావడం తో కుర్రాల్లని తప్పించుకుంటూ బతటికి వస్తూ భాస్కర్ ని చూసి ఓ వెర్రి నవ్వు నవ్వేసి జీప్ లో వేగం గా వెళ్ళిపోయారు. రాఘవరావు గారు  భాస్కర్ ని తిట్టలేదు. స్నేహితుడిలా అక్కున చేర్చుకుని ధైర్యం చెప్పారు.

‘’నీకు ఇష్టమైన వృత్తిలో  స్థిరపడు నాన్న.కానీ అందులో మాత్రం నువ్వు మొదటి స్థానం లో ఉండాలి.నా కొడుకుని చూసి నేను గర్వంగా చెప్పుకునే స్థాయికి నువ్వు ఎదగాలి. మీ అమ్మ మాట కాదని అపుడే నీ ఇష్టానికి విలువ ఇచ్చి నేను నేర్పించిన విద్యకు ఫలితం ఉంటుంది.’’

‘’అలాగే నాన్నగారు.’’ అన్నాడు వినమ్రం గా.ఇంతలో కోడలి పురిటికి తల్లిని పంపమని పెద్దకొడుకు ఫోన్ చేయడంతో ఆయన కనకవల్లిని అమెరికా పంపించారు.

‘’తల్లి ఆశలు తీర్చేవాడు అంటే వాడు. నా పెద్దకొడుకు. మీ నాన్నకి వండిపెడుతూ హాయిగా నేను వచ్చేంతవరకూ కొంపలో పడి ఉండు..హు ‘’ అని దీవించి అమెరికా వెళ్లొపోయింది కనకవల్లి. తల్లి వెళ్ళగానే  ఒక పక్కన  అటు పోటీ పరీక్షలకు వెళ్తూనే, ఇటు కంప్యూటర్ విద్య నేర్చుకుంటూనే పట్టుదలతో పూజలు నేర్పిన గురువుగారి దగ్గర యజుర్వేదం మొత్తం ఔపోసన పట్టాడు భాస్కర్. తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహించిన పోటీలలో ప్రధముడీగా నిలిచాడు. దానిఫలితంగా దేవస్థాన వేదపండితునిగా  నియామక పత్రాలు పంపింది దేవస్థానం. వాటిని చదివిన రాఘవరావు గారు ఆనందభాష్పాలు రాలుస్తూ పుత్రోత్సాహంతో భాస్కర్ణి  గాఢంగా కౌగలించుకుని  అన్నారు.

‘’నాన్నా. ఎంతటి పుణ్యాత్ముడివిరా.నీ స్వశక్తితో నిత్యం స్వామిని దర్శించుకునే ఉద్యోగం సంపాదించుకున్నావ్. మనిషి బ్రతకాలంటే ప్రభుత్వ ఉద్యోగమే అవసరం లేదని,  కష్టపడి ఇష్టం  లేని చదువు చదివే కంటే, ఇష్టపడి చదువుకున్న  చదువులో కష్టపడితే ఉన్నత స్థానానికి చేరుకోగలమ్ అని నిరూపించావయ్యా. ఆయామ్ ప్రౌడ్ ఆఫ్ యు మై బోయ్ ‘’

‘’ ఇది మీరు పెట్టిన బిక్ష నాన్నగారు. అమ్మ తిట్లు ఆశీర్వాడాలుగా, భగవంతుని కరుణ తోడైన కారణమే తప్ప నేను సాధించింది శూన్యం. అమ్మ వచ్చాక మనమందరమూ స్వామి దర్శనం చేసుకుందాం. ‘’ అన్నాడు భాస్కర్ తండ్రి కాళ్ళకు నమస్కరించి. ‘’కృషి ఉంటే మనుషులు  ఋషులౌతారు...మహా పురుషులౌతారు’’ అన్న వేటూరివారి గీతం రాఘవరావుగారి అంతరంగంలో పల్లవిస్తూనే వుంది. 

మరిన్ని కథలు

cow kid
లేగ దూడ
- వినయ్ కుమార్ కొట్టే
valentines day story
ప్రేమికుల రోజు
- కాంతి శేఖర్. శలాక
she like pearl social story
కడిగిన ముత్యం
- లత పాలగుమ్మి
the solution
పరిష్కారమార్గం
- కందర్ప మూర్తి
she like jasmine
మల్లి విరిసింది(ఒక వేశ్య కథ)
- రంగనాధ్ సుదర్శనం
secrete
అసలు సంగతి
- పద్మావతి దివాకర్ల
bride groom jump
పెళ్లికూతురు... జంప్
- రంగనాధ్ సుదర్శనం