ఎవరి బ్రతుకులు వారివి - శింగరాజు శ్రీనివాసరావు

everybody has own life

అనుకోని ప్రయాణం కావడంతో ఏ.సి టిక్కెట్టు దొరకక స్లీపర్ క్లాసులో బయలుదేరాను చెన్నైకి. మా వదిన వాళ్ళ మనవడికి భారసాల అక్కడ చేస్తున్నారు. చిన్న ఫంక్షనే అయినా అందరినీ పిలవడం, వాళ్ళకు చేతులు కడగడం ఆమెకు అదో సరదా. అవతలి వాళ్ళకు వచ్చే అవకాశం ఉందో లేదో అని కూడ ఆలోచించదు. పోనీ ముందుగా చెబుతుందా అంటే అదీ లేదు. ఒకరోజు ముందు ఫోను చేసి మీరు తప్పక రావాలి. వీలుకాదు అంటే కుదరదు. రాకపోతే నా సంగతి తెలుసుగా అని బెదిరిస్తుంది. బెదిరించడం కాదు ఉన్నమాటే అది. మనకు వేరే అత్యవసరమైన పని ఉండి వెళ్ళలేకపోయామా, ఇక అంతే సంగతులు. ఉగ్గుపాల దగ్గరనుంచి మొదలుపెట్టి తను చేసిన సహాయాన్ని, వచ్చిన వేడుకల జాబితాను వల్లించి వల్లించి పిండి వదిలేస్తుంది. ఆ నరకం కంటే ఈ ప్రయాణ నరకమే మేలని అందరూ వచ్చేస్తారు. అలాటి నిర్బంధ ప్రయాణమే ఇది.

రద్దీ మరి అంత ఎక్కువలేదు బోగీలో. ఏమీతోచడం లేదు. ఎదురుగా అటు ఇటుగా నా అంత వయసున్న ఒకతనని పలకరించాను.

" ఎక్కడిదాకా సర్ "

" గూడూరు వరకు" చెప్పాడు

" మీరెక్కడి దాకా" ఎదురు ప్రశ్న

" చెన్నై"

" రాత్రి పదవుతుంది కదా"

" అవునండీ"

" అంత చీకటిలో ఇబ్బంది కదా"

" లేదండీ. మా వాళ్ళు వస్తారు. రాకపోయినా వెళ్ళగలను. నేను రిటైరయేముందు అక్కడ పనిచేశాను రెండు సంవత్సరాలు"

"అయితే ఇబ్బంది లేదు లెండి. ఇంతకూ ఎందులో పని చేశారు"

"బ్యాంకులో"

"మరి మీరు"

" నేను ఉద్యోగస్తుడిని కాదండి. మాది ఒంగోలు దగ్గర చినగంజాంలో చిల్లరకొట్టు. నాకు వయసయిపోయింది కదా, అందుకని దాన్ని నా కొడుకు చూసుకుంటాడు"

" గూడూరులో మీ బంధువులున్నారా"

"లేదండి. నేను గూడూరులో దిగి అక్కడి నుండి బస్సులో ఏర్పేడు వెళతాను. నేను అక్కడ ఆశ్రమంలో ఉంటున్నాను పద్నాలుగు నెలలనుంచి" అతని మాటలలో చిన్న బాధ ధ్వనించింది నాకు.

కొడుకు ఉన్నాడంటున్నాడు. వ్యాపారం అంతా అతనికే ఇచ్చానంటున్నాడు. మరి ఇతను ఆశ్రమంలో ఉండడమేమిటి. అడిగితే ఏమనుకుంటాడో ఏమో నని మౌనంగా ఉన్నాను. కొద్దిసేపు మౌనం మా ఇద్దరి మధ్య. మరల తనే అందుకున్నాడు.

"మీ పిల్లలు ఏంచేస్తున్నారు సర్. ఉద్యోగాలేనా"

"నాకు ఇద్దరూ ఆడపిల్లలే. పెళ్ళిళ్ళు చేశాను. ప్రస్తుతం ఇద్దరూ అమెరికాలో ఉంటున్నారు."

"ఇక్కడ మీరు, మేడమ్ గారు ఉంటారన్న మాట. అందరి పరిస్థితి అంతేలే సర్. ఉద్యోగాల పేరుతో కొందరు, అభిప్రాయభేదాలతో కొందరు, స్వేచ్ఛ పేరుతో కొందరు, ఎలా అయితేనేమి అందరివీ ఒంటరి బ్రతుకులే" అతని మాటలలో ఏదో నిర్వేదం.

కాని అందులో ప్రతి అక్షరం పచ్చినిజం. పైకి అనలేక పోతున్నాను గానీ, అతనికి, నాకు పెద్ద తేడా ఏముంది. అతను ఆశ్రమంలో, నేను సొంత ఇంటిలో. ఏమో నాది కూడా ఇదే పరిస్థితేమో.

"ఏంటి సార్ ఆలోచిస్తున్నారు. అందులో నాది ఏ తెగ అనా. నాది అభిప్రాయభేదాల వర్గం సర్. మా నాన్న బ్రతికినంతకాలం నా దగ్గరే ఉన్నాడు సార్. మా ఇద్దరి మధ్య కూడా మాటల్లో తేడాలొచ్చాయి. కాని మా ఆవిడ పదిమందిలో పుట్టి పెరిగిన మనిషి. కష్టం, సుఖం తెలుసు. అందుకే నేను నోరు పారేసుకున్నా అది మా ఇద్దరిని సర్ది చల్లబరిచేది. నా కొడుకు, కోడలి దగ్గర అదే చేసేది. కాని నా కోడలు డబ్బున్న పిల్ల, ఒక్కతే కూతురుని గారాబంగా పెరిగింది. మాటలో నిదానం లేదు సర్. చచ్చి ఏ లోకానున్నదో మా ఆవిడ ఎన్ని మాటలు పడిందో. అతి కష్టం మీద ఒక ఏడాది కలిసి ఉన్నాము సర్. ఇక ఉండలేక అన్నీ వదులుకుని ఈ ఆశ్రమానికొచ్చాము. వచ్చిన నెలకల్లా అది దిగులుపడిందో ఏమో, ఒకరోజు గుండె పట్టుకుని కూలబడింది. ఆసుపత్రికి తీసికెళ్ళే లోపే నన్ను విడిచిపోయింది" అతని కళ్ళు చిప్పిరిల్లాయి.

అతని మాటలు వింటుంటే నాకు చాలా బాధ వేసింది. ఎటుపోతున్నాము మనం. బంధాలను వదులుకుని స్వేచ్ఛ పేరుతో సంస్కారాన్ని మరచి, ప్రేమలను సమాధి చేసి ఎటో వెళ్ళిపోతున్నాం.

" బాధపడకండి ఏదైనా మన చేతులలో లేదు. మీ తల్లిదండ్రులను చక్కగా చూసి వాళ్ళను మీ చేతుల మీదుగా సాగనంపి మంచి కొడుకు అనిపించుకున్నారు" అనునయించాలని ప్రయత్నించాను.

" నాదేమీ లేదు సర్. అంతా నా భార్య మంచితనమే. మన ప్రతిభ అంటూ ఏమీ ఉండదు సర్. ఆడవాళ్ళు అర్ధం చేసుకుని సర్దుకుపోతుంటే మన గౌరవం నిలబడుతుంది. లేకుంటే వీధి పాలే మన జీవితాలు"

అతని యాధాలాపంగా అన్నా అందులో వాస్తవం లేకపోలేదు. అహంకారపు పొరలు కమ్మనంత వరకు అందరూ సర్దుకుపోతారు. అటువంటి కుటుంబాలలో సంతోషాలు వెల్లివిరుస్తాయి. అహం తలుపు తడితే ఆ ఇల్లు వల్లకాడే మరి.

" మీకు ఆశ్రమంలో ఉంటుంటే బాధగా అనిపించడం లేదా" అడిగాను

" మొదట్లో అనిపించేది. కానీ తరువాత అలవాటయిపోయింది. అంతా వచ్చిపోయి నా ఈడువారే. మంచి కాలక్షేపం. ఇక్కడ చేరిన తరువాత నాకు రక్తపోటు కూడ అదుపులో ఉంది. ఇక్కడి నుంచి వెళ్ళాలంటే ఇబ్బందిగా ఉంది ఇప్పుడు"

" అలవాటుపడ్డారన్నమాట"

" జీవితమంటేనే సర్దుబాటు కదా సర్. ఎక్కడికక్కడే అలవాటు చేసుకోవాలి. ఆరోగ్యం బాగులేకున్నా ఆసుపత్రిలో చేరుస్తారు. తోటివాళ్ళు సహాయం చేస్తారు. కాలం తీరితే పిల్లలకు అప్పజెప్పడమో, లేనివారికి అందరూ కలిసి ఉత్తరక్రియలు నిర్వహించడమో చేస్తారు. వృద్ధాశ్రమాల విస్తరణ మంచిది కాకున్నా, అనాథలలా బ్రతికేకంటే ఇది కొంత మెరుగు కదా సర్. మాటలాడుతుంటే తెలియలేదు. గూడూరు వచ్చినట్టుంది. ఉంటాను సర్." అంటూ ప్రత్యుత్తరం కోసం చూడకుండా దిగి వెళ్ళిపోయాడతను.

ఎంత వాస్తవికత అతని మాటలలో అనిపించింది నాకు. అవి వినిన తరువాత నా పరిస్థితి మీద నాకు అనుమానం వచ్చింది. పిల్లలిద్దరూ అక్కడే స్ధిరపడిపోతే మా గతి ఇంతేగా. మనసు అలా కాదని అంటున్నా ఆరవజ్ఞానం మాత్రం నమ్మకం పెట్టుకోవద్దని హెచ్చరించింది.

ఇంతలో సెల్ ఫోను మ్రోగింది. నా చిన్నకూతురు.

"హలో చెప్పరా అమ్మలూ"

" నాన్న శుభవార్త. మాకు గ్రీన్ కార్డు వచ్చే అవకాశం ఉందట. మాతో పాటు దరఖాస్తు చేసిన వారికి కొందరికి వచ్చింది. తొందరలో మాకు వస్తుంది. అమ్మకు చెప్పండి. చాలా సంతోషిస్తుంది" ఆనందంగా చెప్పింది.

" అభినందనలు అమ్మలూ" అన్నాను మొక్కబడిగా

" ధాంక్యూ నాన్న. ఉంటాను" అని ఫోను పెట్టేసింది.

అంటే ఒక చోట మాకు ఆవాసం లేకుండా పోయిందన్నమాట. మా శ్రీమతి కోరిక నెరవేరింది. ఇక పెద్ద అల్లుడు మాత్రం ఊరుకుంటాడా తన ప్రయత్నాలు తను చేసుకుంటాడు. వెరసి మా బ్రతుకులు కూడ ఇక ఆశ్రమాల పాలేనా. అంతే మరి.

మనసు కకావికలమయింది. భవిత అగమ్యగోచరంగా మారింది. ఒంటరితనం వరమా? శాపమా? అర్థం కాలేదు నాకు. చిన్నతనమంతా హాస్టల్ లలో, పెద్దయ్యాక విదేశాలలో.... తప్పెవరిది?
పిల్లల జీవితాలు బాగుండాలని అప్పులు చేసి హాస్టల్ లలో చేర్చి చదివించే తల్లిదండ్రులదా? పుట్టినప్పటి నుంచే తల్లిదండ్రుల ప్రేమకు నోచుకోక హాస్టల్ లో పెరిగి ఏ బంధానికి వశం కాలేని పిల్లలదా?

కాని ఒక్కటి మాత్రం అర్థమయింది మనిషి పక్షిలాగ తన రెక్కలనే తను నమ్ముకుని బ్రతకాలి. అంతేగాని ఎవరో మనకు సాయం ఉంటారని అనుకోకూడదు. అదృష్టం ఉంటే చూస్తారు. లేకుంటే లేదు. ఎవరి బ్రతుకులు వారివి. భార్యాభర్తలే ఒకరికొకరు తోడు. ఆలోచిస్తూ కళ్ళు మూసుకున్నాను.

నలభై సంవత్సరాల క్రితం 'ఉన్న ఊర్లో ఏదో ఒకటి చేసుకుంటూ అందరం కలసి ఉంటే పోతుంది కదురా. ఆ రెండు వేల కోసం హైదరాబాదు వెళ్ళాలా?' అన్న నాన్న గారి మాటలు చెవులలో రింగుమన్నాయి.

మరిన్ని కథలు

Srivariki prema lekha
శ్రీవారికి ప్రేమలేఖ
- తాత మోహనకృష్ణ
Ramdaas formula
రాందాస్ ఫార్ములా
- వీరేశ్వర రావు మూల
Attagari samrajyam
అత్తగారి సామ్రాజ్యం
- బొబ్బు హేమావతి
Pramod Pesarattu
ప్రమోద్-పెసరట్టు
- వీరేశ్వర రావు మూల
Atanu aame madilo
అతను ఆమె మదిలో
- బొబ్బు హేమావతి
Atani kannu aame meeda padindi
అతని కన్ను ఆమె మీద పడింది
- బొబ్బు హేమావతి
Kottha ugadhi
కొత్త ఉగాది
- తాత మోహనకృష్ణ
Pallavi
పల్లవి
- తటవర్తి భద్రిరాజు