లేగ దూడ - వినయ్ కుమార్ కొట్టే

cow kid

సలికాలం పొద్దు గూకడం మొదలైంది. కైకిలికి పోయినోళ్లు అందరూ బిరబిర ఇండ్లకు మర్లుతుండ్రు. నాటేయ్యబోయిన లచ్చిమీ కాళ్లుఈడుసుకుంటు ఇల్లుజేరింది. పెనిమిటి చేనుకాడి పనులే గాని ఇంటికాడ గిటున్న పుల్ల గటు పెట్టడు. ఉన్న ఒక్క కొడుకు లగ్గం జేసుకొని పొరుగూరు కాడ నౌకరు జేసుకుంటా పెండ్లాంతో ఆడనే ఉంటడు.

బిరబిర నూతికాడ కోప్పర్ల నీళ్లు నింపి ఆ తుక్కు, ఈ తుక్కు జమజేసి పొయ్యంటు పెట్టింది. తానానికి  నీళ్లు బెట్టుకొని ఇల్లు ఆకిలి ఊడుస్తుంటే ఎవలో అచ్చి దొడ్లే గొడ్డు ఈనుతంది అని జెప్తే దవదవ ఊడిసి దొడ్లే కు ఉరికింది.
దొడ్లే గొడ్డు ఈననీకి అపసోపాలు పడుతుంది. కొద్దిగసేపు నిలబడుతుంది, కొద్దిగసేపు పంటంది. దాని కట్టంజూసి లచ్చిమి గుండె తరుక్క పోతంది. తంలాడి తంలాడి మొగ బొక్కును ఈనింది. చిమ్మచీకట్ల సకినాల పిండి లెక్క తెల్లగా కురుస్తున్న ఎన్నెల వోలె ముద్దుగుంది. అదేం సిత్రమో చంద్రునికి మచ్చ ఉన్నట్లే దాని నెత్తి మీద మచ్చ ఉంది. ఇంతలో పొయ్యిమీద పెట్టిన నీళ్లు మతికచ్చి దవదవ పొయ్యి తానం జేసింది. 

ఛాయా తాగే అలవాటు ఉన్న లచ్చిమికి పొద్దుగాళ్ళ , మాపటిల్లి  పాల కోసం ఆళ్ల కాడికి, ఈళ్ల కాడికి పోకుండా  గొడ్డు ఈనిందని మస్తు సంబురపడ్డది లచ్చిమి.

మర్రుపాలు పట్టిద్దామని బొక్కును గొడ్డు దగ్గరికి తీసుకెళ్లింది. గొడ్డు ఒకటే తన్నుడు. బొక్కును కూడా పాలు చీకనియ్యలే. పెనిమిటిని దుకాణం కి తోలి పాల పాకిటి, పాల పీపా తెప్పించింది. పాకిటు పాలు పొయ్యి మీద గరం చేసి చల్లార్చి పీపల పోసి పసిపోరగాళ్లకు  పాలు పోసినట్లు బొక్కుకు పాలు పట్టింది.

రెండో రోజు కూడా అదే పరిస్థితి . గొడ్డు పాలు ఇచ్చుడు లేదు, పీపాతోనే  పాలు పట్టుడు. ఎవత్తి ఎం మంత్రం ఎసిందో, ఏ జేట్ఠ కండ్లు పడ్డాయో గొడ్డుమీద కానీ పాపం పుట్టిన బొక్కుకి పాలు ఇయ్యనీకి నోసుకోలేదు ఆ గొడ్డు. లచ్చిమి తానే తల్లై పాకిటి పాలు తాగిపిస్తంది. 
గొడ్డును డాక్టరుకు సూపిత్తే కాల్షియం తగ్గి ఉంటది అందుకే  పాలు ఇత్తలేదు, రెండు పూటలా సూదులు వెయ్యుండ్రి అని నాలుగు మందు బుడ్డిలు ఇచ్చిండు. ఎన్ని సూదులు ఎసినా, ఎంత తౌడు పెట్టినా గొడ్డు పాలు ఇచ్చుడే లేదు.

తల్లి పాలు లేక తల్లడిందో , పాకిటి పాల విషానికి అలసిపోయిందో కానీ బొక్కు సచ్చిపోయింది. సచ్చిపోయి న బొక్కును జూసి గొడ్డు ఎంత ఏడిసిందో తెల్వదు కానీ లచ్చిమి కళ్ళు జడివానను కురిసినయి.  బొక్కు సచ్చిపోయి నాలుగొద్దులైన లచ్చిమికి దొడ్లే నుంచి బొక్కు అరుపులు ఇంకా చెవులనే గిల్లుమంటున్నాయి.

ఫోన్ల కొడుకుకి సెప్పుకుంటు ఏడుస్తుంటే లచ్చిమిని ఊకుండా పెట్టుడు కొడుకుతోని కూడా కాలే. అవ్వ ఇంటికాడ ఉంటే అదే మతికి తెచ్చుకుంటూ బాధపడుతూ ఉంటదని  వేములవాడ రాయేసుని దర్శనంకి తోలుకపోయిండు కొడుకు. ఎములాడలో రాయేసుని కోడె కడుతుంటే తన బొక్కే మతికచ్చి కండ్లు  చెరువులైనాయి. కొడుకుకి ఎం తెలుసు ఊరు మారినంత మాత్రాన  గుండెల్లో బాధ మారదని.

మరిన్ని కథలు

అన్నమారతి
అన్నమారతి
- Anil Prasad Lingam
the day that willn't come back
తిరిగి రాని రోజు
- నాగమణి తాళ్ళూరి
the change
పరివర్తన
- రాచమడుగు కృష్ణచైతన్య
smart person
మేధ
- ఆదూరి హైమావతి
purna rao-pootarekulu
పూర్ణారావు - పూతరేకులు
- ఆదూరి హైమావతి.
mad man's shirt
పిచ్చోడి చొక్కా
- కృష్ణ చైతన్య ధర్మాన
ugadi pikcle
ఉగాది పచ్చడి
- ఓట్ర ప్రకాష్ రావు
OMG corona
హతవిధీ..కరోనా....!!
- లత పాలగుమ్మి