Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
Movie Review - Aahaa Kalyanam

ఈ సంచికలో >> సినిమా >>

మా ఆవిడ‌ని అడిగే ముద్దు పెట్టా - నాని

Interview with Nani

మూడుర‌కాలైన న‌టులుంటారు.
1. వ‌చ్చిన ప్ర‌తి పాత్ర‌నీ ఒప్పేసుకొనేవాళ్లు.
2. ఇమేజ్‌కి త‌గిన పాత్ర‌ల్ని ఎంచుకొనేవాళ్లు.
3. వచ్చిన ప్ర‌తి పాత్ర‌నీ త‌మ ఇమేజ్ పెంచుకొనేట‌ట్టు మ‌ల‌చుకొనేవాళ్లు.
నాని మూడో ర‌కం. క‌ళ్ల ముందే.. చ‌క‌చ‌క ఎదిగేస్తున్నాడు నాని. చిన్న సినిమాల పెద్ద హీరోగా నిల‌బ‌డిపోయాడు. చ‌క్క‌టి న‌ట‌న‌, టైమింగ్‌, పాత్ర కోసం ఏమైనా చేసేత‌త్వం అత‌న్ని అందరికీ ద‌గ్గ‌ర చేశారు. నెల వ్య‌వ‌ధిలో మూడు సినిమాల వినోదాల్ని అంద‌రికీ పంచ‌బోతున్నాడు నాని. పైసా అత‌నికి న‌టుడిగా మ‌రోర‌క‌మైన గుర్తింపు తెచ్చింది. ఆహా కళ్యాణం, జెండాపైక‌పిరాజు విడుద‌ల కాబోతున్నాయి. ఈ సంద‌ర్భంగా నానితో జ‌రిపిన స్పెష‌ల్ చిట్ చాట్ ఇది.

* నెల వ్య‌వ‌ధిలో మూడు సినిమాలు.. టాలీవుడ్‌లో చ‌క్రం తిప్పేస్తున్నారు..
- అంత మాట అన‌కండి.. (న‌వ్వుతూ). ఇంత త‌క్కువ వ్య‌వ‌ధిలో మూడు సినిమాలొస్తాయ‌ని నేనెప్పుడూ అనుకోలేదు. సినిమా సినిమాకీ ఆరు నెల‌ల గ్యాప్ ఉండేలా ప్లాన్ చేసుకొంటే ఇలా జ‌రిగిపోయింది. అయినా మ‌న చేతుల్లో ఏం లేద‌ని అర్థ‌మైపోయింది. నా సినిమా ఒక‌టి థియేట‌ర్లోంచి వెళ్లేలోగా... నా నుంచి రెండో సినిమా వ‌చ్చేస్తోంది. నెల రోజులు నేనే క‌నిపించి... మొహం మొత్తేసేలా చేస్తానేమోన‌ని భ‌యంగా ఉంది.

* పైసా రిపోర్ట్ ఏం తేలింది?
- మీకు తెలియంది ఏముంది? మిక్స్‌డ్ రివ్యూస్ వ‌చ్చాయి. కొంత‌మంది బాగుంద‌న్నారు. ఇంకొద‌రు... ఓకే అన్నారు. చెడుగా మాత్రం ఎవ‌రూ చెప్ప‌లేదు. న‌టుడిగా నాకు ఎప్పుడో రానంత గుర్తింపు వ‌చ్చింది. ఆ సంతృప్తి మాత్రం కావ‌ల్సినంత ద‌క్కింది.

* ఆల‌స్యంగా విడుద‌ల చేయ‌డం, వాయిదాల మీద వాయిదాలు ప‌డ‌డం కూడా ప్ర‌తికూల ఫ‌లితం వ‌చ్చేలా చేసిందా?
- ఒక్క‌టండీ సినిమా బాగుంటే ఎప్పుడొచ్చినా చూస్తారు. ఇవ‌న్నీ సాకులు చెప్ప‌డానికి ఉప‌యోగ‌ప‌డ‌తాయంతే.

* ఇంత‌కీ ఆహా కళ్యాణం ఎలాంటి సినిమా?
- ఓ పెళ్లికి వెళితే ఎంత సంద‌డిగా ఉంటుందో  మా సినిమాకొస్తే అంత సంద‌డిగా ఉంటుంది. ఈరోజుల్లో పెద్ద క‌థ‌లు, ఇంట్ర‌వెల్ ట్విస్టులూ, భారీ క్లైమాక్స్ ఎవ‌రూ కోరుకోవ‌డం లేదు. సినిమా అంతా హాయిగా చూసేసి, బ‌య‌ట‌కు వ‌స్తున్న‌ప్పుడు స్మైలింగ్ ఫేస్ తో వ‌స్తే చాల‌నుకొంటున్నారు. ఈ సినిమా అలాంటి సినిమానే.

* హిందీ బ్యాండ్ బాజా బారాత్‌కి రీమేక్ క‌దా.. మార్పులు చేశారా?
- పెద్ద పెద్ద మార్పులేం లేవు. క‌థ అదే. స్ర్కీన్ ప్లే కూడా హిందీ సినిమానే ఫాలో అయిపోయాం. తెలుగు నేటివిటీకి త‌గిన‌ట్టు చిన్న మార్పులు చేశాం. అవేం పెద్ద లెక్క‌లోకి రావులేండి. బ్యాండ్ బాజా బారాత్ చూసి ఎలాంటి ఫీల్‌తో బ‌య‌ట‌కు వ‌స్తారో, అదే ఫీల్ ఈ సినిమాతోనూ క‌లుగుతుంది.

* తెలుగులో వ‌చ్చిన జ‌బ‌ర్‌ద‌స్త్ కూడా ఇదే క‌థ‌. ఈ సినిమా ప్ర‌భావం ఆహా కళ్యాణంపై ప‌డుతుందా?
- క‌థ‌ల్ని పోలిన క‌థ‌లు చాలా ఉంటాయి. బేసిగ్గా మ‌న‌కు ఆరేడు క‌థ‌లే ఉన్నాయి. అవే తిప్పి తిప్పిచూపిస్తున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కూ వ‌చ్చిన బ్లాక్ బ‌స్ట‌ర్స్ పేర్లు చెప్పండి. ఆ క‌థ‌లు ఇంచుమించు ఒకేలా ఉంటాయి. స‌రికొత్త పాయింట్‌తో సినిమా తీసి హిట్ కొట్టిన‌వాళ్లెవ్వ‌రూ లేరు. గ‌త నాలుగేళ్ల‌లో హిట్ సినిమాల్ని తీసుకోండి. ఆ పాయింట్ ఎక్క‌డో ఓ చోట ఎవ‌రో ఒక‌రు ట‌చ్ చేసే ఉంటారు. మీరు చెప్పిన జ‌బ‌ర్ ద‌స్త్ సినిమా నేను చూళ్లేదు. అందువ‌ల్ల‌.. ఆ సినిమా గురించి నేనేం మాట్లాడ‌లేను.

* రీమేక్ క‌థ‌ల్ని ఎంచుకోవ‌డంలో సౌల‌భ్యం ఉందా?
- అస‌లు నాకు రీమేక్ అంటేనే ఇష్టం ఉండ‌దు. ఒక‌చోట హిట్ అయిన క‌థ‌ని... రీమేక్ చేస్తే చాలా అంచ‌నాలు పెట్టుకొంటారు. ఆ క‌ళ్ల‌తోనే థియేట‌ర్‌కి వ‌స్తారు. మ‌న సినిమా బాగున్నా.. ఎక్క‌డో ఓ చోట లోటు క‌నిపిస్తుంది. అందుకే నేన‌స‌లు అలాంటి ప్ర‌య‌త్నాలు చేయ‌లేను. బ్యాండ్ బాజా బారాత్ రీమేక్ చేద్దాం అనగానే ఇలాంటి డౌటే వ‌చ్చింది. అప్ప‌టికి ఆ సినిమా చూళ్లేదు. ఇంటికెళ్లి తీరిగ్గా డీవీడీ పెట్టుకొని చూశా. చేస్తే ఇలాంటి సినిమానే రీమేక్ చేయాలి అనిపించింది. ఎందుకంటే.. క‌థానాయ‌కుడి పాత్ర నాకోస‌మే పుట్టిన‌ట్టు అనిపించింది. అందుకే ఒప్పుకొన్నా.

* లిప్‌లాక్ సీన్ గురించి అంద‌రూ మాట్లాడుకొంటున్నారు...
- అంత మాట్లాడుకోవ‌డానికి ఏముదండీ... (న‌వ్వుతూ). క‌థ‌కు ఆ ముద్దు అవ‌స‌రం. పోస్ట‌ర్ల కోసం, మ‌సాలా కోసం ముద్దు సీన్ అంటే నేనెప్పుడూ ఒప్పుకోను. ఎందుకంటే నా సినిమాని నా కుటుంబంతో క‌ల‌సి చూడాల‌నుకొంటా. ఒక్కచోట కూడా నేను ఇబ్బంది ప‌డ‌కూడ‌దు. నాతోవ‌చ్చిన‌వాళ్ల‌ను ఇబ్బంది పెట్ట‌కూడ‌దు. అందుకే.. అలాంటి సీన్స్ నేనే వ‌ద్ద‌ని చెబుతా. కానీ ఈ సినిమాలో ముద్దు చాలా కీల‌కం. క‌థ‌ని మ‌లుపు తిప్పేది, మ‌రో స్టేజ్‌కి తీసుకెళ్లేది అదే. అందుకే ఒప్పుకొన్నా. పైగా ఆ ముద్దు కూడా రొమాంటిక్‌గా తీశారు. వెగ‌టుగా అనిపించ‌దు.

* మీ ఆవిడ అభ్యంత‌రం చెప్పలేదా?
- ముందు మా ఆవిడ ప‌ర్మిష‌న్ తీసుకొన్నాలెండి. ఆ ఇబ్బంది లేదు.

* మీ క‌థానాయిక‌ల్ని మీ ఆవిడ‌కు ప‌రిచ‌యం చేస్తారా?
- దాదాపుగా. సెట్ కి అప్పుడ‌ప్పుడూ వ‌స్తుంటుంది. నా హీరోయిన్స్ మా ఆవిడ‌కు మంచి ఫ్రెండ్స్ అయిపోతుంటారు.

* ఇంత‌కీ ఆహా కళ్యాణం డ‌బ్బింగా? స్ట్ర‌యిట్ తెలుగు సినిమానా?
- స‌గం.. స‌గం. నిజానికి తెలుగు, త‌మిళంలో ఒకేసారి ఈ సినిమా తీయాల‌నుకొన్నాం. కానీ డేట్లు స‌ర్దుబాటు కాలేదు. అందుకే చాలా సీన్స్ త‌మిళం నుంచి డ‌బ్ చేశాం. కొన్ని మాత్రం తెలుగులో తీశాం. కానీ తెలుగు ఫీలే క‌నిపిస్తుంది.

* త‌మిళంలో మీ మార్కెట్ ఎలా ఉంది?
- మార్కెట్ గురించి కాదు గానీ, అక్క‌డ ఆద‌ర‌ణ అమేజింగ్‌. చేసింది మూడు సినిమాల్లో. ఈగ మాత్రం బాగా ఆడింది. కానీ అక్క‌డికి వెళ్ల‌గానే.. నాపై చూపించే అభిమానం ఉంది చూశారూ...అది సూప‌రండీ. చిన్న‌చిన్న ప్ర‌య‌త్నాల‌కు ఇంత గుర్తింపు ఉంటుందా? అనిపిస్తోంది.

* జెండాపైక‌పిరాజు సంగ‌తులేంటి?
- అలాంటి సినిమా ద‌క్క‌డం నా అదృష్టం. జెండాపైక‌పిరాజులాంటి ఒక్క సినిమా చేసినా చాలు... న‌టుడి జ‌న్మ థ‌న్యం అవుతుంది. నిజంగా నా మ‌న‌సుకి బాగా ద‌గ్గ‌రైన సినిమా అది.

* రాబోయే సినిమాలేంటి?
- జెండా... వ‌చ్చిన త‌ర‌వాత కొన్నాళ్లు విశ్రాంతి తీసుకొందాం అనుకొంటున్నా. పైప్ లైన్‌లో చాలా సినిమాలున్నాయి. అయితే ఏదీ ఖ‌రారు కాలేదు.

* ఒకే ఆల్ ది బెస్ట్‌..
- థ్యాంక్యూ

- కాత్యాయని

మరిన్ని సినిమా కబుర్లు
cine churaka