Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
Patashala-13 by bhaskarabhatla

ఈ సంచికలో >> సినిమా >>

చిత్ర సమీక్ష - ఆహా కళ్యాణం

Movie Review - Aahaa Kalyanam

చిత్రం: ఆహా కళ్యాణం
తారాగణం: నాని, వాణీకపూర్‌, బడవ గోపి, ఎం.జె.శ్రీరామ్‌, కార్తీక్‌ నాగరాజన్‌, సిమ్రాన్‌ తదితరులు
ఛాయాగ్రహణం: లోకనాథన్‌ శ్రీనివాసన్‌
సంగీతం: ధరన్‌కుమార్‌
నిర్మాణం: యశ్‌రాజ్‌ ఫిలింస్‌
దర్శకత్వం: ఎ.గోకుల కృష్ణ
నిర్మాత: ఆదిత్య చోప్రా
విడుదల తేదీ: 21 ఫిబ్రవరి 2014

క్లుప్తంగా చెప్పాలంటే :
శక్తి (నాని), శృతి (వాణీకపూర్‌) వెడ్డింగ్‌ ప్లానర్స్‌. వీరిద్దరూ పేరున్న వెడ్డింగ్‌ ప్లానర్‌ చంద్రలేఖ (సిమ్రాన్‌) వద్ద పనిచేస్తారు. కొన్ని కారణాలవల్ల చంద్రలేఖ నుంచి విడిపోయి, శక్తి ` శృతి ‘గట్టిమేళం’ పేరుతో ఓ సంస్థ స్థాపిస్తారు. వెడ్డింగ్‌ ప్లానర్స్‌గా శక్తి, శృతి తక్కువ కాలంలోనే ఎక్కువ పేరు ప్రఖ్యాతులు సంపాదిస్తారు. అయితే వీరిద్దరి మధ్యా విభేదాలొచ్చి విడిపోతారు. ఆ తర్వాత ఏం జరుగుతుంది.? అన్నది మిగతా కథ. అది తెరపై చూడాల్సిందే.

మొత్తంగా చెప్పాలంటే :
తెరపై సహజంగా కన్పించడంలో నానికి ఓ ప్రత్యేకత వుంది. కానీ ఈ సినిమాలో అది కాస్త మిస్‌ అయినట్లు అన్పిస్తుంది. తమిళ డబ్బింగ్‌ డైలాగుల కారణంగానో ఏమో, నేటివిటీ బాగా మిస్‌ అయ్యింది నాని పాత్ర వరకూ.

వాణీకపూర్‌ కాన్ఫిడెంట్‌గా కన్పించింది. గ్లామరస్‌గానూ కన్పించింది. నానికి మాత్రం సరిజోడీ అన్పించుకోలేకపోయింది. నాని కంటే పెద్దగా కన్పించడంతో కాస్తంత ఇబ్బందికరంగా వుంటుంది వీరిని తెరపై చూసే ఆడియన్స్‌కి. సిమ్రాన్‌ చాన్నాళ్ళ తర్వాత తెలుగు తెరపై కన్పించినా, ఆమెకు దక్కింది అతిథి పాత్రే. అంతకన్నా ఆమె గురించి మాట్లాడుకోడానికి ఏమీ లేదు. మిగతా పాత్రధారులంతా ఫర్వాలేదు.

హిందీలో వచ్చిన ‘బ్యాండ్‌ బాజా బారాత్‌’ సినిమాకి ఇది అఫీషియల్‌ రీమేక్‌. తెలుగులో ‘జబర్‌దస్త్‌’ సినిమా కూడా దానికి ఫ్రీమేక్‌ అయినప్పటికీ, ఇది అఫీషియల్‌. తెలుగులో ‘జబర్‌దస్త్‌’ పరాజయం పాలయ్యింది. ఆ సినిమాకి నందిని రెడ్డి దర్శకురాలు.

ఈ ‘ఆహా కళ్యాణం’ విషయానికొస్తే, అఫీషియల్‌ రీమేక్‌ కావడంతో, పెద్దగా మార్పులేమీ చేయలేదు. కానీ, నేటివిటీనే సూటవలేదు. బాగా తమిళ నేటివిటీ కన్పించింది సినిమాలో. డైలాగ్స్‌లో ఆ విషయం బాగా స్పష్టమవుతుంది. మ్యూజిక్‌ వీక్‌గా వుంది. దర్శకుడు సినిమాని హ్యాండిల్‌ చేయడంలో ఫర్వాలేదన్పించుకున్నా, హ్యూమర్‌ ఎలిమెంట్‌పై శ్రద్ధ పెట్టలేకపోయాడు. హీరో హీరోయిన్ల మధ్య రొమాంటిక్‌ సీన్స్‌ విషయంలోనూ, కామెడీ విషయంలోనూ ఇంకాస్త శ్రద్ధ పెట్టి వుంటే బావుండేదన్పిస్తుంది.

ఒక్కమాటలో చెప్పాలంటే : ఈ కళ్యాణం ‘ఆహా’ అన్పించలేదు.

అంకెల్లో చెప్పాలంటే: 2.5/5

మరిన్ని సినిమా కబుర్లు
Interview with Nani