Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
cine churaka

ఈ సంచికలో >> సినిమా >>

ఆదిత్య హృదయం

aditya hrudayam

వారం గడుస్తుంటే భయంగా ఉంది. ఆదిత్య హృదయం ఈవారం ఏం రాయాలా అని. విషయాలు, విశేషాలు చాలానే ఉన్నాయ్. అందులో ఫిల్టర్ చేస్తే ఎంతోకొంత పనికొచ్చేవి ఏం ఉన్నాయని రాస్తేనే గానీ తెలీదు. సిరాశ్రీ గారు తెలీకుండా ఎంత పని పెట్టారో ఇప్పుడిప్పుడే తెలుస్తోంది. రాజశేఖరరెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మేఘ మధనం అనే ప్రాజెక్టు చేపట్టి వర్షం కురిపించినట్టు సిరాశ్రీ గారు నా బుర్రలో నాకే తెలీకుండా మేధో మధనం చేపట్టారు. ఆయనకిదేం హర్షమో! ఇలా మనకి తెలీకుండానే మన మెదళ్ళని మధించే వ్యక్తులు ఇంతక్రితం ఎవరున్నారా అని ఆలోచిస్తే విచిత్రంగా రామ్ గోపాల్ వర్మ గుర్తొచ్చాడు. అదెలాగో చెప్తాను.

ఊహ తెలిసినప్పటి నుండి ఎనిమిదో క్లాసు వరకూ మా నాన్న గారితో కలిసి చూసిన సినిమాలన్నీ విజయా వారి క్లాసిక్స్, ఎపిక్స్ - అలాగే హాలీవుడ్ వి, బాలీవుడ్ వి కూడా. ఎనిమిది నుంచి ఇంటర్ వరకూ చూసిన సినిమాలన్నీ నేను, నాఫ్రెండ్స్, కజిన్స్ తో కలిసి అన్నీ కమర్షియల్ మూవీస్. అప్పటికే దర్శకుడవ్వాలన్న ఆలోచన బలంగా పడిపోవడం మూలాన దాసరి గారు, రాఘవేంద్రరావు గారు, కోదండ రామిరెడ్డి గారు, కోడి రామకృష్ణ గారు, బి. గోపాల్ గారు తీసిన మాస్ సినిమాలన్నీ మెదడకి పట్టేశాయి. మధ్య మధ్యలో విశ్వనాథ్ గారు, జంధ్యాల గారు, సింగీతం గారు, బాపు గారు మెరుపులు మెరిపించినా, హీరోలని లైక్ చేయడం మూలాన కమర్షియల్ సినిమా స్క్రీన్ ప్లే బాగా వంటపట్టేసింది. ఎందుకంటే ఆ సినిమాల్లో పాటలుంటాయ్, డ్యాన్సులుంటాయ్. పరుచూరి బ్రదర్స్, దాసరి గార్ల పదునైన సంభాషణలుంటాయ్. సత్యానంద్ గారి నవ్వించే విలనిజాలుంటాయ్, భారీతనముంటుంది - హీరోతో పాటు సినిమాయే మార్కెట్ లో హీరోలా కనబడే పోస్టర్లు, పబ్లిసిటీ ఉంటుంది. సినిమాలు ఇలాగే తీయాలని డిసైడైపోయాను. 'శివ' సినిమా వచ్చింది. ఫస్ట్ టైమ్ చూసి బావుందనుకుని ఇంటికెళ్ళిపోయాను.

రెండ్రోజుల తర్వాత మళ్ళీ చూశాను. మొదటిసారి మిస్ అయిన డిటైల్స్ మరికొన్ని కనిపించాయి, వినిపించాయి. తర్వాత థియేటర్ లో ఆ సినిమా ఆడినన్ని రోజులూ ఎప్పుడు వీలైతే అప్పుడు చూశాను. ఈ సినిమా ఇలా తీయడానికి స్క్రిప్ట్ ఎలా రాసుకుని ఉంటారు? తెలీలేదు. ఇంత నేచురల్ గా సినిమా తీసి ఇంతపెద్ద హిట్ ఎలా చేశారు? తెలీలేదు.

ఇళయరాజా, సిరివెన్నెల సీతారామశాస్త్రి, తనికెళ్ళ భరణి అందరూ సాఫ్ట్, మెలోడియస్ భావజాలం ఉన్నవాళ్లు - అయినా ఈ సినిమాని ఇంత కమర్షియల్ అప్పీల్, ఫైర్, హీరోయిజమ్ ఎక్కణ్ణుంచి వచ్చింది? అప్పటికే స్టార్స్ అయిన నాగార్జున, మిగిలిన ఆర్టిస్టులు, టెక్నీషియన్లు ఉండగా మొదటి సినిమా డైరెక్టర్ కి ఇంత స్టార్ డమ్ ఎలా వచ్చింది? విగ్గుల్లేవు, మేకప్ లేదు, పంచ్ డైలాగుల్లేవు, ఫైట్ చేసుకునే టైము కన్నా నిలబడి చూసుకునే లెంగ్తే ఎక్కువ. కట్ చేస్తే డ్యూయెట్ సాంగుల్లేవు. అసలు కథతో పాటు పక్క పాత్రలకి పిట్ట కథల్లేవు. సినిమాలు ఇలా తీయాలి అని ఎన్నో కథలు రాసుకున్న కౌమార దశలో ఇలాక్కూడా తీయచ్చని మెప్పించాడు రామ్ గోపాల్ వర్మ. మైండ్ మీద స్టార్మింగ్ కాదు అంతకు మించి లోపలికెళ్లి కెలికేశాడు. బలంగా గట్టి దెబ్బ కొట్టాడు. ఆ దెబ్బ మామూలు దెబ్బ కాదు. ఆలోచనల పునాదుల్ని కదిపి, ఇవి పాతకాలపు భావజాలాల సమాధులని తేల్చి, ఇలా కొత్తగా ఆలోచించమని నేర్పించే ప్రయత్నంలో పూర్తిగా సఫలీకృతుడయ్యాడాయన. కానీ, నాకింకో డౌటు. ఆ రూట్ ని ఫాలో అయితే, ఆయన్నే ఇమిటేట్ చేసినట్టవుతుంది. అవ్వకపోతే మన స్క్రిప్టు మనకే నచ్చదు. ఇంటర్ అండ్ డిగ్రీ అయిదేళ్ళూ ఒక్కకథ నా సినిమా కోసం నేను రాసుకోలేక పోయాను ఈ కన్ ఫ్యూజన్ లో. దీన్ని ప్రభావమనే అనాలి. మళ్లీ దిల్ వాలే దుల్హానియా లేజాయేంగే, హమ్ ఆప్ కే హై కౌన్, తొలిప్రేమ సినిమాలొచ్చాక, నాకో రూటు దొరికింది.

రామూగారి సినిమాల్లోని సహజత్వాన్ని, విగ్గుల్లేని, మేకప్పులు, అసహజమైన సెట్లు, అసందర్భ డైలాగులు, లేని సహజత్వాన్ని ప్రేమకథల్లో ఎమోషన్స్ కి కలిపితే వాటిని అంతే సహజంగా చూపగలిగితే దర్శకుడిగా నాకో ప్ర'స్థానం' ఉంటుందని. మారుతున్న ప్రేక్షకులని ఆకట్టుకోవచ్చని అలా రూపుదిద్దుకున్నదే నా మొదటి సినిమా 'మనసంతా నువ్వే'. ఇందులో పరుచూరి బ్రదర్స్ ఉన్నారు. సీతారామశాస్త్రిగారు ఉన్నారు. కానీ మొదటి సినిమా దర్శకుడిగా నాకు ఇవాళ్టి వరకూ పేరొచ్చింది. కారణం ఇన్ డైరెక్ట్ గా ఆర్ జీవీ కదిపిన పునాదులు. ఆయన టేకింగ్ ని చాలామంది కాపీ చేశారు. కానీ దాని వెనకాల ఆయన ఎడిట్ చేసే టైమింగ్ ని నేను పట్టుకున్నాను. ఆయన సినిమాల్లోని నేచురల్ హీరోయిజమ్ ని చాలామంది కాపీ చేశారు. కానీ ఆయన సినిమాల్లో ఎమోషన్స్ లో కాన్ ఫ్లిక్ట్ లు ఉండే నేచురల్ ధోరణి ని నేను అనుకరించాను. విచిత్రం ఏంటంటే....

సిరాశ్రీకి రాము గారితో కలిసి వోడ్కా తాగడం, మానవ ప్రవృత్తిలో భిన్నకోణాల్ని ఆయన మాటల్లో వినడం ఇష్టం.

పూరీ గారికి రామూ గారితో కలిసి కథలు, ఫిలాసఫీ డిస్కస్ చేయడం ఇష్టం.

కృష్ణవంశీ గారికి రాము గారి షాట్లు, నేచురల్ హీరోయిజమ్ తన సినిమాల్లో చూపించడం ఇష్టం. ఇవన్నీ వాళ్లు మాటల సందర్భంలో అన్నవే.

నాకు రంగీలా, సత్య, కంపెనీ సినిమాల వరకూ దర్శకుడిగా రాముగారి అన్ని సినిమాలూ చూడటం ఇష్టం.

ఇవాళ్టి వరకూ ఆయనతో నాకు పరిచయం లేదు. కలిసి మాట్లాడుకున్నదీ, సినిమాల గురించి చర్చించుకున్నదీ లేదు. ఓసారి విజయవాడ ఎయిర్ పోర్ట్ లో హీరో సుమంత్ పరిచయం చేస్తే హై, బై తప్ప. ఇంకోసారి సిరాశ్రీ గారి దగ్గర నెంబర్ తీసుకుని 'వోడ్కా విత్ వర్మ' పుస్తకం చదివానండి. నేను అనుకున్నదాని కన్నా సిరాశ్రీ గారు రాసిన పుస్తకం చదివాక ఇంకా ఎక్కువ నచ్చారు అని మెసేజ్ ఇస్తే, థాంక్యూ ఆదిత్యా! అని ఆయన రిప్లై రావడం తప్ప మా మధ్య ఏ ఇంటరాక్షనూ లేదు. కానీ, నేను, నాలా చాలా మంచి సినిమా తీయాలని తపించే ప్రతి దర్శకుడి పైన ఆడిన సినిమాల ప్రభావం, వాటి దర్శక, రచయితల ప్రభావం ఎంత అధికంగా ఉంటుందో, ఆ అందరి మేధో మధనం లోనూ రామ్ గోపాల్ వర్మ గారి మధనం (ప్రభావం) ఒకింత ఎక్కువే ఉంటుందని కచ్చితంగా చెప్పగలను. బహుశా అందుకేనేమో ఆయనకొక బ్రాండ్ ఇమేజ్. మళ్లీ ఆయన్ని ఆయన రీ రూట్ చేసుకుని దర్శకుడిగా సినిమా తీస్తే, చూసి ఆనందించే అభిమానుల్లో నేనూ ఒకణ్ని!

(మళ్ళీ వచ్చేవారం మరిన్ని విశేషాలతో...)

 

మీ
వి.ఎన్. ఆదిత్య

మరిన్ని సినిమా కబుర్లు
'Basanti' Release