ఎవరు తవ్విన గోతిలో--- - వెంకటరమణ శర్మ పోడూరి

Evaru tavvina gotilo-

ఆరోజు నారాయణ బ్యాంకు నుంచి కొంచం ముందు గా వచ్చాడు. బ్రీఫ్ కేసు, బెడ్ రూమ్ లో కిటికీ ముందు ఉన్న బల్ల మీద పెట్టి వెనక్కి తిరుగుతుంటే, అతని దృష్టి కిటికీ లోంచి పక్కింటి లక్ష్మణ్ గారి ఇంటి బెడ్ రూమ్ లో ఎప్పుడూ కనపడే ఫాన్ మీద పడింది. అతనికి వెంఠనే ఆశ్చర్యం వేసింది. ఎప్పుడూ తిరుగుతూ ఉండే ఫ్యాన్ ఆగి ఉంది. వెనక్కి తిరగబోయి అక్కడ జరుగుతున్నది చూసి అర్థం కాక అలా చూస్తూ ఉన్నాడు. ఎవరో ఫాన్ మీద నుంచి ఒక పెద్ద గుడ్డ వేసి కిందకి లాగుతున్నారు. ముందు అర్థం కాలేదు, కానీ వెంఠనే అక్కడ ఆత్మ హత్యా ప్రయత్నం జరుగుతోందని అతనికి తట్టడానికి రెండు క్షణాలు పట్టింది. అది లక్ష్మణ్ గారి చిన్న కొడుకు విశాల్ గది అని అతనికి తెలుసు . వెంఠనే అతను కిందకి పరిగెత్తి వ్వాచ్మన్ యాదగిరిని గట్టిగా అరిచి పిలిచి అతను రాగానే తనతో రమ్మని లక్ష్మణ్ గారి ఇంట్లోకి పరిగెత్తాడు. పరిగెడుతూనే విషయం చేప్పి లోపలికి వెళ్ళగానే వాళ్ళ కి విషయం చెప్పమన్నాడు.

ఇద్దరూ వెళ్ళేటప్పటికి లక్ష్మణ్ గారు ఎవరితోనో మాట్లాడుతున్నారు. వీళ్ళిద్దరూ అరుచుకుంటూ ప్రవే సించేటప్పటికీ ఆయన కంగారుగా లేచాడు. యాదగిరి విషయం చెప్పగానే అందరూ విశాల్ రూమ్ వైపు పరిగెత్తగారు. అరుపులకి ఇంట్లో ఆడ వాళ్ళు కూడా వచ్చారు. తలుపులు బాదినా లోపల నుంచి స్పందన లేకపోతే లక్ష్మణ గారికి ఏమి చేయాలో తోచలేదు. ఆయన భార్య అరుస్తూ అన్ని రూములకీ బయటినుంచి తెరిచే తాళాలు ఉన్నాయి కదా అవి తెమ్మని, కూతురో ఇంకెవరితోనో చెప్పడంతో, ఆమె పరిగెత్తి తాళాలు తెచ్చి, గది తెరిచింది. అప్పటికే విశాల్ ఫాన్ కి వెళ్ళాడుతున్నాడు. గబా గబా యాదగిరి, మిగతా నౌకర్లు కిందకి దింపారు. లోపులో నారాయణ అంబులెన్సు కి కాల్ చేశాడు. కొన ఊపిరి తో ఉన్న విశాల్ ని దగ్గరలో ఉన్న యశోదా కి తీసుకువెళ్లారు. వెనకాల నాలుగు కార్లు బయలుదేరాయి.

హాస్పిటల్ వాళ్లు, విశాల్ ని చేర్చుకుని అవసరమయినదంతా చేశారు . అయినా ఇరవయి నాలుగు గంటలు గడిస్తేనే కానీ చెప్పలేమని చెబితే, లక్ష్మణ్ గారికి ధైర్యం చెప్పి నారాయణ వచ్చేశాడు. విశాల్ అలా ఎందుకు చేశాడో మెల్లిగా కనుక్కోమన్నాడు యాదగిరితో. తాను చెప్పక పోయినా యాదగిరి సమాచారం రాబడ తాడని తెలిసినా

****

నారాయణ హైదరాబాద్ కి బదలీ మీద వచ్చి మూడేళ్లు అయింది. ఒక జాతీయ బ్యాంకు లో మొండి బకాయిల వసూలు విభాగం లో ఆఫిసర్. ఆఫీసు వాళ్లే, బ్యాంకు కు దగ్గరగా ఒక మూడంతస్తుల అపార్ట్మెంట్ కాంప్లెక్స్ లో పెంట్ హౌస్ లో అతనికి నివాసం ఏర్పరిచారు.

అతను ఉంటున్న కాంప్లెక్స్ ని ఆనుకునే ఒక పెద్ద ఇంట్లో ఓక మాజీ మంత్రి లక్ష్మణ్ గారి నివాసం. ఆయనకి చాలా వ్యాపారాలున్నాయని, కాంప్లెక్స్ వాచ్ మన్ యాదగిరి చెబుతూ ఉంటాడు. పదవి ఉన్నా లేకపోయినా, ప్రభుత్వం లో ఉన్న పట్టు వల్ల, లిక్కర్ వ్యాపారం, అక్రమ ఇసుక సరఫరా ఇలా చాలా వాటి ద్వారా ఆయన ఆదాయం చాల కోట్లలో ఉంటుందని యాదగిరి భోగట్టా. డబ్బుని అనేక రకాల పెట్టుబడులు పెట్టి పెంచుతున్నాడని భోగట్టా. బ్లాక్ ని వైట్ చేయడానికి బినామీలతో అనేక వ్యాపారాలు చేస్తూ ఉంటాడని గొంతు తగ్గించి రహస్యం చెబుతున్నట్టు చెప్పాడు నారాయణకు

పెంట్ హౌస్ ముందు భాగం నుంచి మంత్రి గారి కాంపౌండ్ కనపడుతూ ఉంటుంది. ఎప్పుడూ వచ్చే పోయే కార్లు, జనాలతో హడావిడిగా ఉంటుంది. నారాయణ బెడ్ రూమ్ లోంచి లక్ష్మణ్ గారి ఇంటి మొదటి అంతస్తు లో ఒక రూమ్ కనపడుతూ ఉంటుంది. అది బెడ్ రూమో రూమో తెలియదు కానీ, సీలింగ్ ఫ్యాన్ కనపడుతూ ఉంటుంది. ఫ్యాన్ ఆగి ఉండడం అతను ఎప్పుడూ చూడ లేదు. యాదగిరి చెప్పడం రూమ్ లక్ష్మణ్ గారి రెండో కొడుకు విశాల్ వాడతాడని ఎప్పుడో చెప్పాడు.

****

మర్నాడు ఆదివారమయినా రోజూ లాగే అయిదింటికి వాకింగ్ కి వెళ్లి వస్తూ, లక్ష్మణ్ గారి ఇంట్లో నూ, వాకిట్లోనూ లైట్లు వెలుగుతొంటే అక్కడ ఉన్న వాళ్ళని ' విశాల్ కి ఎలా ఉందని " అడిగాడు . "ఇంకా తెలివి రాలేదు కానీ, డాక్టర్లు ప్రాణాపాయం లేదని అన్నారండి" అని వాళ్ళు చెప్పగానే సంతోషించాడు

బ్రేక్ ఫాస్ట్ చేసి కాఫీ తాగుతోంటే యాదగిరి వచ్చాడు. అతనికి కూడా కాఫీ ఇచ్చి " అసలు ఏమిజరిగింది ? ఏమయినా తెలిసిందా?" అన్నాడు నారాయణ

" పది రోజుల కిందటే కోయింబత్తూర్ అవతల ఒక మెడికల్ కాలేజీ లో చేరాడట. నిన్నపొద్దుటే అక్కడినుంచి అనుకోకుండా వచ్చి "ఎందుకు వచ్చావురా ?" అని అడిగితే జవాబు ఏమీ చెప్పకుండా తన రూమ్ లోకి వెళ్ళిపోయాడట.మధ్యాహ్నం భోజనం చేసి మళ్లీ రూముకి వెళ్లి పోయాడట" ఇంత కన్నా వివరాలు తెలియ లేదండి అని చెప్పి వెళ్లి పోయాడు

యాదగిరి చెప్పిన వివరాలు వింటే నారాయణకి, అతని మిత్రుడు రాధాకృష్ణ వదిన గారి కూతురు గుర్తు కువచ్చింది. అమ్మాయి కేరళలో ఎదో కోర్సులో చేరి వారం తిరక్కుండా వచ్చి, బాత్ రూమ్ లో ఆత్మ హత్య చేసుకుంది. భరించలేని అవమానం ఎదో అక్కడ జరిగి ఉంటుంది. అది తిప్పుకోలేక పని చెసి ఉంటుంది అనుకున్నారు. వాళ్ళు పలుకుబడి ఉన్న వాళ్ళు కాదు కాబట్టి, ఆత్మహత్యకి కారణం ఊహల దగ్గరే ఆగిపోయింది. అది జరిగిన కొద్ధి నెలలకే ఒక కాలేజీలో అమ్మయిలే దారుణ ర్యాగింగ్ చేసి ఇంకో అమ్మాయి మరణానికి కారణమయ్యారని పేపర్లో చదివాడు నారాయణ . అది తలుచుకునప్పుడల్లా ప్రభుత్వాలమీద, కాలేజీల మీద ర్యా గింగ్ కంట్రోల్ చేయలేక పోతున్నందుకు ఒక నిస్పృహ తో కూడిన కోపం ఫీల్ అవుతూ ఉంటాడు అతను

కొత్త గా చేరాడు అంటున్నారు కాబట్టి రాగింగ్ లాంటిది ఎదో అయి ఉండాలి అనుకున్నాడు. ఇంతలోనే మళ్ళీ యాదగిరి ఒక పోలీసు ఆఫీసర్ని వెంట పెట్టుకు వచ్చాడు

ఆఫీసర్ ని చూడగానే " ఏమిటి కృష్ణ యాదవ్ గారు ఇలా వచ్చారు ?" అడిగాడు నారాయణ . ఎస్ఐ కృష్ణ యాదవ్ నారాయణకి బ్యాంకు కస్టమర్ గా బాగా పరిచయం

" మీరా సార్ నిన్న లక్ష్మణ్ గారికి సహాయం చేసింది . ఎవరో అనుకున్నాను" అని కూర్చుని యాదగిరిని వెళ్లిపొమ్మన్నాడు

" నిన్న జరిగింది వివరంగా చెబుతారా? " అన్నాడు . జరిగిందంతా మళ్ళీ వివరంగా చెప్పి, యాదగిరి చెప్పిన విషయాలు కూడా చెప్పాడు

" మీరు ఒక మాటు స్టేషన్ కి వచ్చి రిపోర్ట్ ఇవ్వవలిసి ఉంటుంది సార్. మేము ఇన్వెస్టిగేట్ చేయాలి కదా? మీరు అంత త్వరగా స్పందించక పోతే నిండు ప్రాణం పోయేది. ఇంకా పూర్తిగా స్పృహ రాలేదు. వస్తే కానీ అతనిని ప్రశ్నించలేము" అన్నాడు

" అతనిని తరవాత ప్రశ్నించ వచ్చు. నా ఉద్దేశ్యం లో ముందు మీరు అతను చదువుతున్న కాలేజీ కి వెళ్లి అతని క్లాస్ మేట్స్ ని విచారించి పది రోజులలో ఏమి జరిగిందో కనుక్కోవాలి. నా ఉద్దేశ్యం లో ఇది ర్యాగింగ్ ఎఫెక్ట్. మీరు ఆలోచించండి" తన అభిప్రాయం చెప్పాడు నారాయణ.

" మీరు చెప్పింది నిజమే. నేను వెంఠనే వెళ్లి విచారిస్తాను. కోయింబత్తూర్ దగ్గర ఎస్కెపి మెడికల్ కాలేజీ అన్నారు కదా?" అని లేచాడు.

***

మరునాడే నారాయణ, ట్రైనింగ్ కోసం పదిహేనురోజులు ముంబయి ప్రయాణ మయాడు . బయలు దేరుతోంటే లక్ష్మణ్ గారు వచ్చి, సరి అయిన సమయం లో వచ్చి విశాల్ ప్రాణాలు కాపాడినందుకు మరీ మరీ కృతజ్ఞతలు చెప్పి వెళ్ళాడు . " ఎలా ఉన్నాడు విశాల్ అని అడిగితే. ఆయనకీ దుఃఖం వచ్చి ముందు మాట రాలేదు. తమాయించుకుని చెప్పాడు. బ్రెయిన్ కి రక్త ప్రసరణ సరిగ్గా అవటం లేదట ఆపరేషన్ చేయాలిఅని. . మామూలు మనిషి అవటానికి చాలా సమయం పట్ట వచ్చు అంటున్నారు అని చెప్పి , తిరిగి వచ్చిన తరువాత తప్పకుండా ఇంటికి రమ్మన్నాడు.

ట్రైనింగ్ నుంచి తిరిగి వచ్చిన రోజున ఆఫీసుకు వెడుతోంటే యాదగిరి కనపడితే అడిగాడు "విశాల్ ఎలా ఉన్నాడ ని? " బాగానే ఉన్నారండి, ఇంకా హాస్పిటల్ లోనే ఉన్నారు. ఆపరేషన్ చేయాలిట " అన్నాడు. . లక్ష్మణ్ గారి ఇంటి మీదుగా వెడుతూ అటుకేసి చూస్తే ఏమీ హడావిడి లేకుండా నిర్మానుష్యంగా ఉంది.

బ్యాంకు చేరుకొని పనిలో పడ్డాడు . బ్యాక్ లాగ్ కరెస్పాండెన్స్ చూసుకుని, టీ తాగుతూ కేబిన్ గ్లాస్ లోంచి బయటికి చూస్తే, కౌంటర్ దగ్గర కృష్ణ యాదవ్ కనిపిస్తే, బయటికి వచ్చి అతనికి విష్ చేశాడు నారాయణ. లోపలికి రమ్మని చెయ్యి ఊపాడు. యాదవ్ వచ్చి కూర్చో గానే, అతనికి టీ చెప్పి, " ఏమైంది విశాల్ విషయం? ఏమన్నా తెలిసిందా? " అన్నాడు కుతూహలంగా

"చాలా విషయాలు జరిగాయి. మీరు ఆశ్చర్య పోతారు. సాయంత్రం వాకింగ్ కి స్టేషన్ వైపు రండి. మాట్లాడుకుందాము". అన్నాడు, ఎవరో సంతకాలకు కాబిన్ లోకి వచ్చిన వాళ్ళని చూసి లేస్తూ.

**

సాయంత్రం ఆఫీసు అవగానే స్టేషన్ వైపు నడిచాడు నారాయణ. స్టేషన్లో యాదవ్ ఎవరితోనో మాట్లాడుతూ లేచి చేయి కలిపి కూర్చో మన్నాడు, రైటర్ కి టీ చెప్పమని సైగ చేసి.

వ్యక్తి వెళ్లిన తరవాత, " ఇప్పుడు చెప్పండి ఏమిజరిగింది ?" అడిగాడు నారాయణ కుతూహలంగా

కృష్ణ యాదవ్ సిగరెట్ వెలిగించి చెప్పడం ప్రారంభించాడు ( ciegarette smoking is injurious to health 😁)

నేనూ, ఏఎస్ఐ నాగరాజు పల్లెటూరు రైతుల వేషంలో వెళ్లాం విశాల్ కాలేజీకి. మా తమ్ముడి ని చేరుద్దామని వచ్చామనీ, ఇక్కడ ర్యాగింగ్ ఏమన్నా ఉందా అని ఫస్ట్ ఇయర్ వాళ్ళని క్యాంటీన్లో పక్కకి పిలిచి అడిగాము. వాళ్ళు ముందర చెప్పలేదు కానీ, కబుర్లలోపెడితే చెప్పారు. ఎక్కువగా ర్యాగింగ్ చేస్తున్న వాళ్ళు ముదిరాజ్, రంగరాజ్, సెంథిల్, కుమార్ అనే వాళ్ళ పేర్లు చెప్పారు . వాళ్ళు నలుగురూ మూడో సంవత్సరం సీనియర్లు. వాళ్ళల్లో ముఖ్యంగా కుమార్ చాలా నిర్దాక్షిణ్యం గా చేస్తాడట. " చూసుకోండి ఎలా చేస్తానో " అని తోటి విద్యార్థుల పొగడ్తల కోసం రెచ్చి పోయి, కొత్త కొత్త పద్ధతులు కనిపెట్టి చేస్తూ ఉంటాడట. భయం కొద్దీ ఎవళ్ళూ వాళ్ల మీద రిపోర్ట్ చేయడం జరగలేదు. ప్రిన్సిపాల్ కి చూ చాయగా తెలిసినా , కుమార్ తండ్రి, కాలేజీ కి సంబంధించిన చాలా కాంట్రాక్టులు చేస్తూ ఉండడం వల్ల ఏమీ చేయలేక పోయాడు. వాళ్ళ ద్వారానే మాకు తెలిసినదేమిటంటే, నాలుగు రోజుల క్రితం 'విశాల్ ని కుమార్ గ్రూపు దారుణంగా ర్యాగింగ్ చేసిందనీ, మర్నాడు ప్రొద్దుటే అతను వెళ్లిపోయాడని చెప్పారు

మేము లోకల్ పోలీసులని కాంటాక్ట్ చేసి, విశాల్ కేసు దృష్ట్యా కుమార్ గేంగ్ నలుగురినీ అరెస్ట్ చేయడానికి ఏర్పాట్లు చేసుకుని మర్నాడు మళ్ళీ కాలేజీ కి వెళ్ళాము

మేము కుమార్ గురించి వాకబు చేసి, కాలేజీ బయట కిళ్లీ కొట్టు దగ్గర సిగరెట్లు కొంటూ ఉంటె అక్కడ కలిశాము. క్రిందటి రోజు కుర్రాళ్ళని అడిగినట్టే, కుమార్ నీ, వాడి పక్కన ఉన్న వాళ్ళని ర్యాగింగ్ గురించి అడిగాము. మేము మఫ్టీ లోనే వెళ్ళాము , మా బంధువు చేరుద్దా మనుకుంటున్నామని మాటలు కలిపాము

కుమార్ మాకు పెద్ద లెక్చర్ ఇచ్చాడు " ర్యాగింగ్ అంటే అంత భయం ఎందుకు అంకుల్? ఎదో కొత్తలో కొంత చేసినా, వాళ్ళతో పరిచయం పెంచుకుని చదువులో చాలా సహాయం చేస్తాము తరవాత. ఒత్తిడి తట్టుకుని అన్ని పరిస్థితులలోనూ సంయమనం ఎలా పాటించాలో వాళ్లకి ట్రైనింగ్ లాంటిదే తప్ప వేరే ఏమీ కాదు " అని, వాళ్ళ పైశాచిక ఆనందం విషయం తప్ప మిగతా కబుర్లు ఏవో చెప్పాడు.

" నువ్వు చెబుతున్నది బాగానే ఉంది బాబూ. మీరు ర్యాగింగ్ చేస్తున్న కుర్రాళ్ళు అందరూ టెస్ట్ ట్యూబ్ లాంటి వాళ్ళు కాదు కదా? అందరూ ఒకే లా ఉండరు. ఒక్కొక్క సున్నిత మనస్కుడు అవమానం భరించలేక ఆత్మ హత్యకి పాల్పడవచ్చు. అనవసరంగా ఒక్క ప్రాణం పోయినా తప్పే కదా ? అన్నాను నేను

" అంత సున్నిత మయిన మనసు ఉన్నవాడు, ఇప్పుడు కాకపోతే ఎప్పుడయినా పని చేయవచ్చు" అన్నాడు తల ఎగరేసి

దానితో నాకు కోపం తన్నుకు వచ్చి, "ప్రాణాలు అంటే అంత చీప్ అయిపోయాయిరా మీకు" అని సాచి లెంపకాయ కొట్టాను వాణ్ని. మిగతా వాళ్ళు గొడవ చేయబోతే, కొద్ది దూరంలో ఉంచిన లోకల్ పోలీసులి పిలిచి అందరినీ అరెస్ట్ చేసి తీసుకు వచ్చాము." వివరించాడు యాదవ్

" నేరం ఒప్పుకున్నారా ? అంత ఆత్మ హత్యకి పాలుపడేటంతగా విశాల్ ని ఏమి చేశారట వాళ్ళు?" అడిగాడు నారాయణ కుతూహలంగా

"మొదట చెప్ప లేదు. మా పద్దతి లో అడిగితే, మిగతా వాళ్ళు జరిగిందంతా చెప్పారు. ఛార్జ్ షీట్ ఫైల్ చేశాము. వివరాలు వింటే మీరు ఆశ్చర్య పోతారు" టీ సిప్ చేసి అన్నాడు యాదవ్

" ఏమిటి అంత ఆశ్చర్య పరిచేది?" అన్నాడు నారాయణ

" విశాల్ ని ర్యాగింగ్ చేసిన క్రితం రోజు. వీళ్ళందరూ ఒక సినిమా కుమార్ ప్రైవేట్ ప్రొజెక్టర్ లో చూశారట. అందులో ర్యాగింగ్ చేయడం చూసి అది చాలా కొత్తగా ఉందని దానిని ఇంకొంచం పెంచి వీళ్ళు విశాల్ మీద ప్రయోగించారట. " చెప్పాడు యాదవ్

" సినిమాలలో అంత ఎక్కువ చూపిస్తే సెన్సార్ కట్ చేస్తారు కదా" అడిగాడు నారాయణ

" మీరు చెప్పింది నిజమే. కానీ కుమార్ కజిన్ ఎవడో సినిమాలకి ఎడిటరుట. వాళ్ళది పెద్ద పైరసీ వ్యాపారం. వీళ్ళకి ఎడిటింగ్ అవకుండా మొత్తం వస్తూ ఉంటాయట. అసలు విషయం తెలిస్తే మీరు ఇంకా ఆశ్చర్య పోతారు. వాళ్ళని అరెస్ట్ చేసినట్టు, వాళ్ళు నేరం ఒప్పుకున్నట్టు తెలియగానే లక్ష్మణ్ గారు పరిగెత్తుకు వచ్చాడు.

వస్తూనే అడిగాడు ఏమి జరిగిందని.

ఒక సినిమా చూసి వాళ్ళు, అందులో ఉన్నట్టు ర్యాగింగ్ చేశారుట అని చెప్పాను. సినిమా తెలుగులోనూ, తమిళం లోనూ కూడా తీశారట అని చెప్పాను

సినిమానా ? సినిమా అది? అని అడిగాడు ఆయన

పేరు చెప్పగానే నిస్చేష్టుడయి కుర్చీలో కూర్చుండి పోయాడు.

" ఎందుకలా ? " కుతూహలంగా అడిగాడు నారాయణ

లక్ష్మణ్ గారు బ్లాక్ ని వైట్ చేయడానికి వాడిని ఎవడినో బినామీ గా పెట్టి సినిమాలు తీస్తున్నాడట. కుమార్ చూసి ర్యాగింగ్ అనుకరించిన సినిమా కి అసలు ప్రొడ్యూసర్ ఈయనే

అది విని నారాయణకి బుర్ర దిమ్మెక్కి ఆలోచనలు స్తంభించాయి . ఇంక లక్ష్మణ్ గారి సంగతి ?

సమాప్తం

మరిన్ని కథలు

Chandruniko noolu pogu
చంద్రునికో నూలు పోగు
- కాశీవిశ్వనాధం పట్రాయుడు/kasi viswanadham patrayudu
Anaadha atidhyam
అనాథ అతిథ్యం
- - బోగా పురుషోత్తం
Vibheeshana Sharanu
విభిషణుని శరణు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Srivariki prema lekha
శ్రీవారికి ప్రేమలేఖ
- తాత మోహనకృష్ణ
Ramdaas formula
రాందాస్ ఫార్ములా
- వీరేశ్వర రావు మూల
Attagari samrajyam
అత్తగారి సామ్రాజ్యం
- బొబ్బు హేమావతి
Pramod Pesarattu
ప్రమోద్-పెసరట్టు
- వీరేశ్వర రావు మూల