కానుక - మద్దూరి నరసింహమూర్తి

Kaanuka

శ్రీరామ

సాయంత్రం ఆఫీస్ నుంచి వచ్చిన మోహన్ కి శృతి కాఫీ కప్పు ఇచ్చి - "ఉదయం అబ్బాయి ఫోన్ చేసాడు"

" ఏమంటాడు"

"వచ్చే ఏడు ఏప్రిల్ ఆఖరు సరికి పదిహేను రోజులు సెలవు పెట్టి పిల్లలతో వస్తున్నాడట. రాత్రి తొమ్మిది తరువాత మళ్ళా చేస్తానన్నాడు".

"సరే, నేను ఫ్రెష్ అయి వస్తాను. ఈ రోజు శుక్రవారం కదా, అమ్మవారి గుడికి వెళ్లి, ఎక్కడేనా హోటల్లో తినేసి వద్దాం."

ఫోన్ మ్రోగింది. పూణే నుంచి వాళ్ళ చరణ్.

స్పీకర్ ఆన్ చేసి, మోహన్ : "ఏం నాన్నలూ అంతా బాగున్నారా”

"మేమంతా బాగానే ఉన్నాం నాన్నా.

"మరేమిటి విశేషాలు చెప్పు,"

"ఉదయం అమ్మకి చెప్పాను. ఏప్రిల్ ఆఖరికి మేమంతా వస్తున్నాం. మురళి రెండో పుట్టినరోజుకి అక్కడే ఉంటామన్నమాట. పదిహేను రోజులు సెలవు పెట్టాను. అక్కవాళ్ళని కూడా, వీలైతే పదిహేను రోజులు సెలవు పెట్టుకొని అప్పటికే రమ్మని చెప్పాను. ఉదయం అమ్మతో మాట్లాడినప్పుడు, ఆఫీస్ పని తొందర్లో ఆ విషయం చెప్పడం మరచిపోయాను."

"స్పీకర్ ఆన్ లోనే ఉంది. మీ అమ్మ వింటూందిలే. పదిహేను రోజులు సెలవు పెట్టేనంటున్నావు. ఇక్కడే ఉంటారా. వేరే ప్రోగ్రాము పెట్టుకొని వస్తున్నారా. "

"ఎక్కడికి వెళ్ళేది లేదు నాన్నా. ఇంట్లోనే ఉంటాం. అమ్మా- నువ్వు ఏమి మాట్లాడడం లేదు."

"నేను వేరే మాట్లాడేది ఏముంది నాన్నలూ. తప్పకుండా రండి.”

“సరే, ఉంటాను." అని చరణ్ ఫోన్ ఉంచేశాడు.

"ఏమిటండి వీడు. ఎప్పుడో నాలుగు నెలల తరవాత వస్తున్నామని ఇప్పుడే చెప్తున్నాడు. పైగా పదిహేను రోజులు సెలవు పెట్టి ఇక్కడ ఇంట్లోనే ఉండడానికే వస్తున్నాము అంటున్నాడు. ఎందుకో, నాకు ఏమీ అర్ధం కావడం లేదు."

-2-

" మురళి పుట్టిన తేదీ మే ఎనిమిదో తేదీన కదా, నాన్నలూ వాళ్ళు ఏప్రిల్ నెలాఖరు సరికే ఎందుకొస్తున్నారు చెప్పు. పైగా, పల్లవి వాళ్ళని కూడా ఏప్రిల్ నెలాఖరు సరికే రమ్మంటున్నాడు."

"ఏమో బాబూ"

"ఏప్రిల్ 30న, నేను రిటైర్ అవుతాను కదా."

"అదా సంగతి. మీకు షష్టి పూర్తి చేస్తాననుకుంటున్నాడేమో.”

రెండు రోజుల తరువాత పల్లవి ఫోన్ చేసి, వాళ్లంతా కూడా ఏప్రిల్ ఆఖరికి వస్తున్నారని, ఆ విషయం తమ్ముడికి కూడా తెలియచేసేనని, చెప్పింది.

నెల రోజుల తరువాత, ఒక రోజు సాయంత్రం ఆఫీస్ నుంచి వచ్చిన మోహన్ నిశ్శబ్దంగా పరధ్యానంగా కాఫీ త్రాగుతూ ఉంటే ---

శృతి : "ఏమిటి అలా పరధ్యానంగా ఉన్నారు. ఏం జరిగిందేమిటి."

మోహన్ : "ఈ రోజు నాతో పనిచేసే విశ్వం ----‘నువ్వు రిటైర్ అయిన తరువాత, ఇక్కడే ఉంటున్నావా లేక మీ అబ్బాయి దగ్గరికి పూణే వెళ్ళిపోతున్నావా’ --- అని అడిగి, అంతటితో ఊరుకోకుండా --- ‘ఏదేనా ఆలోచించి నిర్ణయం తీసుకో. చేతులు కాలేక ఆకులు పట్టుకుంటే లాభం లేదు. మన శంకరం చూడు, రిటైర్ అవగానే వాళ్ళ అబ్బాయి రమ్మన్నాడు కదా అని గెంతుకుంటూ వెళ్లిపోయి, నాలుగు నెలలు కూడా అవకుండానే, అక్కడ ఇమడలేక, పుంజాలు తెంపుకొని వెనక్కి వచ్చేసాడు’ అని అంటే.......”

"మరి మీరేమన్నారు"

"ఇంకా ఏదీ తేల్చుకోలేదు, అని దాటవేసాను."

"వాళ్ళకి అలా చెప్పి తప్పుకున్నారు కానీ, రేపు అబ్బాయి మనల్ని పూణే వచ్చీమంటే, ఏంచేద్దామనుకుంటున్నారు."

“వాడేమిటి అంటాడో చూసి, అప్పుడు నిర్ణయిద్దాములే." అని అప్పటికి ఆ ఆలోచన వాయిదా వేసినా, ఏమిటి చేయడం అని అంతరాంతరాలలో ఆలోచిస్తూనే ఉన్నారు, మోహన్.

నాలుగు రోజులు గడిచేసరికి, ఆ ఆలోచన ఒత్తిడి భరించలేక, ఐదో రోజు సాయంత్రం -- "శ్రుతీ, అబ్బాయి రమ్మంటే, వాడి దగ్గరికి వెళ్ళిపోదాం. తరువాత సంగతి తరువాత చూడొచ్చు."

"సరే, అలాగే కానివ్వండి".

-3-

మార్చి నెల రెండో వారంలో, ఒక రోజు ఉదయం ఆఫీస్ పనిమీద ఒక్కడే వచ్చిన చరణ్ : "నాన్నా, షష్టి పూర్తి ఎలా చేద్దామంటారు, ఆయుష్ హోమం, సత్యనారాయణవ్రతం, తెలిసిన వాళ్ళకి భోజనాలు అనుకుంటున్నారా, లేక ఇంకా వేరే విధంగా అనుకుంటున్నారా" అని అడిగితే,

మోహన్ : "వ్రతం చేసుకొని, ఆ పౌరోహిత్యుని దగ్గరే ఆశీర్వచనం తీసుకుంటే సరిపోతుంది. పల్లవి వాళ్ళు మీరు చాలు. రాగలిగి వచ్చేరా మీ అత్తవారు, పల్లవి అత్తవారు. అంత కంటే, వేరే ఎవరిని పిలవదలచుకోలేదు." అన్నారు.

"సరే అలాగే చేద్దాము. అన్నిపనులు, ఖర్చుఅంతా నేను చూసుకొంటాను. మీరు పౌరోహిత్యులవారితో మీ పుట్టినరోజు 28 నాడు తప్పకుండ వచ్చేటట్లు ముందుగానే మాట్లాడండి. ఆ రోజు ఏకాదశి, శనివారం కూడా కదా. " అని చెప్పి, ఆఫీస్ పని చూసుకొని మరునాడు పూణే వెళ్లిపోయేడు.

ఏప్రిల్ నెల 26 వ తేదీన చరణ్ వాళ్ళు, పల్లవి వాళ్ళు వచ్చేరు. ఆ మరుసటి రోజుకి, ఇరు వియ్యాలవారు వచ్చేరు.

చరణ్, రాగిణి అందరికి బట్టలు పెట్టి, మోహన్ గారి షష్టి పూర్తి చక్కగా జరిపించేరు.

ఆ రోజు సాయంత్రంకే, ఇరు వియ్యాల వారు వెనక్కి వెళ్లిపోయారు. పది రోజులు పోతే వచ్చి పల్లవిని పిల్లల్ని తీసుకొని వెళ్తానని, అల్లుడు కూడా వెనక్కి వెళ్ళిపోయాడు.

ఆ రాత్రి భోజనాలు అయిపోయి, చిన్న పిల్లలు పడుకొని, అందరూ విశ్రాంతిగా కూర్చొని ఉంటే ---

చరణ్ : "నాన్నా, రేపు రిటైర్ అయిపోయిన తరువాత ఏం చేద్దామనుకుంటున్నారు. మీరిద్దరూ ఇక్కడే ఉంటారా. మాతో పూణే వచ్చేస్తారా " అని ఆడిగాడు.

"నువ్వే చెప్పు. ఏం చెయ్యమంటావో. నువ్వు ఎలాగ చెప్తే అలాగే."

"నేను చెప్పినట్లే చేస్తారా "

"అదే చెప్పేను కదరా. మీ అమ్మని కూడా అడుగు కావలిస్తే."

"ఏం అమ్మా, అంతేనా"

"అవును నాన్నలూ. మేమిద్దరం నువ్వు ఎలా చెప్తే అలా చెయ్యాలని ముందే ఒక నిర్ణయానికి వచ్చేము."

చరణ్ : " అలా అయితే, చెప్పేస్తున్నా. మీరు ఇక్కడే ఉండండి" అన్నాడు.

-4-

‘మీరు మాతో పూణే వచ్చేయండి’ అని అంటాడనుకుంటే, ఇదేమిటి వీడు ఇలా అన్నాడు అనుకుంటున్నట్టుగా, మోహన్ శృతి ఒకరినొకరు ఆశ్చర్యంగా చూసుకుంటూ ఒక్కసారిగా అవాక్కయ్యారు.

పల్లవి కూడా, చరణ్ దగ్గర నించి ఆ మాట ఊహించక పోవడంవలన, ‘ఇదేమిటి తమ్ముడు ఇలా మాట్లాడుతున్నాడు’ అనుకుంది.

మళ్ళా చరణే : "మేమే ఇక్కడికి వచ్చేస్తున్నాము నాన్న. నీ షష్టి పూర్తి పుట్టిన రోజుకి నేను ఇచ్చే కానుక ఇదే .” అని ఒక్కసారిగా ముగ్గురిని ఆశ్యర్యంలో ముంచేడు. రాగిణి నవ్వుతూ కూర్చుంది.

ఆ ఆశ్చర్యం లో నుంచి బయట పడడానికి ముగ్గురికి మూడు నిమిషాలు పట్టింది. మోహన్, శృతి, పల్లవి ముగ్గురూ ఒకరికి ఒకరు తాము చరణ్ నోటి వెంట విన్నది నిజమేనా, అని కళ్ళతోనే మాట్లాడుకుంటూంటే – మరలా, చరణ్ : “ఏమిటి నేను చెప్పినది నమ్మలేకపోతున్నారా. నిజంగా, మేమే ఒక నెల్లాళ్ళలో ఇక్కడికి వచ్చేస్తున్నాము. ఈ స్వంత ఇల్లు, ఈ వాతావరణం, ఇక్కడ ఉన్న స్నేహితులు అన్నీ వదలి మాదగ్గరకి వచ్చేయడమంటే, మీకు ఎంత కష్టమో నేను ఊహించుకోగలను. అందుకే, నన్ను ఈ ఊరి బ్రాంచ్ లో పోస్ట్ చేయించుకున్నాను. క్రిందటి నెలలో నేను వచ్చినది ఈ పని మీదనే. మీ ఇద్దరికీ ఈ రోజు సర్ప్రైజ్ ఇద్దామని, ఈ విషయం ఇంతవరకు దాచేను. రాగిణి కి కూడా ఈ రోజు వరకు ఈ విషయం గుట్టుగా ఉంచాలని నేనే చెప్పాను."

ఒక్క సారిగా తేలిక పడిన మనసుతో, మోహన్: " చల్లని కబురు చెప్పావు నాన్నలూ. మా ఇద్దరికి ఇంతకంటే సంతోషం ఏమి ఉంటుంది. నువ్వు పిల్లలతో ఇక్కడే ఉంటె -- అదీ నేను రిటైర్ అయిన తరువాత -- మాకింకేమి కావాలి. మీ అమ్మ మొఖం చూడు ఎలా వెలిగిపోతుందో"

శృతి : "మీ మొహం కూడా ఓ సారి అద్దంలో చూసుకోండి. ఎంత ఆనందం కొట్టొచ్చినట్టు కనిపిస్తూందో "

ఒక్కసారి అందరూ నవ్వులలో తేలిపోయారు.

కొడుకు తనకిచ్చిన కానుక గురించి మిత్రులతో గర్వంగా చెప్పుకొని, మొహాన్ సంతోషంగా రిటైర్ అయ్యారు. ఆ తరువాత వచ్చిన మురళి పుట్టిన రోజు మరీ ఆనందంగా గడిచింది.

*****

మరిన్ని కథలు

Swayamvaram
స్వయంవరం
- తాత మోహనకృష్ణ
Maatruhrudaya mahattu
మాతృహృదయ మహత్తు!
- చెన్నూరి సుదర్శన్
Simhavalokanam
సింహావలోకనం
- మద్దూరి నరసింహమూర్తి
Mana garden
మన గార్డెన్
- తాత మోహనకృష్ణ
Andari bandhuvuluu
అందరి బంధువులు
- భానుశ్రీ తిరుమల
Teeram cherchina parugu
తీరం చేర్చిన పరుగు
- షామీరు జానకీ దేవి
Vimanam lo kalakalam
విమానంలో కలకలం
- తాతా కామేశ్వరి
Aame kavvinchindi
ఆమె కవ్వించింది
- తాత మోహనకృష్ణ