అప్పారావు - మొద్దునిద్ర - దినవహి సత్యవతి

Apparao moddunidra

సార్థక నామధేయుడైన అప్పారవు అడిగినవాళ్లని అడక్కుండా, అడిగీ అడగని వాళ్ళని మళ్ళీ మళ్ళీ అడిగి, అడగని వాళ్ళని కూడా వెంటబడి పట్టుకుని మరీ అడిగీ ...... మొత్తనికి ఎలా అయితేనేం కూతురి పెళ్ళికి కావలసిన పైకమంతా జమచేసాడు.

అప్పు చేయడంలోనే కాదు ఇంకో విషయంలో కూడా పరమ ఘనుడు అప్పారవు..అదేమంటే కుంభకర్ణుడినైనా నిద్ర నుంచి లేపడం తేలికేమో గానీ అప్పారావు నిద్ర పోయాడంటే లేపడం ఎవరితరమూ కాదు తనంతట తాను లేస్తే తప్ప!

ఒకవేళ అనుకోకుండా అవసర సమయానికి ఎవరైనా లేపారే అనుకోండి ఇంక చూడాలి అయ్యగారి తంతు...ఒక గంట పైచిలుకు దాక అయోమయంలో ఉంటాడు .. ఆ సమయంలో తానేం చేస్తున్నాడో ఏం మాట్లాడుతున్నాడో అతగాడికే తెలియదు...ఆ తరువాత మళ్ళీ పడుకుంటాడు...మళ్ళీ తనంతట తాను లేచాక బాబుగారికి జరిగిందేమీ గుర్తుండదు అదీ అసలు విషయం.....

ఇహ ప్రస్తుతానికి వస్తే .... అప్పారావు కూతురి పెళ్ళి జరుగుతోంది. అమ్మాయి గౌరీ పూజా అదీ అయ్యాక మేనమామలు బుట్టలో తీసుకొచ్చి పీటల పైన కూర్చోబెట్టారు.

అప్పటిదాకా హడావిడిగా తిరుగుతున్న అప్పారావు గబగబా భార్య దగ్గరకొచ్చి ‘భాగ్యం నేనిప్పుడే అలా వెళ్ళొస్తాను’ అన్నాడు

భర్త సంగతి ఎరిగున్న భాగ్యం భయం భయంగా చూసి “ఎక్కడికండీ?” అంది.

“ఏట్లోకి” వెకిలిగా నవ్వి “అయినా ఎక్కడికైతే నీకెందుకు? ప్రతీదీ చెప్పాలా! నోరుమూసుకో”

“అదికాదండీ ఇంకాసేపట్లో ముహూర్తం దగ్గర పడుతోంది కన్యాదానం చేయాలి. ఇప్పుడు మీరు బయటకి వెళితే ఎలా అని అడిగానంతే’ అంది ముఖం చిన్న బుచ్చుకుని

“పిచ్చిమొహమా అదా నీ బెంగ! ఆ సంగతి నాకు మాత్రం తెలియదుటే. నాకా మాత్రం బాధ్యత లేదనుకున్నావా! చూడు పెళ్ళికోసం నువ్వు చెప్పినవన్నీ చేసానా లేదా! అది నా కూతురు మాత్రం కాదా. ఊరికే లేనిపోనివి ఆలోచించి బెంబేలెత్తకు” భార్య భుజం తట్టి వెళ్ళిపోయాడు.

‘ఏమాటకామాట చెప్పుకోవాలి పాపం అమ్మాయి పెళ్ళన్నప్పటినుంచీ ఎంతో కష్టపడుతున్నారు. నేనే ఆయనని అనవసరంగా అపార్థం చేసుకుంటున్నానేమో’ అనుకుంది భర్త వెళ్ళిన వైపే చూస్తూ.

ఇంతలో “అమ్మాయ్ భాగ్యం” అత్తగారి పిలుపు విని”‘ఆ వస్తున్నా అత్తయ్యా” అంటూ భర్త పట్ల అనురాగంతో చెమ్మగిల్లిన కళ్ళని ఒత్తుకుని అటుగా వెళ్ళింది.

“ముహూర్తం సమీపించింది కన్యాదాతలు రావాలి” పురోహితుడి పిలుపు వినిపించింది.

ఆ వెనకాలే “చెల్లాయ్ రావాలి శాస్త్రిగారు పిలుస్తున్నారు” అన్నగారు వచ్చి “బావగారెక్కడే?” అనుమానంగా చుట్టుప్రక్కల కలియజూసాడు.

“ఒక పని మీద బయటకి వెళ్ళారన్నయ్యా. వస్తూనే ఉంటారు. పద మనం వెళదాం” చెల్లెలి మాటలకి ఉలిక్కిపడ్డాడు.

“ఆ నువ్వు మరీనూ అన్నయ్యా అలా చూడకు మా ఆయనేం మరీ మీరనుకున్నంత చెడ్డవారేం కాదులే’ మూతి విరిచింది.

“అబ్బబ్బే అదేం కాదు చెల్లాయ్! అయినా తన కూతురి పెళ్ళేగా జాగ్రత్తగానే ఉంటారులే’ అని చెల్లెలితో కళ్యాణ వేదిక దగ్గరికి చేరుకున్నాడు.

“జీలకర్రా బెల్లం పెట్టే వేళయ్యింది, పిల్ల తల్లీ తండ్రి ఎక్కడయ్యా?” ఈసారి శాస్త్రిగారి అరుపు.

అప్పుడు మొదలయింది భాగ్యం మనసులో అలజడి. అప్పారావెక్కడ?అల్లుడెక్కడ? బావగారెక్కడ...ఇలా అందరూ అడుగుతుంటే ఆమె ముఖం పాలిపోయి కాళ్ళూ చేతులూ వణకడం మొదలెట్టాయి.

‘ఎక్కడికెళ్ళాడని చెప్తుంది? ఇప్పుడే వస్తానని చెప్పి వెళ్ళిన మనిషి ఇప్పటిదాకా అయిపూ అజా లేకపోతే! ఫోన్ చేసింది. సమాధానం లేదు. ఎవరి దగ్గరైతే అప్పారావు నంబరు ఉందో అందరూ తమ వంతుగా అతగాడికి కాల్ చేసారు.

‘ఊహూ........’ ఎవ్వరికీ జవాబు లేదు. ఇంకేముందీ అందరూ తలా ఓ దిక్కుకీ పరిగెత్తి అప్రావ్ ...అప్రావ్..అని గావు కేకలు పెడుతూ వెతికారు ఎక్కడా సదరు అప్పారావు జాడలేదు. భాగ్యం కళ్ళనీళ్ళ పర్యంతమై పకపకా నవ్వడం మొదలెట్టింది!

“భాగ్యానికి పిచ్చిపట్టింది” అన్నారెవరో

తట్టుకోలేని మానసిక ఒత్తిడి కలిగినప్పుడు భాగ్యానికి అతిగా నవ్వొచ్చేస్తుంది అది ఆవిడ బలహీనతని ఎవరికీ తెలియదు మరి!

“ఒసేయ్ చెల్లాయ్ ముందా నవ్వాపి మీ ఆయనని వెతుకుదాం రా” మగ పెళ్ళివారిలో అసహనం హద్దులు దాటింది “మరీ ఇంత బాధ్యత లేనివాడని అనుకోలేదు సుమండీ” ఇలా ఎవరికి తోచినట్లు వారు మాట్లాడడం మొదలెట్టారు.

ఇంతలో బుడుగు పరుగుపరుగున వచ్చి ‘పిన్నీ..పిన్నీ మరేమో బాబాయ్...బాబాయ్’ అని రొప్పొచ్చి ఆగాడు

ఒక్క ఉదుటున ముందుకొచ్చి వాడిని గభాలున దగ్గరకు లాక్కుని “ఏమైందిరా మీ బాబాయ్ కి? ఎక్కడున్నారు?’ సరిగ్గా చెప్పి ఏడవరా” కుదిపేసింది

“మరీ బాబాయ్ పెరట్లో చివ్వర ఉందే బావి..” అని ఇంకా చెప్పబోతుండగానే”‘అయ్యో దేముడా నన్నన్యాయం చేసి పోయారా ఎంత పని చేసారండీ! ఇప్పుడు అసలు మీకంత కష్టమేం వచ్చిందండీ? అన్నయ్యా నాకింక దిక్కెవ్వరూ’ అని శోకాలు మొదలెట్టింది

‘ఛస్ ముందా అపశకునపు కూతలాపు అసలు వాడిని సాంతం చెప్పనీ’ అని ఒక్క గదుముతో చెల్లెలి నోరుమూయించి “ఒరే బుడుగూ ఇప్పుడు చెప్పు బాబాయ్ ని ఎక్కడ చూసావు?”

“బాబాయ్ పెరట్లో బావి వెనక బండపైన నిద్ర పోతున్నాడు” అని చావు కబురు చల్లగా చెప్పి తుర్రున పారిపోయాడు.

ఆ మాటలు విని భాగ్యం గుండెలు గుభేలన్నాయి”‘ఇంక అయినట్లే అప్పారవు కూతురి పెళ్ళి” ఎవరో నెమ్మదిగా గొణగడం భాగ్యం చెవిని సోకింది.

అందరూ హడావిడిగా పెరట్లోకి పరిగెత్తారు. బక్కెట్లతో నీళ్ళు ముఖం పైన పోసీ, గట్టిగా పట్టుకుని కుదిపీ అప్పారావుని నిద్రలేపడానికి ప్రయత్నాలు మొదలెట్టారు.

ఉన్నట్లుండి భాగ్యం రివ్వున వెనుదిరిగి పందిట్లోకి వెళ్ళింది. అంతా నిశ్చేష్టులై చూస్తుండిపోయారు.

వెళ్ళినంత వేగంగానూ కూతుర్నీ కాబోయే అల్లుడినీ శాస్త్రిగారినీ ..ఇంకా ఇతరత్రా సామగ్రినీ వెంటబెట్టుకుని ఏకంగా బావి దగ్గరకే వచ్చేసి గబగబా అన్నీ ఏర్పాటు చేసేసి పిల్లలిద్దర్నీ పీటల మీద కూర్చుండ చేసింది. ఈలోగా అందరి భగీరథ ప్రయత్నం ఫలించి మొత్తానికి అప్పరావుని నిద్ర లేపగలిగారు.

అయితే బలవంతంగా నిద్రలోంచి లేచిన అప్పారావుగారు అయోమయంలో తేలుతున్నాడు.... అప్పటికే అప్పారావు నిద్ర సంగతి తెలిసిన అందరూ తమ తమ స్థానాలలో సంసిధ్ధంగా ఉన్నారు. అప్పారవు గురించి అప్పటికే తెలిసున్న శాస్త్రిగారు కూడ పరిస్థితి అర్థం చేసుకుని మంత్ర పఠనం వేగం పెంచారు.

ఆ తరువాత కార్యక్రమమంతా , అప్పారావు నిద్రలో జోగుతుండగానే, ఆతడు తండ్రిగా చెయ్యాల్సిందంతా... అప్పగింతలతో సహా జరిపించేసారు శాస్త్రి గారు.

అందరూ తేలికగ ఊపిరి పీల్చుకున్నారు.....యథాప్రకారం మళ్ళీ నిద్రలోకి జారుకున్నాడు సదరు అప్పారావు.

కొసమెరుపు : ఆ తరువాత ఎప్పటికో తనంతట తాను నిద్ర లేచిన అప్పారావు ప్రక్కనే కునికిపాట్లు పడుతున్న భాగ్యాన్ని చూసి ‘అసలీ భాగ్యానికి ఏమీ పట్టినట్లు లేదు ఓ ప్రక్కన అమ్మాయి పెళ్ళి పెట్టుకుని ఎలా నిద్రపోగలుగుతోందో’ అని మహాలావు చిరాకు పడ్డాడు. *****************

మరిన్ని కథలు

Swayamvaram
స్వయంవరం
- తాత మోహనకృష్ణ
Maatruhrudaya mahattu
మాతృహృదయ మహత్తు!
- చెన్నూరి సుదర్శన్
Simhavalokanam
సింహావలోకనం
- మద్దూరి నరసింహమూర్తి
Mana garden
మన గార్డెన్
- తాత మోహనకృష్ణ
Andari bandhuvuluu
అందరి బంధువులు
- భానుశ్రీ తిరుమల
Teeram cherchina parugu
తీరం చేర్చిన పరుగు
- షామీరు జానకీ దేవి
Vimanam lo kalakalam
విమానంలో కలకలం
- తాతా కామేశ్వరి
Aame kavvinchindi
ఆమె కవ్వించింది
- తాత మోహనకృష్ణ