భాగవత కథలు-5 యజ్ఞవరాహమూర్తి అవతారం - కందుల నాగేశ్వరరావు

Yagna varahamurthi avataram

మానవుల ఆయుప్రమాణం నూరు సంవత్సరాలు. అలానే బ్రహ్మ దేవుని ఆయుప్రమాణం కూడా నూరు సంవత్సరాలు. నూరు సంవత్సరాల మొదటి సగాన్ని ‘పద్మకల్పం’ అని రెండవ సగాన్ని ‘వరాహ కల్పం’ అని అంటారు. ప్రస్తుతం వరాహ కల్పం నడుస్తూ ఉంది. బ్రహ్మదేవునికి యాబది సంవత్సరాలు పూర్తయి యాబది ఒకటవ సంవత్సరం నడుస్తూ ఉంది. ఈ కల్పారంభంలో ఆది మిధున మైన స్వాయంభువమనువు శతరూప దంపతులకు ప్రియవ్రతుడు, ఉత్తానపాదుడు అనే ఇద్దరు పుత్రులూ; ఆకూతి, దేవహూతి, ప్రసూతి అనే ముగ్గురు పుత్రికలు పుట్టారు. వారిలో ఆకృతిని రుచి ప్రజాపతికీ, దేవహూతిని కర్దమ ప్రజాపతికీ, ప్రసూతిని దక్షప్రజాపతికీ ఇచ్చి వివాహం చేసారు. ఆ దంపతుల సంతానంతో ఈ జగత్తంతా విస్తరించింది. స్వాయంభవుడు తన భార్య శతరూపతో కూడా వినయంతో తలవంచి, చేతులు జోడించి బ్రహ్మదేవునితో ఇలా అన్నాడు. ఈ విశ్వంలోని సర్వప్రాణులనూ పుట్టించుటకు కారణమైనవాడవు నీవే. మేము చేయవలసిన పనియేమిటో మాకు ఆజ్ఞాపించు. అప్పుడు బ్రహ్మదేవుడు తన పుత్రుడైన స్వాయంభువ మనువుతో ఇలా అన్నాడు. కుమారా! మహావిష్ణువు గూర్చి అపారమైన భక్తితో యజ్ఞాలు చెయ్యి. ఆ దేవుడు సంతోషిస్తే లోకాలన్నీ సంతృప్తి చెందుతాయి. స్వార్థబుద్ధితో కాక, పవిత్రమైన చిత్తశుద్ధితో యజ్ఞకార్యాలు చెయ్యాలి. నీవూ నీకుమారులూ సంతోషంతో ఈ భూభారం వహించండి. అది విని స్వాయంభవుడు బ్రహ్మదేవుడితో ఇట్లా అన్నాడు. తండ్రీ నీవు చెప్పినట్లే చేస్తాను. అయితే నేను, నా కుమారులు నివసించడానికి తగిన చోటు ఎక్కడా కానరావడంలేదు. భూమి మహాసముద్ర మధ్యంలో మునిగి ఉంది. అందువల్ల మాకు ఉండటానికి చోటు కన్పించటం లేదు. అందువలన ఓ దేవా! ఈ భూమిని ఉద్ధరించే ఉపాయం ఆలోచించి నన్ను అనుగ్రహించు. అలా స్వాయంభువుడు పలుకగా నీళ్ళనడుమ మునిగిపోయి ఉన్న ఈ భూమండలాన్ని పైకి తీసుకొని రావడం ఎలాగ? లోకాలను సృష్టించేటప్పుడు మొదట నీళ్ళను పుట్టించాను. తర్వాత భూమిని సృష్టించాను. ఆ భూమి ఇపుడు జలమధ్యంలో మునిగి పాతాళమధ్య చేరింది. దీనిని ఏ విధంగా యథాస్థితికి తీసుకొని వచ్చేది? ఈ మహాకార్యం నాకు సాధ్యమవుతుందా? అని బ్రహ్మదేవుడు తన మనస్సులో సర్వాంతర్యామి, పురుషోత్తముడూ అయిన లక్ష్మీవల్లభుణ్ణి తలవంచాడు. వెంటనే అతని ముక్కు నుండి ఒక వరాహం బొటన వ్రేలంత పరిమాణంతో జన్మించి, ఆకాశానికి ఎగిరి, ఒక్క క్షణంలోపలనే పెద్ద ఏనుగంతయై మహాపర్వతం అంత అయ్యింది. అక్కడ ఉన్న మరీచి మొదలైన మునులూ, మనువూ, మనువు కుమారులూ, ఆ యజ్ఞవరాహాన్ని ఆశ్చర్యంగా చూచారు. బ్రహ్మదేవుడు తన మనస్సు లోని దుఃఖభారాన్ని దూరం చేయడానికి ఆ పరమాత్ముడే ఈ రూపంలో అనుగ్రహించాడని గ్రహించి సంతోషించాడు. యజ్ఞవరాహమూర్తి ప్రళయకాలంలోని మేఘసమూహాలవలె, దిక్కులు పిక్కటిల్లే విధంగా భయంకరంగా గర్జించాడు. ఆ భయంకరమైన ధ్వని విని బ్రహ్మదేవుడూ, మునులూ అపారమైన ఆనందాన్ని పొందారు. ఆ వరాహమూర్తి కావించిన ఆ ధ్వనికి బ్రహ్మాండభాండ మంతా దద్దరిల్లింది. ఆ శబ్దాన్ని విని జనలోకం లోన, తపోలోకం లోన, సత్యలోకం లోన ఉండే మునులు వేదమంత్రాలతో ఆ యజ్ఞవరాహమూర్తిని కీర్తించారు. ఆ మహావరాహం పొర్లుతూ, పొంగుతూ, సంతోషంతో గంతులు వేస్తూ, ఆకాశానికి ఎగురుతూ, ఇలా అనేక విధాలుగా ఊగుతూ చెలరేగుతూ ఉంది. -2- హిరణ్యకశిపుడు బ్రహ్మదేవునివల్ల వరాలు పొంది సమస్త లోకపాలకులనూ జయించి తన వశం చేసుకొన్నాడు. ఇక తనకు మృత్యుభీతి లేదనే అత్యంత విశ్వాసంతో, సంతోషంగా సుఖంగా ఉన్నాడు. అతని సోదరుడైన హిరణ్యాక్షుడు మదపుటేనుగు తొండం వంటి తన భుజం మీద ప్రచండ గదాదండాన్ని ధరించి, కదనరంగంలో తనకు ఎదురు నిల్వగల్గిన శత్రువీరుడు ఎక్కడా కన్పించక భూలోకమంతా గాలించి గాలించి, స్వర్గంపై దండెత్తాడు. ఆ హిరణ్యాక్షుణ్ణి చూసిన దేవతలు గుండెలు జారి భయంతో దిక్కుతోచక ఎక్కడెక్కడికో పారిపాయారు. అప్పుడు హిరణ్యాక్షుడు విజయగర్వంతో విజృంభించి సముద్రంలో ప్రవేశించాడు. ఆ సముద్రంలో పెక్కు సంవత్సరాలు శత్రు సైన్యాన్ని చీల్చి చెండాడే కోరికతో వీరోచితంగా విహరించాడు. అనంతరం సముద్రాధిపతి అయిన వరుణుడు పరిపాలించే విభావరి నగరానికి వెళ్ళి అక్కడ నిండుకొలువులో ఉన్న వరుణుని చూచి పరిహసిస్తూ. యుద్ధానికి రమ్మని సవాలు చేసాడు. హిరణ్యాక్షుని మాటలు విని సముద్రరాజైన వరుణుడు తన బలాన్ని విరోధి బలాన్ని అంచనా వేసి, ఆ రాక్షసునితో యుద్ధం చేయటానికి సమయం కాదని తెలుసుకున్నాడు. ప్రశాంత వచనాలతో ఆ రాక్షసరాజుని ఇలా సమాధాన పరిచాడు. “నేను ప్రశాంతమైన అంతరంగంతో ఇప్పుడు యుద్ధం చేయకూడదనే ఒక నియమంలో ఉన్నాను. ఇప్పుడు మన మధ్య పోరాటం పనికి రాదు. సాటిలేని నీ అపార పరాక్రమానికి సమాధానం చెప్పగల వీరుడు విష్ణుమూర్తి తప్ప ఎవ్వరూ లేరు. ఆ మహాత్ముడు వైకుంఠంలో ఉన్నాడు. ఆయన తప్పక నీతో యుద్ధం చేస్తాడు. నీ కోరిక నెరవేరుతుంది.” ఈ విధంగా వరుణుడు పలుకగా హిరణ్యాక్షుడు మిక్కిలి ఆగ్రహంతో మండి పడ్డాడు. ఇప్పుడే యుద్ధంలో దేవతలకు మిత్రుడూ, రాక్షసులకు శత్రుడూ అయిన ఆ జనార్థనుని మర్దిస్తా అనుకొంటూ వైకుంఠం మీదకు దండయాత్ర సాగించాడు. అలా వైకుంఠమార్గం పట్టి వెళ్లుతున్న హిరణ్యాక్షుడికి నారదమునీంద్రుడు ఎదురు వచ్చాడు. “ఓ దానవరాజా ఇంత ఆనందంతో ఎక్కడికి వెళుతున్నావు” అని అడిగాడు. నారద మునీంద్రునితో ఆ దానవుడు “ ఆ విష్ణుమూర్తిని అంతమొందించి రాక్షసజాతికి అంతులేని ఆనందం కలిగించాలనే పట్టుదలతో వైకుంఠం దారిపట్టిపోతున్నాను.” అన్నాడు. ఆ మాటలు విన్న నారదుడు ఆ రాక్షసునితో “శ్రీమహావిష్ణువు ఇప్పుడు వైకుంఠంలో లేడు. ఆ మహాత్ముడు భూభారాన్ని పూనడానికై ఆదివరాహరూపం ధరించి రసాతలంలో ఉన్నాడు. అక్కడికి వెళ్ళడానికి నీకు శక్తి ఉన్నట్టయితే వెళ్ళు. ఆ పాతాళంలో నీకూ విష్ణుమూర్తికి తప్పకుండా సమరం జరుగుతుంది.” అప్పుడా రాక్షసరాజు అగ్నివలె మండిపడుతూ మహాతేజస్సుతో గదాదండం చేబూని, ముల్లోకాలకూ భయం కలిగించే రూపంతో తన బాహు పరాక్రమాన్ని ప్రకటిస్తూ పాతాళలోకానికి వెళ్ళాడు. -3- యజ్ఞస్వరూపుడై యజ్ఞవరాహరూపం ధరించిన ఆ మహావిష్ణువు మహా ప్రళయకాలంలో తాను నిద్రలో ఉన్నప్పుడు జలంలో నున్న భూమి రసాతలం లోకి చేరినందువల్ల దానిని ఉద్ధరించడానికై సముద్రంలో ప్రవేశించాడు. ఆ వరాహమూర్తి తన వాడియైన వంకరలు తిరిగిన కత్తులవంటి గిట్టల కొనలతో సముద్రజలాలను చెల్లాచెదురు చేస్తూ పాతాళంలోకి దూసుకుపోయి అక్కడ మునిగిఉన్న భూమిని చూచాడు. అప్పుడు హిరణ్యాక్షుడు కూడా ఆ ప్రాంతానికి చేరి తన యెదురుగా ఆదివరాహరూపంలో ఉన్న విష్ణువును వీక్షించాడు. ఆ ఆదివరాహం దట్టమైన కోరలు కలిగి, దివ్యమైన తేజస్సుతో విరాజిల్లుతూ భూభారం మోయడానికి తగిన శక్తి కలిగి ఉన్నది. వరాహరూపంలో ఉన్న పరాత్పరుడు ఒక్క చూపుతో ఆ రాక్షసరాజు దేహకాంతిని హరించి వేసాడు. ఆ ఆదివరాహం నిరాటంకంగా విహరస్తూ తన ముట్టితో కులపర్వతాలను కూలదోస్తూ, కొమ్ములతో చిమ్ముతూ, గిట్టలతో మట్టగిస్తూ, కుప్పించి దూకుతూ విజృంభించి విహరింపసాగింది. ఆ భయంకర రూపం తరించి ఉన్న ఆ వరాహస్వామితో హిరణ్యాక్షుడు ఇలా అన్నాడు. “ఓ బుద్ధిలేని వరాహమా! బ్రహ్మ ఇచ్చిన వరాలనుబట్టి చూస్తే రసాతలం చేరిన ఈ భూమి అంతా నా ఆధీనంలోనిదే. నీవు ఈ భూమిని తీసుకు పోవద్దు. కాదని నువ్వు తీసుకుపోతే నీ ప్రాణాలు తీస్తాను.” శ్రీమహావిష్ణువు వెంటనే తన వాడియైన కోరల చివర ప్రకాశిస్తున్న భూమితో కదలకుండా నిబ్బరంగా నిలబడ్డాడు. ఆ హిరణ్యాక్షుని పలుకులకు ఆగ్రహించిన యజ్ఞవరాహమూర్తి భూదేవితో కూడా సముద్రజలం నుండి బయటకు వచ్చాడు. హిరణ్యాక్షుడు కూడా భీకరరమైన యజ్ఞావతారం ధరించిన ఆ కమలాక్షుని వెంబడించి ఇలా అన్నాడు. “నువ్వు మోసగాడివి. నిన్ను ఎన్ని తిట్టినా నీకు రోషం రావడం లేదు. ఈ విధంగా పిరికిపందలాగా పరిగెత్తడం నీ మగతనానికి తగిన పనేనా? అప్పుడు శ్రీమహావిష్ణువు భూమిని నీళ్ళపై నిల్పి దానికి ఆధారంగా అనంతమైన తన శక్తిని ప్రసరింపజేశాడు. అది చూసి దేవతలు ఆనందభరితులైనారు. ఆ సమయంలో ఆకాశంనుంచి జలజల పూలవాన కురిసింది. దేవదుందుబులు మ్రోగాయి. గంధర్వులు గానం చేసారు. అప్సరసలు ఆనందంతో నాట్యం చేసారు. అప్పుడు వరాహమూర్తి అయిన మహావిష్ణువు తన ఆభరణాల కాంతులు ఆకాశమంతా వ్యాపింపగా యుద్ధానికి సిద్ధమైనాడు. పెద్ద గదాదండాన్ని చేతపట్టుకొని రమణీయమైన బంగారు కవచాన్ని ధరించిన శ్రీహరి అతన్ని చూసి నవ్వుతూ ఇలా అన్నాడు. “ ఓరీ! కండకావరంతో కనులు కనిపించక నన్ను అడవి మృగంలాగా భావిస్తున్నావు. కదనరంగంలో కాలికి బుద్ధిచెప్పకుండా నిలబడగలిగితే రా! ఎదుర్కో! నీ కోరికలన్నీ ఇప్పుడే తీరుస్తాను. నీవు యమపురంలో కాపురానికి వెళ్ళేముందు నీ ప్రియమైన బంధువులను ఒకసారి చూచిరా. “ ఈ మాటలు విన్న రాక్షసుడు తోకత్రొక్కిన నల్ల త్రాచులాగా క్రోధావేశంతో క్రిందుమీదైనాడు. తన గద తీసుకొని, సాహసంతో శ్రీహరికి ఎదురు నడిచాడు. గదను పైకెత్తి అత్యంత కోపంతో హరిని కొట్టాడు. హరి ఆ గదని పట్టుకొని ముక్కలుముక్కలుగా విరిచేశాడు. అప్పుడు ఆ రాక్షసుడు ఇంకొక గదను తీసుకొని లక్ష్మీపతిని భయంకరంగా కొట్టాడు. హరి హస్తలాఘవంతో ఆ దానవుడు విసిరిన గదను పట్టుకొని తిరిగి అదే గదతో హిరణ్యాక్షుడి వక్షస్థలంపై అదురునట్ట్లుగా కొట్టాడు. ఆ దెబ్బకు వాడు దిమ్మెరపోయి వెంటనే తెప్పరిల్లి జనార్థనుణ్ణి తిరుగు దెబ్బ కొట్టాడు. వారిద్దరూ జయించాలనే పట్టుదలతో మత్తగజాలవలె డీకొంటూ, గాండ్రు గాండ్రుమని గర్జిస్తూ కొట్టుకుంటున్నారు. అది చూస్తున్న బ్రహ్మదేవుడు యజ్ఞవరాహమూర్తితో ఇలా చెప్పాడు. “తండ్రీ! దుష్టచిత్తుడైన ఈ రాక్షసుడు నేనిచ్చిన వరాల వలన మదోన్మత్తుడై లోకాలను చిరాకు పరుస్తున్నాడు. ఆలశ్యం చేయక వీనిని సంహరించి భూదేవికి శుభం కూర్చు. అంతేగాదు స్వామీ! వెంటనే రూపుమాపకపోతే సాయంకాలం అవుతుంది. అప్పుడు వీడిని సంహరించడం సాధ్యం కాదు. అప్పుడు భూమిని ఉద్ధరించిన శ్రీమహావిష్ణువు రాక్షసరాజైన హిరాణ్యాక్షుని సంహరించటంకోసం తన మనస్సులో సుదర్శన చక్రాన్ని సంస్మరించాడు. దైత్యారి చక్రధారియై స్వర్గలోకంలోని దేవతాగణాలు జయజయధ్వానాలు చేస్తుండగా ఆ రాక్షసరాజుకు అభిముఖంగా నడిచాడు. చక్రం ధరించి వస్తున్న ఆదివరాహమూర్తిని చూచి రాక్షసుడు అదిరిపడి పెదవులు తడుపుకుంటూ, చెక్కుచెదరని ధైర్యంతో భయంకరమైన తన గదాదండాన్ని పైకెత్తి ఒక్క పెట్టు పెట్టాడు. అసురుడు విసరిన ఆగదను ఆది వరాహమూర్తియైన ఆ శ్రీహరి ఆనందంగా మందహాసం చేస్తూ కాలితో ఒక్క తన్ను తన్నాడు. అప్పుడు హిరణ్యాక్షుడు భగభగ మండే మంటలతోనున్న భయంకరమైన శూలాన్నివిష్ణుమూర్తి మీద విసిరాడు. త్రివిక్రముడు ఆ శూలాన్ని తన చక్రంతో రెండు ముక్కలుగా ఖండించాడు. రాక్షసరాజు గూబమీద ఇంద్రాదులు సంతోషించుటట్లు వజ్రకఠోరమైన తన హస్తంతో ఒక్క దెబ్బ కొట్టాడు శ్రీహరి. దానితో దానవేంద్రుడు కన్నులు తేలవేసిన, కూకటి వేళ్ళతో కూలిన మహావృక్షంలా నేలపై పడ్డాడు. తరువాత అపారమైన పరాక్రమంతో తన వాడి కోరల అంచులతో ఆ రాక్షసుని విదిలించాడు. ఆ రాక్షస వీరుడు బుడబుడమని నెత్తురు గ్రక్కుతూ వికారమైన ఆకారంతో, కండ్లు వెలికి రాగా, పండ్లు కొరుకుతూ, ప్రాణాలు వదిలాడు. -4- ఆ రాక్షసుని ఈవిధంగా వధించి వాడి వేడివేడి నెత్తురు ధారలతో నిండిన చెక్కిళ్ళు కలవాడై మహాపర్వతం వలె ఒప్పుతూ భూమిని తన కోరచివర ధరించి సముద్రంలో నుండి బయటకు వచ్చాడు. తెల్లని కోరకొనపై నున్న ఆ భూదేవి, స్వామిని ఎప్పుడూ ఎడబాయని శ్రీమహాలక్ష్మి ఆయనకు పూసిన కస్తూరీ పంకం లాగా కన్పించింది. అట్టి యజ్ఞవరాహమూర్తిని చూసి బ్రహ్మాది దేవతలు ఇలా స్తుతించారు. యజ్ఞవరాహమూర్తీ! నీవు జ్ఞానవంతుల అంతరంగాలనే నీటిమడుగులలో క్రీడిస్తుంటావు. భూదేవికి శ్రీదేవికి మనోహరుడవు. దేవతలందరికీ అగ్రేసరుడవు. స్వామీ! నీ తెల్లని దంష్త్రాచలాన తగులుకొన్న భూమి అందాలు చిందుతూ ఉంది. పరమేశ్వరా! జయం! నీవు యజ్ఞాధిపతివి! వేదమూర్తివి! దుష్ట శిక్షణ శిష్ట రక్షణార్థం వరహావతారం ధరించిన నీకు పరమభక్తితో ప్రణమిల్లుతున్నాము. నీ యజ్ఞవరాహ స్వరూపాన్ని అజ్ఞులు దర్శించ లేరు. పరమ కరుణామూర్తివీ, పరమ పవిత్ర చరిత్రుడవూ, పద్మదళాయత నేత్రుడవూ, చిర మంగళాకారుడవూ శ్రీరమా చిత్తచోరుడవూ అయిన నీకివే మాకైమోడ్పులు. నీవు యజ్ఞాధినాధుడవు! యజ్ఞవరాహమూర్తివి! నీవు యజ్ఞ స్వరూపుడవు! యజ్ఞకర్తవు! యజ్ఞభోక్తవు! యజ్ఞఫలప్రదాతవు! యజ్ఞ రక్షకుడవు! సమస్తములనీవే! ఓ ముకుందా! నీకు మా హృదయపూర్వక అభివందనాలు. పద్మనాభా! పర్వతాలతో, నదీనదాలతో, సముద్రాలతో, అరణ్యాలతో నిండిన ఈ భూమండలం నీ తెల్లని కోర చివర ప్రకాశిస్తున్నది. మాటపై కరుణతో సకల చరాచర సమూహంతో నిండిన ఈ భూమండలాన్ని సముద్రజలాల్లో మునిగి పోకుండా ఉద్ధరించు. ఓ దేవదేవా! నీకు నమస్కారం! మాకూ ఈ లోకానికి నీవు తండ్రిని. నీవు భరించుటచే భూదేవి నీ భార్య అయింది. అందుకని ఆమె మాకు తల్లి అవుతుంది. నీతోపాటు ఈ భూమాతకూ నమస్కారం చేస్తాము. నీవు నీ తేజస్సును ఈ భూమి యందు నిలపడంవల్ల ఈ ధరిత్రి ఎల్లప్పుడూ పవిత్రమై ఒప్పుతూ ఉటుంది. అని బ్రహ్మజ్ఞాన సంపన్నులైన మునివరేణ్యులు వరాహస్వామిని ప్రస్తుతించారు. ఓ మాధవా! ఆహ్లాదంతో, వేదశాస్త్రస్వరూపమైన ఆదివరాహమూర్తివైన నీవు పాతాళం నుండి బయటకు వస్తూ సముద్రజలాలతో తడిసిన శరీరాన్ని విదిలించావు. ఆ సమయంలో నీ మెడమీద జూలు నుండి నీటి చుక్కలు నలుదెసలా ఎగిరిపడ్డాయి. పరమ పవిత్రమైన ఆ నీటిబిందువులతో తడిసి తపోలోకంలో, జనలోకంలో, సత్యలోకంలో నివసించే మేమంతా ఎంతగానో పరిశుద్ధులం అయినాము స్వామీ! ఓ లక్ష్మీవల్లభా! ఈ ప్రపంచం సృష్టించేదీ, రక్షించేదీ, లయంచేసేదీ నీవే! సమస్తమూ నీవై ఈ సమస్తలోకాలనూ మళ్ళీ మళ్ళీ సృష్టిస్తున్నావు. ఈశ్వరా! కేశవా! వేదమయా! దివ్యస్వరూపా! దేవ దేవా! అంతులేని నీ వింత లీలలు వర్ణించడానికి మాకు చేతనవుతుందా? అనంతరం పరమాత్ముడైన ఆ యజ్ఞవరాహమూర్తి మహాభయంకరమూ, అత్యంత గంభీరమూ ఐన ఆ సముద్రజలాన్నంతా తన గిట్టలతో ఆక్రమించి, భూమిని ఎప్పటిలాగ సుస్థిరంగా, సుఖంగా నీళ్ళపై నిల్పాడు. అనంతరం అనంతగుణ సంపన్నుడైన ఆ స్వామి అదృశ్యమయ్యాడు. ఈ కథ శుభప్రదమైనది. ఈ కథను ఎవ్వరు భక్తితో చదువుతారో, ఎవ్వరు వింటారో వారిని పరమాత్ముడైన ఆ శ్రీమహావిష్ణువు కటాక్షిస్తాడు. వారి విషయంలో శ్రీహరి ప్రసన్నుడవుతాడు. అటువంటి వారికి సన్మంగళాలు సంప్రాప్తిస్తాయి. ।శుభం।

మరిన్ని కథలు

Aame kavvinchindi
ఆమె కవ్వించింది
- తాత మోహనకృష్ణ
Chandruniko noolu pogu
చంద్రునికో నూలు పోగు
- కాశీవిశ్వనాధం పట్రాయుడు/kasi viswanadham patrayudu
Anaadha atidhyam
అనాథ అతిథ్యం
- - బోగా పురుషోత్తం
Vibheeshana Sharanu
విభిషణుని శరణు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Srivariki prema lekha
శ్రీవారికి ప్రేమలేఖ
- తాత మోహనకృష్ణ
Ramdaas formula
రాందాస్ ఫార్ములా
- వీరేశ్వర రావు మూల
Attagari samrajyam
అత్తగారి సామ్రాజ్యం
- బొబ్బు హేమావతి