జ్ఞానోదయం (కృష్ణార్జున సంవాదం) - కందుల నాగేశ్వరరావు

Gnanodayam

కృష్ణమూర్తి, అర్జునరావు ఇద్దరూ మంచి స్నేహితులు. ఒకే గ్రామంలో రెండు మూడు నెలల తేడాలో పుట్టారు. స్కూలు చదువు మొదలుకొని డిగ్రీ వరకూ కలిసే చదివారు. వాళ్ళ అదృష్టమేమిటో గాని ఒకే ఆఫీసులో వేరే వేరే సెక్షన్లలో పనిచేసి రిటైర్ అయ్యారు. అందువల్ల వాళ్ళ స్నేహం ఎక్కడా అంతరాయం లేకుండా ఇంతవరకూ కొనసాగుతూనే ఉంది. ఒకరంటే ఒకరికి ఎంతో అభిమానం. కష్టాల్లో, సుఖాల్లో వారి బాధలను, సంతోషాలను పంచుకోవడం కూడా అలవాటు. వాళ్ళ ఇద్దరి పిల్లలు చదువులు, పెళ్లిళ్లు పూర్తయి ఉద్యోగం నిమిత్తం వేరే ఊళ్ళల్లో ఉంటారు. ఇద్దరికీ సిటీలో ఉండడానికి సొంత ఫ్లాట్స్ ఉన్నాయి. వేరే ఆస్తులు లేకపోయినా నెలనెలా వచ్చే పెన్షన్ వాళ్ళ ఖర్చులకు సరిపోతుంది. రెండు కుటుంబాలకు మొదటి నుండి పరిచయం ఉండడం వలన రిటర్మెంటు తర్వాత చాలా సార్లు తీర్థయాత్రలకు కూడా కలిసి వెళ్ళారు. కరోనా వల్ల గత రెండు సంవత్సరాల నుండి ఎక్కడికి వెళ్ళడం కుదరలేదు. రోజూ సాయంత్రం పూట ఇద్దరు స్నేహితులూ కలుసుకొని కోలనీ పార్కులో కాసేపు వాకింగ్ చేసి అక్కడి సిమెంటు బెంచీల మీద కూర్చొని బాతాఖానీ వేయడం అలవాటు. ఆ రోజు కూడా మామ్మూలుగానే కబుర్లలో పడ్డారు. అర్జునరావు పుస్తకాల పురుగు. చిన్నప్పటి నుండి కథలు, కవితలు చదవడం చాలా ఇష్టం. కృష్ణమూర్తికి దేశవిదేశాల వార్తలు సేకరించడం, ఆధునిక విజ్ఞానం గురించి తెలుసుకోవడం ఇష్టం. అందువలన అర్జునరావు కంటె లోకజ్ఞానం అధికం, లౌక్యుడు. “ఒరేయ్ కృష్ణా! నాకు పురాణాల నుండి, మన పూర్వ గ్రంథాలనుండి సేకరించి కొన్ని నీతి కథలు రాసి ఏదైనా పత్రికలో ప్రచురించి నా పేరు చూసుకోవాలని ఉందిరా” అన్నాడు అర్జున్. “ఏమిటిరా ఇంత జర్క్ ఇచ్చావ్. ఇప్పటి వరకూ లేనిది, ఈ వయస్సులో ఇలాంటి కోరిక కలిగింది. అయినా కరోనా వచ్చేక చాలా పత్రికలు పేపరు మీద ప్రింటు చెయ్యడం మానేసేయి. అంతా ఇంటర్నెట్ యుగం కదా, అందుకని అందరూ ‘వెబ్ మ్యాగజైన్స్’ మొదలెట్టారు. ప్రత్యేకంగా కొన్ని ‘మొబైల్ ఏప్స్’ కూడా ఏర్పడ్డాయి. అదీకాక ‘ఫేస్బుక్’ లో కథలు, కవితలు, వ్యాసాలు లాంటి రచనలు పోస్టు చేసే ప్రత్యేకమైన సముదాయాలు తయారయ్యాయి” చెప్పాడు కృష్ణమూర్తి. “అయినా పురాణ కథలు, నీతి కథలు ఈ రోజుల్లో ఎవరు చదువుతారురా! టీవి చానెళ్లలో, యూట్యూబ్లో చాగంటి వారు, గరికపాటి వారు, సామవేదం వారు, రావి రమా గారి లాంటి ప్రముఖులంతా ప్రవచనాలు, పురాణ గాథలు చెపుతుంటే, హాయిగా మన పని మనం చేసుకుంటూ వినే సౌకర్యం ఉంది. అలాంటప్పుడు పని మానుకొని నువ్వు రాసిన కథలు ఎవరు చదువుతారురా, ఆలోచించు.” అని అన్నాడు. అంతా విని, “పోనీ, పురాణ కథలు కాకపోతే మనిషి మనుగడకు పనికివచ్చే సూక్తులు మన ధార్మిక గ్రంథాల నుండి సేకరించి రాస్తేనో” అన్నాడు అర్జునరావు. అ మాటలు విని మరల చెప్పడం మొదలెట్టాడు కృష్ణమూర్తి. “ఒరేయ్ అర్జున్, ఇది ‘వాట్స్అప్’ యుగం. అందరూ ‘షేర్ చాట్’ లేకపోతే ‘వేస్ టు న్యూస్’ లాంటి ‘ఏప్స్’ నుండి శుభోదయం మొదలుకొని ఏ రకమైన సూక్తులైనా, నీతులైనా లేక శుభాకాంక్షలైనా చదవకుండానే పంపడం అలవాటు చేసుకొన్నారు. అవన్నీ రంగురంగుల ‘బ్యాక్ గ్రౌండ్’ తో చూడడానికి ఆకర్షణీయంగా ఉంటాయి. అటువంటప్పుడు మనం రాసే సూక్తులు ఎవరు చదువుతారు”. “సరే రా కృష్ణా, నువ్వన్నట్టే సూక్తులు వద్దులే. నువ్వు చెప్పినదంతా బాగానే ఉంది కాని నాకు ఏదైనా రాయాలని కోరిక ఉందిరా. మనం చాలా తీర్థయాత్రలకు వెళ్ళాం కదా! ఆ యాత్రలలో మనం చూసిన తీర్థప్రదేశాలు, దేవాలయాలు, మన సంస్కృతి, ఆచారాలు, వ్యవహారాలు లాంటి విషయాల గురించి వ్యాసాలు రాస్తానో” అని కొంచెం నెమ్మదిగా అన్నాడు అర్జున్. అన్నీ ఆలోచించి నాకు సలహా చెప్పరా”. అన్నాడు అర్జున్. “ఒరేయ్ అర్జున్, మరీ అమాయకంగా మాట్లాడుతున్నావురా. మన ప్రజల మనస్తత్వం అర్థం చేసుకో. తక్కువ రోజుల్లో మొక్కుబడిగా వీలైనన్ని ఎక్కువ ప్రదేశాలకు చూసి వాళ్ళ లిస్టులో టిక్కు పెట్టేసి అందరికీ గొప్పగా చెప్పుకోవడం ముఖ్యం. అంతేకాని ఆ ప్రదేశం తాలూకు ప్రాముఖ్యత గురించి, అక్కడి వింతలు విశేషాలు, దాని గొప్పతనం గురించి తెలుసుకోవాలనే సరదాగాని, కోరికగాని ఉండవు. అసలు తిరిగి వచ్చేక నువ్వు చూసిన పలానా దేవాలయంలో దేవుడి పేరేమిటో చెప్పమంటే చెప్పలేరు. పది రోజుల్లో ఇరవై క్షేత్రాలు ముప్పై దేవాలయాలు చూపిస్తానని ఎవరన్నా అంటే చాలు. మనం కూడా వెళ్ళి వచ్చేస్తే ఒక పని పూర్తయిపోతుంది, ఆ ప్రదేశాలు చూసామని అందరితో చెప్పుకోవచ్చు, అనేదే ఎక్కువ మందిలో ఆలోచన.” అని కాస్త ఆగి ఊపిరి పీల్చుకొని మళ్ళీ మొదలెట్టాడు మూర్తి. “అదే నువ్వు అమెరికాలో గాని, ఆస్ట్రేలియా లోగాని ఉన్న పర్యాటక ప్రదేశాల గురించి అక్కడి విశేషాల గురించి రాస్తే కొంచెం ఎక్కువ మంది చదివే అవకాశం ఉంది. మన గురించి మనకు తెలియక పోయినా అంతా తెలుసని అనుకుంటాం. తెలుగు వాడితో కూడా ఇంగ్లీషులో మాట్లాడితేనూ, ఒకవేళ తెలుగులోనే మాట్లాడినా వీనయినన్ని ఇంగ్లీషు పదాలు వాడితేనూ మనం తెలివైన వాళ్ళ కింద లెక్క. అలాగే బయటివాళ్ళ గురించి ఎంత ఎక్కువ తెలుసుకుంటే మనకి సొసైటీలో అంత గౌరవం” అని తన ఉపన్యాసం పూర్తి చేసాడు. “ కృష్ణా నువ్వు చెప్పిందంతా వింటుంటే నా బుర్ర మొద్దుబారి పోయింది. నువ్వే ఆలోచించి నా సమస్యకు ఏదైనా ఉపాయం చెప్పరా” “అర్జున్, నేను ఇప్పుడు నీకు కొన్ని మార్గాలు చెపుతాను. సావధానంగా విను. మధ్యలో మాట్లాడకు. నేను చెప్పడం పూర్తయాక జాగ్రత్తగా ఆలోచించి నీకు నచ్చిన మార్గం నువ్వు ఎంచుకో.” “ మొదటి మార్గం – ఇప్పటి కుర్రవాళ్లను ఆకర్షించేటట్టు ప్రేమ, అక్రమ సంబంధం, పగ, హింస, హత్యలు, బలత్కారాలు ఉండే కథలు రాయడం. అందులో వీలయినన్ని ఆంగ్లపదాలు వాడాలి. తెలుగు పదాలు ఎంత తక్కువ వాడితే అంత ఎక్కువమంది పాఠకులు చదువుతారు. హీరో సిగరెట్లు కాల్చాలి, వీలయినప్పుడు మందు తాగాలి. కథకు ఇంగ్లీషు పేరు పెడితే ఇంకా మంచిది. ఉదాహరణకు ఈ మధ్య ఓ పేరొందిన ఇంటర్నెట్ పత్రికలో పది లక్షల పాఠకులు, అందులో పదివేల మంది అనుచరులతో మొదటి బహుమతి పొందిన కథ “ హూ కిల్డ్ హెర్” నుండి మచ్చుకు కొన్ని వాక్యాలు చెబుతాను, విను.” “ ఓ బ్యూటిఫుల్ గర్ల్, ఓ టాల్ అండ్ హేండ్సమ్ యంగ్ మేన్ కాలేజీలో పస్ట్ లుక్లోనే ఒకరినొకరు లవ్ చేసుకున్నారు. నెక్స్టుడే వాళ్ళు కాఫీడేలో మీట్ అయి వ్యూస్ ఎక్స్చేంజ్ చేసుకున్నారు. ఆ నెక్స్టుడే ఒకరికొకరు ‘ఐ లవ్ యూ’ చెప్పుకున్నారు. బీచ్లో హేండ్ హేండ్ పట్టుకొని ఈ యండ్ నుండి ఆ యండ్ కి వాకింగ్ చేసారు. ………………………. ఏమైందో నాట్ నోన్. ఒకరోజు మన హీరో షాపింగ్ మాల్ పిప్త్ ప్లోర్ నుండి జంప్ చేసి బేస్మెంటులో ఫెల్ డెడ్. హీరోయిన్ తన హోటల్ గదిలో బాత్రూమ్ లో నేకెడ్ గా ఫెల్ డెడ్ అన్ ద ఫ్లోర్. గుండెల్లో నైఫ్ దిగి ఉంది. బాత్ టబ్ లో వాటర్ అంతా రెడ్ గా అయి పోయింది…………………”. “ ఇలాంటి కథలు తెలుగు పదాలు లేని తెలుగు భాషలో రాయగలవా? రాయగలిగితే నీకు తిరుగు లేదు. అతి కొద్ది సమయంలో నువ్వు చాలా ప్రఖ్యాత రచయితగా చలామణి అవుతావు.” “ఇక రెండవ మార్గం – వాట్సప్ వీరుడుగా వెలిగి పోవడం. నీకు గుర్తున్నాడా మన కాలేజి క్లాస్మేట్ నారాయణ. సన్నగా పొడవుగా ఉండేవాడు. మనం వాడిని నారదుడు అని పిలిచే వాళ్ళం. ఆ రోజుల్లో వాడు ఇక్కడిది అక్కడ, అక్కడది ఇక్కడ చెప్పి పబ్బం గడుపుకొనేవాడు. ఆ నారాయణ గాడు ఇప్పుడు ఓ డజను వాట్సప్ గ్రూపులకు, కొన్ని ఫేస్బుక్ గ్రూపులకు ఎడ్మిన్. వాడికి చెపితే ఆ గ్రూపులన్నిట్లోను నిన్ను సభ్యుడిగా చేరుస్తాడు. నువ్వు పెద్దగా ఆలోచించాల్సిందేమీ లేదు. నువ్వు చదివినా చదవక పోయినా ఒక గ్రూపులో పోస్టు ఇంకో గ్రూపులోకి ఫార్వార్డ్ చేసుకుంటూ పోతే నీకు ఎంత టైము అయిందో తెలియదు. అది కథ అయినా, కవిత అయినా, సూక్తి అయినా నీకు వ్యత్యాసం లేదు. నీకు ఇంకా ఓపిక ఉంటే ఆ మెసేజ్లు నీ కంప్యూటర్‌లో ఎడిటింగ్ చేసి నీ పేరు కూడా తగిలించి మళ్ళీ అన్ని గ్రూపులలో పెట్టేయొచ్చు. నీ టైము తప్ప ఒక్క పైసా ఖర్చు లేదు.” “మూడవ మార్గం – ఇందాక చెప్పినట్లు నువ్వు తీర్థయాత్రల గురించి రాస్తే ఎవరూ చదవరు. నువ్వు చూసినా చూడకపోయిన ప్రపంచంలో ప్రముఖమైన ప్రదేశాల గురించి పర్యాటక సంస్థల వెబ్ సైట్ల నుండి సేకరించు. అక్కడి చూడవలసిన ఆకర్షణలు, వాటి ఫొటోలు, హొటళ్ళు, రవాణా సదుపాయాలు, ఆహార వ్యవహారాలు, వాతావరణం, మన ఊరి నుండి అక్కడికి చేరడానికి ఫ్లైట్ల వివరాలు అన్నీ గూగుల్ ద్వారా సేకరించు. ఈ సమాచారం అంతా కలిపి నువ్వు స్వయంగా అ ప్రదేశం చూసి వచ్చినట్లుగా రాసి పోస్టు చెయ్యి. దీనికి శ్రమ అధికం. “నాలుగవ మార్గం – ఇది అన్ని మార్గాలలోకి భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పిన ఉత్తమమైన భక్తి మార్గం. నీ పేరు చూసుకోవాలనే ‘కోరిక’ చంపుకో. కోరిక అనేది అన్ని రకాల సమస్యలకు మూల కారణం. ఈ వయస్సులో కోరికలు తగ్గించుకొని ‘కృష్ణా, రామా’ అనుకోవడం ఉత్తమం. మనస్సుకు ప్రశాంతత లభిస్తుంది, తిన్నది అరుగుతుంది, రాత్రిపూట హాయిగా నిద్ర పడుతుంది, ఆరోగ్యం పాడవకుండా ఉంటుంది. అందుచేత నీకు కుదిరినప్పుడల్లా టీవీలోను, యూట్యూబ్ లోను పెద్దవాళ్ల ప్రవచనాలు వింటూ, రాయాలని అనిపించినప్పుడు ‘రామ కోటి’ రాసుకుంటే నీ సమస్య తీరుతుంది, భగవంతుని అనుగ్రహం ప్రాప్తిస్తుంది, ముక్తికి మార్గం దొరుకుతుంది.” “ఒరేయ్ అర్జున్, నేను చెప్పాల్సిందంతా అయిపోయింది. జాగ్రత్తగా ఆలోచించి ఏమి చెయ్యాలనేది నువ్వే నిర్ణయించుకో” కృష్ణమూర్తి చెప్పినదంతా విన్న అర్జునరావు అయిదు నిముషములపాటు కళ్ళు మూసుకొని ఏమీ మాట్లాడ లేదు. గయలో భోదివృక్షం క్రింద బుద్దుడికి జ్ఞానోదయం అయినట్లుగా పార్కులో ఉన్న వేపచెట్టు నీడలో ఒక్కసారిగా జ్ఞానోదయం అయింది. ఏమిటి చెయ్యాలనేది పూర్తిగా అర్థమయ్యింది. ఇద్దరూ వీడ్కోలు చెప్పుకొని పార్కు నుండి వాళ్ళ వాళ్ళ ఇళ్ళకు బయలుదేరారు. దారిలో అర్జునరావు స్టేషనరీ షాపు వద్ద ఆగి రామకోటి రాయడానికి ఒక మంచి నోట్ బుక్ కావాలని అడిగాడు. “రామకోటి రాయడానికి కొత్తగా స్పెషల్ నోట్ బుక్స్ వచ్చాయి సార్. ఒక బుక్ రెండు వందల రూపాయలు. ఒక పేజీలో వంద నామాలు రాయవచ్చు. ఒక బౌండు బుక్‌లో అయిదు వందల పేజీలు ఉంటాయి. అంటే మొత్తం ఒక పుస్తకంలో యాభై వేల నామాలు రాయవచ్చు. ‘హాట్ కేకుల్లాగ’ అమ్మడు పోతున్నాయి” అని చెప్పాడు షావుకారు. అర్జునరావు ఆనందంగా నాలుగు వందలిచ్చి రెండు పుస్తకాలు తీసుకొని ఇంటికి వచ్చాడు. కృష్ణారావు మాటలకి జ్ఞానోదయం అయిన అర్జునరావు మరునాటి నుండి రామకోటి రాయాలని నిశ్చయించుకున్నాడు. చాలా రోజుల తర్వాత ఆరోజు ఏ ఆలోచనలు లేకుండా, ప్రశాంతంగా, హాయిగా నిద్రలోకి జారుకున్నాడు. ************** .

మరిన్ని కథలు

Kaakula Ikyatha
కాకుల ఐక్యత
- Dr.kandepi Raniprasad
Elugu pandam
ఎలుగు పందెం
- డి.కె.చదువులబాబు
Lakshyam
లక్ష్యం .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Kaalaateeta vyakthulu
కాలాతీత వ్యక్తులు
- జీడిగుంట నరసింహ మూర్తి
Tagina Saasthi
తగినశాస్తి
- డి.కె.చదువులబాబు
Chivari paatham
చివరి పాఠం .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Chandruniko noolu pogu
చంద్రునికో నూలుపోగు .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Tappudu salahaa
తప్పుడు సలహ .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు