యాచకుడు - తటవర్తి భద్రిరాజు

Yachakudu

హైద్రాబాద్ లో కోటి ఉమెన్స్ కాలేజీ బస్టాప్. ప్రతీ రోజు చాలా రద్దీ గా ఉంటుంది. ఇక్కడ ఉండే బస్టాండ్ నుండి సిటీ లోని అన్ని ప్రాంతాలకు బస్ లు ఉండడం వలన ఎప్పుడూ ప్రయాణికులు ఉంటారు. ఉదయం సాయంత్రం అని తేడా లేదు ఏ సమయం లో ఐనా ఒకేలా ఉండే ప్రదేశం ఇది మాత్రమే అనిపిస్తూ ఉంటుంది రోజూ చూసే వాళ్ళకి. అక్కడ సిగ్నల్ పక్కనే ఉన్న ఫుట్ పాత్ పై చిరు వ్యాపారులు వాళ్ళు అమ్మే వస్తువులు అందరికీ తెలిసేలా గట్టిగా అరుస్తూ ఉన్నారు. వారి పక్కనే యాదమ్మ పువ్వులు మొక్కలు అమ్ముతూ ఉంది. తనకి తెలిసిన నర్సరీ నుండి ప్రతీ రోజు చిన్న చిన్న మొక్కలు తీసుకువస్తుంది. యాదమ్మ భర్త ఆటో డ్రైవర్. ఉదయం యాదమ్మ భర్త , ఆటో లో తీసుకువచ్చి యాదమ్మ ను ఇక్కడ దింపుతాడు. సాయంత్రం మళ్లీ వచ్చి తీసుకు వెళ్తాడు. సాయంత్రం ఐతే రోడ్ పై బుట్టలు లో మల్లెపూలు పెట్టుకుని అమ్మతూ ఉంటాడు యాదగిరి. వేసవిలో పువ్వులు అమ్మే యాదగిరి వర్షాకాలం మాత్రం గొడుగులు అమ్ముతూ ఉంటాడు. ఆ పక్కనే మల్లేశం గోడకు పెట్టుకునే ఫోటోలు అమ్ముతూ ఉంటాడు. చిన్నతనం లో నాన్న కూడా సిటీ అంతా తిరిగి ఈ ఫోటోలు అమ్మడం నేర్చుకున్నాడు మల్లేశం. నాన్న పోయాకా ఇక్కడే రోజూ అమ్ముతూ ఉన్నాడు. ఆ తరువాత వరుసగా పాత పుస్తకాలు అమ్మే షాప్స్ ఉన్నాయి. సిగ్నల్ పక్కనే 60 ఏళ్ళ వృద్ధుడు సత్తెయ్య చిరిగిన పంచి ఒక్కటి కట్టుకుని కూర్చున్నాడు. నెరిసిన జుట్టు , బాగా పెరిగిన గెడ్డం. ఓ అర్ధరాత్రి పక్కనే ఉన్న ఫుట్ పాత్ పై పడుకుంటే ఓ వీధి కుక్క వచ్చి సత్తెయ్య ఎడమ చేతి పై కరిచేసింది. అప్పటి నుండి ఆ చేతికి గాయం అలానే ఉంది. అది ఎవరికీ కనపడకుండా ఆ ఎడమ చేతికి ఓ గుడ్డ కట్టుకుని ఉంటాడు. అతని పక్కనే ఒక చిరిగిన చిన్న నల్ల రంగు బ్యాగ్. అతని వెనకాల ఎవరో తినగా ఇచ్చిన బిర్యానీ పొట్లం. దాని పక్కనే చిన్న గిన్ని. ఆ గిన్నె లో కొంచం చిల్లర డబ్బులు . ఇవన్నీ చూస్తే ఎవరికైనా అర్ధం అవుతుంది అతను ఒక యాచకుడు అని. సిగ్నల్ పడగానే కుడి కాలు కుంటుతూ అందరిదగ్గరకి వచ్చి డబ్బులు అడుగుతూ ఉంటాడు. ఉదయం నుండి సాయంత్రం వరకూ అతడి దిన చర్య అది. రోజూ ఆఫీస్ అయ్యిపోయాకా శ్రావణి ఈ రూట్ లొనే స్కూటీ పై ఇంటికి వెళ్తుంది. ఈ సిగ్నల్ దగ్గరకి వచ్చే సరికి సుమారుగా సాయంత్రం 6 గంటలు అవుతుంది. ఈరోజు సిగ్నల్ రెడ్ లైట్ పడగానే సత్తెయ్య తన గిన్నె తీసుకుని డబ్బులు కోసం శ్రావణి దగ్గరకి వచ్చాడు. శ్రావణి కి యాచకులు అంటే మంచి అభిప్రాయం లేదు. పోయిన నెలలో వీక్ మ్యాగజైన్ లో వచ్చిన బెగ్గర్స్ మాఫియా ఆనే ఒక ఆర్టికల్ ను శ్రావణి చదివింది. దేశంలో మెట్రో సిటీ లలో బిచ్చగాళ్ళు చేసే అకృత్యాలు, చేస్తున్న మోసాలు గురించి ఆ వ్యాసం లో చాలా విపులం గా చెప్పారు. చిన్న పిల్లలను కిడ్నాప్ చేసి వాళ్ళ చేత మాదకద్రవ్యాలు అమ్మించడం. చిన్న పిల్లల చేత యాచన చేయించడం, దొంగతనాలు చేయించడం వంటి ఎన్నో చీకటి వ్యహారాలు ఈ యాచకులు చేస్తుంటారు అని తాను చదివింది. దేశం లోని అత్యంత ధనవంతుడైన బిచ్చగాడు ముంబై లో ఉండే భారత్ జైన్ గురించి ఆ వ్యాసం లొనే చదివింది శ్రావణి. 70 లక్షల రూపాయల విలువైన రెండు అపార్ట్మెంట్స్ ఇతని దగ్గర ఉన్నాయి అని, నెలకి లక్ష రూపాయలు భారత్ జైన్ సంపాదిస్తున్నాడు అని చదివి ఆశ్చర్య పోయింది. అలాగే పాట్నా లో అశోక్ థియేటర్ అనే ప్రాంతం లో ఉండే సార్వాతియా దేవి అనే ఆమె యాచన చేస్తూ నెలకు 50వేల రూపాయాలు సంపాదిస్తుంది. ఆమె సవంత్సరానికి 36000/- ఇన్సూరెన్స్ ప్రీమియం చెల్లిస్తుంది. అది చదివినప్పటి నుండి యాచకుల మీద ఒక సదాభిప్రాయం లేదు శ్రావణి కి. శ్రావణి దగ్గరకు వచ్చిన సత్తెయ్య 'అమ్మా ధర్మం' అన్నాడు. శ్రావణి ఒకసారి సత్తెయ్య కేసి చూసి తల తిప్పుకుంది. తరువాత రోజు కూడా 'ధర్మం చేయి తల్లి' అన్నాడు. శ్రావణి కొంచం చిరాగ్గా మొహం పెట్టి 'వెళ్లవయ్యా వెళ్ళు' అంది. మరో రోజు సత్తెయ్య ధర్మం అని అడిగితే 'మీలాంటి వాళ్ల గురించి నాకు తెలుసు ' అని అక్కడ నుండి సిగ్నల్ పడగానే వెళ్ళిపోయింది. సత్తెయ్య అవేవి పట్టించుకోకుండా , వేరే వ్యక్తుల దగ్గరకి వెళ్ళి ధర్మం చేయండి బాబు అని అడుగుతూనే ఉన్నాడు. ఓరోజు సిగ్నల్ దగ్గర ఆగిన శ్రావణి ఒక దృశ్యం చూసింది. అది సత్తెయ్య తన బ్యాగ్ లో నుండి కొన్ని నోట్ల కట్టలు తీసి , రోడ్ దాటి వెళ్లి ఎవరికో ఇవ్వడం. శ్రావణి తను చదివిన ఆర్టికల్ గుర్తుకు వచ్చింది. ఇలా సంపాదించి ఆ డబ్బులు తో వీళ్ళు మేడలు కడతారు. ఏమి దర్జా లైఫ్, ఎంత ఈజీ గా సంపాదిస్తున్నారు అనుకుంది. ఐనా ఆత్రుత ఆగక అసలు ఈ వ్యక్తి డబ్బులు ఎవరికి ఇస్తున్నాడు అని తెలుసుకోవాలి అనుకుంది. ఓరోజు సాయంత్రం సిగ్నల్ పక్కనే వేచి ఉంది. సత్తెయ్య ఎప్పుడు ఇంటికి వెళ్తాడు ? ఎక్కడ ఉంటాడు ? తన లైఫ్ ఎలా ఉంది. తన కుటుంబం ఎలా ఉంది అని విషయాలు అన్నీ తెలుసుకోవాలి అనుకుంది. కొంచం చీకటి పడ్డాక , సత్తెయ్య ఇంటికి బయలుదేరాడు. సత్తెయ్య కు తెలియకుండా శ్రావణి తన వెనకాలే వెళ్ళింది. ఊరు చివర మురికి వాడ లో చిన్న పూరి గుడిసెలో సత్తెయ్య ఉంటున్నాడు. అది చూసిన శ్రావణి అదేంటి మరి అంత డబ్బు సంపాదిస్తూ ఇలాంటి ఇంట్లో ఉంటున్నాడు. ? అనే ఆలోచనలో పడింది. ఎలాగైనా సత్తెయ్య గురించి తెలుసుకోవాలి అనుకుంది. ఆరోజు ఇక చీకటి పడడం తో తన ఇంటికి వెళ్ళిపోయింది. తరువాత రోజు ఆఫీస్ కి సెలవు పెట్టి మరీ సత్తెయ్య ఉండే ఏరియా కి వెళ్ళింది. అక్కడ సత్తెయ్య గురించి కొంత మంది ని అడిగితే చాలా ఆశ్చర్య కరమైన విషయాలు తెలిశాయి. సత్తెయ్య ఎవరూ లేని అనాధ కాదు. అందరూ ఉండి ఎవరూ పట్టించుకోని అనాధ. సత్తెయ్య కి ఉన్న ఇద్దరు కొడుకులు ఎవరూ చూడక పోతే ఎవరికీ భారం కాకూడదు అని ఇలా యాచన చేస్తూ తన పొట్ట తాను పోషించుకుంటున్నాడు. మరి ఆ నోట్ల కట్టలు ఏంటి ? అవి ఎవరికి ఇస్తున్నాడు ? ఏవైనా చీకటి వ్యహారాలు చేసిన ధనమా ? ఇతను కూడా ఏవైనా మాదకద్రవ్యాలు అమ్ముతూ , ఆ డబ్బులే ఆ రోజు ఎవరికో ఇచ్చి ఉంటాడు ఏమో ? అనే ప్రశ్నలు మాత్రం తన మెదడు లో తిరుగుతూ ఉన్నాయి. సత్తెయ్య ఉండే ఏరియా నుండి వచ్చేస్తుంటే తనకి ఆ రోజు సత్తెయ్య దగ్గర డబ్బులు తీసుకున్న వ్యక్తి కనబడ్డాడు. అతని ని ఆపి తన సందేహాలు మొత్తం అడిగింది శ్రావణి . అతను చెప్తున్న విషయాలు వింటూ ఆశ్చర్య పోయింది . 'సత్తెయ్య కు ఇద్దరు కొడుకులు. ఎవరూ చూడక పోవడం తో తాను ఒక్కడు ఇక్కడ ఉంటున్నాడు. ఎవరికీ భారం కాకూడదు అని యాచన చేస్తూ బతుకు తున్నాడు. ఇక ఆ డబ్బులు విషయానికి వస్తే .. ..తను బతకడానికి ఖర్చు పెట్టుకున్నాక మిగిలిన డబ్బులు అన్నీ దాచి ఇక్కడ దగ్గరలో ఉన్న వృద్ధాశ్రమం లో ఇస్తున్నాడు. తనలానే బిడ్డలు చూడని తల్లి తండ్రులు కొంత మందికి అయినా సహాయం చేయగలుగుతా అని నన్ను పిలిచి ఆ డబ్బులు ఇచ్చాడు. ఆరోజు ఆ డబ్బులు నేనే తీసుకుని వెళ్లి అక్కడ ఇచ్చాను. అని చెప్పాడు ఆ అపరిచిత వ్యక్తి. 'చదువుకున్న నేను కూడా ఎంత తప్పుగా ఆలోచించాను. ఏదైనా ఒక విషయాన్ని విన్న వెంటనే, లేదా చదివిన వెంటనే లేదా చూసిన వెంటనే ఒక అభిప్రాయం కి రావడం . దాని వెనుక పూర్తి వివరాలు తెలుసుకోకుండా నిర్ణయాలు తీసుకోవడం ఎంత తప్పు. సత్తెయ్య గురించి పూర్తిగా తెలుసు కోకుండా 'ఒక మంచి వ్యక్తి గురించి కూడా ఒక తప్పుడు అభిప్రాయానికి వచ్చేసాను' అని తనలో తానే పత్యాతాపపడింది శ్రావణి.

మరిన్ని కథలు

Chinni aasha
చిన్ని ఆశ..!
- ఇందుచంద్రన్
Taraalu antaranga raagaalu
తరాల అంతరంగ రాగాలు
- సి హెచ్.వి యస్ యస్.పుల్లం రాజు
Sneha dharmam
స్నేహ ధర్మం
- వెంకటరమణ శర్మ పోడూరి
Nirnayam
నిర్ణయం
- జీడిగుంట నరసింహ మూర్తి
Toli prema
తొలి ప్రేమ..!
- ఇందుచంద్రన్
Nakka vaibhogam
నక్క వైభోగం
- నిశ్చలవిక్రమ శ్రీ హర్ష