రక్త కన్నీరు - చిట్టత్తూరు మునిగోపాల్

Raktakanneeru

లోపలికి ఎక్కాము. రెండువారలా అటూయిటూ ఉన్న బెద్లమీదా, కిందా అంతా రక్తం మరకలు. చెమ్మగా ఉన్న లోపలిభాగం కడిగినట్లు తెలుస్తోంది కానీ, అప్పటికే గడ్డకట్టిన మరకలు పూర్తిగా పోలేదు. ఒకటా రెండా... ఏకంగా ఎనిమిది మృత దేహాలు. లోయలో ఆ కన్నుగానని రాత్రిపూట. బీభత్స భయానక దృశ్యం మళ్ళీ కనబడి ఒళ్ళు జలదరించింది. మొబైళ్ళు, టార్చిలైట్ల వెలుగుచీకట్ల నడుమ, ఎరుపూనలుపులు కలగలసిన రక్తం పులుముకున్న మానవ దేహాలు...

కాళ్లూచేతులు విరిగి... తలలు పగిలి...

మామిడి కాయల లోడుతో వెళ్తున్న లారీ పాలారు-కంగుంది మార్గంలోని లోయలో పడిపోయిందట. అదుపుతప్పిందా లేక కాలం చెల్లిన వెహికలు కావడంవల్లా అన్నది తెలియదు. ఎత్తుగా వేసిన కాయల లోడ్డుమీద కూకుని ప్రయాణిస్తున్నారు కూలీలు. డ్రైవరు, క్లీనరుతో సహా మొత్తం 28 మంది అక్కడికక్కడే చనిపోయారట. రాత్రి ఎనిమిది గంటలు దాటుతుండగా అందిన సమాచారమీది. కుప్పానికి కనీసం ఇరవై కిలోమీటర్ల దూరం. మెలికలు తిరిగిన గుట్టలతో కూడిన మార్గం. చిమ్మచీకటి. ఆకాశాన్ని ముసుగేసిన మబ్బు, ఇప్పుడో... మరి కాసేపట్లోనో కుండపోత కురిసేలా ఉంది. ఎవరికీ తెలియదింకా. ఉన్నపళంగా స్పాట్ కు చేరుకోగలిగితే, మంచి ఫోటోలే కాదు, వీడియోలూ తీసుకోవచ్చు. పేపరుకూ, చానల్ కూ, స్కోరింగ్ అండ్ ఎక్స్ క్లూజీవ్ కథనం అందించవచ్చు. అది కూడా వేరేవాళ్ళకంటే ముందుగా.

వెళ్ళాలి. మామూలుగా జరిగిన ఘటన ఇచ్చి ఊరుకోడంకాదు, మాంచి హ్యూమన్ ఇంటరెస్టెడ్ స్టోరీతో అదరగొట్టాలి. అసలే మనం మానవీయ కథనా రచనలో స్పెషలిస్టులము కూడా. డెస్క్ లో మన పేరు ఎక్కడికో వెళ్లిపోవాలి.

ఒక సందేహం. ఇంతాచేసి, కష్టపడి స్పాట్ కు వెళ్ళాక అక్కడ అంతమంది కాక, ఏ ఒక్కరో ఇద్దరో మాత్రమే చనిపోయి మిగిలినవారంతా సేఫ్ గా ఉంటే. నా శ్రమ మొత్తం వృథా అవుతుంది. ఒకరిద్దరి మృతికి పెద్దగా ప్రాధాన్యమివ్వరు... ఇటు ప్రింట్ మీడియాలో, అటు ఎలక్ట్రానిక్ మీడియాలో కూడా. ఈ ఆలోచన వెనక్కు లాగుతున్నా, వెళ్లడానికే నిశ్చయించుకున్నాను... భగవంతుడిమీద భారమేసి.

"సార్, యాక్సిడెంటట. ఎంతలేదన్నా ఇరవైముప్పయిమంది చనిపోయారంటున్నారు. స్పాట్ కు వెళ్తున్నాను. అక్కడ సిగ్నల్స్ అందజపోవచ్చు. కుప్పం తిరిగి వచ్చాక కాల్ చేస్తా. వీలైనంత త్వరగా వచ్చేందుకు ట్రై చేస్తా." డెస్కుకు కాల్ చేసి చెప్పేశాను. టూవీలర్ కిందకు దించి ఆర్టీసే బస్టాండ్ వైపు పరుగులు తీయించాను. అప్పటికే నా శిష్యుడు శ్రీనాథ్ అక్కడ సిద్ధంగా ఉన్నాడు. ఎడైతే అదే అయిందని టూవీలర్లోనే స్పాట్ కు వెళ్లడానికి తయారయ్యాము. ఇంతలో లక్కీగా తహశీల్దారు కారు వస్తూ కనిపించింది. రిక్వెస్ట్ చేసి అందులో ఎక్కాము యిద్దరమూ. స్పాట్ కు చేరేసరికి రాత్రి తొమ్మిదిన్నర. "దేముదా మా శ్రమ వృథా కాకూడదు. మృతుల సంఖ్య కనీసం పదిమందికి తక్కువ ఉండకూడదు." ఆరి పొడవునా ప్రార్థిస్తూనే ఉన్నాను. స్పాట్ కు చేరేసరికి రాత్రి తొమ్మిదిన్నర.

ఆంధ్రా జనాలకంటే తమిళనాడు జనాలే ఎక్కువక్కడ. ఆ అంతర్రాష్ట్ర సరిహద్దు తమిళనాడుకు కేవలం పదీపన్నెండు కిలోమీటర్ల దూరంలోనే ఉండడం, మామిడికాయల్ లోడ్డు వెళ్తున్నది ఆ రాష్ట్రమే కావడం కారణం. కూలీలు కూడా అక్కడివారే.

పాతిక ముప్ఫై అడుగుల లోటుంటుందా లోయ. చెట్లు పుట్టలు, ముళ్ళకంపలతో నిండి ఉంది. లుంగీలు ఎగ్గట్టి, కొందరు... కాళ్ళకు అడ్డుపడుతున్న పంచెలు ఊడదీసి, ఒట్టి డ్రాయర్లతో మరికొందరు దిగిపోతున్నారు లోయలోకి.

అక్కడ సీన్ చూసేసరికి నాకు ధైర్యం వచ్చింది. ఫరవాలేదు... కనీసం పది శవాలైనా దొరికేలా ఉంది.

ఎవరూ క్షణమాత్రం ఆలోచించడంలేదు. యాభై అరవై మంది గ్రామీణులు లోయలోకి దిగిపోయారు. అగ్నిమాపక సిబ్బంది, సాధారణ పోలీసులవల్ల కావడంలేదు. అంతా వీరే అయ్యారు. ముందుగా ప్రాణాలతో మిగిలివున్న వారిని, ఒకరికొకరు సాయమందించుకుంటూ భుజాలమీదా, రెండు చేతులమీదా మోసుకొచ్చి రోడ్డుమీదకు చేర్చారు.

ముందుగా చనిపోయినవారిని తీసుకొచ్చేస్తే వారి లెక్క తేలిపోతుంది కదా. మృతుల సంఖ్యను బట్టి ఇక్కడ మరికొంతసేపు గడపాలో లేక వెళ్లిపోవాలో నిర్ణయించేసుకోవచ్చు. అదే చెప్పాను అక్కడ నిలబడి పర్యవేక్షిస్తున్నా ఇన్స్పెక్టర్ తో.

"సార్, ముందు శవాలను పైకి తీసుకొచ్చేస్తే బాగుంటుంది కదా"

అదోలా చూశాడాయన నావైపు. "లేదు మునీ, బతికున్నవాళ్లని ముందు బయ్తకు తీస్తే, వారి ప్రాణాలైనా కాపాడొచ్చు." చెబుతూ అదోలా చూశాడాయన నావైపు. అంతకుమించి ఏమనలేడు... మనం ప్రెస్ కదా. మన అవసరం వారికి ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది.

ఇన్స్పెక్టర్ చెప్పింది కరెక్టే కానీ, నా బాధ కూడా అదే... కొనఊపిరితో ఉన్నవారిని కాసేపలాగే లోయలో ఉంచేస్తే, ఆ ఉన్న ఊపిరి కూడా పోయి, మృతుల సంఖ్య పెరిగి నా శ్రమకు తగ్గ ఫలితం దక్కుతుందని. ఎలాగూ పోయే ప్రాణమే అయినప్పుడు ఆసుపత్రి ఎమర్జన్సీలో ఎందుకు పోవాలి. ఇక్కడో పోతే నాకు పనికొస్తారు.

ఎప్పటికో మృతదేహాలను రోడ్డుమీదకు చేర్చారు. ఈ యాక్సిడెంట్లో చనిపోయింది ఎనిమిదిమందే. కాసేపు ఉస్సురనిపించినా, ఆ సంఖ్య పదికి కేవలం రెండు మాత్రమే తక్కువ జాబట్టి, ఎలాగో కథనం రంజుగానే వండి వార్చేయొచ్చని సమాధాన పడ్డాను.పోలీసు వాహనాల లైట్ల వెలుగులో చకచకా ఫోటోలు తీశాను. శ్రీనాథ్ వీడియోలో బంధిస్తున్నాడు మొత్తం సీనును.

యాక్సిడెంట్ స్పాట్ కు కేవలం పాతిక కిలోమీటర్ల దూరంలోనే ఉంది సమిళనాడు రాష్ట్రం వాణియంబాడి. అక్కడి ప్రభుత్వాసుపత్రికి తరలించారు... మృతదేహాలతోపాటు, క్షతగాత్రులను కూడా.

కుప్పం నుంచి మేమొచ్చినతహశీల్దారు కారు కూడా అటే వెళ్లిపోయింది. చూస్తుండగానే ఒక్కో వాహనమూ, ఒక్కో మనిషీ అక్కడినుంచీ అదృశ్యమయ్యారు. రెండుమూడు టూవీలర్లు, నాలుగురైదుగురు గ్రామీణ వ్యక్తులు మాత్రం స్పాట్ లో మిగిలారు.

మాకిప్పుడు వాహనం లేదు. ఎలా వెళ్ళాలి కుప్పం. పైగా ఎడిషన్ కు టైమైపోతోంది. టైమ్ దాటిపోయిందంటే ఇంట దూరం, ఇంట శ్రమకోర్చి వచ్చి ఫలితం దక్కదు. మిస్ అనే మాట రాకుండా మొబైల్లో నాలుగుముక్కలు డెస్కుకు చెప్పి సరిపెట్టేయాల్సిందే. తీవ్రమైన బాధేసింది నాకు.

ఆలోచననుంచీ బయటపడి చూస్తే, ఇంతకుముడున్న నాలుగురైడుగురు మనుషులు కూడా ఖాళీ చేసేశారు. శిష్యుడు శ్రీనాథ్, నేనూ... మేమిద్దరమే మిగిలాం రోడ్డుమీద... ఒంటరిగా. ఇధ్ద్రమున్నాం... "ఒంటరిగా" అన్న పద ప్రయోగం తప్పెమో.

ఆ సిచ్యుయేషన్లో సైతం తెలుగు భాషా పద ప్రయోగాలగురించి ఆలోచిస్తున్నందుకు, నాకే గర్వంగా అనిపించింది. అవును, డెస్కులో నా రాతల్ని మెచ్చుకోడానికి తగిన అర్హత ఉంది నాకు.

పైన తళుక్కుమంటున్న చుక్కల వెలుగు... చుట్టూ ఉన్న చీకట్లను మరింత చిక్కన చేస్తోంది. అది రోడ్డే కావచ్చు. నట్టడవి మధ్యలోంచి వెళ్తోంది. దూరంగా పొదలు కదులుతున్న అలికిడి వినిపిస్తోంది. ఏనుగులా లేక ఎల్లుగుబంట్లా? పక్కనే ఎనిమిది మందిని మింగేసి, నాలోని పత్రికా రచయితకు అద్భుతమియన పేరు తీసుకు రాబోతున్న మృతు లోయ... నోరు తెరచుకుని ఆవలిస్తోంది.

దూరంగా ఏదో దడదడలాడింది... గుండె గుబగుబ రెట్టింపయింది.

మితిమీరిన వేగంతో మా ముందునుంచీ వెళ్లిపోతోంది అంబులెన్స్. మృత దేహాలను, క్షతగాత్రులను వాణియంబాడి ఆసుపత్రికి చేర్చి తిరిగి వస్తున్న ఆంధ్రా వెహికల్ అది. రోడ్డుకడ్డంపడి ఆపాను.

"సార్, ఇందులోనా..." నేరుగా మృత్యువు నోట్లోకి వెళ్తున్నంత భయం, నా శిష్యుని మాటల్లో...

ఫరవాలేద్న్నట్లు అతడి భుజం తట్టి లోపలికి నెట్టాను.

"పాఠకులకు కిక్కిచ్చే మాంచ్చి ఐటం దొరికింది శ్రీ. కాకపోతే, ఇంకో ఇద్దరినా చనిపోయి ఉంటే బావుణ్ణు, పది అంటే వినదానికి, రాయడానికి, తీయడానికి కూడా బాగుండేది. తెల్లారి చదివే జనాలకు థ్రిల్ కలిగించేది. ఫరవాలేదులే... ఈ ఎనిమిది మందితోనే అల్లేస్తా కత. తెల్లారి మన పత్రికలో అది చదివిన వాళ్ళ కళ్ళల్లో నీళ్ళు తిరగాలి." ఉత్సాహంగా చెప్పుకు పోతున్నాను.

అంబులెన్స్ డ్రైవర్ వృద్ధుడు. వెనక్కి తిరిగి చూశాడు మావైపు, పార్టిషన్ కున్న చిన్నపాటి కిటికీలోంచి. ఆ వెంటనే డ్రైవర్ పక్కనున్న విండో ఓపెన్ చేసి తుపుక్కున రోడ్డుమీద ఉమ్మేశాడు. అతడి నోట్లో పువ్వాకు ఉన్నట్లు కూడా లేదు.

ఎందుకో... అప్రయత్నంగా నా రెండు అరచేతులతో ముఖాన్ని తుడుచుకోవాలనిపించి ఆ పని చేశాను.

ఈలోగా సెల్లు సిగ్నల్ దొరికింది. డెస్క్ కు కాల్ చేశాను.

"సార్, ఇంకో ఫిఫ్టీన్ మినిట్స్ లో కుప్పం చేరిపోతాం. ఫస్ట్ పేజీ అట్టే పెట్టండి. స్పాట్, హ్యూమన్ ఇంటరెస్టెడ్ స్టోరీ... ఎక్స్క్లుజీవ్ ఫోటోలతో సహా ఇస్తున్నాను..."

మరిన్ని కథలు

Abhimanam khareedu
అభిమానం ఖరీదు
- మద్దూరి నరసింహమూర్తి,
Nirvika
నిర్విక
- బొబ్బు హేమావతి
Anji marindoch
అంజి...మారిందొచ్
- కాశీ విశ్వనాథం పట్రాయుడు
Moodu vupayalu
మూడు ఉపాయాలు
- డా.దార్ల బుజ్జిబాబు
Ayyo sankaram mastaaru
అయ్యో! శంకరం మాస్టారు
- తటవర్తి భద్రిరాజు (949 3388 940)
Second hand
సెకండ్ హ్యాండ్
- బొబ్బు హేమావతి
Emi jariginaa antaa manchike
‘ ఏమి జరిగినా అంతా మంచికే ’
- మద్దూరి నరసింహమూర్తి