అయ్యో....అతనా ...!! - శ్యామ్ కుమార్ చాగల్

Ayyo atanaa

" త్వరగా పనులన్నీ పూర్తి చేసుకోండి..అబ్బాయి వాళ్ళు వచ్చే సమయం అవుతోంది." ఇంట్లో అందరినీ తొందర పెడుతూ అన్నాడు రామనాధం " మీరు హాయిగా పేపరు చదువుకోండి.. ఒకటే ఖంగారు అన్నింటికీ." విసుగు తో అంది రామనాథం భార్య అరుణ. పెళ్లీడు కొచ్చిన కూతురు ఉషారాణి ని చూసుకోవటానికి అబ్బాయి వాళ్ళు వస్తున్నారు. అదీ అక్కడి విషయం ! రామనాథం ,స్టేట్ బ్యాంకు లో వుద్యోగం చేస్తూ,భార్య ఒక కూతురు ఇద్దరు కొడుకు ల తో విజయవాడ సత్యనారాయణపురంలో నివసిస్తున్నాడు. కూతురు ఉష రాణి ఇంజనీరింగ్ పూర్తి చేసి కెనరా బ్యాంకు లో సంవత్సర కాలం గా పని చేస్తూ వుంది. చాలా అందమైన అమ్మాయి.అందుకే రామనాథం కూతురుకి సంబంధాలు వెతకటం మొదలు పెట్టాడు అదేసయంలో తండ్రి దగ్గరికి వచ్చి కూర్చుంది కూతురు ఉష రాణి. కూతురిని చూసి ప్రేమ గా అన్నాడు రామనాథం " అబ్బాయి వాళ్ళు కాసేపటి లో వచ్చేస్తారు.. ఏంటమ్మా ..ఏదో చెప్పాలనుకుంటున్నట్లుగా వుంది ఏంటి " అని ప్రశ్నించాడు, కూతురి మొహం లో ఏవోఅనుమానాలు పసిగట్టినవాడిలా. సాలోచనగా చూసింది తండ్రి వేపు ఉష. మరి కాసేపు అలోచించి అడిగింది." నాన్న..ఈ వచ్చే అబ్బాయి ..ఫోటో లో అయితే బాగానే వున్నాడు.. మీరు వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అబ్బాయిని చూసారా ?" అని తండ్రి కళ్ళలోకి చూసింది ఉష. కళ్ళు చిట్లించి చెప్పాడు రామనాథం " లేదమ్మా..ఆ సమయం లో అబ్బాయి లేడు. అబ్బాయి నాన్న తో చాల సేపు మాట్లాడాను. చాలా మంచి వాళ్ళు. పైగా చాలా సంవత్సరాలుగా వాల్లని నేను ఎరుగుదును. మర్యాదస్తుల కుటుంబం.పైగా ఆర్థికంగా మనకంటే కూడా బాగా వున్నా వాళ్ళు. అబ్బాయి హైదరాబాద్ లో చదువుకుని..చాలా త్వరగా చార్టర్డ్ అకౌంటెన్సీ పాస్ అయ్యాడు. అబ్బాయి కి ఎటువంటి దురలవాట్లు లేవని తెలిసింది. తాను సంపాదన మొదలు పెట్టినప్పటినుండీ అంతా అమ్మా,నాన్న లకు ఇచ్చేస్తాడుట. నువ్వు చూస్తావుగా ,మాట్లాడతావుగా ఇప్పుడు . నీకు నచ్చితేనే కదా ,పెళ్లి జరిగేది " అని నవ్వి ,కూతురుముఖంలోకిచూసాడుతండ్రి . "సరే నాన్నగారు.. ,అలాగే! " అని తృప్తిగా లోపలికి వెళ్లి పోయింది ఉష. " ఏమిటంటోంది మీ ముద్దుల కూతురు ?" అంటూ వచ్చి ఎదురుగా వున్న చాప మీద చతికిల పడింది అరుణ. " అదే , అబ్బాయి గురించి అడుగుతూ వుంది..ఇంతకీ,,అన్నీ ఏర్పాట్లు పూర్తి అయ్యాయా?" అని,భార్యవైపుచూసాడు,రామనాథం. " ఏవండీ అదిగో , ఇంటి ముందు ఏదో కారు ఆగినట్లుగా వుంది చూడండి , అబ్బాయి వాళ్ళే అయి వుంటారు " అంది గుమ్మం వేపు చూస్తూ అరుణ. వెంటనే బయటకు వెళ్లి కార్లో నుండి దిగుతున్న అబ్బాయి ని , తల్లీ, తండ్రిని చూసి , నమస్కారం చేసి లోనికి తోడ్కొని వచ్చాడు రామనాథం . అందరూ సోఫాలో,కుర్చీల్లో సర్దుకుని కూర్చున్నారు. పరిచయాలు అయిన తర్వాత , వేరే విషయాలు మాట్లాడుతూ కూర్చున్నారు అందరూ . అబ్బాయి ని చూసాడు రామనాథం. అబ్బాయి ఎవరి తో కూడా మాటలు కలపకుండా తల వంచుకుని కూర్చున్నాడు. "ఇంతకీ అబ్బాయి సి.ఏ ఎక్క డ చదివారు ? " అని, విషయాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేశారు రామనాథం. చెప్పమన్నట్లుగా అబ్బాయి కేసి చూసారు తల్లి తండ్రులు. " రెండు సంవత్సరాల కిందట చెన్నై లో చేసానండి " అని చాలా వినయంగా చెప్పాడు అబ్బాయి. అబ్బాయిని పరికించి చూసింది అరుణ . ' తల నిండా నూనె పెట్టుకుని చక్కగా దువ్వుకుని వచ్చాడు అబ్బాయి. టక్ చేసుకున్నాడు. బట్టలు బిగుతుగా వేసు కున్నాడు. ఎక్కడా భేషజం , గర్వం కనపడలేదు. బావున్నాడు ..చాలా సాదా సీదాగా' అనుకున్నాడు రామనాథం. ట్రే లో కాఫీలు బిస్కెట్లు తీసుకుని వచ్చింది ఉషారాణి. అందరూ మౌనంగా కూర్చొని కాఫీలు త్రాగారు. ఎదురుగా రామనాథం పక్కన కూర్చున్న ఉషారాణి ని చూసి ,తృప్తిగా ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు అబ్బాయి తల్లీ తండ్రిను. " మీరేమైనా అమ్మాయి ని అడగ వచ్చు " అని నవ్వుతూ చెప్పాడు రామనాథం అబ్బాయిని చూసి. 'సరే' అన్నట్లుగా తల ఊపాడు అబ్బాయి. మళ్ళీ అన్నాడు రామనాథం " అదుగో ..అక్కడ హాల్ లో కుర్చీల్లో కూర్చుని మాట్లాడుకోండి " అని దూరంగా వేసిన రెండు స్టీల్ చైర్స్ ను చూపించాడు. అబ్బాయి లేచి వెళ్లి కూర్చుని ఉష వేపు చూసాడు. నువ్వూ వె ళ్ళు అని సైగ చేసింది అరుణ ఉష , ఆ అబ్బాయి మాట్లాడుకుంటూ ఒక పది నిముషాలు గడిపేశారు. అబ్బాయి తల్లి, తండ్రి చాలా సంతోషంగా వున్నారు. వారికి ఉష బాగా నచ్చేసిందని రామ నాథం కు వేరే చెప్పాల్సిన అవసరం కనపడ లేదు. ఆర్థికంగా మిగిలిన అన్ని విధాలుగా సరి అయిన ఈ సంబంధం కుదిరితే బావుండు అని అరుణ, రామ నాథం మనసులో కోరుకున్నారు. కాసేపటికి అబ్బాయి, ఉష అక్కడినున్డి లేచి వచ్చారు. అబ్బాయి నవ్వుతూ వాళ్ళ అమ్మ పక్కన కూర్చున్నాడు. ఉష లోనికి వెళ్ళింది. " మాకు అమ్మాయి నచ్చింది. మీ విషయం తెలియ చేయండి , మేమిక సెలవు తీసుకుంటాము " అని లేచి నమస్కారం పెట్టాడు అబ్బాయి తండ్రి. " సరే నండి , తప్పకుండా, దేవుడి దయ " అని లేచి వీడ్కోలు ఇచ్చారు రామనాథం , అరుణ. సంతోషం తో వెనుతిరిగి లోనికి వచ్చి ఈజీ చైర్ లో వెనక్కి వాలి " అరుణా కాస్త కాఫీ తేవోయ్ " అన్నాడు రామనాథం. వంటింట్లోకి వెళ్లి కాఫీ కప్పు పట్టుకుని వచ్చి రామనాథం కు ఇచ్చి ఆదుర్ధాగా అంది అరుణ " ఏమండీ....అమ్మాయి ఈ సంబంధం వద్దంటోంది " అంది కాస్త అసంతృప్తిగా మొహం పెట్టి . ఆ మాట వినగానే చటుక్కున ఉలిక్కి పడి కుర్చీలోనుంచి లేచి నించున్నాడు రామనాథం . "ఏమిటయ్యింది ,ఎందుకని, అంతా బాగానే వుంది కదా!" అన్నాడు ఆతృతగా. " ఏమిటోనండీ ,...అబ్బాయి తో మాట్లాడి, వెంటనే లోనికి వచ్చి అప్పుడే చెప్పేసింది ఈ సంబంధం వద్దని " అంది దిగులు గా. " ఇంత మంచి సంబంధం వెతుక్కుని మరీ వచ్చారు మనింటికి.,,,అదృష్టం అని అనుకుంటూ ఉంటే ..ఇదేమిటి ఇలా?,,....సరే ..అమ్మాయిని రమ్మను , నే ,కనుక్కుంటా విషయం ఏమిటో " అన్నాడు . అప్పుడే గది లోనుండీ వచ్చిన ఉష ను చూసి " రా.. అమ్మా..ఏంటమ్మ , ఏమైంది..? అబ్బాయి నచ్చ లేదా...లేక ఇంకేదైనా బాగా లేదా?" ఆదుర్ధాగా అడిగాడు రామనాథం. " ఏమిటో నాన్న.. మీరు అసలు అబ్బాయి ని గమనించారా?" అంది నిరాశగా,నిట్టూరుస్తూ '' ఏమిటో చెప్పు..నావరకూ అంతా బాగానే అనిపించింది " అన్నాడు ఒక సారి జరిగిందంతా వెనక్కి ఆలోచిస్తూ. " నాన్నా.. మొదటిగా అబ్బాయి వేసుకున్న టక్ బాగానే వుంది......కానీ..రబ్బర్ చెప్పులు వేసుకోవటం ఏంటసలు?" చిరాకుగా మొహం పెట్టి అంది. రామనాథం ఏమీ మాట్లాడ కుండా కూతురిని చూడసాగాడు. మళ్ళీ అంది ఉష " నాన్న ..నాతో మాట్లాడినప్పుడు కూడా ఆ అబ్బాయి ఏమీ అడగలేదు..అలా బెల్లం కొట్టిన రాయిలాగా కూర్చొని..మీరేమైనా అడగండి అన్నాడు." "సరే , అయితే మరేమిటి ఇంకా ప్రాబ్లెమ్" అని అడిగాడు రామనాథం. " అసలు ప్రాబ్లెమ్ చెబుతా విను నాన్న.. ఆ అబ్బాయి కి ఒక్క స్నేహితుడు కూడా లేడంట..! పైగా అసలు సినిమాలు చూడడట!. చిన్నప్పుడెప్పుడో చూసాడుట. 'సినిమాలంటే అసహ్యం 'అన్నాడు. తన వృత్తి కి సంబందించిన పుస్తకాలు మాత్రమే చదువుతాడట. నవలలు, కథలు, వేరే ఏ పత్రికలూ కూడా చదవడు. అసలు ఏ లోకం లో జీవిస్తున్నాడో అర్థం కాలేదునాన్నా." అంది విసుగు తో కూడిన నిరాశతో. అన్నీ విని ఈ సారి ఆశ్చర్య పోవటం రామనాథం ,అరుణ ల వంతు అయ్యింది. " అదేంటి ...కాస్త విచిత్రంగా వుంది " అంది అరుణ. " సరేలే అదేదో అబ్బాయి చిన్నప్పటి నుండీ మంచి క్రమ శిక్షణ లో పెరిగాడనుకుంటా,,దాంతో నీకేంటి నష్టం అమ్మా?" అన్నాడు ఏమీ మాట్లాడాలోఅర్థం కాని రామనాథం. "నాన్నా..స్నేహితులు అసలు లేరంటే,,అదేదో ఇతనికి మానసిక మైన లోటు. పత్రికలూ, పుస్తకాలు చదవడంటే మరి రోజూ మానసిక ఉల్లాసానికి , ఆనందానికి , అతడి జీవితం లో ఏమున్నట్లు.? ఒక ఆఫీస్ ,పని,సంపాదనేనా ? పైగా అసలు సినిమా లు చూడక పోతే ,,మరి పెళ్ళి అయ్యాక , నేనెవరితో సినిమా కెళ్ళాలి? నాకూ భర్తకు అభిరుచులు కలిస్తేనే కదా ఇద్దరం కలిసి ఆనందంగా జీవించేది. అసలాయన కు అభిరుచి అన్నదే లేకుండా బ్రతికేస్తే నా పరిస్థితేంటి. అసలా జీవితం తలచు కోవటానికే భయంకరంగా ఉంది. లేదు నాన్న........ ఇలాంటి భర్త తో ఎన్ని ఐశ్వర్యాలున్నా దండగే. అయినా సరే ..ఏమీ కాదు ఒప్పుకో ...అంటే...మీ ఇష్టం మరి " అంది తండ్రిని చూసి ఉష. ధీర్ఘ మైన నిట్టూర్పు వదిలి భా ర్య అరుణ ను చూసి " రేపుదయమె వారికి ఫోన్ చేసి .... ఇద్దరి జాతకాలు కుదరటం లేదు....మా ఇంటి ఆచార్యులు కూడదన్నారు అని చెప్పెయ్యి ,ఇంకేం చేస్తాం " అన్నాడు రామనాథం ఈజీ చైర్ లో వెనక్కి వాలి. " అవునండీ...ఈ రోజుల్లో అమ్మాయిలే సరిగ్గా ఆలోచిస్తారు..మన అమ్మాయి చెప్పింది సబబే కదా ?'' అంది అరుణ లేచి వంటింట్లోకి వెళుతూ. ఈ పెళ్లి చూపులలో ఇంకా ఎన్ని కార్టూన్లను చూడాలో అనుకుంటూ తన గదిలోకి అడుగులు వేసింది ఉష రాణి,ప్రస్తుతానికి ప్రమాధం తప్పినందుకు. ***

మరిన్ని కథలు

Aame kavvinchindi
ఆమె కవ్వించింది
- తాత మోహనకృష్ణ
Chandruniko noolu pogu
చంద్రునికో నూలు పోగు
- కాశీవిశ్వనాధం పట్రాయుడు/kasi viswanadham patrayudu
Anaadha atidhyam
అనాథ అతిథ్యం
- - బోగా పురుషోత్తం
Vibheeshana Sharanu
విభిషణుని శరణు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Srivariki prema lekha
శ్రీవారికి ప్రేమలేఖ
- తాత మోహనకృష్ణ
Ramdaas formula
రాందాస్ ఫార్ములా
- వీరేశ్వర రావు మూల
Attagari samrajyam
అత్తగారి సామ్రాజ్యం
- బొబ్బు హేమావతి