పెద్దమ్మ ఇలాఖా - శ్యామకుమార్ చాగల్

Peddamma ilaakha
" రాణీ ! మనం వచ్చే వారం మా పెద్దమ్మ దగ్గరకు వెళ్లొద్దామా ? " అడిగాడు రవి ,భార్య ను ఉద్దేశించి.

" సరే , మీ ఇష్టం , కానీ మీ పెద్దమ్మ గారు చాలా చాదస్తం , ఎవరూ భరించ లేరు అని అనుకుంటుంటే విన్నాను, మరి మనం ఉండగలమా? " అని భయంగా రవి ముఖంలోకి చూసిన్ది రాణి.

" మరేం పర్లేదు , ప్రేమగా చూసుకుంటుంది , అయినా నేనున్నానుగా. " అని మెల్లగా నవ్వాడు రవి.

రవి పెద్దమ్మ పేరు అలివేలు మంగ తాయారు. ఒక పల్లెటూరి ప్రభుత్వ పాఠశాల హెడ్ మిసెస్ గా ఉద్యోగం చేస్తున్నారు. పాఠశాల ఉద్యోగం, పైగా సంతానం కలగక పోవడం తో, క్రమశిక్షణ కలిగిన జీవితానికి అలవాటు పడింది. ఇంటికి ఎవరు వచ్చినా మంచి ఆతిధ్యం ఇస్తుంది. ప్రేమగా చూసుకుంటుంది. కానీ ఆవిడ పెట్టే కట్టుబాట్లను తట్టుకోవడం మాత్రం అందరికీ సాధ్యం కాదు. అయితే రవి కి పెద్దమ్మ తో ఎలా వ్యవహరించాలో బాగా తెలుసు.
వారం పాటు సెలవు పెట్టి పెద్దమ్మ వూరికి బస్సులో బయలు దేరాడు భార్య రాణి తో కలిసి రవి.

రిక్షా లో నుండి దిగి ఇంటి ముందు రాణి చేతిలో నుండీ సూటుకేసు తీసుకుని
ఇంటి గేట్ నెట్టుకుంటూ " పెద్దమ్మా!..పెద్దమ్మ !!" అని కేకలు పెడుతూ ముందుకు అడుగులు వేసాడు రవి.

కంగారుతో బయటకు వచ్చి రవి ని చూసిన మంగ తాయారు " అదేంట్రా అలా అరుస్తూ రావడం ఏంటసలు , నువ్వొచ్చావని అందరి కీ తెలియాలా ?" అని నవ్వుతూ ఎదురొచ్చి రాణి ని చూస్తూ , " పెళ్లి అయిన రెండు నెలలకే , వొళ్ళు చేసిందేంట్రా అమ్మాయి ?" అంది రెండు చేతులతో రాణి బుజాలు పట్టుకొని .

అత్తగారి కాళ్లకు నమస్కారం పెట్టింది రాణి.

"సరే వెళ్లి కాళ్ళు కడుక్కుని రండి వంట చేసేస్తాను ఇంతలో " అని లోనికి వెళ్ళింది మంగ తాయారు.

బాత్రూమ్ లోకి వెళ్లి చూసి ఆశ్ఛర్య పోయింది రాణి. అక్కడ ఒక వైపు నాలుగు రకాల తువ్వాలలు , మూడు రకాలు సబ్బులు , మరో మూడు రకాల టూత్ పేస్టులు చక్కగా అమర్చి వున్నాయి. ఇత్తడి, రాగి గుండిగ లలో నీళ్లు నిండుగా వున్నాయి.

'వాడిన తర్వాత అన్నీ మళ్ళీ సర్ది పెట్టండి 'అని రాసిన ఒక చిన్న బోర్డు చూసి నవ్వుకుంది రాణి. బయటకు వచ్చే ముందు అన్నీ సరిగ్గా వాటిని సర్ది , భయంగా అన్నిటినీ మళ్ళీ ఒక మారు సరి చూసుకుంది రాణి.

రవి , పెద్దమ్మమంగ తాయారు, పాత సంగతులు చెప్పుకుంటూ భోజనం ముగించారు .
రాణి పళ్లెంలో వదిలేసిన మిరప ముక్కలను చూసి చిరాకుగా అడిగింది మంగ తాయారు.
" ఏంటి,,..ఎందుకలా వదిలేసావు ?"

" కారంగా ఉన్నాయి అత్తయ్యా. " అంది సంజాయిషీ ఇస్తున్నట్లుగా భయంగా చూస్తూ.

" అవును వాటిని కూడా కలిపి తినాలి , అందుకనే వేస్తాము " అంది కళ్ళు పెద్దవి చేసి.

ఏం సమాధానం చెప్పాలో తెలియక రవి వైపు చూసింది రాణి.
అంతలో రవి కల్పించుకుని " సరే , పెద్దమ్మ , ఇంకో మారు వదిలి వేయదు లే '' అని నవ్వేసాడు.

సాయంకాలం కాఫీలు త్రాగిన తర్వాత " ఒరేయ్ రవి ఒక రిసెప్షన్ ఉంది , నాకు ,అక్కడే భోజనాలు , మీరు తిని పడుకోండి, నే త్వరగానే ... వచ్చేస్తాను." అని చెప్పి సమాధానం కొరకు ఎదురు చూడకుండా గది లోకి వెళ్ళిపోయింది మంగ తాయారు .

రాత్రి సరిగ్గా తొమ్మిది గంటలకు అన్నట్లుగానే ఇంటికి వచ్చేసింది మంగ తాయారు. వస్తూనే టీవీ చూస్తూ కూర్చున్న రవి, రాణి ని చూసి " ఇంక టీవీ కట్టెయ్యండి , తొమ్మిది గంటల పదిహేను నిమిషాలకు నాకు పడుకోవడం అలవాటు. " అని లోనికెళ్లి బట్టలు మార్చుకుని వచ్చి తిరిగి రాణి ని చూసి " మీరు అదిగో నా గది లో పడుకోండి,.....నే హాల్ లో పడుకుంటాను ." అని మళ్ళీ రవిని చూసి . ఇంతకీ భోజనం చేశారా? " అని అడిగింది .
" అయ్యింది పెద్దమ్మ , సరే పడుకో మరి " అని సమాధానం చెప్పి,
భార్య రాణి ని చూసి " మంచి నీళ్లు చెంబు తీసుకుని రా " అని చెప్పి గదిలోకి వెళ్ళాడు రవి నవ్వుకుంటూ.

గది లోకి వెళ్లి చూసాడు రవి. చాలా చిన్న గది , దానికి ఎక్కడా ఒక్క కిటికీ కూడా లేదు.
రాణి గదిలోకి వచ్చి చూసి " పల్లెటూర్లలో ఇలాగే ఉంటాయి గదులు" అంది చిన్నగా చిలిపిగా నవ్వుతూ.

" ష్ ..మెల్లిగా పెద్దమ్మ విందంటే మన పని అంతే సంగతులు "అన్నాడు గుస గుసగా.

అంతలో బయట హాల్ నుండి తాయారు కేకేసింది" రవీ, చిన్నగా మాట్లాడండి, లేదా నాకు నిద్ర పట్టదు " అని.

వెంటనే భయంగా చూసింది రాణి భర్త రవి కేసి. భార్య రాణి కళ్ళను చూసి కిసుక్కున నవ్వాడు రవి. ఆకాశం కేసి చూసి రెండు చేతులూ పైకెత్తి దండం పెట్టింది రాణి.

నిద్ర పట్టే సమయానికి గది లో గాలి ఆడక ఒళ్ళంతా చెమటలు పట్టి మెలకువ వచ్చింది రవి కి. పైన సీలింగ్ ఫ్యాన్ కేసి చూసాడు. అది తిరుగుతూనే వున్నా , గాలి విసరకుండా ఊరికే చప్పుడు చేస్తోందని అర్థం అయ్యింది రవికి.
భార్య ను చూసాడు, హాయిగా నిద్ర పోతోంది.
రాణి ని లేపి మంచాన్ని ఫ్యాన్ కిందకి వచ్చేలా జరిపి పడుకున్నాడు. కొద్ది సేపటికి చెమటలు మరీ ఎక్కువ అయ్యాయి .
లేచి కూర్చున్నాడు రవి . ఏం చేయాలో అర్థం కాలేదు. లేచి వెళ్లి తలుపు తీసి మంచి గాఢ నిద్ర లో వున్న పెద్దమ్మ ను తట్టి లేపాడు . ఉలిక్కి పడి లేచింది తాయారు " ఏమయిందిరా ?" అంటూ కంగారుగా అడిగింది రవి ని చూసి.
" ఆబ్బె ...ఏమీ లేదు పెద్దమ్మ , లోపల చాలా ఉక్క గా వుంది.. అసలు గాలి ఆడడం లేదు." అన్నాడు చిరాకుగా.


'' అయితే ఏం చేస్తావ్ రా ? " అని అడిగింది మంగ తాయారు నిద్ర మొహం తో అసహనంగా .

రెండు సెకన్లు ఆలోచించి అన్నాడు " బయట వరండాలో పడుకుంటాము "

" ఏదీ మొత్తం బయటా?, సరే " అని లేచింది విసుగ్గా .

లోనికెళ్లి రెండు చాపలు, దుప్పట్లు ,దిళ్లు పట్టుకొచ్చి ఇంటి బయట వరండాలో వేసి
రవి, రాణి బయటకు వెళ్ళగానే , లోపల నుండి థడేలున తలుపులు వేసుకుంది తాయారు

చాపలు పరుచుకుని ,దిళ్లు సర్ది " అమ్మయ్య బ్రతికాము రాణి , చచ్చాననుకో లోపల వేడికి , ఎలా పడుకుంటుందో ఏమో పెద్దమ్మ. రామ రామ" అన్నాడు నవ్వుతూ రవి .

"అబ్బా ఇప్పటికైనా , బుద్ది గా నిద్ర పొండి, నాకు మాత్రం నిద్రొస్తోంది " అని నిద్రకుపక్రమించింది రాణి.
వరండాలో బయట చెట్ల నుండి వచ్చే చల్లని గాలికి కొద్దిసేపట్లోనే హాయిగా నిద్రలోకి జారుకున్నాడు రవి.
వున్నట్టుండి ఆకస్మాత్తుగా మెలకువ వచ్చింది రవికి. లేచి చూస్తే చెవుల్లో జుయ్ మని రొద పెడుతున్నాయి దోమలు. అప్పటికే ముంజేతులు , పాదాలు దోమకాటుతో మండుతున్నాయి.
వెంటనే లేచి కూర్చున్నాడు . దోమలంటే చాలా భయం రవికి. వాటి నుంచి వచ్చే మలేరియా, బోద కాలు,డెంగు మొదలైన వాటిని తలుచుకుని భయం తో ఏం చేయాలో తెలీక రాణి ని నిద్ర లేపి " రాణి ..,, ఎన్ని వేల దొమలో, ఎలా పడుకుంటాం ఇక్కడ? " అన్నాడు .

" మరి ఏం చేద్దామో చెప్పండి .." అంది ఆవలిస్తూ.

ఆలోచించ సాగాడు రవి. ఆకస్మాత్తుగా గుర్తొచ్చింది రవికి డాబా మీదకు వెళ్ళటానికి ,ఇంటి వెనక వేపు నిచ్చెన ఉందని. వెంటనే అన్నాడు " మనం డాబా మీద వెళ్ళటానికి నిచ్చెన వుంది, అక్కడ పడుకోవటం హ్యాపీ "

రాణి కళ్ళు తెరిచి ,అది విని నిరాసక్త తో చూసింది రవిని.

చాపలు, దుప్పట్లు మడత వేసి మళ్ళీ తలుపులు తట్టాడు రవి. లోపలి నుండీ సమాధానం రాలేదు.
అది చూసి రాణి అంది " ఏమండీ పాపం అత్తయ్య గారు పడుకుని వుంటారు, మళ్ళీ మళ్ళీ లేపటం ఎందుకు , మనమిక్కడ ఎలాగోలా పడుకుందాం" అంది భర్త వేపు చూసి.
అంతలో తలుపులు తెరుచుకున్నాయి . మంగ తాయారు ఎర్రబారిన కళ్ళతో నిలబడి రవిని చూసి " మళ్ళీ ఏమొచ్చిందిరా , ఈ రాత్రి ఇక పడుకోవా " అంది కాస్త కోపంగా.

" సారి పెద్దమ్మ..ఇక్కడ విపరీతమైన దోమలు, ఇంటి ఆవరణ లో చుట్టూ మొక్కలు వున్నాయిగా, బహుశా అందుకేనేమో ఇన్ని దోమలు ?.. పైన ..అంటే డాబా మీద పడుకుంటాము..సరేనా " అన్నాడు కాస్త భయం తో.

రవి కేసి సాలోచనగా చూసి ,ఏదో నిర్ణయానికి వచ్చి " సరే పదండి" అంటూ ఇంటి వెనక తలుపులు తీసి పెరట్లోకి వెళ్ళింది మంగ తాయారు.

దుప్పట్లు వగైరా తీసుకుని జాగ్రత్తగా నిచ్చెన పట్టుకుని పైకి ఎక్కాడు రవి. రాణి కూడా మెల్లిగా ఎక్కి పైకి వెళ్ళింది.

కింద నుండి అడిగింది తాయారు" ఎరా.. అంతా సరిగా ఉందిగా , మరి నే పడుకుంటున్నా !"

" సరే సరే ..గుడ్ నైట్ "అన్నాడు రవి డాబా పై నుండీ.

డాబా మీద హాయిగా చల్ల గాలి వీస్తూ వుంది.".పైన వెన్నెల భలేగా వుంది కదూ" అన్నాడు రవి చేతులు వెనక్కు చాపి పడుకుని.

"బాగానే వుంది కానీ మనం నీళ్ల చెంబు మరచి పోయాం " అంది రాణి.

" వుండు తెస్తాను" అని లేచి వెళ్లి కిందకు దిగడానికి వెళ్లి " అయ్యో!!! " అన్నాడు కంగారుగా

" ఏమైందండీ ?!! " అని అడిగింది లేచి నిలబడి ఆదుర్ధాగా భార్య రాణి.

" ఇటు చూడు.. నిచ్చెన !!" అన్నాడు ఆశ్చర్యంగా

రవి దగ్గరకు వచ్చి నిలబడి కిందకి చూసింది రాణి . అక్కడ నిచ్చెన కనపడ లేదు.!!

మరిన్ని కథలు

Kaliyuga yakshudlu
కలియుగ యక్షుడు
- దినవహి సత్యవతి
Maangalyam tantunaa
మాంగళ్యంతంతునా...
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు.
Aavakaya prahasanam
ఆవకాయ ప్రహసనం
- జీడిగుంట నరసింహ మూర్తి
Apaardham
అపార్థం
- బామాశ్రీ
Nijamaina ratnam
నిజమైన రత్నం
- బోగా పురుషోత్తం.
Snehamante Ide
స్నేహమంటే ఇదే
- కందర్ప మూర్తి
Andamaina muddu
అందమైన ముద్దు
- వారణాసి భానుమూర్తి రావు